ఒక్క మంచి సినిమా, ఒకే ఒక్క మంచి సినిమా… కదిలించగలిగే సినిమా, కరిగించగలిగే సినిమా, నిజంగా నవ్వించి, ఏడిపించగలిగే సినిమా అంటూ, ఈ మధ్య మనసు మరీ సినిమా ఫక్కీలో కొట్టుమిట్లాడింది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ల కొద్దిపాటి వెతుకులాటల తర్వాత, అదే వెతుక్కుంటూ వస్తుందిలే అని విసుక్కుని వదిలేసాకా కనిపించిందీ ‘అక్టోబర్’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో; అదీ మన హిందీ సినిమా; మనసు దాహాన్ని తీర్చిన సినిమా.
నిజానికిది సినిమా కాదు, ఒక సుదీర్ఘమైన కవిత. ఓ చెయ్యి తిరిగిన చిత్రకారుడు, కళను దైవంలా ఆరాధించే సృజనకారుడు, పూల రెక్కల వంటి మనసు కలిగిన భావోద్వేగి, అందరినీ సమదృష్టితో చూడగలిగే వేదాంతి… ఇందరూ కలిసి ఒకే చోట ప్రాణం పోసుకున్నట్టుగా, తమ పంచ ప్రాణాలనూ ధారపోసి సృష్టించినట్టుగా ఉందీ సినిమా. దీని అణువణువులోనూ సౌందర్యం తొణికిసలాడింది. సౌందర్యమంటే కంటికి కనిపించే అందం కాదు, జీవితంలోని అన్ని కోణాల్నీ ఉన్నవున్నట్టుగా చూడగలిగే స్పృహ నుండి పుట్టుకొచ్చే అందం. ఒక స్పందనను స్పందనలా పట్టుకోగలిగిన నైపుణ్యంలోనుండి తొంగి చూసే అందం.
అందరూ డ్యాన్ అని పిలిచే డానిష్ వాలియా అనే పాతికలోపు వయసున్న కుర్రాడు, ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ట్రైనీగా పని చేస్తుంటాడు. కొంచెం అమాయకత్వం, కొంచెం అసహనం ఇంకొంచెం కోపం, చాలా ఎక్కువ ముక్కు సూటితనం కలిగి ఉన్న ఈ అబ్బాయి, మర్యాదల ముసుగులు కప్పుకున్న ఈ లోకం పోకడలకు ఇంకా పూర్తిగా అలవాటు పడి ఉండడు.
అలా అందరిలా మారిపోయే క్రమంలో చెప్పలేనన్ని తిప్పలు పడుతుండగా, అతని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఎప్పుడూ ఎదురుగా కనిపించీ, అప్పుడప్పుడూ అలవాటుగా పలకరించీ, అప్పుడో ఇప్పుడో – పార్టీనో, పిక్నిక్ నో అందరితో పాటుగా కలిసి పంచుకున్న, తోటి ట్రైనీ, ‘షూలీ’ అనే అమ్మాయి, హోటల్ మూడో అంతస్తు నుండి క్రిండికి పడిపోయి కోమాలోకి జారుకుంటుంది.
చూడటానికి వెళ్లిన డ్యాన్, వంటి నిండా ట్యూబ్ లతో, వాచిపోయిన ముఖంతో స్పృహ లేకుండా పడి ఉన్న షూలీని చూసి, మొదట్లో అందరిలానే స్పందిస్తాడు. కానీ మెల్ల మెల్లగా అతనికే తెలియకుండా అతడిలో మార్పు మొదలవుతుంది. హాస్పిటల్ కి వెళ్లి షూలీని చూసి రావడం, అక్కడ ఎక్కువ సమయాన్ని గడపటం, అతడికి, ముందు అలవాటుగా, తర్వాత వ్యసనంగా మారిపోతుంది. తనలా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అతనికే అర్థం కాక, కారణాల కోసం వెతుక్కుంటాడు.
షూలీ తనని ఇష్టపడి ఉండవచ్చనీ, అది తనకు అప్పట్లో తెలియకపోయి ఉండవచ్చనీ, అందుకే ఇప్పుడిలా అనిపిస్తోందనీ నమ్మే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నం పెద్దగా ముందుకు సాగకపోయేసరికి, తన మామూలు ధోరణిలో, ఎవరేమన్నా పట్టించుకోకుండా, నచ్చింది నచ్చినట్టు చేయడాన్ని కొనసాగిస్తాడు. హోటల్ పని వేళల్నీ, హాస్పటల్ లో ఎక్కువ సమయాన్ని గడపాలన్న కోరికనూ సమన్వయ పరుచుకోలేక, రెండు పడవల మీదా కాళ్లేసి కాలాన్ని నడిపిస్తాడు. ‘షూలీ ఎప్పుడు కోమా నుండి బయటకు వస్తుందా’ అని ఆశగా ఎదురు చూసే ఆమె కుటుంబ సభ్యులలానైనా కాకుండా -ఎటువంటి ఆకాంక్షలూ, ఆపేక్షలూ లేకుండా, అతడు అక్కడ సమయాన్ని గడుపుతూ, తోచిన సహాయం చేస్తూ ఉంటాడు.
ఆమె మేలుకుని కళ్లు తెరిచి చూసినప్పుడు, ఉప్పొంగిపోయి, సంతోషంతో తలక్రిందులైపోడు. అలా అని, అతడ్ని సరిగా గుర్తైనా పట్టకుండానే ఆ అమ్మాయి, ఈ లోకాన్ని విడిచి పెట్టిపోతే, పిచ్చివాడూ అయిపోడు. చివరికి ఆమె డెత్ సర్టిఫికెట్ కూడా అతనే తెచ్చి పెడతాడు. ‘మనం చేయగలిగింది మనం చేయాలి – వచ్చే ఫలితాన్ని మాత్రం ఎటువంటి పేచీ లేకుండా స్వీకరించాలి’ అన్నదే డ్యాన్ తత్వం. ‘తను మనల్ని గుర్తుపట్టకపోతేనేం, మనం తనని గుర్తు పడతాం కదా’ అంటాడొకచోట. అతడి అతి తక్కువ మాటల్లో ఒకటైన ఈ వాక్యమే, అతని తత్వాన్ని పట్టిస్తుంది.
అందమైన రూపంలో చుట్టుపక్కలే తిరుగుతున్నంత సేపూ, డ్యాన్ కు షూలీపై ఎటువంటి అభిప్రాయమూ కలగనే లేదు. కన్ను వాచిపోయి, ముఖమంతా చెక్కుకుపోయి, ఇంచుమించు నిర్జీవంగా, మంచంపై పడున్న ఆ అమ్మాయిపై అతడికి వాత్సల్యం కలిగింది.
అప్పుడప్పుడూ ప్రియురాలితో మాట్లాడినట్టు మాట్లాడినా, జెలసీ వంటి భావాలను ప్రదర్శించినా, దానిని ప్రేమా అని మాత్రం అనలేం. ఆ భావం ఏమిటీ, ఎందుకు ఎలా కలిగిందీ అనే తర్కాల జోలికి పోకుండా, లోకానికి వెరవకుండా, తనకు తోచినట్టుగా ప్రవర్తించడమే డ్యాన్ గొప్పతనం. అది సరైన పనని చెప్పలేం. కానీ సహజమని మాత్రం ఒప్పుకోగలం.
దర్శకుడు షూజిత్ సిర్కార్ సినిమాలు, వికీ డోనర్ తప్ప మరేవీ చూడలేదు. జీవితాన్ని ఉన్నదున్నట్టు చూపించడం కోసం అతడు పడే తపన, ఈ ఒక్క సినిమాలోనైనా పూర్తిగా అర్థమవుతుంది. ప్రతీ ఫ్రేంలోనూ ఓ కథను ఇముడుస్తాడు. అత్యంత కీలకమైన సంఘటనలనైనా సామాన్యంగానే పట్టుకుంటాడు. అతి సామాన్యమైన క్షణాలకూ సమానమైన గౌరవాన్ని కల్పిస్తాడు. షూలీ, తడికి చేతులు జారి, పిట్టగోడ మీదనుండి పడిపోవడమనే సంఘటన. ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా అతి మూమూలుగానే జరిగిపోతుంది. ఆ సమయానికి అక్కడ పార్టీ జరుగుతుండటంతో, వెనక నుండి వస్తున్న ఉత్సాహభరితమైన సంగీతం, ఆమె పడిపోయాక కూడా కొనసాగుతూ ఉంటుంది.
కొందరి మనుషుల్లోని ఆశావహ దృక్పథాన్నీ, మరి కొందరిలో నిత్యమూ నివాసముండే నిరాశావాదాన్నీ కూడా సహజాతంగా చూపించాడు షూజిత్. అవకాశవాద ధోరణిని మాత్రం, డ్యాన్ అమాయకత్వం ద్వారా ప్రశ్నించాడు.
అంతేకాక, కోమావంటి దీర్ఘకాలికమైన సమస్యలతో బాధపడే వారి బంధువుల, సన్నిహితుల – మానసిక, ఆర్ధిక, సామాజిక స్థితిగతులు ఏ విధంగా అల్లకల్లోలమైపోతాయో చెప్పే ప్రయత్నం చేసాడు. షూలీ తండ్రి చనిపోవడంతో, ఒంటరిగానే ముగ్గులు పిల్లల్ని పెంచుతున్న ఆమె తల్లి, ఓ పక్క హాస్పటల్ లో ఉంటూనే, మరో పక్క కాలేజ్ కి వెళ్లి పాఠాలు చెబుతూ ఉంటుంది. దాచింది కాస్తా, షూలీ ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసేసేందుకు వెనుకాడదు. ‘ఇదంతా ఇక మీదట మా జీవితాల్లో జరుగుతూ ఉండేదే’ అంటూ అంతటి దుఃఖాన్నీ కూడా, నిందలేని మనసుతో స్వీకరిస్తుంది. పువ్వు పూయడం, రాలిపోవడం ఎంత సహజమో, జీవన్మరణాలూ అంతే సహజమని చెప్పే వేదాంత ధోరణిలో సాగుతుంది సినిమా మొత్తం. పెద్ద పెద్ద మాటలు చెప్పకుండానే, భారీ భారీ దృశ్యాలను చూపకుండానే మనసునూ, కళ్లనూ కూడా మాటిమాటికీ తడి చేసిందీ ‘అక్టోబర్’. షూలీ అంటే బెంగాలీలో పారిజాత పుష్పమని అర్థమట. షూలీకి పారిజాత పూలంటే ఇష్టం కావడం, అవి పూయడం అక్టోబర్ నెలలో మొదలుకావడం – ఈ సినిమా పేరు వెనుకనున్న కథ.
నిట్టనిలువుగా రాలి నేలను ముద్దాడే పారిజాత పుష్పాలూ, మాయలా కమ్ముకునే పొగమంచూ, నగరం నడుమన వంగి నిలబడ్డ పచ్చని చెట్లూ, చెట్లను వదిలి ఎగిరిపోయే తెల్లని పక్షులూ…ఇటువంటి అందమైన దృశ్యాలు కొన్ని అక్కడక్కడా కనిపించి, మనసును ఆహ్లాదభరితం చేస్తాయి. పాటల్లేని ఈ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా అక్టోబర్ థీమ్, విచిత్రమైన హాయిని కలిగిస్తుంది. చూస్తున్నంత సేపూ, మనల్ని మన నుండి వేరు చేసి, తెర లోపలి జీవితంలోకి తీసుకెళ్లిపోతుందీ సినిమా. తేరుకుని చూస్తే, ముందు కాసేపు నిలబెట్టేసే నిశ్శబ్దమూ, ఇక తర్వాత తెరిపిలేని ఆనందమూనూ.
*
చాలా మంచి రివ్యూ. సత్యజిత్ రే, మృణాల్ సేన్, మైక్ లీ, కెన్ లోచ్ సినిమాలను తలపించే కథాకథనం.
అవునండి…thank u very much
…విషాదాంతమ్ అంటూ గుర్తు మిగలని సినిమా కు చక్కని రివ్యూ .. థాంక్యూ…
ధన్యవాదాలండీ
చాలా చాలా మృదువుగా ఉంది మీ వచనం, లోతైన విశ్లేషణ, మూవీ చూడాలనిపించేలా… చూడకపోయినా ఇలా చదవడం చాలు అనిపించేలా 🙂 🙂
నా వచనం, విశ్లేషణా మీకు నచ్చినందుకు హ్యాపీ 🙂 ధన్యవాదాలు
టచింగ్!
Thank You sir
భవానీ గారూ
మంచి విశ్లేషణ. చాలా మందికి సినిమా ఎలా చూడాలో దానిద్వారా జీవితాన్ని ఎలా పట్టుకోవాలో భలే గా చెప్పారు. సినిమా చూస్తాను
మీ కామెంట్ చూసి చాలా సంతోషంగా అనిపించింది. మూవీ తప్పక చూడండి. మీకు నచ్చుతుంది. ధన్యవాదాలు
మంచి విశ్లేషణ, భవాని గారు.
ధన్యవాదాలు మధు గారూ
మీరు పొందిన అనుభూతిని మాకూ అందేలా చేసిన మీ అక్షర నైపుణ్యానికి నమస్కారం.!
చాలా సంతోషం ప్రవీణ్ గారూ, ధన్యవాదాలు