సాహితీసంస్థలు నిరాటంకంగా మనుగడ సాగించడం అంతకంతకూ కష్టమవుతున్న నేపథ్యంలో, ఒక సాహితీ సంస్థ గత పాతికేళ్లుగా దేశ రాజధానిలో కొనసాగడాన్ని ఒక విజయంగానే పరిగణించాలి. పండగ చేసుకోవాలి. ఆ ఉత్సవం గడిచిన పాతికేళ్లలో వచ్చిన తెలుగు సాహిత్యాన్ని ఒక సింహావలోకనం చేసుకునే అవకాశంగానూ, సాహితీ మిత్రులందరూ కలుసుకుని సంబరాలు చేసుకోవాల్సిన అవకాశం గానూ గుర్తించడం జరిగింది. ఈ ఉద్దేశంతోనే, మార్చి 14-15 తేదీల్లో ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ పాఠశాల భవనంలో ‘పాతికేళ్ల తెలుగు సాహిత్యం’ అనే శీర్షికతో ‘సాహితీ వేదిక, ఢిల్లీ’ తన రజతోత్సవాలని జరుపుకోబోతోంది.
ఈ సదస్సులో ప్రారంభ సమావేశం, ముగింపు సమావేశాలతో సహా మొత్తం ఎనిమిది సమవేశాలుంటాయి. మిగిలిన ఆరు సమావేశాల్లోనూ పాతికేళ్ల తెలుగు కవిత్వం, కథ, నవల- నాటిక, సమకాలీన సమాజం-సాహిత్యం, ప్రవాసాంధ్ర రచనలు అన్న విషయాలమీద చర్చలు జరుగుతాయి. వీటిలో దాసరి అమరేంద్ర, ప్రభల జానకి, మాడభూషి శ్రీధరాచార్యులు, దర్భశయనం శ్రీనివాసాచార్య, ప్రత్తిపాక మోహన్, కె. ఎన్. మల్లీశ్వరి, వాసిరెడ్డి నవీన్, కాత్యాయని విద్మహే, ఎ. కృష్ణారావు, జి. ఎస్. రామ్మోహన్ వంటి స్థానిక, స్థానికేతర సాహితీకారులు పాల్గొంటారు. అంతేకాక, ఈ సదస్సులో, ప్రభల జానకి గారి సంపాదక్తంలో రూపొందిన ‘ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర’ అనే పుస్తకాన్ని, ‘రజత కిరణాలు’ అనే పేరుతో కూర్చిన సాహితీ వేదిక సభ్యుల రచనా సంకలనాన్ని ఆవిష్కరించడం కూడా జరుగుతుంది. ఈ సభలో పాల్గొని జయప్రదం చెయ్యమని సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం.
*
Add comment