వీళ్లు అరుదైన అంతరించిపోతున్న ప్రత్యేకులు
యిద్దమిద్దంగా ‘యిద’ని పేరేమీ లేదు
ప్రేమను దాటి, పిచ్చిని దాటి– మరెటో వెళుతుంటారు
చిక్కనిచీకటి మీద లెక్కలేని రంగులేరుకుంటారు
ఏమీలేని వొట్టి ఖాళీ మీద ఏమైనా చూస్తారు
ఎంతైనా పొందుతారు
అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానాలు గాల్లోంచి తెంచి ఇస్తారు
ఒక్కోసారి ఆ సమాధానాలే
వీళ్ళను లోకం నుంచి వెలేసిన సరే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు.
అటు నుండి నువ్వు రా
ఇటు నుండి నేను వస్తా
మధ్యేమార్గంలో కలిసి
మన ప్రేమలోకం కట్టుకుందామనే రకం కాదు
అటునుండి అడుగైనా పడకున్నా
దాటాల్సింది
దారిలేని అడవైనా
తీరమేలేని కడలైనా
రణమైనా
మరణమైన
ఒక్క కన్రెప్ప సైగ చాలు
వెరవక జడవక వెళ్ళిపోతారు
అలాగని వెంటపడరు.. వేధించరు.
అదే కన్రెప్ప సైగతో
అక్కడికక్కడే ఆగిపోతారు.
అంతర్ధానమైపోతారు.
అవసరమైతే అంతమైపోతారు
కలల్లో కూడా మళ్ళీ కనపడకుండా కట్టడి చేసుకుంటారు
రక్తసంబంధాలు పక్కన పెడితే,
మనసైతేనో మధువైతేనో
ఒక ప్రేమ పుడుతుంది
పిల్లలయ్యాక ఇంకొకటో, రెండో, మూడో — ప్రేమాంగాలు-
నాలుగు కాళ్ళ పురుగులాగో ఎనిమిది కాళ్ళ చేపలాగో
మహా అయితే వంద కాళ్ళ పాములాగో మన ప్రేమాత్మ.
వీళ్ళ ప్రేమచేతులు లెక్కలేనివి
అందరూ వీళ్లకు అయినవాళ్లే
ఒక్కోరూ ఒక్కో అవయవాలే
పాయలు పాయలుగా విడిపోయి దిగంతాల్ని అల్లేసుకుంటారు
మట్టిబెడ్డల్ని కన్నబిడ్డల్లాగే ఎత్తుకుంటారు
చెల్లెను పట్టుకున్నంత
ఆప్యాయంగా చెట్టును పట్టుకుని చెరువవుతారు
పువ్వుల్లోనే కాదు
ఆకుల్లోనూ అదే అందాన్ని చూసి మైమరచిపోతారు
వివశం వీరి వశం
పరవశం వీరి శ్వాస
హృదయం పురుగు
తొలిచేయగా మిగిలిన ఆకుల్లా ఉంటాయి వీళ్ళ మెదళ్లు.
వీళ్ళు లోకులు కాదు, అనేకులు,
అనంతులు, అడుగులేని లోతులు.
అంతటా పరుచుకున్నోళ్లు
అన్నింటా నిండిపోయిన్నోళ్లు
దేవుళ్ళు కాదు వీళ్ళు
రాతిబొమ్మల్ని చూర్ణం చేసి తాగినోళ్లు
కాగితం పటాలు వీళ్ళను తాకి తరించేటోళ్ళు
ఆకలేస్తే ఆకాశాన్ని తాగేటోళ్ళు
చిన్న గాలికే చెదిరి లోకమంతా నిండేటోళ్లు
బహుశా పిచ్చోళ్లు, వుత్త పిచ్చోళ్లు-
ఎదురైతే తలొంచుకుని దారివ్వడమే
మనం వీళ్ళ కిచ్చే జేజేలు.
*
welcome to సారంగ
వైభవంగ
Highly to be noted your lines and imageries,
keep continuing.
Thank you sir 👍🙏
అద్భుతంగా రాశారు ప్రమోద్… వర్ణన ఎంతో ఇంపుగా ఉంది..ఇలానే రాస్తూ పాఠకులకు వినోదాన్ని పంచండి
Thank you sir. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను.
Chhala Bagundi
Thank you Jyothsna Reddy గారు. మీ విలువైన అభిప్రాయానికి ధన్యావాదాలు.
Heart touching….
Thank you అక్క.