1
అప్పటికింకా డిటిఎల్‌సీ అనే పేరు కూడా పెట్టుకోలేదు. కొన్ని నెలలుగా తెలుగు సాహిత్యం అంటే అభిమానం ఉన్న మిత్రులం కొంతమందిమి నెలకొకసారి కలుసుకుని అప్పటికి మనకి నచ్చిన కథో కవితో పంచుకోవడం, ఏదైనా ప్రాచీనకావ్యం నించి ఒక ఘట్టాన్ని తలుచుకోవడం, ఇలా ముందుకు తెచ్చిన అంశాల గురించి చర్చించే వాళ్ళం.
ఇంతలో తెలుసా అనే ఈమెయిల్ సమూహంలో ఆచార్య చేకూరి రామారావు గారు క్రమం తప్పకుండా సందేశాలు రాస్తుండడం చూశాను. ఆ సందేశాల ద్వారా వారు అమెరికాలో ఉన్నారని అర్ధమైంది. వారికి మెయిల్ పంపాను – ఆచార్యా, మీరు గనక డెట్రాయిట్ నగరానికి వంద మైళ్ళ లోపున గనక ఉన్నట్లైతే నేనే వచ్చి మిమ్మల్ని వెంట బెట్టుకుని రాబోయే నెల మా సాహిత్య సమావేశానికి తీసుకు వస్తాను – అని. ఒక అరగంటలో ఆయన దగ్గర నించి జవాబు వచ్చింది – మీకు అంత శ్రమ అక్కరలేదు, నేను డెట్రాయిట్ కి దగ్గరలోనే కేంటన్ లో ఉన్నాను – అని.
అలాగ వారు అమెరికాలో ఉన్నన్నాళ్ళు ప్రతి నెలా వారిని పిక్ చేసుకుని మా సమావేశానికి తీసుకు వెళ్ళి, ముగిశాక మళ్ళీ ఇంట్లో దింపే భాగ్యం నాకు దక్కింది. మీటింగ్ ముగిశాక అక్కడికి పక్కనే ఉన్న స్టార్‌బక్స్ కి వెళ్ళే వాళ్ళం ఇద్దరం. ఆయనకి అమెరికా వాళ్ళ నీళ్ళ కాఫీ నచ్చేది కాదు. స్టార్ బక్స్ వాళ్ళ మెనూలో దక్షిణ భారతీయ కాఫీకి దగ్గరగా ఉండే కాఫీ ఎలా ఆర్డర్ ఇవ్వాలో ఆయనకి రుచి చూపించాను. చాలా సంతోషించారు. అంతే కాదు, ఈ సంఘటనలు జరిగిన కొన్ని సంవత్సరాల తరవాత డిటిఎల్‌సీ వారు ప్రచురించిన ఆయన వ్యాస సంకలనానికి ముందు మాటలో “మంచి కాఫీ రుచి తెలిసినవాడు” అని నాకు కితాబిచ్చారు కూడా.
విజయవాడ నవోదయ ప్రచురణలు అధినేత అట్లూరి రామ్మోహనరావు గారు డిటిఎల్‌సీ కి మొదటి నించీ దన్నుగా నిలిచిన మహానుభావులు. సమితి సమావేశాలు కొంత ప్రణాళికతో నడవడం మొదలైనాక సభ్యులకి ఎదురైన మొదటి సమస్య తెలుగు పుస్తకాలు అందుబాటులో లేకపోవడం. అప్పటివరకూ సభ్యుల దగ్గర ఉన్న పుస్తకాలలో నించి కొన్ని కథలు ఎంచుకోవడం, వాటిని ఫోటోకాపీ నో, స్కాన్ చేసో పంపిణీ చేసి చదివి చర్చించడం జరుగుతూ ఉండేది. ఈ పద్ధతి వలన ముఖ్యంగా చర్చలు కథలకే పరిమిత మయ్యేవి. ఆ కథలలోనైనా, అందుబాటులో ఉన్నవి పరిమితంగానే ఉండేవి.
మీకెందుకు, మీరు ఏమి చదవాలి అనుకుంటున్నారో ఆయా పుస్తకాలు జాబితా తయారు చేసుకోండి. పుస్తకాల కాపీలు సేకరించే బాధ్యత నాది అని మాకు భరోసా ఇచ్చారు రామ్మోహనరావు గారు.సమకాలీన ప్రక్రియలైన కథలు, నవలలు ఇటువంటివే కాక మేము ప్రతి ఏడూ ఒక పద్య కావ్యం, ఒక ఆత్మకథ లేదా జీవిత చరిత్ర చదవాలని నిశ్చయించుకున్నాం. అవి ఎంత పాత ప్రచురణలో, అసలు ప్రింట్ లో ఉన్నాయో లేవో అనే సందేహం లేకుండా మా జాబితా తయారు చేసుకుని రామ్మోహనరావు గారికి పంపేసే వాళ్ళం. ఆయన దగ్గర స్టాక్ లో లేకపోయినా ఇతర షాపులనుంచి అయినా వెతికి సేకరించి పంపేవారు. ఎప్పుడో అరుదుగా గానీ ఆయన ఎప్పుడూ ఈ పుస్తకం దొరకడం లేదు, వేరే పుస్తకం సెలెక్ట్ చేసుకోండి అనలేదు.
రామ్మోహనరావు గారు తానా సభల సందర్భంగా అమెరికా పర్యటించారు, సతీసమేతంగా. ఆ పర్యటనలో డిట్రాయిట్ కూడా వచ్చి డిటిఎల్‌సీలో ప్రసంగించారు, పుస్తక ప్రచురణ, విక్రయ రంగంలో ఉన్న లోతుపాతులు, అందులో తన జీవిత కాలపు అనుభవాలను. అలా మొదటినించీ, తన ఆరోగ్య సమస్యల వలన నవోదయ షాప్ మూసేసే వరకూ రామ్మోహనరావు గారు డిటిఎల్‌సీకి తోడు నిలిచారు.
3
తానా సభలకి భారత్ నించి వచ్చే రచయితలకూ, కవులకు తోడుగా ఉంటూ వస్తున్న నవీన్ గారు, ఆ సభలు ముగిసిన తరవాత వారిని పలు నగరాలకు తీసుకువెళ్ళే బాధ్యత కూడా తన మీద వేసుకుంటూ ఉంటారు. ఆ బాధ్యతతోనే ఈ రచయితలతో పాటే ఆయన కూడా చాలా సార్లు డెట్రాయిట్ వచ్చి డిటిఎల్‌సీ సమావేశాలలో పాల్గొన్నారు. అంతే కాక, ఏటా ఆయన సంకలించి ప్రచురించే కథాసాహితి సంకలనం, అటు పైన తానా కోసమూ డిటిఎల్‌సీ కోసమూ చేపట్టి నిర్వహించిన మరి కొన్ని ప్రచురణలు, ఆయా సంకలనాల సేకరణలో తన అనుభవాలు ఇవన్నీ చర్చీస్తూ ఉన్నారు. ప్రతి ఏడూ పుస్తకాల సెలెక్షన్ లో కూడా నవీన్ గారి సలహా తప్పక ఉంటూ వచ్చింది.
4
ఎందరో అక్షర బంధువులు తానా, ఆటా, నాట్స్ వంటి జాతీయ సంస్థల కన్వెన్షన్‌లకి వచ్చిన రచయితలు కవులు చాలా మంది డెట్రాయిట్ వచ్చి డిటిఎల్‌సీ తో సంభాషించారు. ఈ సమావేశాలకు మాత్రం మా చర్చ ఫార్మాట్ ని ఉపసంహరించుకుని ఈ ప్రత్యేక అతిథుల ఉపన్యాసాలు వినడానికి సిద్ధమై పోతాం.
తొలిరోజుల్లోనే విచ్చేసిన ప్రత్యేక అతిథి కవయిత్రి జయప్రభ. కొన్ని తన కవితల్ని చదివి వినిపించడంతో బాటు రచనా ప్రక్రియ గురించి, అప్పటి ఫెమినిస్ట్ కవిత్వ ఉద్యమ నేపథ్యం గురించీ ముచ్చటించారు.
పత్రికా సంపాదకుడు, కొద్దిగానే రాసినా కదిలించే కథలు రాసిన గొప్ప కథకుడు ఆర్. ఎం. ఉమామహేశ్వరరావు. తన కథల నేపథ్యాన్ని గురించి బయట పెద్దగా తెలియని ఎన్నో ఆంతరంగిక వివరాలని డిటిఎల్‌సీతో పంచుకున్నారు.
శ్రీరమణ మరొక మరిచిపోలేని అతిథి. కాలమిస్టుగా, బాపు రమణల బృందంలో వారితో చాలా కాలం సన్నిహితంగా పని చేసిన అనుభవాలు, మిథునం కథ – ఇలా ఎన్నో కబుర్లు చెప్పారు. మా ఇంట్లో ఆయనతో జరిపిన సుదీర్ఘ సంభాషణ (అంటే ఆయన అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉండడం) ఒక మరపురాని అనుభవం. ఆ ఇంటార్వ్యూ ఇటీవలే శ్రీరమణ స్వర్గస్తులైనప్పుడు ఇక్కడ సారంగలో మళ్ళీ పబ్లిష్ చేశారు.
అపురూపమైన సాహితీ బంధువుల గూర్చి అపురూపంగా చెప్పారు. అభినందనలు. ధన్యవాదాలు
డిట్రాయిట్ లో ఉన్న నాలుగేళ్ళ కాలంలో డీటీఎల్సీ సమావేశాలు కొన్నిటికి వెళ్ళడం జరిగింది. ఆ అదృష్టం కలిగించింది, నాకు ఈ సంస్థ గురించి తెలియచేసిందీ కూడా నారాయణస్వామిగారే!