పాట మీద ఆధారపడి కవిత్వం బతుకుతున్నదా?

ఈ చర్చావేదికకి మీకు ఆహ్వానం! మీ అభిప్రాయాలు వ్యాఖ్యల రూపంలో ఇక్కడే రాయండి.

“ఈనాటికీ తెలుగు కవిత్వం బతుకుతున్నదంటే అది పాట మీదే బతుకుతోంది. ఎవరైనా కవులు నన్ను విమర్శించినా  అభ్యంతరం లేదు.”

-మా ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌,  చింతకింది కాశీం గారు  ఛాయ సాహిత్యోత్సవంలో మాట్లాడుతూ ఇచ్చిన  స్టేట్‌మెంట్‌ ఇది. స్వయంగా కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు అయిన ఆయన ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌ చాలామందిని ఆశ్చర్యపరిచింది.

ఛాయ సాహిత్యోత్యవంలో డాక్టర్‌ సంగిశెట్టి శ్రీనివాస్‌ క్యూరేటర్‌గా అల్లం రాజయ్యగారు, కాశీంగారు, షాజహానాగారు వక్తలుగా తెలంగాణ అస్తిత్వం అంశం మీద ఒక సెషన్‌ జరిగింది. ఈ సెషన్ లోనే కాశీం గారు  మాట్లాడుతూ కవిత్వంలో పద్యం, వచన కవిత్వం ఉన్నట్టే, పాట కూడా భాగమేనని, కానీ పాటను తెలుగు సాహిత్య విమర్శకులు గుర్తించి గౌరవించిన దాఖలాలు లేవని, మొదట ఆ పని చేసింది కేవీ రమణారెడ్డిగారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాట ముఖ్య భూమిక పోషించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇప్పటికీ వందల పాటలు వస్తున్నాయని, వాటిని గుర్తించి ప్రతి ఒక్కరూ రాసే ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ సందర్భంలోనే పాట వల్లే కవిత్వం బతుకుందంటూ సభ దద్దరిల్లిపోయే స్టేట్‌మెంట్‌ చేశారు. అదే వేదిక మీద ఉన్న కవి షాజహానా గారు ఈ వ్యాఖ్యలతో ఆవేదన చెందుతూ,  దీనిని విభేదిస్తూ,  ఖండించారు. సభలోని కొందరు అభ్యంతరం చెప్పారు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే‌‌..  విరసంలో క్రియాశీలకమైన భూమిక పోషిస్తున్న కాశీంగారు  ఒక రెండువారాల కిందట ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీ `వివిధ`లో  ప్రముఖ కవి జూకంటి జగన్నాథం కవిత్వాన్ని విశ్లేషిస్తూ ఒక మంచి విమర్శనాత్మక వ్యాసం రాశారు. అంతేకాకుండా ఆయన కూడా ఎన్నో మంచి కవితలు రాశారు. కానీ ఆయనే పాటకు ముడిపెడుతూ కవిత్వ మనుగడ మీద ఈ “చిత్రమైన సూత్రీకరణ” చేయడం ఆశ్చర్యంతోపాటు ఆవేదన కలిగిచింది.

తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ఉన్న గుర్తింపు, పాటకు లేకపోవడానికి కారణాన్ని చెబుతూ.. కవిత్వం విశ్రాంతి వర్గాలది కావడం వల్ల దానిని విమర్శకులు భుజాన మోసి.. సాహిత్య గుర్తింపులో ప్రథమ స్థానంలో పెడుతున్నారని, అదే పాట విషయానికొస్తే.. అది ప్రధానంగా శ్రమవర్గాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి వస్తుండటంతో దానిని గుర్తించి తగిన సాహిత్య గుర్తింపు ఇవ్వడం లేదనేది ఆయన ఆవేదన!

అయితే, ఆయన చేసిన ఈ పరిశీలనలో నిజం లేదా? అంటే ఉంది. దానికి చారిత్రక నేపథ్యముంది. ముఖ్యంగా బహుజన, శ్రామిక వర్గాల నుంచి ఒక ఊటలాగా వెల్లువెత్తుతున్న పాటను కావాలనే గుర్తించకుండా తమ సవర్ణులు రాసిన కవిత్వాన్నే ఆహా ఓహో అని కీర్తించిన తెలుగు సాహిత్య రాజకీయాల పాత్ర ఉంది. అయితే, ఆయన ఎక్కుపెట్టిన విమర్శ అక్కడికే పరిమితమైతే సమస్య ఉండకపోయి ఉండేది.  అది స్వీపింగ్‌ కామెంట్‌లా ఉండటం-మొత్తం కవిత్వమే పాట మీద బతుకుతుందంటూ  సూత్రీకరణ చేయడంలోనే పాక్షికత ఉంది. ఆయన చెప్పిన “విశ్రాంతి” వర్గాలు అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి రాజుల కాలంలో పోషణ, ఆదరణ బాగా ఉండి సకలభోగాలు అనుభవిస్తూ రాసిన వారు. ఆ తర్వాతి కాలంలో ఉన్నతోద్యోగాలు చేస్తూ ఏసీలో ఉంటూ కవిత్వం రాస్తున్నవారికి ఈ పదాన్ని వర్తింపజేశారా? తెలీదు.

అయితే, ఇప్పుడు కవిత్వాన్ని రాస్తున్నది, కవిత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నది ఈ “విశ్రాంతి వర్గాలే” నా అన్నది మొదటి ప్రశ్న. ఆయన ఉద్దేశిస్తున్న “విశ్రాంతి వర్గాలు” ఇప్పుడు పోషణ, ఆదరణ ఉన్న సినీ రంగంలో కొంత కనిపిస్తే కనిపించవచ్చు గాక. కానీ ఆ వర్గాలు, ఆ స్థాయిలో ఇప్పుడు కవిత్వాన్ని రాస్తూ.. వెన్నుదన్నుగా లేరే? ఇప్పటి, ఈ ఆధునిక కాలపు కవిత్వం ఎవరి నుంచి పలుకుతుంది?  ఆధునిక మానవుడి సంవేదనను, సంఘర్షణను, అనేక ఒడిదొడుకుల మధ్య నిత్యం గాయాలు ఓడుతున్న జీవిత శకలాలను కవిత్వం చేస్తున్నది ఎవరు? ఇప్పటి నిజమైన కవిత్వానికి ప్రతినిధులు ఎవరు? వారిని ఒకప్పటి “విశ్రాంతి వర్గాల”  పదబంధంతో ముడిపెట్టి ఇప్పుడు వస్తున్న కవిత్వాన్ని.. పాటతో పోటీని, పేచీని పెట్టి తక్కువ చేయడం సబబేనా? అన్నది ప్రశ్న. అసలు ఇప్పటి ఆధునికకాలంలో వస్తున్న కవిత్వాన్ని, కవులను ఎవరైనా, ఏ సాహిత్య విమర్శకులైనా పట్టించుకుంటున్నారా?

ఇప్పుడు రాస్తున్నది మధ్యతరగతి వాళ్లు, దిగువ మధ్యతరగతి వాళ్లు. నిత్య జీవత సంఘర్షణలో రక్తమోడుతున్నవాళ్లు. అనేక కుతర్కాలతో, కుళ్లుతో, కులవ్యవస్థతో నిండిపోయిన సమాజాన్ని భరిస్తూ.. మరింత మెరుగైన సమాజాన్ని, సమనాత్వాన్ని కాంక్షిస్తూ రాస్తున్నవాళ్లు. వాళ్లందరూ `విశ్రాంతి వర్గాలు` అన్న సూత్రీకరణ కిందకు ఎలా వస్తారు? మీరు చేసిన సూత్రీకరణ ఎంత పాక్షికమైనదో, అంత గాయపరిచేది కాబట్టే.. వేదిక మీద షాజహానా గారు అంతగా ఆవేదన చెందారు. పాటకు దొరికినంత గుర్తింపు, ఆదరణ కూడా ఇప్పుడు కవిత్వానికి కూడా లేదన్నది నిజం.

ఇక, కవిత్వం-పాట మధ్య సారూప్యమెంత? రెండూ ఒక్కటేనా? లేక వేర్వేరా? అన్నది పరిశీలిస్తే.. సమస్త సాహిత్యానికి మూలం పాటనే. అది జానపదులు, శ్రామికుల శ్రమ సంస్కృతి నుంచి వెలికివచ్చి.. క్రమంగా పాటే లిఖితరూపాన్ని ధరించి.. శిష్ట సాహిత్యంగా మారి పద్యంగా గద్యంగా ఆ తర్వాత వచన కవిత్వంగా పరిణమించింది. ఆ కవిత్వంలోనే మళ్లీ పాట భాగమైంది. పాటకు కవిత్వం దోహదం చేస్తుంది. నిండురూపం ఇస్తుంది. ఎంత శ్రామికుడి పాట అయినా  అందులో రాగం, లయ కుదురుకోవాలంటే అందులో కవిత్వపు సొగసు ఉండాల్సిందే.

నిండైన కవిత్వం లేని పల్లవి చరణాలతో ఏ పాట కూడా గొప్పది కాదు. కానీ కవిత్వం, అందునా ఆధునిక వచన కవిత్వం పాటతో ఏమాత్రం సంబంధంలేనిది. అదొక స్వతంత్ర అస్తిత్వం. స్వయం సమృద్ధ ప్రక్రియ దానికి దేనీమీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. పాట ఉన్నా లేకున్నా కవిత్వం ఆగదు. కవిత్వానికి పాట హంగును, రాగాన్ని అద్ది.. ఇంకాస్త మెరుగ్గా పాఠకుణ్ని రంజింపజేయగలదు. అంతవరకే. కానీ, సమాజంలో సంఘర్షణ, అరాచకం, అన్యాయం, హెచ్చుతగ్గుల వ్యత్యాసం ఉన్నంతకాలంలో కవిత్వం వస్తునే ఉంటుంది. అది దేని మీదో ఆధారపడి బతకడం కాదు నిత్య చైతన్య స్రవంతిలాగా వేల భావాలతో సంఘర్షిస్తూ ఆధునిక మానవుడిని ప్రకటిస్తూనే ఉంటుంది.

ముగింపు: ఇప్పుడు ఇదంతా కేవలం కాశీం గారి కోసమే కాదు. కవిత్వం అంటే చాలా చిన్నచూపు ఉండి, ప్రతిదానితో పోల్చి తక్కువచేసే వారికి కూడా. ముఖ్యంగా తన స్టేట్‌మెంట్‌ పట్ల అదే కార్యక్రమంలోని చివరి సెషన్‌లో కూడా కాశీం గారు  మాట్లాడుతూ కొంత ఆత్మపరిశీలన ధోరణిలో మాట్లాడారు. తన స్టేట్‌మెంట్‌ మీద కొంత నిరసన వచ్చిన క్రమంలో ఇప్పటికైతే అది తన అభిప్రాయమని, కాలక్రమంలో దానిని మార్చుకుంటే మార్చుకుంటానని ప్రకటించారు. ఆ మార్పు రావాలని, స్వయంగా కవి అయిన ఆయన మరింత కవిత్వం కూడా రాయాలని, విమర్శకుడిగా ఆధునిక కవిత్వాన్ని మరింత గుర్తిస్తూ.. వెన్నుదన్నుగా నిలుస్తూ చక్కని విమర్శనాత్మక వ్యాసాలు రాయాలని కోరుకుంటున్నాను.

*

శ్రీకాంత్ కాంటేకర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి చర్చకు పునాది వేసినావ్ మిత్రమా. పాట కచ్చితంగా ఎక్కువ ప్రభావశీలంగా ఉంటుంది. Instant popularity కూడా తెస్తుంది. పాట ఒకప్పుడు enlighten చేసింది. ఇవ్వాళ entertainment కు మాత్రమే పరిమితమయింది. అదీ చర్చించాలి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు