అందమైన మా ఊరు, రంగు రంగు పువ్వులు, గల గలా ఏరులు, చిన్ని చిన్ని పక్షులతో హాయిగా ఉంది. చల్లని గాలులు, పచ్చని మొక్కలు , వాటి మధ్య స్నేహముతో మంచి మంచి ఆటలతో, చలాకీగా సాగిపోయే జీవన పయనం . సెలయేటి స్నానాలు, కళ్ళాపి ముగ్గులు కల్మషం లేని మనుషుల మధ్య చెట్టూ పుట్టా కలగలిసిన దివ్య క్షేత్రం లా వెలిగిపోతూ వుంది మా ఊరు ‘నా ఊహల్లో’.
చాలా రోజుల తరువాత మళ్ళీ మా ఊరు వచ్చాను . ఇంటికి చేరుకునే సరికి చీకటి పడింది, రేపటి కోసం ఆలోచిస్తూ హాయిగా నిద్ర లోకి జారుకున్నాను. తెల్లవారుతూనే మెలుకువ వచ్చి నా కిటికీ లోనుంచి చూసాను, చక్కటి పొలంలో అందమైన, విరబూసిన పొద్దు తిరుగుడు పూలు దర్శనమిచ్చాయి, చూస్తూనే నేనెవరో తెలిసినట్టు పిల్లగాలి కి అటు ఇటు తలలు తిప్పుతూ పలకరిస్తున్నట్టు , నన్ను ఆహ్వానిస్తున్నట్టు కనిపించాయి. ఆ అందమైన దృశ్యం నా కళ్ళల్లో నిలిచిపోయింది . ఆ అనందం నుంచి తేరుకుని , స్నానం ముగించి, భోజనం చేసి, సరదా ముచ్చట్లతో సమయం గడుపుతూ కాసేపు విశ్రమించి , సాయం సంధ్య వేళ ఊళ్లోకి బయల్దేరాను.
ఒకప్పటి పొలాలు కుంచించుకు పోయాయి , భవనాలు కార్లు దర్శనమిచ్చాయి. కాస్త పచ్చదనం దొరికిన చోట కాసేపు కూర్చుందామని ఒక పొలం గట్టు మీద కూర్చున్నాను. పొలానికి కాస్త దూరంలో పశుపక్ష్యాదులు ప్రశాంత జీవనం సాగించటం నా కంట పడింది . వేదాలు-నాదాలు తెలియని ఒక గేదె , హాయిగా మేత మేస్తూ రేపటి గురించి చింత లేకుండా ఏ దిగులు లేకుండా నిశ్చలం గా నిర్మలం గా వుంది, ఎక్కడా చోటు దొరకనట్టు, దాని వీపే ఇంద్ర భవనం లా వాలిన కాకి, నాలాగే ఆ సాయంత్రాన్ని ఆస్వాదిస్తోంది. చిన్మయానందం లో ఉన్నట్టు ఆ గేదె, కనీసం విదిలించలేదు సరి కదా , స్నేహితుడే అన్నట్లు ఊరకుండిపోయింది, పలక రించలేదని విడిపోయే స్నేహాల కంటే, ఏ పలకరింపు లేకపోయినా వాటి మధ్య ఉన్న స్నేహ బంధం చాలా గొప్పది , విడదీయలేనిది. ‘కుహు-కుహు’ అనే కోకిల స్వరంలో, ‘ఇక్కడ నేనూ ఉన్నాను’ అని చెప్పుకుంటున్నట్టు , దానికి ‘కావ్-కావ్’ అని కాకి ‘మాకు తెలుసులే’ అన్నట్టు, సమాధానమిస్తున్నట్టు సరిగ్గా సరిపోతుంది. చెట్టు తొర్ర లో నుంచి తొంగి చూసి, తుర్రు మని సిగ్గు తో పారిపోయిన ఉడతలు , దొంగ బాబా లాంటి కొంగజపం చేస్తున్న కొంగలు, కవ్విస్తూ రెచ్చకొడుతూ, చిలిపి వేషాలేస్తున్న కోతి, అన్ని కలగలిసి ఒక చిన్న ప్రపంచమే కొలువైనట్లు తోచింది. కుల మత జాతి భేష జాలు లేకపోయినా, భావజాలమే వేరైనా , వాటి మధ్య సాగుతున్న స్నేహ భావం నన్ను కదిలించింది.
జీవన విధానానికి పరాకాష్టగా మెలుగుతున్నట్లు వాటి ప్రవర్తన “మానవత్వానికి” మించి ఉన్నట్లు అనిపించింది. సరదాగా సాగిపోతున్న సాయం సంధ్య వేళ , ఉన్నట్లుండి “నేను” వాటి మధ్య ఉన్నాననే విషయాన్ని గ్రహించాయి , నన్ను చుసిన పశుపక్ష్యాదులు ఒక అసహనపు నిట్టూర్పుని విడిచినట్టు అన్నీ ఒక్కసారిగా నన్ను ఉరిమి చూసినట్లనిపించింది. వాటి ఆటపాటలు కట్టేసి నా మీద యుద్ధమే ప్రకటించినట్లు, వాటి అసహనం, కోపం, జాలి, కరుణ నాకు చాలా ప్రస్ఫుటం గా తెలుస్తోంది. ఎందుకు నా మీద ఇటువంటి ప్రవర్తన అని ఆలోచిస్తే, తెలిసింది, అది నా మీద కాదు, మనుషుల మీద అని. నిజమే మరి, వాటి స్వేచ్చని, అవసరాలని, ఆహారాన్ని, వాటి కుటుంబాలని కూడా చిన్నాభిన్నం చేసేసిన మనిషిని చూసి, వాటి అసహనాని ప్రకటిస్తున్నాయే గాని ఎదిరించలేదు , తిరగబడి పోరాడగలిగే శక్తీ ఉండి కూడా భరిస్తున్నాయే తప్ప, సహనాన్ని కోల్పోకుండా, గాంధీ గారి భావనను గుర్తు చేసేలా వుంది వాటి ప్రవర్తనా తీరు. అటు పైన, నన్ను వెలేసినట్టు, పట్టించుకోవడం మానేశాయి . ఇపుడు అసహనం నా వంతు అయింది. చిరాకు కోపం ఆవేశం కూడా వస్తోంది. వాటికున్న సహనం ముందు నా కోపం ఎక్కువ సేపు నిలవలేదు, ఏమి చేయలేని అసమర్దుడిగా వెనుదిరిగి ఇంటి ముఖం పట్టాను.
నా గదిలో కూర్చుని కిటికీ వైపు చూసాను, పొద్దున్న నన్ను పలకరించిన పొద్దు తిరుగుడు పూలు, అటు తిరిగి నన్ను అసహ్యించుకుంటున్నట్లు వాటి ముఖాల్ని అటు వైపు తిప్పుకున్నాయి , అసలే అసహనమ్ లో ఉన్న నాకు ఈ అవమానము భరించలేక, కోపావేశంలో పూలని తెంపేద్దామనే దుర్మార్గపు ఆలోచనలో, కిటికీ తలుపు తీసాను, చల్లని పిల్ల గాలి మాయలా నన్ను కమ్మేసి నిద్రలో ముంచేసింది . పొద్దునే లేచే సరికి, అందంగా చక్కగా పసి పాప బోసి నవ్వుల విరబూసిన పొద్దుతిరుగుడు పూవు !!.
*
చాలా మనోహరంగా ఉంది కధ. అద్భుతమైన మానవీయ కోణం.
thank you Balaji garu…
ప్రకృతి రమణీయతను తన కోణంలో చూస్తూ తన్మయత్వం పొందారు రచయిత. అంతవరకు బాగనే వుంది. కాని అంతలోనే అసహనానికి జీవులు గురికావడం కొంచెం అసహజమేమో అనిపించింది. బహుశా సాయం సంధ్య వేళకు జీవులు గూటికి చేరే సందర్భాన్ని అలా వర్ణించి ఉండవచ్చు. ఇక శీర్షిక విషయానికొస్తే సూర్యకాంతి పుష్పం సూర్యాభిముఖంగా పయనించే లక్షణం కలిగివుంటుంది. అలాగే మనిషి కూడ అవసరాల ఊసరవెల్లి. అలా స్పృశిస్తే బాగుండేది. టోటల్ గా ఫర్వాలేదనిపించింది శీర్షిక. అభినందనలు.
thanks for the comments.
రమాకాంత్! పొద్దు తిరుగుడు పువ్వు ..నువు రాసిన కథ గురించి :
మనిషి మానసిక స్థితి, మిగతా జీవ వైవిధ్యాలు గురించిన విశ్లేషణ అద్భుతం. చంచలం గా ప్రవర్తించే తీరు, ఇన్నర్ వాయిస్ ని ప్రజంట్ చేయటం బాగుంది. ఇప్పటి ecological balance lo మిగతా జీవుల life style ఒక్కటే సరిగ్గా ఉందని చెప్పటం బాగుంది. వేదాలు నాదాలు తెలియని దగ్గర్నుంచి నువు రాసావ్ చూడు..అద్భుతం. ప్రతి జీవి లక్షణాన్ని, వైవిధ్యత ను metured భావాలతో, డెప్త్ తో రాసావ్. ఒక్కో సారి, ఒక్కో కథ ను abstract గా ముగించటమే బాగుంటుంది. కథకు గొప్పదనాన్ని, కథా లక్షణాన్ని ఇస్తుంది. నీ intention స్పష్టం గా ఉంది. Title బాగుంది. మన మానసిక స్థితి ఎలా మారిపోతూ ఉంటుందో తెలియచేసే లా! పరి పరి విధాల ఆలోచించే మనిషి కి విచక్షణ ఉండటం అనే చిన్న లక్షణాన్ని చూపిస్తోంది కథ.
that was perfect analysis as if reading my mind.. thank you..
పలకరించలేదని విడిపోయే స్నేహాల కంటే….. అద్భుతం రమాకాంత్…… నాకు చాలా బాగా నచ్చేసింది
thank you for the comments …
Good write up.
తెలియని ఒక గేదె , హాయిగా మేత మేస్తూ రేపటి గురించి చింత లేకుండా ఏ దిగులు లేకుండా నిశ్చలం గా నిర్మలం గా వుంది
Ignorance enta bliss o ee sentence clear ga explain chestundi.
thank you…