పీడితుల ‘ఎద్దు’

అల్లం రాజయ్య అనగానే ఒక మౌఖిక కథకుడు, ఒక ఆదివాసీ కథకుడు, ఒక ఉత్పత్తి సంబంధాల మధ్య పర్చుకున్న అమానవీయతను కథలుగా మలిచిన విప్లవ కథకుడు అనే విశేషణాలతో పాటు 1969 తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడనీ గుర్తుకు వస్తాయి. తొలి దశలో వేల పేజీల నాన్ సీరియస్ సాహిత్యం రాసినా తరువాత కరపత్రాల్ని రాయడంతో మొదలు పెట్టి 1973లో ‘శివసత్తి శక్తి’ కథ నుండి సీరియస్ కథా ప్రస్థానం మొదలు పెట్టారు. ‘ఎదురు తిరిగితే’, మహాదేవుని కల’, ‘మనిషిలోపలి విధ్వంసం’, ‘మధ్యవర్తులు’, ప్రత్యర్థులు’, ‘అతడు’, ‘కుర్చీ’, ‘గురువులు’, ‘నీల’, ‘కమల’ వంటి నిప్పురవ్వల్లాంటి కథల్ని రాయడమే గాక బొగ్గు గనుల జీవితాల్ని చిత్రిస్తూ ‘కార్మిక కథలు’ కూడా రాశారు. వందకు పైబడి కథలేగాక ‘కొలిమంటుకున్నది’, ‘ఊరు’, ‘అగ్ని కణం’, కొమరంభీం’, ‘వసంత గీతం’, ‘టైగర్ జోన్’ (నవలిక – 2016) లాంటి మూల మలుపులనదగ్గ నవలల్ని రాశారు. అంతేగాక మొదటి నుండి తెలంగాణ తెలుగును, తెలంగాణ జీవితాన్ని కథీకరిస్తూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటిన రచయిత కూడా. కొన్ని రోజులు ‘క్రాంతి’ అనే పత్రికను నడిపారు. కరీంనగర్ నుండి వెలువడ్డ ‘విద్యుల్లత’ పత్రిక ప్రారంభానికి కృషి చేసిన వారిలో అల్లం రాజయ్య ఒకరు. 2000 నుండి దొంగదెబ్బ తీస్తున్న మన ఉమ్మడి శత్రువు, ప్రపంచ శత్రువును అంచనా వేయడంలో ఒకింత వెనుకబడ్డ అల్లం రాజయ్య చాలా తక్కువగా రాస్తూ ఎక్కువగా కథా కార్యశాలల్లో, వివిధ సమావేశాల్లో, చర్చా వేదికల్లో కనిపిస్తున్నారు. నగర జీవితంలో పల్లెల్ని స్మరించుకుంటూ ఇటీవల మిద్దె తోటల్ని కూడా పెంచుతూ పర్యావరణ ‘సోయి’ని నలుగురికి పంచుతున్నారు. ప్రజలు ఎప్పుడూ కరెక్టే. వారికి అవసరమైనప్పుడు అనేక ఉద్యమాలు చేపడుతారు అని చెప్పే అల్లం రాజయ్య రాసిన మరో ఉత్పత్తి సంబంధాల ప్రజాకథ ‘ఎద్దు’. ఈ కథ 1978లో ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో మొదట ప్రచురింపబడింది.

తెలంగాణలో అదొక మారు మూల పల్లె. ఆ ఊరికి సర్పంచి యాదగిరి. ఈయనకు పది ఎడ్లున్నాయి. వాటికి ప్రతి రోజూ పల్లి పిండి, ఉలువపప్పు పెడుతూ పెంచుతున్నాడు. అదే ఊర్లో ఓదెలు అనే సామాన్య రైతు కూడా ఉన్నాడు. ఇతనికి ఒక కలుమతోక ఎద్దు ఉంది. ఓసారి ఈ కలుమతోక ఎద్దు సర్పంచి యాదగిరి పదెడ్లను కొమ్ములతో కుమ్మి తరిమి తరిమి కొడుతుంది. ఈ దృశ్యాన్ని చూసిన సర్పంచి యాదగిరికి తలకొట్టేసినట్టు ఆవుతుంది. ఆ కలుమతోకెద్దు అంతటితో ఆగక సర్పంచి యాదగిరి వెంబడి కూడా పడి ఆయన ఒంటి మీది బట్టల్ని చింపుతుంది. ఇది చూసి పాలేర్లు కిస కిస నవ్వుతారు. యాదగిరి అవమానంతో పండ్లు పటపట కొరుక్కుంటూ ఓదెలును పరుషంగా తిడుతాడు.

అప్పటి నుంచి యాదగిరికి ఆ కలుమతోకెద్దు మీదనే కన్ను. ఓసారి ఓదెలును అడుగనే అడిగిండు. కలుమతోకెద్దును తనకు అమ్ముమని. కానీ ఓదెలు అమ్మనంటడు. ఓ రోజు ఎక్కడో ఓదెలు ఒక్కగానొక్క కొడుకు యాదగిరికి కనబడుతాడు. “యాదగిరి పిలగాన్ని గుచ్చి గుచ్చి సూసిండు. కర్రెగ షాగె ముదిరి, సెక్కిన సండ్ర కట్టె తీర్గున్నడు పోరడు. ఎందుకనో పెదవులు పూసున్నయి తెల్లగ. కడుపు నీల్ల కాగోలె పెరుగుతున్నది. కండ్లు తప్ప కండ్లు. కాళ్ళు సన్నబడి పుల్లల తీర్గున్నయ్.” మరో రోజు ఓదెలు బాయికాడ మామిడి చెట్టు ఎండి పోయి కనిపిస్తుంది. వెంటనే యాదగిరి ఓదెలు ఇంటికి పోయి మీ అన్న సెందురుగాడు మంత్రాలు నేర్సిండటగదా ఇంట్ల నీ కొడుకును చూసినవా? బాయికాడ మామిడి చెట్టు చూసినవా? ఎట్లెండి పోయిందో? ఎవరో చేతబడి చేసినట్టున్నారు అని మెల్లగా పుల్ల అంటించి పోయిండు.

అంతే! సాయంత్రం వరకు ఓదెలు కొడుకుని తీసుకొని మంత్రగాని దగ్గరికి పోయిండు. వాడు అంజనమేసి యంత్రాలు, తంత్రాలు గట్టి ఇరువై రూపాయలు, కోడి పుంజు, సేరు సారా పట్టిచ్చిండు. అయినా పిలగాని రోగం కుదరలేదు, మామిడి చెట్టుకు ఆకులూ రాలేదు. ఓదెలు మరింత ఆగమాగమై ఊర్నిండా అప్పులు చేసి కాలుగాలిన పిల్లి లెక్క మంత్రగాళ్ల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. తిరిగి తిరిగి వచ్చే సరికి కోతకొచ్చిన వరి పొలం ఎవడో కోసుకొని పోయిండు. అన్నదమ్ముల మధ్య పంచాయితీ ముదిరేలా చేసి యాదగిరి పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టిస్తాడు. అక్కడ ఫైసలా కాకపోవడంతో ఓదెలుతోని ఆయన అన్న చెంద్రయ్య మీద పోలీసు కేసు పెట్టిస్తాడు. కేసు చాలా రోజులు జరిగి చివరికి చెంద్రయ్యకు మూడేండ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ లోపు కడుపులో లేగ చనిపోయి తొలి చూలు ఆవు చనిపోతుంది. కర్చు మీద కర్చు పెట్టిచ్చి కొడుకు కూడా చనిపోతాడు. “ఏడ్చేడ్చి ఎనుకకు మర్రి చూసుకుంటే తేలింది మూడు వేల అసలు, రెండు వేల వడ్డీ కలిపి అయిదు వేల అప్పు.” ఈ అన్నీ సందర్భాల్లో యాదగిరి ఓదెలుకు అప్పు ఇస్తూ కాగితాలు మార్పించుకుంటూనే ఉంటాడు. దేవునోలే ఆదుకుంటున్నవ్ అని ఓదెలు భార్య శంకరమ్మ యాదగిరి కాళ్ళు మొక్కుతుంది. “ఎట్లైనా సర్పంచి దేవునసోంటోడు” అనుకుంటాడు ఓదెలు.

ఓ రోజు యాదగిరి పెండ్లాం సావిత్రమ్మ ఓదెలును పిలిచి పరిస్థితి అంతా మెత్తగా వివరించి మీ కలుమతోక ఎద్దును మాకిచ్చి మా పయ్యెద్దును కొట్టుకపొమ్మని, పటేలు అడుగద్దన్నడు కాని నేనే ఆయనకు తెల్వకుంట సాటుకు అడుగుతున్న అని చెప్పింది. ఓదెలుకు ఏం చేయాల్నో అర్థంగాక మాపటేల వరకు అట్లే చేసిండు. ఇట్లా రాసుకున్న కాగితంలో కొందరి చేత సాక్షి సంతకం పెట్టించుకుంది సావిత్రమ్మ.

ఆయేడు వానలెక్కువై ఏసిన పొలం మునిగిపోయింది. మురిగిపోయింది. లెక్క జూస్తే ఓదెలు యాదగిరికి పది వేల అప్పు తేలిండు. శంకరమ్మ నెత్తి నోరు మొత్తుకున్నది. చివరికి అప్పు తెంపుటానికి ఓదెలు యాదగిరికే పొలం అమ్మిండు. అప్పు పోంగ ఓదెలుకు వెయ్యి రూపాయలు మిగిలినై.

పాత పగలు మర్చి పోయి ఓ రోజు ఓదెలు జైల్లో ఉన్న అన్న చంద్రయ్యను చూసుటానికి పోయిండు. చంద్రయ్య అంతెత్తు ఎగిరి జరిగిన నష్టాన్ని వివరించి “కొత్త దొరలురా! కొట్టరు, తిట్టరు. బెల్లం మాటలు. పావురంగ మాట్లాడ్తరు. సాప కింది నీళ్ళ తీర్గ సల్లంగ నెత్తి మీనికి పాకి గప్పుడు నెత్తి మీన కాలేసి పాతాళానికి తొక్కుతరు. గదే మాయ. గా మాయల పడనోన్ని కట్టుబోతని ఇగో ఇనుప సలాకలెనుకకు పంపిత్తరు. జనం తొక్కేది ఏర్పడక ఊబిల దిగబడి పోయి ఊపిరాడక సత్తరు. భూంపుండు ఎదురుంగ కన్పిత్తే గదా తప్పుక తిర్గుటానికి..”

ఓదెలుకు అర్థమై కానట్టే ఉన్నది.

భారతీయ గ్రామీణ ప్రజల అమాయకత్వానికి, వారిపై ఆధిపత్య వర్గాలు చేస్తోన్న ప్రచ్చన్న దాడికి ఈ కథ అక్షరోదాహరణ. శత్రువును మట్టు పెట్టాలంటే వాడితో శతృత్వం పెంచుకొని వాడికి దూరంగా ఉండి వాడిపై కారాలూ, మిర్యాలు నూరడం కాదు. వాడి పక్కన్నే ఉండి, వాడితో స్నేహంగా మెదులుతూ, వాడికి సహాయం చేస్తున్నట్టు నటిస్తూ వాడిని సర్వ నాశనం చేయడం ఒక ఐస్ క్యూబ్ కుట్ర. తడి గుడ్డతో, రక్తం పైకి కనబడకుండా గొంతు కోయడం ఒక నయా వంచన. పూర్తిగా తెగేదాకా మనకు కూడా మనకు తెలియదు. కొన్ని సార్లు అసలు జీవితాంతం తెలియనే తెలియదు. పైగా మనమే మన గ్రహచారం ఇలా ఉందని సర్దుకుపోతాం. అన్నదమ్ముల మధ్య పగను ఎగదోసి దాని మంటకు చలి కాచుకుంటాడు యాదగిరి.

ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా ఇంకా చాలా గ్రామాల్లో దళితులు, బహుజనులు చేతబడి, క్షుద్ర విద్యల పేరుతో ఆధిపత్య వర్గాల చేతుల్లో, కొన్ని సార్లు సమీప బంధువుల, స్వంత కుటుంబీకుల చేతుల్లోనే చంపబడుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా టార్గెట్ చేసిన వాళ్లను అంతం చేయడానికి, వాళ్ల బంధువులను బలహీనం చేయడానికి ఇదొక సన్నని మార్గం. ఆస్తి తగాదాల్లో చేతబడుల, క్షుద్ర విద్యల పాత్రను కేంద్రంగా చేసుకొని తెలుగులో, ఇతర భారతీయ భాషల్లో చాలా కథలు వచ్చాయి. వాటిలో ఈ కథ ఒక మైలురాయి. వర్గ దృక్పథంతో పాటు, ఆజ్ఞానాన్ని, పేదరికాన్ని దాని ప్రభావాన్ని రచయిత కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. ఉత్పత్తి సంబంధాల్లో పర్చుకున్న సంక్లిష్టతను, సామాజిక సంబంధాల్లో పేరుకు పోయిన అమానవీయతను అల్లం రాజయ్య చాలా అద్భుతంగా చిత్రించారు. భూస్వామ్య దోపిడీ మనిషిని బలహీన పర్చడానికి పన్నే మాయా పన్నాగాలు, క్రూరత్వం, క్రమంగా సామాన్యుల సర్వస్వాన్ని ఆక్రమించి కనిపించని గాయాలపాలు చేసే ఒక ఆధిపత్య స్వభావం అంతా చాలా ఉన్నతంగా కనిపిస్తుంది ఈ కథలో.

కథంతా ఓదెలు, యాదగిరి, శంకరమ్మ, సావిత్రమ్మ, చెంద్రయ్య ఈ ఐదు పాత్రల చుట్టే తిరుగుతుంది. కానీ తెలంగాణలో రైతు కూలి ఉద్యమాల ముందరి, తరువాతి గ్రామాల వాతావరణాన్ని చాలా బలంగా చిత్రించిన కథ. ఆనాటి పల్లెల లోపలి, బయటి నొప్పి, పరిణామాలు, ఆధిపత్య వర్గాల ఆర్థిక దోపిడీ, పీడనకు ఈ కథ ఒక నిలువెత్తు సాక్ష్యం. ఎనభై శాతం ఉన్న గ్రామీణులు ఇంకా ఎంత చైతన్యం కావాలో, వ్యక్తులు వ్యవస్థను ఎంత నిరసించాలో, ఎంత తిరుగుబాటు చేయాలో ఎట్లా సరికొత్త యుద్ధం చేయాలో చెప్పిన కథ.

అల్లం రాజయ్య కథల గురించి మాట్లాడేటప్పుడు ఆయన వాడిన భాష, శిల్పం గురించిన చర్చ తప్పనిసరి. ఆనాటి తెలంగాణేతర సాహిత్యకారులు, పాఠకులు అల్లం రాజయ్య సాహిత్యమంతా ‘అల్లం’ వాసన వేస్తోందని నిరసించినా పట్టుబట్టి రాజయ్య తెలంగాణ తెలుగులోనే రాయడం ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం మీద నిలబడి చూసినప్పుడు ఎంతో అబ్బురపరిచే విషయం. ఇప్పటి రచయితలకు ఆదర్శప్రాయం. రాజయ్య కథలు ఎక్కువ శాతం చాలా సరళ శిల్పంలో సాగిపోతాయి. ఒక మౌఖిక కథనం కనిపిస్తుంది. సన్నివేశ కల్పన, సంఘర్షణ అంతా ఎంతో వాస్తవికంగా ఉండి కథ చదువుతున్న అనుభూతినిగాక ఒక జీవితాన్ని లోతుగా చూస్తున్న స్పర్శ కలుగుతుంది. నెల మీద నిలబడి కథలు ఎలా రాయాలో కూడా చెప్తాయి ఈయన కథలు. రాజయ్య కథలు జీవితం ఇలా ఉంది అని వాచ్యంగా, ఇలా ఉంటే బావుండు అని ధ్వన్యాత్మకంగా చెప్తాయి. ఈ కథ కూడా అంతే. సగటు మనిషిలో రావాల్సిన చైతన్యపు పాయల్ని కలగని ముగుస్తుంది.

Eddu Story – Allam Rajaiah

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొన్ని తెలియని విషయాల్ని కొత్తగా తెలియపర్చిన విధానం చాలా బాగా నచ్చింది సార్. మంచి విశ్లేషణాత్మక మాటల అల్లికల మూటను అందించినందుకు ధన్యవాదాలు సార్

  • The socio cultural history of typical Feudal Telangana state of affairs in the virginal TELANGANA dialect…is explained and anatomised from Marxian perspective of two classes of people…exploited and the exploiters. A sample of the chaste, rural and yesteryear TELANGANA dialect is quoted for the present day strange readers…the wording..”ice cube kutra” is new literary expression…Dr Veldandi’s scholarly post mortem is comprehensive and complete in all aspects… The problem I found in the names of the characters is, all represent Bahujans…in 70’s of Feudal Telangana,I don’t think people from amorphous Bahujan society were in politics…to differentiate the mutually exclusive and ever antagonistic Bahujans (illiterate Shoedross) from the Feudal Shoedross ( Raos, Reddy) the names of the characters should have been representative……I’m grateful to Dr Veldandi for taking us to see the society in its totality of yesteryears..

  • కలుమ తోక అంటే అర్థం కాలేదు.కానీ ఆనాటి పరిస్థితి ని కళ్ళ ముందు నిలిపింది
    మంచి కథ ను పరిచయం చేశారు
    రచయిత కు అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు