కాకులన్నీ కరెంటు తీగకు తోరణాలై
నీ పిండం కోసం తొంగి చూస్తుంటే
సగం కాలిన నిన్ను పూడ్చబెట్టాలా కాలబెట్టాలా
ఊరవతలకు విసిరి కొట్టాలా
జనాలు అడుగుతుర్రా
చిన్నా..
నువ్వున్నప్పుడు లేవని నోళ్ళు
ఇప్పుడు నా మీద మీద పడుతుంటే,
చావెందుకు రాదురా సులువుగా
నువ్వేనా వచ్చి తీసుకుపో నీ తోడుగా
బాల క్రిష్ణుడు నా ఇంట పుట్టేనని
శ్రీ రామ రక్షగా నీ కంటి పాపనై కాపాడుతూ వచ్చా
పేగును నాగులా నువ్వు చుట్టుకు పుట్టినా
ఆ కేశవుడే నా ఇంట అడుగిడినాడని మురిసిపోయా
మూలుగు బొక్కల పులుసొండి
ఆదివారాలు నీకు పండగ చేసానురా
పొయ్యిలో కట్టెలేకున్నా
మండుతున్న ఆకలి కడుపుల్తో అన్నమోర్చి పెంచానురా
ముసలి బతుకులకి మూడో కాలుగా
ఆసరావై తోడుంటావనుకుంటే
మసిగా మారిపోయి వస్తావా!
నువ్వు ఒంటి మీద ఏసుకున్న పెట్రోలు
నా ఇంటి మీద ఏసున్నా…
నీతో నేనూ వచ్చేద్దును కదరా ఎర్రి నాగన్న..
అమ్మ లేకుండా ఉండగలవా కన్నా..
వాళ్లంతా మాటల మాయగాల్లు
ఓటర్లను దగాచేసే దొంగ నా కొడుకులు
ఓట్ల పండగప్పుడు మాత్రమే కనిపించే సర్కరోల్లు
వాళ్లంతా ఒకటే అని తెలియకనే
వాడి కోసం నువ్వు సస్తే
నా చావుకు కొరివి పెట్టే చేతులెక్కడని వెతకనురా!
నీలాంటి పీనుగలు తోవంతా ఉన్నా
సక్కదైతాదంటవా ఈ దేశం
నీ వంటి మీదున్న నిప్పు ఆరేలోపు
ఇంకో తప్పు జరగదంటావా!
శ్రీనివాసులు.. శ్రీకాంతులు..
దహించుకుపోయిన పిచ్చి మారాజులు
ఏం ఒరిగిందయ్యా మీకు
మా వంటి పేద తల్లుల కడుపుకోతలు
మీ బలవన్మరణాల వీలునామాలు
నిండు జీవితాల చేదు జ్ఞాపకాలు.
*
nice poem kiran gaaru
Thank you Sushma ❤️
ప్రశ్న దహిస్తుంది
Excellent
హృద్యంగా ఉంది.
కవిత అద్భుతంగా ఉంది కిరణ్. అభినందనలు👏👏💐
Thank you akka ❤️
Peenugula deasham-very impressive. Hearty congratulations to KiranVibhaavari.