పొద్దు గడవడం లేదు…
పొద్దు పొడవకముందే
ఊరి మధ్యలో నుండి లేచిన జీవం
పొద్దు గుంకే సరికి ఊరిపొలిమేరలో ఇంకో
జీవాన్ని తోడు కోరుతుంటే
అసలు పొద్దే గడవన్నట్టు,
భారంగా ఉంటుంది.
నిన్న పొద్దున్న కన్పించిన మనిషి,
ఈ పొద్దున్నకి లేడంటే…
గుండె గొంతుకలో చిక్కుకుపోయి
మనసు అగాధంలోకి జారిపోయి
నోట మాట పడిపోతుంది.
క్షణం ముందు వరకూ
తామరాకుపై నీటిబొట్టులా
సురుగ్గా కదలాడిన మనిషి,
కళ్ళముందే వాన బుడగై చట్టుక్కున
చిట్లిపోతుంటే కళ్లల్లో నీరు ఆవిరై
నింగిలో నల్లటి మబ్బులై తేలుతూ
చుక్క కన్నీరు కూడా నేల రానంటుంది.
కంటికి కనిపించని ‘రక్కసి’
చెట్టంత మనిషిని నిలువునా
మెలేస్తుంటే..
ఆగిపోయిన ఊపిరులన్నీ
ఒక్కటై, మేం చేసిన తప్పేంటని
ఒక్కపెట్టున రోధిస్తోంటే…
ఆయువు తీసుకున్న వాయువు
సైతం బిక్కసచ్చిపోయి
బిక్కు బిక్కు మంటున్నప్పుడు
నిజంగానే ఊపిరాడనట్టు ఉంటుంది.
*
ఆయువు తీసుకున్న వాయువు సైతం బిక్క సచ్చి
క్షమించాలి.. ఏమైనా తప్పుగా రాశానండీ.?
చాలా బాగుంది.మీకవిత