నాకు నా మట్టుకు సలికాలం అంటే – పాప్తాతనే
పొద్దుగాల లేసి సలిమంట పెట్టేటోడు
ఆ బోసి నవ్వు నాకు ఇప్పటికీ జ్ఞాపకమే
తాత తిట్టే తిట్లు నా చెవుల్ల ఇంకా యినబడుతున్నయ్
పాప్తాత అంటేనే చెట్టెత్తు మనిషి – గట్టి పానం
జీవితం చివరి క్షణాల్ల బతుకుమీద
పెద్ద యుద్ధమే చేసిండు
ఊపిరి ఆపలేక బిగబట్టుకున్నడు
సత్తువ పోయినంక తనకు తానుగ ఓడితనుకున్నడు
ఎంతైనా పుట్టిందీ మనిషి పుట్టుకే కదా!
అన్ని గొనాలు తనల దాసుకున్నడు
కోపంగానీ, ఆనందంగానీ అంతే చూపెట్టేటోడు
గుండె నిబ్బరం నిండా నింపుకున్నోడు గన్కనే,
తాతకి మూడో కాలు రాకమునుపు,
తానేడ్చింది ఎప్పుడూ జూడలే
కానీ గా దినం ఏడ్చిండు సిన్న పిల్లగాన్లెక్క
పెయ్యంత ముడతలు అపూటం ముదిరినంక,
మిడిసిల్లకు ఉరితాళ్లు పడుడు శురువయినయి
చాతకాకున్న దినాం తానం చేసేటోడు
చేతికి కట్టె కట్టి ఊరంతా తిరిగేటోడు
ఎట్లున్నడు? మా అన్న అని,
తోబుట్టువులొస్తే కన్నీళ్లు పొంగుకచ్చేయి
ఉత్తి మాటలు పక్కన పెట్టి ఇవురంతోని,
“మనిషన్నంక అన్నీ ఉండాలే బిడ్డా
సుద్దపూసలెక్కుంటే లోకంల బతకలేమ్రా”
అన్నట్టే బతికిండు
మాట పడని మనిషి కాబట్టే –
తన కూర్కం గుండెలమీన తనే నిద్రపోయిండు
సావుని సేతుల్లకి తీసుకున్నడు
ఇయ్యాల తాత లేడు –
సలికాలం అచ్చిన యాటాట
నాతోని కూసోని సలిగాచుకుంటడు
న్యాలమీద తన పేరు రాస్తే మురిసిపోతడు
గా బోసి నవ్వుతో నవ్విపోతడు!
చానా ధైర్యపోడు –
కఠినత్వాన్ని కళ్లకు కట్టేటోడు
సున్నితత్వాన్ని లోపల దాపెట్టేటోడు
తన కాళ్లు ఒంచి కూసుంటే కీళ్ళిరిగిపోయేవి

ఎవులకైనా మోకాళ్ళు బిర్రయితే,
కాళ్ళకి బిర్రుగ తాళ్లుకట్టి పురేసి
బ్లేడుతో బొటనేలు కోసి
నల్లని ఇసంనెత్తుర్ని బయటికి ఇడ్పిచ్చి
సక్కంగ నాటువైద్యం చేసేటోడు
ఎప్పుడైతే బసమ్మ కాలం చేసిందో,
తాత వైద్యం కుంటుబడ్డది
అంతో ఇంతో పుణ్యం చేసిండనో ఏమో
తొంభై మీదనే లవు సక్కంగ బతికిండు
తాత సలి మంటల్ల వాణిబీడీలు తాగుతా
ఒక్క దమ్ము లోనికి తీయంగనే,
రెండు చెంపల్లు లోపల్లంటుకున్నట్టే ఉండేయి
ఎన్ని తాగినా ఇన్నేండ్లు బతకిండంటే గొప్పే
పాపయ్య తాతని మేమంతా,
ప్రేమతోని పాప్తాతా అని పిలిసేటోళ్ళం
మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి పిలువాలని పానం గుంజుతుంది
ఓ పాప్తాతా…!
నిన్ను గుర్తు చేసుకున్న ప్రత్యాప,
నా కండ్లల్ల నీ బోసినవ్వే మెదులుతది!
నీ నెత్తికి రుమాలు చుట్టి నువ్వు నవ్విన నవ్వు గుర్తొచ్చినప్పుడల్లా,
ఆ నవ్వుని పోల్చనీకి ఇంకేనవ్వు దొరుకుతదో అనిపిస్తది?!
*
Add comment