వెనిస్ పశ్చిమ ఫ్లోరిడాలో అట్లాంటిక్ కి దగ్గరగా ఉన్న పాత తరహా ఊరు. ఊరంతా వెచ్చని పచ్చదనం. వింత నిశ్శబ్దం. ప్రపంచంతో నిమిత్తం లేనట్టుగా ఉంటుంది. అక్కడకి చేరిన రెండో రోజు అనుకుంటాను. కిటికీలోంచి చూస్తుంటే పెద్ద ట్రక్కు పడవని లాక్కుంటూ వెళుతోంది. ఓ పెద్దావిడ పెంపుడు కుక్కతో నింపాదిగా నడుస్తోంది. దూరంగా చర్చి బెల్లు మ్రోగింది. రోజూ అవే దృశ్యాలు! వినీత సొంత దీవిలా ఉందని మురిసిపోయింది. మా ఆరేళ్ళ కావ్యకి ఇంటెదురు పార్కు విపరీతంగా నచ్చింది.
గోడకి అతికించిన కాగితాల్లో, ఖాళీ ఊహల్లో దీవులు బాగుంటాయని తొందరగానే తెలిసొచ్చింది. మనిషికి మనుషుల ప్రపంచం తప్పదు. చుట్టుపక్కల స్నేహితులు, తోటి దేశస్థులు లేకపోవడం చాలా వెలితిగా ఉండేది. ఒంటరి దీవిపై తప్పి తిరుగుతున్నట్టు ఐదేళ్లు గడిపాము. ఈ మధ్యన రెండు నెలల క్రితం టాంపాకి మారడంతో ఊపిరి పీల్చుకున్నాము. కొత్త ఊరు, కొత్త స్నేహితులు…జీవితం ఒక్కసారిగా వేగం పుంజుకుంది. నేను, వినీత పాత బాకీ తీర్చాలనే తొందరలో ఉన్నాము.
***
న్యూ టాంపా, శుక్రవారం మధ్యాహ్నం
రేపటి కమ్యూనిటీ వేడుకకి రెండు వందల మంది వస్తారని అంచనా. నిర్వాహక బృందంలో వినీత ముఖ్యపాత్ర పోషిస్తోంది. రోజంతా సెల్ వదలకుండా తిరుగుతూ, మధ్యలో నాకో సెకనిస్తూ తెగ హైరానా పడుతోంది. “విడుదలైన ఖైదీలని రేపు జనజీవన స్రవంతిలో కలుపుకుంటారు” అనగానే జోకనుకుంది. నవ్వి ఊరుకోకుండా అతిథులకి ఆరారగా సందేశాలు పంపే పని నాకు అప్పజెప్పింది.
పొడుగాటి ఈ-మెయిలుకి హంగులు అద్దుతుంటే కావ్య వచ్చింది.
స్కూలు బ్యాగు ఓ మూల పెట్టి, “డాడీ! నేనేం కేస్ట్ తీసుకోను?” అని అడిగింది.
తలెత్తే లోపు “మిస్టర్. బత్తులా! ఏం…సెలెక్ట్… చేసుకోను?” అంటూ స్క్రీను కి అడ్డంగా చేతులు పెట్టింది.
“…అసలు కేస్ట్ అని ఎక్కడ విన్నావు?’ అని చేతులు మెత్తగా పక్కకి తోసాను.
“యు నో వాట్…ఈ రోజు వరల్డ్ హిస్టరీలో ఇండియా గురించి మొత్తం చెప్పారు.”
“ఏమిటి, మొత్తం చెప్పేసారా?”
“అవును…వచ్చే వారం రోల్ ప్లే కూడా ఉంది.” అని బ్యాగులోంచి గులాబి రంగు ఫోల్డరు తీసి చూడమని సైగ చేసింది. ఫోల్డరుపై “కావ్య. ఆర్. బత్తుల, సిక్స్త్ గ్రేడ్” అని గుండ్రటి అక్షరాలు. ఎప్పుడు అసైన్మెంట్ లో సాయం కావాల్సినా ఫోల్డరు నా మీద పడేస్తుంది. పని పూర్తయ్యే దాకా పట్టి పీడిస్తుంది. ఫోల్డరు తెరిచి చూస్తే సుమారు ఇరవై పేజీల స్టడీ మెటీరియల్ పద్ధతిగా అమర్చి ఉంది.
మొదటి పేజీలో “నిన్నే కులపు కొలిమిలో పోత పోసారు? భారతదేశపు కుల వ్యవస్థ” అనే హెడ్డింగు.
పేజీలు పైపైన తిరగేస్తుంటే ఆర్యుల దండయాత్ర, వర్ణ వివక్ష, కర్మ సిద్ధాంతం వంటి అంశాలు కనిపించాయి . చివర్లో ‘రోల్ ప్లే’ అనే సెక్షను చూడగానే ఫోల్డరు మూసాను.
“అసలు ఫోల్డరిచ్చిందే ఆ సెక్షను చూడమని,” అని చిన్నబుచ్చుకుంది. వెంటనే పుంజుకుని “నన్నూ, జెన్నీని ఒకే గ్రూపులో పెట్టారు తెలుసా?” అని రోల్ ప్లే కి పోస్టరు ఎలా తయారు చెయ్యాలో వివరంగా చెప్పింది. నేను ఓపికగా విన్నాను. ప్రీస్ట్, కింగ్… అన్టచబుల్ అని ఐదు రకాల హెడ్ బ్యాండులు చూపించింది.
“జెన్నీకి బో అండ్ యారో అంటే తెగ ఇష్టం. ఈ వీకెండ్ లోపు మెసేజ్ పంపితే మిస్. లెవర్ట్ మనమడిగిన కేస్ట్ ఇస్తుంది, లేదంటే వాళ్ళిచ్చిందే తీసుకోవాలి.” అని బుంగమూతి పెట్టింది.
“ఇప్పుడే కదా, ఈ మెటీరియల్ ఇచ్చావు. కాస్త వివరంగా చదివి చెబుతాను.” అని నచ్చచెప్పాను. మామూలుగా అయితే నస పెట్టి సాధించుకునేది. లోపల్నించి వినీత పిలుపు కాదు… అరుపు వినపడ్డంతో “సరే రేపటి లోగా చెప్పు. చాలా ప్రిపరేషన్ ఉంది.” అని నసుక్కుంటూ వెళ్ళింది.
***
ఆ రాత్రి పడుకోబోయే ముందు వినీత కాస్త తీరుబడిగా కనిపించింది. వేడుక అప్డేట్ లు చెబుతుంటే కాసేపు విన్నాను. ఇక తెమిలేలా లేదని “ఇక్కడ తప్పుడు పాఠాలు ఎందుకు చెబుతారు?” అని అడ్డు పడ్డాను. సెల్ పక్కన పెట్టి అర్థం కానట్టు చూసింది. మధ్యాహ్నం కావ్యకి, నాకు జరిగిన సంభాషణ చెప్పాను. అంతా విని “రాం!…నీకు ఆఫీసులో పని తక్కువయ్యింది. ప్రపంచ చరిత్ర అంటే అన్ని దేశాల మంచి చెడ్డలు చెబుతారు. అమెరికా చరిత్ర కూడా చెబుతారు.” అని సెల్ పైకెత్తింది.
అలా తీసి పడెయ్యడం ఏ మాత్రం నచ్చలేదు. “భలే సమర్ధిస్తున్నావు!” అని సైడ్ టేబుల్ పై పడున్న పుస్తకం పైకి తీసాను. కాస్త దుమ్ము పైకి లేచింది. పేజీలు చదవకుండా తిరగేస్తుంటే “నీతో వాదించే ఓపికా, టైం రెండూ లేవు. సాయంత్రం నుండి కేటరింగ్ వాడు ఫోన్ ఎత్తట్లేదు, ఫైర్ క్రాకర్స్ కాల్చుకుందుకు హెచ్.ఓ.ఏ నుంచి క్లియరెన్స్ రాలేదు. అదే విషయం నందినికి టెక్స్ట్ చేస్తున్నాను.” అని నావైపు చూసింది.
“అప్పుడప్పుడూ వార్తలు చూడు. రేసిజం ఎక్కడుందో తెలుస్తుంది.”
“నువ్వు చరిత్రని, వార్తలని కిచిడీ చేసి మాట్లాడుతున్నావు.”
“నువ్వు అనుకూలంగా విడగొడుతున్నావు. పకడ్బందీగా ఉన్న స్టడీ మెటీరియల్, హెడ్ బ్యాండులు, పోస్టర్ చేయడానికి సూచనలు చదువు… తెలుస్తుంది. ఇదంతా ఏళ్లుగా సాగుతున్న ప్రచారం!.”
వినీత ఇక వాదించేట్టు కనిపించలేదు. బెడ్రూమ్ సంభాషణ ఇలా మలుపు తిరుగుతుందని నేనూ అనుకోలేదు. ఇద్దరం నిశ్శబ్దంగా రాజీ పడ్డాము.
“అయితే ఏమిటంటావు?” అని అడిగింది.
కులపు కొలిమి…అని చదవగానే పీకల దాకా కోపమొచ్చింది. చిన్న పిల్లని నిరుత్సాహపరచడం ఎందుకని తమాయించుకున్నాను. తనని నచ్చచెప్పి పంపేయగానే ఓ ఆలోచన తట్టింది, కాసేపు నెట్ బ్రౌస్ చేయగానే ఓ కచ్చితమైన ప్రణాళిక ఏర్పడింది.
“మీ పాఠంలోని అంశాలు మా జాతిని కించపరిచేవిగా ఉన్నాయి, వాటిని సవరించాలని స్కూల్ డిస్ట్రిక్టు కి పిటిషను పెడదాము.” అన్నాను. నేను తయారు చేసిన డ్రాఫ్ట్ తెచ్చి చూపించాను. చదివి, కొన్ని ప్రశ్నలు అడిగింది. నాకు తోచిన సమాధానం చెప్పాను. “మన కమ్యూనిటీలో ఇంకొన్ని సంతకాలు సేకరిస్తే పిటిషన్ బలంగా ఉంటుంది, కదా?” అని అడిగింది. చాలా మంచి సలహా అనిపించింది.
నా మాటలు పట్టించుకోని మనిషిని రెండే రెండు నిముషాల్లో ప్రభావితం చేసాను, ఆత్మస్తుతి తప్పనిపించలేదు.
“నందినీ వాళ్ళమ్మాయి మన కావ్య క్లాసే! రేపు వాళ్ళ హస్బెండ్ ని పరిచయం చేయమంటాను.” అని చెప్పింది.
నా మంకుపట్టుకి సరైన కారణం చెప్పలేను. ఆఫీసులో మొహం తిప్పుకుని వెళ్లిన శ్వేత జాతీయులు కావొచ్చు, ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న వార్తలు కావొచ్చు. ఏదైనా ఓ ఐదారు అదనపు సంతకాలు దొరికితే చాలు పిటిషను పెట్టాలని నిశ్చయించుకున్నాను.
***
క్లబ్ హౌస్ చుట్టూ ఒత్తైన పచ్చిక మైదానం, నీరు ఎగజిమ్ముతున్న ఫౌంటైన్లు. దీప కాంతులతో ప్రాంగణం నిండుగా ముస్తాబయింది. లేత శీతాకాలపు గాలులు మెల్లిగా వీస్తున్నాయి. ఫైలు తెరిచి చూసుకున్నాను. పిటిషను, సంతకాలు తీసుకోవాల్సిన పేపర్లు అన్నీ సరిగ్గానే ఉన్నాయి. లోపల ఫైలు పట్టుకుని తిరగడం కాస్త నామోషీగానే ఉన్నా తప్పించుకోలేని పరిస్థితి. వినీత, కావ్య ముందే వెళ్లిపోవడంతో ఒక్కడినే మిగిలాను. నాకు పెద్దగా పరిచయాలు కూడా లేవు. ప్రాంగణం నిండుగా ఉంది. ఆడవారు వైవిధ్యభరితంగా తయారయ్యారు. పిల్లలు సీతాకోకచిలుకల్లా వెంట తిరుగుతున్నారు. చుట్టం చూపుగా వచ్చిన పెద్దవారు హుందాగా అక్కడక్కడ కనిపించారు.
నందిని ఆవిడ భర్త రవిని పరిచయం చేసింది. అసలే తెలుగు ఆకలి మీద ఉన్నానేమో ఒక్కసారిగా కబుర్లు గుమ్మరించాను. మాటల్లో ఇద్దరి ఆఫీసులు దగ్గరేనని తెలిసి కాస్త తీరికగా లంచ్ కి కలవొచ్చని అనుకున్నాము. పిటిషన్ ప్రస్తావన నోటి దాకా వచ్చింది కానీ పరిచయమయిన వెంటనే భయపెట్టడం సబబు కాదనిపించింది. ఇంచుమించు పిల్లలంతా ఒకే స్కూలు వారవడంతో ఏ ఇబ్బందీ లేకుండా ఆడుకుంటున్నారు.
రాత్రి వినీత కంగారు పడింది గానీ కేటరింగ్ వాన్ టైం కి వచ్చింది. యూనిఫామ్ వేసుకున్న స్టాఫ్ దగ్గరుండి అంతా చూసుకున్నారు. ఫైలు టేబుల్ పై పెట్టి పకోడీలు తీసుకుంటుంటే పక్కనున్న అమ్మాయి “ఉయ్ ఆర్ వెజిటేరియన్స్!” అని ఎవరికో చెబుతోంది.
పొడుగ్గా, సాంప్రదాయ పంచె కట్టులో ఉన్న వ్యక్తి “ఐ యామ్ సందీప్ రెడ్డి గోన,” అని పలకరించాడు. నన్ను పరిచయం చేసుకుంటుంటే “తెల్సు, రవితో మాట్లాడ్తుంటే ఇన్న. కమ్యూనిటీల కొత్తగొచ్చిన్రా?” అని అడిగాడు.
“అవును ఈ మధ్యనే వచ్చాము.”
“మా కోబ్రదర్ దయానంద్ రెడ్డి బత్తుల మేరీల్యాండ్ల ఉంటడు, ఎర్కపడ్తరా?” అని కండువా సర్దుకున్నాడు. జవాబు చెబుతుంటే ఫైలు జారింది. అనుకోకుండా మా సంభాషణ పిటిషన్ మీదకి మళ్లింది. సందీప్ తప్పక సంతకం చేస్తానని అన్నాడు. ఈ లోపు ఓ వ్యక్తి రేసు కారులా దూసుకొచ్చి “అధ్యక్షా! జర మమ్లని యాది బెట్టుకో!” అని సందీప్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. నన్ను కజిన్ అని, ఆ వచ్చిన వ్యక్తిని చెడ్డీ దోస్త్ అని పరిచయం చేసాడు. ఆ చెడ్డీ దోస్త్ ఉన్నంత సేపూ గొంతులు అనుకరిస్తూ తెగ నవ్వించాడు. అతను వెళ్లిపోగానే మేమిద్దరమే మిగిలాము. పాత తెలుగు సమితిలో ప్రాంతీయ భావాలు ఎక్కువయ్యాయని అందుకే కొత్త సంఘం పెట్టాల్సి వచ్చిందని, మిగతా రాజకీయాలు కూడా నింపాదిగా చెప్పుకుంటూ వచ్చాడు.
పిల్లలకి, పెద్దలకి సరదా పోటీలు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. ఎమ్సీ పాత్ర పోషిస్తున్న గిరజాల జుట్టు అబ్బాయి టీవీ భాష స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
క్లబ్ హౌస్ వెనుక ఖాళీ స్థలంలో పిల్లలు గుండ్రంగా నిలబడి బాణాసంచా కాలుస్తుంటే కావ్య అక్కడే ఉంది. అందరి మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఓ పెద్దాయన మనవరాలిని తీసుకొచ్చి మిగతా పిల్లలతో కలిపి నిలబెట్టారు. ఆయన తన పేరు వాసుదేవరావని, పంచాయత్ రాజ్ లో పనిచేసి నాలుగేళ్ల క్రితం రిటైరయ్యానని చెప్పారు. నా ఉద్యోగం, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
“…అయితే బత్తుల వారసులన్నమాట.” అని తమ ఊరి నేపథ్యం, పాత రోజులు ఆసక్తికరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ లోపు చిన్న నిప్పురవ్వ తాకడంతో ఆయన మనవరాలు ఏడుపు మొదలు పెట్టింది. ఊరుకోపెట్టగానే తిరిగి వెనక్కి వెళ్లింది.
“అస్సలు భయం లేదు…” అని మెచ్చుకోలుగా తిట్టారు.
“అక్కడ అంత సందడిగా ఉంటే, మన దగ్గర ఎందుకు ఉంటారు?” అనగానే ఇద్దరం నవ్వుకున్నాము.
“ఎప్పుడైనా టెక్కలి వచ్చారా?”
“లేదంకుల్, ఎప్పుడూ రాలేదు.”
“మీకు తెలుసో లేదో, సరిగ్గా మా ఊరి సెంటర్లో మీ ఇంటి పేరుతో ఓ వీధుంది.”
“అవునా, ఎప్పుడూ వినలేదు.”
“మీరంతా చిన్నవాళ్లు. ఇంట్లో కనుక్కోండి మనవాళ్ల గొప్పతనం చెబుతారు.” అని చనువుగా భుజంపై చెయ్యి వేసారు.
“మా తాత ముత్తాతలది కూడా హైదరాబాదే, అటు వైపు బంధువులు ఉండే అవకాశం లేదు…” అనగానే ఆయన హావభావాలు మారిపోయాయి. ఆ తర్వాత కలిసున్న కాసేపు పొడిపొడిగా మాట్లాడారు.
కార్యక్రమం ముగియగానే క్లబ్ హౌస్ చిందరవందరగా మారింది. వినీత మిగతా బృందంతో కలిసి సరి చేస్తుంటే నేనూ సాయపడ్డాను. అంతా ముగిసి ఇంటికి డ్రైవ్ చేస్తుంటే కావ్య, వినీత దారి పొడుగూతా మాట్లాడుతూనే ఉన్నారు.
***
బాగా పొద్దుపోయాకా కావ్య పెద్ద పోస్టరుతో మా బెడ్రూమ్ లోకి వచ్చింది. చాలా సేపు అలికిడి లేకపోయేసరికి పడుకుందనుకున్నాను. ఎంత రాత్రయినా అసైన్మెంట్ మర్చిపోకపోవడం గర్వంగా అనిపించింది. పోస్టర్ మధ్యన ఖాళీ చూపించి, ఏం రాయాలని అడిగింది. “అన్టచబుల్త్” అని చెప్పాను. కావ్య గట్టిగా హత్తుకుని “అన్నిటి కంటే అదే పెద్ద రోలని మిస్.లెవర్ట్ చెప్పింది, గుడ్ నైట్!” అని వెళ్లింది.
కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను.
నలిగిన ఫైలు ఖాళీ చేస్తుంటే వాసుదేవరావు గారు గుర్తొచ్చారు.
ఆయన “ఊరి చివర వీధి…” అని ఉంటే ఆలోచించేవాడిని.
***
పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్
అమెరికా ఇతివృత్తం తో ..ఇక్కడి ఇలాంటి సమస్యలతో,,,మనం పట్టించుకోవలసిన ఇలాంటి విషయాలతో చాలా తక్కువ కథలు వచ్చాయి. ఒకానొక స్కూల్ లో చోటు చేసుకున్న ఈ విషయాన్ని “అన్ టచబుల్ ” ని గమనించి కథగా మలచడం చాలా బావుంది. కథలో ముందు అసలు ఆ వెనిస్ నగరంలో జీవితం ప్రసక్తి ఎందుకా అని అనిపించినా ఆ తరువాత తెలుగు వారు ఎక్కువ గా ఉండే టాంపా నగరంలో జీవితానికి తేడా చూపించడం కథకుడి ఉద్దేశ్యం అని అర్థం అయింది.
ఎప్పటి లాగానే కొత్త అంశం తెర మీదకి మంచి కథనంతో మరొక చక్కటి కథ అందించిన మధు కి అభినందనలు
–వంగూరి చిట్టెన్ రాజు
రాజు గారు, మీ ప్రోత్సాహాక వ్యాఖ్యలకి ధన్యవాదాలు!
You’re thinking and literature is great
శ్రీనివాస్, ధన్యవాదాలు!
మంచి సున్నితమైన అంశం. బాగా రాసారు.
నిత్యా గారు, ధన్యవాదాలు!
మధు, సున్నితమైన అంశాన్ని అతి సరళంగా వ్రాసారు. ఆలోచింపజేసే రచనలు ఎక్కువ పదజాలం వాడకుండా వ్రాయడం మీ ప్రత్యేకత. — మురళి.
మురళి, థాంక్స్.. ప్రయత్నిస్తున్నాను!
మధు గారు – చాలా బాగా రాసారు. భారత దేశం వదిలి వచ్చినా, అక్కడి సమస్యలు మనం ఇక్కడకు ఎలా తీసుకు వస్తామో బాగా చూపించారు. వేరే కామెంటార్ అన్నట్టు, వెనిస్ – టాంపా juxtaposition చాలా చాలా బాగుంది. మీ కథలు మొదటి నుంచి ఫాలో అవుతున్నాను. మీ రచనా శైలి, మీరు choose చేసుకునే టాపిక్స్…. ఇవే నా జోహార్లు.
Raghu Garu, Appreciate your feedback.
మధు, నీ రచనా శైళితో అత్యంత క్లిష్టమైన ‘అంటరానితనము’ అనే విషయాన్ని అలవోకగా స్పృశించి ఆలోచింపచేశావు. భవిష్యత్తులో మరిన్ని ఆసక్తి కలిగించే అంశాలతో వాృయూలి. అబినందనలు.
రాజశేఖర్, మీ స్పందనకి ధన్యవాదాలు!
సున్నితం గా బాగా రాశారు. మన మనసులో కులం ప్రాంతం సప్త సముద్రాలు దాటినా వదలవా.
మధు గారు, Unfortunately, prosperity breeds collective narcissism! ఈ ధోరణికి ఎదుగుదలే తప్ప తగ్గే సూచనలు ఇప్పట్లో లేవు. మీ స్పందనకి ధన్యవాదాలు!
Pardon for commenting in English. It is easy for us to comment on our own fallibility for our casteist feelings and for bringing such into our lives in US. It is much more difficult to see and further difficult to comment on or take action about the education system here and the various fallacies or questionable facts they teach in schools here about India in general and baout Hinduism in particular. This is a hot issue in CA and TX right now. Thank you Madhu for incorporating this very important and contemporary issue in your story.
Nasy Garu, Thanks for the feedback!
చిక్కని, చక్కని కథ.
కనీసం చర్చించడానిక్కూడా చాలామంది యిష్టపడని అంశంపై కథ ఇవాళ్టి అవసరం. చాలా బావుంది మధు గారూ!
Prasad Garu, Thank you!
కుల వ్యవస్థ మన జాతిలో ఉన్నందుకు బాధ పడాలా? దాని గురించి విదేశీయులు వివిధ జాతుల గురించి బోధపరిచే క్రమంలో పిల్లలకి చెప్పటం వల్ల మన జాతి పరువు పోతోందని బాధ పడాలా? పరాయి నేలల మీద కూడా మన జాతి జాడ్యాన్ని వదిలించుకోనందుకు బాథ పడాలా? వీటికి మన వద్ద సమాధానం లేదు. తక్కువగా పరిగణించగడే కులం పాత్ర వరించటం తప్ప మన అభ్యుదయానికీ నైతికతకీ మరే సూచనా లేదా? కథకుడు ఉత్తమ పురుషలో చెప్పటంలో వల్ల చాలా సూచించగలిగే అవకాశం మిస్సయింది. మంచి అంశం తీసుకున్నందుకు రచయితకి అభినందనలు. ఫేస్బుక్కులో పరిచయం చేసినందుకు మిత్రులు రమణమూర్తి గారికి కృతజ్ఞతలు.