సమకాలీన కథ గురించి రచయితల అభిప్రాయాలను “సారంగ” ఆహ్వానిస్తోంది. ప్రశ్నలు ఇవే వుంటాయి. కానీ, జవాబులు వివిధ రచయితల నుంచి ప్రచురిస్తున్నాం. ఈ ప్రశ్నలకు జవాబులు మీ దగ్గిర వుంటే మీరూ రాయచ్చు. editor@saarangabooks.com కి మీ జవాబులు పంపించండి. ఈ వారం జవాబులు చరణ్ పరిమి ఇస్తున్నారు.
2010 నుంచి 2023 వరకు వచ్చిన కథలపై వస్తుపరంగా, శిల్పపరంగా మీ అభిప్రాయాలు.
మా కన్నా పదేళ్ల ముందు రాయడం మొదలుపెట్టిన వాళ్ళ కథలు, నాతోపాటు రాస్తూ వస్తున్న రైటర్స్ కథలు ఈ టైమ్‌లో వచ్చాయి. 21వ శతాబ్దంలో న్యూ ఏజ్ కథలు మొదలైన కాలం ఇది. సాఫ్ట్‌వేర్ బూమ్, విదేశాలు వెళ్ళిన వాళ్ళ కుటుంబాలు, జీవితాల్లో వచ్చిన మార్పులు, మెట్రోపాలిటన్ లైఫ్, అర్బన్ వర్కింగ్ ఉమెన్ సంఘర్షణలు, పిల్లలు విదేశాలకు వెళ్లిపోయి ఒంటరిగా మిగిలిన తల్లిదండ్రుల కథలు, మెటీరియలిస్టిక్ మెంటాలిటీస్ పెరిగిన ఈ క్రమంలో సోల్ సెర్చింగ్ మీద వచ్చిన కథలు. ఇవన్నీ బహుశా ఇదే సమయంలో మొదలయ్యాయి.
కుప్పిలి పద్మ నగర జీవితం మీద రాసిన కథలు ఆ టైం యువతుల సంఘర్షణలకు మంచి ఉదాహరణ. అలాగే ఖదీర్‌బాబు రాసిన ‘బియాండ్ కాఫీ’ కథలు. స్త్రీ పురుష సంబంధాలు, ఒంటరితనం గురించి యాంత్రిక జీవితం తెచ్చిన మార్పులను ఆ కథల్లో ఆవిష్కరించారు.
ఇంతకుముందు సామాజిక సమస్యల మీద కథలు ఉండేవి. ఈ టైంలో మాత్రం వైయక్తిక కథలు పెరిగాయి. రాట్ రేస్ లాంటి లైఫ్ మొదలయ్యాక దాని దుష్ప్రభావాలను వైయక్తిక కథల రూపంలో చెప్పగలం అని రచయితలు కథలు రాసి చూపించారు. వెంకట్ శిద్దారెడ్డి ‘సోల్ సర్కస్’ కథలు, అఫ్సర్ రాసిన ‘ఐ’, అరిపిరాల సత్యప్రసాద్ రాసిన ‘డబుల్నాట్’, నేను రాసిన ‘అన్ఆర్టిస్ట్ బయోగ్రఫీ’ ఇలాంటివన్నీ ఆ తరహాలోనివే.
బహుశా శిల్పంలో డిస్ట్రక్టివ్ నేరేటివ్ స్టైల్ ఊపందుకున్న కాలం ఇది. పాత తరహాలో ఆ రోజుల్లో అని పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లకుండా అబ్రప్ట్‌గా టైం పీరియడ్‌ని మార్చుకోవడం ఒక టెక్నిక్‌గా వచ్చిన కథలు. పత్రికల్లో షార్ట్ స్టోరీ మరింత షార్ట్ అయిపోయిన కాలం కూడా ఇదే కాబట్టి శిల్పం, టెక్నిక్‌లో కూడా మార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్ణన తగ్గి సూటిగా చెప్పడం పెరిగింది. ఓపెన్ ఎండింగ్ ఉండే కథలకు రిసీవింగ్ పెరిగింది. బరువైన వాక్యాలతో కాకుండా సులభంగా చదివించే కథలను పాఠకులు ఇష్టపడటం కనిపిస్తుంది.
వెబ్ మ్యాగజైన్లు విరివిగా వచ్చి పత్రికలు మొహం చాటేసిన కథలకు వేదిక అయ్యాయి. కాబట్టే కుల వివక్ష, ఎల్జీబీటీ వర్గానికి సంబంధించిన కథలు వెబ్ పత్రికల ద్వారా బయటికి వస్తున్నాయి.
చిత్రకళ, ఫోటోగ్రఫీ, నృత్యం, సినిమా లాంటి కళల నేపథ్యంలో నేను రాసిన కథలు ఈ కాలంలో వచ్చిన మార్పులు సూచించేవే. సైన్స్ ఫిక్షన్, చారిత్రక కల్పన కథలు పల్ప్ ఫిక్షన్ ముద్ర నుంచి బయటపడి సీరియస్ లిటరేచర్‌గా గుర్తించబడింది కూడా ఈ పదేళ్ల కాలంలోనే అనుకుంటాను. అనిల్.ఎస్.రాయల్ లాంటి వాళ్ళ సైఫై కథలు, కాలయంత్రం, రీబూట్ ఉత్తమ కథల సంకలనాల్లో చోటు దక్కించుకోవడమే దీనికి ఉదాహరణ. ఇది మంచి పరిణామం.
ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ రాయడం మొదలయ్యాక ఇంకా షార్ట్(మైక్రో) ఫిక్షన్ కథలు సాహిత్యంలో మొదలయ్యాయి. ప్రస్తుతం మన యావరేజ్ అటెన్షన్ స్పాన్ 2015కి 25% తగ్గిపోయింది. ఇప్పుడు మరింతగా తగ్గింది. కాబట్టి శిల్పపరంగా మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.
తెలుగు కథా సాహిత్యంలో గత రెండు దశాబ్దాలుగా వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించగలిగాయా?
నేను చదివినంతవరకు గమనించింది చెప్పగలను. తెలుగు సాహిత్యంలో సామాజికంగా, వ్యక్తిగతంగా, కథా వస్తువులోను, కథల్లోనూ మార్పులు వచ్చాయి. మానవ సంబంధాలలో వచ్చిన మార్పులను ఎక్కువగా కథలుగా రాస్తున్నారు. సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ అస్తిత్వం గురించి 2010 తర్వాత ఎక్కువ కథలు వచ్చి ఉండాలి. దళిత అస్తిత్వంలో దళిత క్రైస్తవ జీవితం ఒక భాగమే అని చెప్పిన సమయం ఇది. ఎండ్లూరి మానస ‘బొట్టు’, ఇండ్ల చంద్రశేఖర్ ‘దేహయాత్ర’, మెర్సీ మార్గరెట్ రాసిన కథలు దళిత జీవితాల్లో కొత్త కోణాల్ని పరిచయం చేశారు.
అంతర్జాతీయ మార్పులు మన కథల్లో ఎక్కువగా చేరినట్టు కనపడదు. యూఎస్‌లో రేసిజం ఆసియావాసులను ఇబ్బంది పెట్టడం కావచ్చు. సిరియా, అఫ్గానిస్థాన్ అంతర్యుద్ధాలు కావచ్చు.. ఇలాంటివి కథల్లోకి వచ్చినట్టు కనపడదు.
చిత్రకారుడు బాలి గారు రాసిన ‘కథలాంటి జీవితం’ అనే కథ చదివాను. అమెరికాలో ఒక ఇరాక్ వ్యక్తి అంతర్మథనం అతని కొలీగ్ అయిన తెలుగు యువతితో పంచుకోవడం, సద్దాం హుస్సేన్ మరణం తర్వాత ఈ తెల్లజాతీయులు ముస్లిం దేశాల ప్రజలను చూసే దృష్టికోణం మీద ఆ కథ సాగుతుంది. అంతర్జాతీయ పరిణామాలు వ్యక్తిగత జీవితాల మీద చూపించే ప్రభావం గురించి తెలుగు కథలు అంతగా రావడం లేదు అనిపిస్తుంది. Intrapersonal New Age కథలు మరిన్ని వస్తాయి కానీ భిన్న దృక్పథాలు, ఫిలాసఫీస్ నుంచి కథలు ఎంతవరకు వస్తాయో చూడాలి.
మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?
వెబ్ మ్యాగజైన్స్‌లో, సారంగ, ఈమాట, సంచిక నాణ్యమైన కథలు ఇస్తారు. నిజానికి పత్రికల్లో కథలు సోఫిస్టికెటెడ్‌గా ప్రజెంట్ చేసే పరిస్థితిలో కొన్ని వివాదాస్పద, నిర్మొహమాటంగా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నప్పుడు నా ఛాయిస్ సారంగా లాంటి వెబ్ మ్యాగజైన్.
అలాగే కథా సంకలనాల్లో మంచి కథలు ఉంటాయి. సాక్షి, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో రెగ్యులర్‌గా మంచి కథలు దొరుకుతాయి.
గత రెండు దశాబ్దాలుగా వస్తున్న కథావిమర్శ మీకు తృప్తినిచ్చిందా?
కథా విమర్శలో న్యూఏజ్ కథా విమర్శ అసలు మొదలే కాలేదు అనిపిస్తుంది. కొత్త కథకులు పెరిగిన దాంట్లో ఒక్క శాతం కూడా విమర్శకులు పెరగలేదు. పత్రికల్లో కథ మీద రివ్యూ రాసి దాన్నే విమర్శ అంటున్నారు. Constructive Criticism ఇంకా రావాల్సిఉంది. పాత సిద్ధాంతాలతో, Predetermined Viewsతో చేసే విమర్శ ప్రస్తుత తరానికి అవసరం లేదు. విమర్శించే తరం ఒకటి కొత్తగా రావాలి. విమర్శను రచయితలు కూడా ఆహ్వానించే ధోరణి లేకుంటే ఇక రాకపోవచ్చు.
కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏ విధంగా దోహదపడుతున్నాయి?
నిజానికి కథా సంకలనాలే ఎక్కువ దోహదం చేస్తున్నాయి. పది మంచి కథలు లేదా పదిమంది నాణ్యమైన రచయితలు ఒకే చోట దొరికినప్పుడు పాఠకులకు అది ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. యువపాఠకులు రెగ్యులర్‌గా పత్రికలు, వెబ్‌సైట్లు ఫాలో అవుతారో లేదో చెప్పలేము. బుక్ ఫెయిర్‌లో విరివిగా పుస్తకాలు కొని, తీరిగ్గా ఉన్నప్పుడు చదువుకుంటున్నారు. నేను ఒక పాఠకుడిగా కథా సంకలనాలు ఇష్టపడతాను. ముఖ్యంగా సాహిత్య అవార్డులు పొందిన పుస్తకాలు కొత్త పాఠకులకు మొదటి ఛాయిస్‌గా ఉంటున్నాయి. ఆ విధంగా సంకలనాలు కథా ప్రయాణానికి బాగానే దోహదం చేస్తున్నాయి.
*
Add comment