యార్లగడ్డ రాఘవేంద్ర రావు నిన్న మొన్నటి కవి కాదు. అనుభవశాలి. 1991 నుండీ ఇప్పటి ఈ పచ్చి కడుపు వాసన (2021) వరకూ ఆరు కవితా సంపుటులు ప్రచురించిన కవి. ముప్పై ఏళ్ళగా కవిత్వం రాస్తున్న కవిని పాఠక లోకం ఆదరించకుండా ఇన్ని పుస్తకాలు వేయడం సులభం కాదు. అతన్ని ఇలా అక్కున చేర్చుకోవడానికి కారణం, అతని అలవాటైన కవితా వాక్యమా ? సహజంగా మనకి ఎవ్వరి కవిత్వం పట్లైనా ఉండే వ్యామోహమా ? చాలా వరకూ అప్పటిదాకా అతను / ఆమె రాసిన కవిత్వ రూపసారాల పట్ల కొంత అభిప్రాయం ఏర్పరుచుకోవడం చేత ఒక మొగ్గు ఏర్పడుతుంది. దానివల్ల ఇతను ఈసారి ఎలా రాశాడు, ఏం కొత్తగా రాశాడన్న కుతూహలం ఏర్పడుతుంది. అందుకీ కవీ మినహాయింపు కాదు. తన కవిత్వం వైపుకి మనల్ని చాలా సునాయసంగా మళ్ళిస్తాడు. దేంతో ? భావావేశ పూరితమైన, ఉద్విగ్న, ఉద్వేగాత్మకమైన కవిత్వ వాక్యాల చేత. అవీ పరమ వాస్తవికత ప్రతిఫలించడం చేత. “మనిషి కింత, మనసు కింత గంధం పూసిన దాన్ని, అసలు కాలం మీద కొడిగట్టని గండదీపంలా నేనెంత దర్పం పోయినదాన్ని” లాంటి చక్కటి చిన్న చిన్న చిక్కటి వాక్యాలు రాయగలిగీ, పేజీల కొద్దీ పెద్ద పెద్ద కవితలు రాయడం చేత. వెరసి; ఎంతో భావనాత్మకంగా చెప్పినట్టు మాయ చేసినా; అంతకు మించిన జీవన సారాంశానికి మనల్ని దగ్గర చేయగల వస్తు నిర్వహణ చేత. ఇన్ని కారణాల చేత రాఘవేంద్ర రావు గారు తన కవిత్వం వైపుకి మనల్ని ఆకర్షిస్తారు.
రాఘవేంద్ర రావు జీవితంలోని బహు సున్నితమైన పార్శ్వాలను కవిత్వీకరిస్తారు. అతని మునిమాపు (2005) చూడండి; వృద్దాప్యం ఇతివృత్తంగా మనల్ని కదిలించే వాక్యాలెన్నో ఉన్నాయందులో. అలాగే ముంతపొగ (2001), ప్రపంచీకరణ మాయాజాలంలో రైతు దుస్థితి గురించిన కవిత్వం. ఏ కవైనా సున్నితమైన ఆలోచనలనే కవిత్వం చేస్తాడు కదా ఈతని గొప్పతనం ఏమిటీ ? అనుకున్నప్పుడు , ఈ కవి రాసిన వచనం గానీ కవిత్వం గానీ ఏది చదివినా మనల్ని మెలిపెట్టే మెత్తదనం ఒకటుంటుంది. శ్మశానం గురించి సత్య హర్శ్చంద్ర నాటకంలోని కాటి సీనును మరిపించేలా, జాషువా శ్మశానవాటిక కవితని దాటి వచ్చేలా రాసిన ‘నాకూ శెలవు కావాలి’; మోహన్ గురించిన ‘బొమ్మల చెట్టు’; నాన్న లేని కాళ్ళు, నాకిక్కడేం బాగోలేదురా లాంటి కవితలూ; ఇవన్నీ చదివితే ఈ కవి మనల్నెందుకింద ‘ఎమోషనైలేజషన్’ కి గురిచేస్తున్నాడూ అన్న కోపం వస్తుంది. ఆ కోపం జీవన మలుపుల్లో మనల్ని తడిపే నదీ ప్రవాహం మీద కలిగే కోపం. తడిచిపోయామే అన్న సంభ్రమలోంచి తడుస్తూనే ఉండిపోవాలన్న తాదాత్మ్యత వల్ల కలిగిన కోపం. ఇతను నొప్పి పెట్టించడాన్ని ఇష్టపడే సాంకేతికత విద్య తెలిసిన కవి. బహు ప్రమాదకారి కూడా సుమా.
ఎందుకంటే కవిత్వ వస్తువులు ‘తత్కాలీన’ లక్షణం లేకుండా చిరస్థాయిగా నొప్పెడతాయి. ‘ఒక కాలాన్నలా గుక్కపట్టనీయండి, ఒక కాలాన్నలా ఎవరో పారేసిన పసికందులా ప్రాణాలార్చుకోనివ్వండి’ (కాలసూక్తం); ‘రుచులు పోయిన సందర్భాల మీద ఇప్పుడే పలకరింత వాలుతోంది’ (తల నరుక్కున్న సూరీడు) ‘ఇప్పుడు కూడా కలలు అడవిలా వీయాలి’ (ఇంద్రావతి స్వగతం) ‘నీలాంటి నాన్న వాళ్ళకూ కావాలి వాళ్ళ కోసం కాసిన్ని కౌగిళ్ళను చెక్కే ఇంద్రచాపాల్ని మరి కాసిన్ని లాలనల్ని, సంగీతాల్ని పూచే బతుకు తుంపరల్ని’ (నాన్న లేని వాళ్ళు); ఉత్తరాల గొప్పతనాన్ని, పోస్టుమేన్ని గుర్తుచేసే ఒక్క పోస్ట్ చేయండి ప్లీజ్ లాంటి వాక్యాల వెనుక వున్న కళాత్మక అభివ్యక్తికి వేదన పడుతున్న కవి ఆవేశం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. The content of work is the artistic reflection through images of specific phenomena from the real world, aesthetically interpreted and evaluated by the artist(Foundations of Marxist Aesthetics-Avner Zis) రాఘవేంద్ర రావు కవిత్వంలోని కళాత్మకత గురించి ఎంత చెప్పినా తక్కువవుతుంది గానీ, కవిత్వేతివృత్తం పాఠకుడిలో సుడిగుండాలు రేపుతుంది. అతని కవిత్వ వ్యక్తీకరణ రూపం వెనుక కుటుంబమూ-సమాజమూ వేరువేరు కాదని తెలుసుకున్న సంఘర్షణ ఉంటుంది. అందుకే ఇతని కవిత్వంలోని నొప్పి విస్తృతి గలిగినదిగా మనచే ప్రశంసలు పొందుతుంది. ఏడిపించేవాణ్ణి ప్రేమించడమేమిటి ? కాదా ? ఆత్రేయని, కలేకూరిని, చెరబండరాజుని, ఆశారాజుని, రేవతీదేవిని ఇలా ఒకరేమిటి ? వీళ్ళందరి కవిత్వంలోని ‘సంస్పర్శల్ని’ తేలిగ్గా తీసుకోలేము. మనిషి సమాజానికెలా అతుక్కుని ఉంటాడో తెలిపే కవితలు రాయడం దానికదే ఒక ప్రతేకమైనది.
రాఘవేంద్ర రావు శిల్పరిత్యా అలానే ఉన్నాడు. మారలేదు. భాష పట్ల అతనికున్న మక్కువ కూడా తగ్గలేదు. అతను మరింత సులువు కాగలవాడు గానీ, కాలేదు. కాష్టాగారాలూ, లయ నర్తనం, ప్రణవ లయలు, మంత్రబీజాలు ఇంకా చాలా పదాలు వాడకుండా బాగుణ్ణనిపిస్తాయి. కాలాన్ని వెర్రి వెంగళప్ప అనడం ధైర్యాన్నిస్తుంది గానీ ‘కాలం’ లాంటి పదాల పునరుక్తి ఇబ్బంది పెడుతుంది. అది లెక్కవేయడానికీ ఉత్సాహం వేయలేదు. నీటి కోక చిలుక, నిప్పుల గూళ్ళు, చనుబాలజున్ను, లాంటి కొత్త కొత్త ప్రతీకలు మాత్రం ఎంతో బాగున్నాయనిపిస్తుంది. కవికున్న భావనాబలం మహత్తరమైనది. కొంత నిలవనీటి చందం ఉన్నా, మనసు పడవలోంచి మనమతన్ని దించేయలేమని మాబాగా తెలిసిన కవి రాఘవేంద్ర రావు.
పాఠకులుగా అతని కవిత్వం మనకి సిరిముత్యాల్నిచ్చిందో, మౌన భంగం జరిగిందో, చలికి వొణికామో, కాసిన్ని ఊపిరి మెతుకులు ముట్టుకున్నామో లేదో; మీ శ్వాసల చప్పుడు కోసం దోసిలి పట్టుకుని ఉన్నాను – అని మహా వినమ్రంగా అడుగుతాడు గానీ, ఈ కవిత్వ పుస్తకం ఒక పరిణితిని సూచిస్తుంది. అది విడిపోయిన తెలుగు రాష్ట్రాల్ని, మూగదైన తెలుగు భాషని, పాపికొండల్ని, దూరాన ఉన్న పిల్లల కోసం ఫ్రీజర్ బాక్సులో, మార్చురీలో (దేహాల బంధికానా) ఘనీభవించిన స్పర్శల్ని గుర్తుకుతెస్తుంది. సౌభాగ్య గారితన్ని ‘గంభీర భావుకుడన్న’ మాటనిజం. ఈ గంభీరత కరిగిపోయే ముందున్న మంచు గడ్డ. ఆశావహాన్నీ, అపనమ్మకాన్నీ రెండింటినీ సమదృష్టితో చూడగల వ్యక్తి ఈ కవి. జీవితంలోని విరోధాభాసని ఒడిసిపట్టుకున్నారు యార్లగడ్డ.
తన ప్రాధమిక మూలాల్ని అలానే పట్టి ఉంచుకున్న పుట్టమన్ను లాంటి ఈ కవిత్వంలో దృక్పధం దృష్ట్యా గంగవెర్రులెత్తిందీ లేదూ, జారిపోయింది లేదు. జండాలాగే ఉండు, నన్నూ బతకనివ్వు, నేను కశ్మీరీని లాంటి కవితలు కవిగా తన రాజకీయ అవగాహనకి చిత్రిక పడతాయి. తన ముద్రకోసం, ఉనికి కోసం ప్రకృతితో సామరస్య సహజీవనం కొనసాగిస్తున్నాడీ కవి. ప్రజాస్వామిక తాత్విక నిశ్చలత ఉంది. సంప్రదాయ కవితా వాక్యానికీ నవ్య కవిత్వ అభివ్యక్తికీ గల వస్తుగత పునాదిరాళ్ళ లోతుపై అవగాహన ఉండీ; సగం వాక్యంగా మిగిలి ఉండటంలో తీరని అవసరం ఉందన్న సాహసి. అతని ప్రతి జీవితానుభవాన్నీ కవిత్వ రూపంలో అధ్యయనం చేసేందుకు ఈ ‘పచ్చి కడుపు వాసన’ ఉపకరిస్తుంది. ఎక్కడో మార్క్స్ గురించి టీఎమ్మెస్ “ప్రకృతివాద పరిమితుల్ని దాటి వ్యక్తిలోని సామాజిక అంశాన్ని మార్క్స్ దర్శించాడు” అంటాడు. ఆ ప్రయత్నం యార్లగడ్డ రాఘవేంద్ర రావు గారి కవిత్వంలోని ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది. (పచ్చి కడుపు వాసన పుస్తకానికి ఈ యేటి ప్రతిష్టాత్మక ‘ఉమ్మడిసెట్టి సత్యాదేవి’ సాహిత్య పురస్కారం ప్రకటించారు. అనంతపురంలో ఈరోజే సభ. కవికి అభినందనలు. పుస్తకం ధర 125/- ప్రతులకు +91 77309 21820 ను సంప్రదించండి)
*
అన్న…కవిని, కవిత్వంలో కవి దృష్టిని…సుస్పష్టంగా చెప్పడంలోనూ..
సూటిగా మాట్లాడటంలోనూ మీకు మీరే సాటి అనిపించేలా ఉన్నాయి ఇటీవల మీ వ్యాసాలు..
అందుకు తాజా ఉదాహరణ ఈ వ్యాసం..
మీ వ్యాసం ఆసక్తిగా , మనసుపెట్టి చదువించింది….మీకూ కవికి శుభాకాంక్షలు..
కవిత్వ విశ్లేషణ చాలా గొప్పగా వుంది అభినందనలు శ్రీరామ్ గారూ💐💐💐
విశ్లేషణ బావుంది
కవి వాక్యాలు అంతర్లీనంగా సాధించే సంవేదన మీ వ్యాసం తో స్పష్టమైన రూపు కడుతుంది.అదే మీ ప్రత్యేకత.గొప్ప వ్యాసం.
జయహో కవిత్వం 🙏👌👌
కవి సున్నితమైన వాక్యాల గురించి ,ఇన్నేండ్లుగ కవిత్వం రాయడం వెనుక రహస్యం గురించి ఉద్వేగంతో చదివించారు సార్.
మంచి కవి పరిచయం. శ్రీరామ్ మీకు రాఘవేంద్ర గారికీ ఇద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు.
“మనిషి కింత, మనసు కింత గంధం పూసిన దాన్ని, అసలు కాలం మీద కొడిగట్టని గండదీపంలా నేనెంత దర్పం పోయినదాన్ని”
ఇలాంటి చాలా చక్కని వాక్యాలు అనేకం ఆకట్టుకునేలా ఉన్నాయ్..
కవి దివా రాత్రాలు మధనపడి మండించిన కవిత్వ దీపాన్ని,తన అక్షర చమురుతో మరింత తేజోవంతం చేసే రసవిద్య తెలిసిన రాతగాడు శ్రీరాం.కవి ఊహా పరిధిని దాటి మరీ విస్తరిస్తాడు..విశ్లేషిస్తాడు.శ్రీరాం గారి సూక్ష్మ పరిశీలనతో పాఠకులు కొత్త కవిత్వ అనుభూతిని ఆస్వాదిస్తారు. అభినందనలు శ్రీరాం గారు.