డాక్టర్ వి. చంద్రశేఖరరావు సుమారు మూడు దశాబ్దాలపాటు తెలుగు కథా పాఠకులను మంత్ర ముగ్ధులను చేశారు. అసామాన్యమైన వాక్య నిర్మాణంతో అందరినీ మంత్రనగరి సరిహద్దులకు తీసుకు కెళ్లారు. రాశి మాట ఎలా వున్నా, వాసిలో మాత్రం ఉత్తమసాహిత్యాన్ని వెలువరించారు. జీవని-1994, లెనిన్ ప్లేస్-1998, మాయలాంతరు-2003, ద్రోహవృక్షం-2012 కథా సంకలనాలతోపాటు; ఐదు హంసలు -2000, ఆకుపచ్చని దేశం-2012, నల్లమిరియపుచెట్టు-2012 నవలలు తీసుకొచ్చారు. ప్రయోగాత్మకం అని చెప్పకుండానే వినూత్న ధోరణిలో కథను ప్రయోగించి, అందరినీ తనదైన ప్రపంచంలో విహరింప జేశాడు. ఎన్ని చేసినా, ఎన్నడూ సామాజిక ప్రయోజనాన్ని వీడే సాము చేయలేదు. కానీ, ఆరుపదుల వయసుకే ఈ లోకాన్ని వీడే సాహసం చేశారు.
చంద్రశేఖరరావుగారి మరణానంతరం ఆయన ఆరో కథా సంపుటి ‘ముగింపుకు ముందు’ను కుటుంబ సభ్యులు, సాహితీ మిత్రులు తీసుకొచ్చారు. వీటిల్లో మొదటిది ‘పూర్ణ మాణిక్యం ప్రేమకథలు’ అన్నిట్లోకీ పెద్దది. మిగిలిన ఆరు కథల్లో ఒక్క ‘కొయ్య గుర్రాలు’ మినహా మిగతా కథలన్నీ కూడా ఖచ్చితంగా 16 పేజీల చొప్పున వుండటం చిత్రం. ఇంతకు ముందటి కథల్లాగే ఈ కథల్లోని పాత్రలన్నీ అతని ఇతర కథల్లోని పాత్రలతో అంతర్లీనంగా సంబంధం కలిగి ఉంటాయి. అక్షరాలను వరుస కట్టి వాక్యాలుగా పేర్చి కథలు అల్లడం తెలీని ఈ రచయిత, ఎప్పటిలాగే విధ్వంస దృశ్యాలను, సుమనోహర సందర్భాలను రంగుల్లో ముంచి కొత్త పెయింటింగ్ లను పాఠకుల ముందుంచాడు.
కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని యూనివర్సిటీల్లో ఒక వర్గపు విద్యార్థి సంఘాలు ఊపందుకున్నాయి. విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వాటిని ఓ కుక్క ప్రధానకేంద్రంగా ‘హిట్లర్ జ్ఞాపకాలు’ చిత్రించారు. నక్సలైట్ ఉద్యమంలో మమేకమై తర్వాత దళిత చేతనతో కొత్త పుంతలు తొక్కిన ఓ ఉద్యమకారుడి జీవిత చిత్రం ‘సూర్యుని నలుపు రంగు రెక్కలు’. ఉన్నచోటే ఉండి పరుగులు తీసే ఆలోచ నాపరుల గురించిన ‘కొయ్య గుర్రాలు’, భిన్నధృవాలైన తండ్రీకొడుకులు ‘నేను, పి.వి.శివం’, దళితుడి మాన సిక స్థితిని ఆవిష్కరించే ‘బ్లాక్ స్పైరల్ నోట్ బుక్’, భార్యభర్తల ఘర్షణలోని తీవ్రతను వ్యక్తీకరించిన ‘ముగిం పుకు ముందు’-కథలన్నీ పాఠకుడిలో నిస్సందేహంగా ఒక అలజడిని సృష్టిస్తాయి.
‘పూర్ణమాణిక్యం ప్రేమ కథలు’ చంద్రశేఖరరావుగారి చివరి కథ. జనవరి 2017లో ఆంధ్రప్రదేశ్ మాస పత్రికలో ప్రచురితమయ్యింది. అంతకు ముందు ఏడాది రాసిన కథల్లో ‘కొయ్యగుర్రాలు’ మార్చిలో, ‘నేనూ, పి.వి.శివం’ నవంబర్ లోనూ అచ్చయ్యాయి. ఆశ్చర్యకరంగా ఈ రెండు కథల్లో కొన్ని సంఘటనలు యథాతథంగా పునరావృతం అయ్యాయి. కొన్ని ముఖ్యమైన పాత్రలు వేర్వేరు కథల్లో కనిపించడం, ఆయా సంఘటనలకు సంబంధించిన డిఫరెంట్ షేడ్స్ ను ప్రదర్శించడం ఈయన కథల్లో మామూలే. అయితే, ఈ పునరావృతాలు అలా అనిపించవు.
‘కొయ్యగుర్రాలు’ కథలో ఆత్మహత్య చేసుకున్న కవి కల్లూరి రాజ ఇంటి వర్ణన(పేజీ: 81), ‘నేనూ, పి.వి. శివం’ కథలో ఆత్మహత్య చేసుకున్న కవి ఇల్లు వర్ణన(పేజీ:91) అలానే ఉంటుంది. అలాగే వాసుదేవరావుగారి ప్రస్తావన(పేజీ:83), రెండో కథలో పులుపుల సార్ ప్రస్తావన(పేజీ:98); ఇక ఈ రెండు కథల చివర్లో జరిగే యాక్సిడెంట్ సన్నివేశం, దెబ్బలు తగిలిన వ్యక్తి ప్రవర్తన ఒక్కలాగే చిత్రించారు. ఇందుకు కారణమేంటో అర్థంకాదు. బహుశా, ఒక పెద్ద కథ రెండుగా మారడం వల్లనా? లేక ఆయా సన్ని వేశాలను మనసు నుంచి తుడిచేసుకోలేకపోయారా? ఏమో, చెప్పలేం.
ఏ రచయితైనా తనదైన ముద్ర కోసం, ప్రత్యేకమైన శైలి కోసం తపస్సు చేస్తాడు. ఏ కొందరికో అది సాధ్యమవుతుంది. కానీ, మరికొందరికి అదే శాపమవుతుంది. ఫలానా రచయిత ‘భలే రాస్తాడు’ అనుకునే పాఠకులు.. కొంతకాలానికి, ఆ ఫలానా రచయిత ‘ఇలానే రాస్తాడు’అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చేస్తారు; ఆ ఫలానా రచయిత పరిస్థితి కూడా అంతే. తనకు తెలియకుండానే-‘తాను ఇలాగే రాయాలి’అనే మానసిక స్థితిలోకి వెళ్లి పోతాడు. ఆ శైలినే తన ఐడీ కార్డుగా భావిస్తాడు. తాను ఏం రాస్తున్నాడు, ఏ వస్తువు స్వీక రిస్తున్నాడు, ఏ సందర్భంలో వ్యక్తీకరిస్తున్నాడు-అనేదాన్ని కన్వీనియంట్ గా విస్మరిస్తాడు. తాను ఎలాంటి విషయం చెబుతున్నా-ఎప్పుడో పాఠకులను మెస్మరైజ్ చేసిన ఆ పాత సీసా లోనే పోసి-అచ్చు బయటకు తీస్తాడు.
నిజమే, ఒకోసారి ఆ అచ్చు-ఆ రచయితకే పాతదనీ, బోర్ అనీ అనిపిస్తుంది. అప్పుడు తన క్రాఫ్ట్ మెన్షిప్ ను ఉపయోగించి కొన్ని అదనపు సొబగులు అద్దే ప్రయత్నం చేస్తాడు. ఇది మరింత గందరగోళానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఒకోసారి తనకు తెలియని విషయాల్నించి తప్పించుకోడానికి కూడా రచయిత ఈ సోకుల మాటున దాక్కుంటాడు. ఈ మొత్తం వ్యవహారమంతా పాఠకులకు అర్థమైపోతుంది. దాంతో పాఠకులకీ, రచయితకీ మధ్య కనిపించని ఎడం పెరిగిపోతుంది.
చంద్రశేఖరరావుకీ, పాఠకులకీ అటువంటి ఎడం ఎప్పటి నుంచో ఉంది. బహుశా, అది ‘లెనిన్ ప్లేస్’ కథలప్పటి నుంచీ కావచ్చు. ఎందుకంటే, అప్పటి నుంచి ఆయన రాసిన కథలేవీ సామాన్యమైనవీ, సాధార ణమైనవీ కావు. అందుకే అవి ఒక తరహా పాఠకులకు ఎక్కవు. సాహిత్యాన్ని అనురక్తితో చదివేవారికీ, సాహిత్యంలో మునిగితేలేవారికే ఆయన కథల రుచి తెలుస్తుంది. అందుకే ఆయన రచయితల రచయిత, మామూలు రచయిత కాదు.
అటువంటి రచయిత-అందులోనూ డాక్టర్ అయ్యుండీ అర్థాంతరంగా వెళ్లిపోవడం విషాదం. ఎన్నెన్నో రాయాల్సినవారు ఏడుకట్ల సవారీలాంటి ఈ ఏడు కథల్నీ వదిలివెళ్లడం మరీ విషాదం.
మోహనసుందరం హఠాత్తుగా మరణించినట్టు, పూర్ణ మరొకరి ప్రేమలో పడినట్టు, లలిత ఎప్పటికీ నవ్వనట్టు, చంద్రశేఖరరావు అదృశ్యమై..ఓ పాత్రలా మారిపోయారు.
రాత్రిపూట యూనివర్సిటీ గోడల మీద వెలిసే పెయింటింగ్ లా (గ్రాఫిటీ అంటారుట దాన్ని), మిట్ట మధ్యాహ్నం మండుటెండలో చెలరేగిపోయే రోడ్లలా(లలితకు ఆ ఉక్కపోతంటే చాలా చిరాకు), నిస్సారంగా వెన్నెల కురిసే రాత్రి రావు బాలసరస్వతి పాటలా(ఆ గొంతు చంద్రశేఖరరావుకి చాలా ఇష్టం).. ఆయన, ఆయన కథలూ, ఆయన పాత్రలూ ఎప్పటికీ మన మధ్య తిరుగాడుతూనే ఉంటాయి.
(ముగింపుకు ముందు –డాక్టర్ వి.చంద్రశేఖరరావు, వెల: రూ.100/-, ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు)
Good review. Great intro about chandra sekhar rao garu.
ధన్యవాదాలు
ఆయన గురించి చాలా కొత్త గా చెప్పారు. మీరిలానే రాస్తారు. నాకు తెలుసు.
హ.. హ్హ.. ఎలా తెలుసు?
“ఇంతకు ముందటి కథల్లాగే ఈ కథల్లోని పాత్రలన్నీ అతని ఇతర కథల్లోని పాత్రలతో అంతర్లీనంగా సంబంధం కలిగి ఉంటాయి. అక్షరాలను వరుస కట్టి వాక్యాలుగా పేర్చి కథలు అల్లడం తెలీని ఈ రచయిత, ఎప్పటిలాగే విధ్వంస దృశ్యాలను, సుమనోహర సందర్భాలను రంగుల్లో ముంచి కొత్త పెయింటింగ్ లను పాఠకుల ముందుంచాడు.”
మంచి విశ్లేషణ .
ధన్యవాదాలు సార్