మౌనం ఒక్కోసారి
నాలుగు గోడల మధ్య
గోడ గడియారంలోని
క్షణాల ములికి శబ్దం కూడా
భయంకరంగా, వికృతంగా
శత్రువులా గడగడ
లాడిస్తుంది!
అర్ధరాత్రి
అందరూ ఆదమర్చి
నిద్రపోతున్నారు
తీతువు పిట్ట అరుపులు
ఎక్కడో దూరాన
హృదయ విదారకంగా
రోధిస్తున్న బక్క చిక్కిన
ఎండిన శునకపు రోదన
ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి
ముంపుకోస్తున్న ముప్పును
మను ధర్మ శాస్త్రం
కాబోయే ఆధునిక రాజ్యాంగం
ఈ మోసాన్ని, దుర్నీతిని
చూసి ఆ కుక్క ఆ రాత్రి
అంబేద్కర్ విగ్రహం సాక్షిగా
అతడు చూపుడు వేలును
కన్నార్పకుండా చూస్తూ
కూర్చున్నది!
డియర్ డార్విన్
ఎంతటి మూర్ఖుడవయ్యా
నీ జీవ పరిణామ సిద్ధాంతం
మళ్లీ రాతి యుగంలోకి
వెళ్లిపోయింది!
బ్రతికుండగానే నిన్ను
శాశ్వత సమాధి చేస్తున్నారు.
భవిష్యత్ తరాలకు
కనీసం నీ పేరు కూడా
తెలియకుండా కుట్ర పన్నుతున్న
కుటిల రాజకీయ నాయకులు
అయ్యా డార్విన్
నిన్ను నీవే రక్షించుకోవాలి
జీసస్ లా శిలువ నెక్కి
పునరుత్థానం పొందాలి!
*
Add comment