‘ప్యార్‌ కరో’నా!

‘ఒకవేళ మనలో కరోనా వైరస్‌ చేరినా అది తేలే లోగా మనం ఇంకేం ఆలోచించకుండా బతికేద్దాం యాసిన్‌! ‘

శాన్య ఢిల్లీ. 8 జూన్‌ 2020 తెల్లవారుజాము.

మెల్లగ హోష్‌లకొచ్చిండు యాసిన్‌. తలంత దిమ్ముగుంది. ఏదో మత్తు. పూర్తిగ దిగినట్లు లేదు. కండ్లు నులుముకున్నడు. ఎల్లకిల పండుకొనున్నడు. ఎక్కడున్ననా అని యాదికి తెచ్చుకుంటానికి కోషిష్‌ చేసిండు.

గౌతమి పెంట్ హౌజ్‌!

పక్కన చూస్తే గౌతమి లేదు. లేషి చూసిండు. వాష్‌ రూం బైటి నుంచే పెట్టి ఉంది. బయిటి తలుపు గుంజిండు. రాలేదు. అదేంటి, లాక్‌ చేసి యాడికి పోయినట్లు?

మెల్లంగ గుర్తొచ్చింది, కరోనా విజృంభించిన విషయం. మత్తు దిగిపోయింది! బెడ్డు మీద కూలబడ్డడు.

ఒక్కో సంగతి యాదికొస్తున్నది. ఇంత భయంకర, బీభత్స పరిస్థితిలో గౌతమి యాడికెళ్లింది?! ఎందుకెళ్లింది?

ఆకలి బాగయితున్నది. షానా నీరసంగ ఉంది. మెల్లగ లేషి కిచెన్‌ దిక్కు నడిషి పొయి మీద చూసిండు. గ్యాస్‌ పొయి మీద ఒక గిన్నె ఉంటె మూత తీసిండు, జిబ్బున వాసనొచ్చింది. అన్నం పాషి పోయి ఉంది. ఝట్ న మూత పెట్టేసిండు. ఫ్రిజ్‌లో చూసిండు. పండ్లు, స్వీట్లు, ఇంకా ఏవో ఉన్నయి. తీసి తినుకుంట ఎనక్కొచ్చి మల్ల బెడ్డు మీద కూలబడ్డడు.

బయట పరిస్థితి ఎట్లున్నదో.. అరె, తన ఫోనెక్కడ? ఎతుక్కున్నడు. బెడ్డుకు అవతల పడిపోయి ఉంది. తీసి చూసిండు. స్విచాఫ్‌ అయిపోయింది. లేషి చార్జింగ్‌ పెట్టిండు. తలుపు గుంజి చూసిండు. రాలేదు.

ఏం చెయ్యాల్నో తోస్తలేదు. అమ్మ, తమ్ముడు ఎట్లున్నరో..? గౌతమి ఎక్కడికి పోయి ఉంటుంది? బెడ్‌ మీద ఒరిగిండు. తల కింద చేతులు పెట్టుకొని పైన ఫ్యాన్‌ దిక్కు చూస్తు సోంచాయిస్తున్నడు. ఫ్యాన్‌ లెక్కనే తల నిండా ఆలోచనలు తిరుగుతున్నయి.

కరోనా పెద్ద ఎత్తున విజృంభించడంతో హాస్పిటల్స్‌ సరిపోక, వైద్య సిబ్బంది సరిపోక దేశం అతలాకుతలమైంది. బయట జనం తిరగక ఊర్లు, పట్టణాలు, నగరాలు బోసిపోయినయి. రోడ్ల మీద కేవలం పేషంట్లు, వారిని మోసుకుపోతున్న వైద్య సహాయక సిబ్బంది, శవాలను వాహనాల్లోకి ఎక్కిస్తున్న మిల్ట్రీ! పరిస్థితి భయానకంగా తయారైంది. ఇలాంటి వార్తలు చూసి చూసి సైకలాజికల్‌గా సిక్‌ అయిపోతున్న దశ.

తమ ఇంటి చుట్టూ కరోనా రోగులతో బిక్కుబిక్కుమంటూ తను, అమ్మ, తమ్ముడు! ఏం చేయాల్నో పాలుపోలేదు. ఆ సమయంలో తన పెంట్ హౌజ్‌కి వచ్చేయమని బతిమాలింది గౌతమి.

ఆరు నెలల కింద సిఎబి (సిజన్‌షిప్‌ అమెండ్‌ మెంట్ బిల్‌) పార్లమెంటులో బిజెపి పాస్‌ చేయడంతో సిఎఎకు, ఎన్నార్సీకి వ్యతిరేకంగా పోరాటం షురువైంది. మొత్తంగా ముస్లింల అస్తిత్వానికే ఎసరు పెట్టాలని, మిగతా బహుజనులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేపట్టిందని బుద్ధిజీవులకంతా అర్ధమయ్యింది. కేంద్రం- అమిత్‌ షా, మోడీల ఆధ్వర్యంలో ఉండే ఢిల్లీ పోలీసులు జెఎన్‌యూ, జామియా మిలియా యూనివర్సిటీ స్టూడెంట్స్ పై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డరు. షాహీన్‌ బాగ్‌ పోరాటం దేశమంతా విస్తరిస్తున్నది. జామియా మిలియా యూనివర్సిటీ ముందు కూడా పోరాటం నడుస్తున్నది. తను కూడ సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేకపోరాటంలో ముందువరుసలో ఉన్నడు. ఈలోపు ఢిల్లీ ఎన్నికలు వచ్చినయి. దేశమంతా ఢిల్లీ దిక్కు చూసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీయే గెలిచింది. షాహీన్‌ బాగ్‌ మీద, ముస్లింల మీద మరింత కసి పెరిగింది మనువాదులకు. పక్కా ప్లాన్డ్‌గా ఈశాన్య ఢిల్లీలోని నాలుగు బస్తీలపై కొన్ని వందల మూక జైశ్రీరాం నినాదాలతో విరుచుకుపడింది. పోలీసులు వారికే సహకరించిన్రు. మోడీ, అమిత్‌ షా మౌనం వహించిన్రు. మూడు రోజుల పాటు హింసాకాండ కొనసాగింది.

ఆ హింసాకాండలో రెండోరోజు తమ ఇంట్లోకి దూసుకొచ్చి ఐదారుగురు గూండాలు ఇంట్లోని సామానంతా ధ్వంసం చేస్తూ అడ్డుకోబోయిన తనపై దాడి చేసిన్రు. తలపై ఇనుప రాడ్‌ దెబ్బ పడింది. తనకు స్పృహ తప్పినట్లయ్యి కింద పడ్డడు. తనను రక్షించడానికి అడ్డం పడ్డడు తన తండ్రి. దాంతో ఆయనను ఇనుప రాడ్లతో కొట్టి, కత్తులతో పొడిచిన్రు. కండ్లు బైర్లు కమ్ముతున్న తనకు తన తండ్రిని ఒకడు కత్తితో మళ్ళీ మళ్ళీ పొడుస్తున్న దృశ్యం మత్తు వదిల్చింది. ‘బాబా!’ అంటూ అడ్డం పోబోయిండు. మల్లొక రాడ్ దెబ్బ తన తలపై పడింది. ఒంటి మీద దెబ్బల లెక్కేలేదు. దాంతో తను స్పృహ కోల్పోయిండు. ఇంట్ల సామానంతా గుంజి తగులబెట్టి పెట్రోలు పోసి అంటుపెట్టి ‘జైశ్రీరాం’ నినాదాలు చేస్తూ వెళ్లిపోయిన్రట వాళ్లు. లోపలి అర్రలో పడుకోనున్న తమ్ముడినైనా రక్షిద్దామని తన తల్లి ఆ అర్రలోకి పరుగెత్తి తలుపు పెట్టి అడ్డం నిలబడ్డదట. సామాను తగలబడుతున్న వేడికి తనకు స్పృహ వచ్చేలోపు తన తండ్రి గిలగిలా కొట్టుకుంటున్నడు. ‘బాబా! బాబా!’ అని పిలుస్తు తన ఒళ్లోకి తీసుకున్నడు. తన చేతుల్లోనే ప్రాణాలు వదిలిండు తన తండ్రి! ఒకరోజంతా తన తండ్రి శవాన్ని ఇంట్లనే పెట్టుకొని ఉండిపోయిన్రు తను, తన తల్లి, తమ్ముడు. బయట విధ్వంసకాండ జరుగుతనే ఉంది. దొరికిన ముస్లింలను దొరికినట్లు కొట్టడం, చంపడం కొనసాగుతున్నయి. హాహాకారాలు, జైశ్రీరాం నినాదాలు, కర్రలు, కత్తుల శబ్దాలు, వాహనాలు, ఇండ్లు, షాపులు తగలబడుతున్న చప్పుళ్లు.. గుండెలు హడలిపోయినయి. ఆ తగులబడుతున్న సామాను ఇంటికి అంటుకోకుండా బయిటి గేటుదాంక తోసిండు తను. ఇంట్లో ధ్వంసమైన మరిన్ని వస్తువులు తీసుకెళ్లి ఆ మంటల్లో ఏసిండు. లోపలికొచ్చేసి లోపలి అర్రలో బిక్కు బిక్కుమంటు గడిపిన్రు ముగ్గురు. తండ్రి శవంపై ఒక దుప్పటి కప్పి బోరున ఏడ్చిండు తను. తల్లి, తమ్ముడు కుమిలి కుమిలి ఏడుస్తున్నరు. బయిటి నుంచి చూసేటోళ్లకు ఆ ఇల్లు ధ్వంసం చేయబడి తగులబడుతున్నట్లు కనిపిస్తుండడంతో మరెవరూ అటుదిక్కు రాలేదు.

***

కండ్లల్లో నిండిన నీళ్లను తుడుచుకుంట లేషి ఫోన్‌ ఆన్‌ చేసిండు యాసిన్‌. చూస్తె చాలా మిస్డ్‌ కాల్స్‌ ఉన్నై! గౌతమి నుంచి ఎక్కువ. ఇంటి నుంచి రెండు. గౌతమికి కాల్‌ చేసిండు. రింగ్‌ అవుతున్నది. కాని లిఫ్ట్‌ చేయలేదు. తన ఇంటికి కాల్‌ చేసిండు. అక్కడ కూడా ఎవరూ ఎత్తడం లేదు. గుండెల్లో గుబులు. ఏంటి పరిస్థితి!

కాసేపాగి మళ్లీ గౌతమికి చేసిండు. ఊఁహూఁ.. ఎక్కడ ఉండి ఉంటుంది? బయట పరిస్థితి ఏమిటి? డేట్ చూసిండు. తను ఇక్కడికొచ్చి 15 డేస్‌ అయ్యిందా! పరేశాన్‌ అయ్యిండు. 13 రోజుల దాంక గుర్తుంది. ఆ రాత్రి గౌతమితో మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయిండు తను. తరువాతి రోజు ఏమయ్యింది? అంటే తను మత్తులో ఉన్నాడా? తనకు గౌతమి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చిందా? ఎందుకు? ఎందుకలా చేసింది? అంటే గౌతమి? గౌతమి అసలెందుకు బయిటికి వెళ్లింది? తల తిరిగిపోతున్నది యాసిన్‌కు.

మళ్లీ మళ్లీ కాల్‌ చేసిండు. ఒకవేళ గౌతమి..! అలాంటి ఆలోచనకే గుండె ఆగినంత పనయ్యింది. నో.. నో, అలా జరగడానికి వీల్లేదు. దుఃఖం తన్నుకువచ్చింది. ‘గౌతమీ! గౌతమీ!’ అంటూ ఏడుస్తున్నడు యాసిన్‌. పక్క మీద వాలిపోయిండు.

చాలాసేపటికి ఏమేం జరిగినయో మననం చేసుకోబట్టిండు-

ఢిల్లీలో మరణాల సంఖ్య ఎక్కువవుతూ లాక్‌ డౌన్‌ దాటి నిరంతర కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి బీభత్సంగా తయారైంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న తనను తన పెంట్ హౌజ్‌కి వచ్చేయమని గౌతమి పోరింది. ‘మీ ఏరియాలో మరణాలు ఎక్కువ జరుగుతున్నాయని, కరోనా విజృంభించిందని వార్తలొస్తున్నాయి యాసిన్‌! నువ్వు మాస్క్‌ లేదంటే టవల్‌ లాంటిది ముఖానికి కట్టుకొని ఒకటికి రెండు టీషర్టులు వేసుకొని బయలుదేరి ఎట్లాగైనా వచ్చేయి. నా దగ్గర చాలా ఎక్విప్‌మెంట్లున్నయి, మెసిసిన్‌ ఉంది. మనం కొన్నాళ్లు జాగ్రత్త పడడం మంచిది’ అని పోరింది. గౌతమి విషయం ఇంట్లో అందరికీ తెలుసు. ఇంటికి కూడా వచ్చి వెళుతుండేది గౌతమి.

‘మరి మా అమ్మావాళ్లను ఏం చేయను గౌతమీ! వాళ్లను వదిలి రానా!’ గాద్గదికమైన గొంతుతో అన్నడు యాసిన్‌. ‘వాళ్లకు జాగ్రత్తలు చెప్పి రా యాసిన్‌. మీ తమ్ముడున్నడు కదా! ఒకవేళ మనం ఈ విపత్తు నుంచి, ఈ మహమ్మారి నుంచి బయటపడలేకపోతే కనీసం నాలుగు రోజులైనా కలిసి బతికి.. చచ్చిపోదాం యాసీన్‌.. ప్లీజ్‌!’ అని బతిమిలాడింది గౌతమి.

భయంగ ఉన్నది నిజమే.. ఎటూ కదల్లేకుండా బోర్‌ కొడుతున్నది నిజమే.. కాని తన వాళ్లను వదిలి వెళ్లడమా? కాని వారిని ఎక్కడికీ తీసుకెళ్లలేడు. ఎవరూ దగ్గరగా లేరు. అయినా ఈ సమయంలో ఎవరూ ఎవర్నీ రమ్మనేలా లేదు పరిస్థితి. గౌతమి మాత్రమే రమ్మంటుంది. అదీ, కలిసి గడుపుతూ చచ్చిపోదామంటున్నది… ఏంటి చేయడం.. తను ఒక్కతే ఉన్నది కూడా! ఎటూ తోచడం లేదు.. కాలు నిలువనీయడం లేదు..

పక్క రూంలోంచి అమ్మ తమ సంభాషణ విన్నట్లుంది, కాని విననట్లే ఉండి కాసేపాగి, తనతో అన్నది, ‘గౌతమి ఎక్కడున్నదిరా, వాళ్ల పరిస్థితి ఏమిటి? కనుక్కున్నవా?’

‘వాళ్లు బాగనే ఉంటరమ్మా! గౌతమి వాళ్ల అమ్మానాన్నలతో లేదమ్మా! తన పెంట్ హౌజ్‌లో ఉంది. తోడు నన్ను రమ్మంటున్నది. మిమ్మల్ని వదిలేసి నేనెట్లా పోతాను!’ అన్నడు తను.

‘పోరాదురా! మాకేమవుతున్నది? ఆ పిల్ల భయపడుతున్నట్లుంది.. ఒక్కతే ఉన్నది కదా! మాకు రెండు వారాలు సరిపడా వస్తువులన్నీ తెచ్చిపెట్టినవు కదా! తమ్ముడు పెద్దోడే కదా, నన్ను వాడు చూసుకుంటడు. అంతగ ఏమన్న అవసరం పడితె ఫోన్‌ చేస్తం కదా.. వెళ్లు..!’ అన్నది అమ్మ.

ఆ మాటే కావాలి కదా తనకు. తన లాంటి వాడిలోనూ స్వార్థం తొంగిచూస్తుంది..! సరే నని, ఏదున్నా ఫోన్‌ చెయ్యమని తమ్ముడికి చెప్పి బయల్దేరిండు.

శత్రుసేనను తప్పించుకుని పారిపోతున్న ఏకాకి సైనికుడిలా బైక్‌ మీద దూసుకెళ్లిపోయిండు. కష్టంగా పోలీసులను తప్పించుకొని, సందుగొందులు తిరిగి, బండి మీద ఒక లాఠీ దెబ్బ తిని, గౌతమి ఉన్న ఏరియాకి చేరుకున్నడు. పెంట్ హౌజ్‌ తలుపు కొట్టగానే గౌతమి పరుగెత్తుకొచ్చిన సప్పుడు. తలుపు తీసి, మొఖం నిండా నవ్వుతో ‘థాంక్యూ వెరీ మచ్‌ రా..! ఒక్కదాన్ని పిచ్చెక్కిపోతున్న.. నువ్వొచ్చావ్‌, ఇక చాలు! లోపలికొచ్చి వెంటనే స్నానం చెయ్‌. నీళ్లు వేడి పెట్టిన’ అన్నది.

***

గౌతమితో రోజులు ఎలా గడిచిపోయినవో తెలీదు. మధ్యలో తమ్ముడు కాల్స్‌ చేసిండు. వాడు ఇంటెలిజెంట్. వాడి మీద నమ్మకంతోనే తను గౌతమి కాడికి రాగలిగిండు. మొదటి రెండుసార్లు కాన్ఫిడెంట్ గనే మాట్లాడిండు తమ్ముడు. మూడోసారి మాట్లాడలేక ఇబ్బంది పడుతూ అమ్మ కిచ్చిండు. అమ్మ గొంతులోనూ కాస్త నీరసం. ‘నువ్వు మంచిగున్నవు కదరా..!’ అన్నది. ‘నేను ఓకే అమ్మీ..! మీరెట్లున్నరు..? నేను రానా? ఆ ఏరియాలో పరిస్థితి బాలేదని తెలుస్తున్నది’ అన్నడు. ‘వద్దురా.. మేము బాగనే ఉన్నం.. నువ్వు క్షేమంగ ఉంటే చాలు. మళ్లీ మాట్లాడతాను బేటా..!’ అన్నది. ఫోన్‌ కట్ అయిపోయింది. ఎందుకట్ల పెట్టేసింది అమ్మ?! చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయిండు యాసిన్‌. నిజానికి తను ఆ ఏరియాకి వెళ్లే పరిస్థితి లేదు. టీవీల్లో, సోషల్‌ మీడియాలో వార్తలను బట్టి ఆ ఏరియా అంతా కరోనామయమైపోయింది. అక్కడ నుంచి బయిటికి వచ్చిన వారిని ఎవరినీ ఎవరూ రానివ్వడం లేదు. తప్పించుకుపోదామని ప్రయత్నించిన కొందరినైతే ఆర్మీ కాల్చేసింది!

కళ్లల్లోంచి జలజలా నీళ్లు రాలిపోయినయ్‌ యాసిన్‌కు. బోరుబోరున ఏడ్చిండు. గౌతమి తన ఒడిలోకి తీసుకొని ఓదారుస్తూ ఏడ్వనిచ్చింది.

‘నేను వెళ్తాను గౌతమీ! మా అమ్మ..! మా తమ్ముడు..! అయ్యో.. నేను వెళ్లి చూసుకుంటాను.. మాట్లాడిస్తాను.. వాళ్లనలా వదిలేయడం బాగలేదు గౌతమీ…’ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నడు యాసిన్‌.

‘వద్దు యాసిన్‌! నువ్వెళ్లి ఏం చేయలేవు.. నీ చేతుల్లో ఏం లేదు.. ఆ ఏరియా పూర్తిగా డిఫెక్టెడ్‌. మనం వాళ్లను బయిటికి తేలేం.. అక్కడే జాగ్రత్తగా ఉండమని చెప్పడం మంచిది! కరోనా ఎఫెక్ట్‌ అయితే తమ్ముడు డీల్‌ చేయగలడు! అటు వెళితే నువ్వు కూడ కరోనా బారిన పడే ప్రమాదముంది!’

‘ఇప్పుడు నాలో లేదంటవా!?’

‘లేకపోవచ్చు.. నా దగ్గర ఉన్న మెడిసిన్‌ కరోనా వైరస్‌తో ఫైట్ చేస్తుంది. అందుకే కదా నిన్నిక్కడికి పిలుచుకున్నది. మన దగ్గర ఇంకా కొన్నాళ్లు మనం దేని బారిన పడకుండా ఉండగలిగే, పడ్డా నిలువరించే మెడిసిన్‌ ఉంది. నీకు పొద్దున ఇచ్చిన ఇంజెక్షన్‌ ఉంది చూడూ.. అది నా పరిశోధనలో భాగం. దానికి కొంతవరకు వైరస్‌ని నిరోధించే శక్తి ఉందని నమ్ముతున్నాను. మొదట్లో కరోనా బాధితులకు ఇచ్చి చూశాను. కొంత తేడా కనిపించింది. కాని నేను చెబితే నమ్మే స్థితిలో మన డాక్టర్లు ఉండరు. అందుకే ఆ ప్రయాస పడలేదు.’

‘నువ్వు అన్ని రోజుల దాకా కరోనా పేషంట్లకు సేవ చేస్తూ గడిపావు. నీకు సోకే అవకాశం లేదా?’

‘ఉంది..! నాకు కూడా అనుమానంగ ఉంది. మూడు నెలలు వాళ్లకు సేవ చేసి చేసి అలసిపోయాను. నా కళ్ల ముందే ఎందరో చనిపోవడం కూడ నన్ను కలచివేసింది. అందుకే వచ్చేశాను. కాని ఒకరి నుంచి ఒకరికి సోకకుండా కూడా కొంతకాలం నిలువరించే మెడిసిన్‌ కూడ నేనొకటి తయారుచేశాను. హాస్పిటల్‌లో ఉన్నప్పుడే దానిని కూడా టెస్ట్‌ చేసి చూశాను. దానిపై కూడా కొంతవరకు నాకు నమ్మకం అనిపించింది. ఆ మెడిసిన్‌ కూడా నేను వాడుతున్నాను. నా నుంచి ఎవరికీ సోకకుండా, ముఖ్యంగా నీకు సోకకుండా అది పనిచేస్తుంది! కాకపోతే ఎక్కువ మోతాదులో ఏవీ లేవు!’ అన్నది విచారంగా.

‘ఓహ్‌.. ఓకే.. మరిప్పుడేం చేద్దాం!?’ గౌతమి షానా ఇంటెలిజెంట్ అని యాసిన్‌కి తెలుసు.

‘ఒకవేళ మనలో కరోనా వైరస్‌ చేరినా అది తేలే లోగా మనం ఇంకేం ఆలోచించకుండా బతికేద్దాం యాసిన్‌! నా దగ్గరున్న మెడిసిన్‌ ఇంకొన్నాళ్ల వరకు సరిపోతుంది. ఈలోగా చూద్దాం..’ అంటూ యాసిన్‌ని తన ఒడిలోకి తీసుకుంది గౌతమీ!

***

మల్లొకసారి గౌతమి ఫోన్‌ ట్రై చేసిండు యాసిన్‌. ఎత్తడం లేదు. ఎక్కువసార్లు చేస్తే మొబైల్‌ ఆఫై పోవచ్చు. చూద్దాం అనుకున్నడు. ఇంటికి ఫోన్‌ చేసిండు. ఎవరూ ఎత్తడం లేదు! తన అనుమానం నిజమేనా! అమ్మకు, తమ్ముడికి కరోనా ఇన్‌ఫెక్ట్‌ అయిఉంటుందా?! ఇంట్లోనే ఉండిపోయారా? డాక్టర్స్‌కి కాల్‌ చేసి ఉంటారా? ఇన్‌ఫెక్ట్‌ అయినట్లు అనిపిస్తే తను ఒకవేళ రాలేకపోతే ఈ నంబర్లకు కాల్‌ చేయాలని చెప్పి వచ్చిండు తను.

గుబులుగ అనిపించింది. మళ్లీ మళ్లీ తమ్ముడి నంబర్‌కి చేసిండు. ఎత్తలేదు. తమ ఏరియాకి కేయించిన కరోనా హాస్పిటల్‌ నంబర్‌కి కాల్‌ చేసిండు. చాలాసేపు బిజీ తర్వాత ఎత్తిందొక నర్స్‌.

అమ్మ పేరు, తమ్ముడి పేరు చెప్పి ఇన్‌ఫర్మేషన్‌ అడిగిండు. లైన్ లో ఉండమని చెప్పి రిజిస్టర్ చూసి వాళ్లిద్దరూ హాస్పిటల్లో అడ్మ్‌ట్ అయిఉన్నారని చెప్పింది. షాకయ్యిండు. ‘కండిషన్‌ ఏమిటి?’ అనడిగిండు. ‘చెప్పలేము’ అన్నది. ‘చూడడానికి రావచ్చా?’ అడిగిండు. ‘లేదు, ఎవరికీ పర్మిషన్‌ లేదు’ అన్నదా నర్స్‌. కొన్ని క్షణాలు బ్లాంక్‌ అయిపోయి, తేరుకొని, ‘మళ్లీ ఎప్పుడు కాల్‌ చేయాలంటారు?’ అడిగిండు. ‘నాలుగు రోజులాగి చేయండి’ అన్నది.

 

ఫోన్‌ పెట్టేసి కూలబడిపోయిండు. వెక్కి వెక్కి ఏడ్చిండు. ఓదార్చడానికి గౌతమి కూడా లేదు!

చాలాసేపటికి లేషి గౌతమి తనకేమైనా ఇన్‌ఫర్మేషన్‌ వదిలి వెళ్లిఉంటుందా అనిపించి వెతకడం మొదలుపెట్టిండు. మెత్త కింద.. చుట్టుపక్కలా.. ఊఁహూఁ.. మూలకు మెడిసిన్‌ పెట్టి ఉన్న చిన్న టేబుల్‌ మీద చూసిండు. ఆశ్చర్యం, టేబుల్‌ మీద గౌతమి హ్యాండ్‌ రైటింగ్‌తో మూడు స్లిప్స్‌ ఉన్నయి! రెండు స్లిప్స్‌ రెండు ఇంజెక్షన్‌ బాటిల్స్‌ కింద ఉన్నై. మూడోది ట్యాబ్‌లెట్ల బాటిల్‌ కింద. స్లిప్స్‌ మీద ఒకటి, రెండు నంబర్లు వేసి ఉన్నై. జాగ్రత్తగా చదివిండు. మొదటి స్లిప్‌ మీద కొన్ని ఎక్కువ అక్షరాలున్నై:

యాసిన్‌! ఈ ఇంజెక్షన్‌ వెరీ ఇంపార్టెంట్. ఇది నువ్వు తీసుకొని బయిటికి వెళితే సుమారుగా ఒక గంట ఇరవై నిమిషాల పాటు నిన్ను ఏ వైరస్‌ దరిచేరలేదు. ఈ బాటిల్‌లో ఒక డోస్‌ మాత్రమే ఉంది. మరో డోస్‌ నేను తీసుకొని బయిటికి వెళ్తున్నా!’

ఒంట్లో సన్నని ఒణుకు మొదలైంది యాసిన్‌కు. అసలు గౌతమి బయిటికెందు కెళ్లింది?

రెండో స్లిప్‌ మీద:

ఒకవేళ మనలోకి వైరస్‌ ప్రవేశించిందని డౌట్ వస్తే ఈ ఇంజెక్షన్‌ తీసుకోవాలి. మన నుంచి వేరేవారికి సోకకుండా ఇది కొన్ని గంటలు పనిచేస్తుంది. ఎన్ని గంటలో సరిగా తెలీదు. ఇది నేను వాడుతూ వచ్చాను. ఇది కూడా అయిపోవచ్చింది. 5ఎంఎల్‌ చొప్పున రెండుసార్లకు ఇది వస్తుంది.

మూడో స్లిప్‌ మీద:

ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే 12 గంటలపాటు మానసికంగా ధృడంగా ఉంటాం.

(యాసిన్‌! హ్యాంగర్‌కి తగిలించిన నా నైటీ పాకెట్లో నీకొక లెటర్‌ రాసి పెట్టాను.. బహుశా చివరి ఉత్తరమేమో! లవ్‌ యూ రా!)

గుండెల్లో ఉద్వేగం, దుఃఖం తన్నుకువచ్చింది యాసిన్‌కు.

వేగంగ వెళ్లి నైటీ జేబు వెతికిండు. చిట్టీ దొరికింది. ఆత్రంగ తీసి చదివిండు:

 

”మై లవ్‌ యాసిన్‌!

నేను బయిటికి వెళ్తున్నా. బయట పరిస్థితి బాలేదు. మన ఏరియా నుంచి ఎవరినీ బయిటికి రానివ్వడం లేదు. బార్డర్‌లో ఒక గురుద్వారాను హాస్పిటల్‌గా మార్చారు. అక్కడికి మాత్రమే ఆర్మీ పర్మిషన్‌తో వెళ్లే అవకాశం ఉంది. ఈ ఏరియా అంతా కూడా వైరస్‌ ఆక్రమించి ఉంది. దాదాపు అంతా మృత్యువాత పడుతున్నారు. మన దగ్గర మెడిసిన్‌తో పాటు ఫుడ్‌ కూడా అయిపోవచ్చింది.

నాకు మా అమ్మతో చాలా ఎటాచ్ మెంట్ అని చెప్పాను కదరా! తను జీవితమంతా మా నాన్న వికృతత్వం వల్ల చాలా టార్చర్‌ అనుభవించింది. తను హాస్పిటల్‌లో చివరి దశలో ఉంది. ఆమెను చివరిసారి చూసుకోవాలని వెళ్తున్నాను. నాకు కూడా వైరస్‌ ఇన్‌ఫెక్ట్‌ అయ్యిందేమోనని డౌట్ గా ఉంది. అది నీకు అంటకూడదని కూడా బయిటికెళ్లిపోతున్నా! ఓపికుంటే అక్కడే ఎక్కడో హాస్పిటల్లో జాయినవడానికి చూస్తా.

నేను గమనించినంత వరకు నీలో ఇమ్యూనిటీ పవర్‌ ఎక్కువ! నీకు ఇప్పటి దాకా ఏమీ ఇన్‌ఫెక్ట్‌ కాలేదనే నమ్ముతున్నా. నీకు మెలకువ రాగానే ఫ్రిజ్‌లో మిగిలిన వాటిలో ఏమైనా తిని, మిగిలినవి తీసుకొని బయిటికి వెళ్లు. కింద సెల్లార్‌లో నా కార్‌ ఉంది. కీ టేబుల్‌ మీద పెట్టిన. తీసుకొని ఈ బిల్డింగ్‌ వెనుక వైపు నుంచి ఢిల్లీ బార్డర్‌ దాటి వెళ్లిపో. మనుషులున్న ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లు. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి చేరుకో. అక్కడే వీలైనంత కాలం నువ్వు గడపాలి. మర్చిపోకుండా రెండు దుప్పట్లు, పిల్లో, వాటర్‌ బాటిల్‌, ఫోన్‌ తీసుకెళ్లు. నైఫ్‌ మర్చిపోకు. కిచెన్‌లో కాస్త పెద్దది ఉంది చూడు, అది తీసుకెళ్లు. అది నీకు ఆత్మరక్షణకు, ఏవైనా కోసుకు తినడానికి, మరి దేనికైనా పనికి రావచ్చు. ఆఁ.. లైటర్‌ కూడా తప్పకుండా తీసుకెళ్లు. మేచ్‌ బాక్స్‌ కూడా పెట్టుకో. ఇక మిగతావి నువ్వు రూమంతా తరచి చూసి నీకు అవసరమనుకున్నవి తీసుకెళ్లు. ఈ బిల్డింగ్‌లో ఎవరైనా తారసపడితే జాగ్రత్త! వీలైనంత త్వరగా బయటపడి నీ ప్రాణాలు రక్షించుకో. ఇప్పటికే ఈ ప్రాంతమంతా కూడా ఇన్‌ఫెక్ట్‌ అయిఉంది. నువ్వు అడవిలో పడ్డావనుకో కొన్నాళ్ల తరువాత నీకు ఏదో ఒక దారి దొరుకుతుంది.

 

నా పరిస్థితి ఏమిటి అని కదా నీ ఆందోళన! నేను అయిపోతానేమో రా.. జూన్‌ 7న నాకు ఊపిరి తీయడం కష్టంగా మారుతున్నట్లుగా అర్థమైంది. ఇప్పటిదాకా నాలో ఉంటే నా నుంచి నీకు సోకకూడదని మెడిసిన్‌ తీసుకుంటూ వస్తున్నా. కాని నాలో రెసిస్టెన్స్‌ పవర్‌ అయిపోవచ్చిందని అర్ధమైంది. ఆ మెడిసిన్‌ కూడా అయిపోవచ్చింది. మిగిలింది నీకోసం ఉంచి వెళ్తున్నా. నిద్రలో ఉన్న నీకు జాగ్రత్తగా హై డోస్‌ మత్తు ఇచ్చాను. చాలాసేపు నిన్ను చూస్తూ గడిపాను. దుఃఖం ఆగలేదు. ఏడుస్తూనే చూస్తూ కూర్చున్నాను.

మనం కలిసి జీవించే కలలు ఎన్ని కన్నామో.. అవన్నీ ఇలా ఆవిరైపోతాయనుకోలేదు రా! కాని తప్పదు. ప్రకృతికి అందరమొకటే! ఒకసారి మనం గొడవ పడ్డాం, గుర్తుందా.. మనకు పుట్టబోయే బిడ్డ నీలా ఉండాలి అంటే నీలా ఉండాలి అని! ఎలాంటి పేరు పెట్టాలని…”

ఉత్తరం మీద పడి ఆరిపోయిన గౌతమి కన్నీటి చుక్కను చేతి వేలితో తడిమిండు యాసిన్‌. దానిపైనే తన కన్నీటి చుక్క పడింది!

”… నువ్వు బతకాలిరా. నీకు బతికే అవకాశం ఉంది. కొన్నాళ్లకు ఈ పరిస్థితి సమసి పోవచ్చు. ఎఫెక్ట్‌ కాని ప్రదేశాలు, ఇన్‌ఫెక్ట్‌ అయిన చోట కూడా ఇమ్యూనిటీ పవర్‌ ఎక్కువగా ఉన్న వారు బతికిపోతారు. నిజానికి మన దేశంలో ఎఫెక్టయిన యువకులు కోలుకునే అవకాశం ఎక్కువ. ముసలివాళ్లు కోలుకోవడం కష్టం. నేను హాస్పిటల్లో ఎక్కువమంది పేషంట్లను సేవ్‌ చేసే ప్రయత్నం చేశాను. కొందరు ఆడవాళ్లు తమను అందరూ దూరం పెడుతున్నారని భయంతో ఏడుస్తూ నన్ను అల్లుకుపోయిన సందర్భాలున్నాయి. ఇన్‌ఫెక్ట్‌ అయిపోయి ఉంటాను. నిన్ను మిస్సవుతున్నానన్న బాధ తప్ప నాకు గర్వంగానే ఉంది రా! నా మనిషిగా నువ్వు కూడా గర్వపడాలి తప్ప, ఏడవకు…

యాసిన్‌! మనం మెడిసిన్‌లో చేరిన తొలి రోజుల్లో నీ మీద ఎందుకో దృష్టి పడింది. ఎప్పుడూ పరధ్యానంగా ఉండేవాడివి. తెలుసుకుంటే నువ్వు మెరిట్ స్టూడెంట్ వని తెలిసింది. క్లాస్‌లో అందరూ హైఫైగా, దునియాఁలోని స్టైల్స్‌ అన్నీ కొడుతుంటే నువ్వు అవేవీ పట్టించుకోకుండా సాదాసీదాగా ఉండేవాడివి. నేనే ముందుగా పలకరించాను నిన్ను. నువ్వు చాలా క్యాజువల్‌గానే తీసుకున్నావు. నన్ను నేను పరిచయం చేసుకున్నాక నీ గురించి చెప్పావు. మనం ఫ్రెండ్సయ్యాం. కాని నేను చూసిన లోకం వేరు. నీ లోకం వేరు. నీ నుంచి అవన్నీ వింటూ గడిపేదాన్ని. నీ భావాలు, నీలోని పెయిన్‌, నీ ఫీలింగ్స్‌ నన్నెంతో ప్రభావితం చేశాయి. మెల్లమెల్లగా నాకు నువ్వే లోకమైపోయావు. పొద్దున్లేస్తే నీ కోసమే స్పీడ్‌గా తయారై కాలేజీకి వచ్చేదాన్ని. నిన్ను విడిచి వెళ్లాలని అస్సలుండేది కాదు. నువ్వు రాని రోజు నాకు లోకమంతా శూన్యంగా తోచేది. ఇవేవీ నీకు చెప్పడానికి సమయమే చాలకపోయేది!

ఆ సమయంలోనే మా ఇంట్లో మా నాన్న వికృత చేష్టలు ఎక్కువయ్యాయి. డబ్బు మదం కదా! మా అమ్మను రకరకాలుగా టార్చర్‌ పెట్టాడు. నేను అడ్డుపడితే నన్ను ఇంట్లోంచి వెళ్లగొడతానని, మెడిసిన్‌ మాన్పిస్తానని బెదిరించేటోడు. నాకు వేరే మార్గం లేదు. అదంతా నీకు మాత్రమే చెప్పుకునేదాన్ని. ఆ సమయంలో నువ్విచ్చిన ఓదార్పు, తోడు, చెప్పిన ధైర్యం నన్ను నన్నుగా నిలబెట్టాయి.

నిజానికి తామంటే పడిచచ్చే పిచ్చి ఉన్న ఆడవారిని చూస్తే చాలామంది మగాళ్లకు తమ ఇగో స్యాటిస్ఫై అవుతుంది. ఆ ఆడవారికి కూడా ఒక జీవితం ఉంటుందని చెప్పకుండా తమపై ఆధారపడే పరాన్నజీవులుగా  మార్చేసే మగాళ్లే అంతా! కాని నేనింతగా నువ్వంటే పిచ్చి ప్రేమతో ఉన్నా నువ్వు నన్ను నన్నుగా నిలబెట్టే మాటలు చెప్పడమే కాకుండా నీ మీద ఆధారపడకుండా నన్ను మలిచిన తీరు నాకు మరింత నచ్చింది. దాంతో నేను నా గురించి చాలా ఆలోచించుకునేదాన్ని. నా అల్పసంతోషి తనాన్ని వదులుకోవాలని, లోతుగా ఆలోచించాలని, ముఖ్యంగా మెడిసిన్‌ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. నిజానికి నాకు మెడిసిన్‌పై, పరిశోధనలపై చాలా ఇంట్రస్ట్‌ ఉందని నీకు తెలుసు కదా! చాలా లోతుగా నా ఆలోచనలు పోయేవి. అటువైపు దృష్టి పెట్టి పరిశోధనలు చేయడం మొదలు పెట్టాను.

ఇంట్లో ఒక ల్యాబ్‌ ఏర్పాటు చేసుకున్న విషయం నీకు చెప్పాను. నువ్వు కూడా బాగా ఎంకరేజ్‌ చేశావు. కాకపోతే నువ్వు సామాజిక విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ, డిస్టర్బ్‌ అవుతూ మెడిసిన్‌ మీద ఎక్కువగా దృష్టి పెట్టకపోయేవాడివి. ఎంతవరకు చదవాలో అంతవరకే పరిమిత మయ్యేవాడివి. అందుకే నిన్ను ఎక్కువగా డిస్టర్బ్‌ చేసేదాన్ని కాదు. ఈ విషయంలో నాకు మన క్లాస్‌మ్‌ట్ సుపర్ణ ఎక్కువగా సాయపడింది కదా! దానికి కూడా బాగా ఆసక్తి. మేం ఎన్నో సైంటిఫిక్‌ విషయాలు, మెడికల్‌ పరిశోధనల విషయాలు డిస్కస్‌ చేసుకునేవాళ్లం. చాలాసార్లు నా ల్యాబ్‌కి తను వచ్చేది. ఇద్దరం కలిసి ఎన్ని పరిశోధనలు చేసామో లెక్కలేదు. నిన్ను రమ్మంటే ఎన్నడూ నువ్వు రాలేదు. నువ్వు సోషల్‌ మూవ్‌మెంట్స్ లో బిజీగ ఉండేవాడివి. నేను నిన్నిక బలవంత పెట్టడం వదిలేశా.

ఈ కరోనా మొదలయ్యాక కూడా మేమిద్దరం చాలా చర్చించుకున్నాం. ముందు నీకు చెప్పిన రెండు మందులు తయారుచేయడంలో తను చాలా సాయం చేసింది. ఆ సమయంలో నువ్వు సిఏఏ, ఎన్నార్సీ పోరాటంలో బిజీగా ఉన్నావు. మీ ఏరియాలో జరిగిన దాడులతో నువ్వు కలవడం తగ్గిపోయింది. మీ నాన్న చనిపోవడం నిజంగా షాకింగ్‌! సారీ రా! అందుకే నిన్ను ఎక్కువగా బయిటికి రమ్మని అనలేకపోయేదాన్ని. నేనే రావాలని ప్రయత్నించేదాన్ని. నీలో ఉన్న ఒక చెడ్డ గుణం, నా దగ్గర డబ్బున్నా నువ్వు అవసరమున్నప్పుడైనా తీసుకోకపోవడం. అయినా డబ్బుదేముంది యాసిన్‌! అదే సంపాయించాలనుకుంటే నీలాంటి వాళ్లు చాలా సంపాదిస్తారు. అందరూ డబ్బు సంపాదనలోనే పడితే సమాజం గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు! అందుకే నాకు డబ్బంటే అసహ్యం! ఆ అసహ్యం కలగడానికి మా డాడీ ఒక బలమైన కారణం!

సరే, నేనేదేదో రాస్తున్నా.. మనసు మనసులో లేదు. నువ్వు జాగ్రత్త రా! నీకేం కాదు. కాన్ఫిడెంట్ గా సిటీ దాటు. ఎన్ని కష్టాలైన పడి ఎక్కువ రోజులు చెట్ల మధ్య గడుపు. నీలాంటి వారి అవసరం ఈ సమాజానికి చాలా ఉంది. నీకు నా తోడుంటే ఇంకా బాగుండేది.  బహుశా నువ్వొక్కడివే అయిపోతావేమో రా! నీకు నేను కూడా లేకుండా పోతున్నా! యామ్‌ వెరీ సారీ!

ఇంకా చాలా రాయాలని ఉందిరా.. కాని మైండ్‌ బ్లాంక్‌ అయిపోతున్నది..

చివరిసారి నీళ్లు నిండిన కళ్లనిండా నిన్ను చూసుకొని పోతున్నా.. నీ నుదుటి మీద కనీసం ఒక ముద్దు కూడా పెట్టే అవకాశం లేక విలవిల్లాడుతున్న మనసుతో.. వెళ్లిపోతున్నా రా!

ఆగిపోతుందో నీకోసం తట్టుకుని నిలబడుతుందో తెలీని ఈ గుండె నిండా ప్రేమతో..

నీ

గౌతమి

(బయిటి తలుపు కీ నా నైటీ జేబులోనే ఉంది. నువ్వు బయిటికెల్లేప్పుడు తొడుక్కోవలసినవన్నీ ఆ మూల టేబుల్‌ మీద ఉన్నాయి.)”

వెక్కి వెక్కి ఏడ్చిండు యాసిన్‌!

ఎంతోసేపటికి లేషి వేడినీళ్లు పెట్టుకొని స్నానం చేసిండు. ఒక బ్యాగ్‌లో గౌతమి చెప్పినవన్నీ మెడిసిన్‌తో సహా వేసుకొన్నడు. తన బట్టలు ఉతికి మడిచిపెట్టి ఉంచింది గౌతమి. వాటిని కూడా పెట్టుకొని పి.పి.గౌర్‌ (ఒంటి నిండా మాస్క్‌) తొడుక్కొని, ముఖానికి మాస్క్‌ పెట్టుకొని షూస్‌ వేసుకొని, చేతులకు గ్లౌవ్స్‌ వేసుకొని బయల్దేరిండు.

తలుపు తీసుకొని బయికొస్తే చుట్టూ సైలెంట్ గా ఉంది. మెల్లగా మెట్ల దిక్కు నడిషిండు. బిల్డింగ్‌ అంతా సైలెంట్ గా ఉంది. ఒక అంతస్తు దిగి లిఫ్ట్‌ ముందుకెళ్లి చూసిండు. లిఫ్ట్‌ నడుస్తలేదు. బహుశా ఆఫ్‌ చేసి ఉంటరు. లిఫ్ట్‌ ద్వారా కూడా కరోనా వ్యాపించే అవకాశముందని ప్రచారమైంది. మెల్లగా మెట్లు దిగుతూ కిందికి వెళ్లిండు. ఒక్క ఫ్లోర్‌లో కూడా ఒక్కరు కూడా కనిపించలేదు. సెల్లార్‌ కి వెళ్లి కార్‌ డోర్‌ తీసి బ్యాగ్‌ పక్క సీట్లో పడేసి కార్‌ స్టార్ట్‌ చేసి చూసుకున్నడు. ట్యాన్క్ ఫుల్‌ ఉంది. గౌతమి తీసుకున్న అన్ని జాగ్రత్తలు చూస్తే మళ్లీ కండ్లల్లో నీళ్లు తిరిగినయి.

కార్‌ స్టార్ట్‌ చేసి పోనిచ్చిండు. బయిటి గేట్ దగ్గర దిగి గేట్ తీసి కార్‌ బయట పెట్టి మళ్లీ గేట్ వేసి స్పీడ్‌ గా పోనిచ్చిండు. స్మశాన వీధుల్లా నిర్మానుష్యంగా ఉన్నాయి రోడ్లు. జనసంచారం లేదు. ఇప్పుడు పోలీసుల అవసరం లేకుండానే అంతా ఇండ్లకు పరిమితమయ్యిన్రు. అక్కడక్కడ బాడీ అంతా మాస్క్‌లతో ఒకరిద్దరు కనిపిస్తున్నరు. అంత దూరంగా పోలీస్‌ వ్యాన్‌ కనిపించగనే పక్కనున్న గల్లీలోకి పోనిచ్చిండు. ఒక అరగంట ఊహామాత్రంగా తనకు తెలిసిన దిక్కు ఢిల్లీ బయిటికి పోనిస్తున్నడు.

ఒక రోడ్డు ఎక్కంగనే ఒక మనిషి ఎదురుంగ నడుచుకుంట వస్తూ చేతులు జోడించి కారుకు అడ్డంగా నిలబడిండు. ఆపాల్నా.. పక్కనుంచి స్పీడ్‌గా ఎల్లిపోవాల్నా? క్షణాల్లో ఎటూ తేల్చుకోలేక స్లో చేసిండు. కారు పక్కకు పోనిచ్చినా అతను రిక్వెస్టు చేస్తున్నట్లుగా సైగలు చేస్తూ అడ్డం వచ్చిండు. ఆపిండు యాసిన్‌. చేతులు జోడించి అతను నిలబడ్డడు. లెఫ్ట్‌ సైడ్‌ డోర్‌ గ్లాస్‌ దించుతూ అటు రమ్మన్నడు యాసిన్‌.

అతను చేతులు జోడించే ఎడమ డోర్‌ దిక్కు వస్తున్నడు. ఒక్క క్షణం దబాయించి ఎల్లిపోనా అనిపించింది యాసిన్‌కు. కనీ, ఆ పని చేయలేకపోయిండు. అతను ఆ దిక్కు వచ్చి ”ప్లీజ్‌ బ్రదర్‌! నన్ను కాస్త మీరు వెల్లిందాక వదిలేయండి ప్లీజ్‌!” అని మళ్లీ చేతులు జోడించిండు.

కొన్ని క్షణాలు బ్లాంక్‌ అయిపోయి, అసంకల్పితంగా వెనక కూర్చొమ్మని సైగ చేసిండు యాసిన్‌. వెనక డోర్‌ తీసి కూర్చున్నడు అతను, ”థ్యాంక్యూ వెరీమచ్‌ బ్రదర్‌!” అనుకుంట. కార్‌ పోనిచ్చిండు యాసిన్‌. అతను దగ్గడం, తుమ్మడం చేయడం లేదు కాబట్టి పరవాలేదు అనుకున్నడు.

”మీకు ఢిల్లీ బయిటికి, చెట్లు తోటలున్న వైపు పోయే దగ్గరి దారి తెలుసా?” అడిగిండు యాసిన్‌.

”కొంత తెలుసు.. పోనివ్వండి, చెప్తాను” అన్నడు అతను.

”మీ పేరేంటి?”

”రామ్‌ మనోహర్‌!”

”మీరెక్కడికి వెళ్లాలి?”

”ఈ ఏరియా నుంచి బయటపడాలి ముందు!”

”మీ ఇల్లు ఇక్కడేనా?”

”అవును, అందరూ కరోనా బారిన పడ్డారు. హాస్పిటల్‌లో అడ్మ్‌ట్ అయ్యారు.”

”ఓహ్‌.. మా వాళ్లు కూడా..! మరిప్పుడు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నరు?”

”తెలీదు.. చాలామంది ఫ్రెండ్స్‌కి కాల్‌ చేశాను. ఎవరూ నేనొస్తానంటే రమ్మనలేదు. తమ తల్లిదండ్రులు వద్దంటున్నారని ఎక్కువమంది చెప్పిన్రు. ప్రాణ భయం ముందు ఎంతటి స్నేహాలైనా నిలువవు అని అర్ధమైంది. జీవితంలో కొన్ని తప్పులు చేశాను.. వాటికి శిక్షనేమో ఇదంతా..” అతను ఏడుస్తున్నాడు.

యాసిన్‌ మౌనంగా కార్‌ నడుపుతున్నాడు. కొన్ని గల్లీలు, రోడ్లు మూసి ఉన్నాయి. కొన్ని చోట్ల మళ్లీ వెనక్కి తిప్పి పోనివ్వాల్ని వస్తోంది. ఒకచోట మూడు రోడ్ల కూడలి, ఒకచోట నాలుగు రోడ్ల కూడలి.. పోలీసులను, ఆర్మీని తప్పించుకొని పోనిస్తున్నడు. అర్ధం కాక ఆగినచోట వెనక కూర్చున్న మనోహర్ ఎటు వెళ్లాలో చెప్పిండు. అలాగే ఎటుదిక్కు వెళ్లడానికి వీలుంటుందో, అడవి ఎక్కడుంటుందో కూడా మనోహర్ డైరెక్ట్‌ చేసిండు.

మధ్యలో మరి నువ్వెక్కడ దిగిపోతావని అడిగిండు యాసిన్‌. మీరెక్కడికి వెళ్తున్నారని మనోహర్ అడిగితే అడవిలోకి వెళ్తున్న విషయం చెప్పిండు. అభ్యంతరం లేకుంటే తను కూడా వస్తానన్నడు మనోహర్.

సరేనన్నడు యాసిన్‌. తను ఒక్కడు మాత్రం ఏం చేస్తడు.. మనిషికి మనిషి తోడు, మాటకు మాట తోడు అనుకున్నడు.

ఢిల్లీ పొలిమేర దాటి కొద్దిదూరం పోయినంక ఒకచోట దూరంగా చెట్లు, పచ్చదనం ఎక్కువగా కనిపిస్తున్న దిక్కు ఒక మట్టి దారి కనిపించి కారును అటు మలిపిండు యాసిన్.  వెళ్లగలిగినంత దూరం పోనిచ్చి ఇక దారి లేని కాడ దిగి కొంత దారి సాపు చేసుకుంట మళ్లీ ఎక్కి మరికొంత దూరం పోయిన్రు. ఒక చోట అల్లంత దూరాన మామిడి తోట, మధ్యలో ఒక చెట్టు కింద చిన్న గుడెసె కనిపించినయి. ప్రాణం లేషి వచ్చింది ఇద్దరికీ. అక్కడికి కారు వెళ్లగలిగినంత దూరం తీసుకెళ్లి ఒకచోట ఆపేసి బ్యాగులు తీసుకొని గుడిసె దిక్కు నడిషిన్రు.

చెట్లకు మామిడి పండ్లు పండి అక్కడక్కడ రాలిపడి ఉన్నయి. అవాలే రాలినట్లు అనిపించిన తాజా పండ్లు చెరో రెండు తీసుకొని గుడిసె చేరుకొని చూసిన్రు. గుడిసెల ఎవరు లేరు. ఒక కుక్కి నులకమంచం ఏసి ఉంది. వీళ్ల అలికిడికి ఒక పెద్ద పాము గుడిసెలోంచి బయిటికి పారిపోయింది. ఇద్దరి ఒళ్లు ఝల్లుమన్నది. నాలుగు అడుగులు వెనక్కి ఉరికిన్రు. పాము దూరంగా పోతున్నది కనిపించి జర నిమ్మలపడ్డరు. కింద కనిపించిన ఒక కర్ర తీస్కొని గుడిసె దగ్గర్కి పోయి కర్రతో సప్పుడు చేసిండు యాసిన్‌. ఒక తొండ, రెండు బల్లులు కదిలినయ్‌.

చుట్టు చప్పుడు చేసి బ్యాగులు కింద పెట్టి నీల్ల కోసం చూసిన్రు. పక్కన స్విచ్‌ బోర్డ్‌ ఆ పక్కనే బోర్‌ పైప్‌ కనిపించినయ్‌. స్విచ్‌ బోర్డు పరిశీలించి గ్రీన్‌ బటన్‌ నొక్కిండు మనోహర్‌. పంపు పోస్తున్నది. ఇద్దరు ఖుష్షయిన్రు.

‘ముందు నేను స్నానం చేస్త బ్రదర్‌!’ అన్నడు మనోహర్‌. సరేనన్నడు యాసిన్‌. ఇద్దరు గుడిసె కాడికి నడిషిన్రు.

మొఖానికున్న మాస్క్‌ తొలగించిండు మనోహర్‌! అతని మొఖం చూస్తూనే స్థాణువులా నిలబడిపోయిండు యాసిన్‌. తన తండ్రిని పొడిచినవాళ్లల్లో ఒకడు! ఇతనే ఎక్కువ పోట్లు పొడిషిండు!

గుండె మండిపొయింది యాసిన్‌కు. ఎక్కడలేని కోపం తన్నుకువచ్చింది. తమాయించుకోవడం కష్టమైంది.

మనోహర్‌ ఒంటికున్న మాస్క్‌, బట్టలు అన్నీ తీసి చుట్టు ఉన్న చిన్న చిన్న చెట్ల మీద ఎండకు ఏసిండు. బ్యాగుల్నుంచి టవల్‌ తీసి డ్రాయర్‌ మీద పంపు దిక్కు నడిషిండు. ఈలోపు యాసిన్‌ నరనరాన పాకిన ఆగ్రహాన్ని నిగ్రహించుకోడానికి ఆపసోపాలు పడ్డడు. మనోహర్‌ మీద పడి కొట్టాలనిపించింది ఒక్క క్షణం. మంచం బయికి లాక్కొని కూలబడిపొయిండు. తలను రెండు చేతులతో నొక్కుకున్నడు. ఎలాంటి పరీక్ష ఇది?! ఇంకా ఎంతటి క్షోభల్ని అనుభవించాలె ఈ ఒక్కరోజే! ఎన్ని కఠోర నిజాలు ఎదుర్కోవాలె. అతని గుండె ఊటగా కొట్టుకుంటున్నది. ప్చ్‌! ప్చ్‌! అని ఎన్నిసార్లు అసహనం వ్యక్తం చేసిండో.. ఎన్ని  నిట్టూర్పులు విడిచిండో.. ఇంకా ఏం చేయడానికి తనిదంతా భరించాలె? ఛత్తెరికి జిందెగీ! పోయి పోయి ఇతను తనకే ఎదురుపడాల్నా? ఎందుకీ మానసిక హింస తనకి?

మనోహర్‌ స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంట ‘నువ్వు కూడా స్నానం చెయ్‌ బ్రదర్‌!’ అన్నడు. అతని దిక్కు చూడలేకపోయిండు యాసిన్‌. మాట్లాడకుంటనే లేషిండు. మనసులో మంట. తన మొఖంలో మనోహర్‌ పట్ల అసహ్యం తనకే సమజవుతున్నది. మాస్క్‌, బట్టలు తీసేసి టవల్‌ తీసుకొని స్నానానికి పొయిండు. బోర్‌ కింద నిలబడితె తల, ఒళ్లు జరసేపు సల్లబడ్డయి. తల బోరు కిందనే ఉంచి కాసేపు కండ్లు మూసుకున్నడు. మనసు గజిబిజిగా.. మంటగా… అంతలోనే దయ, క్షమ, తత్వం ఎన్నో ఆవరిస్తున్నై.

స్నానం చేసి వచ్చేసరికి మంచంలో కూర్చొని పండు తింటున్నడు మనోహర్. ‘పండు చాలా బాగుంది బ్రదర్‌!’ అంటూ మజా చేస్తున్నడు.

బదులేమీ ఇవ్వకుంట తల తుడుచుకొని బ్యాగ్‌ల నుంచి ఒక టీషర్ట్‌ తీసి వేసుకుండు యాసిన్‌. తను కూడ ఒక పండు తీసుకొని కడుక్కొనొచ్చి చెట్టుకి చేరగిలబడి తింటున్నడు.

‘బ్రదర్‌! మనం బయటపడ్డట్టేనా? మనకు కరోనా సోకలేదంటవా? ఎన్నాళ్లు మనం ఇక్కడ ఉండగలం?’ అనడిగిండు మనోహర్‌.

‘తెలీదు’ యాసిన్‌ నిరాసక్తమైన జవాబు.

‘ప్చ్‌.. హూఁ..’ అని నిట్టూర్పు వదిలి పండును ఆస్వాదిస్తున్నడు మనోహర్‌.

యాసిన్‌ మనసు బ్లాంక్‌గా ఉంది. మనోహర్‌ ఏదో అడుగుతున్నడు. యాసిన్‌ దేనికీ జవాబు ఇవ్వలేదు. అసలు అవేవీ యాసిన్‌కి వినబడలేదు. పండు తినేసి చేతులు మొఖం కడుక్కొనొచ్చి కూర్చొని జరసేపు చుట్టూ ఉన్న పచ్చదనాన్ని, మామిడి తోటను చూస్తు గడిపి చెట్టు కింద కూర్చొని బ్యాగులో వేసొకొచ్చిన పుస్తకాల్లో సూఫీ పొయిట్రీ తీసి చదవడం మొదలుపెట్టిండు.

కాసేపు చదివి పుస్తకం పక్కన పెట్టేసి చెట్టు మొదలుకి అలా ఒరిగి కళ్లు మూసుకున్నడు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక న్యాప్‌ తీసిండు.

లేషి చూస్తే మనోహర్‌ మంచంలో సన్నటి గురక పెడుతున్నడు. పైకి లేషి అతని దగ్గరికి నడిషిండు. అతన్ని చూస్తు కాసేపు నిలబడ్డడు. బ్యాగ్‌లో కత్తి యాదికొచ్చింది. తలుచుకుంటే ఆ కత్తితో తన తండ్రిని ఇతను పొడిషినట్లే తను పొడిచేయగలడు. కాని అప్పుడు అతనికీ తనకూ తేడా ఏముంటుంది! అనుకుని కళ్లు మూసుకొని తమాయించుకుని పక్కకు వెళ్లి దూరంగా చూస్తూ నిలబడ్డడు. క్షమను మించిన గుణమేముంటుంది అనుకున్నడు మనసులో.

సాయంత్రమవుతున్నది. చెట్లు గాలికి ఊగుతున్నయి. పక్షులు ఎగురుతున్నయి. ఏవేవో కూతలు, అరుపులు. ఈ ప్రకృతి అందరిదీ. ఒక్క మానవుడు మాత్రమే దీనిపై తను ఆధిపత్యాన్ని సాధించాననుకున్నడు. విర్రవీగిండు. ఎన్ని దాష్టీకాలు.. ఎన్ని ఊచకోతలు.. ఎన్ని ఎన్నెన్ని దౌర్జన్యాలు.. ఇవాళ ఏమయ్యింది.. ఈసారి కరోనాతో మానవుడు ఎంతటి దుర్బలుడో ప్రకృతి చాటి చెబుతున్నది! ప్రపంచమంతా ఇండ్లల్లో నక్కింది. ఇప్పటికీ అర్ధం చేసుకొని మెలగకుంటే మళ్లీ మళ్లీ ప్రకృతి తన తీర్పు చెబుతనే ఉంటది!

ప్రకృతి గురించి దాని సమతుల్యం గురించి ఎన్నడు ఆలోచించిండని మనిషి. షానా తక్కువమంది ఆలోచించి హెచ్చరించినా ఎక్కడ విన్నడని. వినకుంటే ఇలాగే భూకంపాలు, సునామీలు, తుఫానులు, వైరస్‌లు ప్రకృతిని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తాయి!

***

రెండోరోజు మనోహర్‌ అడిగిండు, ”ఏం బ్రదర్‌! ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు నాతో సరిగా మాట్లాడడం లేదు. ఎందుకని?”

చెట్టు మొదలు చుట్టు తన మకాం పరుచుకున్నడు యాసిన్‌. దగ్గరగా మంచం జరుపుకొని కూర్చొని ఉన్నడు మనోహర్‌.

ఏం చెప్పాల్నో సమజ్‌ కాలేదు యాసిన్‌కు. కాసేపు మౌనం తర్వాత చెప్పిండు,

”మాది భజన్‌పురా! మొన్నటి ఢిల్లీ ఊచకోతలో ఒక ఐదారుగురి గుంపు మా ఇంట్లోకి జొరబడి కత్తులు కర్రలతో దాడి చేసింది. నా తండ్రిని చంపేసింది. అందులో ఎక్కువ కత్తిపోట్లు పొడిచి మా నాయన చావుకి కారణమైన వాడివి నువ్వు! నీ మొఖానికి మాస్క్‌ తీసినప్పుడు నిన్ను గుర్తుపట్టిన క్షణం నుంచి నేను మనిషిని కాలేకపోతున్నాను” అంటూ తల వంచుకొని కళ్లు మూసుకున్నడు యాసిన్‌.

షాక్‌కి గురైపోయిన మనోహర్‌ నోట మాట రాక అలా ఉండిపోయిండు. ఆ రోజు సంఘటనలు గుర్తు చేసుకున్నడు. ఆ రోజు తను ముగ్గురిని కసితీరా పొడిచిండు. అందులో ఎవరో మరి. ఇప్పుడెలా.. ఇతనేమైనా కక్ష తీర్చుకునే అవకాశముందా? మనిషి అలా లేడు. ఈ పరిస్థితుల్లో సారీ చెప్పి మంచి చేసుకోవడమే మంచిది. కాసేపటికి యాసిన్‌ దిక్కు చూసిండు మనోహర్‌. తల వంచుకొనే ఉన్నడు యాసిన్‌!

”సారీ బ్రదర్‌! వెరీ సారీ! నేనేదో మైకంలో అవాళ అలా తప్పు చేసిన. నేను ఆ గొడవల్లో పాల్గొన్నట్లు తెలిసి మా అమ్మా నాన్న కూడ బాగ తిట్టిన్రు. నేను చేసింది పెద్ద పొరపాటే! నన్ను క్షమించు బ్రదర్‌!” అన్నడు ప్రాధేయపడుతున్నట్లు.

యాసిన్‌ ఏం మాట్లాడలేదు. కాసేపటికి ఒక పెద్ద నిట్టూర్పు విడిచిండు,

”నువ్వు మారితే మంచిదే బ్రదర్‌! అందరం మనుషులమే. ఈ భూమ్మీది అన్ని జీవుల కన్నా కాస్త తెలివైన జంతువులం. మానవత్వం ఏమిటో తెలుసుకున్నవాల్లం. జంతువుల్లా ఒకర్ని ఒకరం చంపుకోవడం మనిషితనం అనిపించుకోదు. నీలో మనిషిని మేల్కొలుపు. నీకు నువ్వే చింత చెయ్యి. నీ తప్పును నువ్వు తెలుసుకుంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది!” అంటూ పైకి లేషిండు యాసిన్‌.

”తప్పకుండ బ్రదర్‌!” అంటూ మంచంలోంచి తను కూడా లేషి యాసిన్‌ని ఆలింగనం చేసుకున్నడు మనోహర్‌. ఒక్క క్షణం తటపటాయించినా మనస్పూర్తిగా అలాయిబలాయి ఇచ్చిండు యాసిన్‌.

 

***

ఆ రోజంతా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నరు ఇద్దరూ. ఆ చుట్టుపక్కల మానవమాత్రుడెవరి జాడ లేదు. చుట్టూ తిరిగి రక రకాల కాయలు, పండ్లు తెచ్చుకున్నరు. తిన్నరు.

ఉండబట్టలేక అడిగిండు యాసిన్‌,

”నీకు అభ్యంతరం లేకపోతే అసలు ఆ దాడికి మీరంతమంది ఎట్ల జమయ్యిన్రు బ్రదర్‌? ఏ కారణాలు మిమ్మల్ని అలా ఉసిగొల్పినయి? చెప్పు బ్రదర్‌.. వినాలనుంది!” అన్నడు.

కొద్దిగ ఇబ్బంది పడ్డడు మనోహర్‌. ”ఏదోలే బ్రదర్‌! అయిపోయింది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్‌ ఉన్నరు నాకు. వాళ్లు ఎప్పుడు ఇవే విషయాలు మాట్లాడతరు. వాళ్లు శాఖకు వెళ్లడం, ఆ పుస్తకాలు పత్రికలేవో చదవడం చేస్తారు లే. వాళ్ల వల్లే నాకు కూడ ముస్లింలంటే పట్టరాని కోపం ఏర్పడింది. మా అమ్మా నాన్న కూడ ఆ గొడవ తర్వాత వాళ్లను బాగా తిట్టిన్రు. వాళ్లను ఇంటికి రావద్దన్నరు…”

‘కాని, అంతమంది ఒక్కరోజే ఎట్ల జమయ్యిన్రు మనోహర్‌?”

”ఏముంది, మాకు కొన్ని వాట్సప్‌ గ్రూపులున్నై. వాటితోనే ఇన్ఫర్మేషన్‌ పాస్‌ ఆన్‌ చేసుకున్నం…”

”మనుషుల్ని చంపుతున్నప్పుడు నువ్వేం సంకోచపడలేదా..!”

”మా వాళ్లు అంతటి ఉద్రేకం కలిగేలా చేసిన్రు. ఎగేసిన్రు. ఎంతమందిని చంపగలమో చూద్దాం అన్నంత ఉన్మాదం అది. తర్వాత ఎందుకో మాటిమాటికి నేను చంపినవాళ్ల మొఖాలు, వాళ్ల చుట్టూ భయకంపితులైన వారి మొఖాలు గుర్తొచ్చి నిద్రపట్టలేదు. నా ఫ్రెండ్స్‌ మాత్రం నన్ను చాలా మెచ్చుకున్నరు. నేనెందుకో ఎంజాయ్‌ చెయ్యలేకపోయిన.”

”పరవాలేదు మనోహర్‌, నీలో మంచి మనిషి ఉన్నడు. నీలో మార్పు సాధ్యం!”

”కానీ, వెరీ సారీ బ్రదర్‌! మీ నాయనను చంపింది నేనే అని గుర్తుపట్టిన తర్వాత కూడా నువ్వు కంట్రోల్లో ఉన్నావు చూడూ! మామూలు విషయం కాదు. అదే నేనైతే నీలా ఉండలేకపోదును!”

”మనం మనుషులం మనోహర్‌! చెప్పిన కదా, జంతువులం కాదు! జంతు దశను దాటి వచ్చినవాళ్లం. ఆ మాత్రం ఆత్మపరిశీలన లేకపోతే మనిషులుగా మన బ్రతుకు వృధా!”

”ఎనీ హౌ.. థ్యాంక్యూ వెరీ మచ్‌ బ్రదర్‌!”

***

మరో రోజట్లా గడిపేసిన్రు. రాత్రిళ్లు ఒకరు కాకపోతే ఒకరు జాగ్రత్త వహిస్తున్నరు, ఏదైనా చప్పుడైతే లేషి చూడ్డం.. చప్పుడు చేయడం చేస్తున్నరు. తామున్న చోటికి చుట్టూరా కొద్దిదూరం కట్టెలతో కింద కొడుతూ చప్పుడు చేస్తూ వస్తున్నరు, పాములేమైనా ఉంటే ఇంకా దూరం పారిపోతాయని. రెండు తేళ్లను, మూడు జెర్రులను కూడా చంపిన్రు. సమయం దొరికినప్పుడల్లా మనోహర్‌ని మార్చడానికి షానా విషయాలు చెప్పిండు యాసిన్‌.

మధ్య మధ్యలో గౌతమి, అమ్మ, తమ్ముడు గుర్తొచ్చి మనసు చెదిరిపోయేది యాసిన్‌కు. గౌతమి ఫోన్‌ ఆఫై పోయింది. గౌతమి ఫ్రెండ్‌కి కాల్‌ చేస్తే తనకు తెలీదు అన్నదామె.

మూడోరోజు ఉదయం చల్లగా ఉంది వాతావరణం. కాలకృత్యాలు తీర్చుకున్నంక చెట్టు కింద కూర్చుని పండ్లు తింటున్నరు. మామిడి ముక్కలు కత్తితో కోసి ఇస్తూ అడిగిండు మనోహర్‌,

”యాసిన్‌ బ్రదర్‌! మీది భజన్‌పురా కదా! మీరు మా బస్తీ వైపెందుకు వచ్చినట్లు?” అని.

గౌతమి గురించి, జరిగిన విషయాలన్నీ చెప్పిండు యాసిన్‌.

”అన్ని రోజులు గౌతమి రూంలో ఉన్నావా!?” అడిగిండు మనోహర్‌.

”అవును.. తను పిలిచిందే అందుకు.. నేను ఎక్కడ కరోనాకు ఇన్‌ఫెక్ట్‌ అవుతానోనని నన్ను రక్షించుకునే ప్రయత్నం చేసింది.. ఈలోగా తనేమైపోతుందో తెలీదు కాబట్టి ఉన్నన్ని రోజులు నాతో గడపాలని నిర్ణయించుకున్నది!”

”అంటే మీరిద్దరూ సెక్సువల్‌గా కూడా గడిపారా!?”

”అవును.. తనకు నేనంటే చాలా ఇష్టం.. నాకు కూడా ప్రాణం! ఇద్దరం లోకం మరిచిపోయి ఏకమైపోయాం…”

ఒక్కసారిగా మనోహర్‌ మంచంపై నుంచి లేషిండు. ఏం జరుగుతుందో యాసిన్‌ అర్ధం చేసుకునే లోపల చేతిలో ఉన్న కత్తితో యాసిన్‌ని పొడవడం మొదలుపెట్టిండు. యాసిన్‌ షాక్ లోంచి తేరుకుంటూ పక్కకు జరిగే సరికి కత్తి ఎడమ భుజంలో, ఎడమ చేతిపై దిగింది. మనోహర్ ను వెనక్కి నెట్టేస్తూ లేషిండు యాసిన్‌. అంత దూరం పడి మళ్లీ లేస్తున్నడు మనోహర్‌. పిచ్చిపట్టినట్లు అరుస్తు ఊగిపోతూ మళ్లీ యాసిన్‌ మీదికి ఉరికొస్తూ పొడవబోయిండు. తప్పించుకుంటూ మళ్లొకసారి పక్కకు నెట్టేసిండు యాసిన్‌. ఈసారి ఒంటికి గాయమైంది. అతని ఉన్మాదం నుంచి తప్పించుకోవడం కష్టమనిపించి, ఇక లాభం లేదని,

”హేయ్‌! నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు పొడుస్తున్నవ్‌?” అంటూ పెద్దగా అరుస్తూ తన బ్యాగ్‌ అందుకొని పరిగెత్తిండు.

”సాలె.. మాకె లౌడే.. మా హిందూ అమ్మాయిని అనుభవిస్తవారా?” అంటూ ఉరికొస్తున్నడు మనోహర్‌!

షాకయ్యిండు యాసిన్‌ ఆ మాటలకు!

”అరె హౌలే..! హిందూ ముస్లిం ఏందిరా..! అది ప్రేమరా! నీకు ఎప్పటికీ అర్ధం కాదులే..! నువ్వు మారినవనుకున్నా.. మీరు మారరు రా.. థూ.. మీరూ.. మీ బతుకూ..!” అంటూ మనోహర్‌కు అందకుండా బలం కొద్దీ పరిగెత్తుతున్నడు యాసిన్‌.

మనోహర్‌ పట్టరాని ఉద్రేకంతో ఉరికొస్తూ కాలికింద మట్టి స్లిప్‌ అయి బోర్లా పడ్డడు. అదే అదనుగా కారు దిక్కు పరుగెత్తిన యాసిన్‌ బ్యాగ్‌లోంచి కీస్‌ తీసి కారు డోర్‌ తీసి లోపలికి దూరి డోర్‌ పెట్టేసుకున్నడు. మనోహర్‌ లేషి పరిగెత్తి వచ్చే లోపల కారు స్టార్ట్‌ చేసి పరిగెత్తించిండు యాసిన్‌. ఈలోపు కారు వెనక్కి పరిగెత్తుకొచ్చిన మనోహర్‌ కదిలిపోతున్న కార్‌ మీద నిస్సహాయంగా కత్తితో పొడిచిండు. ఆ దెబ్బ వెనక డిక్కీ మీద పడింది. కారు దూసుకెళ్లిపోయింది!

పిచ్చిగ అరుస్తు ఆ మానుల మధ్య రక్తం కారుతున్న కత్తితో నిలబడిపోయిండు మనోహర్‌!

*

 

స్కైబాబ

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పరిస్థితులన్నీ కట్టగట్టుకొని వచ్చినట్లున్నాయ్.
    చదవడం మొదలు పెట్టినప్పనుంచీ తెలియకుండానే దృశ్యాత్మకమై ఇమాజినరీలు కళ్ళల్లో అలా పరుగెత్తుకుంటూ పోయాయ్.

    మతం ముందు మానవత్వం ఏపాటిది.

    – నస్రీన్ ఖాన్

  • ఈ సందర్భంలో ఇలాంటి కథ రాయాలంటే గట్స్ ఉండాలి. జీవితాన్ని తీక్షణంగా చూసే చూపు రచయితకు ఉంటే తప్ప ఇలాంటి కథ రాయలేం. ఒకేసారి మత రాజకీయాల్నీ వాటిని ఎదుర్కొని నిలబడే జంటని ఆ నేపధ్యంలో వాళ్ళు ఎదుర్కాన్న కష్టాల్నీ చిత్రించిన కథ.

  • అద్భుతమైన కథ. స్కై మార్క్ బలంగా వుంది. అందరూ చదవాలే.

  • అద్భుతమైన కథ. స్కై మార్క్ బలంగా వుంది. అందరూ చదవాలే. Political story of contemporary times.

  • స్కై బాబా గారు,

    మీ రాజకీయ సిద్ధాంతాన్ని ప్రకటించటానికి కథా ప్రక్రియను ఏకపక్షంగా వాడుకోవటం సమంజసంగా లేదు. మీలో ఉన్న అభద్రతా భావాన్ని మీ కథ తెలియచేస్తోంది. మీరు తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. కేవలం ఒక వర్గం వారే ఉన్మాదుల వలె వ్యవహరించటం లేదు. ఉన్మాదం అన్ని వర్గాల్లో ఉంది. WHATSAPP గ్రూపుల ద్వారా హింసను ప్రేరేపించటం ఇరు వర్గాలూ చేస్తున్నారు. పది నిమిషాలు పోలీసులు
    కళ్ళు మూసుకుంటే తామేంటో చూపిస్తామని ఒక ప్రతినిధి అన్నప్పుడు మీ లాంటి మానవతా వాదులెవరూ ఖండించలేదెందుకని. ఢిల్లీ విద్వంసాన్ని మీకు అనుకూలంగా మలచుకున్న మీకు భైంసా వికృత క్రీడ కనబడలేదా.

    సాటి మనిషిని ప్రేమించాలని చెప్పే మీ లాంటి మేధావులకు సూటి ప్రశ్న

    * ఈ దేశంలో యాసీన్ , గౌతమి లాంటి జంటలు కోకొల్లలు ,
    మరి యాస్మీన్, గౌతం వంటి జంటలెన్ని ?

  • చాలా రోజుల తరవాత sky sir ni
    (స్కైబాబ గారి కొత్త కథ “ప్యార్ కరోనా”)
    చదవటం హ్యాపీ. ఇది ఒక సామాన్య అభిమాని స్పందన…

    చిత్తశుద్ధి ఉన్న ఒక ఉద్యమ కర్త ఎలా ఉంటాడు, ఎలా ఆలోచిస్తాడు, ఎలా రాస్తాడు… అనేది ఈ కథ చదివాక అర్థం అవుతుంది.
    “ప్రాణాల మీద కొచ్చక కూడా ఏంటండీ మి caa లు nrc లు” అనొచ్చు కొందరు.
    ప్రాణాలు రక్షించబడి ఒడ్డున పడ్డాక – హమ్మయ – అనుకోటనికి లేదు మరి.
    ఎందుకంటే..ఇది అస్తిత్వ పోరాటం. మూలవాసులకి ఇది పుట్టుక ముందు నుంచే ప్రారంభం అవుతుంది.
    క్రిమి దేముంది, ఎన్నో వోచయి, చచ్చాయి, పోయాయి.
    కానీ ఈ పోరాటం అనాదిగా సాగుతూనే ఉంది, ఇంకా ఎన్నాళ్ళు సాగుతుందో కూడా తెలీదు.

    ఈ క్రిమి నీ ఎదుర్కునే విధానాలు బయట దేశాల్లో, మన దేశం లో ఉన్న తేడా మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న వలస కూలీలను కూర్చోబెట్టి కలుపు మొక్కలకు పిచికారి చేసినట్లు చేశారే… ఏ మంత్రి కొడుక్కో, బావమర్ది కో వొస్తే ఇలా చేస్తారా?!
    ఖచ్చితంగా చేయరు.

    అందుకే వాతావరణం లోని క్రిమి తో పాటు
    సమాజం లోని వెతలతో కూడా ఉద్యమకారుడు పోరాటం చేయాల్సిందే. ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ ఈ విషయం ప్రస్తావించాలి.

    Sky sir is a true activist. He shows us how a responsible writer/poet must behave, think and write.
    I salute him for his commitment.
    Must read his new story
    I provided the link on my wall.

    కాకుంటే ఎంతో అద్భుతంగా రాయగల ప్రతిభ ఉండి కూడా sky sir ఎందుకు రాయట్లేదో అర్థం కావట్లేదు. మా లాంటి ordinary readers missing him so much. Whatever దయచేసి ఇదే జోరు కొనసాగించి
    మరెన్నో కథలు మాకు అందించాలి.
    ఈ lockdown time ni కావల్సినంత పిండుకొండి

  • ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఊహించనిది. అడుగడుగునా ఒక మనోహర్ తయారై వున్నారు. ద్వేషం నింపుకున్న కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్న వారికి మనుషులు కనిపించడం లేదు. ఏమో…నేను పుట్టిన నేల గురించి నేను కన్న కలలు ఇలా దగ్ధం కావడం జీర్ణించుకోలేని స్థితి. అయినా ఆశ..ఏదో ఆశ..స్కై కి అభినందనలు. సమకాలీన సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించిన తీరు బాగుంది.

  • మతం కరోనా కంటే ప్రమాదం
    ————————-
    భిన్నమైన కథ. సామరస్యాన్ని కోరుతున్న కథ. ప్రాణాపాయ స్థితిలో కూడా ఎక్కించాల్సిన రక్తం ఏ కులం వాడిది అని ఆలోచిస్తున్న కాలంలో ఉన్నాం. కూతుర్ల కొడుకుల మంచి ఆలోచించాల్సిన పెద్దవాళ్ళే కులం పేరుతో మతం పేరుతో వాళ్ళ జీవితాలను చిదిమేస్తున్న కాలంలో ఉన్నం. అలాంటి పరిస్థితిలో మార్పు కోరే అప్పీల్ ఈ కథ. చాలా స్పీడ్ గా వెనక్కు వెనక్కు వెళ్తున్న మన సమాజానికి అంతే స్పీడ్ గా బ్రేక్ వేసే కథ. అందుకే ఆ జర్క్ నుంచి తేరుకోవడానికి అర్ధం కావడానికి కొంచెం టైం పడుతుంది. నిజమెప్పుడూ నిష్టూరమే. గౌతమీలు మాయం కాకూడదని… యాసీన్లు దుఃఖ పడకూడదని… మనోహర్ లు మారాలని… మతం కరోనా కంటే ప్రమాదం కాకూడదని బలంగా కోరే కథ.

  • మత దురహంకారం ఏదైనా నికృష్టమైంది. ఇండియాలో మెజారిటీ హిందూ ఆధిపత్య మతదురహంకారం మరింత నికృష్ట మైంది.
    స్కై తన హృదయాన్ని,మనస్సును మేళవించి ‘ప్యార్ కరోనా’ కథ రాసారు. కథ మనుస్సును కరిగించింది. కదిలించింది.
    ఆధిపత్య భావజాలంతో ప్రేరితుడైన వ్యక్తి పట్ల మానవత్వంతో వ్యవహరించినా, ఉన్మత్త భావాలు పెల్లుబికి .. మానవత్వాన్ని పరిహసిస్తూ హింసాత్మకంగా వ్యవహరించడం ఇవ్వాళ ఇండియాలో పెట్రేగిన ఆధిపత్య మతోన్మాదాన్ని, పరువు హత్యల పరంపరను కళ్లకు కడుతుంది.

  • అంబటి సురేంద్రరాజు కామెంట్:
    ఇప్పుడే కథ పూర్తి చేసిన.
    padthe waqt acchaa lagaa … lekin narration me aur thodaa depth laanaa thaa ! phir bhi acchaa hai!
    delhi backdrop me ek taraf caa , aur ek taraf corona ke beech story chalaanaa aasaan cheez nai hai. Tumhaarii ye Koshish saphal huvee! – ye mai maanuungaa …!
    Sadat Hasan Manto ke stories baar baar padnaa – ye meraa mashwaraa hai …! 🌷💐💓💐🌷

  • బాబా భయ్యా! మొదటిసారి మీ కథకు కామెంట్ పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది!
    మీ కథలకు నేను అభిమానిని.
    మీ కథలన్నీ స్త్రీలు తమ విద్యను పెంపొందించుకోవడం, తమ దైనందిన సమస్యల పరిష్కారాల కోసం స్వయంగా పోరాడడం లాంటి విషయాలను బలంగా చెబుతాయి.
    మీ కథలు, వదిన షాజహానా కథలు చదివినప్పుడు నేను ఎంతో హ్యాపీగా ఫీలవడమే కాకుండా చాలా రోజులు ఆ కథలు నన్ను వెంటాడుతూ సరైన దారిలో ఆలోచించేలా చేస్తాయి.

    మీ కథలు కల్పితాలు అనిపించవు, మన చుట్టూ జరుగుతున్న విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంటాయి.

    ఇవాళ కథలన్నీ CAA, NRC చుట్టూ తిరుగుతున్నాయి. మనం ఈ సమస్యను ఎదురుకుంటున్నది నిజమే! నేను స్వార్ధపరురాలినే కావచ్చు, ఈ విషయాలను నేను వ్యక్తపర్చే ధైర్యం చేయలేకపోతున్నాను😢
    ఆ విషయంలో మీ గట్స్ ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను! నిజానికిది మన ఉనికి సమస్య!

    ఏదేమైనా మీరు చేస్తున్నది గొప్ప పని.

    ఇవాళ నేనొక డాక్టర్ గా కరోనా పేషంట్స్ ని మతం, కులం చూడకుండా వైద్యం చేస్తున్నాను. డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఇది కరోనాతో పోరాడే సమయం.

    మరోసారి మీకు అభినందనలు భయ్యా!
    రచన మీకు అబ్బిన ఒక బహుమతి. మీరు ఈ దేశానికి ఒక బహుమతి!

    -డా.హనీఫా బేగం
    ఢిల్లీ

  • In unconditional situation also religion effected the person. This story shows how the people mentally fixed with caste, religion. How many years we have to wait for all are equal. Comparing to developed countries how they have developed. Are they following caste and religion. India is always developing country. It’s under going process…….. Anyways story is Super.

  • Hi sky
    వర్తమాన వాస్తవాలను చాలా గొప్పగా రికార్డ్ చేసినవు.
    హిందూ మత ఉన్మా దానికి మనిషంటే కులము,మతంగానే కనిపి స్త ది
    అనేది బాగా చెప్పిన వు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు