పారశివది అసలు మైసూర్ . వాళ్ల నాన్న గారిది కాఫీ వ్యాపారం . ఈ కుటుంబం అంతా ఒక స్వామీజీ భక్తులు .
దాయాదులతో ఏవో తగాదాల వల్ల ఈయన్ని ఆ స్వామీజీ తన ఇంకో భక్తుడైన ఈ మందుల కంపెనీ యజమానికి అప్పగించారట . ఆయనే ఈ మేడమీద ఇల్లు వేసి పెళ్లి కూడా తన భక్తుల కుటుంబంలో అమ్మాయితో చేసి ఇక్కడ కాపురం పెట్టించారు . పారశివని చూస్తే అసలు తగాదాలకు పోయే మనిషిలా కనిపించలేదు . బొద్దుగా తెల్లగా కురచ మనిషి . దానికితోడు అమాయకమైన నవ్వు .
చిన్న ప్రసాద్ మా గురించి ముందే చెప్పడంతో మమ్మల్ని “రాండి … కూసుకోండి ” అని కన్నడ యాసలో ఆహ్వానించాడు . ” కాఫీ తాగుతారా !” అని వంటింట్లోకి వెళ్లబోయిన ఆయన్ని ప్రసాద్ ” ఏం వద్దు మేం స్నానాలు చేసి దారిలో టిఫిన్లు తిని అక్కడే తాగుతాం ” అన్నా వినిపించుకోలేదు . మాకు గ్లాసుల్లో కాఫీ అందించాడు .
అడయార్ హాస్పటల్ కి వెళ్లే ముందు మైలాపూర్లోనే ఒక హోటల్ కి వెళ్లాం . అందరూ ఇడ్లీ సాంబార్ చెప్పారు, నేను మాత్రం పొంగల్ తిన్నాను . నాకు అసలే పొంగల్ అంటే తెగ ఇష్టం . పైగా మద్రాస్ పొంగల్ రుచి భలే వుంది . ఇక్కడ వున్నన్నాళ్లూ బ్రేక్ ఫాస్ట్ ఇదే తింటానని చెప్పేశాను .
హోస్పటల్ కి వెళ్లాం . అక్కడ పెద్ద హాల్లో వున్న కుర్చీల నిండా జనం . నాకు ఒక్క క్షణం ఏదో దిగులు కమ్మేసింది . అక్కడ మన ఆదాయాన్ని బట్టి వైద్యం ఖర్చులుంటాయి . నన్ను బి కేటగిరీ కింద రాశారు . ఏ, బీ కేటగిరీల నుంచి వసూలు చేసిన సొమ్ముతో సీ కేటగిరీ వాళ్లకి ఉచిత వైద్యం అందిస్తారట . అక్కడ ఎక్కువ శాతం తెలుగు వాళ్లే అదీ కోస్తా జిల్లాలనుంచి వచ్చిన వాళ్లు . వాళ్లలో డబ్బున్న వాళ్లు కూడా సి కేటగిరీ కింద రాయించుకుంటున్నట్టు అర్ధమైంది .
రేపు వచ్చి టెస్టులు చేయించుకోవాలన్నారు . అప్పటికే సాయత్రమైంది . నీరసంగా ఇల్లు చేరాం . ప్రసాద్ తిరిగి వెళ్లి పోయాడు . చిన్న ప్రసాద్ పారశివకి మమ్మల్ని అప్పగించి వెళ్లాడు . ఆ రాత్రి మేం భోజనానికి బయటకు వెళ్లబోతుంటే పారశివ తను అన్నం వండేస్తానంటూ పట్టుబట్టాడు . పెద్దగిన్నెడు అన్నం వండి ఫ్రిజ్ లో నుంచి ఒక స్టీల్ డబ్బా తీసుకొచ్చి మాకు చూపిస్తూ ” మా మిసెస్, బాబు వూరికి వెళ్లి వుండారు , ఆమె వారానికి సరిపడా అన్ని రకాల పేస్టులు చేసి పెట్టి వుండాది ” అన్నాడు .
ఆ డబ్బాలో వున్న వాంగీబాత్ గుజ్జు తీసి అన్నంలో కలిపాడు . మూడు పళ్లాల్లో వాంగీబాత్ వడ్డించాడు . కమ్మగా తిన్నాం . మర్నాడు టెస్టులయ్యాకా రెండురోజుల్లో మళ్లీ బయాప్సీ చేయాలన్నారు. అమ్మో మళ్లీ టెస్టులు చేయించుకునే సరికే అలిసిపోయిన నాకు ఇంకా బయాప్సీ అనేసరికి నీరసం వచ్చింది .
పూర్తి మత్తు ఇచ్చి చేస్తామని మెలకువ వచ్చాకా పంపేస్తామన్నారు . ఇక కాస్త అలవాటైంది కాబట్టి ఆ రోజు నుంచి హోటల్ తీసుకుని వుండి పోదామని నిర్ణయించుకున్నాం .
మేం మైలాపూర్లో వున్నన్ని రోజులూ పారశివ చేతి భోజనమే తిన్నాం . చిత్రంగా అంత మహానగరంలోనూ మేడమీద వున్న ఆ ఇల్లు ఒక కుటీరంలాగా వుండేది . కొబ్బరాకులపందిరి లోనుంచి చందమామ కనిపిస్తూ వుంటే ఆ వసారాలో చాపలేసుకుని కూర్చుని మాట్లాడుకునే వాళ్లం .
అక్కడ మేం వున్నన్ని రోజులూ అలసిపోయి ఇంటికి వచ్చిన మాకు ఒక రోజు చిత్రాన్నం , ఇంకో రోజు బిసీబెళబాత్ , ఆ తరవాతి రోజు వాంగీ బాత్ కలిపి పళ్లాల నిండా వడ్డించాడు . వసారాలోనే కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా తిన్నాం .
అప్పుడు పారశివ సాక్షాత్తూ మా ఆకలి తీర్చడానికి అన్నపూర్ణాదేవి పంపిన పరమశివుడే అనిపించాడు .
( వచ్చే సంచికలో |
వుందో లేదో తెలియని వ్యాధికి కీమో థెరపీల వంటి వేదనాభరితమైన ట్రీట్మెంట్ , జుట్టు వూడిపోయి మొహం మాడిపోయి చందమామను రాహువు మింగేసినట్టు విలవిలలాడే నా మనసును చందన లేపనంలా చల్లబరిచిన మనుషుల కధలే అడయార్ కధలు
Add comment