తాయిమాయి రేపి, పరేషాన్ జేసి, ఆలోచింపజేసి, మల్ల మల్ల చదివించే కథ ఏది? నిజాన్ని నిష్టూరంగా, నిబద్ధతగా, నిక్కచ్చిగా అయినా చెప్పే కథే ఆ కథ. జీవితాలను ఆవిష్కరించి చూపించే కథలు సదా నిలిచిపోతాయి. ఆ మేలిమి జాడలు ఉన్న కథలు ‘డిమ్కి’ కథలు.
వేటికవే విభిన్న జీవిత పార్శ్వాలు. పాలమూరు యాస ఆకట్టుకుంటుంది.
యువ రచయిత్రి స్ఫూర్తి కందివనం గారు రాసిన ఈ పుస్తకంలోని టైటిల్ కథను గతంలో చదివి ఉన్నాను. ముల్కనూరు సాహితీ పీఠం – నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2021 లో ఆ కథకు మొదటి బహుమతి వచ్చింది.
బుర్రకథల వాళ్ళ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించిన విషాద గాథ.
కథల విషయానికి వస్తే….
దగాపడ్డ బతుకు చిత్రం, చారెడు నూకల కోసం తప్పని పోరాటం ‘డిమ్కి’ కథ. ఈ సంకలనంలో మొదటి కథ ఇదే. ‘శంకరా ఏం రాత ఇదీ?’ అని బుర్ర కథలు చెప్పే సంచార జీవుల మీద అపారమైన జాలి, గౌరవం కలుగకమానదు. సంచార జీవితాలు ఎలా తెల్లారతాయో తెలుసుకోవచ్చు.
సుక్కమ్మ, శంకరయ్య, వాళ్ళకు ముగ్గురు పిల్లలు. ఊరూరు తిరుగుతూ బుర్రకథలు, భాగవతం చెబుతూ ఆ వచ్చే రూపాయి, అణా మీద ఆకలి తీర్చుకోవాలి. సంచార జీవితాల్లో పూడ్చలేని ఖాళీ ఈ కథలో కనిపిస్తుంది. అనారోగ్యంతో కట్టుకున్న భార్య చనిపోతే అంత్యక్రియలు చెయ్యడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడా శంకరయ్య తంబూర, డిమ్కి పట్టుకొని ఇంకొక చావు ఇంట్లో కథ చెప్పడానికి వెళ్తాడు.
గుండెల్లో బాధను దిగమింగుతూ కథ చెప్పి ఆ వచ్చిన డబ్బులతో ఇంటికొచ్చి భార్య అంత్యక్రియలు చెయ్యడం ఎంత పెద్ద విషాదమో. అలా సంచార జీవితాలను రికార్డు చేసిన కథ.
కాస్ట్ సిస్టం ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు ఉంటాయని చాలా బలంగా, అంతే ఉదాత్తంగా చెప్పిన కథ ‘నల్ల చీమలు’. ఊరువాడల్లో పెద్దలు గుడికి, బడికి దూరం చేసిన వైనం. చదువుకునే కాలేజీల్లో తోటి విద్యార్థులు రిజర్వేషన్ల మీద పడి ఏడవడం షరా మామూలుగా మారింది. అనాదిగా కులం మనిషిని ఎంత కుతంత్రంగా మార్చిందో, అది ఇంకా ఎంతటి కోరలు పెంచిందో ఈ కథ చదివితే అర్థం అవుతుంది.
ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు మతం చుట్టూ సాగుతున్నాయి. కానీ మతంలోని కులాలను సంస్కరించుకోవాలని ఎందుకు అనుకోవు? ఈ కథ ఆ ప్రశ్నను చాలా సూటిగా, స్పష్టంగా అటు భ్రష్టు పట్టిన రాజకీయాలకు, బూజుపట్టిన విద్యాలయాలను అడుగుతోంది.
ర్యాంక్ కొట్టిన ఓ దళిత అమ్మాయి అంతరంగం. చిన్నప్పటి నుంచి ఆమె బాగా కష్టపడి చదివి ఓ స్థాయికి వచ్చే క్రమంలో అడుగడుగునా ఎదుర్కున్న అవమానాల సమాహారం ఎర్ర చీమల గాట్లు. మాలాంటి మెరిట్ ఉన్నోళ్ళకు రిజర్వేషన్లు అన్యాయం చేస్తున్నాయి అన్న మిత్రులను చూశాను. కానీ మా ఇళ్ళలో పెద్ద కులం అనే అహంకారం అణగారిన కులాలను ఎంత నీఛంగా చూస్తారో? ఆవైపు ఏమైనా సంస్కరణ మొదలుపెడదామా అన్న ఆలోచన లుప్తం?
కులవృత్తులను మనసారా కౌగిలించుకున్న కథ ‘ముసురు’. తాళ్ళు ఎక్కడానికి గౌడన్నలు నిత్యం చేసే బతుకు పోరాట చిత్రణ ఈ కథ. చెట్టెక్కి ప్రాణాల మీదకు తెచ్చుకున్న గౌడన్నల పరిస్థితేంటి? కులవృత్తిని ప్రాణంగా ప్రేమించే వారిని అదే వృత్తి అంపశయ్య మీద ఉంచితే?
ఉన్నత చదువులు చదివి కులవృత్తిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఈతరం వాళ్ళు అందునా ఉన్నత విద్యావంతులైతెనేమీ చక్కగా కులవృత్తిని చేస్తూ, కొనసాగిస్తూ సాలు సంటర్లనే ఆగిపోకుంట ముంగటికి తీస్కపోతే తప్పేంది? అని ఎరుకజేసే కథ.
టైలర్ జయమ్మ అపరాజితగా నిలిచిన కథ ‘చీకటి వెలుగులు’. ‘నా లైఫ్ ఇంతటితో అయిపోయింది, నన్నెవరు దేకుతలేరు, ఇగ నేనెందుకు బతకాలె? కట్టుకున్నోడే ఏరెటామె ఎంబడ వోయిండు…’ అని బాధపడుతూ చాలామంది తనువు చాలిస్తుంటారు. కానీ ఈ జయమ్మ అలా అస్సలు చెయ్యదు. ఏదైనా.. ఏమైనా సరే జీవిత ధర్మాన్ని విడనాడొద్దని ఒక సానుకూల దృక్పథంతో ముందుకు సాగి కథ చదివినవాళ్ళలో గొప్ప స్ఫూర్తిని నింపుతుంది.
‘నేను మీ!’ కథలో కుక్క విశ్వాసం గురించి తెలిసిందే. ఆ కుక్క పీఓవీలో ముసలమ్మ ఔదార్యం గురించి చెప్పిన తీరు బాగుంది. కూటికి గతిలేకపోయినా దానగుణం కొందరికే పరిమితమైన అద్భుతమైన నగ అనవచ్చు. ఆ సొబగు ఆ పేద అవ్వ సొంతం. తనకెవరో పెట్టే పిడికెడు మెతుకుల్లోంచి నోరులేని జీవుల కడుపు నింపుతుంటుందామె.
జంతువులను కేవలం మన అవసరాలకు మచ్చిక పేరుతో వాడుకుంటున్నాం. ఆ వాడకం సాటి మనిషిని కూడా నాప్కిన్ మాదిరి వాడుకునే దాకా వచ్చింది. ఈ ధోరణిని బద్దలు కొట్టి పునర్వైభవాన్ని పునర్మించుకుందామని హృద్యంగా చెప్పిన కథ.
‘నాయిన చెప్పిన అబద్ధం’ కథలో ఇంట్లో పెద్దవాళ్లు ముఖ్యంగా రైతు కుటుంబాల్లో కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే కొన్ని నిర్ణయాలు పిల్లల్లో ఎంత ఫోబియా ఉండిపోతుంది, వాళ్ళ మానసిక స్థితిని ఆ పరిస్థితులు ఎంతలా ప్రభావితం చేస్తాయి అనే పాయింట్ గా సాగుతుంది. దాని కారణంగానే అంజి సరిగ్గా చదువు మీద దృష్టి పెట్టలేకపోతాడు.
అలా చదువులో వెనకబడ్డ కొడుకును గాడిలో పెట్టడానికి ఆ తండ్రి ఏం చేశాడు? ఇది క్లీన్ నరేటివ్ కథ.
ఆడపిల్లలకు స్వేచ్ఛ ఏంటి? అమ్మాయిలు అదుపులో ఉండాలిగ, ఆడపిల్లలకు బయటి పనులెందుకు? కుటుంబాన్ని చూసుకుంటే చాలదు? అతిగా స్వేచ్ఛ ఇస్తే ఆడపిల్లలు చెడిపోతారు…, ఇలాంటి మాటలు చాలా మామూలుగా అనేస్తుంటారు, ఫాలో అవుతుంటారు. సభ్య సమాజం ఆధునిక భావజాలంతో ఎంత మున్ముందుకు దుమికినట్టు వెళ్తున్నా ఇంకా స్త్రీల విషయంలో వారి వారి ఆలోచనలు, ప్రవర్తనా తీరు పాతాళం కన్నా లోతుల్లోకి వెళ్తోంది. పురుషాధిక్యత ప్రదర్శిస్తూ జీవితంలో సగ భాగం, ఆమె లేకపోతే జీవితమే లేదు, అసలు సృష్ఠియే లేదు అని తెలిసినా వెర్రిగా ప్రవర్తించే మగ పుంగవులు.
ఈ తీరు ఎప్పటికి మారెను? ఎంతమంది మహిళలు ఇంకా తమ హక్కుల కోసం గొంతెత్తాలి? ఇలాంటి రచనలు ఇంకా ఎన్ని రావాలి? అయినా మారరా? ‘స్వేచ్ఛ’ కథ ఆ దిశలో ఆలోచింపజేస్తుంది. ఆచరణకు ప్రేరణనిస్తుంది.
‘ఊరి యాదికొచ్చింది’ కథ చదివాక లచ్చుమమ్మ గుండెలా మన గుండె కూడా చెరువు అవుతుంది. కరోనా మహమ్మారి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఎన్ని అరి గోసలు పెట్టిందో ఈ కథలో స్పష్టంగా తెలుస్తుంది. రెక్కాడితే గాని డొక్కాడని శ్రమజీవులు తీవ్రంగా చితికిపోయారు. కరోనా మొదలయి పనులన్నింటినీ లాక్ చేసేసింది. అప్పుడు ఎంతమంది కూలీలు కాలి బాటన సొంతూళ్ళకు వెళ్ళారో చూశాం. ఆ విషాదం మళ్ళీ రావొద్దని కోరుకోని హృదయం లేదు.
పట్నం వచ్చిన లచ్చుమమ్మ భర్త ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో మంచానికే పరిమితం అవుతాడు. పిల్లలు, పసి పిల్లాడిలా మారిన భర్త? ఏం చెయ్యాలామె? రెండు రెక్కలే బతుకు పోరాటంలో తన ఆయుధాలు అనుకుంది. కానీ కోవిడ్ రక్కసి ఆ ఆయుధాలను విరిచేసినంత పని చేసింది? అప్పుడామె ఏం చెయ్యాలి? ఎలా తన పిల్లలు, భర్తను సంభాళించాలి? మరోపక్క మహమ్మారితో ప్రాణాలు కాపాడుకోవాలి??
కరోనా సమయంలో పేదవాళ్ళు రెండు యుద్ధాలు చేశారు. ఉన్నోళ్ళకి అదేం పెద్ద ప్రభావం చూపించలేదు. కానీ పేదలు ఇంకా ఆ గాయాన్నుంచి కోలుకోలేకపోతున్నారు. అప్పుడు చల్లని ఊరమ్మ గుర్తొచ్చి, శివారు మీద చేజార్చుకున్న పొలం పొలమారి వలవలా ఏడవడం తప్పితే ఆ నిస్సహాయ జీవులు ఏమీ చెయ్యలేనితనం??
ప్రస్తుత సమాజంలో ఒంటరి అమ్మాయిల పట్ల కామాంధుల వికృత క్రీడను ప్రశ్నిస్తుంది ‘తీర్పు’ కథ. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న అమ్మాయిలు ఇలాంటివి ఎన్నో ఎదుర్కున్నారు. అయినా వాటికి ఫుల్ స్టాప్ పడిందా? సాఫ్ట్‌వేర్ సంస్థలు లేట్ నైట్ వర్క్ చేసే అమ్మాయిలకు రక్షణగా చర్యలు చేపట్టడం ఆశావహ దృక్పథం.
వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారన్న కనికరం కూడా లేకుండా మదమెక్కిన ఆంబోతులు విరుచుకుపడుతుంటారు. ఈ కథలో నాయకి పాత్ర విచలిస్తుంది. వాడిని అంతమొందిస్తుంది. కానీ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి. ఆత్మ రక్షణలో భాగంగా ఆమె అలా చెయ్యాల్సి వచ్చిందని చట్టాలు ఊరుకుంటాయా అన్న ప్రశ్నతో కథ తీర్పును పాఠకులకు వదిలెయ్యడం మంచి ముగింపుగా అనిపించింది.
ఇవీ స్ఫూర్తి కందివనం రాసిన డిమ్కీ కథలు. 85 పేజీలు ఉన్న ఈ కథల్ని అలా మొదలుపెట్టి ఇలా ముగించవచ్చు.
డిమ్కి ప్రతులకు: 9652745117
డాక్టర్ వేదగిరి రాంబాబు కథానిక పురస్కారం – 2025 కు ‘డిమ్కీ’ కథల సంపుటి ఎన్నికైన సందర్భంగా స్ఫూర్తి కందివనం గారికి శుభాకాంక్షలు.
Add comment