పూర్ణమూ నిరంతరమూ

‘‘నేను ఇప్పటికే ఉస్మానియా వైద్య కళాశాల వారితో మాట్లాడాను. వారికి అంగీకారపత్రం కూడా రాసి ఇచ్చాను. వారి ఫోను నెంబరు, రెఫరెన్సు కోసం వారికి చెప్పవలసిన నెంబరు గల లేఖను ఇందువెంట జతపరిచాను. నేను చచ్చిన వెంటనే వారికి ఫోన్‌ చేస్తే వారు స్వయంగా వాహనంలో వచ్చి నా దేహాన్ని తీసుకెళతారు. అందులో ఇతరుల కోసం ఉపయోగపడగలిగిన అవయవాలన్నింటినీ తీసేసుకున్న తరువాత… మిగిలిన శరీరాన్ని విద్యార్ధుల ప్రయోగాల కోసం వాడుకుంటారు. ఈ నిర్ణయాన్ని దయతో ఎవ్వరూ వ్యతిరేకించవద్దని మనవి. ఎవ్వరూ అతిక్రమించరని విశ్వాసం.’’

వాడి మొహంలో ఇప్పుడు ఎగతాళి లేదు. నవ్వులేదు. ఓసారి తలెత్తి నావైపు సీరియస్‌గా చూసి మళ్లీ అందులో పడిపోయాడు. ఈసారి బయటకు చదవట్లేదు. మనసులో చదువుకుంటున్నాడు. కానీ, అందులో ఉన్న సారాంశం ఇది…

‘నేను చస్తే మెడికల్‌ కాలేజీ వారికి మినహా ఎవ్వరికీ కబురు చేయవద్దు. దేశాలు పట్టిపోయిన పిల్లలక్కూడా. ‘చివరిచూపు’ అనే కాన్సెప్ట్‌ మీద నాకు నమ్మకం లేదు. చచ్చిపోయాక ప్రాణంలేని దేహాన్ని చివరిగా చూడడమేమిటి… ట్రాష్‌! అదివరలో వారు నన్ను ఎప్పుడెప్పుడు చివరిసారి కలిశారో ఓసారి గుర్తుచేసుకుంటారు, సజీవమైన అదే చివరిచూపు. అదేదో వేడుకలాగా… పూలమాలలూ, మేళాలూ ఈ గోలంతా నాకు కిట్టదు. ప్రాణం మాయమైతే చాలు ఆ శవం అప్పుడే దేవుడై పోయినట్లుగా అంతా వచ్చి కాళ్లు మొక్కడాలూ… ఇలాంటివి నాకు అసహ్యం. అందుకే నా మట్టుకు అలాంటివేం లేకుండా చూడగలరు. ప్లీజ్‌’ ఇలాంటివే మరికొన్ని వాక్యాలేవో రాసి ముగించాను.

చదవగానే, అసలే కాస్త ఎర్రగా ఉంటాడు, వాడి మొహం జేవురించింది. దాన్ని పరపరా చిన్న ముక్కలుగా చింపి విసిరి కొట్టాడు. వాడికిచ్చింది జిరాక్స్‌ కాపీ.

‘ఆవేశం ఆరోగ్య సూచిక కాదు’’ అన్నాన్నేను.

‘‘ఇలాంటి అసందర్భ పిచ్చి ప్రేలాపనలు, అవుతాయా?’’ అన్నాడు.

ఈలోగా అన్నపూర్ణ వచ్చింది. మూడు కాఫీ కప్పులతో.

‘‘ఈ పైత్యాన్నంతా నువ్వుకూడా చదివావా?’’

‘‘నన్నుగూడా ఇలాంటిదే రాయమంటుండాడు నా’’ అంది. మా కప్పులు టీపాయ్‌పై పెట్టి, తను మాత్రం గట్టుమీద కూచుంటూ.

‘‘ఒక్క రాత్రిలో ఇంత పిచ్చెక్కడం కూడా సాధ్యమేనన్నమాట’’ అన్నాడు వాడు.

ఈ పిచ్చిని (జనాభిప్రాయాన్ని మనమెందుకు కాదనడం) ఒక్క రాత్రిలోనే రాశానుగానీ, ఆలోచన ఒక్క రాత్రిది కాదు.

– – –

‘‘కిరణ్మయి వాళ్ల అమ్మ చనిపోయింది. నేను శ్రీకాళహస్తి వెళుతున్నా’’ నా కొడుకు ఫోన్‌ చేశాడు మొన్న రాత్రి.

‘‘హాస్పిటల్‌ దగ్గర కెళ్లావుగా… చూడనివ్వలేదా?’’ అడిగాను.

‘‘చూడ్డం ఏముందిలే! ఇప్పుడే అంబులెన్స్‌ బయల్దేరింది. నేను ఏదో బస్సుపట్టుకుని వెళ్తా’’

‘‘చివరి చూపులు కూడా అయ్యాయి కదరా. వెళ్డం అవసరమా…?’’

‘‘వెళితే ఏమిటి నష్టం’’

ఇంకేం మాట్లాడగలను.

‘‘ఓ జత బట్టలు…’’

నా మాట తుంచేస్తూ ‘‘ఇదేమన్నా పెళ్లా. ఎల్లుండొచ్చేస్తా’’ అని కట్‌ చేసేశాడు.

నాకు పాతికేళ్ల వయసులో నలభై అయిదేళ్ల ఫ్రెండ్సుండే వాళ్లు. చాలామంది చాలా చనువుగా, పెద్దరికం ప్రస్తావన లేకుండా స్నేహంగా మెలగగలిగే రీతిలో. నాకు నలభై అయిదు వచ్చేసరికి పాతికేళ్ల కొడుకు తయారయ్యాడు. ఇక నాకు పెద్దరికం కన్నా స్నేహమే మిగిలింది. వాడితో సంభాషణ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అర్జెంటుగా ఎవరో తెగ్గొట్టేస్తున్నట్టు.

కిరణ్మయి అమ్మ చనిపోవడం మా కుటుంబానికి కూడా బాధ కలిగించే సంగతి. ఆమె నాక్కూడా తెల్సు. చాలా మంచిది. ముగ్గురూ అమ్మాయిలే. మా వాడిని బిడ్డలా చూసుకునేది. సొంత అక్కచెల్లెళ్లు లేని ఈ ఏకాకి ఇంట్రావర్ట్‌ వెధవకి వాళ్లతోటి గట్టి బంధమే కుదిరింది. ఉన్న కొద్దిలో… వాళ్లు గొప్ప! ఇదంతా అనవసర ప్రస్తావన గానీ, వాడు వెళ్లిపోయాక నా ఆలోచనలు చావు మీదికి, వాడు అక్కడకు వెళ్లాక జరగబోయే తతంగం మీదికి మళ్లాయి. స్మశాన వైరాగ్య చింతనలాగా…

వాడు వెళ్తాడు. చెప్పానుగా ఇంట్రావర్ట్‌ వెధవని, వాళ్లదేమో భూమంతా అల్లుకున్న బంధువర్గం. వెళ్లి అక్కడ ఓ మూ నిల్చుంటాడు. ఓ వైపు పూమాలలూ, డప్పు మేళాలూ తదితర సమస్త హంగామా ఉంటుంది. అంతా ముగిశాక తిరిగి రైలెక్కి వచ్చేస్తాడు. అంతకు మించి భోరున ఏడ్చే, కనీసం ఏడుస్తున్న వారిని పరామర్శించేపాటి కలివిడి కూడా వీడికి ఉందనుకోను.

అసలు ఎందుకిదంతా. చావు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తప్పించుకోలేని, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఎదురై తీరే సంగతి. సందర్భాన్నిబట్టి ఒక్కొక్కరికీ ఒకింత ముందూ, వెనకా అంతే. దాన్ని గురించి ఇంత హడావిడి ఎందుకు? ఎవరు చచ్చినా బంధుగణమంతా ఎగబడి ఊళ్లుదాటి వచ్చి చూసి వెళ్లడం… శవాన్ని ఊరేగించుకుంటూ ఆ సంగతి పురప్రజలు గుర్తించరేమోనని డప్పు వాయించుకుంటూ… టపాసులు పేల్చుకుంటూ… ఇదంతా అవసరమా?

సమాజం మారుతోంది. ప్రపంచమంతా గుప్పిట్లో ఇమిడిపోతోంది. టెక్నాలజీ మనుషుల్లో మార్పు తెచ్చేస్తోంది. అయినా మనుషుల ఆలోచనా సరళి మారడం లేదు. మహా ముదిరితే… యూఎస్‌లో ఉన్న కొడుకు ఇండియాలో ఉన్న తండ్రి చనిపోతే, ఆయన్ని ఎలక్ట్రిక్‌ క్రెమేషన్‌ బెడ్‌మీద పడుకోబెట్టిన తర్వాత యూఎస్‌లో తన ఆఫీసు పని చేసుకుంటూ క్రెమేషన్‌ తాలూకు వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసుకుని ఓ ‘మౌస్‌ క్లిక్‌’తో తగలెట్టేసే టెక్నిక్స్‌ కనుక్కుంటారేమోగానీ, అసలు ఈ తగలెట్టడం అవసరమా… అనే ఆలోచన మాత్రం చేయరనుకుంటా…! మరోవైపు మన మెడికల్‌ కాలేజీలు ప్రయోగాలకోసం శవాలు దొరక్క సతమతమైపోతుంటాయి. కొంటుంటాయి. మనం మాత్రం ఉన్న శవాలకు దండలేసి, పార్టీ జెండాలు కప్పి దేవుళ్లను చేస్తుంటాం. కొందరు గొప్పోళ్లు, నాయకుల విషయంలో పరిస్థితి ఇంకా ఘోరం.

వాళ్లని తగలెట్టాలంటే గంధం కొయ్యలూ, నెయ్యి డబ్బాలూ కావాలి. కప్పెట్టాలంటే సమాధి, దాని చుట్టూ తోటలు పెంచాలంటే ఎకరాలకొద్దీ స్థలం కావాలి. అసలే రియలెస్టేటు పరిస్థితి ఎలా ఉందిప్పుడు? హైదరాబాదు లాంటి ఊళ్లలో ఆరడుగుల స్థలం కావాంటే మూడు లక్షవుతుంది. అయిడియా! సర్కారు, స్మశానంలో స్థలాల్ని తేరగా పంచేయకుండా… రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకిస్తే సరి. ఇక ఎవరూ చచ్చినా వాటి జోలికెళ్లరు. ఎంచక్కా కరెంటు చితిమంటల్నో, మెడికల్‌ కాలేజీల్నో చూసుకుంటారు. అవును మెడికల్‌ కాలేజీలకు ఇచ్చే అలవాటు రావాలి. రావాలంటే ఎవరో ఒకరు మొదలెట్టాలి.

-అలా తయారైంది ఈ విల్లు.

– – –

రెండో రోజుకు బాబు వచ్చేశాడు. ఓ కాపీ ఇచ్చాను. సగం చదివి-

‘‘అద్భుతంగా ఉంది నాన్నా. అసలు నువ్కొక్కడివీ కాదు. మనం మన పరిచయస్తులందరినీ ఇలాంటి అగ్రిమెంట్లకు ఒప్పించామంటే చాలా బాగుంటుంది. దీన్నొక ఉద్యమంలా చేపట్టాలి. చిరంజీవి కళ్లూ, నెత్తురూ పోగేసినట్టు…’’ ఆవేశంగా అన్నాడు. నా కొడుకు నుంచి అంతకంటె భిన్నమైన స్పందన వస్తుందనే భయం నాకు లేదు.

సాంతం చదువు అన్నట్టుగా సంజ్ఞ చేశాను.

అన్నపూర్ణ అక్కడే కూర్చుని సినిమా దర్శకుడి మీద గౌరవంతో…. కామెడీకి నవ్వకుండా, యాక్షన్‌ సన్నివేశాల్లో దాన్ని ఫీలవకుండా రాయిలాగా చూసే ప్రేక్షకుడి మాదిరిగా మా ఇద్దర్నీ చూస్తూ కూర్చుంది.

‘‘ఇదేమిటి. చిత్రంగా ఉంది’’ అన్నాడు చివరి పేరా ముగించి.

‘‘అదే ట్విస్టు’’ అన్నాన్నేను.

ఒక్కటంటే ఒకే ఒక్క క్షణం తల వంచుకుని స్తబ్దుగా, నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

‘‘ఎవరినీ పిలవొద్దనీ, ఎవరూ రావొద్దనీ ఆదేశించడానికి నీకేం హక్కు ఉందసలు’’ – అక్షరాల్లో రాస్తే ఇలా కటువుగా ఉంది గానీ, మా వాడు ఆ ప్రశ్నను చాలా సుతిమెత్తగా తగిన విరుపు, ‘పాజ్‌’లతో వినయంగా అడిగాడు. ఒక్క వాక్యంలో ముగిసిపోయింది గానీ, అందులో చాలా అనుబంధ ప్రశ్నలున్నాయి. అవును. ఇతరులు (మన కొడుకు కావచ్చు, మిత్రులు బంధువులు ఎవరైనా కావచ్చు) స్వేచ్ఛని, ఇష్టాలని నియంత్రించే, కాదనే అధికారం మనకు ఎందుకుంటుంది? ఈ కోణం నాకు ఇదివరకు స్ఫురించలేదు.

ఇప్పుడు ఏం చెప్పాలో తటాల్మని తోచలేదు.

మాటకోసం దేవులాడాల్సి వచ్చింది.

‘‘అంత సూటిగా చెప్పలేను. ఎగ్జాంపుల్స్‌తో అయితే ఓకే.’’

‘‘ఏదోట్లే? అసలు ఎందుకలా రాశావో చెప్పు’’

‘‘కిరణ్మయి వాళ్ల అమ్మ చనిపోతే నీవెళ్లి ఏం చేశావ్‌’’

ఎందుకా ట్విస్టు ప్రశ్న వేశానో వాడికి అర్ధం కాలేదుగానీ, సావధానంగా చెప్పాడు.

‘‘చేయడానికేముంటుంది? సరిగ్గా శవాన్ని దించే సమయానికి నేను అక్కడికెళ్లా. బంధువులంతా అప్పటికే వచ్చేసినట్లున్నారు. బాధలూ, ఏడుపులూ, దుఃఖాలూ మొదలయ్యాయి. పొద్దుగుంకే ముందు శవాన్ని ఏటికి తీస్కెళ్లారు. నేను తిరుపతి వచ్చి బస్కెక్కి వచ్చేశా…’

‘‘నువ్వు ఏడ్చావా…?’’

‘‘చావు ఒక విముక్తి. దానికి ఏడవడం ఎందుకు?’’

‘‘ఎవరినైనా ఊరడించావా?’’

‘‘ఏడుపును మించిన ఊరడింపు ఉంటుందా? మధ్యలో నేనెందుకు?’’

‘‘పూలమాలూ, కాళ్లు మొక్కడాలూ…’’

‘‘నాన్నా ట్రాష్‌ మాట్లాడకు. శవానికి మొక్కితే, దండలేస్తే గౌరవిచడం కాదు. ఆ మనిషి వ్యక్తిత్వం, మంచితనం గుర్తుంచుకుని మన జీవితంలో ఆచరిస్తే అదే గౌరవించడం’’ ఈసారి వినయం లేదు, ఘాటుగానే అన్నాడు.

‘‘మరైతే అందుకోసం నువ్వు హైదరాబాదు నుంచి యెకాయెకిన శ్రీకాళహస్తి వెళ్లాల్సిన అవసరమేంటి?’’

వాడు బిత్తరపోయాడు. ఈ చర్చ చివర్లో నేను ఇలాంటి (పిచ్చి) ప్రశ్నను సంధిస్తానని వాడు ఊహించి ఉండకపోవచ్చు.

బుర్రంతా దేవులాడినా సరే, ఎగ్జాంపుల్స్‌తో అయినా సరే… వాడు దీనికి సమాధానం చెప్పగలడని నేను అనుకోను. నేను వాడి అబ్బని! వాడు చాలాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు.

‘‘రిలేషన్స్‌ లాజికల్‌గా ఉండవు నాన్నా’’ అన్నాడు. చాలా కష్టపడి కూడగట్టుకున్నట్టు.

‘‘పలాయన వాదంను ఆశ్రయించేప్పుడు వచ్చే మొదటి సమాధానం ఇది’’ అన్నాన్నేను.

వాడు చివాల్న లేచి, విసురుగా తన గదిలోకి వెళ్లిపోయాడు. ఓటమి, చేతగానితనం బయటపడినప్పుడు మాత్రమే ఏ మనిషికైనా కోపం వచ్చేది. నా పుత్రరత్నానికీ అలాగే కోపం వచ్చింది.

– – –

 

…అని నేను అనుకున్నాను.

ఆ రాత్రి భోజనాలయ్యాక నేను పడగ్గదిలో కంప్యూటర్‌ ముందు కూర్చుని ఎమ్మెస్‌వర్డ్‌ కాగితమ్మీద, కీ బోర్డుతో ఏదో రాసుకుంటున్నాను. అన్నపూర్ణ కార్టూన్‌ నెట్‌వర్క్‌లో తనకు ఇష్టమైన టామ్‌ అండ్‌ జెర్రీ చూస్తోంది.

బాబు వచ్చి నా బెడ్‌మీద కూర్చున్నాడు. నాకు వెనగ్గా.

‘‘ఈ ప్రపంచంలో లాజిక్‌ లేకుండా ఏదీ ఉండదు నాన్నా, రిలేషన్స్‌ కూడా!’’ ఉపోద్ఘాతం లేకుండా ఉదయం సంభాషణ కొనసాగింపును అందుకున్నాడు.

నేను వెనక్కు కూడా తిరగలేదు. ‘సరే చెప్పు’ అన్నట్లుగా కీల టకటకలు ఆపాను. ఏం చెబుతాడు వాడు? అందమే జీవితం అనుకునే వయసులో ఉన్నాడు. ఏం చెప్పడానికైనా ఏం జీవితానుభవం ఉంది వాడికి. అయినా మొదలెట్టాడు…

‘‘ఎవరైనా చనిపోతే మనం వెళ్లడం, పోయిన వారికోసం కాదు నాన్నా మిగిలిపోయిన వారికోసం.’’ ముందు ఈ వాక్యం అర్ధం చేసుకో అన్నట్టుగా కొంత ఆగాడు. నేను వింటున్నాను. అర్ధం కూడా చేసుకుంటున్నాను.

కిరణ్మయి అమ్మ చనిపోయింది. ఆమె కోసం మనం వెళ్తామా? కిరణ్మయి కోసం వెళ్తాం…’’ ‘ఎందుకు?’ అనబోయానుగానీ, ధారకు అడ్డు అవుతుందని ఆగిపోయాను.

‘‘కిరణ్మయి అమ్మ సంగతి ఎందుకు? రేపు నువ్వు చనిపోతే ఎవ్వరూ రావొద్దని మహా రాసేశావ్‌. కానీ నీ శవాన్ని మెడికల్‌ కాలేజీ వ్యాన్‌ ఎక్కించే వరకూ దాని ముందు కూర్చుని ఉంటే నేను ఏడవకపోవచ్చు. కానీ లోపల ఏదో ఫీలింగ్‌ ఉంటుంది నాన్నా. ఏదో కోల్పోయిన ఫీలింగ్‌. మన నుంచి ఏదో, ఎవరో తీసుకెళ్లిపోతున్న ఫీలింగ్‌. ఆ సమయంలో ఎదురుగా నాకోసం వచ్చిన వాళ్లు కనిపించారనుకో… వాళ్లు ఊరడించకపోవచ్చు. కానీ ‘ఒకరిని కోల్పోయాను, కానీ నాకింకా ఇందరున్నారు’ అనే భరోసా అందుతుంది హృదయానికి. నేను వెళ్లిందీ అందుకే. వాళ్ల అమ్మ చూపించిన ప్రేమలో నేను వెయ్యో వంతు చూపించగలనా వాళ్లకి? ‘ఏం బంధం మిగిలింది ఇంక నాకిక్కడ?’ అని కిరణ్మయి కళ్లమ్మట నీళ్లు పెట్టుకుంటే… ‘బంధాలకు మేం లేమా’ అని నేనుకాదు, నాలాంటి వందమంది అక్కడ కనిపిస్తే…. ఆ మనసుకు బంధాలు ఇంకా ఉన్నాయని అనిపిస్తుంది.

నువ్వూ చదువుకున్నావ్‌గా నాన్నా… వేదాల్ని. ‘పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’అని! దాని అర్థం ఏమిటో ఎవరికైనా చెబితే మన మొహాన్నే నవ్విపోరూ…! మొత్తంలోంచి మొత్తం తీసేస్తే – మొత్తం మిగిలి ఉంటుంది.

అనేగా దాని అర్ధం. ఎక్కడుటుంది నాన్నా అలా? ప్రాక్టికల్‌గా అసలది ఊహించగలమా? అయితే అది సాధ్యమే. వేదం చెప్పే దేవుడిలో అది ఉంటుందో లేదో నాకు తెలీదు. కానీ అది మానవ అనుబంధాల్లో ఉంటుంది నాన్నా. పూర్ణమైన ఒక అనుబంధం తెగిపోయింది… అయితే అనేక అనుబంధాలు ఇంకా పూర్ణంగానే ఉన్నాయి. దాన్ని అనుభూతింపజేయడానికే నాన్నా…

స్వరం పట్టేసినట్టు ఆపేశాడు. నేను అనుకున్నది కరెక్టే… ‘ఏదైనా చెప్పడానికి ఏం జీవితానుభవం ఉంది వాడికి?’ నేను అనుకోనిది ఒకటి ఉంది… ‘ఏదైనా చెప్పడానికి కావాల్సింది జీవితానుభవం కాదు, మనసు.’ వాడు కొనసాగించాడు.

‘‘ఇది నువ్వు ఆలోచించే తెలివితేటలుగల మెదడుకు సంబంధించినది కాదునాన్నా. మనసుకు అందే కమ్యూనికేషన్‌.’’

ఈసారి ఆపేయడంలో, ఇక అంతా అయిపోయింది అనే ముక్తాయింపు ఉంది.

నేను మరుగుజ్జును అయిపోయిన ఫీలింగ్‌ వస్తోంది.

నేను వాడికేసి తిరిగాను. వాడి కళ్లలోకి చూశాను.

ఊహ తెలిసినప్పటినుంచి వాడికి నా కళ్లలోని చూపు బాగా పరిచయం. లేచి నా దగ్గరకు వచ్చి మెడచుట్టూ చేతులేసి బిగించి పట్టుకుంటూ, బుగ్గమీద ముద్దు పెట్టాడు.

వాడి బుగ్గమీద తడి, నా బుగ్గమీద తడితో కలిసిపోయింది.

రెండూ వెచ్చగానే ఉన్నాయి. అసలిప్పుడు కన్నీళ్లెందుకు వచ్చాయి?

…ఈ ప్రపంచంలో లాజిక్‌ లేని సంగతులు కూడా కొన్ని ఉంటాయి.

.. ఆంధ్రజ్యోతి ఆదివారం, 6 మే 2007

కథ 2007, కథావార్షిక 2007, తెలుగుపలుకు సంచిక

రచయిత మొదటి కథా సంపుటి ‘పూర్ణమూ నిరంతరమూ’

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పరస్పర విరుద్ధభావాలను ఏకత్రాటిపై సమన్వయం చేసేప్రయత్నమీరచన.
    ఒకే నాణానికి చెరొకవైపున ఉండే బొమ్మ బొరుసులను బాలెన్స్ చేసే ప్రయత్నమిది.
    రిలేషన్స్ (సంబంధాలు) లాజిక్ గా ఉండవు, ఈ ప్రపంచంలో లాజిక్ లేకుండా ఏది ఉండదు, ఈ ప్రపంచంలో లాజిక్ లేని సంగతులు కూడా కొన్ని ఉంచాయి అనే విరుద్ధభావాలను సందర్భానుసారంగా వ్యక్తీకరణలన ఈరచన రెండువైపులా పదునున్న కత్తిలాగా అనిపిస్తుంది.
    ‘ఈప్రపంచంలో సందర్భాన్నిబట్టి ప్రతిఒక్కరూ ముందువెనుకలుగాచనిపోవటం జరుగుతుంది. ఇంతదానికి హడావిడెందుకు …, ఎవరు చచ్చినా బంధుగణమంతా ఎగబడి ఊళ్లు దాటి వచ్చి వెళ్లడం, శవాన్ని ఊరేగించుకుంటూ ఆ సంగతి పురప్రజలు గుర్తించరేమోనని డప్పు వాయించుకుంటూ, టపాసులు పేల్చుకుంటూ – అంతిమయాత్ర అత అవసరమ అని తండ్రి పాత్రద్వారా ప్రశ్నిస్తాడు రచయిత. ఈ ఆలోచనాధోరణితో తను చనిపోతే తన శవాన్ని డాక్టర్లకూ, మెడికల్ కాలేజికి అప్పగించమని విల్లు వ్రాస్తాడు తండ్రి.
    తండ్రి భావాలని గౌరవిస్తున్న కొడుకుపాత్రతో ‘నువ్వొక్కడివే కాదు, మనం, మనపరిచయస్తులందరినీ ఇలాంటి అగ్రిమెంటులకు ఒప్పించామంటే చాలా బాగుంటుందనీ, దీన్నొక ఉద్యమంలా చేపట్టాలనీ’ సమర్ధింపజేస్తాడు రచయిత.
    ఎవరైనా చనిపోతే మనంవెళ్లటం పోయినవారికోసం చేసే అర్ధంలేని ఫార్మాలిటీ కాదు, మిగిలినవాళ్లకోసమని కొడుకుపాత్రతో చెప్పిస్తాడు. “ఆసమయంలో ఎదురుగా నాకోసం వచ్చినవాళ్లు కన్పిస్తే, వాళ్లు ఊరడించకున్నా. నేను ఒక్కరినే కోల్పోయాను కానీ నాకిందరున్నారనేభరోసా కల్పించగలగుతామని చెప్పిస్తూ, ‘ఇది నువ్వుఆలోచించే తెలివితేటలుగల మెదడుకు సంబంధించినది కాదు నాన్నా, మనసుకు అందే కమ్యూనికేషన్ అని ముక్తాయింపు ఇవ్వగలగటం చాలా అర్ధవంతంగా ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు