తెరె బినా జిందగీ, హిందీ పాటలలో అతడు-ఆమె…
నా ప్రియమిత్రుడు, మంచి మనిషి, మంచి రచయిత, మృదుభాషి పరేష్ దోశి పుస్తకం డిసెంబర్ 2019లో అచ్చయ్యింది.
ఏమిటీ పుస్తకం అంటే, ఇది పాటల పుస్తకం. హిందీ పాటల పుస్తకం. హిందీ పాటలను తెలుగువారికి అర్థమయ్యేలా అనువదించి రసాస్వాదనకు అవకాశం కల్పించిన పుస్తకం. నిజానికి ఇది పుస్తకం కాదు, పాఠకుడు ప్రతి పేజీ తిప్పుతున్నప్పుడు తప్పనిసరిగా తన జీవితంలోని గతకాలపు మధురజ్ఙాపకాల్లోకి జారిపోయేలా చేసే ఒక నోస్టాల్జియా ఈ పుస్తకం. దిల్ తో బచ్చా హై జీ అనుకోకుండా ఉండలేము.
ఈ పుస్తకంలో హిందీ పాటలకు దోశీజీ అనువాదం అందించారు. అనువాదం అంత తేలిక కాదు. పైగా పాటల అనువాదం మరింత కష్టం. ఎందుకంటే, అనువాదం అనేది కేవలం ఒక భాషలోని పదాలను మరో భాషలోకి మార్చడం కాదు. ఒక భాషాసంప్రదాయానికి మరో భాషా సంప్రదాయానికి చాలా తేడా ఉంటుంది. అభివ్యక్తిలో ప్రతి భాషకు దాని ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత మరో భాషలో పలికించాలి.
హిందీ, తెలుగు భాషలకు చాలా తేడా ఉంది. ఈ పుస్తకంలో తీసుకున్న చాలా పాటలు హిందుస్తానీ, అంటే ఉర్దూ పదాలెక్కువ. ఉర్దూ, హిందీ భాషల్లో పదాలు చిన్న చిన్నవిగా ఉంటాయి. ఏకాక్షర పదాలు ఎక్కువ. పాటను అదే బాణీలో అనువదించడం అందువల్ల చాలా కష్టం. నడక, గతి, మీటరు చూసుకుని అదే భావాన్ని పలికించాలంటే కత్తిమీద సాము చేయాలి. సరే, దోశీజీ అలా చేయలేదు, ఆయన పాట అర్థాన్ని వచనం రూపంలో చెప్పారు కాబట్టి ఆయనకు కాస్త తేలికయ్యిందని అనుకుంటే, అది పెద్ద పొరబాటు. ఎందుకంటే వచనంలో చెప్పడం మరింత కష్టం. ఎందుకంటే, గేయసాహిత్యానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ప్రాసలు, నడక, లయ, తూగు ఈ శబ్దసౌందర్యం ఉంటుంది. ఈ శబ్ధసౌందర్యాన్ని వదిలేసిన తర్వాత పాఠకుడిని మెప్పించేలా అనువదించడం ఇంకా కష్టం.
ఉదాహరణకు రుదాలీలో పాట దిల్ హూం హూం కరే చాలా మంది వినే ఉంటారు. ఈ పాట వింటున్నప్పుడు ఒకవిధమైన ట్రాన్సులోకి తీసుకెళ్ళిపోతుంది. అర్ధం తెలియకపోయినా ఆ పాటను ఆస్వాదిస్తాం. గుల్జార్ మాటల మాయావి. హూం హూం, ధం ధం, జిన్, తన్, మన్ వంటి పదాల ప్రయోగం ద్వారా ఒక అద్భుతమైన మాయాజాలాన్ని, విషాదమేఘాన్ని గుల్జార్ సృష్టించాడు. ఈ శబ్దాల ప్రభావం లేకుండా అనువాదంలో కేవలం భావాన్ని చెప్పడం వల్ల, చాలా గొప్పగా వింటూ వచ్చిన పాటలోని అసలు అర్థం ఇంతేనా అని పాఠకుడు భావించే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి దోశీజీ చేసింది కత్తిమీద సాము మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ. ’’గుండె కొట్టుకుంటున్నా దడే‘‘ అని అనువదించడం ద్వారా హిందీ పాటలోని సాహిత్యం సాధించిన అనుభూతిని పాఠకుడికి అందించారు.
ఈ పుస్తకంలోని ప్రతి పాట ప్రత్యేకమైనదే. అనువాదం కూడా విశిష్టమైనదే. కేవలం కొన్ని పాటల గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. పుస్తకంలోని మొదటి పాట గైడ్ చిత్రానికి శైలేంద్ర రాసిన, కాంటోం సే ఖీంచ్ కే ఆంచల్… ఈ పాట చాలా మంది చాలా సార్లు వినే ఉంటారు. విన్న ప్రతిసారి మొదటిసారి విన్నప్పటి రోజులను గుర్తు చేసుకునే ఉంటారు. పాతజ్ఙాపకాల్లోకి వెళ్ళి పోయి ఉంటారు. నిజానికి ఈ పాటకు, మన జ్ఙాపకాలకు సంబంధం ఉండకపోవచ్చు. కాని పాటలు ఈ నోస్టాల్జియా ప్రభావం వేస్తాయి. ఇక ఈ పాట గురించి దోశీజీ చాలా నేపథ్యం, సినిమా కథ సారాంశం వివరించడం ద్వారా అర్థం చేసుకునే వాతావరణం ఏర్పరచిన తర్వాతనే పాట అనువాదం ఇచ్చారు. వివాహేతర సంబంధాలపై 1965లో తీసిన సినిమా ఇది. అంతకన్నా ముందే 1927లో చలం రాసిన మైదానం నవల కూడా ఇలాంటి వస్తువుపై రాసిందే.
ఈ పాటను అనువదిస్తూ ఒక చరణంలో రాసిన మాటలు
’’ఇప్పుడు నేను నా అధీనంలోనే లేను
తనువెక్కడో వుంటే, మనసెక్కడో
యేమి పొంది చిరునవ్వు దాల్చి
ఈ జీవితం పాడిందో ఈ పాట
మరలా ఈ రోజు జీవితేచ్ఛ
మరలా ఈ రోజు మృత్యుకాంక్ష‘‘
ఒరిజినల్ పాట హిందీ సాహిత్యాన్ని తెలుగు లిపిలో కూడా ఈ పుస్తకంలో అందించారు. కాబట్టి ఒరిజినల్ కూడా చదువుకోవచ్చు. ఈ పాటకు తెలుగు అనువాదం చదివిన తర్వాత మైదానంలో రాజేశ్వరిని అర్థం చేసుకోవడం తెలుగు పాఠకుడికి మరింత తేలికవుతుంది.
క్లాసికల్ పాటలే అన్నీ ఎన్నుకున్నారు. అలాంటి మరో పాట ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్. మక్దూం ముహియుద్దీన్ రాసిన గజల్ ఇది. గజల్ వస్తువు సహజంగానే ప్రేమ విరహాలే ఉంటాయి. కాబట్టి అతడు ఆమె శీర్షిక క్రింద ఈ గజల్ పెట్టడం సముచితమే. సామల సదాశివ గారు ఈ గజల్ గురించి రాస్తూ, రాత్రంతా ప్రేయసి జ్ఙాపకమే వస్తుందని, ఆమె రాలేదు కాబట్టి కన్నులు తడిశాయని, ఆమె రాకపోయినా ఆమె జ్ఙాపకాలు వచ్చాయి కాబట్టి తడి కన్నులు నవ్వాయని గొప్పగా వివరణ ఇచ్చారు.
బాఁసురీకి సురీలీ సుహానీ సదా
యాద్ బన్ బన్ కే ఆతీ రహీ రాత్ భర్
ఈ షేర్ కు దోశీజీ చేసిన అనువాదంలో మక్దూం భావాన్ని పూర్తిగా తెనిగించడమే కాదు, అదే అనుభూతి పాఠకుడికి కలిగించారు.
పిల్లంగోవి తీయని స్వరాలు
జ్ఙాపకాలై వస్తూనే ఉన్నాయి రాత్రంతా
అంటూ స్వరాల మాదిరి జ్ఙాపకాలు అలలు అలలుగా వస్తున్న భావచిత్రాన్ని, శబ్ద ప్రధానమైన భావచిత్రాన్ని సాధించారు.
ఈ గజల్ చివరి షేర్ అనువాదం
’’ఎవరో ఉన్మత్తుడు వీధుల్లోనే తిరుగాడుతూ ఉన్నాడు రాత్రంతా
యేదో పిలుపు వినిపిస్తూనే ఉంది రాత్రంతా‘‘
ఇక్కడ ప్రేయసి స్మితా పాటిల్ మానసిక స్థితిని వర్ణించడానికి ఈ షేర్ ఎంత అద్భుతంగా కుదిరిందో దోశీజీ చక్కగా వివరించారు. నిస్సందేహంగా ఈ గజల్ ప్రేమ విరహాలు ప్రధానమైనదిగా ఉన్నప్పటికీ మక్దూం రాసిన గజల్లో అంతరార్థం సోషలిస్టు సూర్యోదయం కోసం వేచి చూసే కార్యకర్తల మనస్థితి వర్ణన. ఆ సూర్యోదయం లేదు కాబట్టి చీకటిగా చూపించారు. ఈ చీకట్లలో కమ్యునిజం కోసం పనిచేసేవారు తిరుగుతూనే ఉన్నారని, విప్లవనినాదాలు ఇస్తూనే ఉన్నారని ఆయన చివరి షేర్ అంతరార్థం. ఈ విప్లవకవులకు విప్లవమే ప్రేయసి అని అర్థం చేసుకోవాలి. అతడు-ఆమె శీర్షిక క్రింద ఈ గజల్ ను అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ అంతరార్థం కన్నా విరహవేదనకే ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది.
మరో అద్భుతమైన పాట ’’అజ్నబీ బన్ జాయే హమ్ దోనో‘‘. ’’మరోసారి అపరిచితులమై పోదాం‘‘ అనే అనువాదం కన్నా గొప్పగా ఎవరు అనువదించలేరు. ఈ పాట రాసింది పాటల మాంత్రికుడు సాహిర్ లూధియాన్వి. సాహిర్ అంటే మాంత్రికుడని అర్థం. లూధియానాకు చెందినవాడు కాబట్టి లూధియాన్వి అంటారు. సాహిర్ లాంటి మరో కవి లేడు. ఫైజ్, మక్దూం వంటి దిగ్గజాలున్న కాలంలో సాహిర్ తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకున్న కవి. ఆయన రాసిన హిందీ పాటలు అనేకం. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే కేవలం పాట గురించి చెప్పడం మాత్రమే కాదు, సినిమా గురించి, కవి గురించి, ఆయన జీవితం గురించి కూడా ముచ్చటించే పుస్తకం. ఎంతో గొప్ప సమాచారం అందించే పుస్తకం. సాహిర్ జీవితంలో అమృతా ప్రీతమ్ పాత్ర గురించి దోశీజీ వివరించడం బాగుంది. ఈ పాటలో చివరి చరణంలో సాహిర్ రాసిన పదాలకు దోశీజీ అనువాదం చదివితే మనకు రెండు ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. సాధారణంగా అనువాదంలో మూలభాష అర్థమైతే చాలు కాని లక్ష్యభాషలో గట్టి పట్టు ఉండాలని అనుకుంటాం. కాని దోశీజీకి రెండు భాషలపై సమానమైన అధికారం ఉంది. మూలంలోని భావాన్ని పట్టుకోవడంలో ఉన్న లాఘవం, తెలుగులో ఆ భావాన్ని చెప్పడంలోని నైపుణ్యం రెండు ఆశ్చర్యపరుస్తాయి. ఈ కవితను మీరే చదివి ఆనందించండి
మీర్జా గాలిబ్ సినిమాలో గజల్ అనువాదం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఈ గజల్ అనువాదానికి లొంగేది కాదు. ఈ గజల్ అనువాదం అద్భుతంగా చేశారు. ప్రతి షేర్ భావాన్ని అనువాదంలో పలికించారు. ఈ సందర్భంగా వఫా అనే పదం గురించి ఇచ్చిన వివరణ చాలా బాగుంది. వఫా అంటే ప్రేమ మాత్రమే కాదు, విధేయత అని చక్కని వివరణ ఇచ్చారు. వఫా అంటే విధేయతతో పాటు విశ్వసనీయత కూడా, ఫెయిత్ ఫుల్ అనే ఇంగ్లీషు పదం కూడా కొంతవరకు సరిపోతుంది. ఉర్దూ పదాలను కవి ఏ భావంతో ఉపయోగించారో ఆ భావాన్ని పట్టుకోవడం చాలా అవసరం. ’’ఏక్ పత్తర్ తబియత్ సే ఉఛాలో యారో‘‘ అని దుష్యంత్ కుమార్ ఒక షేర్ లో రాశాడు. ఇక్కడ తబియత్ అనే పదం నిఘంటువులో అర్ధాలతో వాడింది కాదు. శ్రద్ధగా, మనసుపెట్టి అనే భావాలతో వాడింది. గాలిబ్ వంటి కవిని అనుదిస్తున్నప్పుడు ఈ సమస్య చాలా సార్లు ఎదురవుతుంది. గాలిబ్ ఆ పదాన్ని ఏ అర్థంతో ఉపయోగించాడన్నది గ్రహించడం ముఖ్యం. ’’హమ్ కో ఉన్ సే వఫా కీ హై ఉమ్మీద్; జో నహీ జాన్తే వఫా క్యా హై‘‘ ఇక్కడ దోశీజీ ’’ప్రేమ‘‘ అనే పదం వాడడం ద్వారా గాలిబ్ షేర్ ని చాలా అందంగా అనువదించారు. ఇక్కడ విధేయత, విశ్వసనీయత వగైరా పదాలు తెలుగులో పొసిగే పదాలు కావు. ’’నేను ఆశించిది వారి ప్రేమ; రామా, వారికి ప్రేమంటనే తెలీదే‘‘ అంటూ అందంగా అనువదించారు.
ఈ పుస్తకంలో చేర్చిన పాటల్లో 2011లో వచ్చిన రాక్ స్టార్ సినిమాలోని కున్ ఫ యకున్ పాట కూడా ఒకటి. ఇది నిజానికి మిగిలిన పాటలతో పోల్చితే కొత్త పాట. కాని సూఫీ సాహిత్యం వల్ల బహుశా దోశీజీ దృష్టిని ఆకర్షించి ఉండాలి. కున్ ఫ యకున్ నిజానికి అరబీ. దివ్యఖుర్ఆన్ లో దైవం శక్తిసామర్థ్యాల గురించి పలుచోట్ల ఈ పదాలు వచ్చాయి. దైవం ఏదన్నా చేయాలని అనుకున్నప్పుడు ఆ పనిని ’’అయిపో‘‘ అని ఆదేశిస్తాడు. అంతే ’అయిపోతుంది‘. ఈ వాక్యాలకు దోశీజీ ఇచ్చిన వివరణ పూర్తిగా అధికారికమైనది. ఇక్కడ దోశీజీ చేసిన అనువాదం ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి
’అస్తు‘ అని నువు అనడం ఆలస్యం
రెప్పపాటులో ప్రత్యక్షం అస్తిత్వం
ఈ అనువాదంలో చాలా ఈజ్ ఉంది. రెండు భాషల్లోను సాధికారికత లేకపోతే ఇలా చేయడం సాధ్యం కాదు. ఈ పాటను తీసుకున్నప్పుడు ’చల్ ఛంయ్య ఛంయ్య‘‘ పాట కూడా తీసుకుంటే బాగుండేదని అనిపించింది.
ఈ పాటలో తాను కొన్ని వాక్యాల అనువాదాన్ని వదిలేశానని దోశీజీ చెప్పారు. ఆ వాక్యాలను వదిలేసినా భావానికి వచ్చిన నష్టమేమీ లేదనే అనుకుంటున్నాను. బహుశా దోశీజీ అందుకే వదిలేసి ఉంటారు. అయినా కొన్ని వాక్యాలు పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాను.
ఔలియా అంటే వలీకి బహువచనం. వలీ అంటే దైవానికి మిత్రుడని భావం. మర్యాదపూర్వకంగా బహువచనాన్ని వాడతారు. నిజాముద్దీన్ సూఫీ, వలీ దైవానికి మిత్రుడని ఈ పాటని ప్రారంభించారు. తర్వాత సర్కార్ అంటే ప్రభూ అని అర్థం. ఇక్కడ ఒక రెండు వాక్యాలు ప్రత్యేకంగా ప్రస్తావించాలి.
జబ్ కహిం పె కుచ్ నహీ భీ నహీ థా
వహీ థా వహీ థా వహీ థా వహీ థా
ఇక్కడ ’’నహీ భీ నహీ‘‘ అనే పదాలు గమనించాలి. అంటే ’నహీ‘ లేదా ’నాస్తి‘ కూడా లేనప్పుడు, అప్పుడు దైవం ఉన్నాడనే భావం. గాలిబ్ ఒక గజల్లో ఇలా అంటాడు
న థా కుచ్ తో ఖుదా థా, కుచ్ న హోతా తో ఖుదా హోతా
(ఏదీ లేనప్పుడు దైవం ఉన్నాడు, ఏది లేకపోయినా దైవం ఉంటాడు)
డుబోయా ముఝ్ కో హోనేనే, న హోతా మై నే తో క్యా హోతా
(’’ఉండడం‘‘ అనేదే నన్ను ముంచింది. నేను లేకపోతే ఏమయ్యేది)
ఇది కూడా లోతైన భావనే. మనిషి అస్తిత్వమే లేకపోతే ఏమిటంటూ దేవుని అస్తిత్వంపై చాలా చాకచక్యంగా ప్రశ్నిస్తాడు గాలిబ్
అలాగే ఈ పాటలో మాయ అనే పదం, మోహ్ మాయా అనే పదాల్లోని మాయగాను అర్థం చేసుకోవచ్చు. కారుణ్యం అనే భావంలోను తీసుకోవచ్చు.
ఈ పాటలో వచ్చే మరో వాక్యం. సదఖాల్లాహుల్ అలియ్యుల్ అజీమ్. సదఖ అంటే సత్యవాక్కు. అల్లాహు అలియ్యుల్ అజీమ్ అంటే అత్యున్నతుడైన దైవం పలికేది స్వచ్ఛమైన సత్యం అని భావం. అలాగే సదఖ రసూలుహుల్ నబీ వుల్ కరీం అంటే కారుణ్యమూర్తి అయిన ప్రవక్త పలికేది సత్యమని భావం. ఆ తర్వాతి వాక్యం సల్లల్లాహు అలైహి వ సల్లం. ఇది ఒక ప్రార్థన. సాధారణంగా ప్రవక్త ముహమ్మద్ పేరు పలికిన వెంటనే సల్లలాహు అలైహి వ సల్లం అని పలుకుతారు. దీనికి అర్థం ఆయనపై శాంతి కలుగుగాక అని. ఇస్లామీయ సాహిత్యంలో ప్రవక్త పేరు తర్వాత (స) అని రాసే పొడి అక్షరానికి అర్థం ఇదే. అక్కడ ఈ ప్రార్థన చదవాలని భావం. అలాగే జీసస్ పేరు ఉచ్ఛరించిన తర్వాత కూడా అలైహిసల్లం అంటే ఆయనపై శాంతి కలుగుగాక అని పలుకుతారు. ప్రవక్తల పేర్లు పలికిన తర్వాత ఇలా ప్రార్థించడం సంప్రదాయం. ఈ పాటను అర్థం చేసుకోడానికి ఇది అదనపు సమాచారం మాత్రమే. దోశీజీ అనువాదంలో పాట భావం మొత్తం వచ్చేసింది.
ఈ పుస్తకంలో ఉన్న మరో గొప్ప పాట 1962 ఖైదీ సినిమాలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ముజ్ సే పహలీ సి ముహబ్బత్ అనే పాట. మజ్రూ సుల్తాన్ పురి రాసిన పాట తేరె ఆంఖోంకె సివా అనే లైన్ ఈ పాట నుంచే తీసుకున్నారని దోశీజీ రాశారు. మరో విషయమేమంటే, ఫైజ్ తన కవిత్వ సంపుటికి పెట్టిన పేరు ’నక్షె ఫరియాదీ‘. ఈ పేరును గాలిబ్ కవిత ’’నక్షె ఫరియాదీ హై కిస్కీ షోఖియే తహ్రీర్ కా‘ అనే షేర్ నుంచి ఆయన తీసుకున్నారు. గాలిబ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న కవి ఫైజ్. ఈ పాట నిజానికి గజల్ కాదు. కాని చాలా మంది గజల్ గా పొరబడతారు. దానికి కారణం పాటలోని సాహిత్యం. నూర్జాహాన్ పాడిన శైలి. నిజానికి సమాజంపై ఒక నిరసన ధ్వని ఉన్న పాట ఇది. కాని అద్భుతమైన మార్ధవంతో అదే విషయాన్ని చెప్పిన పద్ధతి ఈ పాటను గజల్ అని భ్రమించేలా చేస్తుంది. అదే స్థాయిలో, అదే మార్దవాన్ని పలికిస్తూ దోశీజీ అనువదించారు.
ఈ పుస్తకంలో చెప్పుకోవలసిన మరో పాట సాహిర్ లూధియాన్వి రాసిన వో సుబహ్ కభీతో ఆయెగీ. ఈ పాట నిజానికి సినిమా కోసం రాసిన పాట కాదు. ఫైజ్ రాసిన పాటలు కూడా సినిమా కోసం రాసినవి కాదు. సినిమాలో వాడుకున్నారు. సాహిర్ ఈ పాటను స్వతంత్రం తర్వాతి పరిస్థితులపై నిరసనగా రాశాడు. ఈ స్వతంత్రాన్నా మనం కోరుకున్నది అనే స్వరంతో రాశాడు. ఫైజ్ కూడా ఇలాంటి ధ్వనితో రాసిన కవిత ఉంది. సుబాయే ఆజాదీ పేరుతో రాశారు. ’’యే దాగ్ దాగ్ ఉజాలా‘‘ అంటే ఈ మచ్చలు పడిన ఉదయం అని అర్థం. సాహిర్ అసలైన స్వతంత్ర ఉదయాన్ని ఆకాంక్షిస్తూ ఈ కవిత రాశాడు.
కవిసంగమంలో వంద వారాల పాటు ఈ వ్యాసాలు సీరియల్ గా వచ్చాయి. స్వరాలు తొడిగిన కవిత శీర్షికతో రెండు సంవత్సరాల పాటు దోశీజీ ఈ వ్యాసాలు రాశారు. అందులోంచి ఏరి కూర్చిన పాటలివి. అతడు-ఆమె ధీమ్ తో రోమాంటిక్ మూడ్ లోని పాటలు. హిందీ సాహిత్యాన్ని తెలుగు లిపిలో చిరుపుస్తకంగా పుస్తకానికి అనుబంధం ఇవ్వడం బాగుంది.
సాహిర్ ఎలాంటి మాంత్రికుడో, దోశీజీ కూడా అలాంటి మాంత్రికుడే. హిందీ పాటల్లోని ఒక ప్రత్యేకత ఏమిటంటే, సున్నితగా, సుకుమారంగా, మఖ్మల్ లాంటి మార్దవంతో గుండెలకు హత్తుకుపోతాయి. దోశీజీ కి ఈ మంత్రాలు తెలుసు. ఎలాంటి పదాలు వాడితే ఈ అనుభూతిని, రోమాంటిక్ పాటల్లో స్త్రీ స్వరాన్ని, పురుషస్వరాన్ని పలికిస్తున్నప్పుడు ఎలాంటి పదాలు ఎలా వాడాలో, మూలంలోని భావాన్ని పాఠకుడికి ఎలా చేరవేయాలో ఆయనకు బాగా తెలుసు. చాలా పాటలు మనకు అప్పుడప్పుడు హఠాత్తుగా గుర్తొస్తుంటాయి. ఒక్కోసారి ఒక్కోరోజు ఏదో ఒక పాట మన నాలుకను వేదికగా చేసుకుని రోజంతా నాట్యం చేస్తూనే ఉంటుంది. ఇలా వెంటాడే పాటల్లోని భావాన్ని, అనుభూతిని పూర్తిగా ఆస్వాదించేలా చేయడమే కాదు, ఈ పాటలను మనపైకి దాడికి పంపించే పుస్తకమిది. ఈ పాటల దండయాత్రలో ఓడిపోవాలనే పాటల అభిమానులు కోరుకుంటారు. ఈ పుస్తకం చివరి పేజి చదివిన తర్వాత.. దం లగాకే హైసా పాట గురించి చదివేసిన తర్వాత… ఈ పుస్తకంతో మనతో
’’అచ్ఛాతో హమ్ చల్తే హైం‘‘ అంటున్నదా అనిపిస్తుంది.
’’ఫిర్ కబ్ మిలోగే‘‘ అని మనం ప్రశ్నిస్తూ మిగిలిపోతాం
ఇలాంటి మరో పుస్తకంతో త్వరలో కలవాలని కోరుతున్నాను.
*
చాలా బాగుంది వాహెద్.. ఈ వ్యాసం. హిందీ పాటలు సౌకుమార్యం దోశీ ఎలా తనది చేసుకున్నాడో… దాన్ని నువ్వు అంటే మృదువుగా పరిచయం చేశావు. ఎన్నో గొప్ప పాటల్ని గుర్తు చేశారు. ధన్యవాదాలు.
మేము FB లో 100 episodes చదివి ఆనందించాము. పరేష్ గారు రాసిన పాటలగురించి చాలా మంచి విశ్లేషణ !ధన్యవాదాలు.
మంచి వ్యాసం …మంచి పుస్తకం…చక్కని పరిచయం
మరో పుస్తకమూ రావాలి అని ఆశిస్తున్నా