1
జీవితం నుండి పారిపోయేవారుంటారు. అందుకు కారణాలు అనేకం.
Cold skin అనే స్పానిష్ చిత్రంలో Gruner తన తన భార్య మరొకరికి సన్నిహితమవడం వల్ల ప్రపంచానికి దూరంగా, ఒక మారుమూల దీవిలో ఉన్న లైట్ హౌస్ ఆపరేటర్ ఉద్యోగంలో చేరుతాడు. ఎన్నో దశాబ్దాలు తను మరణించే వరకు ఆ దీవిలోనే ప్రపంచానికి దూరంగా ఉండిపోతాడు.
Ad Astra చిత్రంలో యుద్ధాలు, హింస నిండిన ఈ ప్రపంచం మీద విరక్తి కలిగి H.Clifford McBride వ్యామగామిగా నెప్ట్యూన్ గ్రహానికి దగ్గరలో ఉన్న స్పేస్ స్టేషన్ కి వెళతాడు. అక్కడి నుండి తిరిగి భూమికి రావడానికి ఇష్టపడడు. ఇటువంటి పాత్రల్ని మనం యూరోపియన్, అమెరికన్ నవలల్లో చూస్తుంటాం. ఇటువంటి పాత్రలు నిజంగానే జీవితంలో ఉంటాయా అనే సందేహం ఎవరికైనా కలగవచ్చు! నిజంగానే ఉంటాయి అని నేను రూఢి పరచగలను. ఎందుకంటే అటువంటి వ్యక్తుల్ని, ఘటనల్ని కొన్నింటిని నేను స్వయంగా చూశాను.
2
“జీవితం నుండి పారిపోయేవారుంటారు” అనే వాక్యం నా మదిలో మెదిలింది ఆ 70 ఏళ్ళ జపనీయ వృద్ధుడు హినాటాని కలిసినప్పుడు. అతని చూపు, ఆలోచన ఎంతో స్పష్టంగా ఉన్నాయి. అయితే అతనిలో ఏదో వేదన ఉన్నట్లు అనిపించేది. అతడు జీవితం నుండి పారిపోయి ఇక్కడకు వచ్చాడనిపించింది. రోజులు గడిచేకొలదీ అది నిజమని నమ్మకం కలిగింది. అతని గురించి చెప్పాలంటే ఇంకొంచెం ముందు నుండి మొదలు పెట్టాలి.
3
ఆ రోజు New York of Asia గా పిలవబడే బ్యాంకాక్ మహానగరంలో, ఆసియాలోనే అతి పెద్ద సూపర్ లగ్జరీ మాల్స్ లో ఒకటైన ICON SIAM లో షాపింగ్ ముగించుకుని sky train లో ప్రయాణించి స్టేషన్ నుండి అపసవ్య దిశలో బయటకు వచ్చి తెలియని వీధుల్లో తప్పిపోయాను. బ్యాంకాక్ లో GPS అడ్డదిడ్డంగా పనిచేస్తుంది. ఒక దేశం మొత్తాన్ని ఒక నగరంలో కుక్కినట్టుగా ఉంటుంది బ్యాంకాక్. ఆకాశ హర్మ్యాలు, ఇరుకిరుకు సందులు – అక్కడ తప్పిపోకుండా ఉండడం అసాధ్యం. సరే, నేను తప్పిపోయానని అర్థమైంది. నేను స్వయంగా హోటల్ కి చేరుకోలేనని అనిపించింది. అది నిజం కూడా.
నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. కొంతసేపటికి అది వచ్చింది. డ్రైవర్ కి నా ఫోన్ కి వచ్చిన కోడ్ ని చూపించాను. అతడు ఎందుకో కంగారుగా ఉన్నాడు. త్వరగా ఎక్కమని చెప్పాడు. అతడు ఎక్కడెక్కడో రకరకాల వీధుల్లోంచి తిప్పుతున్నాడు. అప్పటికి గంటసేపైంది. ప్రయాణం ఇంత సుదీర్ఘంగా ఉండే అవకాశం లేదు. ఎట్టకేలకు ఒక చీకటి వీధిలో కారు ఆపి దిగమన్నాడు.
“ఎందుకు?” అని ప్రశ్నించాను.
అప్పుడు అతడు మాట్లాడిన మాటలకి gibberish అనే ఆంగ్ల పదం సరిగ్గా సరిపోతుంది. ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాకుండా బ్యాంకాక్ మహానగరంలో అతడు క్యాబ్ నడుపుతున్నాడని అర్థమైంది. ట్రాన్స్ లేటర్ పెట్టి నేను దిగాల్సిన చోటు ఇది కాదని చెప్పాను. అప్పుడు కోడ్ ని చూపించమని అడిగాడు. ఈసారి మెల్లగా కూడబలుక్కుని అంకెలతో ఇంగ్లీషు అక్షరాలు కలగలిసి ఉన్న ఆ కోడ్ ని చాలా మెల్లగా చదివాడు. అప్పుడు అతనికి అర్థమైంది నేను బుక్ చేసిన క్యాబ్ అతనిది కాదని. దాంతో అతడు స్టీరింగ్ కి తలబాదుకున్నాడు. పిచ్చిపిచ్చిగా తనలో తాను మాట్లాడుకున్నాడు. ప్రపంచం అంతమైనట్టుగా దిగులు చెందాడు.
“ఈ ట్రిప్ కి డబ్బు ఇస్తాను, ఆందోళన పడవద్దు” అని చెప్పాను.
అతడు ఏదీ అర్థం చేసుకునే స్థితిలో లేడు. ఎందుకంటే విపరీతమైన ఆందోళనలో ఉన్నాడు.
“నన్ను హోటల్ కి తీసుకెళ్ళు. అదనంగా డబ్బు ఇస్తాను” అని అడిగాను.
త్వరగా కారు దిగిపొమ్మని ఆవేదనగా చెప్పాడు.
అప్పటి వరకు అయిన ప్రయాణానికి డబ్బు ఇస్తుంటే తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. ప్రతికూల సంఘటనలు జరిగినప్పుడు అతిగా ఆందోళనపడటం, వ్యాకులపడటం మూలంగా మనం యదార్ధ స్థితిని అర్థం చేసుకోలేము. పరిష్కారాలకు చేరుకోలేము.
Poor fellow అని అతనిపై జాలి పడ్డాను కాని ఆ అర్థరాత్రి నన్ను చూసి జాలిపడేవాళ్ళు ఉండరని తెలుసుకోలేకపోయాను. ఆ నడిరాత్రి ఒంటి గంటకి ఎక్కడో తెలియని ఒక చీకటి వీధిలో నన్ను ఆ కంగారు మనిషి ఒదిలేశాడు. ఇందులో ఇబ్బంది పడాల్సిందేముంది, మరో క్యాబ్ బుక్ చేసుకుని హోటల్ కి వచ్చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఆ సమయంలో, ఆ వీధిలో క్యాబ్ బుక్ చేసుకున్న ప్రతిసారీ 30, 40 నిమిషాల తర్వాత కాన్సెల్ అయిపోయేది. కాళ్ళు నొప్పి పుట్టి ఒక భవనం ముందు ఉన్న ఫుట్ పాత్ మీద కూర్చున్నాను. మరో రెండు గంటలు అక్కడే గడిచిపోయాయి. అదృష్టం ఏమిటంటే ఆ వీధిలో కుక్కలు లేవు.
ఆ చీకటి వీధిలో రాత్రి 2 గంటలకి ఒక అమ్మాయి ఉద్యోగం నుండి తిరిగి వస్తూ నడుస్తూ ఇంటికి వెళుతోంది. స్వయంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న మరి కొందరు అమ్మాయిలు తమ షాపులు మూసివేసి అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్లడం గమనించాను. స్త్రీలకి భారతదేశంలో కూడా ఇటువంటి స్వేచ్ఛ, రక్షణ ఉండి ఉంటే బాగుణ్ణు కదా అనిపించింది. గాంధీ గారి కల ఇక్కడ నెరవేరింది. భారతదేశంలో అది ఎప్పటికీ నెరవేరదు. ఎందుకంటే మనది అధిక సభ్యత, సంస్కారం గల దేశం అని మనం ఎన్నో గొప్పలు చెప్పుకుంటాము. మనం ఒకలా ఉంటూ, మరొకలా ఉన్నట్టుగా భావించుకుంటాం. నకిలీ మోరల్స్ కి, మోరల్ పోలీసింగ్ కి అధికమైన విలువ ఇస్తాం. ద్వంద్వ ధోరణిలో జీవిస్తాం.
4
ఎప్పటికో ఒక క్యాబ్ వచ్చింది. 3 గంటలకు నన్ను క్షేమంగా హోటల్ కి చేర్చింది. ఆ హోటల్ పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాల నడుమ ఇరుక్కుపోయిన గజిబిజి గల్లీలలో ఉంది. పెద్ద పెద్ద భవనాల మధ్యన బంధించబడిన ఆ చిన్న ప్రాంతంలో వీధి దీపాలు లేక చీకటిగా ఉంటుంది. ఆ వీధుల్లో తప్పిపోతే కనుక తిరిగి హోటల్ కి చేరడం చాలా కష్టం.
దాని అద్దెను బట్టి అది చాలా పెద్ద హోటల్ అని ఊహించుకున్నాను. అయితే నేను ఒక న్యూయార్క్, లండన్, మెల్ బోర్న్ స్థాయి మహానగరంలో హోటల్ బుక్ చేసుకుంటున్నానన్న విషయమే మర్చిపోయాను. ఏదేమైనా చిన్నదైనా ఆ హోటల్ అందంగా, శుభ్రంగా ఉంది. వివిధ దేశాల నుండి వచ్చిన వారు రాత్రులు బీర్లు తాగుతూ కబుర్లు చెప్పుకోవడానికి, పాటలు పాడుకోవడానికి, సంగీత వాద్యాల్ని వాయించడానికి అక్కడ అవకాశం ఉండేది. ఆరు బయట హోటల్ ముందు టేబుల్ వేసుకొని రోడ్డు మీద ఉల్లాసంగా గడపడానికి అవకాశం ఉండేది. అటువంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణం పెద్ద హోటల్స్ లో ఉండదు.
జీవితం మనకు ఇచ్చే surprise లను మనం వినమ్రతతో స్వీకరించాలి. అవి మొదట కష్టంగా అనిపించినా కొత్త ద్వారాలను తెరుస్తాయి. కొత్త అనుభవాలకు దారిని పరుస్తాయి. ఇటువంటి అనుభవాలు మనం ప్యాకేజ్ మీద ప్రయాణం చేస్తే లభించవు. స్వయంగా మనం మన స్వంత విచక్షణతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. స్వయంగా ఊహాతీతమైన సవాళ్లను స్వీకరించడానికి సిద్ధపడి వెళ్లాల్సి ఉంటుంది.
5
నేను క్యాబ్ దిగగానే, ప్రారంభంలో ఆ హోటల్ ముందు ఆ 70 ఏళ్ళ జపనీయ వృద్ధుడు హినాటాని కలిశానని చెప్పాను కదా! అక్కడికి మళ్ళీ వద్దాం. రోజూ రాత్రి నేను హోటల్ కి తిరిగి వచ్చినప్పుడు ఆయన అక్కడే ఉండేవారు. చీకటిలో ఒక స్టూల్ పై కూర్చుని రాత్రంతా సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ గడిపేవారు. మామూలుగా అయితే అతనితో నేను సంభాషించే అవకాశమే లేదు. అయితే ఊహించని విషయాలెన్నో జరుగుతాయి జీవితంలో. ఆ రోజు నేను sky train దిగాక, automated gate లో ticket card బదులు నా hotel room key card వేసి బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా హోటల్ గది తెరుచుకోవాలంటే ఆ కార్డు కావాలి. డూప్లికేట్ కార్డ్ తీసుకోవాలంటే రిసెప్షనిస్టు ఉండాలి. మరి ఆ రిసెప్షనిస్టు ఎక్కడికి పోయాడు!
అప్పుడే హినాటా నన్ను పలకరించారు. రిసెప్షనిస్ట్ త్వరలోనే వస్తాడని ధైర్యం చెప్పారు. ఆ రిసెప్షనిస్ట్ కోసం ఎదురు చూస్తున్న నాకు విసుగు కలుగకుండా ఆయన కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. అది అతనిలోని దయాగుణం. అప్పటికి ఆయన ఆ హోటల్ కి వచ్చి మూడు నెలలు అయింది. ఆయన ఎక్కడికీ వెళ్లేవారు కాదు. అతడికి చక్కని ఇంగ్లీషు వచ్చు. అందువల్ల అతనితో మాట్లాడడం ఎంతో సౌకర్యవంతంగా అనిపించేది. అతడు తన రూం లో కాకుండా అందరితో కలిసి లాంజ్ లో ఉండడానికి ఇష్టపడేవాడు. అందరినీ పలకరిస్తూ యోగక్షేమాలు అడిగేవాడు. అవసరమైన ఎన్నో వివరాలు చెప్పేవాడు. రాత్రంతా ఆ స్టూల్ మీద కూర్చుని ఒంటరిగా సిగరెట్లు తాగేవాడు. ఒక రాత్రి కొంతమంది యువకులు, యువతుల గ్రూప్ తో హోటల్ ముందు గట్టు మీద పేకాట ఆడుతూ కనిపించాడు. మరొక రోజు ఇంకొక యువ గ్రూపుతో బీరు తాగుతూ కనిపించాడు. పగలు లాంజ్ లో అందరి యోగ క్షేమాలు కనుక్కుంటూ, వారికి తెలివైన సలహాలు ఇస్తూ గడిపేవాడు. ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా మసలేవాడు.
ఆ మాయమైపోయిన 25 ఏళ్ళ యువ రిసెప్షనిస్ట్ స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లిపోయి ఉంటాడని, బహుశా రావడం ఆలస్యం అవుతుందని హినాటా నాకు చెప్పారు. సుదీర్ఘమైన సంభాషణల తర్వాత లాంజ్ లోని సోఫా లో ఆయన నన్ను పడుకోమన్నారు. తెల్లవారడానికి ఎంతో సమయం లేదు కాబట్టి నిద్రపోమని, నిద్ర చాలా అవసరమని చెప్పారు. నేను సోఫాలో నిద్రపోయాక ఒక అమెరికన్ యువ జంట నా పక్క సోఫాలో కూర్చుని అసహనంగా మాట్లాడుకుంటున్నారు. నాకు నిద్రాభంగమై లేచి కూర్చున్నాను. చీకటిలో హినాటా ఇంకా స్టూల్ పైన కూర్చుని సిగరెట్లు తాగుతున్నారు. అమెరికన్ జంట check in కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సుదీర్ఘ ప్రయాణంలో అలసిపోయిన ఆ జంట రిసెప్షనిస్ట్ రాక కోసం విలవిలలాడుతూ ఎదురుచూస్తున్నారు.
6
అదృశ్యమయిపోయిన యువ రిసెప్షనిస్ట్ పార్టీ ముగించుకుని ఎప్పుడో తెల్లవారు జామున వచ్చి 1000 రూపాయిలు తీసుకుని, నాకు sky train లో పారేసుకున్న hotel room key card కి నకలు చేసి ఇచ్చాడు. ఉదారంగా కిచెన్ లోకి వెళ్ళి కాఫీ తయారు చేసుకోమన్నాడు. అయితే కాఫీకి వెయ్యి రూపాయిలు ఛార్జ్ చేశాడనుకోండి. అది వేరే విషయం.
అలా హినాటాతో అయిన పరిచయం రోజూ కబుర్లు చెప్పుకునే వరకు వెళ్ళింది. ఆయన నాతో ఎన్నో విషయాలు మాట్లాడేవారు. రోజూ ఎన్నో ఉపయోగపడే సలహాలు చెప్పేవారు. మనుషులు ఇలాగే కదా జీవించాలి, ఎదుటివారికి సహాయపడేలా, సాటివారికి ప్రేమను పంచేలా! జ్ఞానంతో పండిన వృద్దాప్యం, పెరిగిన వయసు యువతకు ఎంతో కొంత ఇవ్వగలగాలి; వారికి ప్రేమనో, మార్గదర్శనాన్నో, కాస్త భరోసానో, ధైర్యాన్నో- అలాకాకుంటే ఒక జీవితాన్ని పూర్తిగా వృధా చేసుకున్నట్టే!
చివరి రోజు హినాటా ఎంతో ఆత్మీయంగా వీడ్కోలు చెప్పారు. భారతదేశం గురించి ఎన్నో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని రోజులు బ్యాంకాక్ లోనే ఉండాలని ఆయన అనుకుంటున్నట్టుగా చెప్పారు.
“జీవితం నుండి పారిపోయేవారుంటారు” అనే వాక్యం మరొకసారి నా మదిలో మెదిలింది, ఆ వీడ్కోలు సమయంలో.
అతడు జీవితం నుండి పారిపోయి ఇక్కడకు వచ్చాడనిపించింది. ఈ ఆఖరి రోజున అది నిజమని పూర్తిగా నమ్మకం కలిగింది.
మరొకసారి నేను హినాటాని తిరిగి కలువలేనని తెలుసు. ఆ విషయం నా హృదయాన్ని దిగులుతో నింపివేసింది.
నాకు అర్థమైంది ఏమిటంటే; లోకానుభవాలతో ఇంకా మలినం కాని దేశదేశాల నుండి వచ్చే, ఏ భేషజాలు లేని నిష్కపటమైన యువతతో గడపడం ఆయన హృదయానికి శాంతినిస్తోందని. వారి గురించి శ్రద్ధగా, ఆపేక్షగా తెలుసుకోవడం – వారికి ఆయన ఇచ్చే వివేకవంతమైన సలహాలు, ప్రేమ వల్ల ఆయనకు ఏదో తెలియని సాంత్వన దొరుకుతోందని.
ఆయనలోని నిగూఢమైన దుఃఖమో, ఒంటరితనమో మరేదో తెలియదు కానీ, దానికి ఇక్కడ ఉపశమనం దొరుకుతోందని అనిపించింది.
*
Wow..excellent write up sir
శ్రీరాం, నిజమే ‘జీవితం నుంచి పారిపోవాలనుకునే వారు’. అందుకే ఒక్కొక్క జీవితం ఒక్కొక్క కథను చెప్తుంది. చాలానే సాహసంతొ కూడుకున్నది మీ ప్రయాణం. . అందుకే మేము ఎప్పుడూ packaged tours లోనే వెళ్ళేది. మాలాంటి senior citizens కు అదే safe, comfort.మీలాంటి యువకులు explore చేయవచ్చు, ఏ స్థితిలోనైన ధైర్యం కోల్పోరు. Australia tour వెళ్ళినపుడు opera theatre చూడటానికి మేమె వెళ్ళి, తప్పిపోయి, ఉద్యోగం ముగించుకుని ఒక young lady ని పట్టుకుని, మమ్మల్ని ఒక దరికి చేర్చేవరకు వదలలేదు. ఇలాగే మలేషియాలొ mall లొ తప్పిపోయి, guide phone no. ఉండింది. ఒక అబ్బాయి ని పట్టుకుని ఫోను చేయించి, మమ్మల్ని బస్సు దగ్గరకు వదిలే వరకు వదలలేదు. Package tours లోను ఇలా సాహసాలు. చాలా బాగా రాశారు.