సగం కలలో అలా నిన్ను వదిలేసి వెళ్ళానా
ప్రపంచం కాగితపు ఉండై
నా నుండి విసిరేసుకుంది
మళ్లీ అణువుల్ని పేర్చి విశ్వాన్ని ఎలా కట్టుకోను?
దిక్కు తోచని ఒక తోక చుక్క
నక్షత్రాల్ని, అక్షరాల్ని కలుపుకొని
దారిలో ఒంటరిగా తానే కథ అల్లేసుకున్నాక
తోవ దొరగ్గానే కథ మర్చిపోయి మాయమైపోయాక
ఖాళీ ఆకాశం లోంచి రాలి పడ్డ కధలం మనం
ఖాళీ జీవితంలో నిండు హృదయమో
నిండు జీవితంలో ఖాళీ హృదయమో
ఇవి రెండూ తప్ప ఇంకేదైనా సరే
పెండ్యులం లా ఊగీ ఊగీ కళ్ళు తిరిగాయి నాకు
కాఫీ కప్పు వేడికి, వర్షపు తుపరు చలికి
జరుగుతున్న యుద్ధానికి తెరవేస్తూ
వెనుక నుండి రగ్గు కప్పేదానివి.
ఇప్పుడు టీ కిచెన్లోనే తాగేస్తున్నా
బాల్కనీ లో మనీ ప్లాంట్ ఎండిపోయి ఉంటుంది
కలలో ఎప్పుడూ పొగ మంచులోకి నడుస్తూ పోతావు
మంచులో దొరకవని అక్కడే కూర్చొని
ఎండ కోసం ఎదురు చూస్తుంటాను
ఎండకు బదులు మెలకువొస్తుంది
ప్రతి సారీ ఇంతే
పోతూ పోతూ గాయాల్నిచ్చావు
పోతూ పోతూ జ్ఞాపకాల్నిచ్చావు
వేల కవితలకు వస్తువునిచ్చావు
కానీ ఇవేవీ వద్దు నాకు
విరహంలోని అందమైన బాధా వద్దు
ఎడబాటు ఇచ్చే హీరోయిజమూ వద్దు
సాయంత్ర కాలం కురిసే చీకటి రేణువులు
ఉదయపు ముసురుకి ముందొచ్చే గాలీ
నేను ఒంటరినని నాకు గుర్తు చేయకుంటే చాలు
*
Wah wah