పుస్తకాలు చదవడం మీద ఆసక్తి కలిగించే కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను కానీ, ఇప్పటికే మీరు చాలా పుస్తకాలు చదువుతున్నారు చిన్నప్పటినుంచి. అవి చరిత్ర పుస్తకాలు, లేదా సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు, మరికొన్ని భాషకు సంబంధించిన పుస్తకాలు. “ఇవన్నీ పుస్తకాలే కదా మళ్లీ కొత్తగా మేము పుస్తకాలు చదవడం గురించి మీరు చెప్పేది ఏముంది” అని మీకు అనిపించొచ్చు. అంచేత ముందు మనం పుస్తకాలకి ఒక విభాగం చేద్దాం.
ఇంతవరకు మీరు చదువుకున్న పుస్తకాలన్నీ రకరకాల శాస్త్రాలకు సంబంధించినవి. అవి సాంఘిక శాస్త్రాలు కావచ్చు, సామాజిక శాస్త్రాలు కావచ్చు ఇక మిగిలినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సైన్సులు కావచ్చు. వీటితో పాటు మీకు తెలుగు, ఇంగ్లీషు, హిందీలకు సంబంధించిన వాచకాలు కూడా ఉండే ఉంటాయి. వీటన్నిటిని మనం ఒక పక్కన పెడదాం. ముందు పుస్తకాలను రెండు కేటగిరీలు, లేదా రెండు వర్గాలుగా విడదీద్దాం. మొదటి కేటగిరీ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పుస్తకాలు.
ఇక రెండో వర్గం ఏవైతే ఉన్నాయో వాటి గురించే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ రెండో వర్గం పుస్తకాలను కాల్పనికి సాహిత్యం అంటారు. ఇవి అన్ని భాషల్లోనూ లక్షల సంఖ్యలను దాటి ఉన్నాయి. మనం చెప్పుకోవలసినది వీటి గురించి.
నిజానికి మొదటి వర్గానికి చెందిన పుస్తకాలు చదువుకోవడం వల్ల కొంత విషయ పరిజ్ఞానం, అవగాహన వస్తాయి. అవి మరింత ముందుకు వెళ్లే కొద్దీ ఒకే అంశానికి సంబంధించిన లోతైన, విజ్ఞానానికి, అవగాహనకు మాత్రమే పరిమితం అయిపోతాయి.
ఉదాహరణకు ఫిజిక్స్ లో ఎం. ఎస్. సి చదువుకుని తర్వాత డాక్టరేట్ చేస్తే అనంతమైన భౌతిక శాస్త్రంలో ఒకే ఒక అంశం గురించి లోతుగా చదువుకున్నట్టు అవుతుంది. ఇలా ఏ శాస్త్రమైనా ఇంతే. దీని తాలూకు పరిజ్ఞానంతో పాటు, ఇది బతుకుదెరువుకు ఉద్యోగాన్ని కూడా సంపాదించిపెడుతుంది కానీ ఇక్కడితో జీవితం ఆగిపోదు, అయిపోదు.
జీవితానికి కూడా కావలసినవి ఏవో ఇంకా మిగిలిపోయాయని అనిపిస్తూ ఉంటుంది. రెండో వర్గం పుస్తకాలు తెలియని మనుషులు తమ సంతృప్తి కోసం ఈ మిగిలిన ప్రపంచంలో రకరకాలుగా వెతుక్కుంటూ ఉంటారు. అది ఆస్తులు పోగేసుకోవటం, డబ్బు సంపాదించుకోవటం, వస్తువులు కొనుక్కోవడం, సుఖాల కోసం, విలాసాల కోసం వెంపరల లాంటివి . కానీ వారి ఆరాటాలకు ఎక్కడా తృప్తి దొరకదు.
అలాంటప్పుడు ఈ రెండో వర్గానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటున్న వాళ్ళని చూస్తే వారు ఈ పై వాటి వేటితోను సంబంధంలేని ఆనందం పొందుతూ కనిపిస్తారు. ఇది నేను చెబుతున్న కాల్పనిక సాహిత్యం అనే రెండో కేటగిరీ తాలూకు,ఉపయోగం అవసరమూ కూడా.
సరే నేను పుస్తకాలను రెండుగా వర్గీకరించాను కాబట్టి రెండో వర్గం పుస్తకాలు మరింత ప్రత్యేకమైనవి అని చెప్తున్నాను కాబట్టి ఇవాళ వాటి గురించే మాట్లాడుకుందాం.
ఈ రెండో వర్గం పుస్తకాల్లో నవలలు, కథలు కవిత్వము, జీవిత చరిత్రలు, ఆత్మకథలు లాంటి మరెన్నో రకాలు ఉన్నాయి. మీరు వీటన్నింటి జోలికి పోవద్దు. ప్రస్తుతం కతలతో మొదలుపెడదాం. కథల పుస్తకాలు చదవడం మొదలు పెడితే మన చుట్టూ ఉండే జీవితాల, మన జీవితాల్లో ఉన్న అనేక అనేక సంఘటనల వెనక అర్థం కాకుండా ఉండే విషయాలు అర్థమవుతున్నట్టు ఉంటాయి. ఒక మంచి కథ చదవకముందు మనం, చదివిన తర్వాత మనం వేరువేరుగా ఉంటాం. మనకి మనమే మరి కొంత తెలివిగా మారినట్టు మనకు అనిపిస్తుంది. ఓ మంచి కథ అలాంటి పని చేస్తుంది. మనకి తెలుగు భాషలో లక్షల కథలు వచ్చిఉన్నాయి. ఈ కథలన్నింటినీ కూడా శ్రీకాకుళం లో ఉన్న కథానిలయం అనే సంస్థ పోగుచేసి దాచి పెట్టింది. అంతేగాక వాటిని అందరికీ సులువుగా ఉండేలాగా ఆన్లైన్లో చేర్చి పెట్టింది.
మీకు ఏ కథ కావాలన్నా ఇంచుమించుగా అందులో దొరుకుతుంది ఇక చదవడం దగ్గరకు వద్దాం.
చదవటం అన్నది సులువైన పనేమీ కాదు, కష్టమైన పని. అది సినిమా హాల్లో మనకి నచ్చిన వినోదాత్మకమైన సినిమా చూసినంత సులువు కాదు.
కథ చదవడానికి లేదా, ఓ పుస్తకం చదవడానికి ముందు మనని మనం సంసిద్ధం చేసుకోవాలి. ఐతే కొన్ని పుస్తకాలు అంత సులువుగా నడవవు. వాటిని చదవడానికి మనం ఎంతో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా అలాంటి పుస్తకాల జోలికి పోకూడదు.
మనం మొదలుపెట్టుగానే అదే మనని గబగబా ముందుకు తీసుకెళ్లాలంటే కథల పుస్తకాలు కొన్ని ఉంటాయి. వాటితో మొదలుపెట్టాలి.
అవి మనం ఒక పేజీ చదవగానే మనకు తెలియకుండానే పుస్తకం అంతా చదివేలా చేస్తాయి. దీన్నే ‘చదివింప చేసే లక్షణం’ లేదా ‘రీడబులిటీ’ అంటారు. ముందుగా ఇలాంటి పుస్తకాలు అనుభవజ్ఞులని అడిగి ఎంపిక చేసుకోవాలి. ఆ విధంగా పుస్తకానికి చేరువ కావటం అనే మొదటి మెట్టు ఎక్కాలి.
ఇప్పుడు కొద్దిగా పుస్తకం చూడగానే తీసి చదవాలని అనిపించేదాకా వస్తాం.
అప్పుడు కొంచెం మన శ్రద్ధని పరీక్షించేలాంటి పుస్తకాలను మనమే ఎంచుకోవాలి.
మీ వరకు నేను ఏం చెప్తానంటే పూర్వం చందమామ అనే పత్రిక మాసపత్రికి వచ్చేది. అది ఎంచుకోమని చెప్తాను. చందమామ కథలు చిన్న పిల్లల కథలు. కానీ ఇవి పెద్దల కోసం కూడా రాసిన కథలు. ఇవి జీవిత సారాన్ని సులువైన మాటల్లో చెప్పిన కథలు. అలాగ గొప్ప గొప్ప రచయితలు అనబడే వాళ్ళు ఆ చందమామ కథలు రాసి పెట్టారు. వారిలో కొడవటిగంటి కుటుంబరావుఅనేవారు ప్రధానమైనవారు.
ఇక్కడ మీకు ఒక గమ్మత్తయిన సంఘటన చెప్తాను. మా అబ్బాయికి చిన్నప్పటినుంచి చందమామలు కొని ఇచ్చి చదివే అలవాటు చేశాం. వాడు చాలా చందమామ పుస్తకాలు చదివి ఆ కథలు తిరిగి మాకు చెప్తూ ఉండేవాడు. పెద్దవాడు అయిన తర్వాత జంషెడ్పూర్ లో ఉన్న XLRI అనే యూనివర్సిటీ లో మానవ వనరులకు సంబంధించిన ఎంబీఏ చేయడానికి ఎంపిక చేయబడ్డాడు. అది భారతదేశం లోనే మానవ వనరుల ఎంబీఏ కి నెంబర్ వన్ విశ్వవిద్యాలయం. అక్కడ రెండేళ్లు చదువుకున్న తర్వాత ఆ పిల్లవాడు చెప్పింది ఏమిటంటే “ఆ విశ్వవిద్యాలయంలో చెప్పిన చాలా విషయాలు నాకు తెలిసిన విషయాలనే అనిపించాయి, కాకపోతేఅక్కడ అధ్యాపకులు వాటిని మరింత విస్తృతంగా విశ్లేషణాత్మకంగా చెప్పారు అంతే తేడా. అయితే అవన్నీ ఎక్కడ ఇంతకుముందే తెలుసుకున్నానూ అంటే చందమామ కథల్లో” అని చెప్పాడు.
అంటే చందమామ కథలు ఎంత విలువైన కథలో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మీరు మీ పుస్తక పఠనాన్ని చందమామ కథల తో మొదలు పెడితే సులువుగా ముందుకెళ్తుంది. అయితే అక్కడే ఆగిపోకుండా మరింత ముందుకు వెళ్ళటానికి మీ అధ్యాపకులను అడిగి, మీ లైబ్రరీకి వెళ్లి అక్కడి ఉద్యోగులను అడిగి మీకు అనువుగా ఉండే పుస్తకాలు సంపాదించుకోవడం, చదవడం రోజువారీ కార్యక్రమంగా మొదలుపెట్టాలి.
గొప్ప రచయితలు రాసిన పుస్తకాలు కొన్ని మొదలు పెట్టడమే మనకు తెలుస్తుంది. మనకు తెలియకుండానే అవి మనని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అలాంటి పుస్తకాలు మీరు అడిగి తెలుసుకోండి.
మీకు ఒక ఉదాహరణ చెప్తాను. విభూతి భూషణ్ బెనర్జీ అని ఒకాయన బెంగాలీ భాషలో గొప్ప నవలలు రాశారు. ఆయన రాసిన పథేర్ పాంచాలి అనే నవలను సత్యజిత్ రాయ్ అనే ఆయన మూడు భాగాలుగా సినిమా తీశాడు. వాటికి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో పుస్తకాలు ఇలా ఉంటాయా, సినిమాలు ఇలా ఉంటాయా అని దిగ్భ్రాంతి తో చూసేయి.
ఆ విభూతి భూషణ్ బెనర్జీ రాసిన మరొక నవల చంద్రగిరి శిఖరం. ఇది వంద పేజీలు కూడా లేని చిన్న నవల. దీనిని నేను మొదటిసారి చదివినప్పుడు పక్కన పెట్టకుండా రెండు గంటల్లో చదివేశా. తర్వాత నవల అదే ఇరవై కాపీలు కొని ఒక మంచి సందర్భంలో ఆసక్తి ఉన్నవాళ్లందరికీ పంచిపెట్టాను.
ఈ పుస్తకం అనుకోకుండా అక్కడి నుంచి పుస్తకాలు చదివే అలవాటు పెద్దగా లేని ఒక అమ్మాయి చేతికి వెళ్లింది. ఆ అమ్మాయి అలా దాచిపెట్టి ఒకనాడు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తూ రైల్లో ఏమీ తోచక హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టింది. ఒక రెండు గంటల్లో పుస్తకం చదివేసింది. తనే ఆశ్చర్యపోయిందిట. ఈ విషయం నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పింది. “నేను ఎప్పుడూ ఏ పుస్తకమూ పూర్తిగా చదవలేదు. ఇంత తొందరగానూ చదవలేదు. కానీ పుస్తకం మొదలుపెట్టడం ఏమిటి ఆపలేకపోయాను. పుస్తకాలు చదువుకుంటే ఇంత బాగుంటుందని నాకు ఇవాళే తెలిసింది. ఇది చదవకముందు ఉన్న నాకు, చదివాక నాలోను ఆశ్చర్యంగా మార్పు కనిపించింది.” అని చెప్పింది.
అంటే ఒక మంచి పుస్తకం చదవక ముందు ఉన్న మనం చదివేక ఎలా మారుతామో ఆ అమ్మాయి చెప్పినప్పుడు మనం ఎలా కాదంటాం.
ఇలా పుస్తకాల దగ్గరికి మనంతట మనమే శ్రద్ధగా వెళ్లాలి. అక్కడి నుంచి మనకు ఎంతో విలువైనవి ఏవో దొరుకుతాయని నమ్మకంతో వెళ్ళాలి. అలా వెళ్తే నిజంగా దొరికి తీరుతాయి. ఇది చెప్పడానికే నేను మీ దగ్గరికి వచ్చాను.
ఇక పుస్తకాలు ఎందుకు చదవాలి అన్న ప్రశ్న ఒకటి ఉంది.
దానికి రెండు, మూడు సమాధానాలు చెప్తాను. ఒకటి ఏంటంటే మన చిన్న జీవితంలో మనకు ఉండే అనుభవాలు చాలా కొద్ది మాత్రమే. మన ఊరు, మన ఇల్లు, మన కళాశాల, మన దైనందిన జీవితం, మన బంధుమిత్రులు, వీరితో ఏర్పడిన కొన్ని అనుబంధాలు, ఇంత మాత్రమే.
ఇంతకంటే పెద్ద ప్రపంచం గురించి కానీ, ఎంతోమంది వ్యక్తుల గురించి గానీ, ఎన్నో స్వభావాలు గురించి కానీ, ఎన్నో సంఘటనల గురించి గానీ మనకు తెలియదు. ఇవన్నీ తెలియడం కేవలం పరిజ్ఞానం అవుతుంది. లేదా సమాచార సేకరణ అవుతుంది.
కానీ వీటన్నింటి కన్నా అనుభవం గొప్పది. ఏదైనా సరే మన అనుభవంలోకి వచ్చిందే మనకు నిజమైన పాఠం అంతేకాక మన అనుభవం మనకు జ్ఞానంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది. అలాంటప్పుడు మనకున్న పరిమితమైన అనుభవాలు ఎలా సరిపోతాయి. ఎందరో అనుభవాలు, ఎన్నో అనుభవాలు మనకు ఎలా సొంతం అవుతాయి.
అది పుస్తకాల వల్ల జరుగుతుంది. పుస్తకాల్లో కథల్లో ఉన్న పాత్రలు అవి చదువుతున్నంత సేపు మనని ఆవహిస్తాయి. వాళ్ళ కష్టాన్ని గాని, సుఖాన్ని గాని మనదిగా మనం అనుభూతి చెంది దానికి మనం స్పందిస్తాం. ఆ పాత్ర కష్టంలో ఉంటే బయటపడేదాకా ఆందోళన పడతాం. బయట పడిన తర్వాత మనమే బయటపడినట్టుగా స్థిమితపడతాం. ఇలా కాల్పనికి సాహిత్యం మనకు అసంఖ్యాకమైన అనుభవాలను ఇస్తుంది. దాని ద్వారా మనం మన స్పందించే శక్తిని పెంచుకోగలుగుతాం.
దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే మన చుట్టూ ఉన్న మనుషులందరికీ మనం దగ్గరవుతాం. ఆత్మీయలమవుతాం. మన ప్రపంచం చాలా పెద్దది అవుతుంది. ఇందులో ఒంటరితనానికి చోటు ఉండదు. ఈ పని పుస్తకాలు చేస్తాయి.
ఇక పుస్తకాలు ఇంకా ఏం చేస్తాయి అంటే మనకు ఎంతో ప్రియమైన వారిలాగా మన పక్కన కూర్చుని మనకి ఇష్టం కలిగేలాగా మన సమస్యల్ని పరిష్కరిస్తాయి. మనకి మంచి చెడు తెలుసుకునే శక్తినిస్తాయి. ఈ పని వేదాలు, పురాణాలు, శాస్త్రాలు కూడా చేసేయి. కానీ వేదాలు అధికారులుగా అజ్ఞాపిస్తాయి. నువ్వు ఇలాగే ఉండాలి అని. పురాణాలు స్నేహితుడి లాగా మంచి చెప్పి ఊరుకుంటాయి. కానీ కావ్యాలు అంటే కథలు ప్రియురాలు లాగా లేదా ప్రియుడిలాగా చాలా ప్రేమగా నోటికి ఇష్టమైన ఆహారం అందించినంత ప్రేమగా చక్కగా మనకు అవసరమైనవి చెప్తాయి.
అసలు పుస్తకాలు ఏమేం చేస్తాయో నా అనుభవం చెప్తాను.
నేను దాదాపు 55 ఏళ్లుగా మంచి పుస్తకాలు ఏరుకుని చదువుకుంటూనే ఉన్నాను. అవి నన్ను చాలాసార్లు నాకు అర్థం కాని సమస్యలను విప్పి చెప్పేయి. కొన్నిసార్లు నాలుగు రోడ్ల కూడలి లాంటి జీవిత ప్రయాణంలో నిలబడి ఏ దారిలో వెళ్లాలో తెలియనప్పుడు దారి చూపించేయి. అలసిపోయి ఇక ఈ పని నా వల్ల కాదు అనుకున్న సందర్భంలో తిరిగి కొత్త శక్తిని ఇచ్చాయి. అలాంటి వాటిలోఒక పుస్తకం గురించి చెప్తాను.
ఆ పుస్తకం పేరు ‘అతడు అడవిని జయించాడు’. ఈ పుస్తకం కేశవరెడ్డి అనే ఒక రచయిత రాశాడు. మీకు ఈ పుస్తకం కథంతా చెప్పను. సూక్ష్మంగా చెప్తాను. ఒక బీదవాడైన ముసలివాడు, పందులను పెంచుకుని, వాటితోటే జీవితం గడుపుకునేవాడు.
కథ ఇలా మొదలవుతుంది “సాయంకాలం అయ్యింది ఆ ముసలివాడు జ్వరంతో ఉన్నాడు” అని. ఇక్కడ సాయంకాలంఅన్నదీ, అతను ముసలివాడు అన్నదీ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇంకా జ్వరం తో ఉన్నాడు.
ఇతను పెంచే పంది కడుపుతో ఉంది. అది అడవికి పోయి ఇంటికి ఇంకా ఇంటికి రాలేదు. దాన్ని వెతుక్కుంటూ ఆ సాయంత్రం అతను అడవికి బయలుదేరాడు.అదే వస్తుంది లే అని మునగదీసుకుని పడుకోలేదు. అడవి లోపలికి వెళ్లేసరికి చీకటి పడింది. అక్కడ ఓ చెట్టు కింద పంది నొప్పులు పడుతోంది. ఇక మరికొంత సేపట్లో పిల్లల్ని పెడుతుంది. ఈ ముసలివాడు దానికి కాపలా కోసం అని చెప్పి ఎదురుగుండా ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. పంది కాసేపట్లో కూనల్ని పెట్టింది. ముసలివాడు ఇక రాత్రంతా చుట్టుపక్కల ఉండే మృగాలు దగ్గరికి రాకుండా, అవి ఆ పిల్లల్ని ఏమీ చేయకుండా ఉండడం కోసం కాపలా కాస్తూ ఉన్నాడు. ఈనిన పంది ఎవరిని దగ్గరికి రానివ్వదు కానీ పెద్ద మృగాలు వస్తే అదేమీ చేయలేదు. అందువల్ల వాటి బారి నుంచి దానిని రక్షించడానికి కాపలా కాసాడు. తెల్లవారేక దాని పిల్లల్ని తన వెంట తెచ్చిన బుట్టలో ఆకుల మధ్య పదిలంగా ఉంచి ఊళ్ళోకి బయలుదేరాడు, పంది ని కూడా వెంటపెట్టుకుని. ఊరు దరిదాపుల్లో చేరాక ఒక చెరువు పక్కన ఆ బుట్ట దింపి ఆకులు తొలగించి చూసేసరికి బుట్టలో పంది పిల్లలని ఎండకి చచ్చిపోయి ఉన్నాయి. ముసలాడి ప్రాణం ఉసూరుమంది. కానీ ఆ సమయంలో అతను దిగులుతో ఉంటే మరి ముందుకు అడుగు వేయలేడు. కాబట్టి ఇప్పుడు నేను ధైర్యంగా ఉండాలి ఈ ఈనిన పందికి గూడు కట్టి, దీనికి తిండి పెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది, నేను ఇప్పుడు మళ్లీ శక్తి కూడగట్టుకోవాలి అనుకుంటూ పనిలో ప్రవేశించాడు. అని నవల పూర్తి చేస్తాడు రచయిత.
ఈ నవల్లో జ్వరంతో ఉన్న ముసలాడు రాత్రంతా నిద్రపోలేదు. ఆ పంది పిల్లల్ని కాపలా కాసుకుంటూనే ఉన్నాడు. వాటిని మళ్లీ జాగ్రత్తగా నెత్తిమీద పెట్టుకుని ఇంత దాకా తీసుకొచ్చాడు. కానీ అవి దక్కలేదు. దీన్ని మనం అతని తాలూకు విజయం అనాలా ఓటమి అనాలా? విజయమే అనాలి.
అతను ఆ పిల్ల కోసం, వాటి తల్లి కోసం పడిన శ్రమ అంతా కూడా అతని విజయమే. అతను ఆ విజయం నుంచి తిరిగి కొత్త శక్తిని తెచ్చుకున్నాడు.
లేకపోతే దాన్ని ఓటమిగా అనుకుంటే ఇక ఆ తల్లి పంది గురించి కూడా పట్టించుకోకుండా, జ్వరం వల్ల, అలసట వల్ల పడిపోయి ఉండేవాడు. కానీ అలా చేయకుండా తిరిగి మళ్ళీ కొత్త పనిలో ప్రవేశించటం అతని విజయం.
ఈ కథ ‘నేను ఇక ఈ పని చెయ్యలేను నావల్ల కాదు’ అనుకున్న ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటాను. అక్కడ ఆగిపోకుండా ముందుకు వెళుతూ ఉంటాను. ఇది ఎలాంటి కథో మీకు తెలిసింది కదా
మంచి పుస్తకం మనకు ఎలాంటి శక్తిని ఇస్తుందో నా అనుభవనం లోంచి మీకు ఉదాహరణగా చెప్పేను.
ఇలాంటి పుస్తకం ఇంకొక అనుభవాన్ని కూడా ఇస్తుంది. మనం ఇలాంటి అడవుల్లోకి వెళ్ళగలమా? బహుశా కుదరదు. కానీ ఆ పుస్తకం చదువుతున్నంక సేపూ ఒక దట్టమైన అడవిలోకి మనం వెళ్తున్నట్టే ఉంటుంది. పైగా రాత్రిపూట, చీకటి. చీకట్లో అడవి కనిపించదు. కానీ వినిపిస్తుంది. రకరకాల పక్షుల జంతువుల కూతలు, అరుపులు. ఇక తెల్లవార్లూ ఆ ముసలివాడి వెంట ఆ చెట్టు మీద మనం కూడా కూర్చుని ఉంటాం. ఇలాంటి ఒక అనుభవాన్ని మనకు ఈ పుస్తకం ఇస్తుంది.
అంటే మన జీవితంలో మనం పొందడానికి కుదరని గొప్ప అనుభవాలు ఇలా పుస్తకాల ద్వారా పొందొచ్చు.
జీవితంలో అన్నింటికంటే కూడా అనుభవం గొప్పది అని ఇందాక చెప్పాను కదా. అలాంటి అనుభవాన్ని పొందిన అనుభూతిని ఇలాంటి పుస్తకాలు ఇస్తాయి.
ఇలాంటిదే మరొక కథ చెప్తాను. ఇది ఒకప్పుడు డిగ్రీ విద్యార్థులకు పాఠ్యభాగంగా ఉండేది. పిల్లలకు ఈ కథ నేను చాలా సార్లు చెప్పాను అన్నిసార్లూ ప్రతీ సంవత్సరం పిల్లలు మారుతున్నా అందరూ కూడా ఒకేలా స్పందించేవారు.
ఆ కథ పేరు ‘ఆకలి’ కొలకలూరి ఇనాక్ అనే రచయిత రాశారు. ఈ కథ గురించి కూడా సూక్ష్మంగా చెప్తాను. ఒక చిన్న పట్టణంలో మెయిన్ రోడ్డు, దానికి అటూ ఇటూ ఊరు విడిపోయి ఉంటుంది. అటున్న ఊర్లో మేడలు మిద్దెలు ఉంటే, ఇటు ఉన్న ఊర్లో కేవలం పూరిపాకలే ఉన్నాయి. ఇక్కడున్న ఒక పూరి పాకలో చిట్టి అనే ఒక పిల్ల, తమ్ముడు ఉన్నారు. వాళ్ళ నాన్న తాగుబోతు. వాళ్ళ అమ్మే కష్టపడి వాళ్ళకి తిండి పెట్టాలి. చాలాసార్లు పస్తులతో ఉంటారు ఈ పిల్లలు. ఒక్కొక్కసారి రోడ్డు దాటి అటువైపు వెళ్లి అక్కడ ఆడుకునే పిల్లలు ఏమైనా పెడితే తిందామని చూస్తారు. కానీ చాలా సార్లు వాళ్ళ కోరిక తీరదు. అలా రోడ్డుకి ఇటుఅటూ తిరగడంలో ఒకసారి చిట్టి ఓ లారీ కింద పడుతుంది. వెంటనే లారీ డ్రైవర్ దాన్ని బయటికి తీసి దానికి కాలు విరగడం చూసి ఇంటికి తీసుకొచ్చి, వైద్యం చేయించి, ఒక ఆరు నెలల పాటు గ్రాసం ఏర్పాటు చేస్తాడు. వచ్చినప్పుడల్లా పిల్లలకు రకరకాల చిరుతిళ్లు పట్టుకొస్తాడు. ఆరు నెలల తర్వాత చిట్టి ఆరోగ్యంగా చక్కగా తయారైతే తన బాధ్యత తీరిందివఅని రావడం మానేస్తాడు. చిట్టికి, తమ్ముడికి తిరిగి మామూలుగా పస్తులే మిగిలాయి.
చిట్టి మళ్లీ రోడ్డుకి అటు ఇటు తిరగడం మొదలుపెడుతుంది, మరోసారి లారీ కింద పడితే తిండి దొరుకుతుందని ఆశపడి. అలా తిరుగుతూ డ్రైవర్లతో తిట్లు తింటూ ఉంటుంది. చివరికి ఒకనాడు లారీ కింద పడి చచ్చిపోతుంది.
ఈ కథ పిల్లల్లో ఎలాంటి మార్పు తెచ్చిందీ అంటే తినే పదార్థాలు ఏవి కూడా పారేయమని, అలాగే తినేవి పేదవారితో పంచుకుంటామనీ, వాటి విలువ ఎంత ముఖ్యమైందో అర్థమైంది అని వాళ్లే చెప్పారు. ఇంచుమించుగా పిల్లలు ఈ కథ విని కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. నిజంగా ఆకలి అంటే మనకి ఏం తెలుసు? సమయం ఒక గంట దాటితే ఆకలి అనుకుంటాం. ఒకరోజు తిండి దొరక్కపోతే ఆకలి తాలూకు కష్టం తెలుస్తుంది. కానీ ఆకలి బాధ తెలియదు కదా. వరుసగా రెండు మూడు రోజులు తిండి లేకపోతే, నీళ్లు తాగి ఉండాల్సి వస్తే ఆ ఆకలి బాధ ఏంటో అర్థం అవుతుంది. కానీ ఈ ఆకలి బాధ రచయిత ఒక కథలోంచి మన అనుభవంలోకి తెస్తాడు. ఇలా కథలు మనకు తెలియని అనుభవాన్ని ఇస్తాయి అందుకని మనం పుస్తకాలు చదవాలి.
పుస్తకం మిత్రుడే కాదు. ప్రియుడు, ప్రియురాలూ కూడా.
*
Add comment