అలా అని నా మనసులోని బాధను
నీ సంతోష సమయాల్లోకి వంపేయలేను
ఏళ్ళకేళ్ళనుంచి పూడిక తీయని కళ్ళతోనే జీవిస్తున్నా
తడిలేనితనం ఎన్నో అవమానాలని
ముఖానికి అద్దుతూ మనిషి అర్థాన్నే మార్చేస్తుంది కదా
చూపు దరిదొరకనంత లోతులో ఉంటుంది
ఎన్ని పాతాళగరిగెలను భుజం మీద మోస్తూ తిరుగుతూ వెతుకుతున్నాను
అయినా కాటకల్పు నీడలు నన్ను చుట్టేస్తున్నాయి
అన్ని తొవ్వలూ ఒక్క తీరుండవు
ముళ్లపొదలమీద కూడా పూలు తలెత్తుకునే
ఉంటాయి అవి దోసిట్లో అమరినంత అందంగా
నీ నవ్వు ఉందని చెప్పాలనే అనిపిస్తుంది
కానీ నువ్వో పక్క నేనో పక్కన
మన మధ్య వేల కాంతి సంవత్సరాల ఎడబాటు దూరం
నిప్పులమీద చిటపటలాడే ఊదు
మన ప్రేమల వెలుతురు వేళలో మాత్రం
సుగంధభరితమై వాలిపోయేది
ప్రియతమా!
ఎప్పటికైనా జ్ఞాపకాలే మన చూపుడు వేలుమీద
పుట్టుమచ్చలా శాశ్వతంగా నిల్చిపోతాయి
*
Expression చాలా బాగుంది అండి. మంచి కవిత.