పేచీ అంతా నా పేరుతోనే..

కడ్బందీ పథకం లో భాగం
ముందుగాల మూతికి కుట్లేయడం!!
బరిగీసి
మెదడుకు తాళం వేసుకున్నవారు
రాతి యుగం నాటి రాతకు ఊతం ఇచ్చేవారు!
నా మెడకు ఉచ్చు పేని
విషణ్ణ వదనంతో
రేపటి నిర్ఘాంత దృశ్యాలు చూడమంటారు.
ఏమైనా అంటే?!
నా బస్తీ బరితెగించిందంటారు!
ఇదెక్కడి న్యాయమని నినదించానో,
కేంద్రం కారాగారం మరింత జటిలమై…
ఏళ్ళకు ఏళ్లు వేళ్ల పైనే లెక్కించుకో’మంటున్నై!
నలుగురిలో ఏకాకిని చేసి
నల్ల బల్లా చెరిపినంత తెలిగ్గా
నా చరిత్ర చెరపాలంటాడు.
యధేచ్చగా  ఏక సైగతో
ఇంటి పైకి బుల్డోజర్లు నడపడం
నా కలలను కాగితాలకే పరిమితం చేసి-
పట్ట పగలే
ప్రజాస్వామ్యాన్ని నిలువు దోపిడీ చేయడం!
ఏదైనా నిందను నాపై మోపి
ఆపై చేతులు దులిపేయడం..
వాడికి కొవ్వొత్తులు వెలిగించినంత తేలిక
చీకట్లో చప్పట్లు కొట్టినంత ఆనందం
గరిటెలతో గిన్నెలు మోగించినంత సంబరం!
తెహిఖీక్ లేకుండానే
‘ఏక్-తర్-ఫా’ తీర్పులొస్తున్న విషమ కాలం!?
మనుషులు..!
మైలు రాళ్ళకు మతం రంగు పులిమి
నాగరికత అనుకోమంటున్నారు.
మానవతను ముక్కలు ముక్కలుగా కోసి
ప్రజ్వల ప్రగతిగ ఆస్వాదించాలనుకుంటున్నారు.
రాజ్యం పూజ్యం మతవాది చేసిన మానభంగం!
రాజకీయంతో రాజీ పడ్డ చోట
మన్మానీ మనసు విప్పి మాట్లాడుతుంది.
తఖ్త్ మీది తానాషాహీ
సంతోష గీతాలు పాడుతుంది.
గదిలోనే గుట్టు రట్టు కాకుండా
గుర్తులేమీ మిగలకుండ కాకతాళీయంగా
కోట్ల కొక్కానికి వేలాడలేక
ప్రశ్న బరిబత్తలై పారిపోతుంది.
ప్రశ్నబతుకే ప్రశ్నార్దకమౌతోంది
ప్రశ్నించడం క్రమబద్ధీకరించిన నేరమౌతుంది!
నడి సముద్రంలో మునుగుతున్న నావకు
పూచీ కత్తు ఇవ్వలేని ఈ ఫాసిస్ట్ ప్రపంచానికి
పేచీ అంతా నా పేరుతోనే..!
అస్తిత్వం ఒకసారి ఆత్మరక్షణ లో పడ్డాక
అడుగడుగునా అగ్ని పరీక్షలే
సహన వాక్యం రాయనివ్వని పరీక్షల ఫలితాలే
రేపటి అంతులేని అశృవులు! ఆత్మ బలిదానాలు!!
నేరం మోపడానికి ఋజువు కావడానికి
చావు బతుకుల చౌరస్తాలో
అకస్మాత్తుగ అనుమానపు గన్ను పేలడానికి!!
అఖ్లాఖ్ అమానుష హత్య కావడానికి!
ఖాఖీ గోడల మధ్య ఖదీర్ కళేబరంలా మిగలడానికి!
“షహాదత్” పలికిన నా పేరొక్కటి చాలదూ..?!
ఊహాజనిత ఉదంతమంతా
తనకు తానై ఊపిరి పోసుకుంటుంది.
కావాల్సిన కథంతా
కథనంతో సహా రీళ్ళకు రీళ్ళై కళ్లముందే తిరుగుతుంది.
ఊరూరా విద్వేషం ఉన్నదీ లేనిదీ కలగలిసి
ఊర్ల మీదపడ్డ ‘బర్బాదీ’ గరం బిర్యానీ లెక్క ఉడుకుద్దీ!
*

షేక్ షకీల్ పాషా

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆక్రోశం అక్షరీకరణ సమయస్ఫూర్తి గా

  • నిస్సహాయ పెయిన్ ఈ కవిత..
    దేశం నాశనమవుతున్నా ఉలుకూ పలుకూ లేని మౌన గోడ మీది పిల్లులకు బహుమానం..

    • మీ ఆత్మీయ స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు యూసుఫ్ సర్.

    • బహుత్ బహుత్ షుక్రీయా మహమూద్ భయ్యా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు