పుస్తకం నన్ను సంక్షోభంలోకి దించేసింది.
పుస్తకం నన్ను అథః పాతాళానికి తొక్కేసింది.
పుస్తకం నాకంటూ నాదైన జీవితం లేకుండా చేసింది. పుస్తకం నన్ను నాకుటుంబానికి దూరం చేసింది.
పుస్తకం ప్రస్తుతం నన్ను సమాజానికి దగ్గర చేసింది పుస్తకం నన్ను కవి రచయిత నవలాకారుడు చేసింది నా చేత యాత్రలు చేయించింది.
పుస్తకం నన్ను ప్రకృతి ప్రేమికుడుగా మార్చింది. ఇప్పుడు ఉద్యమకారుణ్ణి చేసింది.
మా అమ్మ మూడో తరగతి చదివింది. ఆమె ఎక్కడ చిన్న పేపర్ ముక్క కనిపించినా తీసుకొని చదువుతూ ఉండేది. నాకు తెలియకుండా ఆమె నా మీద చదువు ముద్ర వేసింది.
నాకు ఊహ తెలిసినప్పుడు చందమామతో మొదలైన పుస్తక పరిచయం కథలు చదవడంలో ఇష్టాన్ని పెంచింది.పెద్దవాళ్లు తెచ్చుకొని చదివే పుస్తకాలు తీసుకుని అర్థమైనా కాకపోయినా చదివేవాడిని.మా గ్రామంలో పంచాయతీ గ్రంథాలయంలో ఉండే పుస్తకాలు ఏకపాత్రలు మహనీయులను పరిచయం చేసింది. పాఠశాలలో గ్రంథాలయం నన్ను పుస్తకానికి మరింత దగ్గర చేసింది. డిటెక్టివ్ నవలలు పాపులర్ సాహిత్యం నన్ను పుస్తకాన్ని ప్రేమించేటట్లుగా చేసింది. మంచి పాఠకుడిగా మార్చింది.
ఆంధ్రజ్యోతి దినపత్రిక నన్ను కవిగా రచయితగా మార్చింది. మా గ్రామానికి వచ్చే ఒకే ఒక్క ఆంధ్రజ్యోతికి నేను నిరంతర పాఠకుడిని. పత్రికలో వచ్చే కథలు కవితలు నా రచన కు ప్రేరణ ఇచ్చాయి. మహాప్రస్థానం నన్ను ఊపేసింది ఆ వాతావరణంలో నుండి కవిత్వం రాయటం కథలు రాయడం మొదలు పెట్టించింది. అర్థం కాకున్నా సరే పుస్తకాన్ని చదవటం అలవాటు చేయించింది. ప్రైవేటు జీవితాన్ని పక్కనపెట్టి సభలు సమావేశాలకు నన్ను పురి కొలిపింది పుస్తకమే.
పాఠకుడిగా ఉన్నంత వరకు నేను సమస్యలకు లోను కాలేదు. రచయితగా మారిన తర్వాత పుస్తకాల ముద్రణ నన్ను అప్పులు పాలు కూడా చేసింది.
పుస్తకం పై ఉన్న ప్రేమవల్ల అనేకమంది నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆటలాడుకోవడం నాకిప్పుడు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. పుస్తకం చదవడమే అన్ని అజ్ఞానాలను దూరం చేసింది. అజ్ఞానంతో నడిచే వాళ్ళను దూరం చేసింది. పుస్తకం జీవితానికి ఒక అర్ధాన్ని కలుగజేసింది.
పుస్తకం నన్ను ఎంతో మంది యువతను ప్రేరేపించడానికి అనేక కార్యక్రమాలు వర్క్ షాపులు చేయించింది.
చివరికి అధ్యయనం ద్వారా నేను తెలుసుకున్న సత్యమేమిటంటే సామాజిక మార్పుకు విద్య పాఠశాల పిల్లలు గ్రామాలు తల్లిదండ్రులు దోహదం చేస్తారని తెలుసుకున్నాను.
జీవితానికి అర్థం పరమార్ధం అదే అని నిర్ణయించుకున్నాను. అప్పటినుండి పుస్తకాలు చదవటంతో పాటు పిల్లల చేత చదివించడం కూడా మొదలుపెట్టాను. తరగతి గది నుండి పాఠశాల నుండి గ్రామంలో ప్రతి ఇంటికి పుస్తకం చేరే విధంగా అనేక ప్రయత్నాలు చేశాను. ఆ విధంగా పిల్లల చేత
పుస్తకాలు చదివించాను. పుస్తకాలు రాయించాను.
సమాజంలో అనేకమంది మిత్రులు పుస్తకాల విలువ తెలుసుకొని పాఠశాలలకు గ్రంధాలయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేశాము. విద్యా వ్యవస్థలో లోటుపాట్లను తెలుసుకుని విద్యా వ్యవస్థ నందు చేయాల్సిన సంస్కరణలను కనుగొన్నాను. మొత్తంగా రెండు తెలుగు సమాజాలలో పుస్తకాన్ని విస్మరించిన సంక్షోభాన్ని గుర్తించి పరిష్కారంగా మరో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించాము. విద్యా వ్యవస్థ లో లోపాలను గుర్తించి సంస్కరణల దిశగా ఆలోచన మొదలైంది.
ఈ మొత్తం పుస్తక జీవితంలో పుస్తకం చాటు నుండి క్రూరంగా ఆలోచించే క్రూరంగా ప్రవర్తించే స్వార్థపరులను ఎంతో మదిని చూశాను. పుస్తకాలను అడ్డుపెట్టుకొని అరాచకాలు చేసేవారికి దూరంగా జరిగి సమాజానికి అవసరమైన ప్రక్రియను నిరంతర సాధనగా చేయడం మొదలు పెట్టాను.
నేను చదువుకున్న పాఠశాలలో జీవీ సార్ ల్యాబ్ అసిస్టెంట్ గా ఉండి లైబ్రేరియన్ గా పనిచేసేవారు. మా చేత జనరల్ స్టోర్ నడిపించేవారు. ఆయన పుస్తకాలతో చేసిన ప్రయోగమే ఇప్పుడు పాఠశాలల్లో ఇంప్లిమెంటేషన్ చేయించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము. పాఠశాలలో ప్రత్యేకమైన లైబ్రేరియన్ లేడు. కానీ లైబ్రరీ పీరియడ్ కచ్చితంగా అమలు జరిపేవాడు. ఆయన ప్రతి క్లాస్ లీడర్ ద్వారా పుస్తకాలను లైబ్రరీ పీరియడ్ లో క్లాస్ కు పంపేవాడు. లీడర్ పుస్తకాలు ఇచ్చి పీరియడ్ అయిన తర్వాత తిరిగి తీసుకునేవాడు. అలా ఆ పీరియడ్ కచ్చితంగా జరిగేది. అది మరో గ్రంథాలయ ఉద్యమానికి మార్గదర్శకం అయింది.
పుస్తకమార్గం
ఊహ తెలిసినప్పటి నుండీ
పుస్తకాలను స్పర్శిస్తే చాలు
చందమామలు మా పెరటి చెట్టు కొమ్మలకు వేలాడేవి
నక్షత్రాలు మా ఇంటిముంగిట పందిరి వేసేవి
మేఘాలు ముసురుకుని పలపలా వర్షించేవి
అక్షరాలను ప్రేమగా వెన్ను నిమిరినప్పుడల్లా
రంగురంగుల పక్షులు ఎగురుతూ వచ్చి నా మేనిపై సయ్యాటలాడేవి
అడవులూ కొండలూ నదులూ లోయలూ
నా కళ్ళ ముందు కదులుతున్న చలనచిత్రాలయ్యేవి
ఒంటికంటి రాక్షసులూ అందమైన రాకుమార్తెలూ
మా ఇంటికొచ్చి పలకరించి పోయేవాళ్ళు
ఆకాశంలోకి ఎగరాలనుకున్నప్పుడు పుస్తకంలో తలదూర్చి
మబ్బుల్లో గిరికీలు కొట్టేవాడిని
ఈదాలనుకున్నప్పుడు సెలయేటి నీటిలో సయ్యాటలాడేవాడీని
ఇంద్రధనస్సులను పిలిచి రంగుల్లో మునిగి తేలేవాడిని
రాజహంసలతో సరాగాలాడేవాడిని
పుస్తకాల్నిండా నెమలికన్నులు అప్పుడప్పుడూ
బిడ్డల తల్లులయ్యేవి
వెలుతురు పిట్టలు మంత్రపు పుల్లలు తెచ్చిచ్చేవి
దూరాభారం ప్రయాణించాలనుకున్నప్పుడు
హాయిగా వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుని
ఇష్టమైన పుస్తకాన్ని పొట్టపై బోర్లించుకునే వాడిని
రెక్కలు మొల్చుకొచ్చి ఎన్ని యోజనాలైనా ఎగురుతూ పోయేవాడిని
పర్వతాల్ని అధిరోహించేవాణ్ణి
లోయల వెంట ఉరుకులు పరుగులు తీసేవాణ్ని
రాజభవనాలకు వెళ్ళి రాజుల్నీ రాణుల్నీ పలకరించొచ్చేవాడిని
పులులతోనూ సింహాలతోనూ జూలు పట్టుకుని ఆడుకునేవాడిని
పుస్తకాల్నిండా ఎందరో నా సావాసగాళ్ళు కొలువుతీరి
సయ్యాటలకు ఉసిగొల్పుతుండేవాళ్ళు
పుస్తకం నాకు గాఢ నిద్రలో నుండి వెలుతురు తోటలోకి
దారి చూపే వెన్నెల పూదోట
మామూలు మనిషి ఙ్ఞాని కావడానికీ ఙ్ఞాని బుద్ధుడు కావడానికీ
ఎన్నెన్నో బోధనల్ని చేసేది పుస్తకమే
మనిషి మనిషిగా మనగలగడానికీ
పదిమందిని మానవతా స్పర్శతో అక్కున చేర్చుకోవడానికీ
పుస్తకం ఒక జీవన మార్గం
పుస్తకమే ఒక జీవన గమ్యం
Add comment