పెక్కు నేనులు నేను, ఒక్కరిని కాను!

మధ్య  “ప్రజాతంత్ర” వారి డిజిటల్ దృశ్య వేదిక “సంభాషణ” లో ‘సామాజిక క్రియాశీలి సజయ తో మాట్లాడాను. చాలా విషయాలు దొర్లిపోయాయి కాని, ఒకే  ఒక ప్రశ్న నన్ను ఇబ్బంది పెట్టింది. నన్ను నేను నిర్వచించుకొమ్మన్నట్టుగా ఆమె అడిగారు. నేనేమిటో, నా తాత్విక చింతన ఏమిటో, నాకు నేనేమి విశేషణాన్ని ఇష్టపడతానో చెప్పాలన్న మాట. అది కొంచెం కాంప్లికేటెడ్‌.

ఆ ప్రశ్నను సీరియస్ గా తీసుకుందామనుకుంటే, అదేదో గంభీర తాత్విక వేదాంత అన్వేషణ లాంటిది అనిపించి భయం వేసింది.  తేలికగా తీసుకుని జవాబు చెబితే, అనేక వెక్కిరింతలు కాచుకుని ఉన్నాయనిపించింది. తాత్వికుడిని కాలేక, సామాన్యుడిగా మిగలలేక, సతమతమై, మొత్తానికి ఏదో చెప్పేశాను.

ఎన్నో నదుల నీళ్లు తాగాను. ఎన్నో రుతువుల సూర్యరశ్మిని, తెమ్మెరలను, తేమలను పీల్చుకుని పెరిగాను.  ఎన్నో అసంపూర్ణాలూ, అసంబద్ధాలూ, అంధకారాలూ, అహంకారాలూ మోస్తూనే ఉన్నాను. ఎట్లా చెప్పుకోవడం, ఏ మార్గానికైనా ఒక బోధకుడిననో సాధకుడిననో కనీసం అనుచరుడిననో? నాస్తికుడిననో భక్తుడిననో ప్రజాస్వామికుడిననో సోషలిస్టుననో ఎట్లా అనుకోవడం? పరస్పరం కొంత పొందిక కలిగిన అనేక సానుకూల సౌజన్య భావాల కూడలిలో సంచరిస్తున్నానని చెబితే, రాజకీయంగా కొంత కచ్చితంగా ఉండవచ్చు, లేక, అది  బడాయి మాత్రమే కావచ్చు.

మనకు మనం ప్రాధాన్యం ఇచ్చుకునే సాధనంగా ఉత్తమ పురుష ఏక వచన సర్వనామం, నాకు చాలా అయిష్టమైన విషయం. సైద్ధాంతిక అప్రియత్వం సంగతి తరువాత,  మొదటిది మొహమాటం, రెండోది, ఆ వ్యక్తీకరణల్లో అవకాశమున్న అల్పత్వం.  ఇప్పుడు ఈ రాస్తున్న దానిలో కూడా  ఎన్ని నాకు,  నేను, నన్ను, నా లు ఎందుకు  అనుమతిస్తున్నానో, కేకేఆర్ ఎంత చెప్పినా ఎందుకు బుద్ధి రాలేదో తెలియదు. ప్రత్యక్ష అనుభవాల నుంచి మాట్లాడేటప్పుడు ‘నేను’ ను తప్పించుకోలేము. ఒక దృష్టి కోణం నుంచి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు దానికి బాధ్యత వహించడానికైనా ‘నేను’ అవసరం. ఆ మాటను నిషేధించలేము కానీ, దానిలో మాటు వేసి ఉన్న ఆధిక్య భావం నుంచి, నార్సిసిజం నుంచి కాచుకోకపోతే పతనమే.

ఈ అస్తిత్వం వదలకపోవడానికి, వదులుకోకపోవడానికి బహుశా ఒకే కారణం ఉండి ఉండాలి.  ప్రతి ఒక్క మనిషీ ఒక విడి యూనిట్‌ కూడా. శరీరపరీవృతుడు.  సామూహిక స్పృహ మాత్రమే గరిష్ఠంగా ఉండి, విడి చేతన కనిష్ఠంగా ఉండిన కాలం ఎప్పుడైనా ఉందేమో తెలియదు. తన జ్ఞానేంద్రియాల నుంచి మాత్రమే విశ్వాన్ని తెలుసుకుంటున్న మనిషికి, లోకపు భౌతిక వాస్తవికతకూ తనకూ ఉన్న సంబంధం గురించిన తీవ్ర వ్యథ కలగడం సహజం.  తనలో తాను బ్రహ్మాండ వ్యక్తిత్వంగా,  మొత్తంగా చూసినప్పుడు పిపీలికత్వంగా కనిపించి తన గురించి తనకు మథన కలగవచ్చు. జననానికి ముందు ఉనికిలో లేని,  మరణానంతరం ముగిసిపోయే తన చేతన మీద కలిగే విపరీతమైన బెంగ కావచ్చు.

మన ఉనికిని బట్టి మనమేమిటో చెప్పుకుంటూ ఉంటాము. పుట్టుక నుంచి చదువులనుంచి, హోదాల నుంచి, భావాల నుంచి, ఆచరణ నుంచి, రూపురేఖల నుంచి ఇంకా అనేకానేక లక్షణాల నుంచి, ఆపాదనల నుంచి మనల్ని మనం ఫలానా  అనుకుంటాం.  ఎన్ని రకాలుగా వర్ణించుకున్నా, అవన్నీ కానిది ఇంకా ఏదో మనలో మిగిలే ఉంటుంది. అదేదో సినిమాలో ఎమ్మెస్‌ నారాయణ అతి చేసినట్టు, అవన్నీ సరే,   ఇంతకీ నువ్వెవరు? అన్న బేతాళ ప్రశ్న మళ్లీ మళ్లీ మొలుస్తూనే ఉంటుంది, గుర్తింపులకు, గౌరవాలకు, చిరునామాలకు సంబంధించి కాదు, అంతకు మించిన మౌలికప్రశ్నగా ‘నేను’ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు తారసపడుతుంది.

“నువ్వెవరు?” అని ఎదుటివారు అడిగినా అడక్క పోయినా “నేనెవరు?” అన్న  ప్రశ్న కొందరికైనా స్ఫురిస్తుంది. అర్ధరాత్రి వేళ వసిష్ఠుడి ఆశ్రమానికి   వచ్చి రాముడు తలుపు తట్టాడట. “ఎవరు?” అన్నాడు ముని.  “నేనే స్వామీ!” అన్నాడు రాముడు. “నేనంటే?” అడిగాడు వసిష్ఠుడు. “ అది తెలుసుకుందామనే గురువుగారూ, వచ్చింది!” అన్నాడట రాముడు. ఈ కథ ముళ్ళపూడి వెంకటరమణ జోకుల పుస్తకంలో ఉన్నా, ఇందులోని బాధ  మాత్రం జోకు కాదు. రాముడంతటి వాడిని కూడా రాత్రుళ్లు నిద్రపోనీకుండా కలవరపరిచే ప్రశ్న “నేనెవరిని?”.  నిశ్చల నిశ్చితాభిరాముడికి సందేహాలుంటాయా? అని భక్తులకు ఆగ్రహావేశాలు కలగవచ్చు. ప్రపంచం, సృష్టీ, చరిత్రా అంతా తాము సంభావించే ఫండమెంటల్స్‌ కు లోబడే ఉండాలని కోరుకునేవారికి స్వస్వరూప జ్ఞానం ఎక్కువ. కలడుకలండనువాడు కలడోలేడో అన్న సంశయం వారికి ఉండదు. నేనెవరు అన్న ప్రశ్నకు వారి దగ్గర ప్రవేశం దొరకదు.

చలం దగ్గర అంతేవాసిగా ఉన్న చిక్కాల కృష్ణారావు గారితో నాకు ఉత్తరాల స్నేహం ఉండేది.  చలం పోయిన కొత్తలో చాలా దుఃఖంగా ఉండి, ఆయనతో దగ్గరగా ఉన్నవారందరినీ కలుసుకోవాలని ప్రయత్నించాను. కృష్ణారావు, బాలబంధు బి.వి. నరసింహారావు, రేమళ్ల చిన్నారావు లతో  అట్లాగే పరిచయం.  “నేను అంటే ఏమిటి” అన్న శోధనలో తానున్నానని కృష్ణారావుగారు ఒకసారి రాశారు. అప్పటికి ఒకవైపు చలం ఆరాధనలో ఉంటూనే, అభ్యుదయ, విప్లవ పుస్తకాల ఔత్సాహిక పాఠకుడిగా కూడా మెలిగేవాడిని.  కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువు సంకల్పంలో మానవుడు ప్రభవించినట్టు శ్రీశ్రీ రాసినట్టుగానే , సృష్టి అనాది చలనం లోనే  తన ఉనికి  మూలాన్ని గుర్తించి, ఆ వ్యక్తీకరణతో   ఆత్మకథను ప్రారంభించిన చలం మిత్రశిష్యులై ఉండి, నేను అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉన్నాడేమిటి ఈయన అనుకుని, కృష్ణారావు గారికి పెద్ద ఉత్తరం సంధించాను.

నన్ను నేను భౌగోళికంగా, సామాజికంగా, చారిత్రకంగా నిర్వచించుకుంటూ, పటాల్లో అక్షాంశ రేఖాంశ వివరాలు ఇచ్చినట్టు నా అస్తిత్వాన్ని పూసగుచ్చి, కృష్ణారావుగారి అన్వేషణ ఏమంత విశేషమైనది కాదని, సమాధానం నాదగ్గర ఉన్నదని కాస్త దూకుడుగా ఆ ఉత్తరం రాశాను.  తలచుకుంటే ఆ చాపల్యానికి ఆశ్చర్యం వేస్తుంది. అందులోని విషయం, రాసిన ఆ ఉత్సాహం తప్పుడువని కాదు. నాలో పొడుచుకువచ్చిన ప్రవచనకారుడే సమస్య. పాదార్థికమైన, ప్రత్యక్ష గోచరమైన కోఆర్డినేట్స్‌ కృష్ణారావుకు కూడా ఏదో మేరకు తెలిసే ఉంటాయని నేను గుర్తించలేదు, నేనెవరు అన్న ప్రశ్న నుంచే రమణ మహర్షి మొదలయ్యారని, చలం కు కూడా ఆ శోధనలో ఆసక్తి కలిగే అరుణాచలం చేరారని, కృష్ణారావులో కూడా ఆ కోవలోని మనిషే అని గ్రహింపు లేకుండా, కలం మిత్రుడయ్యాడు కదా అని మతమార్పిడి చేద్దామని ప్రయత్నించాను. ఆ తరువాత కృష్ణారావుగారితో ప్రత్యక్షంగా కలిశాను. దేవుళ్ల మీద ఆయనకు ఉండే భక్తిని, మనుషుల మీద ఆయన చూపించే అపారమైన ప్రేమను తెలుసుకున్నాను.  జీవితాన్ని ఆనందమయమూ సాహసవంతమూ చేసుకోవడానికి ‘అన్వేషణ’ ఆయనకు అడ్డురాలేదు. బహుశా, చివరిదాకా ఆయన వెదుకులాట ముగిసి ఉండదు. కానీ, తనను తాను కనీస స్థాయికి కుదించుకోవడంలో, ఆ అనామకత్వంలో సార్థకతను చూసుకోవడంలో ఆయన సఫలమయ్యారు.

కృష్ణారావు గారికి నేను ‘బోధించిన’ భౌతికవాద ‘నేను’ విశ్లేషణ కూడా  విస్తృతమూ గాఢమూ వినయవంతమూ అయింది తప్ప తలకిందులు కాలేదు. ఓడిపోలేదు. కాకపోతే, సొంతదనాన్ని రద్దు చేసుకోవడంలో, ఆభిజాత్యాన్ని అదిమిపెట్టుకోవడంలో నా వంటి వారు పెద్దగా సాధించింది లేదు. వాస్తవానికీ చూపుకూ మధ్య అనుక్షణం జోక్యం చేసుకునే “అహం” కారాన్ని పక్కకు నెట్టి అతీత దృష్టిని సాధించగలమా? ఈ చెలం నన్ను విడిచిపెట్టడు అని తన మీద తనే విసుగుపడిన చలం లాగా, మనల్ని మనం విదిలించుకోగలమా? వైరాగ్యం కోసం, వేదాంతం కోసం కాదు. పరస్పరత కోసం. అహం బ్రహ్మాస్మి  కంటె, త్వమేవాహం నయం.

మరి ఈ అనామకత్వం బేనామీగా మారాలా? నిష్క్రియలోకి పరిణమించాలా? తానెవ్వరన్న విచికిత్సే లేక, తాను తానే అనుకుని ధర్మసంకటంలో పడిన అర్జునుడికి, కృష్ణుడు విషయం బోధపరిచాడు. నువ్వొక అస్వతంత్రుడివి, నీవు చేసే పనులకు వచ్చే కీర్తిఅపకీర్తులు, పుణ్యపాపాలు కూడా నీవికావు పొమ్మన్నాడు. ఆత్మసంభావితుల గురించి, ధనమాన మదాన్వితుల గురించి హేళన చేశాడు.   ఇక్కడ ఉన్నదైవాహంకారాన్ని పక్కనబెడితే, “అంతా తమ ప్రయోజకత్వం, తామే భువికధినాధులమని’’ విర్రవీగిన శక్తులన్నీ ‘ ఇతరేతర శక్తుల’ చేతుల్లో పేకమేడల్లా కూలిపోయిన సంగతిని చరిత్ర కూడా చెబుతుంది. కాలం కడుపుతో ఉండి కన్న మనుషులమే తప్ప, నిజంగానే  ‘నేను-తాను”  ల ఘనత ఏముంది? అలాగని విధికో, చరిత్రకో ఆధిపత్యం కట్టబెట్టి, వ్యక్తులు నిమిత్తమాత్రులుగా మిగిలిపోతే, చోదకశక్తులూ చొరవలూ ఎక్కడి నుంచి వస్తాయి?

*

కె. శ్రీనివాస్

కె. శ్రీనివాస్ సాహిత్య విమర్శకులు, తెలంగాణా సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక ప్రతిపాదనలు చేసిన సిద్ధాంత జీవి. పత్రికా రంగంలో నవీన యుగం జెండా ఎగరేసిన ప్రయోగవాది. "ఆంధ్ర జ్యోతి" దినపత్రిక పూర్వ సంపాదకులు.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తాత్విక స్వీయ విశ్లేషణ స్ఫూర్తిదాయకంగా వుంది సర్

  • పెక్కు నేనులు నేను. నేను ఒక్కరిని కాను. అనే మీ వ్యాస శీర్షిక “నేను ఎవరిని” అనే అన్వేషణకు నూటికి నూరు శాతం సరిపోతుంది.
    మీ వ్యాసం చదువుతూ ఉంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు అన్ని ఆటోమేటిక్గా మెదడులోకి వెళుతున్నట్టు భావన కలిగినది.
    ముగింపు చాలా గొప్పగా ఇచ్చారు. “కాలం కడుపుతో ఉండి కన్న మనుషులం మనం అని.
    మనుషులే కాదు, ఊహకందని ఈ అనంత విశ్వాన్ని కాలం కన్నదేమో!
    ఏదేమైనా మీ వ్యాసాన్ని చదివి ఎంతో జ్ఞానాన్ని పొందినట్టుగా భావిస్తున్నాను ధన్యవాదాలు మీకు శ్రీనివాస్ గారు.

  • ఒక గొప్ప శక్తినంతటిని రంగరించి రాసిన మాటలు ఇవి..
    ఇది రాయడానికి, ఇలా రాయడానికి తాత్విక చింతన ఒక్కటే ఉంటే మాత్రమే సరిపోదు గొప్ప ధైర్యం కూడా కావాలి ! చిక్కాల కృష్ణారావు గారికి మీరు రాసిన లేఖ చదవాలి అనిపించింది ఈ వ్యాసంలో మీ ప్రస్తావన తర్వాత..
    చలం పేసిన ప్రశ్నలన్నీ భుజాన మోసిన బరువుతో మీరు చెప్పిన మాటలు ఎప్పటిలాగే బాగా నచ్చేశాయి.
    మీ మనోఫలకం నుంచి మరింత ప్రశ్నలను ఆశిస్తూ..

    క్రాంతి

  • ఇది మరో మ్యూజింగ్ లా అనిపించింది. చక్కగా, వేగంగా చదివించగలిగేలా, కవితాత్మకంగా అంటారే, అలాగ, ఎప్పటి మీ శైలితో రాశారు. శైలి అన్నప్పుడు, మీరు అనుకున్నదాన్ని (దానితో ఇతరులు అంగీకరించనీ, అంగీకరించకపోనీ) చాలా శక్తివంతంగా చెప్పడం! నేను చదివిన జర్నలిస్టుల్లో, ఇంత చక్కగా రాయగలిగిన వారు లేరు. విషయ పరిగ్న్యానం వున్నవారు లేరని కాదు. శైలి గురించి చెబుతున్నాను. మిమ్మల్ని మీరు, ‘భయమూ, బడాయీ’ లేకుండానూ, సరిగానూ, నిర్వచించుకున్నారు. ‘’ఎన్నో అసంపూర్ణాలూ, అసంబద్ధాలూ, అంధకారాలూ, అహంకారాలూ మోస్తూనే ఉన్నాను” అనే మాటలు మీ మనసులో నించే వచ్చాయని నమ్ముతున్నాను. “ఒక బోధకుడిననో సాధకుడిననో కనీసం అనుచరుడిననో? నాస్తికుడిననో భక్తుడిననో ప్రజాస్వామికుడిననో సోషలిస్టుననో ఎట్లా అనుకోవడం?” ఇదీ కూడా మంచి ‘స్వయం పరిశీలన’! ఇలాంటి అవగాహన ని, ఫిలాసఫీలోనూ, పొలిటికల్ సై న్సు లోనూ, ‘ఎక్ లెక్టి సిజ్మ్’ అంటారు. కానీ, మీరు, “పరస్పరం కొంత పొందిక కలిగిన అనేక సానుకూల సౌజన్య భావాల కూడలిలో సంచరిస్తున్నానని” చెప్పుకున్నారు. కానీ, ‘ఎక్ లెక్టి సి జ్మ్’ లో, పొంతన లేని అంశాలే ఎక్కువ వుంటాయి. ఉదాహరణకి, ‘నాస్తికుడి’కీ, ‘భక్తుడి’కీ పొంతన కుదరదు గదా, భావజాల పరంగా గానీ, నిజజీవితాచరణలో గానీ! అలాగే, ఈనాటి బూర్జువా ‘ప్రజాస్వామ్యానికీ’, ‘సోషలిజాని’కీ మధ్య పొంతన వుండదు గదా? కాబట్టి, “కొంత పొందిక” వుండడం, ప్రస్తుత పరిస్తితుల్లో ఫరవాలేదుగానీ, కొన్ని నిర్ణయాత్మకమైన (డెసిసివ్) సందర్భాలలో, ఏదో ఒక పక్షం కచ్చితంగా తీసుకుని తీరకపోతే, ‘మంచి పక్షానికి’ నష్టం జరుగుతుంది.
    బి.ఆర్ .బాపూజీ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు