కొన్ని మరణాల్ని కనీసం ఊహించలేను నేను!
అలాంటి ఉద్వేగంలో అసలేం మాట్లాడాలో కూడా తెలియదు.
పోయిన ఎండాకాలం సదాశివ గారు చనిపోయారన్న వార్త విన్న రోజున నేను ఖమ్మంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో వున్నాను. సూఫీ యాత్రస్థలాల్లో కాళ్ళరిగేలా తిరిగీ తిరిగీ ఖమ్మం చేరుకుని అనారోగ్యం పాలయ్యాను. ఆ క్షణాన ఆంధ్రజ్యోతితో సహా వివిధ టీవీ చానల్స్ వాళ్ళు అనేక సార్లు ఫోన్ చేసి, సదాశివ గారి గురించి కనీసం రెండు ముక్కలు చెప్పండి అని అడిగారు. ఏం చెప్పాలి? అసలు ఆ వార్త నేను నమ్మలేని స్థితిలో వున్నా. మౌనం ఒక్కటే సమాధానం! “ఇప్పుడు మాట్లాడలేను” అని మరో సమాధానం.
1
సదాశివ గారికి నేను కౌముది గారి కొడుకుగానే చాలా కాలం తెలుసు.
దానికి కారణం మేమిద్దరం మొదటి సారి కలుసుకుంది నేను ఖమ్మంలో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు! కానీ, తరవాతి కాలంలో మేమిద్దరం ఎంత దగ్గరయ్యామంటే, 2005లో ఆయన రాసుకున్న “యాది”లో మా నాన్నగారి గురించి రాయడానికి ఆయన “నేటి సుప్రసిద్ధ తెలుగు కవి అఫ్సర్ తండ్రి” అని పరిచయం చేశారు. మా ఇద్దరి మధ్యా పెనవేసుకున్న ఆత్మీయతకి వయః భేదం లేదు.
నేను హైదరబాద్ లో పనిచేస్తున్న కాలంలో సీతాఫల్ మండిలో వొక మారుమూల చిన్న గదిలో వుంటున్నప్పుడు కూడా సదాశివ గారు ఆ గదికి వచ్చి, గంటల తరబడి మాట్లాడుతూ కూర్చునే వారు. సాహిత్యం , సంగీతం తప్ప ఇంకో లోకం వుందా సదాశివ గారికి? అనుకునే వాణ్ని. నిజంగానే ఆయనకి ఇంకో లోకం తెలియదు. ఆయన మాతృ భాష ఉర్దూ కాదు, కానీ ఉర్దూ ఆయన ఊపిరి. ఆ భాష లేకపోతే అసలు ఆయన ఉనికి ఎలా వుండేదా అని అనుకుంటాను వొక్క సారి! ఆయన గాయకుడు కాదు, కానీ సంగీతం ఆయన ప్రాణం! అదీ…హిందూస్తానీ! ఇలాంటి అభిరుచి ఎలా పుట్టిందో వొక పెద్ద ప్రశ్న అయితే, అసలు ఆ రెండు లోకాలూ పట్టని చోట బతుకుతూ ఆ రెండీటీని అంటిపెట్టుకొని వుండడం ఆయనకి ఎలా సాధ్యమయిందన్నది పెద్ద ప్రశ్న. ఎప్పటికప్పుడు సమాజం ఆమోద ముద్ర వేసిన రంగాలే మనల్ని శాసించే కాలంలో సదాశివ గారిని ఎలా అర్థం చేసుకోవాలి? వీటన్నీటికి మించి, ఆయన సంస్కారం!
“ఛలో అఫ్సర్ సాబ్, మనిద్దరం కలిసి వొక కప్పు చాయ్ తాగాలి!” అని ఆయన మాటల మధ్యలో అంటున్నప్పుడు
“మీరు నన్ను సాబ్ అనడమేమిటి? నన్ను చడ్డీల్లో వున్నప్పటి నించీ చూశారు.” అన్నాన్నేను వొక సారి.
ఆయన వెంటనే, “సాబ్ అన్నది నీ వయసు కోసం కాదు. నీ ఆలోచనల్లో నువ్వు చూపిస్తున్న పరిణతికి!” అనేశారు చప్పున – సదాశివ గారితో మాట్లాడ్డం అంటే, కేవలం వొక రచయితతో మాట్లాడ్డం కాదు. సంస్కారంలో ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్చుకోవడం!
2
సదాశివగారిని మొదటి సారి చూసినప్పుడు అప్పుడప్పుడే నేను టీనేజ్ లోకి ప్రవేశిస్తున్నా.
ఖమ్మంలో నర్సింహ స్వామి గుట్టకి వెళ్ళే దారిలో ప్రసిద్ధ రచయిత హీరాలాల్ మోరియా గారి ఇంట్లో మేము అద్దెకి వున్న కాలం. ఆ ఇంట్లో రెండు గదులే వున్నా, పెద్ద ఆవరణ వుండేది. ఆ ఆవరణలో నేను, మా చెల్లి నుస్రత్ చిన్న సైజు పొలం పనులు చేసే వాళ్ళం. ఒక డజను టమాటా, ఇంకో డజను బెండకాయ, వొక డజను వంకాయ, కొత్తిమీర మొక్కలు వేసి బడి నించి రాగానే ఆ తోటపనిలో వుండే వాళ్ళం. నాకు మొక్క జొన్న పొత్తులు అంటే చచ్చేంత ఇష్టం. ఎనిమిదో తరగతి ఎండాకాలం సెలవుల్లో మేం వరైటీగా మొక్కజొన్న వేశాం. చూస్తూండగానే అవి పొట్ట వేసి, పొత్తులయ్యాయి.
అలాంటి రోజుల్లో మొదటి సారి మా ఇంటికి వచ్చారు సదాశివగారు.
ఆయన వచ్చీ రాగానే ఆయనకో సలాం కొట్టి, బొగ్గు కుంపటి రాజేశాను. అమ్మ ఆయన కోసం టీ చేసే లోపు వొక మొక్కజొన్న పొత్తు ఆయనకి వేడివేడిగా అందించాను. ఆయన ఎంత సంబరపడిపోయారో చెప్పలేను.
“అఫ్సర్, నువ్వు షాయరీ చదువుతున్నావా?” అని ఆయన అడిగిన మొదటి ప్రశ్న. నేను సమాధానం చెప్పేలోగానే నాన్నగారు పెద్దగా నవ్వి, “వాడు షాయరీ కంటే ఎక్కువ ప్రయోజనకరమయిన పనులు చేస్తున్నాడు, తోట పని! వాడు అక్షర సేద్యం కాదు, నిజం వ్యవసాయం చేస్తాడట”
నేను తోటపనిలో ఎక్కువ సమయం వృధా చేస్తున్నానని అప్పటికే నాన్నగారికి లోపల కోపంగా వుండేది కాస్త!
“ఏం పర్లేదు బేటా, ఇప్పుడు తోటపనిలోంచి కవిత్వంలోకి మళ్ళావనుకో, నీకు కవిత్వ రహస్యాలు మీ అబ్బాజాన్ కంటే ఎక్కువ అర్థమవుతాయ్!” అని నన్ను దగ్గిరకి లాక్కుని నా తల మీద జుట్టుని చేతుల్తో బుజ్జగించారు. ఆ రోజు ఆయన నాన్నగారికి “ఫారసీ కవుల ప్రసక్తి” అనే పుస్తకం కానుకగా ఇచ్చి వెళ్లారు. వెళ్తూ, వెళ్తూ “ఇది అబ్బా జాన్ కే కాదు, నీకు కూడా! ఇప్పుడు కాదనుకో, కొన్నాళ్లు ఆగి చదివితే అర్థమవుతుంది!” అన్నారాయన.
కొన్నాళ్లు ఆగు అని ఎవరయినా అంటే, ఆ టీనేజీలో వెంటనే రోషం పుట్టుకొచ్చేది. ఆ రోషంతో ఆ రాత్రి మొదటి సారి సదాశివ గారి పుస్తకం చదివాను. ఏం అర్థమవుతోందన్న ప్రశ్నకి సమాధానమేమీ ఇచ్చుకోకుండా మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా చదివేశా మొండిగా.
అందులో నా గొప్పతనం కానీ, మొండితనం కానీ ఏమీ లేవు. అది కేవలం సదాశివ గారి వచనంలోని వేగం. ఈ పుస్తకంలో కవిత్వం కంటే ఎక్కువగా కవుల జీవితాల్లోని ఆసక్తికరమయిన కథలుంటాయి. ఫారసీ కవులు చాలా మంది సూఫీలే! వొక కథ ఇప్పటికీ నాకు గుర్తుంది.వొక ముస్లిం పండగ పూట బాధపడుతూ కూర్చున్నాడట. “మసీదుకు వెళ్దామంటే కాళ్ళకి చెప్పుల్లేవు. కొందామంటే డబ్బుల్లేవు. దేవునికి తన మీద దయ లేదనుకున్నాడు అతను. సరే, ఏదయితే అదే అనుకుని, మసీదుకి వెళ్ళాడు. మసీదు మెట్ల మీద వొక బిచ్చగాడు కూర్చొని వున్నాడు. అతనికి కాళ్ళు లేవు. ఆ ముస్లిం మరీ బాధపడ్డాడు. కానీ, ఇంతలోనే “ దేవుడు నిజంగా నా మీద దయచూపించాడు. చెప్పులు లేకుంటే మానే…కాళ్ళయితే వున్నవి.” అనుకోని నమాజ్ చదువుకుని తృప్తిగా వెనుదిరిగాడట.
ఈ పుస్తకంలోని చాలా కథలు చాలా కాలం నేను నా స్నేహితులకి చెప్పే వాడిని. నేను చదివిన మంచి పుస్తకం నా స్నేహితులూ నలుగురూ చదివి తీరాలని అనుకునే వాడిని. వాళ్ళతో పనిమాలా చదివించే వాడిని. సదాశివ గారి రచనలు ఎక్కడ కనిపిస్తే అక్కడ చదవడం, వాటి మీద దోస్తులతో ముచ్చట్లు..కొద్దికాలం ఆ హవా నడిచింది.
ఆ క్రమంలో సదాశివ గారి ఇతర పుస్తకాల కోసం గాలింపు మొదలుపెట్టాను. ఆయన అనువాదం చేసిన “ఉర్దూ సాహిత్య చరిత్ర” చదివాను. అది ఆ వయసులో బాగా కష్టమయిన పుస్తకం నాకు. కానీ, చివరి దాకా వదలకుండా చదివాను. ముఖ్యంగా అందులో వున్న గజల్ పంక్తులు బట్టీ కొట్టడం మొదలెట్టాను. అది చదివాక ఇంకో సారి సదాశివ గారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు నేను తొమ్మిదో తరగతిలోకి వచ్చాను. “పుస్తకం అంతా సరళంగా రాశారు. గజల్ అనువాదాలు మాత్రం కష్టమయిన తెలుగులో రాశారు. “ అన్నాను. ఆ రోజుల్లో అట్లా ఎవరినయినా ముఖమ్మీద అనేయడం నాకు అలవాటుగా వుండేది.
“ఏదీ వొక ఉదాహరణ చెప్పు!” అన్నారాయన. నేను పుస్తకం తీసి, అయిదారు గజల్స్ అనువాదాలు చూపించాను. “అవి సరళంగా రాస్తే వాటి ప్రభావం తగ్గుతుందా?” అని అడిగాను.
అలా సూటిగా మాట్లాడే వాళ్ళంటే ఆయనకీ ఇష్టమే! “కౌముదీ సాబ్, మీ వాడు మంచి విమర్శకుడవుతాడయ్యా!” అని నవ్వి, నా వేపు తిరిగి “ నువ్వన్నది నిజమే బేటా! షాయరీ అనగానే అది గంభీరంగా వుండాలనుకుంటాం. అది పొరపాటు! ఈ సారి సరళంగా తర్జుమా చేస్తా నీ కోసం!” అన్నారు.
తొలి సంభాషణలు కాబట్టి అవి నాకు బాగా గుర్తుండిపోయాయ్. కానీ, తరవాత సదాశివ గారిని ఎన్ని సార్లు కలిశానో లెక్క లేదు. కలిసిన ప్రతి సారీ ఆయన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పడం, లేదా ఆయనే నా కోసం కొన్ని పుస్తకాలు పట్టుకు రావడం. అవి నేను చదవడం, ఆయనతో మాట్లాడ్డం…సంభాషణ అనేది ఎంత అందమయిన అనుభూతో ఆయన చెప్పక చెప్పేవారని అనిపించేది ఆ తొలియవ్వనంలో…
సదాశివ గారు రాసిన పుస్తకాలల్లో ఎంత నేర్చుకున్నానో, ఈ సంభాషణల్లో అంత నేర్చుకున్నానన్న తృప్తి ఇప్పటికీ వుంది నాకు. .
ఆయనలో ఆ మనుషుల్ని వెతుక్కుంటూ వెళ్ళే అన్వేషణ కూడా నాకు బాగా నచ్చేది. మా ఇద్దరికీ మధ్య వున్న వయసు దృష్టితోనో, చదువుల తారతమ్యమో చూస్తే ఆయనకి నన్ను వెతుక్కుంటూ రావలసిన అవసరం లేదు. నిజానికి కొన్ని సందర్భాల్లో ఆయన్ని నేను బాగా నిరాశపరిచాను కూడా! ముఖ్యంగా ఆయన నన్ను ఉర్దూలో రాయమని ఎంత ప్రోత్సహించారో చెప్పలేను. “నీకున్న భావనాశక్తికి ఉర్దూ భాష నిజంగా తగిన భాష. అచ్చంగా కవిత్వ భాష అంటే ఉర్దూనే!” అనే వారు. కానీ, ఉర్దూ సాహిత్యం మీద నాకు ఆసక్తి వున్న మాట నిజమే కానీ, అందులో రాయగలగిన శక్తి అవతల పెడితే, తెలుగుతో పోల్చినప్పుడు ఉర్దూ – ఈ మాట కటువుగా అనిపించినా- పరాయీ అనే అనిపించేది.
3
2006లో మేం ఇండియా వెళ్లినప్పుడు, వెళ్ళిన వారం రోజులకే సదాశివ గారి ఫోన్. నిజానికి అప్పటికింకా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఆయనే ఫోన్ చేసే సరికి సిగ్గనిపించింది.
“అఫ్సర్ సాబ్, మొత్తానికి దొరికారు. ఏమిటి మీరు కూడా గడ్డం పెంచుకు తిరుగుతున్నారా?”
“అదేమిటి? నేను గడ్డం పెంచుకోవడం దేనికి?” అన్నాను నేను ఆయనేం మాట్లాడుతున్నారో అర్థం కాక.
“తెలీదా మీకు, ముస్లిం రచయితలు కుర్రాళ్ళు ముస్లిం అనిపించుకోవడానికి గడ్డాలు పెంచుకు తిరుగుతున్నారు కదా!”
నిజానికి ఆ కొత్త మార్పు అప్పటికి నాకు తెలీదు. కానీ, పీర్ల పండగకి సంబంధించిన కథలు సేకరించడానికి నేను వూళ్లలో తిరగడం మొదలెట్టినప్పుడు అర్థమయింది ఆయన మాటల అంతరార్ధం. ముస్లిం సంస్కరణ వాదం నిజంగానే ఎక్కువగా పనిచేస్తోంది ఆ పట్టణాల్లో! ఆ వూళ్ళన్నీ తిరుగుతూ నేను ఆదిలాబాద్ వెళ్ళాను. అప్పుడు సదాశివ గారిని చాలా కాలం తరవాత చూశాను. అప్పుడు వొక పూట అంతా మేము అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూనే వున్నాం. ఎన్ని గంటలు దొర్లిపోయాయో కనీసం గడియారం వేపు చూపు మళ్లలేదు.
అప్పటికే నేను ఆయన్ని చూసి పదిహేనేళ్ళయింది. ఆయన నా ముఖం తన అరచేతుల మధ్యకి తీసుకొని, “ఇప్పుడు మిమ్మల్ని ‘నిన్ను’ అని పొరపాటున కూడా అనలేను, అఫ్సర్ సాబ్!” అన్నారు. అంతకు ముందు జరిగిన సంభాషణలన్నీ వొక ఎత్తు అయితే, ఈ సంభాషణ వొక్కటే వొక ఎత్తు నా యాదిలో. ఆ రోజు ఎందుకో ఆయన కైఫీ అజ్మీని బాగా తలచుకున్నారు. అసలు సంభాషణే కైఫీ గజల్ తో మొదలయ్యింది.
‘నేను వెతుక్కుంటున్న ప్రపంచం దొరకడం లేదు
నేను వెతుక్కుంటున్న కొత్త ఆకాశం దొరకడం లేదు
కొత్త ప్రపంచం, కొత్త ఆకాశం దొరికినా
కొత్త మానవుని ఆచూకీ దొరకడం లేదు.
“అఫ్సర్ సాబ్, ఇప్పుడు నేనేం మాట్లాడినా ఫిర్యాదులు చేస్తున్నట్టే వుంటుంది. నిజానికి నాకు ఈ లోకం మీద ఫిర్యాదులే ఎక్కువున్నాయి. ఒక తృప్తి లేకుండా పోయింది, మనుషుల్లో!”
ఆయన ఆ మాట అన్నప్పుడు నాకు ఫారసీ కవుల ప్రసక్తిలో చదివిన మసీదూ- చెప్పుల కథ గుర్తొచ్చింది. ఆ చిన్న కథ ఆయనకి గుర్తు చేశాను.
ఆ రోజు ఆయన అన్న మాటల్లో ఇవి కొన్ని మాత్రమే:
“హిందువులు- ముస్లింలు అన్న తేడా ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ- అది తెలుగు ఉర్దూ అన్న తేడాగా కూడా కనిపిస్తోంది. ఉర్దూ ముస్లింల భాష మాత్రమే అని దాన్ని వొక మతానికి అంటగట్టి మాట్లాడినప్పుడల్లా నేను తల్లడిల్లిపోతాను. ‘బేచెయిన్’ అయిపోతాను.”
“షాయరీ అన్నది మనసులోపల వున్న తేడాల్ని తొలగించాలి. కానీ, షాయరీ పేరుతో మళ్ళీ గోడలు కడ్తారేమిటి?”
“అసలు ప్రేమా, దుఖఃమూ, సంతోషమూ ఏవొక్క భావమూ తాజాగా మిగలడం లేదు. అన్నీటి మీదా రాజకీయ సంతకాలు పడుతున్నాయి.”
చాయ్ చాయ్ తాగుతూ కొన్ని గంటల తరబడి సాగిన సంభాషణలో సదాశివ గారి దిగులు ఏమిటో నాకు అర్థమవుతూనే వుంది. కానీ, సమాధానం ఏముంది నా దగ్గిర అప్పుడయినా, ఇప్పుడయినా?
అదే మా చివరి సంభాషణ అవుతుందని ఆ రోజు ఊహించలేకపోయాను. ఆయన నోటి వెంటే నేను గతంలో అనేక సార్లు విని వున్న ఈ వొక్క మీర్ గజల్ మాత్రం నా లోపల ఇప్పుడు మూగగా రోదిస్తోంది.
“సరానే మీర్ కే ఆహిస్తా బోలో
అభీ తక్ రోతే రోతే సొగయా హై!”
“మీర్ సమాధి తలాపున నెమ్మదిగా మాట్లాడండి. ఏడ్చి ఏడ్చి ఇప్పుడే నిద్రించాడు.”
*
మీ జ్ఞాపకాల్లో సదాశివ వ్యక్తిత్వం రూపు కట్టింది.
ఎప్పటికప్పుడు సమాజం ఆమోద ముద్ర వేసిన రంగాలే మనల్ని శాసించే కాలంలో సదాశివ గారిని ఎలా అర్థం చేసుకోవాలి? వీటన్నీటికి మించి, ఆయన సంస్కారం!
Good Article
ABBA title supparb POOVU NILICHEDI KODDIROJULE…..
PARIMALAM SADA….enta bagundo!
Iddaru goppamanushula sneham……endariko aadarsam.
inka evo cheppalani vundi Natalie ravadamledu.
Dhanyadaalu .
Annapurna.
సామల సదాశివ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. కప్పగంతున లక్ష్మణ శాస్త్రి గారి శిష్యుడు. ఉర్దూ సాహిత్యంలో అపార జ్ఞానం ఉన్నవాడు. యాది పుస్తకం ఎన్నోసార్లు చదివాను. చాలా చక్కటి వ్యాసం రాసిన అప్సర్ గారికి ప్రేమపూర్వక అభినందనలు.
మీ జ్ఞాపకాల దొంతరలను పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
మీ ఆర్టికల్ మొత్తంమీద నన్ను అత్యంత అమితంగా ఆకట్టుకున్నవి…
” పూజ్యులు సడాశివరావుగారికి ఇష్టమైన సంగీతం, సాహిత్యం… కానీ, వాటికి భిన్నమైన / సంబంధమేలేని చోట జీవితాన్ని నడిపిస్తూ, తన అభిరుచినకి ఏమాత్రం భంగం వాటిల్లకుండామనగలగడం”.
ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించవలసినది.
ఇక రెండవ వాక్యం….
” సమాధిలో శరీరం అలసిపోయి నిద్రిస్తున్నది.
భంగం కలిగించవద్దు” అని చెప్పడం.
మనసును ఆలోచించేలా చేస్తున్నాయి షడ్.
నమస్తే🙏
ఎందుకో అఫ్సర్ గారూ చదివిన తర్వాత మనసంతా దిగులు ముసురుకుంది. నిజమే ఇక్కడ మనిషి ఆచూకీ దొరకడం లేదు.
సదాశివుడు ఆయన , ఫకీరోంకా ఖ్వాజా నీవు!!