పుచ్చలపుర చరిత్ర

సంప్రదాయము మాది సాంబారు పొడికాదు!

విక్రం సేథ్ రాసిన పొలిటికల్ సెటైర్లన్నీ కాల, స్థల నిబంధనకు అతీతంగా అన్ని సమాజాలనూ ఎండగాడతాయి. ది టేల్ ఆఫ్ మెలన్ సిటీ కూడా అలాంటిదే. మ్యాంగో కింగ్డం, బనానా కంట్రీ అనే పదాలకు ధీటుగా రాసిన ఈ పుచ్చకాయ నగర ఇతివృత్తాన్ని చారిత్రక నేపధ్యంలో, కాస్త ఆర్కైక్ రుచితో వడ్డించాడు. వర్తమాన భారత ఉపఖండ పరిస్థితులకు అద్దం పట్టే ఈ పద్యాన్ని నాకు తెలిసినంత పౌరాణిక / గ్రాంధిక బాణీలో అనువదించడానికి ప్రయత్నించాను.  

 

పుచ్చలపుర చరిత్ర

———————-

అనగనగా అచటనుండె

పుచ్చలపురపు రాజొకండు

పరిశుద్దుడు స్థిర చుత్తుడని

కొలిచెను తన ప్రజలందరు

 

నగరి జనుల ముదమొప్పగ

నడిబొడ్డున నిలబెట్టుడి

రాజకీర్తి నగిషీలతో

విజయ తోరణమొకటియని

ఫర్మానా ప్రకటించెను

హుజూర్ జంగ్ బహద్దూర్

 

రాజు తలచిన దెబ్బలకు కొదవా

సేవకుడు నడుము వంచిన

పూర్తి కాని పని కలదా

 

మలిదినాన పుచ్చల పురాన

పొద్దు పొడిచెను విజయ తోరణ శిఖరాన

రాజు వెడలె రవితేజములలరగ

ఖిన్నుడయ్యే కిరీటము నేల రాలగ

 

శిరమును తాకె కురచ తోరణ కమాను

మరణ దండన తప్పదనెను రాజు భవనశిల్పికి

 

వురికంబము పురి పగ్గములు

సిద్దమాయె సద్దు చేయక

మెడపట్టి ఈడ్చబడెను

వధ్యశిల కడకు భవనశిల్పి

 

‘వినుము రాజా నా మనవి

తడవు చేసిన తనువు చాలింతు

దోసము చేసినది నిజముగ

దొరవారి పనివారలు ‘

అని చాటెను ఎలుగెత్తి

బలికి కొనిపోబడుచున్న ధనిక బడుగు

 

జాగు సేయుడని ఆనతిచ్చి

కూలి వాడ్ర మెడకు చుట్టే

మరణ శాసనమును

అతిశయమొప్పగ అనుమతించె

భవనశిల్పి దీర్ఘాయుషును

 

నిర్ఘాంత పోయిన ఆ నిమ్నసేవకులు

విన్నవించుకొనిరి కన్నీటి ప్రార్ధన

 

‘ఘనత వహించిన ధరణిపతీ

కురచ ఇటుకల కిటుకు మరువకు సుమీ’

అని మర్మము తెలిపిన మరునిమిషమే

బేల్దారి గుంపును పిలువనంపె

 

మరణ జ్వర పీడితులై వారు

కురచ ఇటుకలు తెమ్మని చెప్పిన

దురిత పాత్రుడు నిజముగ

నగర రూపకర్తయనిరి

 

తడవు సేయక నృపుడు

నగర శిల్పిని గాంచి

‘రాచ యానతిని మోయు

గారవము నిచ్చితిని నీకు

మారు పలుకకుండ

అమర లోకమునకు పొమ్ము ‘ అనెను

 

దిక్కు తోచని నగరశిల్పి

మ్రొక్కి చేసెను చివరి మనవి

‘నిక్కము మీరన్నది

నిర్మాణ పధకము నాదే

పెక్కు మార్పులు చేసిన

అధికర్ముడు మాత్రమ తమరే’

 

ఆలకించిన రేడు అదిరిపడెను

మ్రానునెక్కెడి శిరము తనదని ఎరిగి

నిష్పక్షపాతమే ప్రాణసంకటమవ్వగ

తరుణోపాయమునకై పరిపరి వెదకెను

 

టక్కరి చిక్కు సుమీ ఇది మిక్కిలి జటిలము

సూక్ష్మబుద్ధి ఒకడిని తక్షణము తెండని పలికె

వేగులు వెళ్ళితిమని చెప్పిరి భూదిగంతముల వరకు

వూరి చివర కూలిన భవంతినుండి తెచ్చిరి

బోసి ముఖపు ముదుసలి ఒకడిని

మోసికొనుచూ  నులక మంచము పైన

 

మసక కండ్లవాడు మసలు మరచెను కాళ్ళు

పీల స్వరమును పెగల్చి తీర్పునిచ్చె

 

మరణపాత్రుడు ద్రోహి సందేహము వలదు

రాజ మకుటము పడద్రోయ సాహస మెట్లొచ్చె

తాపు చేసినది ప్రభువుకు తోరణమ్ము

హేతువు రూఢి అయినది యమపాశమె తగును

 

గజములు హయములు కలిసి ఇగ్గుకొచ్చె

మరణదండనకై ఆ మహా తోరణమును

 

‘ప్రభువు శిరమును తాకి పరిశుద్ద పడినట్టి

కుడ్యమును చంప పాడికాదు ‘

అనెనొకండు అమాత్యుడగుటచే

భజన చేయుట తప్ప వేరొక బాధ్యత లేదాయె

 

నిజము చెప్పితివనెను రాజు

ముదమార ఆతని భక్తిని చూసి

అదుపు తప్పిన జనులు అడిగె

వురిని వీక్షించెడు యొక శుభఘడియ ఎపుడని

 

అలజడి గ్రహించిన రాజు ఆలశ్యము చేయక

జనాగ్రహమునుండి గద్దెను తప్పింపదలచె

 

‘పాప పుణ్యములూ, దోష పరిశుద్దతలు

సమయమున్నది దీనికి సవివరముగ చర్చింప

జాగు చేయక ఇచ్చెదము జాతి కోరిన బహుమానము

నగరపౌరుల కోరిక తీర్చుటయే నరేశుని కర్తవ్యము

తర్క వితర్కములను మాని తక్షణమే అమలు చేయుదము

కుత్తుకనొక్కటి వెదకుడి కూడలిలో వ్రేలాడను

వేడుక తిలకించి ప్రజలు తరలెదరు వీడులకు

 

ఘనుని ఆనతి గైకొని నిలిపిరి

ఘనమగు ఎత్తున వురిని

పురజనులందరు రాగ

తరచి చూసిరి ప్రతి ఒక్కరిని

విధిని నమ్ముడి జనులార అరుదుగానైన

దురదలన్నిటి తీర్చు దరువు వేయున్

 

ఒకనికి కురచనాయె ఎత్తాయె మరియొకనికి

రాజు మెడకు మాత్రము రంజుగా సరిపోయే

 

రాజానతి మేరకు వ్రేలాడెను శిరము

రాజు అమరుడాయె ఆజ్ఞ అమలాయె

 

భగవదాశీర్వాదమిది పీక దొరికెను వురికి

సింగాదనము వణికెడిది అట్లు కాకుండినన్

ధిక్కారము చేసెడివారు కోపిష్టి నగరి వాసులు

పెద్ద అవమానము తప్పె ప్రభువు కిరీటమునకు

 

‘రాజు చిరంజీవి ‘ ఎలుగెత్తి అరిచె మంత్రి

చిరంజీవికి జోహార్లనెను సంతసించిన జనులు

 

మత్తు దిగగ గాంచిరి కాపరి లేని మంద తామని

దేశపుటంచుల వరకు పంపిరి చాటింపు దూతలను

 

‘మలి సూర్యోదయమున తొలి రేకలు విచ్చునప్పుడు

తోరణమును దాటువాడె కారణ జన్ముడు

ఎంచుకొన అర్హుడు తదుపరి కులపతిని

మచి జరుగు వాని నోటి మాటనుబట్టి ‘

 

మనుజు డొకండు దాటె బురుజు ద్వారమును

నిలువుమనిరి బటులు ఆ నాటు వస్త్రధారిని

 

‘ఏలిక పేరు చెప్పక వీసమైనను కదలవు కచ్చితము ‘

‘పుచ్చకాయ ‘ అని పలికె పిచ్చి చూపుల బైతు

 

మాట మీద నిలబడు మోటువాడు అతడు

పుచ్చకాయ తప్ప ఎరుగడు వేరు ప్రపంచంబు

 

గైకొనుము వందనము గోల్ మాల్ రాజా అనుచు

దొర్లించుకు పోయిరి కరపుచ్చ ఫలమును

నిలిపిరతనికి గద్దెపై వందిమాగదుల మధ్యన

చిడతలు చిప్పలు తెచ్చి హారతులిచ్చిరి ముదమున

 

***

పెక్కు వర్షములాయె ఇట్టి అనుభవము జరిగి

ఒక్కడైనను లేడు అసహజమని ఆక్షేపింపగా

 

‘ఖర్బూజము ఎట్లు చేరె మహరాజ స్థానమునకు

వెర్రిపండు మీరాజనిన ఏడ్పురాదా’

తప్పుజారి ఇట్లు ప్రశ్న లడిగినవాడు

తప్పకుండ పొందు తగిన జవాబు

 

‘సంప్రదాయము మాది సాంబారు పొడికాదు

వేల ఏళ్ళుగ వున్నట్టి వేద భూమి ఇది

రాజుకిష్టమైన రాయపుచ్చఫల రూపమదుండ

మచ్చర పడ వజ ఏమి తుచ్ఛ ప్రజకు

 

దేశ శాంతి నందు వేలు పెట్టకనుండి

మేలు చేసెడి రాజు మూగయైన ఏమి

గుమ్మట రూపమే ముద్దు గమ్ముట కూర్చొనుటకు

నెమ్మది కలుగు బ్రతుకుకు నమ్మరె మమ్ము’

 

*

 

ఇండస్ మార్టిన్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మిలన్ సిటి వ్యంగ్యానికి అనువైన మాత్రా ఛందస్సును ఎన్నుకొని తెలుగు చేయటం బాగుంది. స్థలాభావము వల్లనో ఏమో స్టాంజాలుగా(నాలుగు నాలుగు పంక్తులుగా)లేకపోవటం చిన్నలోటే.
    దీర్ఘ కవితను ఎంతో ప్రశంసనీయంగా సంగీత రూపకంగా అందించిన కవికి వందనాలు

  • మీనుండి మళ్ళీ ఓ కొత్త కౌశలం. నడక బావుంది. కథ బావుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు