నెమ్మదిగా నిప్పురవ్వలా మొదలైన చావు కబురు తొందర్లోనో పొగలా ఊరంతా కమ్మేసింది.
తెల్లారగట్ట నాలుగు గంటలకి చౌదరి పోయారు. భార్య చౌదరాణి ఏడ్చి ఏడ్చి ఉదయం ఏడు గంటలకి కాస్త కూడదీసుకుని ముల్లా కరీముద్దీన్ కోసం కబురు పెట్టింది. ఎవ్వరికీ చెప్పద్దని పనివాడికి గట్టిగా చెప్పి మరీ పంపింది.
పనివాడు ముల్లాని తీసుకొని వచ్చి, ఇంటి ఆవరణలో వదిలిపెట్టి వెళ్ళాడు. చౌదరాణి ముల్లాని పై అంతస్తులోని పడక గదిలోనికి తీసికెళ్లింది. అప్పటికే శవాన్ని పక్క మీద నుంచి దింపి నేలమీద పడుకోబెట్టారు. పసిమి ఛాయలో ఉన్న తెల్లటి మొఖానికి తెల్లటి బట్ట చుట్టారు. తెల్లటి కనుబొమ్మలు, తెల్లటి గడ్డం, పొడవాటి తెల్లని జుట్టుతో చౌదరి మొహం ఓ వింత కాంతితో ప్రశాంతంగా ఉంది.
చౌదరి శవాన్ని చూడగానే ముల్లా “ఇన్నలిల్లాహ్ ఎ వాఇనె అల్లాహె రజివూన్” అంటూ కొన్ని సంతాప వాక్యాలు చదివాడు. ముల్లా సద్దుకు కూర్చోక ముందే చౌదరాణి బీరువా అరలలో నుంచి చౌదరి రాసిన విల్లు తీసి, చదవమని ఇచ్చింది. చౌదరి తన చివరి కోరికగా తన శవాన్ని ఖననం చేయవద్దని, దహనం చేయమని, ఆ తర్వాత ఆ బూడిదని తన నేలకు నీళ్ళిచ్చిన నదిలో కలపమని విల్లులో రాశాడు.
ముల్లా విల్లు చదివి, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మతపరంగా చౌదరి ఊళ్ళో చాలా మంచి పనులు చేశాడు. హిందువులకి, ముస్లింలకి సమానంగా దానాలు ఇచ్చాడు. తాత్కాలికంగా కట్టిన మసీదు స్థానంలో ఇటుక, సిమెంట్ తో పక్కా భవనాన్ని కట్టించాడు. ఇంకో విషయం ఏమిటంటే హిందువులకి కూడా శ్మశానంలో కాంక్రీట్ కట్టడాలు కట్టించాడు. చాలా ఏళ్ల నుంచి అనారోగ్యంతో పక్కకే పరిమితమైనా, రంజాన్ మాసంలో బీదాబిక్కీ అందరికీ తన సొంత ఖర్చులతో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశాడు. ఇరుగుపొరుగు ముస్లింలకి అతని మీద అపారమైన భక్తి, నమ్మకం ఉండేవి.
విల్లు చదివిన ముల్లాని అందులోని విషయాలు ఆందోళనకి గురిచేశాయి. ‘దీని వల్ల ఏమైనా గొడవలైతే? అసలే దేశంలో పరిస్థితులు బాగోలేవు. హిందువులు మరింత హిందువులుగాను, ముస్లింలు మరింత ముస్లింలుగాను తయారయ్యారు.
“నేనెటువంటి మతపరమైన కార్యక్రమాలనీ కోరుకోవడం లేదు. శ్మశానంలో దహనానికి కావలసిన ఏర్పాట్లు మాత్రమే. నేను పండిట్ రామచందర్ కి చెప్పి ఉండేదాన్నే. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకూడదని ఆ పని చేయలేదు” అంది చౌదరాణి.
“చౌదరి శవాన్ని మీ శ్మశానంలో దహనం చేయడానికి ఒప్పుకోకు. చుట్టుపక్కల ముస్లింలు అనవసరమైన గొడవలు చేసే అవకాశం ఉంది. చౌదరి సామాన్యమైన మనిషేమీ కాడు. అతనికి అనేక మందితో అనేకరకాల సంబంధాలున్నాయి” అంటూ ముల్లా కరీముద్దీన్, పండిట్ రామచందర్ కి ఇచ్చిన సలహాతో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి.
పండిట్ రామచందర్ తన ప్రాంతంలో ఎటువంటి అరాచకశక్తులకి చోటివ్వనని ముల్లాకి భరోసా ఇచ్చాడు. విషయం బయటికి పొక్కక ముందే రామచందర్ తన ముఖ్య అనుచరుల చెవిలో వేశాడు.
కానీ నిప్పురవ్వలు రాజుకున్నాయి. మంట అంటుకోవడం మొదలు పెట్టింది.
“ఇది చౌదరీకో, చౌదరాణీకో మాత్రమే సంబంధించిన విషయం కాదు. విశ్వాసానికి, నమ్మకానికీ సంబంధించిన విషయం. ఓ మొత్తం సమూహానికీ, మతానికీ సంబంధించిన విషయం. మొగుణ్ణి ఖననం చేయద్దు, దహనం చేయమనడానికి చౌదరాణికి ఎంత ధైర్యం? ఇస్లాం మూల సూత్రాలని మర్చిపోయిందా?” అంటూ కొంతమంది చౌదరాణిని కల్సితీరాలని నిర్ణయించుకున్నారు.
చౌదరాణి వాళ్ళతో చాలా నిగ్రహంతో మాట్లాడింది. “సోదరులారా, ఇది ఆయన చివరి కోరిక. ఏముంది శరీరం అంటే మట్టే కదా; కాలిస్తే ఏంటి? కప్పెడితే ఏంటి? కాల్చడం వల్ల ఆయన ఆత్మ శాంతిస్తుందనుకుంటే మనం ఎందుకు అభ్యంతరం పెట్టాలి?”
ఆవిడ సమాధానంతో కొంతమందికి కోపం వచ్చింది. “ఆయన్ని కాల్చడం మీకు కూడా తృప్తినిస్తుందా?” అంటూ గద్దించాడో పెద్దమనిషి.
‘అవును, ఆయన ఆఖరి కోరిక తీర్చడం నాకు చాలా తృప్తినిస్తుంది” అంది చౌదరాణి చిన్నగా.
రోజు గడుస్తున్న కొద్దీ చౌదరాణిలో ఆందోళన పెరిగిపోతోంది. అందరినీ ఒప్పించి, మెప్పించి చేద్దామనుకున్న పని చాలా సాగదీత వ్యవహారంగా మారిపోయింది. నిజానికి చౌదరి చివరి కోరికలో ఏవిధమైన చిక్కుముడులుగానీ, కథలుగానీ, రహస్యాలుగానీ లేవు. అలాగే ఏదో మతానికో, నమ్మకానికో సంబంధించిన తాత్వికతా లేదు. తను పోయాక తనకు సంబంధించిన ఏ చిన్న అవశేషం కూడా మిగలకూడదని ఒక మనిషి కోరుకున్న చిన్న సాదాసీదా కోరిక.
“బతికున్నంత వరకే ‘నేను’. పోయాక ‘నేను’ లో ఏదీ మిగలకూడదు”.
చాలా ఏళ్లక్రితం చౌదరి తన భార్యతో ఈ విషయం చెప్పినప్పటికీ, బతికున్నప్పుడు ఇలాంటి విషయాలను పట్టించుకోవడానికి ఎవరికి తీరిక ఉంటుందీ? అందుకే చౌదరి దీన్ని తన విల్లుగా రాశాడు. ఆయనపట్ల తన ప్రేమనీ, విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి, ఆ విల్లుని అమలుచేయడమే చౌదరాణికి ఉన్న చక్కటి అవకాశం. ఎంతైనా ఒక మనిషి పోయిన వెంటనే అతనికి చేసిన బాసలు మర్చిపోనక్కరలేదు కదా?
చౌదరాణి పండిట్ రామచందర్ ని తీసుకు రమ్మని బీరూని పంపింది. అయితే అతను అప్పటికే తప్పించుకు పోయాడు. అతని తోటి పండితుడు “చూడు తమ్ముడూ, చౌదరిని దహనం చేయడమంటే ఆయనకి బొట్టు పెట్టి, మంత్రాలు చదవాలి” అన్నాడు.
“అరె పోయినవాడికి మతం ఎలా మారుస్తారయ్యా?” అన్నాడు బీరు.
“ఎక్కువ వాదించకు. గీతలో నుంచి శ్లోకాలు చదవకుండా చితికి నిప్పెలా పెడతాం? అలా చెయ్యకపోతే ఆత్మకి విముక్తి కలగదు. అది దయ్యమై మనందరినీ పట్టి పీడుస్తుంది. అది మీకూ ఇబ్బందే, మాకూ ఇబ్బందే. మేం చౌదరిగారికి ఎంతో ఋణపడి ఉన్నాము. ఆయనకి ఇలాంటి అపచారం చేయలేము” అన్నాడా పండితుడు.
చేసేదేమీ లేక బీరూ వెళ్లిపోయాడు.
పండిట్ ఇంట్లోనుంచి బీరూ బయటికి రావడం పన్నా చూశాడు. పన్నా మసీదుకెళ్లి అక్కడున్న వాళ్ళతో ఆ విషయం చెప్పాడు.
చల్లారుతున్న నిప్పుకి మళ్ళీ మంటని ఎగదోసినట్టు అయ్యింది. నలుగురైదుగురు ముస్లిం పెద్దలు తమ నిర్ణయాన్ని విస్పష్టంగా ప్రకటించారు. తాము చౌదరికి ఎంతో ఋణపడి ఉన్నామని, ఆయన ఆత్మ అలా అశాంతిగా తిరగడం సహించలేమని చెప్పారు. మసీదు వెనక ఉన్న శ్మశానవాటికలో ఖననం చేయడానికి గొయ్యి తవ్వమని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు.
సాయంత్రం అయ్యేసరికి, హవేలీలో మరి కొంతమంది పోగయ్యారు. చౌదరాణిని బెదిరించి, భయపెట్టి ఆ విల్లు ఆవిడ నుంచి లాక్కుని కాల్చేయాలనుకున్నారు. చేతిలో విల్లు లేకుండా ముసల్ది మాత్రం ఏమి చెయ్యగలదని వాళ్ళ ఆలోచన.
ఈ విషయం చౌదరాణి ముందే పసిగట్టినట్టుంది. ఆవిణ్ణి అదిరించి, బెదిరించబోతే వాళ్ళకి ఒకటే చెప్పింది. “ముల్లా కరీముద్దీన్ విల్లు చూశాడు, చదివాడు. వెళ్ళి అతన్ని అడగండి”.
“అతను చూడలేదంటే?”
“అతను ఖురాను మీద ఒట్టేసి కాదని చెప్తే నేను చూపిస్తా. లేకపోతే…”
“లేకపోతే ఏంటీ?”
“లేకపోతే కోర్టులో చూసుకుందాం.”
విషయం కోర్టుకెళ్ళక తప్పదని తేలిపోయింది. చౌదరాణి పట్నం నుంచి తన లాయర్ని, పోలీసులని కూడా పిలుపించుకోవచ్చు. వాళ్ళ సమక్షంలోనే తన నిర్ణయం అమలు చేయొచ్చు. లేకపోతే భర్త శవాన్ని అయిసు గడ్డల మీద పెట్టి, అంత ఆత్మ విశ్వాసంతో ఎలా మాట్లాడగలదూ?
ఆ రాత్రి పుకార్లు షికార్లు చేశాయి.
“గుర్రం మీద ఒక మనిషి చౌదరి హవేలీ నుంచి పట్నం వైపు వెళ్తూ కనబడ్డాడు. అతను ముఖానికి ముసుగేసుకున్నాడు” అన్నాడు ఒకడు.
మరోడు అతను చౌదరి గుర్రపుశాల నుంచే వస్తునట్లుగా చెప్పాడు.
ఖడు చెప్పినదాని ప్రకారం, హవేలీ పెరట్లోంచి కట్టెలు కొడుతున్న శబ్దం వినిపిస్తోంది. చెట్లు కొట్టడం కూడా చూశాడు.
సందేహం లేదు. పెరట్లోనే చితిని కాల్చడానికి చౌదరాణి సన్నాహాలు చేస్తోంది. తల్చుకుంటే కల్లు రక్తం సలసలా మరుగుతోంది.
“పిరికిబందల్లారా! ఈ రోజు రాత్రి ఓ ముస్లిం చితి మంటలు కాలుతూ ఉంటే, చుట్టూ కూర్చుని చూద్దాం.”
కల్లు దిగ్గున లేచాడు. చంపడం, రక్తాలు పారించడం అతని వృత్తి. అయితే ఏంటి? కొన్నిసార్లు కొన్ని విషయాలకి విశ్వాసాన్ని కూడా లెఖ్కల్లోకి తీసుకోవాలి.
నలుగురైదురుని వేసుకొని కల్లు హవేలీ పిట్ట గోడను దూకి, లోపలికి వెళ్ళాడు. శవం పక్కన ముసలావిడ
ఒక్కత్తే కూర్చుని ఉంది. ఆవిడ విషయం తెల్సి, తేరుకునే లోపలే కల్లు గొడ్డలితో ఆవిడ తల నరికేసాడు.
చౌదరి శవాన్ని తీసుకుని, మసీదు పక్కన శ్మశానంలో గొయ్యి తవ్వినచోటికి తీసుకెళ్లారు. వాళ్ళు అలా వెళ్తుండగా, “ పొద్దున్నే చౌదరాణి శవం కనిపిస్తే ఏమవుతుంది?” అని అడిగాడు రంజా.
“ముసల్ది పోయిందా?”
“తల పగిలింది. పొద్దున్న దాకా బతకడం కష్టమే.”
కల్లు ఒక్కసారి ఆగి చౌదరాణి పడక గదివైపు చూశాడు. పన్నాకి కల్లు లోలోపల ఏం ఆలోచిస్తున్నాడో అర్ధమైపోయింది.
“నువ్వెళ్ళు బాస్. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు ఖచ్చితంగా తెల్సు. అన్నీ నే చూసుకుంటా.”
కల్లు శ్మశానం వైపు నడిచాడు.
ఆ రాత్రి చౌదరాణి పడక గదిలో నుంచి మంటలు ఆకాశాన్ని తాకుతుంటే ఊరు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.
బతికున్న వాళ్ళని కాల్చేశారు. చచ్చిన వాళ్ళని కప్పెట్టారు.
***
చిత్రం: సృజన్ రాజ్
గుర్తుందా రెండేళ్ల కిందట అమ్మతో హాస్పిటల్లో ఉన్నారోజుల్లో… ఓ రోజు ఫోన్లో ఈ కథ చెప్పారు.. ఎప్పటికీ కాస్త భయపెట్టే కథ :'(