పా. రంజిత్ కి వెయ్యి కళ్ళు!

పా. రంజిత్ సినిమాల్లో ఐడియాలజీల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది!

‘‘ఆల్ ఐడియాలజీస్ ఆర్ ఇడియటిక్’’ అని ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి చెప్పాడు. ఫిలాసఫర్స్ ఎప్పుడైనా ప్రపంచాన్ని, ప్రజల మనస్తత్వాల్ని నిర్వచిస్తారు తప్పితే ప్లకార్డులు పట్టుకుని ఉద్యమం చేసి సమాజాన్ని మార్చరు.  అలా ఫిలాసఫర్స్ పరంపరలో ఎవరైనా ప్రపంచాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారా అని ఆరాతీస్తే ఒక్క కార్ల్ మార్క్స్ మాత్రమే మనకు కనిపిస్తాడు. అలా మార్చలేని వాళ్ళకి ఐడియాలజీలు తప్పుగా అనిపించడంలో తప్పులేదు. మార్చే వాడికి ఒప్పుగా కనిపించడంలో కూడా తప్పులేదు. ‘‘బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు; నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి; రణరంగం కానిచోటు భూస్థలమంతా వెదకిన దొరకదు’’ అని మహాకవి శ్రీశ్రీ తన మహాప్రస్థానం ‘దేశ చరిత్రలు’ అనే కవితా ఖండికలో అంటాడు. ఇదే పా. రంజిత్ సినిమాల్లో కనిపిస్తుంది. కాలగమన ఘర్షణలో తప్పొప్పులు మాటే తప్పేమో! ‘అవసరం, ఆకలి’ మనిషిని చరిత్రగా మలుస్తాయేమో అనిపిస్తుంది.

అసలు ఈ భూమ్మీద ఎవరికి ఐడియాలజీ కావాలి? అనే ప్రశ్నకు ఈ ప్రపంచ పటాన్న సమాధానం దొరికే అవకాశం ఉందా? బాగా గమనిస్తే అనాదిగా ఐడియాలజీ ఉన్న వాళ్ళు, అది లేని వాళ్ళను పాలిస్తున్నారన్నది అందరూ ఏక కంఠంతో ఒప్పుకోవాల్సిన సత్యం.  మరో విషయం ఏమిటంటే మెజారిటీ, మైనారిటీ అనే సమస్య ఒకటుంది! భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రం మీద నడుస్తుంది.  ఇన్ని భిన్న సంస్కృతుల సమ్మేళనంలో అనేక ఐడియాలజీలు పుట్టుకురావడం, వాటి గుర్తింపు కోసం కొట్లాడటం చాలా సహజంగా జరుగుతుంది. వాటిని గౌరవించడం భారతీయ ధర్మం. అంతేగానీ దానికి లేనిపోనివి అంటగట్టి తప్పుగా జడ్జిమెంట్లు పాస్ చేయడం సరికాదు.

నిజానికి పా. రంజిత్ సినిమాలను నిశితంగా పరిశీలిస్తే కబాలి, కాలా, సార్పట్ట ఈ సినిమాల్లో దర్శకుడిపై ఉన్న ఐడియాలజీ ప్రభావాల వల్ల ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి పంచాయనడంలో సందేహం లేదు. ఈ మూడు సినిమాల్లో మనం బాగా గమనిస్తే మద్యపానానికి హీరోని దూరంగా ఉండాలని చెబుతూనే ఉంటాడు. ‘కబాలి’ లో హీరో (రజినీ) పాత్రను హీరోయిన్ కుముదవల్లి (రాధికా ఆప్టే) డామినేట్ చేస్తూనే ఉంటుంది. అదే కాలా సినిమాలో కూడా చూడవచ్చు. అలాగే ‘సార్పట్ట’లో కూడా హీరో ఎంత బలవంతుడైనా తల్లి చాటు బిడ్డలానే సినిమా అంతా కనిపిస్తాడు. ఇది బాగా గమనిస్తే వేదకాలం నాటి స్త్రీకి ప్రతీక. పురుషులతో సమంగా స్త్రీలకు ఆ కాలంలో యజ్ఞాధికారం ఉండేదని ఋగ్వేదసంహితలో 8వ మండలంలో 31వ సూక్తిలోని 5ఋక్కులు రాశారు. నాటి స్త్రీ గ్రహకృత్యాలలో ఒక భాగమే.  కొందరు ఋషి పదవులను పొంది విదుషీమణులుగా వుండేవారు. పిత్రార్జితమైన ఆస్తికి స్త్రీలే వారసులు. బ్రాహ్మణకాలలో కూడా ఈ అంశం పొందుపరిచారు. స్త్రీలు స్వతంత్రులని తండ్రి ఆస్తికి వారసులని యజ్ఞయాగాది కార్యక్రమాలలో పాల్గొనేవారనీ, రాజకీయ, నైతికశాస్త్రాలలో నిష్ణాతులనీ, శాసనాధికారం ఉండేదని, బ్రాహ్మణకాల వల్ల తెలుస్తుంది. బృహదారణ్యకోపనిషత్తులోని యాజ్ఞవల్క్యుని కథ స్త్రీలకు సభా ప్రవేశం ఉండేదనడానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకజాతి నాగరికతను తెలుసుకోవాలంటే ఆ జాతి స్త్రీల కిచ్చిన స్థానాన్ని బట్టి తెలుస్తుంది. అదే మనకు పా. రంజిత్ సినిమాలో స్త్రీపాత్రల చిత్రణలో కనబడుతుంది.

జనరల్గా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ అంటే చాలా భారీగా ఫ్లాన్ చేస్తారు. అదే కబాలిలో గమనిస్తే రజనీ జైల్లో పుస్తకం చదువుతున్నట్టు చూపించి తర్వాత ‘ఫుల్ అఫ్స్’ (వ్యాయామం) చేయడం చూపిస్తాడు. పా. రంజిత్ తన సినిమాల ద్వారా యువతకి మద్యపానానికి దూరంగా ఉంటూ వ్యాయమం చేస్తూ బాగా చదువుకోవాలంటాడు. ఇది కేవలం అతను నమ్మిన ఐడియాలజీ వల్లే అతని ప్రతీ సినిమాలో మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాడని మనం గమనించాలి. సాహిత్యంలో ఇలాంటి బలమైన ఐడియాలజీలు ఉంటాయి కానీ వ్యాపార దృక్పథం కలిగిన సినిమాల్లో ఎలా సాధ్యమంటే దాన్ని పా.రంజిత్ సుసాధ్యం చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాంటి ఐడియాలజీ ఉన్న యువదర్శకులకు నీలం ప్రొడక్షన్స్ స్థాపించి ఆలోచింపజేసే చిత్రాలను నిర్మిస్తున్నాడు. అలా వచ్చినవే ‘పెరియారుం పెరుమల్’ గుండు, కుతురైవాల, సెత్తుమాన్, రైటర్ ఇలా చాలా పెద్ద లిస్టు ఉంది.‘కాలా’ సినిమా అయితే 2014 నుండి 2018 వరకూ భారతదేశ రాజకీయాలకు అద్దం పట్టిందనడంలో సందేహం లేదు. దళిత ఐడియాలజీ అయితేనేం సమాజానికి మంచే చెబుతున్నప్పుడు అది దేశానికి కూడా మంచే అవుతుంది. ‘‘సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’’ అని 1910 లోనే గురజాడ అప్పారావు చెప్తే, బహుశా పా. రంజిత్ ఇప్పుడు దాన్ని పాటిస్తున్నట్లు అతని జర్నీ చూస్తుంటే అనిపిస్తుంది.

‘సార్పట్ట పరంపర’లో బలవంతుల రాజ్యంలో బలహీనవర్గాలకు అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అది చేజార్చుకుంటే అలాంటి అవకాశాలు మళ్ళీ రావడం చాలా కష్టమని అండర్ మెసేజ్ గా జనరంజకంగా చెప్పాడు. బలహీనులకు రాకరాక వచ్చిన అవకాశాల్ని బలవంతులు ఓర్వలేనితనంతో చెడు అలవాట్లకు, సావాసాలకు వాళ్ళను  బలిచేయడం మనిషిలోని స్వార్ధానికి పరాకాష్టగా నిలుస్తుంది. అటువంటి సన్నివేశాలను క్రియేట్ చేయడం వల్ల రియాలటీకి దగ్గరగా అనిపిస్తుంది. పా. రంజిత్ ఎప్పుడూ వేయి కళ్ళతో కాన్సెస్ గా ఉంటూ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని తన సినిమాల ద్వారా యువతకు చెప్తున్నట్లనిపిస్తుంది.  చదువులు మానేసి, తాగుబోతులై, రౌడీల్లా బలాదూర్గా తిరిగితే అవకాశాలు మన కోసం కాస్కొని కూర్చోవనే నేటి నగ్నసత్యాన్ని కూడా చెప్తున్నాడు.బలవంతుల బలంతో పాటు ఇరువర్గాల బలహీనతల్ని కూడా సమానంగా చూపిస్తూ సూచన చేయడం పా. రంజిత్ ప్రతిభా విశేషం. పా. రంజిత్ అంటే కులమనే ముద్ర వేస్తున్నారని ఈ సినిమాలో ఆ పదం వాడకుండా సింబాలిజంలో చూపించాడు.చివరిగా మనకో ఐడియాలజీ లేకపోతే మన రాతలు, కూతలు, చేతలు గుంపులో గోవిందలా ఉంటాయి తప్పితే ప్రత్యేకంగా కనిపించవు. పా. రంజిత్ వ్యక్తిగత సామాజిక స్పృహ వల్లే అతని సినిమాలు సమాజానికి అద్దంపడుతున్నాయి. ఈ సత్యాన్ని పసిగట్టే వరకూ పా. రంజిత్ మనకు అందని కొండలా నెత్తి మీద బండలా కనిపించడం చాలా సహజం.

*

ప్రవీణ్ యజ్జల

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ వ్యాసానికి కావలసిన మూలాలను వెతుకుతూ ప్రముఖు తత్వవేత్తల మాటలు ఉఠంకిస్తూ వ్యాసాన్ని చక్కగా రాశారు. అభినందనలు. కానీ పా రంజిత్ ఐడియాలజీ మీరు ప్రస్తావించిన వేదాలతో ముడిపడి ఉందా? లేక భారతదేశంలో అన్ని రంగాలలో అణగదొక్కబడిన స్త్రీ జాతిని మేల్కొలపడానికి అంబేద్కర్ రాసిన ఐడియాలజీకి దగ్గరగా ఉన్నదా? మీరు ప్రస్తావించినట్లు వేద కాలంలోనే స్త్రీలకు సమానత్వం ఉన్నట్లయితే వారు వంట ఇల్లు వదిలీ మడులు తెంచుకొని చదువుకొని దేశాన్ని వందల వేల సంవత్సరాల క్రితమే అభివృద్ధి పథంలోకి నడిపేవారు. కానీ అది ఇది ఏ యుగం లోనూ ఏ దశాబ్దంలోనూ చరిత్రకారుడూ లిఖించలేదు. వేదాలలో ఉన్నప్పటికీ ఆచరణలో ప్రతిబింబించడం లేదని నా అభిప్రాయం. నా ఉద్దేశంలో పా రంజిత్ అంబేద్కర్ ఐడియాలజీలో ఉన్న సమానత్వాన్ని తన రచనల్లో దర్శకత్వంలో సమాజానికి చూపిస్తున్నారు కానీ వేదాలలో సారాన్ని అని కాదు అని నా అభిప్రాయం. ఈ నా సద్విమర్శని అన్యగా భావించవద్దు మిత్రమా.

    • JD Prabhakar బాగుంది మిత్రమా నీ సందేహం. వేదకాలం నాటి స్త్రీ బలాన్ని గుర్తించిన పురుష సమాజం ఆమెను వంటింటికే పరిమితం చాలా తెలివిగా చేశారు. నా వ్యాసంలో ‘‘ఒకజాతి నాగరికతను తెలుసుకోవాలంటే ఆ జాతి స్త్రీల కిచ్చిన స్థానాన్ని బట్టి తెలుస్తుంది. అదే మనకు పా. రంజిత్ సినిమాలో స్త్రీపాత్రల చిత్రణలో కనబడుతుంది.’’ అని రాశాను. ఇందులో నా ఉద్దేశం మీకు దగ్గరగానే ఉంది. కాకపోతే కాస్త ఆలోచిస్తే గానీ అది అర్ధం కాదనుకుంటున్నాను. మరొకసారి ఆలోచించు మిత్రమా.

  • సునిశిత పరిశీలనకు అభినందనలు.

    కానీ , పా రంజిత్ ది పూర్తిగా దళిత బహుజన దృక్పదం అనిపిస్తోంది.

    భారత దేశ రాజకీయాలను, విస్మరణ సమూహాల చరిత్రను ఆతను సమర్ధవన్తంగా తిరిగి దృశ్య రూపంలో చరిత్రీకరిస్తున్నారు. ‘పా ‘ చిత్రాలలో స్త్రీ పాత్రలు ధైర్యమైనవిగా, వ్యక్తిత్వం వున్నవిగా చిత్రీకరిస్తున్నారు.

    దళిత, బహుజనుల ఆహార అలవాట్లు ( సర్పట్ట లో బీఫ్ బిర్యాని ) జంతువులపై వారి ప్రేమ ( కాలా లో ఇంట్లోనే మసిలే కుక్కలు ).

    పా రంజిత్ ఇప్పుడు కొత్తతరం రచయితలకు, దర్శకులకు ఉత్సాహకారుడు. శూద్ర కులాల దృష్టి నుంచి రాజకీయాల్ని, సమాజాన్ని,

    మానవ సంబంధాలను, అభివృద్ధి దృక్కోణాన్ని చూపిస్తున్న దర్శకుడికి జై భీంలు, అభినందనలు.

  • పా. రంజిత్ మూడు సినిమాల ద్రుక్పథాన్ని ప్రవీణ్ యజ్జల చిన్న వ్యాసంలో విశ్లేషించిన తీరు బాగుంది.

  • అంద‌రూ “అన్నీ వేదాల‌లోనే ఉన్నాయి” అన్న భ్ర‌మ‌ల్లోకి తీసుకెళ్ళేవాళ్ళే కానీ ఆ వేదాల వ‌ల‌న ప్ర‌పంచ దేశాల ముందు భార‌త‌దేశ ఔన్న‌త్యాన్ని నిల‌బెట్టిన‌వి ఏవీ అంటే గంద‌ర‌గోళ ప‌ర‌చే స‌మాధానాలే త‌ప్ప నెరీదుగా దొరికే స‌మాధానాలు సున్నా. మా తాత‌లు నేతులు తాగారు మా మూతుల వాస‌న చూడండి అనే వాద‌న వ‌ల్ల దేశంలో కుట్ర‌పూరితంగా అణ‌చివేయ‌బ‌డిన స‌మూహాల‌కు వొరిగింది శూన్యం. స‌మీక్ష‌కునికి కార్ల్ మార్క్స్ మాత్ర‌మే ఒక గొప్ప ఐడియాల‌జిస్ట్ గా క‌న‌బ‌డ‌టం అత‌ని పేరును చూసాక పెద్ద‌గా ఆశ్చ‌ర్యమ‌నిపించ‌లేదు. ప్ర‌పంచమంతా ఒక ఎత్తు భార‌త‌దేశం మాత్ర‌మే కులాల కంపుతో, కుళ్ళిపోతుంది దానికి ముసుగు ఒక మ‌తంలో దాగి వున్న ఆచారాలు సాంప్ర‌దాయాలు. ఇటువంటి భార‌త‌దేశ వ్య‌వ‌స్థ ప్ర‌స్తావ‌న‌, వాటికి పరిష్కారం చూపలేని మార్క్సిజం ఎందుకు నెత్తిన పెట్టుకుంటారో?! పీడిత వ‌ర్గాలు నెత్తికెత్తుకునే బాబాసాహేబ్ అంబేడ్క‌ర్ ను ఎందుకు తెలివిగా విస్మ‌రిస్తారో !? అర్దం కాద‌నుకోన‌వ‌స‌రం లేదు. పా రంజిత్ అనుస‌రించేది బాబాసాహేబ్ అంబేడ్క‌ర్ చూపిన స‌మ‌తా స‌మాన‌త్వ‌మ‌నే మాన‌వీయ బాట‌. మా జీవితాల‌తో ఏ మాత్రం సంబంధం లేని ఆ వేదాలు, బ్రాహ్మ‌ణ‌కాలు, ఉప‌నిష‌త్తుల గోల మాకొద్దు. మాకు కావ‌ల‌సింది స‌మానత్వం, విద్య‌, ఆత్మ‌గౌర‌వం మాత్ర‌మే.

  • విలువైన ఆలోచనల సమాహారం… మీ ఆర్టికల్…
    చాలా బావుంది… పా.రంజిత్ కు..జైభీంలు

  • ఇది సినిమా మీద పూర్తి సమీక్ష కాకున్నా దర్శకుడి అంతరంగాన్ని బాగా చెప్పారు. కానీ ఒక్క విషయం ఏమంటే వేదకాలంలో స్త్రీ స్థానం ఏమిటో ఇప్పుడు మనకి అవసరమా? సాహిత్యంలో ఎక్కువగా మధ్య తరగతి స్త్రీ విషాద జీవితాలు ఉంటాయి. కానీ వాస్తవానికి కింది వర్గపు స్త్రీలు ఉత్పత్తిలోనూ, కుటుంబ ఆర్ధిక అవసరాలు తీర్చే స్థానంలోనూ వుంటారు కాబట్టి వారు నేల మీద దయనీయంగా పాకకుండా వెన్నెముకతో దృఢంగా నిలబడి వుంటారు. రంజిత్ ఆ వాస్తవాన్ని ప్రభావవంతంగా చూపుతుంటారు. అలా చూపడంతో ప్రేక్షకులకు స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది.

  • వేదకాలం నాడు స్త్రీలు ఎలా ఉండేవారో మనం చదివి తెలుసుకోవడం తప్ప నిజంగా చూసింది లేదు

    రంజిత్ సినిమాలలో స్త్రీ పాత్రలు బలంగా ఉండటానికి కారణంగా దాన్ని తీసుకోలేం

    అట్టడుగు, లేదా పేద వర్గాల స్త్రీలు శ్రామిక వర్గానికి చెందిన వారు.వాళ్ళు సహజంగా జీవితం పట్ల ధృడ విశ్వాసంతీ, శక్తిని నమ్ముకున్న వారై ఉంటారు. సహజంగానే ధైర్యం, వారి ప్రవర్తనలో కనపడుతుంది.

    రాధికా ఆప్టే అయినా, ఇంగ్లీష్ మాట్లాడే కబిలన్ తల్లి అయినా ఆ వర్గాలని

    • వేదకాలంలో వట్టి బ్రాహ్మలే లేరండోయ్.! అన్నీ జాతులు వారు ఉన్నారు. ఆ కాలానికి వేదకాలం అని పేరు పెట్టారు. నా ఉద్దేశం మాతృస్వామిక సంస్థలని

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు