“పురుషుడు తన స్వేచ్ఛనీ , స్త్రీ తన స్వాతంత్రాన్నీ , కోల్పోయే ఏకైక వింత వ్యవస్థ పెళ్లి “అని చిన్నప్పుడు ఎక్కడో చదివిన గుర్తు . కానీ జీవితం విస్తరిస్తున్నకొద్దీ , అనుభవ వైశాల్యం పెరుగుత్న్నకొద్దీ ఆ వాక్యం అర్ధసత్యమేనని తెలుస్తుంది . పురుషుడు స్వేచ్ఛను కోల్పోతాడో లేదో తెలియదు కానీ స్త్రీ మాత్రం ఖచ్చితంగా తన సమస్తాన్నీ కోల్పోతుంది . చాలాకాలం క్రితం ఒక కవిత లో నేను స్త్రీ పెళ్లి అయితే “క్రియ లేని వాక్యం “అవుతుంది అని రాసాను . ఆ వాక్యం రాస్తున్నప్పుడు ఆ అక్షరాల వెనుక వున్నది మా అమ్మమ్మ . మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం . ఆమె చాలా అద్భుతంగా పాడుతుంది . ఆమె కే సరి అయిన ప్రోత్సాహం ఉండి అవకాశాలు వచ్చి ఉన్నట్టయితే నూర్జహా ని , సురయానీ , లతా దీదీ ని పక్కన పెట్టేసి ఉండేది . ఆమెకే కనుక చక్కటి విద్య అంది ఉంటే నానీ ఫాల్కీవాలా ను , రామ్ జెఠ్మలానీ ను పక్కన పెట్టి ఉండేది . ఏదీ అందలేదు కనుక మౌనం గా తన లోకంలో తన జీవితమేదో గడిపేసి నిష్క్రమించింది .
ఎప్పుడో ఎనిమిదేళ్ళప్పుడు తమిళ దేశం నుండి ఆంధ్రదేశం వచ్చి తనకు తెలియని భాష , తనకు తెలియని మనుషులు , తనకు తెలియని ప్రాంతం లో నోరు విప్పి లోలోపలి భావం చెప్పడాని కీ , హృదయం విప్పుకోవడానికీ అనువుకాని పరిస్థితుల మధ్య జీవితాన్ని యథాతథం గా స్వీకరించిన ఆమె అంటే నాకు గొప్ప ఆరాధన . జీవితం లో ఆమెకు ఎవరిమీదా కంప్లైంట్ లేదు . జీవితం మీద అయినా కంప్లైంట్ ఉందొ లేదో తెలియదు . కానీ ఆమె స్ట్రాంగ్ హార్టెడ్ ఉమెన్ అని మాత్రమే తెలుసు .
ప్రముఖ రచయిత్రి మన్నెం శారద అభినందనలతో పంపిన మన్నెం శారద కథలు చదువుతున్నప్పుడు , అందులోని “పాట ఆగింది ” కథ చదువుతున్నప్పుడు నన్ను కుదిపేసిన నోస్టాల్జియా పై వాక్య సముదాయం . 2014 లో నవ్య వీక్లీ , జనార్ధన మహర్షి సంయుక్తంగా నిర్వహించిన కథలపోటీలో రూ 5000/- బహుమతి పొందిన కథ అది . 2014 సంవత్సరం లో వచ్చిన ఉత్తమ కథలుగా ఎంపిక చేసిన ఏ కథా సంకలనం లోనూ ఆ కథ ఉన్నట్టు లేదు . ఆ కథ నిర్వాహకుల దృష్టికి రాలేదో , వచ్చినా దానిలో ఉత్తమ కథా లక్షణాలు లేవు అని అనుకున్నారేమో తెలియదు కానీ నాకు మాత్రం అది చాలా చాలా గొప్ప కథ . హృదయ వీణా తంత్రులను మీటడం కూడా సాహిత్య ప్రయోజనమే అని నా ప్రగాఢ నమ్మకం
మన్నెం శారద కథ అంతా ఉత్తమ పురుష లో , ప్రోతగానిస్ట్ , మనవరాలు మనకు చెపుతుంది . అమ్మమ్మ కి ముగ్గురు కొడుకులు . ఒక కూతురు . పెద్దకొడుకు నరసింహమూర్తి అంటే ఆమెకు ప్రాణం . అల్లారుముద్దుగా పెంచింది . తను సవతి తల్లిని అనే ఊహకి కూడా అందనంత ప్రేమగా పెంచింది . కానీ అర్ధం లేని , అవసరం కాని రహస్యం తెలిసాక కొడుకు భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు . మళ్ళీ తిరిగి చూస్తే ఒట్టు . రెండవ కొడుకు కి ఆస్తి అనుకున్నంత రాలేదని కోపం . వృద్ధాప్యం లో తనను చూస్తాడని మూడవకొడుకుకి ఆస్తి తన వాటాతో సహా ఇచ్చేస్తుంది . మూడవ కొడుకు ఆస్తి నంతా హారతి కర్పూరం లా కరిగించేసి అమ్మను భారంగా , బరువుగా అనుకుంటాడు . కొడుకు అమ్మ అపురూపం అనుకుంటేనే కోడళ్ళు సరిగ్గా చూడని రోజులలో కొడుకే పట్టించుకోక పోతే ఇక కోడలు సంగతి చెప్పేది ఏముంది?
అల్లుడు మంచివాడే కానీ ,” ఇంత బతుకూ బతికి అల్లుడు దగ్గర ఉండటమా “అని అమ్మమ్మ ఆభిజాత్యం .
కాలమలా గడుస్తున్నప్పుడు మనవరాలికి అరకులోయలో మెడికల్ ఆఫిసర్ గా పోస్టింగ్ వస్తుంది . మనవరాలికి ఇంకా పెళ్లి కాలేదు కనుక అమ్మమ్మ ని తోడుగా తీసుకుని వెళతాను అంటుంది . మనవరాలికి అమ్మమ అంటే చాలా ప్రేమ . చిన్నప్పుడంతా మనవరాలు అమ్మమ్మ దగ్గరే పెరిగింది . ఇప్పుడు వృద్ధాప్యం లో అమ్మమ్మ ఒంటరిగా క్షణాలని గంటలుగా గడపడం మనవరాలికి ఇష్టం లేదు . రానని రానని మొరాయించినా బలవంతంగా తనతో అరకు తీసుకుని వెళుతుంది . అమ్మమ్మ ను చూడటానికి దార అనే పనమ్మాయిని పెడుతుంది . రెండురోజుల పాటు అలిగి అన్నం తినకుండా దీక్ష చేసిన అమ్మమ్మ మూడోరోజుకు కుదుట పడుతుంది .
అరకు లోకి వచ్చాక జీవితం కొత్తగా మొదలు అయినట్టు ఉంటుంది అమ్మమ్మ కి . మనవరాలు హాస్పటల్ నుండి తిరిగి వచ్చేసరికి రోజుకోరకం షాక్ ఇస్తూ ఉంటుంది . ఇంటిముందు నాటడానికి తెచ్చి పడేసిన మొక్కలను మెల్లగా ఓపిక తెచ్చుకుని నాటుతుంది .ఒక రోజుల మనవరాలు గదిలో ఏదో పని చేసుకుంటుంటే “బ్రోచే వారెవరురా ” అనే పాట వినవస్తుంది . అచ్చు సుబ్బలక్ష్మి గొంతు లాగే వుంది ఎవరు పాడుతున్నారా అని మనవరాలు బయటకు వచ్చి చూస్తే అమ్మమ్మే సన్నగా పాడుతూ కనిపిస్తుంది . “అమ్మమ్మా !నీకు సంగీతం వచ్చా ?”అని అడిగితే “కొన్నాళ్ళు వీణ కూడా నేర్చుకున్నాను “అంటుంది . “ఇన్నాళ్లు మాకీ సంగతి తెలియదే “? అని మనవరాలు ఆశ్చర్య పోతే అమ్మమ్మ నిర్లిప్తంగా నవ్వి “ఎలా తెలుస్తుంది ? నా పెళ్లయి అత్తారింటికి రాగానే “పాటలు తైతక్కలు మా ఇంట్లో లేవు . మాది పరువు గల కుటుంబం “అంది మా అత్తగారు . అంతే ! మరెప్పుడూ గొంతు విప్పలేదు . అంతే కాదు , నా పేరు గాయత్రి . కానీ నన్ను అందరూ మీ తాత మొదటి భార్య పేరున శేషమ్మ గానే పిలిచారు . అలా నేను ఆవిడ లో పరకాయ ప్రవేశం చేశాను “అని అమ్మమ్మ కళ్ళలో నీళ్లతో చెపుతుంది
ఆ మాటలు అన్నీ విన్నాక మనవరాలి హృదయాన్ని ఒక బాధా వీచిక బలంగా తాకుతుంది . అమ్మమ్మ మీద జాలి పెరిగిపోతుంది . ఒక రోజు అరకు లో గిరిజన కళాకారులు తయారు చేసిన వస్తువులతో ఎగ్జిబిషన్ జరుగుతుంటే వీల్ చైర్ లోనే అమ్మమ్మ ని ఎగ్జిబిషన్ తీసుకుని వెళుతుంది మనవరాలు . అక్కడ అమ్మమ్మ రకరకాల బొమ్మలు , పూసల దండలు అన్నీ అబ్బురంగా చూస్తుంది . మనవరాలు “నీకు బొమ్మలంటే ఇష్టమా ?”అంటే “అవును . నా చిన్నప్పుడు నేను రామాయణం మొత్తాన్ని చిన్న చిన్న బొమ్మల రూపం లో తయారు చేశాను . నా పెళ్ళికి ముందు ప్రతి సంక్రాంతికీ మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టేవారు . ఆ బొమ్మలు ఇక్కడకు తెచ్చుకున్నా కూడా . మాకు ఆచారం లేదు అని మా అత్తగారు అంటే అన్నీవదిలివేసాను “అని చెపుతుంది
మనవరాలు రెండు రోజులు సెలవు పెట్టి విశాఖ వెళ్లి ఎక్కడో అటక మీద ఉన్న పెట్టెలన్నీ దుమ్ముదులిపి బొమ్మలను తీసుకుని అరకు వస్తుంది . వారం పది రోజులపాటు అమ్మమ్మ కళ్లన్నీ చికిలించుకుని మరీ బొమ్మలకు మరమ్మత్తులు చేస్తుంది . బొమ్మల్లో బొమ్మై పోతుంది . పని చేస్తూ ఎన్ని పాటలు పాడుతుందో . మళ్ళీ అమ్మమ్మ కొత్తగా గా పుట్టినట్టు , కొత్తగా బాల్యాన్ని అనుభవిస్తున్నట్టు , కొత్తగా యవ్వనాని ఆహ్వానిస్తున్నట్టు , కొత్తగా జీవితాన్ని సరి కొత్తగా జీవిస్తున్నట్టు , లోలోపల సృజన శక్తులు ఏవో ఆత్మను , శరీరాన్ని దీప్తివంతం చేస్తున్నట్టు
కొత్తగా కనిపిస్తుంది . ఆ ఇంట్లోకి కొత్తగా ఆమని వస్తుంది . ఎలకోయిల గొంతు విప్పుతుంది
చివరకు ఒక రోజు అమ్మమ్మ చేసిన బొమ్మలన్నిటితో ఒక బొమ్మల కొలువు . అరకు వాలీ లోని స్టాఫ్ అంతా వస్తారు . కూతురు , అల్లుడు , ఇంకా చాలామంది చిన్నా , పెద్దా . అందరూ బొమ్మలకొలువు చూసి ఆశ్చర్యపడిపోతారు .
అందరూ మెచ్చుకుంటుంటే అమ్మమ కళ్ళలో వెలుగు , జీవితం సాఫల్యం చెందినట్టు ఒక వింత అనుభూతి
రాత్రి పది అవుతుంది . అమ్మమ్మ అలసి పోయిందని మనవరాలు గదిలోకి తీసుకుని వెళ్లి పడుకోబెడుతుంది . హార్లిక్స్ తీసుకుని వస్తాను అని వంటగదిలోకి మనవరాలు వెళుతుంటే అమ్మమ్మ “మరుగేలరా ఓ రాఘవా “పాడుతూవుంటుంది . ఆ పాట గాలి అలలో తేలి విశ్వమంతా వ్యాపిస్తుంది .ప్రతి చెట్టునూ , పుట్టనూ , పలకరిస్తుంది .పయనించీ , పయనించే ఒక లేత మావి చిగురు పచ్చదనం లో దాక్కుంటుంది . ఒక గండు కోయిల గొంతు లో ఉండిపోతుంది . ఒక మలయానిల గానం లో కుదురుకుంటుంది
హార్లిక్స్ తీసుకుని మనవరాలు వచ్చేసరికి పాట ఆగిపోతుంది
ఇక్కడ మన్నెం శారద కథ ముగిస్తుంది
ఇక ప్రతి పాఠకుడూ తన కథ ఏదో తాను రాసుకోవాలి . మన అమ్మమ్మ ల్లో , నాన్నమ్మ ల్లో ఉన్న సృజన శక్తులను మనం గమనించామా ? వాళ్ళ దాకా ఎందుకు ? కనీసం మన అమ్మల్లో , మన సహచరులలో ఎవరిలో ఏ రహస్య పాల పుంతలు దాగి ఉన్నాయో మనమెప్పుడైనా హృదయం వొగ్గి విన్నామా ? వాళ్ళు ఒకవేళ పాటలు పాడితే ఎప్పుడైనా వాళ్ళ పాటలో ఒక్క స్వరం అయినా అయ్యామా ? వాళ్ళు బొమ్మలు గీస్తే ఆ బొమ్మల్లో ఒక్క రంగు చుక్క అయినా అయ్యామా ? పోనీ వాళ్ళు కధో కవిత్వమో రాస్తే వాళ్ళకోసం ఒక్క అక్షరమో , ఒక్క వాక్యమో మనలోనుండి తీసి ఇచ్చామా ? మన సొంతం అనుకునే మనుషుల లోలోపలి అంతరంగాలలోకి ఎప్పుడైనా మన సాలోచనల లోచనం విచ్చుకుందా ?
ఈ ప్రశ్నలకు మనం జవాబు ఎవరికో చెప్పుకోవలసిన పని లేదు . మనకు మనం జవాబు చెప్పుకుని , ఆ జవాబు తో సౌకర్యవంతం గా ఉండగలమా ? ప్రయత్నించండి
మా అమ్మమ్మ పాట గురించి “అమ్మమ్మ పాట “అనే పేరుతొ నేనొక కథ రాయాలి అని నేను చాలా తపన పడ్డాను కానీ రాయలేదు .ఇప్పుడిక రాయవలసిన అవసరం కూడా లేదు
*
మనసు పెట్టి వినాలే కానీ ఎన్నో అద్భుతాలు బయటకు వస్తాయండి. కానీ అమ్మమ్మ లకి, నానమ్మ లకి, అమ్మలకి వారి ఆలోచనలకు space ఇవ్వాలని తెలియని, అనుకోని ఆధునిక ప్రపంచం కదా మనది. చాలా బాగా రాశారు వంశీకృష్ణ గారూ.
ఒక మంచి కధని హృదంతంగా పరిచయం చేశారు. “2014 సంవత్సరం లో వచ్చిన ఉత్తమ కథలుగా ఎంపిక చేసిన ఏ కథా సంకలనం లోనూ ఆ కథ ఉన్నట్టు లేదు . ఆ కథ నిర్వాహకుల దృష్టికి రాలేదో , వచ్చినా దానిలో ఉత్తమ కథా లక్షణాలు లేవు అని అనుకున్నారేమో తెలియదు ..” ఈ కధల సంపుటి వ్యవహారం ఆభ్జెక్టివ్ గా ఉంటోందా!?.
చాలా మంచి పరిచయం,
ముందు తరాల్లోని ఎంతో ప్రతిభ భాద్యతల క్రింద నలిగి వెలుగులోకి రాలేదు.అసలు వారి గురించి ఆలోచించుకునే అవకాశం వారికి లేదు.ఇప్పుడు కొంత పరిస్థితులు మారినా మనసులు మారడానికి చాలా సమయం కావాలిసి రావచ్చుఁ.
Good job sir.
It is too good.. but in the ending there is a confusion.. why the song stopped? Anything happened to Grand mother? And also “ఇప్పుడిక రాయవలసిన అవసరం కూడా లేదు” these words also left me no where!
నేను చదవలేక పోయిన కథ మీ విశ్లేషణ వల్ల చడవగలిగాను.. శారదక్క కథలన్నీ ఎన్నెన్నో వర్ణాల జీవిత చిత్రాలే. కథ చదువుతుండగానే ముగింపు ఊహించాను.. మంచి కథ. ఇరువురికీ అభినందనలు..
అభినందనలు, sir, కధ బాగుంది,