పొగ

హిందీ మూలం: గుల్జార్                                                                            స్వేచ్ఛానువాదం  : శ్రీనివాస్ బందా

వార్త చిన్న నిప్పు రవ్వలా మొదలైంది కానీ, చూస్తూండగానే దాని పొగ పేటంతా అలుముకుంది. చౌదరిగారు తెల్లవారుఝాము నాలుగింటికి చనిపోయారు. ఆయన భార్య ఏడ్చినంతసేపు ఏడ్చి, తనని తాను కూడదీసుకుని, ముల్లా ఖైరుద్దీన్ ని పిలవమని నౌకరుని పంపించింది. వెళ్ళబోయేముందు, చౌదరిగారు చనిపోయిన సంగతి ఎవరికీ చెప్పొద్దని నౌకర్ని గట్టిగా హెచ్చరించింది.  ముల్లా వచ్చాడు. నౌకర్ని వెళ్ళమని, ముల్లాని మేడమీది పడకగదిలోకి తీసుకెళ్ళి, మంచం మీది నుంచి దించి కింద పడుకోబెట్టిన చౌదరిగారి శవాన్ని చూపింది ఆవిడ. తెల్లటి రెండు దుప్పట్ల మధ్య, గుడ్డులోని పచ్చ సొనలా మెరుస్తున్న చర్మంతో, నెరిసిన కనుబొమలు, గడ్డం, తెల్లటి పొడవైన కేశాలతో, చౌదరిగారి ముఖంలో మరణం వెలుగుతోంది.

దాన్ని చూస్తూనే ‘ఎన్నల్లాహి వ ఇనా అలేహే రాజేఉన్’ అంటూ మొదలుపెట్టి, మరికొన్ని ‘జుమ్లే’లు చదివి ముల్లా కూర్చోబోతుండగా, చౌదరిగారి భార్య అల్మారాలోంచి ఒక వీలునామాని బయటికి తీసి ఆయనకి ఇచ్చి, చదవమంది. అందులో చౌదరిగారి చివరి కోరిక రాసుంది.

‘నా శవాన్ని పూడ్చిపెట్టవద్దు. దాన్ని చితిమీద దహనం చెయ్యాలి. నా బూడిదని ఊరి పక్కనుంచి పారుతూ మా పొలాలని తడిపే నదిలో కలపాలి…’

చదివిన ముల్లా అవాక్కయ్యాడు.

వూళ్ళో ఇస్లాం మతానికి చౌదరిగారు చేసిన సేవ అపారం. అటు హిందువులకీ ఇటు మహామ్మదీయులకీ ఒకే విధంగా దానాలు చేసేవారాయన. జీర్ణావస్థకి చేరిన ఊరి మసీదుని బాగు చేయించినట్లే,  హిందువుల స్మశానానికి కూడా చక్కగా మరమ్మత్తులు చేయించారు. చాలా ఏళ్లనించీ ఆరోగ్యం బాగాలేక నీరసిస్తున్నా, ప్రతి రంజాన్ లోనూ మసీదులో బీదవాళ్ళకి ‘ఇఫ్తారీ’ ఆయన చేతులమీదుగానే జరిగేది. పేటలో సాయిబులందరికీ ఆయనంటే ఎనలేని భక్తీ, గౌరవమూ. ఇప్పుడీ వీలునామా చదివేసరికి, ఏం చేస్తే ఏం గొడవవుతుందోనని ముల్లా గుండె గుభేలుమంది. అసలే దేశం పరిస్థితి బాలేదు. హిందువులు మరీ హిందువులయ్యారు, ముస్లిములు మరీ ముస్లిములయ్యారు!!

“నేను హిందూ కర్మకాండలేవీ జరిపించదల్చుకోలేదు. స్మశానంలో దహనానికి ఏర్పాట్లు చెయ్యండి చాలు. అసలు రామచంద్ర పండిత్ గారికే చెప్పేదాన్ని. ఆయన ఒప్పుకోకపోగా, వీల్లేదంటూ రాద్ధాంతం చేస్తాడేమోనని పిలవలేదు,” అంది చౌదరిగారి భార్య.

రాద్ధాంతం జరగనే జరిగింది.

ముల్లా ఖైరుద్దీన్ సంగతంతా చెప్పి, “మీ స్మశానంలో చౌదరిని దహనం చెయ్యడం వీలు కాదని చెప్పండి దీక్షితులుగారూ. లేకపోతే సాయిబులు గొడవ చేస్తారు. ఈ చౌదరి అనామకుడేమీ కాదు. ఆయనకి ఎంతోమందితో  ఎన్నో రకాల సంబంధాలున్నాయి,” అంటూ రామచంద్ర పండిత్ కి బోధించబోయాడు ముల్లా.

పేటలో గొడవలు రేగడం తనకీ ఇష్టం లేదన్నాడు రామచంద్ర పండిత్. విషయాన్ని అంతవరకూ రానివ్వకుండా పేటలో పెద్దలందరికీ తనే నచ్చచెప్తానన్నాడు.

అంటుకున్న రవ్వ మెల్లిమెల్లిగా మంటగా మారసాగింది. ఇప్పుడది చౌదరిగారి గురించో, ఆయన భార్య గురించో కాదు. ఇప్పుడది విశ్వాసానికి, జాతి మొత్తానికి, వర్గానికీ, మతానికీ సంబంధించినదిగా మారింది. ‘భర్త శవాన్ని పూడ్చి పెట్టొద్దనీ కాల్చమనీ’ అంటుందా ఆయన భార్య? ఎంత ధైర్యం? ముస్లిం మతాచారాలు ఆమెకు తెలియవా?’

కొందరు ఆమెతో మాట్లాడి తీరాలని పట్టుబట్టారు.

“చూడండి బాబూ, ఇది ఆయన చివరి కోరిక. పూడ్చితేనేం, కాల్చితేనేం? జరిగేదొకటే కదా! దహనంవల్ల ఆయన ఆత్మ శాంతిస్తుందంటే మీకేం అభ్యంతరం ఉండాలి?” నిబ్బరంగా అడిగిందావిడ.

ఒకతను కోపంతో ఊగిపోతూ అడిగాడు “అంటే, ఆయన శరీరాన్ని దహనం చెయ్యడం మీకూ ఇష్టమేనా?”

“అవును,” అందావిడ ముక్తసరిగా. “ఆయన చివరి కోరికని తీర్చితేనే నాకు సంతృప్తిగా అనిపిస్తుంది.”

పొద్దు పైకెక్కుతున్నకొద్దీ ఆవిడలో అసహనం పెరగసాగింది. గుట్టుచప్పుడు కాకుండా జరుపుదామనుకున్నది కాస్తా రచ్చకెక్కుతోంది. అయితే, చౌదరిగారి చివరి కోరిక వెనక ఎటువంటి క్లిష్టమైన ఎత్తులూ, కథలూ, రహస్యాలూ లేవు. మతానికీ ఆచారాలకీ సంబంధించిన పట్టింపులూ లేవు. ఉన్నదల్లా, మరణించిన తర్వాత తన నామరూపాలు కూడా లేకుండా నశించిపోవాలన్న ఒక సాదాసీదా మనిషి కోరిక ఒక్కటే. “ఉన్నప్పుడు ఉన్నాను. లేనప్పుడు ఎక్కడా లేను.”

ఈ నిర్ణయాన్ని ఆయన చాలా ఏళ్ళ క్రితం ఆవిడ ముందు ప్రస్తావించాడు కానీ, బతికుండగా  అలాంటి విషయాలని ప్రత్యేకించి అంత వివరంగా ఆలోచించి పెట్టుకునేదెవరు? కానీ ఇప్పుడు, ఆయన కోరిన ఆ కోరికని తీర్చడమే ఆయన మీద ఆవిడకున్న ఆపేక్షకీ, విశ్వాసానికీ చిహ్నంగా నిలుస్తుంది. కళ్ళముందునించి మనిషి మాయమైనంత మాత్రాన, ఇచ్చిన మాట మరుగైపోదుగా?

ఒక దశలో, రామచంద్ర పండిత్ ని పిలవమని నౌకరుని పంపించినా, ఆయనెక్కడా కనిపించలేదు.

“చూడూ, దహనం చెయ్యడానికి ముందు మంత్రాలు చదివి, చౌదరిగారి నుదిటిమీద బొట్టు పెట్టాల్సిందే,” అన్నాడు వాళ్ళ మనిషొకాయన. “పోయిన మనిషి మతాన్ని ఇప్పుడెలా మారుస్తాం?”

“ఎలా కుదురుతుందోయ్? అయినా భగవద్గీత శ్లోకాలు చదవందే ముఖాగ్ని ఎలా పెడతాం? ఆయన ఆత్మ మనందర్నీ పీడించుకు తినదూ?

“చౌదరిగారు మాకు ఎంతో మేలు చేసిన మనిషి. మేమాయన ఆత్మని ఘోషించనివ్వం.”

చేసేది లేక నౌకరు వెనక్కి మళ్ళాడు.

అది ‘పన్నా’ కంటబడింది. అతను వెంటనే మసీదుకి వెళ్లి కబురందించాడు.

కొద్దికొద్దిగా చల్లారుతున్న మంట కాస్తా మళ్ళీ భగ్గుమంది.  కాచుక్కూచున్న కొందరు సాయిబులు ఖరాఖండీగా చెప్పేశారు. ‘చౌదరిగారు తమకు చేసిన మేలు తక్కువ కాదు కాబట్టి, ఆయన ఆత్మని గాలికొదిలెయ్యలే’మన్నారు. శవాన్ని పూడ్చడానికి మసీదు వెనక గోరీల దొడ్డిలో గొయ్యి తవ్వమని పురమాయించారు కూడా.

పొద్దువాలుతుండగా చౌదరిగారి ఇంటిమీదికి ఇంకొందరు వచ్చిపడ్డారు. ముసలావిడని బెదిరించి, ఆ వీలునామాని లాక్కుని చించేస్తే, ఇక ఈ విషయంలో ఆవిడ ఏమీ చెయ్యలేదని వాళ్ళ ఆలోచన.

ఆవిడ వాళ్ళ ఆలోచనలని పసిగట్టినట్లుంది. వీలునామాని దాచేసింది. “వెళ్లి ముల్లా ఖైరుద్దీన్ నే అడగండి. ఆ వీలునామాని ఆయన చూశాడు, మొత్తం చదివాడు కూడా,” అంది వాళ్ళతో.

“తనకేమీ తెలీదని ఆయన బుకాయిస్తే?”

“అలా అని ఆయన ఖురాన్ మీద ప్రమాణం చేస్తే దాన్ని మీకు చూపిస్తాను. లేకపోతే…”

“లేకపోతే?”

“కోర్టులో చూద్దురుగాని…”

ఆ మాటతో, విషయం కోర్టుదాకా పోవచ్చని వాళ్లకి స్పష్టమైంది.  పట్నంనుంచి తమ ప్లీడర్నీ పోలీసుల్నీ పిలిపిస్తుందేమో ఈవిడ! పోలీసుల దన్నుతో తన మాట నెగ్గించుకుంటుందల్లే ఉంది. అసలు ఈపాటికే వాళ్ళని రమ్మని కబురు పెట్టేసిందో! లేకపోతే, ఒక పక్కన మొగుడి శవం ఐసు దిమ్మ మీద పడుండగా ఈ ముసలిది ఇంత నిబ్బరంగా వాదించగలదా?

చీకటి ముసుగులో, పుకార్లని మించిన వేగంతో కబుర్లూ పరిగెడతాయి.

“ఒకతను గుర్రం మీద పట్నం వైపు వెళ్తుంటే చూశాను. మొహం కనబడకుండా గుడ్డ చుట్టుకున్నాడు. చౌదరిగారి బంగళానుంచే బయల్దేరాడు,” అన్నారెవరో.

‘బంగళా అంటావేంటీ, చౌదరిగారి గుర్రపుశాలనుంచే బయటికొచ్చాడు, నా కళ్ళారా చూశా’నన్నాడు మరొకడు. చౌదరిగారి బంగాళా వెనక దొడ్లో కట్టెలు కొడుతున్న చప్పుడు వినడమే కాకుండా, చెట్టు విరిగి పడటాన్ని కూడా చూశానని ఇంకోడన్నాడు.

అంటే ముసలిది తన దొడ్లోనే చితి పేర్పిస్తోందన్నమాట!

ఈ మాట వినగానే, పచ్చి రౌడీ ‘కల్లూ’ నెత్తురు ఉడికిపోయింది.

“వెధవల్లారా! ఈ రాత్రి, ఒక మహామ్మదీయుడిని చితి మీద కాల్చుతుంటే మీరంతా ఆ మంటలని చూస్తూ ఊరుకుంటారా?” అంటూ కల్లూ తన కలుగులోంచి బయటికొచ్చాడు. అతని వృత్తి హత్యలు చెయ్యడమైతే అవుగాక… మతాన్ని అవమానిస్తే సహించగలడా? “తల్లి కన్నా మతమే గొప్పదిరా!”

నలుగురైదుగుర్ని వెంటేసుకుని, వెనక గోడ ఎక్కి బంగళామీదికి చేరాడు కల్లూ. పడకగదిలో చౌదరిగారి భార్య తలవంచుకుని ఒంటరిగా కూర్చుని వుంది… శవం దగ్గర. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే కల్లూ చేతిలోని దుడ్డుకర్ర బలంగా ఆవిడ తలమీద పడింది.

వాళ్ళు శవాన్ని ఎత్తి, మసీదు వెనక గోరీల దొడ్డిలో సిద్ధం చేసిన గొయ్యి దగ్గరికి మోసుకువెళ్తున్నారు. ఇంతలో ‘రంజా’కి ఓ సందేహమొచ్చింది – “తెల్లారాక  ముసలిదాని శవం కనిపిస్తే మళ్ళీ ఏ గొడవొస్తుందో?”

“అది చచ్చిందంటావా?”

“తల పగిలిందిగా… ఇంకేం బతుకుతుంది?”

ఆగాడు కల్లూ. చౌదరిగారి పడకగదివైపు చూశాడు. అతని మెదడులో ఆలోచనలని ‘పన్నా’ పసిగట్టాడు.

“అర్థమయింది… నువ్వు పదన్నా. మిగిలింది నాకొదిలెయ్.”

కల్లూ కదిలాడు – గోరీల దొడ్డి వైపు.

ఆ రాత్రి, చౌదరిగారి బెడ్రూమ్ నుంచి ఆకాశానికి ఎగసిన మంటల పొగ, పేటంతా ఆవరించింది.

ఒక దేహం సజీవదహనమైంది…

ఒక మృతదేహం ఖననమైంది…

(సేకరణ: ఫెమినా – 9 ఏప్రిల్ 2020 సంచికనుంచి)

చిత్రం: చరణ్ పరిమి 

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Its a poor story. There is no logic in the story which depicts the communal intolerance in India. More over, story intended to establish that Muslims are more intolerant and irrational than Hindus. Its a poor technique to narrate the story too. But I appreciate the translator for rending this one into Telugu.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు