టయం మూడున్నర.
కూలిపనికి పోయొచ్చి.. రోంత చద్దిబువ్వ, పండుగారం వేస్కోని తిని.. లోపటింట్లోని నులక మంచంలో పండుకున్యాడు. ఉన్నట్లుండి కంటిమింద కునుకొచ్చినాది.
‘ఓ అబ్బిగా..! మైటాల నాలుగ్గంట్లకు రెడ్డయ్య ఇంటికాడికి పోవాల్లంట. ఆయప్ప చెప్పినాడు’ అంటూ వాకిట్లోకి వచ్చి కేకేసిపోయినాడు ముసిలి మల్లేషు.
ఎర్రప్ప గబక్కని కునుకులోంచి బయటికొచ్చి ‘ఆ పోతాపో’ అన్యాడు తనకే తెలీకుండా.
రెడ్డయ్య పిల్లంపినాడే అనే ఆలోచనతోనే ఎర్రప్ప గుండె పగిలిపోయినాది.
వాడి పెండ్లాము, ఇద్దురు పిల్లోల్లు బెత్తురుకున్యారు.
‘ఏం జేసినావు మొగోడా.. ఏమన్నా వాళ్ల వొచ్చువుల్ని దెం…చ్చినావా.. రెడ్డయ్యోళ్లను తిడ్తే.. నీ మాటలేమన్నా విని.. ఎవురన్నా పుల్లలు పెట్టి సచ్చినారా కొంపదీసి’ అంటూ పెండ్లాము రోంత ఎర్రప్పను రొప్పినాది.
‘నీయ్యక్క… ఓరుకుండు వదరకుండా.. ఏంటి దెంకచ్చుకోలె.. ఏమన్ల.. నీకు తెల్దా నా కత’ అన్యాడు ఎర్రప్ప.
‘నాకు తెల్చులే.. వువూ’ అంటా మూతి ఇడిచి బెల్లంకాపీ చేతికిచ్చినాది.
‘స్సుస్సు..’ అంటూ ఊపర్లకొట్టుకుంటా కాపీ తాగినాడు.
రాయలసీమలోని కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతంలో బీసీలు, మైనారిటీలు, మాలామాదిగోళ్లంటే కాపోళ్లకు (పులివెందుల ప్రాంతంలో రెడ్లను కాపోళ్లని పిలుచ్చారు) చానా తక్కవ చూపు. చవక. కింద కులపోల్లను పైటాల పూట పని ఉన్నా లేకున్నా.. ఏమి మాట్లాడాలన్నా.. ఇంటిమాదిగోడితోనో, దావుంటిపోయే వాళ్లతోనో ఇంటికి పిలిపిచ్చుకోవటం రెడ్లకు అలవాటు. మామూలు ఇషయం. దీన్నే ‘పిల్లంపటం’ అంటారులే. ఇట్లా ఎందుకు జేచ్చారంటే.. తక్కువ కులపోళ్లు వాళ్లిండ్లకాడికి పోయి.. చిన్నాచితకా ఇషయానికి చేతులు కట్టుకోని నిలబడాలి. వంగొంగి నంగినంగి మాట్లాడాల. ‘వాడట్టాంటోడు.. ఈడు ఇట్టాంటోడ’ని పుల్లలు పెట్టాల.. రెడ్డిని .. ‘ఇందుడు చందుడే దేవేంద్రుడ’ని బాగా పొగడాల . రెడ్లకు నచ్చని, వాళ్ల మాట ఇని పనికి రానోళ్లను చిన్నోళ్లవరైనా చిన్న పొరపాటు చేసినా అంతే.
కూలిపనులకు పోయినప్పుడు రెడ్ల తోటలో కిందపడిన చీనీ కాయలు తిన్యా తప్పే. అది ఎవురోకరు చెప్తే.. ఇంటికాడికి పిల్లంపుతారు. ‘డ్లే.. అట్లెందుకు జేసినావు.. భయం లేకండా ఉండాది. చీనాకాయలు తిన్నందుకు దుర్మాన కట్టాల’ అని బెత్తిపిచ్చారు. ‘రేపుట్నించీ పనికి రావాయ్’ అంటా లోసన్సు చేసుకుంటారు. గొల్లోల్లయో, మాదిగోళ్లయో మేకలు పొరపాటున తోట అంచున ఉండే చీని చెట్ల ఆకులను తింటే మేకలనే తీసుకున్యారు. దుర్మాన కట్టిచ్చుకుంటారు. అట్లా ఉంటాయి.. కొందరి రెడ్ల కతలు. సన్నకులపోళ్లు రెడ్డింటికాడ తిరగటం, వాళ్లకు వొగ్గి చెప్పటం.. దర్బారనుకుంటారు. రాజుల మాదిరి ఎచ్చలుగొట్నట్లు వాళ్ల మంచుకు. ఈ పొద్దు ఎర్రప్ప వొంతొచ్చినాది. ఏంటికి పిల్లంపినారో ఆయప్పకే తెల్దు.
ఎర్రప్ప మొరటోడు. చక్కా ఏసుకోకుండా వొంటిమీదుండే బనీను, లుంగీతోనే రెడ్డయ్య ఇంటికాడికి బయలుదేర్నాడు. మంచంకోళ్లమింద ఉండే ఎర్ర బొచ్చుటవాల తీసుకుని బుజంమీద ఏసుకున్యాడు. రోలుకాడ ఇడిచిన టైరు మెట్లు ఏసుకున్యాడు. రోటి పక్కనే ఇసకమీద ఉండే చల్లకాగులో నీళ్లను గ్లాసుతో ముంచుకోని తాగినాడు. పడమటెండ చెంపలు పగలగొడ్తాంది. నీళ్లు తాగిన చేత్తోనే మూతి తుడుసుకోని ఇండ్లు దాట్తాండు.
‘రోంత కోపం తగ్గించుకోప్పా.. పిల్లోల్లుండేపని. వాళ్లు పెద్దోళ్లు.. ఏమన్యా..పట్టించుకోవాకు. నాలుగు తిట్నా. ఒక ఏళ కొట్నా తుర్సుకోవాల్చిందే. మన జాతి ఎంత, మన బతుకెంత’ అన్యాది వాళ్ల పెండ్లాము.
‘నేనేమీ తప్పు చేయలేదు.. నన్ను కొట్టేమొగొడే లేడు’ అంటా రోసంగా ఎల్లబారినాడు.
‘ఛాల్లే నీ సంబడం.. కండ్లు నెత్తిన పోనియ్యాకు నాయినా.. కాపోళ్లను చిన్నపాకుతొటం మాట్లాడి మనం గెల్చుకుంటామా..? ఈ ఊర్లో బతుకుతామా?’ అంటా కుక్కిమంచం మీద పండుకున్న ఎర్రప్ప వాళ్లమ్మ మూలుగుతానే ఎచ్చిరిక చేసింది.
‘అందురు బోసెప్పేటోళ్లే’ అనుకుంటా ఎర్రప్ప ఎల్లబారినాడు.
రెడ్డియ్యింటి దావపట్నాడు.
ఎర్రప్ప కంటే పదినిముషాల ముందే.. దావలో ఎవరో చీకికంప మండల్ని ఈర్చుకోని పోయినారు. దావలో చేత్తో గీసినట్లు వరసలుండాయి. చీకాకు, అక్కడక్కడ ముల్లులుండాయి. ముల్లులు చూసుకోకుండా ఎర్రప్ప పోతాండు. ఆయప్పపాటికి ఆయప్ప పోతాంటే.. ముల్లులు ఆయప్ప టైరుమెట్లకింద పడి పటక్కుమని ఇరిగిపోతానాయి.
ఎర్రప్ప మంచు బాలేదు. ఏంటికి రెడ్డయ్య పిల్లంపినాడుబ్బా.. అనే భయంతో అడుగులేచ్చానాడు.
నాకు తెల్చి నేను తప్పు చేయలేదు. ఏమైతాదిలే అని తనకు తాను ధైర్నం చెప్పుకున్యాడు. గట్టిగా అడుగులేచ్చాండు.
ఎర్రప్ప వొట్టి బొటికినేలి గుర్తుగాడు. దేనికీ భయపడే రకం కాదు. తెలివిగా మాట్లాడలేడు. కడుపులో ఉండేది మాట్లాడతాడు. తనమీద తనకి బాగా నమ్మకమున్నోడు. కష్టపడే బతకాల.. పాపపు కూడు తింటే కడుపులోకి వొంటదనే నిటారు మంచు ఆయప్పది. ‘మాదిగనాకొడుకుల్లారా.. ‘ అని ఎవురన్నా తిట్నపుడు బాగా తాగుతాడు. ‘ఈ భూంమీద దేవుడు పుట్టిచ్చినాక అందరూ ఒకటే. ఏమి సోమీ.. కాపోళ్ల నెత్తర ఎర్ర.. మా నత్తర బులుగు ఉంటాదా?’ అంటా ఆకాశంపైకి నెత్తి ఎత్తి అరుచ్చాడు. ఎప్పుడూ ఇట్లనే ఉంటాదా..? ఏ నాటికైనా మా మాదిగోళ్ల బతుకులు మారవా..? అనుకునే ఆశ ఎర్రప్పది. దేవుడుండాడు అంటాంటాడు.
ఆయప్ప పనిలో చెండుతాడు. ఆయప్పతో పోటీపడి ఎవురన్నా మట్టిపని చేయాలంటే నరాలు తెగుతాయి. అంత పనోడు. మట్టిపని, సేద్యం, ఇత్తటం, చేండ్లల్లో నీళ్లు తిప్పటం, బండికి మోకులు బిగిచ్చి చేన్లోనుంచి పంటను కల్లాల్లోకి తేటం, వాములు ఏయటం, తాళ్లు పేడటం, గొడ్లితో కట్టెలు కొట్టటం ఎర్రప్పను కొట్టేవాడు లేడు. పని తెలిసిన మొగోడు ఆయప్ప. ఊర్లో చాలామంది రెడ్డేర్లకు మంచి పనోడు. ఊర్లోని అన్ని చేలు, తోటలు ఎర్రప్పని గుర్తుపడ్తాయి. ఎవరయినా వాడి పనితనం చూసి మెచ్చుకుంటారు. మాకే జీతానికి ఉండమని బంగపోతారు. అయితే జీతానికి ఉండటం కంటే.. అందరికీ కూలికి పోవటం ఎర్రప్పకిష్టం. అందికే ఆయప్పంటే చానామంది కాపోళ్లకు కోపం.
నేనేమీ తప్పేజేయలా.. రెడ్డయ్య ఏమంటాడో చూడాల.. ఏదయితే అది అయితాది అనుకున్యాడు.
మూడు కలాలు దాటి చింతచెట్టుకాడికి పోయినాడో లేదో.. ‘రోయ్.. ఎర్రోడా’ అంటూ ఓ కేక దూరంనుంచి.. పలుకురాళ్ల మధ్య వినిపించిట్లు ఒకటికి రెండుసార్లు ఇనపడ్నాది.
ఎవరుబ్బా అని ఎగ చూసినాడు. దూరంగా శాంతమ్మ చెయ్యి ఊపుతాంది.
శాంతమ్మ.. ముసిలాయమ్మ. కాపోళ్ళాయమ్మ. ముందడుగేయలేక.. నిలబడ్నాడు. దగ్గరికి పోయినాడు.
‘మ్మోవ్.. ఏంది’ అన్యాడు.
‘ఎర్రోడా రోంత కాపీ పోచ్చా.. గ్లాసు తెచ్చుకో’ అన్యాది.
‘ఇప్పుడే తాగినామ్మా ఇంటికాడ.. పనుందిమ్మా మల్లొచ్చాలే’ అన్యాడు.
‘డ్లేయ్.. ఉత్తకూతలు కుయ్యాకు. నీకు బోగపనుంటాదిలే’ కసురుకుంది శాంతమ్మ.
ఇంక ఆయమ్మ ఇర్సిపెట్టదని ఎర్రప్పకి అర్థమైంది. ఎనములదొడ్లో ఉంటే కోళ్లగూడు పక్కన ఉండే బొగ్గుగూటిలో మూడు సిలవరు చిన్న గలాసులుండాయి. అన్నీ మాదిగోళ్లకోసం బెట్టిన గలాసులవి. ఒక గలాసును తీసుకున్యాడు. పక్కన ఉండే ఎనమల తొట్లో నీళ్లను ముంచుకోని గలాసును కడుక్కున్యాడు.
శాంతమ్మ కోడలు వచ్చి.. గలాసులో ముక్కాలుభాగం కాఫీ పోసింది.
ఎర్రప్ప బెరీన తాగినాడు. ఎడం బుజంమీద టవాల్ని కుడిబుజానికి ఏసుకున్యాడు. కాపీ తాగిన గలాసును చేత్తో కడిగి గూట్లో పెట్నాడు. లుంగీ కడ్తా.. ‘మ్మో.. పోయచ్చా’ అన్యాడు.
‘యాటికిరా.. ఆ వామిలోని చెనక్కాయకట్టెను దుస్సకచ్చిపో. ఆడుండాది చూడు జొల్ల’ అన్యాది శాంతమ్మ.
కాఫీ పోయడమెందుకు.. ఈ పని చెప్పటమెందుకు.. సన్నోళ్లమంటే ఇంత అదవ అంటూ మనసులో అనుకున్యాడు.
చెప్పిన పని చేయకుండా ఎప్పుడూ ఉండలేదు ఎర్రప్ప.
బెరీన శాంతమ్మ ఇంటిపక్కనే ఇరవై అడుగుల్లో ఉండే కల్లంకాడికి పోయి.. గోడెక్కి దుంకినాడు. జల్లను తీసుకుని చెనక్కాయకట్టె దుస్సినాడు. పదినిమిషాలకల్లా జొల్లను గాటిపాటకి చేర్సినాడు.
‘ఓమ్మా.. శాంతమ్మో.. పోతాన’ అన్యాడు.
‘బోగ పోతానువురేయ్.. అవుతలేందన్నా కాలిపోతాందా.. ఈ మధ్య మాకు పనికి రాలే.. అయ్య అరుచ్చాండు నీమీంద’ అంటాంది శాంతమ్మ కోడలు.
యాయి ఆయప్ప చెవ్వలకు ఎక్కలేదు. రెడ్డయ్య ఇంటిదావ పట్నాడు.
పదడుగులేసినాడో లేదో.. ‘ఓ ఎర్రప్ప చీనా మొద్దులుండాయి.. గొడ్లితో చీలగొడ్తావా.. పొయ్యిలేకి పుల్లల్లేవ’ని మల్లాడ్డి కేక.
‘ఇప్పుడే వచ్చాలేప్పా’ అని పాదాలు ఏగంగా కదిల్నాయి.
‘మాదిగోళ్లంతా ఒక చాట ఉన్నట్లు.. కాపోళ్లంతా ఒకచోటనే ఉండారు. ఈళ్ల ఇండ్లతిక్కొచ్చే ఇట్లనే ఉంటాది. ఏంచకదింటారు. మాదిగోళ్లు కనపచ్చే సాలు.. ఈ కాపోళ్లకు ఏదో పని అప్పుటికప్పుడే మతికొచ్చాద’నుకున్యాడు మనసులో. ఎవురన్నా పిలుచ్చారేమోనని ఇండ్ల తిక్కు చూసుకోకుండా కండ్లు నేలకేసుకుని బెరబెరా నడుచ్చాండు ఎర్రప్ప.
రెడ్డయ్య ఇండ్లొచ్చింది. ఎర్రప్ప కాళ్లు, చేతులు గజగజా వణుకుతాన్నాయి.
గేటు తీసినాడో లేదో.. ఆ ఇంటి జీతగాడు మల్లేషు కనపచ్చినాడు.
‘ఏందిరా ఇంతలేటా.. ఆయప్ప రమ్మందెప్పుడు.. నువ్వేందిట్ల. ఆయప్ప చిటపటలాడ్తాండు’ అన్యాడు దగ్గుతా.
ఎర్రప్ప గుండెకాయ పటక్కని పగిలిపోయినాది.
ఎంత ధైర్నమున్న సన్నకులపోళ్లకయినా… రెడ్డయ్య ఇండ్లు సూచ్చానే ఉచ్చ. వణకాల్సిందే.
అప్పటివరకూ గుండెనిబ్బరంగా, గొప్పగా, సేచ్చగా, బీకరంగా, ఎచ్చలుగా.. మీసాలు తూగే వాళ్లెవరైనా రెడ్డయ్య ఇంటికాడ అందరూ తగ్గునాకొడుకులే. ఆ ఇండ్లు దర్బారును చూసి ధైర్నము దేలం దావన పరిగిత్తాది.
రెడ్డయ్యకి నరనరాన కాపోళ్లు తప్ప మిగతాకులపోళ్లు మంచులే కాదు. ఈ విషయం ఎర్రప్పకి బాగా తెల్చు.
గేటు కాడనుంచి లోపలికి ఎర్రప్ప పదడుగులు ఏసినాడో లేదో.. కొట్టంలో కోడి దాక్కున్యట్లు మోడాల్లోకి సూర్యుడు పోయినాడు. రోంతసేపు మొబ్బు పట్నాది. మాదిగోళ్లపిల్లోళ్లు రెండు దేశపెద్దులను కడుగుతానారు. లంకంత గాటిపాటలో చిత్తక్క పేడకాళ్లు ఊడుచ్చాంది.
గుంటక తగిలిచ్చిన ఫర్గూసన్ టాక్టరుంది . ఇంజను పెద్దగాను సూచ్చా ఎర్రప్ప క్షణం ఆగిపోయినాడు.
టాక్టరు పక్కన రెడ్డయ్య కారుంది.. దూరంగా రెండు హీరోహోండాలున్నాయి.
ఇంట్లోకి నిగీత సూసినాడు. రెడ్డయ్య కనపడలేదు. ఆయప్ప మాటలూ ఇనపడలేదు. ఇంట్లో లాకుంటే బాగుండు అనుకున్యాడు.
అంతలోనే.. ఇండ్లుతుడిచే తలారోళ్లాయమ్మ కనపచ్చినాది.
‘ఓమ్మో.. రెడ్డయ్య ఉండాడా?’ అని అడిగినాడు.
“అవుతల పక్క ఎనికి వాకిలి అవతల కలంలో ఉండాడేమో!.. ఎర్రప్ప’ అన్యాది ఆయమ్మ.
రెడ్డయ్య ఇండ్లు లంకంత కొంప. చుట్టూ ఖాళీ స్థలం. రెడ్డయ్య ఇండ్లు, గాటిపాటలు, చిన్న మిద్దెలు, టాక్టరు సామాన్లేసుకునే షెడ్డు.. అంతా కలిపి ఎకరా ఉంటాది. ఇంటి పక్కనే ఇవుతట్టు, అవుతట్టు నాలుగైదు కల్లాలుండాయి. అయ్యన్నీ ఆయప్పవే.
ఇరుక్కుంతలోంచి అవుతల పక్కకలోంకి పోయినాడు ఎర్రప్ప.
రెడ్డయ్య కనపచ్చినాడు. ఎర్రప్పకి పాణం గాల్లో ఎగిరిపోయినట్లు అనిపించినాది.
‘య్యో.. రమ్మన్యావంట’ అని వొంగి దండాలు పెట్టి, ఎడ్చినట్లు మగం పెట్నాడు.
రెడ్డయ్య సోగనలుపు. తెల్లని పండ్ల వరుస. నగితే బాగుంటాడు కానీ.. ముక్కోపి. ఆయప్పకి దయ, జాలి, అఫిమానాలు లేవు. పనోళ్లంతా నాకే రావాల్ల. నాముందు అందరూ వంగివంగి దండాలు పెట్టాల. ఈ ఊరికి నేనే పెద్ద మొగోణ్ణి. కాపోళ్లుకూడా నాకేం లెక్క.. అన్నట్లుంటాడు. మారాజులాగా.. తనకు తాను చక్రవర్తిలాగా.. తన ఊహల్లో తాను తిరుగుతాంటాడు. రెడ్డయ్యకి అరవై ఎకరాల పొలం ఉంది. అబ్బ సంపాఇచ్చిన ఆచ్చి అది. ఇండ్లూ అంతే. అబ్బను, నాయిన్ను, అమ్మను ఎవరినీ ఖేర్ చేయడు. అంతా తనముందు తక్కువే అనే కండకావరం. చిన్నప్పట్నుంచీ అట్లనే పెరిగినాడు. ఇప్పుడాబుద్ధి యాటికి పోతాది.
ఇట్లరారా.. ఎర్రప్ప.. ‘లంజాకొడకా నీయమ్మ గవగుద్దన్ దెంగ ‘ అంటూ బూతులుతిట్నాడు.
ఎర్రప్ప భుజం మీద రెండు గుద్దులు గుద్దినాడు.
గోడకాడుండే ముల్లుబర్రదీసుకుని రెండేట్లు గట్టిగా పెరికినాడు.
ఎర్రప్ప మొద్దుబారిపోయినాడు.
ఇంట్లో పని చేసే తలారోళ్లాయమా.. రోట్లో తెలవాయికారం దంచే చాకలోళ్లపాప, రెడ్డయ్య ముందు గోడకాడ కూర్చున్న బాలిగాడు, చిన్నప్ప.. అందరూ చూసినారు. వణికినారు. అందరి నోళ్లు పిడచకట్టకపోయినాయి. వాళ్ల నోర్లల్లో ఎంగిలి ఊరలేదు. గొంతులారిపోయినాయి. గూపిచ్చికలు మాదిరి ముర్సుకోని వణుకుతా కూచ్చున్యారు. వాళ్ల అరకాళ్లు పదురెత్తుకున్యాయి.
ఎవురికీ ఆ రెండు నిమిషాలు దిక్కుతెల్లె.
దూరంగా గొర్లు తోలుకుండేవాళ్ల ఈల.. ఆ నిశ్శబ్దంలో ఇంగా గట్టిగా ఇనపడ్నాది.
‘సంపుతాండుమ్మో’ అంటా ఇండ్లు తుడిచే ఆయమ్మ రెడ్డయ్య పెండ్లాన్ని పట్టకచ్చినాది.
ఆయమ్మ.. మంచిది. పట్టణంలో ఇంటరు చదువుకుంది.
‘కొట్టాకు కొట్టాకు’ అని అడ్డపడ్నాది… ఎర్రప్ప ముందు బర్రపట్టుకున్న రెడ్డయ్య దగ్గరికిపోయి.
‘నీకు తెల్దుపో.. లోపలికిపో’ అని సింగరిచ్చుకున్యాడు ఆయమ్మను.
‘వాడేం చేసినాడు.. కొడ్తాండావు. కూలీనాలీ సేసుకోని బతికే మాదిగోళ్లను కొడ్తే.. ఆ పాపం.. మనకు తగుల్తాది’ అనె ఆయమ్మ రోంత కోపంగా.
రెడ్డయ్య చల్లబడినట్లు.. బర్ర ఇసిరేసినాడు.
‘చూడు.. వానెమ్మందె.. నేను పద్దన్న ఎర్రమట్టి మిట్టతోటకాడికి మాదిగిళ్లల్లో పోతాన్నా. ఈ లంజాకొడుకు ఏదో కాలిపోయినట్లు.. పద్దన్నే అరుగుమింద కూచ్చొని బీడీ తాగుతాండు. గొల్లలబజారులో, బలిజోళ్ల ఇంటికాడ, చిల్లరోళ్ల ఇండ్లకాడ నేను బోతాంటే అందరూ లేచి కుచ్చుంటారు. వానెక్క నా బండి శబ్దం వాడికి తెల్దా.. ఈ మాదిగనాకొడుక్కి. నన్నంత తక్కవంచనా వేచ్చాడా. సొయ్యం దెంగితిని’ అంటూ తిడ్తాంటే రెడ్డయ్య కండ్లు చాకలోల్ల ఇచ్చిరీపెట్టెలో ఉండే కాలే బొగ్గు నిప్పుల మాదిరి ఎర్రగయినాయి.
‘వాని అరుగు వానిష్టం.. వాడు పండుకుంటాడో.. ఎగురుతాడో.. వాడిష్టం’ అనుకుంది మనసులో రెడ్డమ్మ.
ఆ మాటలు బయటికంటే.. మొగుడి పరువు దించినట్టుంటాదని రెడ్డమ్మ నోరు కట్టేసుకుంది. ఇంట్లో ఉండే చిన్నకులపోళ్ల ముందర కట్టుకున్నోడి మాణం పోతాదని కోపాన్ని పంటిబిగువున ఓర్చుకున్యాది రెడ్డమ్మ.
‘నా అరుగు నాఇష్టం.. నువ్వెవరూ సెప్పేటందుకు లంజాకొడకా’ అని గట్టిగా మెడపట్టి చొక్కా గుండీలు లాగి మరీ రెడ్డయ్యను అడగాలనుకున్యాడు. కాలిమెట్టుతీసి కొట్టానుకున్యాడు ఎర్రప్ప. కానీ వాడికి గుండెకాయలు లేవు. కాపోళ్లను కొట్టడం కాదు కదా.. నిలదీసి ఓ మాట అంటే వాడు సంపినా.. అందురూ కరెక్టంటారు. మూగి ఎద్దులమాద్రి తలకాయలు ఊపుతారని ఎర్రప్పకి బాగా తెల్చు. ఈ రెడ్డిని ఎదురించి ఈ ఊర్లో పిల్లాజెల్లాతో కలిసి నేను ఎట్లా బతకాల.. అనే భయపాలోచనలు ఎర్రప్పను తేనీగలు చుట్టుముట్నట్లు చుట్టుకున్యాయి. ఆలోచింకుండానే.. ‘నాయినా సందకాడ… నాకు మెత్త బలపాలు కొనియ్యాల’ అంటూ బడికిపోయేప్పుడు బిడ్డ అన్నమాటలు చెవల్లో ఇనపడినాయి.
ఎర్రప్ప మెత్తగయినాడు.
వాడి కండ్లూ ఎర్రగా మారినాయి.
కండ్లల్లోంచి నీళ్లు దుంకలేదుకానీ.. వాడి రెండు కండ్లు పిసురు కట్నాయి.
ఏమి చేయాలో అర్థం కాక.. బుజంమీద ఉండే ఎర్రటవాల్ని నెత్తికి కట్నాడు.
‘చూసినావా వాడిసొయ్యం..’ అంటూ రెడ్డయ్య అరుచ్చానాడు.
మల్లొచ్చాయ్యా.. అంటా దండపెట్టి.. ఎనిక్కి మళ్లినాడు ఎర్రప్ప.
అక్కడంతా.. యాపమాన్లు ఊగుతాండాయి. ఎర్రప్ప బాధ గడ్డకట్టి కడుపులోనే నిలబడినాది. సుక్కెనుముల మీద నిలబడిన రెండు కొంగలు పిడుదులుండాయోమోనని ఎతుకులాడ్తాండాయి. కొంగల్ని సూచ్చా.. గేటు బయటికొచ్చినాడు.. మెల్లగా . మెట్లు కూడ ఏసుకోవటం మర్చిపోయినాడు. ఎద్దులు కడుగుతాండే పిల్లోడు ‘మెట్లున్నో’ అంటాంటే.. ఎర్రప్ప చెవలకు ఇనపడలా.
దావలోకి వచ్చినాడో లేదో.. గుండెదడ మరింత పెరిగేట్లు టప్పెట ఇనపడింది.
‘మల్‌రెడ్డిగారి తోటకి కరెంటు పెట్నారెంటయ్యో.. ఎనుములు, ఆవుల్ని ఇర్సద్దంట. మూన్నాళ్లు కరెంటు పెడ్తారంటయ్యో.. మర్చిపోవాకండయ్యో..’ అంటా టప్పెటోడు టప్పెట కొడ్తా దండువారేచ్చాండు.
ఎర్రప్పని రెడ్డయ్య కొట్న వార్త ఇమానం మాద్దిరి పోయినాది.
ఎర్రప్ప పెండ్లాము, పిల్లోల్లు కలాల దావుంటి పరిగెత్తా వచ్చినారు.
వాని పెండ్లాము ఏడ్చాంది. కన్నీళ్లను పైటకొంగుతో తుడుచుకుంటా.. ఏడుచ్చాంది.
‘ఏంగాలెలే.. ఎర్రిదానా’ అన్యాడు పెండ్లాన్ని.
‘నల్లిబిజ్జి పర్దెంగినాడంట ఎర్రప్పను.. ‘
‘వాడికి సొయ్యంలే.. కాపోళ్లంటే భయంలేదా…’ అంటూ వాళ్లకులపోళ్లే తిట్టబట్నారు.
‘కాపోళ్లు పోతాంటే.. అరుగులమీంద కూర్చుంటారు.. భయ్యంలేద’ ని చిల్లరోళ్లూ గునకొట్టుకున్యారు.
ఎర్రప్ప బాధపడ్నాడు.
తనమీద పడిన దెబ్బకి , జరిగిన అవమానంకి కాదు..
బీదోడుకి.. నాలాంటోడి మాదిగోడికి మా కులపోళ్లే చేటు అనే ఇషయం అర్థమయ్యి బాధపడ్నాడు.
ఈ కాలంలో కూడా మంచల్ని కొట్టి.. జీతాలకు పెట్టుకోని.. బానిసల్లాగా బతకమంటే ఎట్లా అనుకున్యాడు. ఎవురిండ్లు వాళ్లది. ఎవరిట్టం వాళ్లది. కాపోళ్లు పోతాంటే మా ఇండ్లకాడ మేం ఎందుకు లేవాలి. ఇట్ల ఎవురు అలవాటు చేసినారో. పేదోడు పేదోడికే శతృవు అనుకున్యాడు. మా కులపోళ్లంతా అరగలమీద కూర్చోలేరు. నేను కూర్చుంటే రెడ్డయ్యకి నా మీద లేనిపోనియి ఎక్కించి.. పుల్లలు పెడితే వాళ్లకేమొచ్చాది. ఏమీ రాదు.. ఈళ్లు మారరు. మారనన్నాళ్లూ పెద్దోళ్ల కాళ్ల కింద మా బతుకులు ఇట్ల నలగాల్సిందే అనుకున్యాడు ఎర్రప్ప. అంతలోనే మా అబ్బజేజీ, మానాయినా, అమ్మ బతికిన అరుగు అది. నా అరుగు నా ఇట్టం. వాడెవడు చెప్పటానికి.. నాయింటికాడ అరుగుమీద కూర్చుంటే ఇట్లా ఉండాది. రస్తా కాడ కూర్చుంటే ఏమైతాది. దేలంకాడ కూర్చుంటే ఏమైతాదని.. అనుకున్యాడు. ఊహే భయంగా ఉండాది. రోంతసేపు కోపం, రోంచేపు బాధ… వరుసకట్టి ఆయప్ప గుండెలో రక్తంమాదిరి ఉరుకుతానాయి.
ఎర్రప్ప ఇంటికొచ్చినాక, మెల్లగా మంచంమీద కూచోని.. పడుకున్యాడు. అరుగు మీద ఎందుకో కూర్చోబిద్ది కాలేదు. అరుగును చూస్తే కోపం, భయమూ వచ్చినాది. ఇంట్లోనుంచి గడారు, పికాసి, పార, గోళం తెచ్చినాడు. గడారుతో మోట్లు గట్టిగా కొట్టి బండను ఎల్లబీకినాడు. బండను పక్కకు తీసి గోడకు ఆనిచ్చినాడు. గడారుతో అరుగును పగలగొట్టి నిమ్మట్లోకి అరుగును తీసేసినాడు. ఇంట్లో ముసిల్ది, పెండ్లాం, పిల్లోళ్లు గమ్మన సూచ్చాండారు. అరుగును భూస్థాపితం చేసేంత వరకూ నిమ్మళంలేదు ఎర్రప్పకి. ఆకలయితాంది కడుపులో. పేగులు కరుచ్చానాయి. ఆ రాత్రి ఇంట్లో అందరూ పచ్చుండారు. ఎవరూ తినలేదు. ఏడుచుకున్యారు. వాడికి ‘దూం తగలా.. వాడు నాశనమై పోనూ.. ‘ అంటా ఎర్రప్ప పెండ్లాము కొట్టంలోంచి బయటికి ఇనపరానంత సన్నగా గొణిగింది. ‘ఇంటారుమ్మా..దుర్మార్గులను ఏమనడు దేవుడు. మన చిన్నోళ్లం’ అంటా కోల్లిని అత్త అర్చినాది.
రేత్తిరి కాడ సయిరుపొద్దుదాటినాక… మంచంలోంచి లేచినాడు పులిమాదిరి కోపంగా.. ఆయప్ప ఎర్రప్ప.
‘యాటికిప్పా..’ అన్యాది ఇంటిది.
‘దొడ్డికి పోయొచ్చా..’ అంటా బానలోని నీళ్లను డబ్బీతో ముంచినాడు.
నీళ్లడబ్బీ పట్టుకోని రస్తాలోని వేపచెట్టుకాడికి పోయినాడు. అరుగుమింద కూర్చున్యాడు. బండలపై మెట్లతోనే నడ్చినాడు. ‘ఇదేమన్నా.. ఎవురబ్బని సొమ్ము’ అంటూ మనసులో అనుకున్యాడు.
అట్లనే.. దేలంకాడికి పోయినాడు.
అరుగుమీద కూర్చున్యాడు.
టయం అర్ధరాత్రి దాటి రెండయితాంది.
*త్తిత్తిత్తీతి తిత్తిత్తితీ.. * అంటా అపశకునం పిట్ట అరుచ్చాంది.
ఎర్రప్ప.. తుతూతూ.. అంటా మూడుసార్లు ఎంగిలిమూసినాడు. పాడునాకొడుకుది ఇప్పుడే అడ్చాలా.. అని ఆ పిట్టను తిట్నాడు.
బీడీ ముట్టిచ్చి.. కాళ్లమీద కాళ్లేసుకుని… గర్వంగా అరుగుమింద కుచ్చున్యాడు.
బీడీ గట్టిగా లాగి పొగను ఇడ్చినాడు. ఎర్రప్ప దమ్మలు ఉప్పొంగినాయి.
……..
…….
……..
……..
కొన్నాళ్లాగినాక రెడ్డయ్యను చూసి మిగతా కాపోళ్లు ఇర్సుకున్యారు.
‘కాపోళ్లంపోతాంటే.. అరగల మీద కూర్చుంటే ఎట్లా’ అని ఎంకిరెడ్డి, సుబ్బారెడ్డి, చిన్నరెడ్డి, నాగిడ్డి.. అంటూ వాళ్ల చేండ్లకాడ అన్యారు.
ఇది చూసి రేప్పొద్దున మాదిగోళ్లు నీలుగుతారురోయ్ అని మిగతా కాపోళ్లు మాట్లాడుకున్యారు.
అరగల ఇషయం తెలిసి.. బీసీలు, మాదిగోళ్లు.. అట్లంటే ఊరంతా గునకొట్టుకున్యారు.
సూచ్చాండగానే.. ఒకరో, ఇద్దరో పోనిచ్చి మిగతా వాళ్లంతా ఇంటి ముందుండే అరుగుల్ని కొట్టేసిరి.
కొందరు బీసీలు.. ‘వానెబ్బ.. మా అరుగులు మాఇష్టం’ అంటా అట్లనే ఉండారు.
ఇది చూసి కొందరు కాపోళ్లు.. ‘వాస్తుకు మంచిదికాదు..అపశకునం. ఇండ్లంతా శనిపడతాది’ అని భయపెట్నారు.
అరుగులుండే వాళ్ల ఇంటికాడికి పోయి వాస్తురెడ్డి దిగులుపెట్నాడు. కండ్లు మూసుకోని.. అంకెలు కూడి.. తీసేసినాడు. ‘రోయ్.. తిక్కనాకొడకల్లారా.. వాచ్చుకు ఇంటి ముందర అరుగులుంటే నట్టం.. అరిట్టం. కొంపలు కొట్టకపోతాయి. సెప్పేది సెప్పుతానా.. ఇబ్బందులొచ్చే నాకు తెల్దు.. ‘ అని భయపడిచ్చిరి. పులిగాని కంటే గిలిగాడు ఎక్కవని మిగిలినోళ్లు అరుగులు తీసేసి కాంపోండు కట్టిచ్చుకున్యారు. గేటాకిల్లు పెట్టుకున్యారు.
ఇప్పుడు.. ఒకరో ఇద్దరి ఇంటిముందర అరుగులు ఉన్యా.. కూర్చోటం మానేసి ఇండ్లల్లో టీవీలు చూడబట్టిరి.
మాదిగోళ్లు అరుగులు కట్టడం మర్చిపోయినారు. మంచాలమీద కూర్చుంటానారు.
కాపోళ్లు వచ్చినారని.. లేచీలేచినట్లు, చూచీచూడనట్లు లేచ్చనారు.. పోరుజాలకు.
ఇప్పటికీ మాలామాదిగోళ్లెవరూ… రస్తాలోని అరుగుమీద.. దేలంకాడ అరుగుమీద కూర్చునే హక్కులేదు.
ఎర్రప్ప బిడ్డకు పెండ్లయినాది.
కొడుకు బిటెక్ చదువుకుని హైదరాబాద్‌కి పోయి సాఫ్టువేరు చేచ్చానాడు.
రస్తా అరుగు కూలిపోయింది. అక్కడ మల్లమ్మగారి ఎనుములు కట్టేచ్చానారు.
ఎర్రప్ప కొడుకు.. బూపొద్దన దేలందావుంటి వచ్చాంటే.. అరుగుమింద ఉండే కాపోళ్లు పిల్చినారు. వాళ్ల దగ్గరకి పోయినాడు. ఎంత లెక్కొచ్చాది, యాడుంటావు, సంపాయిచ్చానావా అని అడిగినారు. జవాబులు చెప్పినాడు. అరుగును ఆనుకుని నిలబడినాడు. కానీ ఆ అరుగుమీద కూర్చునేందుకు దమ్మకాయలు లేవు. అసలు ఆ ఆలోచనే లేదు ఆ పిల్లోడికి. అరుగుమింద ఉండే ముగ్గురు రెడ్డేర్లు బూపొద్దు అయినాదని లేచినారు. ఇంకో ఆయప్ప కూడా వాళ్లు పోతానారని కదిలినాడు. ఇంతలోకే ఎర్రప్ప కొడుకు స్నేహితుడు సంతోష్ రెడ్డి వచ్చినాడు. బైక్ అరుగు పక్కన ఆపినాడు. ఏలా ఉన్నావు.. ఆఫీస్ ఎక్కడ అని అడిగినాడు. నరేష్ అరుగుమింద కూర్చోమన్నాడు సంతోష్. వద్దులే అన్నాడు నరేష్. కొద్దిసేపు ఆగినాక సెల్ఫీ దిగుదామా అన్నాడు నరేష్. సంతోష్ సరే అన్నాడు. ఫటాఫట్ నాలుగైదు సెల్ఫీలు దిగారు.
కేవలం మూడడుగుల ఎత్తు, రెండున్నర మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుండే సామాన్యమైన బండల అరుగు.
అరుగుమీంద ఏళ్లనుంచీ పెద్దకుమోళ్లు కూచ్చోని కూచ్చోని బండలు పాలీసు అయితాండాయి.
అరుగెనకాల యాపచెట్టుకీ అరుగు మాదిరే ఎక్కువ విలువ వచ్చినాది.
అవును అది కేవలం.. అరుగు.
జీవచ్చవాల్లేని రాతి అరుగుమీద.. కూర్చునే హక్కు మనిషికి లేదు!
ఎందుకంటే..
అది ఎక్కువ కులం అరుగు..
దానికో అర్హత ఉందంట.
కాపోళ్ల ముడ్డి కింద నలిగి నలిగి.. దానికీ ‘కాపదనం’ అంటింది.
బడుగుబలహీననిమ్నజాతులనుకు
ఎందుకంటే.. అది కాపోళ్ల అరుగు.
దానిమింద కాపోళ్లు తప్ప మాదిగోళ్లు కూర్చోవటానికి కల కూడా కనరు. అదో సాహసమే. ఆ అరుగుమింద కూర్చుంటే.. అదో సీఎం సీటులాగా వాళ్లకు అనిపిచ్చాది.
ఆ పొద్దు రాత్తిరి..
నరేష్ స్మార్ట్ ఫోనులో పాటలు ఇంటానాడు. వాళ్లమ్మ ఫొటోలు సూచ్చానాది. దేలంకాడ అరుగుమింద తీసుకున్న ఫొటోలు చూసినాది. ఆ ఫోనులోని ఫోటా తన భర్త ఎర్రప్పకి చూపిచ్చా.. ‘నీ కొడుకు ఘనకార్యం చూడుప్పో’ అన్యాది నగుతా.
ఎర్రప్ప తన కొడుకు రెడ్డోళ్ల అరుగుమింద కూర్చున్నది కలనా, నిజమా అనేట్లు చూసినాడు. అరుగు పక్కన మాను ఉందా లేదా అని పోల్చుకున్యాడు. ఏదో రాజ్యాన్ని జయించినంత ఆనందం ఎర్రప్పలో కలిగినాది. గుండెంతా ఎలిగినాది.
ఎర్రప్ప మీసాలు దువ్వినాడు.
తన కొడుకు సాహసవంతుడిగా కనపచ్చినాడు.
మాదిగోళ్ల తరఫున కంచుకోడను బద్ధలు కొట్న మొగోడిలా కనపచ్చినాడు.
అదేందో కానీ..
అప్పటివరకూ దేలం కాడ ఉండే అంతెత్తు రెడ్డోళ్ల అరుగు.. ఆ పొద్దు ఎర్రప్ప కంటికి సన్నగా కనపడినాది.
అది మామూలుదే అనుకున్యాడు.
అంతలోనే ఆ ఫొటో చూసినాక.. మాదిగోడికి ఇంత ఓలిగా అని ఎవరన్నా పెద్దోళ్లకు చెబుతారేమోననీ, వాళ్ల వాడలోని వాళ్లే ఏమైనా పుల్లపెడతారేమోననీ, రెడ్డోళ్లు ఏమంటారేమో అనే భయమూ ఎంటాడినాది.
అందాకా దమ్మపొగరుతో సింహం లాగా ఉండే ఎర్రప్ప మెత్తగయినాడు. నిద్దరరాల.
*
(ఇక్కడ అరుగంటే భూస్వామ్యుల దర్బారు అనుకోవచ్చు. ఆ కొన్ని ధనిక వర్గాలు సాధించే ముఖ్యమంత్రి సీటు కావొచ్చు. ఆఫీసుల్లో ఆ కొందరి పెత్తనం ఇంచార్జిల సీటు కావొచ్చు. అరుగు స్థానంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ఏ ప్రాంతాన్నయినా ఆపాదించుకోవచ్చు. అరుగు అంటే ఫేస్‌బుక్ అరుగు కావొచ్చు. ఇట్లా ఏదైనా గొప్పవాళ్ల స్థావరం అనుకోవచ్చు. నేను అనే గొప్ప, కండకావరం కొన్ని వర్గాల్లో కొందరిలో రక్తంలో కల్చకపోయి ఉంటుంది. మన దేశంలో అప్పట్లో మామిడికాయ కోసినందుకు ఓ దళితుడిని చంపిన పెత్తందారీ వ్యవస్థ, ఇటీవల అమెరికాలో ఓ నీగ్రోని తెల్లజాతీయుడు కుతిక నొక్కి చంపిన సంఘటన.. ఈ ఎర్రప్పలాంటి వారి బతుకు దాదాపు ఒకటే పరిస్థితి. ఇంకా భయపడుతూ ఇంకా తక్కువ జీతానికి సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉండే వాళ్లు ప్రతి గ్రామంలో ఉండారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు హత్యకు గురవుతున్నారు. అయితే మన వ్యవస్థలో అవేమీ కళ్లకు కనపడటం లేదు. అవన్నీ మరుగునపడిపోతున్నాయి. ఎందుకంటే పేదోడి తరఫున ఏ ప్రభుత్వాలు మాట్లాడవు. ఏ పత్రికలు, ఏ వ్యవస్థా పనిచేయదు)
చాలా బాగా రాశారు సర్ .. అభినందనలు
Thanks Anna
Narration superb. Arugu lo konaalu
Thanks andi 🙏🙏