పాపం

ఒడియా మూలం : పరేష్ పట్నాయక్

తెలుగు అనువాదం : వంశీకృష్ణ

 

ఉదయం పెద్ద తమ్ముడికి అన్నం తినిపించి , చిన్న తమ్ముడిని కాసేపు ఆడించి పదిగంటలప్పుడు “బడికి  కి వెళుతున్నాను “అని అమ్మకు చెప్పాను

“ఇవాళ బడికి వద్దు . మీ నాన్న బడికి వెళ్ళొద్దని  చెప్పమన్నారు “అన్నది అమ్మ

నాకు ఆశ్చర్యం కలిగింది . నాన్న ఎందుకు బడికి వెళ్లొద్దు  అన్నాడు . మా నాన్న ఎప్పుడూ నాతొ ఏదీ చెప్పాడు . నన్నెప్పుడూ బడికి తీసుకుని వెళ్లడం కానీ తీసుకుని రావడం కానీ చేయలేదు . నా చదువు గురించి మాస్టారి తో మాట్లాడింది కూడా లేదు . పుస్తకాలు కానీ , బట్టలు కానీ కొనిపెట్టిందీ లేదు . కానీ ఎందుకివాళ  అకస్మాత్తుగా బడికి వెళ్లవద్దని అంటున్నారు ? నేను పొద్దున్నే తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టింది బడికి వెళ్ళడానికే కదా . అమ్మ ఎప్పుడూ నన్ను బడికి వెళ్లవద్దని చెప్పలేదు . ఇవాళ ఎందుకని ?

బడికి వెళుతున్నాను అని చెప్తాను కానీ నేను నిజంగా బడికి వెళ్ళను . ఊరి కి చివరవున్న పండ్ల తోటలోకి వెళతాను . నాతో పాటు నా స్నేహితులు సెబీ , సెంత్రీ  కూడా బడి ఎగ్గొట్టి వస్తారు , మేముముగ్గురమూ మధ్యాహ్నం దాకా గవ్వలతో ఆడుకుంటాము . చింత చిగురు ను పచ్చి మిరపకాయలతో కలిపి నూరుకుని తింటాము . మామిడిపళ్ళ కాలం లో మామిడిపళ్ళు కోసుకుని , ఉప్పూ కారమూ అద్దుకుని  లాగించేస్తాము . మధ్యాహ్నం దాకా ఆటలు పాటలతో గడిపి ఇంటికి చేరుకుంటాను

ఇంటికి రాగానే మా అమ్మతో “అమ్మా ! ఇవాళ మాస్టారు చాలా పాఠాలు చెప్పారమ్మా ! “అంటాను

అమ్మ “చదివింది చాల్లే కానీ  వచ్చి కాస్త పని అందుకో ! మేకల్ని అక్కడ కట్టేసి ఆవులను తోలుకుని రా ! ఇల్లు వాకిలి శుభ్రంగా తుడిచి తమ్ముళ్లను చూసుకో “అంటుంది

నేను అలాగే అని చెప్పి పనిలో మునిగిపోతాను

నేను నెలకు ఒకసారో , రెండు సార్లో బడికి వెళతాను . బళ్ళో హాజరు పట్టీలో నా పేరు ఇంకా అలాగే ఉంది . మాస్టారు నేను బడికి రావడం లేదని నాన్నకి ఏమైనా ఫిర్యాదు చేశారా ? కానీ నాన్న నా చదువు గురించి అస్సలు పట్టించుకోడు కదా . ఇవాళ బడికి వెళ్లవద్దని ఎందుకు అన్నారు ? నాన్న ఉదయం  నల్లమందు (ఓపియం ) పీలుస్తూ నే లేస్తాడు . పనికి పోయి ఎప్పుడో రాత్రి బాగా తాగి ఇంటికి చేరుకుంటాడు

అమ్మని కొడతాడు . నన్నూ తమ్ముళ్ల మీద గుడ్లు ఎర్ర చేస్తాడు . ఆ సమయం లో అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళవద్దు అంటుంది . అమ్మను కొడుతుంటే మేము భయంభయంగా ఒక పక్కన నిలబడతాము . అమ్మను కొట్టీ కొట్టీ ఎప్పటికో అలసట వచ్చి నాన్న పక్కమీద కూలిన చెట్టులా వాలిపోతాడు . ఈ అర్ధ రాత్రో అమ్మ నాన్నని లేపి ఇంత తినిపిస్తుంది . అమ్మ ఏడుస్తుంది కానీ ఒక్క మాట కూడా అనడు

నాన్న తన పద్దతిలో తానుంటాడు . మేము మా పద్దతిలో మేముంటాము . నా మీద కానీ , తమ్ముళ్ల మీద కానీ , అమ్మ మీద కానీ నాన్న ప్రేమ పడిన గుర్తు లేదు . నాన్న కి తన నల్లమందు అంటేనే ఎక్కువ ఇష్టం. ఒక రోజు మా మాస్టారు పిల్లలని వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు . అప్పటికి నేనింకా బడికి వెళ్లడం లేదు . అప్పుడు మా నాన్న ఇంట్లో లేడు . ఎప్పుడు మాత్రం ఇంట్లో వున్నాడు కనుక .

మాస్టారు మా అమ్మ తో “చూడమ్మా ! మీ అమ్మాయి పాఠశాలకు వెళ్లే వయసు  వచ్చింది . పాఠశాల కి  పంపండి . మన పాఠశాల లో పిల్లలు తక్కువగా వున్నారని , ఎన్రోల్మెంట్ పెరగకపోతే మొత్తంగా మూసేస్తామని ప్రభుత్వం అంటున్నది “అన్నారు .

“పాఠశాల ను మూస్తే మూయనివ్వండి . అదేమైనా మా పాఠశాలా ? బడికి వచ్చి చదువుకుని మా అమ్మాయి ఏమైనా ఊళ్లేలాలా ? ఉద్యోగాలు చేయాలా?” అన్నది .

మాస్టారు కొంత సేపు మౌనంగా ఉండి

“పాఠశాల మూసివేస్తే నా ఉద్యోగం  ఊడుతుంది . నా భార్యా పిల్లలు బజారున పడతారు “అన్నారు దీనంగా .

బజారున పడతారు అన్న మాట మా అమ్మ హృదయాన్ని తాకినట్టుంది . అమ్మ కాస్త మెత్త పడింది . “సరే పిల్లను పంపిస్తాను కానీ  చదువు కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేను “అన్నది .

పంపిస్తాను అన్న మాట తో మాస్టారి మొహం లోకి కళ  తిరిగి వచ్చింది . “మీరు పంపించండి చాలు . ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంటుంది . ఆమె బాగా చదివితే కొంత డబ్బు  కూడా ఇస్తుంది “అన్నారు మాస్టారు

అలా నేను బడికి వెళ్లడం మొదలుపెట్టాను . మొదట్లో నేను రోజూ బడికి వెళ్లేదానిని . కానీ పలక  కానీ , పుస్తకాలు కానీ , పెన్సిల్ కానీ లేదు . మాస్టర్లు నన్ను విసుక్కునేవాళ్ళు . . అమ్మ మాత్రం “నేను మొదలే  చెప్పాను  కదా! ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేనని “అనేది  “చదువు ఉచితమే , కనీసం పలక  బలపం కూడా కొనక పోతే ” ఎలా అనేవాళ్ళు మాస్టర్లు . అప్పటినుండీ నేను బడికి వెళ్లడం లేదు .

పండ్ల తోటలోకి వెళ్ళేది ఎవరైనా చూసి నాన్నకి చెప్పారా ? ఎవరికైనా ఏమవసరం ఉంటుంది ?

అమ్మ మాట విని నేను బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను . కొంతసేపటికి సెబీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది .

“రావా ?” అన్నది

“లేదు . ఇవాళ నేను రావడం లేదు . మా నాన్న  ఇవాళ బడికి వెళ్లొద్దు  అన్నారు “అన్నాను

“ఎందుకని ?”అన్నది సెబీ

“నాకు తెలియదు ”

నా మాట పట్టించుకోకుండా “జామూన్లు  పంటకి వచ్చాయి “అన్నది సెబీ

“అయితే రేపు కోసుకుందాం లే “అన్నాను

సెబీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది

కొంతసేపటికి సెంత్రీ  వచ్చింది

“రావట్లేదా ”

“లేదు ”

“ఎందుకని ?”

“తెలియదు”

“కొత్త కార్డ్స్  తెచ్చాను ”

“రేపు ఆడుకుందాము ”

“మంచి రుచికరమైన పచ్చడి తెచ్చాను ”

“దాచిపెట్టు . రేపు తిందాము ”

కానీ ఆ రేపు ఎప్పటికీ రాదని  ఆ క్షణమ్ లో నాకు తెలియదు

మేమిలా మాట్లాడుకుంటున్నప్పుడు మా నాన్న వచ్చారు . నాన్నని చూసి పరుగు లంకించుకుంది . నా స్నేహితులు మా నాన్న అంటే భయపడతారు “మీ నాన్న కళ్లెప్పుడూ మందార పువ్వులు లాగా ఎర్రగా ఉంటాయి . “అని సెబీ అంటే “మీ నాన్న కి అన్ని బూతు మాటలు ఎలా వస్తాయి ?”అని సెంత్రి  అడుగుతుంది . నేనేమీ మాట్లాడను

నాన్న తో పాటుగా మరొక ముసలివాడు కూడా వచ్చాడు . అతడు చాలా అసహ్యంగా వున్నాడు . నాలుగు దిక్కులా వైపు అనుమానంగా చూడసాగాడు . అతడు నన్ను ఒక్కఉదుటున మింగేశేలా  చూశాడు . నాన్న మా దగ్గరికి వెళ్లి ఆమె చెవిలో ఏదో  గుసగుస గా చెప్పాడు . అమ్మ నన్ను లోపలి కి పిలిచింది .

“ఏంటమ్మా “అన్నాను

“నువ్వు నాన్న తో వచ్చిన మనిషి తో వెళ్ళాలి “అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టుగా

“ఎక్కడికి వెళ్ళాలి ? ఎందుకు వెళ్ళాలి ?”అన్నాను నేను

“నువ్వు వెళ్ళాలి అని చెప్పాను  కదా ! వాదించకు “అన్నది అమ్మ

నేను మొండికేశాను . “నేను అతడితో ఎందుకు ? ఎక్కడికి వెళ్లాలో చెప్పాల్సిందే ” అన్నాను

“గట్టిగా అరవకు . మీ నాన్న సంగతి తెలుసు కదా ! ఎంత కోపిష్టో ? వచ్చి నిన్ను బాదినా బాదుతాడు ”

అమ్మ అన్న మాటకి నేను నిశ్శబ్దం అయిపోయాను

“వెళ్లి నీ బట్టలు సర్దుకో ” అన్నది అమ్మ

ఆ వచ్చిన ముసలి మనిషి తో నేను ఎందుకు వెళ్లాలో ? ఎక్కడికి వెళ్ళాలో ? ఎంతకాలం ఉండాలో నాకు అర్ధం కాలేదు . నా కళ్ళ  లో నుండి నీళ్లు ఉబికి వచ్చాయి . నా ఏడుపును చూసి అమ్మ బాధ పడింది . “ఏడవకు ! బిడ్డా ! మీ నాన్న చూస్తే కొడతాడు “అన్నది అమ్మ . నా కళ్ళ  చివరలనుండి  నాన్నను చూసాను . గడ్డం  తో ఉన్న  నాన్న మొహం హిస్ మని బుసలు కొడుతున్న తాచుపాములా కనిపించింది నాకు . తన కళ్ళలోని నెత్తుటి జీరలు ఒక్క క్షణమ్ పాటు నన్ను భయపెట్టాయి . అమ్మ సర్దుకోమన్నది . ఏం  సర్దుకోను . బట్టలు మాత్రమే సర్దుకోనా ? లేక గోళ్ళ  రంగు , సబ్బు ఇవి కూడానా ? ఒక మగ్గు , అన్నం  తినే కంచం ? నేను గందరగోళం లో పడిపోయాను . నా కళ్ళ  నుండి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి . అలా నిశ్చలంగా నిలబడిపోయాను.

అమ్మ ఒక పాత చీర లో కొన్ని వస్తువులు మూట గట్టి “పద  సమయం లేదు “అన్నది నన్ను నాన్న వైపు లాక్కుని వెళుతూ  అమ్మ చేతిలో మూట చూసి నాన్న “ఇంత  లగేజి ఎందుకు ? ”

“ఎక్కువ ఏమీ లేవు . దానికి కావలసినవి అందులో వున్నాయి . ఉండనివ్వు “అన్నది

నేనా మూటను చంకను పెట్టుకున్నాను . ఈ మూటేనా ఇక్కడ నాకున్నది? ఇదే నా సర్వస్వమా ?

నాన్న దగ్గరకు వచ్చి “చూడు  ఎవరు ఏమి అడిగినా నువ్వేమీ మాట్లాడకూడదు “అన్నాడు

అప్పడు అమ్మ నాన్న దగ్గరకు వచ్చి “నువ్వెందుకు దానికి ఏదీ చెప్పవు ? తన మామయ్య దగ్గరకి అది వెళుతున్నదని చెప్పు “అన్నది . నాకు తెలిసి మాకు చుట్టాలు అంటూ ఎవరూ లేరు . ఈ మావయ్య ఎక్కడినుండి వచ్చాడు ? నేను పుట్టినప్పటి నుండీ నేను ఎక్కడకూ వెళ్ళలేదు . మా ఇంటికి ఎవరూ రాలేదు . మా నాన్న నెత్తుటి కళ్ళను చూస్తూనే నేను పెరిగాను . ఈ ముసలాయన మామయ్య వాళ్ళ ఊరినుండి వచ్చాడా ? మామయ్య వాళ్ళ వూరికే అయితే ఇంత రహస్యం ఎందుకు ?

నాన్న ఆ ముసలాయన దగ్గరకు వచ్చి “ఇక బయలుదేరండి . ఇప్పటికే ఆలస్యం అయింది “అన్నాడు

ముసలాయన బయలు దేరాడు . అయన వెనకే నేను . నాన్న మాతో పాటు నడవసాగాడు . కొంత దూరం వెళ్ళ్లాక  వెనక్కు తిరిగి చూశాను . అమ్మ తమ్ముళ్లు ఇద్దరినీ గట్టిగా పట్టుకుని నిలుచుని ఉంది . అమ్మ కళ్ళలో నీళ్లు ఉన్నాయా ? నాన్న వంతెన దాకా వచ్చి ఆగిపోయాడు . నెమ్మదిగా మా ఊరు  కనుమరుగై పోయింది . అదృష్టవశాత్తు మమ్మల్ని ఎవరూ చూడలేదు .  తల వంచుకుని నడవసాగాను . ఇంక  ఎప్పటికీ ఈ ఊరు  రానేమో . ముసలాయన చేతికఱ్ఱను నెలకు తాటిస్తూ నడుస్తున్నాడు . ఒక్క మాటకూడా మాట్లాడటం లేదు . నేనూ నిశ్శబ్దం గానే వున్నాను . బాలకేశ్వర స్వామి వారి ఆలయ గోపురం , ఊరు  ముందున్న పెద్ద మర్రి చెట్టూ మాయమయినాయి .

నేను నెమ్మదిగా గొంతు పెగల్చుకుని “నేనెక్కడికి వెళుతున్నాను ? “అన్నాను

ముసలివాడు  నా వంక తిరిగి “మా ఇంటికి “అన్నాడు

“ఎంత దూరం ”

“ఇంకో నాలుగు మైళ్ళు ”

“మీరు నన్ను ఎందుకు తీసుకుని వెళుతున్నారు ?”

“నిజంగా నీ కేమీ తెలియదా ?”

“లేదు  నిజంగా నా కేమీ తెలియదు ”

“మీ నాన్న నిన్ను నాకు అమ్మాడు ”

నేను ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం మర్చిపోయి నిట్రాట లా నిలబడిపోయాను

అమ్మాడా ? నేనేమైనా నీళ్ల  కుండనా  అమ్మడానికి ? నేనేమైనా అరటిపళ్ళ  గెలనా ? లేక ఇంట్లో నీళ్లు కాచుకునే అల్యూమినియం పాత్రనా ? అమ్మడానికి . ఎంతకు  అమ్మాడు ? ఈ ముసలాయన నన్ను ఎంతకు  కొన్నాడు ? నేనెప్పటికీ మా ఊరు  వెళ్ళ లేనా ? నా స్నేహితులతో ఆడుకోలేనా ? అమ్మా అంటూ అమ్మను చుట్టేసుకోలేనా ? తమ్ముళ్ల  తో గిల్లీ  కజ్జాలు ఆడలేనా ?

ఆ ముసలివాడు  బోసి నోటి తో ఒక చిన్న నవ్వు నవ్వి “భయపడకు ! నిన్ను రాణి లా చూసుకుంటాను “అన్నాడు

అతడు నన్ను రాణి లా చూసుకుంటాడట ? అతడేమైనా రాజా ? అతడితో నేనేమీ మాట్లాడలేదు . దారిలో మరొక వూళ్ళో మేము ఆగాము . బొరుగుల అన్నం తిన్నాను . అతడు టీ  తాగాడు . నన్ను అడిగితే వద్దు అన్నాను . ఒక చెట్టుకింద కొంత సేపు విశ్రాంతి తీసుకున్నాము”

“నీకు బాధగా ఉందా ? “అని అతడు అడిగాడు

నేనేమీ మాట్లాడలేదు . అతడు ఏదో  మాట్లాడుతున్నాడు . నా మనసును గెలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు . మా వూళ్ళో మనకు  మాత్రమే  ప్రత్యేకమైన ఇల్లు ఉంది . అది చాలా పెద్దది .  నువ్వు వూళ్ళో ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరం లేదు . ఒకవేళ ఎవరైనా అడిగితే “ఏమి చెపుతావు నువ్వు ” అని ప్రశ్న వేస్తున్నట్టుగా ముసలివాడు  అడిగాడు

“ఏమి చెప్పాలి ?”అన్నాను నేను

“ఏం  చెప్పాలి అంటే?”  అని ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగి ,” వద్దు ఏమీ చెప్పవద్దు “అన్నాడు

ఈ మాట చెప్పేసరికి మేము వాళ్ళ వూరు చేరాము. ముసలివాడు  ఇల్లు ఊరి చివర వుంది. అప్పటికే చీకటి పడింది . అది చాలా పెద్ద ఇల్లు .  తాళం వేసి వుంది . ముసలివాడు  తాళం తీసి లోపలి నడిచాడు. దీపం వెలిగించాడు. ఇంట్లో ఎవరూ వున్న  ఆనవాళ్లు లేవు. నాకు భయం వేసింది. ఈ ఇంట్లో ఎంత కాలం ఉండాలి?

“నేను వంట చేయనా ?’అని అడిగాను

“వద్దు . నాకు వంట వండటం వచ్చు ”

“మరి ఇల్లు వూడవనా ?”

“వద్దు . చాలా దూరం నడిచి నువ్వు అలసిపోయి ఉంటావు . పోయి మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకో ”

ముసలివాడు  గదిలోకి దారి తీసాడు . గదిలో చీకటిగా వుంది . దీపం వెలిగించాడు . ఆ గుడ్డి  దీపం చీకటిని బయటకు నెట్టేయలేక పోతున్నది . మంచం మీద నా మూటను పెట్టి నేను కూడా ఒక మూట లాగా పడుకున్నాను . అలాగే నిద్రలోకి జారిపోయాను . రాత్రి ఎప్పటికో అతడు నన్ను నిద్ర లేపాడు . అప్పటికి వంట పూర్తి అయింది . అతడు వడ్డిస్తే మంచి ఆకలి మీద ఉన్న  నేను తిని అట్లాగే మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయాను .

ఉదయం లేవగానే ఇంటి వంక పరిశీలనగా చూసాను . చాలా పెద్ద ఇల్లు అది . మా చిన్న గుడిసె లాగా కాదు . నాలుగో ఐదో  గదులు  వున్నాయి. అల్మారాలు వాటి నిండా సామాను . ఇంటి ముందు పెద్ద బావి . ఒక పక్కగా  ధాన్యం గాదె . దాన్నిండా ధాన్యం . కానీ ప్రకృతి పిలుపుకు బయటకు వెళ్ళవలసిందే .

ముసలివాడు  మధ్యాహ్నానికి భోజనం తయారు చేస్తున్నాడు . నేను వెళ్లి పక్కన కూర్చున్నాను . మా ఇద్దరి మధ్యా సంభాషణ ఇలా సాగింది

“గ్రామస్తులు అంత మంచి వాళ్ళు కాదు . నువ్వు ఈ ఇల్లు దాటి బయటకు వెళ్లే సాహసం చేయవద్దు “అన్నాడు

“మీతో పాటు ఇంకెవరూ లేరా ?”అని అడిగాను

“ఇంతకు ముందు వుండేవాళ్ళు . ఇప్పుడెవరూ లేరు ”

“వాళ్లెక్కడికి వెళ్లారు ”

“నా భార్య చనిపోయింది . ఇద్దరు పిల్లలు అస్సాం వెళ్లిపోయారు. ఇంతవరకూ తిరిగి రాలేదు  ”

“వాళ్ళు బతికే ఉన్నారా ?”

“ఎవరికీ తెలుసు. వాళ్ళు వెళ్ళిపోయి పదేళ్లు దాటింది ”

“ఇల్లంతా ఖాళీగా వుంది ”

“ఇక వుండదులే , ఇప్పుడు నువ్వు వచ్చావుగా ”

“ఇక్కడ నేనేమి చేయాలి ?”

అతడేమీ మాట్లాడలేదు . నిశ్శబ్దంగా  మరొక కట్టే పొయ్యిలోకి దూర్చాడు . మంట  భగ్గుమన్నది

నేను బయటకు వస్తే ఆ వీధిలో వున్న చాలామంది పిల్లలు పెద్దలు గుమికూడి నావంక కళ్ళు విప్పార్చుకుని చూస్తూ చాలా ప్రశ్నలు వేశారు . నేను దేనికీ సమాధానం చెప్పలేదు . అతడు నన్ను దేనికీ జవాబు చెప్పవద్దని హెచ్చరించాడు కదా . అయినా వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే వున్నారు

“మీ ఇల్లెక్కడ ?”

“ఈ ముసలాడు  నిన్ను ఎక్కడనుండి తీసుకుని వచ్చాడు ?”

“నీ వయసెంత ?”

“నువ్వు నిర్బంధం లో ఉన్నావా ?”

“మీ తల్లి తండ్రులు ఇతడితో  ఎలా పంపించారు ?”

నేను ఏ ప్రశ్నకూ జవాబు చెప్పలేదు . వాళ్ళ ప్రశ్నలు వింటూ ఉండిపోయాను . నా కళ్ళు వాళ్ళ మాటలు వింటూ విశాలంగా విప్పారాయి

“అమాయకురాలు లాగా వుంది ”

“చూడండి . మాటలు రావు అనుకుంటా !”

“మూగదో , చెవిటిదో కాకపోతే తల్లి తండ్రులు ఈ ముసలాడితో పంపి ఎందుకు వదిలించుకుంటారు ?”

“చిన్న పిల్ల లాగే ఉంది ,. ఈ ముదనష్టపు ముసలాడు తనతో ఈ పిల్లను ఎందుకు తీసుకుని వచ్చాడు ?”

నేను అన్నీ విన్నాను . అంతా అర్ధం చేసుకున్నాను కానీ ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు . నేను మళ్ళీ ఇంటిని సర్వే చేయడం మొదలు పెట్టాను . బయటకు వెళ్లిన అతడు కొన్ని కూరగాయలు , ఆకు కూరలు పట్టుకుని వచ్చాడు . ఎందుకో తెలియదు కానీ అతడు మళ్ళీ నన్ను హెచ్చరించాడు “చూడు ఈ ఊరి  వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు . ఎవరితోనూ మాట్లాడకు “నేనేమీ మాట్లాడలేదు . కానీ వార్త ఊరంతా ఎలా పాకిపోయిందో , సాయంత్రం అయ్యేసరికల్లా పంచాయతీ మొదలు అయింది . ఇలా పంచాయతీ పెట్టడం మా ఊళ్ళో  కూడా వుంది కనుక నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు . ముసిముసి చీకటి పడుతుండగా  అతడిని పంచాయతీ దగ్గరకు  పిలిచారు . పంచాయతీ జరిగే ప్రదేశం అతడి ఇంటికి కాస్త దూరం లో వుంది . నేను ఇంట్లో వుండే అంతా చూడగలుగుతున్నాను . వినగలుగుతున్నాను .

“మీ ఇంట్లో ఉన్న  అమ్మాయి ఎవరు ? “పంచాయతీ పెద్ద ప్రశ్న

“ఆమె అమ్మాయి . అంతకంటే మీకు ఏమి కావాలి ?” ముసలివాడు  జవాబు

“ఆమెను మీ ఇంట్లో ఎందుకు వుంచుకున్నావు ”

“ఆమె ఇల్లు చూస్తుంది ”

“మీ ఇద్దరి మధ్యా ఉన్న  సంబంధం ఏమిటి ?”

“నేను ఒంటరిగా వున్నాను . రోజువారీ పనులు చేయడానికి ఆమెను తెచ్చుకున్నాను . దానివలన మీకేమిటి నష్టం ?”

ముసలివాడు  సమాధానం విన్న పంచాయతీ పెద్ద “ఇదుగో చూడు నీ మంచి కోసమే చెపుతున్నాను . ఇంతకుముందు నువ్వు ఇలా చాలా చేశావు  . నువ్వు ఎలాంటి వాడివో, నీ ప్రవర్తన ఎలాంటిదో ఈ వూళ్ళో అందరికీ తెలుసు . జరగరానిది ఏదైనా జరిగితే ….. ”

ముసలివాడు  మధ్యలో అందుకుని “మీరా అమ్మాయిని చూశారా ? చాలా చిన్న పిల్ల . ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడటం మీకు పద్దతి కాదు “అన్నాడు

ముసలివాడు  మాటలు చాలా మామూలుగా ఉన్నా  పంచాయతీ పెద్ద మాటలలోని అర్ధం నాకు బోధపడలేదు . అతడు ఇంతకు  ముందు కూడా ఇలా ఆడపిల్లల్ని కొనుగోలు చేసుకుని తీసుకుని వచ్చాడా ? అలా అయితే ఆ ఆడపిల్లలు ఎక్కడ వున్నారు ? . పంచాయతీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది . ఆ తరువాత చెప్పుకోదగిన సంఘటన ఏదీ జరగలేదు . రోజులు గడుస్తున్నాయి

కానీ నేను ఇంటి ముందుకో , వెనక్కో  వెళ్ళినప్పుడు చాలా మంది వందల , వేల ప్రశ్నలు వేస్తుండేవారు . నేను వేటికీ జవాబు చెప్పేదానిని కాదు . వాళ్ళ ప్రశంలు ఇలా ఉండేవి

“నువ్వు ఎక్కడ పడుకుంటావు ? మంచం మీదా ? నేల  మీదా ?”

“అతడు నిన్ను ఎలా చూస్తాడు . భార్యలా చూస్తాడా ? కూతురులా చూస్తాడా ?”

“నీకు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తున్నదా ?”

“ముసలివాడు  మంచివాడు కాదు ”

“ముసలివాడు  నువ్వు ఏమని పిలుస్తావు ?”

అవును ముసలివాడు  నేను ఏమని పిలుస్తాను ? నాకూ అతడికీ మధ్య వున్న  సంబంధం ఏమిటి ? ఈ ప్రశ్నలు నన్ను ఇబ్బ్బంది పెట్టేవి ? కానీ ఏ జవాబూ  నా దగ్గర లేదు

మళ్ళీ పంచాయతీ పెట్టారు . ఊళ్ళో  ఉన్న  ఆడవాళ్ళంతా  స్నానాల రేవు దగ్గరా , కూరగాయల మార్కెట్ దగ్గరా  ఒకటి రెండు అనేమిటి నలుగురు గుమికూడిన ప్రతి చోటా  గుస గుస లాడుకుంటున్నారు . చర్చిస్తున్నారు . తీర్పులు చెపుతన్నారు . పరిస్థితిచేయి జారిపోతున్నదని మథన పడుతున్నారు . ఏదో  ఒకటి చేయాలనీ తాపత్రయపడుతున్నారు . ఎంతమాత్రమూ సహించకూడదు అంటున్నారు

ముసలివాడు  మళ్ళీ పంచాయతీ కి పిలిచారు . పంచాయతీ పెద్ద

“దీనికి నీ సమాధానము ఏమిటి ? “అని ప్రశ్నించాడు నేరుగా ఏ ఉపోద్ఘాతమూ చెప్పకుండా

ముసలివాడు  కూడా “నాకేమీ తెలియదు ? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ?”అని అడిగాడు

‘నీకు తెలియదా ?  ఊరంతా తెలిసింది నీకు తెలియదా . నాటకాలు ఆడవద్దు . నువ్వు ఒకళ్ళ ఇంటికి రావు . మరొకరు ఎవరూ నీ ఇంటికి రారు . కానీ అది నీ ఇంట్లో జరిగింది . ఎలా జరిగిందో , ఏం  జరిగిందో నువ్వు చెప్పాలి ?”అని పంచాయతీ పెద్ద గట్టిగా ప్రశ్నించాడు

అతడు “మీరు చెప్పేది ఏదో  నేరుగా చెప్పండి . ఏమి జరిగిందో ?”అన్నాడు

“నీ ఇంట్లో ఉన్న  అమ్మాయి  గర్భవతి . ఈ పాపం ఎవరు చేసారు ?”

“నేనెలా చెప్పగలను . నా వయసు  ఎనభయి ఏళ్ళు . పదేళ్ల పిల్ల ఆ అమ్మాయి . ఆమెనే అడగండి “అతడు స్థిరంగా చెప్పాడు

పంచాయతీ పెద్ద నన్ను పిలిపించాలని నిర్ణయం చేశాడు . నాకు పిలుపు వచ్చింది నేను వణుకుతూ , నీళ్లు నిండిన కళ్లతో పంచాయతీ దగ్గరకు వచ్చాను .

“నీ ప్రస్తుత పరిస్థితి కి కారణం ఎవరు ? ఈ పాపం లో ఎవరికీ భాగం ఉంది ?” పంచాయతీ పెద్ద అడిగాడు . నేను కళ్ళెత్తి అతడి వంక చూశాను . అతడి కళ్ళు నిప్పు కణికల్లా  భగ భగ  మంటున్నాయి . పంచాయతీ వంక చూసాను . అందరూ గుమికూడి ఉనాన్రు . మహా పాపం జరిగింది . దీన్ని ఎంత మాత్రమూ సహించరాదు . ఈ అకృత్యానికి ఎక్కడో ఒక చోట అడ్డు పడాలి . న్యాయం జరగాలి . న్యాయం జరగాలి . గోల గోల గా నినాదాలు వినవస్తున్నాయి

వణుకుతూ నేను నోరుతెరిచాను . కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను . కొన్నాళ్ల క్రితమే నా నాలుకను తెగ్గోశారు.

*

వంశీ కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు