గుంటూరు పాతబజార్ రోడ్డు. సాయంకాలం. సూర్యుడు కిందికి దిగుతూ ఆకాశంలో ఒక ఎర్రటి గీత గీశాడు. ఆ కాంతి రోడ్డుపై పడుతూ షాపుల గోడలపై వంకరటింకర నీడల్ని గీస్తోంది. విస్తరించిన ఒక అస్తవ్యస్త సౌందర్యం. ఓ తీవ్రమైన జ్ఞాపకంలా గాలిలో మిరపకాయల ఘాటు. ఆటోల అరుపులు, మోటార్ సైకిళ్ల హారన్లు, దగ్గర్లోని గుడిగంటల శబ్దం కలగలసిన ఓ గందరగోళ లయ. ఈ చప్పుళ్ల మధ్య ఓ చిన్న షాపు.. పూర్ణచంద్ర టైప్ ఇన్‌స్టిట్యూట్.. ఒంటరిగా కనిపిస్తోంది. పాతయుగం జాడల్ని తలపిస్తోన్న గోడలు. ద్వారం దగ్గర ఓ పాత గోద్రెజ్ టైప్‌రైటర్, శ్మశానంలోని సమాధిని గుర్తుచేస్తూ. దాని అవతల కుర్చీలో కూర్చొని ఉన్నాడు శశాంక్. 29 ఏళ్ల వయసు యువకుడు. వంటిపై దుమ్ము పట్టిన తెల్ల చొక్కా. గజిబిజిగా ఉంగరాల జుట్టు. కళ్లల్లో నీడలా నిలిచిన ఓ గాఢమైన మౌనం. అతని చేతులు టైప్‌రైటర్‌పై ఆగాయి.
సన్నగా వణుకుతున్న చేతుల్తో ఓ పేపర్‌ను టైప్‌రైటర్‌లో పెట్టాడు శశాంక్. ఓ కీని నొక్కాడు. “టక్!” ఆ చప్పుడు గదిలో ప్రతిధ్వనించింది, గోడల్ని తాకుతూ రోడ్డుమీదికి చొచ్చుకుపోయింది – ఓ పక్షి రెక్కల చప్పుడులా. అతని కళ్లు ఆ మిషన్‌పై ఆగాయి. కీలపై దుమ్ము ఓ పొరలా ఆవరించి ఉంది. అతని చేతివేళ్లపై గాయంలా కనిపిస్తోన్న చెమట బొట్లు. సూర్యాస్తమయ ఎరుపు కాంతి గదిలోకి చొరబడి, అతని ముఖంపై సృష్టిస్తోన్న ఓ గోధుమరంగు ఛాయ. గది గోడపై వేలాడుతున్న ఓ పాత ఫోటో. ఆ ఫొటోలో టైప్‌రైటర్ ముందు కూర్చుని వున్న పూర్ణచంద్రరావు. చుట్టూ నిలబడి ఉన్న ఓ డజనుమంది స్టూడెంట్స్. పూర్ణచంద్రరావు ముఖంపై ఓ గురువు గర్వాన్ని తలపిస్తోన్న చిరునవ్వు మెరుపు. అతని కళ్లల్లో రెండు తరాల జీవితాల్ని వెలిగించిన సంతృప్తి.
గాఢంగా ఊపిరి తీసుకున్నాడు శశాంక్. అతని గుండెలో ఓ బరువు, ఓ గతం జాడలు. అతని కళ్లు టైప్‌రైటర్‌పై. దాని శరీరంపై తన తండ్రి చేతుల వేడి ఇంకా ఉన్నట్లు ఫీలయ్యాడు. అతని గొంతు సన్నగా వణికింది. కంటి అంచును తడిమిన చిన్న నీటి బొట్టు.
“1970, 1980లలో ఈ బజారు నీ నామస్మరణ చేసింది. పూర్ణచంద్రరావు అంటే ఒక గురువు, ఒక యోధుడు. ఎన్ని వందల మంది జీవితాల్ని ఈ టైప్ మిషన్‌తో నిలిపావో నువ్వు! ఆ రోజుల్లో ఈ రోడ్డు నీ చప్పుడు కోసం ఆగిపోయేది. ఆడ, మగ తేడా లేకుండా ఎంతమంది ఇక్కడ కూర్చొని కలలు రాసుకున్నారు! ఆ కలలు నిజాలై వాళ్లలో ఎంతోమంది టైపిస్టులుగా, స్టెనోగ్రాఫర్లుగా జీవితాల్ని వెలిగించుకున్నారు! నీ చేతులు ఈ మిషన్లలో గుండెల్ని నింపాయి. నువ్వు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఓ దీపంలా వెలిగావు. చాలామందికి ఇదొక గుడి. ఇవాళ ఈ షాపును హారన్లు ముంచెత్తుతున్నాయి. కంప్యూటర్లు ఈ టైప్ మిషన్లను చీల్చేస్తున్నాయి. ఈ శబ్దం నా గుర్తింపు. నా గతం నువ్వు నాకిచ్చిన ఆశ. కానీ ఈ బజారు దాన్ని మర్చిపోతోంది. ఈ మిషన్ నా గుండెలో బతికే ఉంది. కానీ నీ కొడుకు ఈ టైప్ మిషన్ చప్పుళ్లని కాపాడలేని స్థితిలోకి వచ్చాడు..” అనుకున్నాడు శశాంక్ తనలో తను ఓ లోతైన బరువుతో.
అతని మళ్లీ ఓ కీని నొక్కాడు. “టక్!” ఆ చప్పుడు ఓ గాయంలా గదిలో ప్రతిధ్వనించి, రోడ్డుదాకా వ్యాపించి గత జ్ఞాపకం లాంటి అనుభూతిని సృష్టించింది. అతని చేతులు టైప్‌రైటర్ కీలపై చకచకా పరుగులు పెడుతున్నాయి – ఓ లయలా, ఓ యోధుడి కత్తిసాములా, ఓ నర్తకి నాట్యంలా. గదిలో చల్లని గాలి వీచి, పూర్ణచంద్రరావు ఫొటోను తాకింది. శశాంక్ చెంప మీదుగా ఓ కన్నీటి బొట్టు జారి, ఓ కీపై పడింది.
రోడ్డుమీద ఓ పెద్దాయన షాపు దగ్గర ఆగాడు, ఆయన చేతిలో ఓ మొబైల్. ఆయన పూర్ణచంద్రరావు విద్యార్థుల్లో ఒకడు. ఈ టైప్‌రైటర్ చప్పుడుతో తన జీవితాన్ని మొదలుపెట్టినవాడు, ఒకప్పుడు ఇక్కడే తన కలల్ని కాగితాలపై టైప్ చేసుకున్నవాడు. ఆయన ఏదో చెప్పబోయి ఆగిపోయాడు- ఆయన కళ్లల్లో గతం కదిలిన గుర్తు. గుడి గంటల శబ్దం ఆగిపోయింది. టైప్‌రైటర్ చప్పుడు ఒంటరిగా మిగిలింది.
———————-
పూర్ణచంద్రరావు ఇల్లు.. కరెంట్ లేదు. క్యాండిల్ వెల్తురు. 50 ఏళ్ల మీనాక్షి కుర్చీలో కూర్చొని ఉంది. గోడమీద ముఖంపై చిరునవ్వు తాండవిస్తున్న పూర్ణచంద్రరావు ఫొటో. శశాంక్ ఇంట్లోకి అడుగుపెట్టాడు.
మీనాక్షి తలెత్తి కొడుకును చూసింది. బరువుగా అడుగులు వేస్తూ లోనికి వచ్చాడు శశాంక్.
“నాన్నా, షాప్ అమ్మేయ్. దివ్యకు ఎప్పుడు సంబంధం కుదిరినా పెళ్లి చెయ్యడానికి మన దగ్గర డబ్బులు రెడీగా ఉండాలి. ఈ వారంలో డబ్బు కట్టకపోతే నా ఆపరేషన్ వాయిదాపడుతుంది. సరే. నేను ఎన్నాళ్లు ఉంటానో తెలీదు. నేను పోయేలోపైనా చెల్లి పెళ్లి చేసేస్తే.. నా బాధ్యత తీరుతుందని నా ఆశ. అర్థం చేసుకో నాన్నా.. ఎన్నాళ్లని ఆదాయం లేని ఆ ఇన్‌స్టిట్యూట్ పట్టుకొని వేళ్లాడుతుంటావ్. నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంటోంది. ఏదైనా మంచి ఉద్యోగం చూసుకో నాన్నా.”
కొడుకు వచ్చీ రాగానే మనసులో ఉన్నది చెప్పేసింది మీనాక్షి. ఆమెకు రొమ్ము కేన్సర్ అని ఈమధ్యే తేలింది. కూతురు దివ్యకు పాతికేళ్లొచ్చాయి. ఇప్పుడు పెళ్లి చెయ్యకపోతే రాను రాను సంబంధాలు దొరకడం కష్టమైపోతుందని ఆమె బాధ.
శశాంక్ గుండెనెవరో మెలిపెట్టినట్లయ్యింది. అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి అంటే అతడికి ఎంత అభిమానమో! అందుకే అతడి జ్ఞాపకమైన టైప్ ఇన్‌స్టిట్యూట్‌ని తాను ఉన్నంతవరకు నిలబెట్టాలని తాపత్రయపడ్తున్నాడు. కానీ ఇంటి పరిస్థితులు అందుకు తావిచ్చేట్లు లేవు. అమ్మ కూడా తనను నిష్ఠూరాలు ఆడుతోంది. ఆమె మాటల్లో తప్పేమీ లేదు. ఓ తల్లిగా కూతురికి మంచి సంబంధం చేయాలనేది ఆమె తపన. అతను తండ్రి ఫొటో వంక చూశాడు. ఆయన చిరునవ్వు ఓ సవాలులా తోచింది.
“అమ్మా, ఈ షాపు నాన్న ఆత్మ. దాని శబ్దం ఆయన ఊపిరి. షాపు అమ్మితే పది లక్షలొస్తాయి. కానీ దాన్ని అమ్మితే నాన్నను పూర్తిగా చంపేసినట్లు కాదా! నీ ఆరోగ్యం కోసం, దివ్య పెళ్లి కోసం నేను ఏదో ఒకటి చేస్తాను. కానీ ఈ టైప్‌రైటర్ ఆగిపోతే నేనుండి ఎందుకు? నాన్న చివరి కోరికను తీర్చకుండా ఆయనకు ద్రోహం చెయ్యమంటావా?” అన్నాడు శశాంక్, ఉద్వేగానికి లోనవుతూ.
గట్టిగా ఊపిరి తీసుకుంది మీనాక్షి. ఆమె కళ్లల్లోనూ తడి. ఆమె చేతులు వణికాయి. ఆవేదన నిండిన ముఖంతో కొడుకును చూసింది.
“నాన్నా, మీ నాన్న నీకు వారసత్వంగా ఆ షాపిచ్చాడు నిజమే. ఆ రోజుల్లో ఆ టైప్ మిషన్లే మనకు అన్నం పెట్టాయి. నువ్వు పుట్టినప్పుడు మీ నాన్న నీ చేతి వేళ్లను టైప్ మిషన్‌పై ఆడించడం నాకింకా గుర్తుంది. అప్పట్లో ఆ మిషన్ సౌండ్ ఇష్టంగా ఉండేది. ఇప్పుడది వింటుంటే గుండెల్లో బరువుగా అనిపిస్తోంది. మీ నాన్న ఇప్పుడున్నా ఆ షాపును అమ్మేసేవాడు. షాపు కంటే బతుకు ముఖ్యం కదా నాన్నా?” అంది మీనాక్షి. ఆమె గొంతుతో బాధ స్పష్టంగా వినిపించింది.
శశాంక్ ఏమీ మాట్లాడలేకపోయాడు. కళ్లల్లోంచి నీటిబొట్లు చెంపల మీదుగా జారి నేలపై పడ్డాయి. ఆ ఇంట్లో కొన్ని క్షణాలు నిశ్శబ్దం తాండవించింది.
———————
పూర్ణచంద్రరావు ఇల్లు… మీనాక్షి, శశాంక్, దివ్య.. ముగ్గురూ ఒక వేపు దివాన్ మీద కూర్చొని ఉంటే, ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు సుధాకర్. అతని చేతిలో అగ్రిమెంట్ పేపర్.
“శశాంక్, అందరూ ఇక్కడ సంతకం పెట్టండి.” అని అతని చేతిచ్చాడు సుధాకర్. శశాంక్ చేతులతో పాటు గొంతు కూడా వణికింది. ఏదో అనబోయాడు కానీ మాట గొంతుదాటి బయటకు రాలేదు.
చివరకు తమాయించుకుంటా, “సుధాకరన్నా, ఇన్‌స్టిట్యూట్, టైప్ మిషన్ నాన్న ప్రాణాలు. అవి లేకపోతే, నేను నాన్నను పూర్తిగా కోల్పోయినట్లే.” అంటూనే పేపర్‌పై సంతకం చేశాడు శశాంక్, వణుకుతున్న వేళ్లతోటే. మీనాక్షి, దివ్య కూడా బాధపడుతూనే సంతకాలు చేశారు.
“తప్పదు కదా శశాంక్. సెంటిమెంట్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అనుకున్నప్పుడు, దాన్ని వదలడమే బెస్ట్.” అంటా అగ్రిమెంట్ పేపర్‌ను తీసుకున్నాడు సుధాకర్. అతని మొహంలో సంతృప్తి. విజయ దరహాసం. పది లక్షలున్న బ్యాగ్‌ను శశాంక్ చేతికివ్వబోయాడు. “అమ్మా, ఆ బ్యాగ్ తీసుకో” అన్నాడు శశాంక్. మీనాక్షి దాన్ని అందుకుంది.
———————
సూర్యోదయమైంది. గుంటూరు పాతబజార్‌లో అలజడిగా ఉంది. బుల్డోజర్ ఒకటి అక్కడ గర్జిస్తోంది. పూర్ణచంద్రా టైప్ ఇన్‌స్టిట్యూట్ నేలమట్టమవుతోంది. బుల్డోజర్ కోరలు షాపు గోడల్ని కూల్చేస్తున్నాయి. శశాంక్ దూరంగా నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక టైప్‌రైటర్ కీ. అతని కళ్లల్లో ఇప్పుడు నీళ్లు రావట్లేదు, ఇంకిపోయినట్లుగా.
కూలుతున్న గోడల నుంచి ధూళి మేఘాలు లేస్తున్నాయి. ఆ రోడ్డు మీద వెళ్తున్నవాళ్లలో కొంతమంది ఆగి చూస్తున్నారు. వారిలో అక్కడ టైపింగ్ నేర్చుకున్నవాళ్లు ఉన్నారు.
“పాతబజార్‌కే ఒక కళగా ఉండేది ఈ షాప్. పిల్లలకు టైపింగ్ నేర్పిస్తా పూర్ణచంద్రరావు గొంతు ఖంగుమంటా వినిపించేది. ఆయనా పోయాడు, ఇప్పుడు ఈ షాపూ పోతోంది” అన్నారెవరో. ఇక అక్కడ నిలవలేక వెనుతిరిగి ఎటుపోతున్నాడో తెలీకుండా నడిచాడు శశాంక్.
——————–
రాత్రివేళ గుంటూరులోని ఓ షాపింక్ కాంప్లెక్స్.. నియాన్ లైట్లతో రోడ్లు వెలిగిపోతున్నాయి. కాంప్లెక్స్‌లో మొబైల్ ఫోన్ల రింగ్‌టోన్లు ఒక దాని తర్వాత ఒకటిగా మోగుతున్నాయి. కంప్యూటర్ కీ బోర్డ్ సౌండ్లు కూడా చిన్నగా వినిపిస్తున్నాయి.
ఆ కాంప్లెక్స్ ముందు ఒక యువకుడు సెక్యూరిటీ గార్డ్ యూనిఫాంలో కనిపిస్తున్నాడు. అతని చేతిలో ఓ లాఠీ కూడా ఉంది. అటూ ఇటూ పహరా కాస్తున్న ఆ కళ్లల్లో ఏదో గాయం.
అతని ఎడమచేయి ప్యాంట్ జేబులోకి వెళ్లి, ఓ చిన్న వస్తువును బయటకు తీసింది. అది ఓ టైప్‌రైటర్ కీ!!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Add comment