పాటలు పుట్టిన తావులు

తెలుగు లోకి వచ్చిన అనువాద పుస్తకాల్లో ఆయువుపాట అన్న ఈ పుస్తకం ప్రత్యేకమైన పుస్తకం. ఆయువుపాట అన్నమాటను కొంచెం తత్సమం గా చేస్తే ప్రాణగీత మవుతుంది. ప్రతి దేశానికి, ప్రతి జాతికి జవజీవాలను, చైతన్యాన్ని ఇవ్వగల పాటలు, ఇచ్చిన పాటలు కొన్ని ఉంటాయి. ఆ పాటలని ప్రజలంతా ఏళ్ల తరబడి విశ్వజనీనంగా చేస్తూ పాడుకుంటూ ఉంటారు.
ఉదాహరణకి మన గురజాడ వారి దేశభక్తి కవిత దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది తెలుగుదేశానికి, భారతదేశానికి మాత్రమే సంబంధించిన పాట కాదు.
ఈ పాటని ఏ దేశమైనా తమ జాతి గీతంగా, ఇంకా చెప్పాలంటే తమ ఆయువు పాటగా వాడుకోవచ్చు.
అలాంటి పాటలు ఎన్నో ఏళ్లుగా ప్రజల  గళాల ద్వారా బయటకు వచ్చి తరతరాలుగా ప్రయాణించి ఇప్పటికీ ప్రజలలోకి చొచ్చుకుపోయిన  ఉన్నాయి. అవి మనకు అత్యాధునిక సాంకేతికత కారణంగా వినటానికి కూడా అందుబాటులో ఉన్నాయి.
అటువంటి పాటలలో తొమ్మిది దేశాలకు సంబంధించిన తొమ్మిది పాటలను ఎంచుకుని వాటి ఆంగ్ల మూలాల నుంచి తెలుగులోకి అనువాదం చేయడమన్న ఒక చిన్న పనిని చంద్రలత అనే రచయిత్రి మొదలుపెట్టారు.చిన్న పనా అంటే ఇదేమీ చిన్నపని కాదు. అయితే చంద్రలత లో నవలా రచయిత్రీ, కథా రచయిత్రి మాత్రమే కాకుండా అలుపెరుగని పరిశోధకురాలు కూడా ఉన్నారు.
ఆమె ఏ వస్తువును తీసుకుని దాని గురించి రాద్దామని అనుకున్నా దాన్ని ఆమూలాగ్రం   పరిశోధించడానికి ఎన్ని ఆకరాలైతే   ఉన్నాయో, ఎన్ని ఆధారాలైయితే ఉన్నాయో వాటిన్నిటినీ ఆపోశన పట్టి వాటి ద్వారా సమగ్ర సర్వస్వాన్ని తెలుసుకోకపోతే స్థిమితంగా ఉండలేరు.
ఈ తొమ్మిది పాటల ను అనువదించడం అనే చిన్న పని తో పాటు  వీటి పుట్టుపూర్వోత్తరాలు సర్వ సమగ్రంగా అంతర్జాలాన్ని గాలించి గాని, పుస్తకాలు చదివి గాని సంపాదించి వాటిని ప్రతి పాట తోటి అనుసంధానం చేసి మనకు అందించడం అనే పెద్దపని కూడా నిర్వహించారు.అలా తయారయిన పుస్తకమే ఈ ఆయువు పాట.
ఇందులోని తొమ్మిది పాటలలోఎనిమిది యూరోపియన్ దేశాల ప్రజల పాటలు. ప్రజల పాటలంటే  మళ్ళీ సాధారణ ప్రజలు, పల్లె  ప్రజలు, జానపదలు పాడుకున్న పాటలు. అక్కడ పుట్టిన పాటలు అక్కడ నుంచి ఎంత దూరం ప్రయాణించేయి, తిరిగి ఎంతగా ప్రజా సమూహాల గుండెల్లోకి చేరి పోయాయి అన్నది చెప్పడమే ప్రధానంగా ఈ రచన సాగింది.ఇంకా రెండవ ప్రపంచయుద్ధ కాలంలో ఇవి నిర్వహించిన పాత్ర ఎంత గొప్పదో సవివరంగా ఇందులో ఉంది. నిజానికి ఈ తొమ్మిది పాటల్లో ఒక పాట ఆసియా దేశం పాట, మరొకటి అమెరికా పాట. మిగిలిన ఏడుపాటల వెనుక చాలా కథ ఉంది. యుద్ధ చరిత్ర ఉంది.
ఈ పుస్తకంలో మొదటి పాటగా ఆమె తమిళం లో సుబ్రహ్మణ్య భారతి రాసిన పాటను ఎన్నుకోవడం చాలా ఔచిత్యవంతంగా ఉంది. ఆ పాట పేరు చంద్రులత అనువాదంలో ‘వెలుగును మరిచిన పువ్వు’.
ఆ విధంగా భారతీయ గీతంతో మొదలుపెట్టి యూరోపియన్ కంట్రీస్ అన్నీ తిరిగి వచ్చి అమెరికన్  పాటను కూడా కలుపుకుని పాట తాలూకు విశేషమైన శక్తిని వివరించడం కోసమే ఈ ప్రయత్నం చేసి ఉంటారు.
ఇది కేవలం పాటల అనువాద పుస్తకం గా కాకుండా ప్రయోగాత్మకంగా కూడా చేయటం ఆమె ఉద్దేశం. ఎందుకంటే ఈ పాటలన్నీ ఇప్పటికీ వందేళ్ళ క్రితం పుట్టి పెరుగుతూ వచ్చిన పాటలైనా వాటికి ఉన్న ప్రశస్తి వల్ల ఇప్పటికీ మనకి యూట్యూబ్లో దొరుకుతూనే ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా వినిపిస్తూనే ఉన్నాయి. అలా విన్న పాటలను ఆమె అంతటితో వదిలిపెట్టకుండా వాటి చరిత్ర మొత్తం అంతటినీ తెలుసుకోవడం కోసం పరిశోధన చేసి ఒక్కొక్క పాటకి ఏడెనిమిది పేజీల చరిత్రని అందించడం ఈ పుస్తకంలో చేసిన ప్రయోగం.
నాకు తెలిసి ఇలా ఏళ్ళ తరబడి ప్రజల వెంట ఉన్న పాటలను ఒక చోట చేర్చి వాటి కథాకమామిషు కాక వాటిని రాసిన వారి పాడిన వారి చరిత్రలు కూడా చెప్పడం కొత్త ప్రయోగమే.
ఈ పుస్తకంలో ఆమె ఎంపిక చేసుకున్న పాటలు వంద ఏళ్ళ కాల పరిధి లో వచ్చిన పాటలు.ఇవి ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పాటలు. ఆ కాలంలో ప్రపంచంలోని ఇంచుమించుగా అన్ని దేశాలు అనేక కష్టనష్టాలే కాకుండా హింసలకు, దుఃఖభూయిష్టమైన జీవితాలకు గురికావడం గురించి చరిత్ర నమోదు చేస్తూ వచ్చింది. అంత బీభత్స ప్రధానమైన కాలంలోనూ పేద ప్రజలకు, జానపదులకు అణగారిన వారికి, అణచబడినవారికి కేవలం పాట మాత్రమే ఎలా ప్రాణాలు నిలుపుతూ వచ్చిందో ఈమె తాను ఎంపిక చేసిన పాటల ద్వారా స్పష్టంగా వివరించుకుంటూ వచ్చారు.
అసలు ఈ పుస్తకం అంతా రెండు మూడు సార్లు చదవాల్సిన పుస్తకం. నేను అలాగే చదివాను. ఎందుకంటే ఐరోపా దేశాల్లో వచ్చిన ఈ పాటల గురించి చెప్తున్నప్పుడు వాటి పుట్టుపూర్వతరాలన్నీ కూడా ఈ యుద్ధాలతో ముడిపడి ఉన్నాయి. ఈ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్లు, నాజీలు, వాళ్ల ఇనుప సంకెళ్లు, ఊచకోతలు ఇవన్నీ దాటుకుని బయటికి వచ్చిన పాటలు గురించి, తర్వాత కాలంలో కూడా విశేష ప్రచారాన్ని పొందిన పాటలు గురించి ఈమె ఇందులో వివరించుకుంటూ వచ్చారు.
నాకు ఏమనిపించిందీ అంటే అసలు ఏ పాట ఏ విధంగా గొప్పదో చెప్పాలంటే, ఆ   పాట తాలూకు పుట్టుక నుంచి, ఆయా దేశకాల పరిస్థితుల మీదుగా అది ఎంత దూరం ప్రయాణించిందో చెప్తే తప్ప మనకి దాని పురాతనత్వం గానీ, అది సాధించిన విశ్వజనీనత గానీ తెలియదు కదా.
ఆ విధంగా తెలియ చెప్పడం కోసం ఆమె కొన్ని ప్రత్యేకమైన పాటలను ఎంచుకున్నారు. ఆ ఎంచుకోవడంలోనే చంద్రలత తాలూకు చరిత్రతో పాటను  ముడివేస్తున్నటువంటి దృష్టి అర్థమవుతూ వచ్చింది. నిజానికి పాటకి ఉన్న శక్తి ఇంత గొప్పదా అని మనం ప్రతి పాట గురించి చదువుతూ పుస్తకం చివరికి వచ్చేటప్పటికి విభ్రాంతికి లోనవుతూ, గగుర్పాటు కు గురవుతాం.
కవితాత్మకమైన ఈ పాటల గురించి చెప్తూ చంద్రలత ఇలా అంటారు.
“ఈ లోకంలో ఎవరి లోకం వారిది. వారి వారి లోకాలలో జీవిస్తున్నా కొందరి అనుభూతులు అందరికీ అందుతాయి. అప్పుడు ఆ కవిత లేదా పాట అంతగా ఆనందంగా మనోహరంగా రూపొందుతుంది అనుభూతి ప్రధానంగా సాగే ఈ అపురూప ప్రియరాగాలలో కొన్ని ముఖ్యమైన పాటలు రచించిన వారి మనసును దాటి  గడపలు దాటి, కాలాలను దాటి, లోకాలన్నీ చుట్టేస్తాయి. అజరామరం అవుతాయి.” ఇలా అజరామరమైన పాటలే ఈ తొమ్మిది పాటలూ.
ఇందులో మొదటి పాట సుబ్రహ్మణ్య భారతి రాసిన తమిళ పాట. రచయిత్రి  ఐరోపా దేశాల పాటల గురించి చెప్పడానికి మొదలుపెట్టినప్పుడు తన మాతృదేశపు పాటతోటే మొదలుపెట్టడం నాకు ఎంతో ఆనందం కలిగింది. నిజానికి ఇలా అజరామరమైన పాటలు ఇంత పెద్ద మన భారతదేశంలో ఎక్కువే ఉన్నాయి. బంకిం చంద్రుడి వందేమాతరం అలాంటి మన ఆయువు పాట. స్వాతంత్రోద్యమంలో ఆ పాట ఎంత శక్తివంతంగా పనిచేసిందో చరిత్రకు తెలుసు. ఇప్పటికీ అది మనకి ప్రార్థనా గీతమే.
ఇక “మాకొద్దీ తెల్ల దొరతనము” లాంటి పాటలు గురించి చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి చాలా పాటల్లోంచి స్వాతంత్ర సమరయోధుడైన భారతి పాటను ఎన్నుకోవడం సమయోచితమైన పని. ఎందుకంటే ఈమె రాస్తున్న ఈ అనువాద పుస్తకం తెలుగు లోకి వస్తున్న అనువాదం. ఇందులో ప్రత్యేకించి తెలుగు వారి పాటల గురించి గానీ, దేశమంతా తిరుగుతున్న పాటలు గురించి గానీ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు.
అందువల్ల మనకు తెలియని సుబ్రహ్మణ్య భారతి పాటని అనువాదానికి తీసుకున్నారు. పైగా అది కూడా పైగా ప్రేమ గీతం.
సుబ్రమణ్య భారతి ఐదేళ్ల వయసులో తన తల్లిని పోగొట్టుకున్నాడు. ఆ శూన్యం ఎప్పటికీ శూన్యంగానే ఉండిపోయింది. అమ్మ రూపురేఖలను చూపే ఒకే ఒక్క ఛాయాచిత్రం కూడా పోయినప్పుడు కలిగిన శూన్యాతి శూన్యం లో ఒక అపురూపమైన ప్రేమ గీతం పుట్టింది. అదే “ఆశైముగం మరందు పోసే” అన్నది. కణ్ణన్ పాట్టు అనే కావ్యం లోని పాట ఇది. ఈ పాటను “వెలుగును మరిచిన పువ్వు” అన్న పేరుతో అనువదించి ఈ పుస్తకంలో చేర్చారు. “తేనెను మరచిన మధుపము వానను మరచిన పైరు లాగ కన్నడి ముఖాన్ని మరిచిపోతే ఇక ఈ కనులు ఉండి ఎందుకే” అట్లా సాగుతుంది అనువాదం.
                       2
ఇలా ఇందులో ఈమె 1.జర్మన్ పాట 2.ఇటాలియన్ పాట 3. ఫ్రెంచి పాట 4.స్పానిష్ పాట 5.ఆఫ్రికన్ పాట 6.కరేబియన్ పాట 7.అమెరికన్ పాట చివరిగా 8 గ్రీక్ పాట లను వెతికి, ఎంచుకుని, అంతర్జాలసహాయంతోనూ, పుస్తకాల సహాయంతోనూ వాటి గురించిన సమస్తమూ ఇందులో రాశారు.
సంవత్సరాలు, నెలలు, తారీకులు కూడా వదలకుండా ఈ పాటల చరిత్రను పరిశోధన లాగ చేసిఅందించారు.
అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క పాట గురించి రాసిన వ్యాసాన్ని నేను ఒకటికి మూడు సార్లు చదివాను.
కారణం వంద ఏళ్లపాటు ప్రజా సమూహాల నోళ్ళ ద్వారా ప్రచారం అవుతూ ఉన్న ఆ పాటలు తాలూకు విశేషాలు అన్నీ కూడా  ఇందులోకి తీసుకురావటమే కారణం.
నేను ముందే చెప్పినట్టు రెండో ప్రపంచ యుద్ధం తాలూకు ప్రభావం, నష్టం జర్మనీతో సహా ఈ దేశాల అన్నింటి మీద ఉంది. అలాంటి పరిస్థితుల్లో జర్మనీలోని నాజీలను గాని వారికి మద్దతునిస్తున్నటువంటి మిగిలిన దేశాలను గాని ఎదిరించే క్రమంలో ఈ పాటలు వచ్చేయి. వాటిని పాడి ప్రచారం చేసిన గాయకులు గాని, రచయితలు గాని, స్వరకర్తలు గాని ఎలాంటి శిక్షలకు గురవుతూ వచ్చారో అదంతా ఈ పుస్తకంలో ఉంది
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ  పాటల స్వరకర్తలు గాని, గాయకులు గాని రచయితలు గాని అతి పేదరికం నుంచి వచ్చినవారు. వారి తల్లిదండ్రులు ఏ ఏ పనులు చేసి పిల్లల్ని ఎలా పెంచుకుంటూ వచ్చారో, అంత సంక్లిష్టమైన వాతావరణంలో ఎన్ని కష్టాలు పడుతూ కూడా పాటని ఒక సాధనంగా, ఆయుధంగా చేసుకుంటూ ముందుకు సాగారో చదువుకుంటూ పోతే మనకి ఒక జ్ఞాన బోధ జరిగినట్టు అనిపిస్తుంది.
ఇంచుమించుగా చంద్రలత ఇందులో చెప్పిన పాటలన్నీ ఇప్పుడు మనకు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి.
నేను ఈ పుస్తకం రెండు మూడు సార్లు చదివాక యూట్యూబ్లోకి వెళ్లి ఆ పాటలు కూడా విన్నాను.
అప్పటి కొందరు గాయకుల్ని కూడా కళ్ళతో చూసే భాగ్యం మనకు ఆధునిక సాంకేతికత వరంగా ఇచ్చింది. మామూలుగా యూట్యూబ్లో వారి పాటలు వింటే బాగుంటుంది కానీ ఈ పుస్తకంలో రాసిన చారిత్ర్యక నేపథ్యంలో మరియం మకీబా వంటి గాయకుల పాటలు చూస్తూ వింటే అది గొప్పఅనుభవం. ఆ పాట వెనక ఉన్న ఏళ్ల తరబడి నడిచిన జీవితాల నలుగుడు కళ్లముందు కనిపింపచేసింది ఈ ఆయువు పాట.
ఇందులో ఒక్కొక్క పాట చరిత్ర చెబుతూ ఆమె రాసిన వ్యాసాల్లోంచి కొన్ని వాక్యాలు చూడండి.
‘వీధి దీపం నీడన’ అనే జర్మన్ పాట ఒక సాధారణమైన బడిపంతులు రాసింది. అతను
అందమైన జీవితం, అందమైన ప్రేయసి కుదురైన జీవితం తాలూకు కలల దుప్పటి కప్పుకొని ఈ పాట రాశాడు. అతని పేరు హాన్స్ లీఫ్
తర్వాత రెండవప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత గాయాల కారణంగా బయటపడ్డాడు. అతను రాసిన పాట ‘లేలే అండర్సన్’ అనే క్యాబరే గాయని, నట విద్యార్ధి, గాయపడ్డ గృహిణి పాడింది. పాడుతూనే వచ్చింది. ఆ పాట వల్ల జర్మన్ లో వారిద్దరూ వివక్షకు గురయ్యారు. నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది .
తర్వాత కాలంలో జర్మన్ భాషలో పాడిన ఈ పాట సుమారు 48 భాషల్లోకి అనువదించబడింది. దాదాపు 200 రకాలుగా పాడిన ఈ పాటను 2006 లో హ్యాంబర్గ్ కు చెందిన ‘బేర్ ఫ్యామిలీ రికార్డు’ వారు పదిల పరిచారు.
అయితే నాజీ ప్రభుత్వం ‘లేలే ‘ పట్ల చూపిన నిర్బంధానికి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. కానీ ఆ పాటకు ఉన్న ఆదరణ వల్ల ఆమెకు కలిగిన ప్రజాభిమానం ముందు  ప్రభుత్వం మౌనవహించవలసి వచ్చింది.
ఇలా రెండో ప్రపంచ యుద్ధం పూర్తయ్యేనాటికి వందలాది యుద్ధ ట్యాంకులు, లక్షలాది యుద్ధ ఆయుధాలతో పాటుగా ఒక శత్రువు పాటను మిత్రపక్షాల వారు వారితో తీసుకెళ్లారు- అని రాస్తుంది రచయిత్రి.
పాట తాలూకు శక్తి ఏమిటో మనకు ఈ వ్యాసం లో తారస్థాయి లో కనిపిస్తుంది.  ప్రేమకు, విరహానికి సంబంధించిన ఈ పాటను ఇరుపక్షాల యుద్ధగీతంగా మార్చిన ఘనత  కార్ల్ హైంజ్ రీ టన్ దే. రేడియో ద్వారా విశేషంగా ప్రచారం చేసిన ఘనత కూడా ఆయనదే. ఈ పాట ప్రత్యేకత గురించి ఆమె ఇలా రాస్తారు
“నెమ్మదిగా గాఢాను రక్తితో, మత్తుగా, మార్దవంగా సాగే అండర్సన్ గొంతుక ఆ పూటకు సైనికులను నిద్రపుచ్చే గుళిక. యుద్ధ భూమి, ఆసుపత్రి, కాన్సన్ట్రేషన్ క్యాంపు, శరణార్థి శిబిరాలు అన్ని చోట్ల ఈ పాట వినిపించబడింది.”
అనేక నిర్బంధాలకు గురైన ఈ పాటను ప్రచారంలోకి తెచ్చిన వారిలో మిత్ర పక్షాల పాత్ర పెద్దది. అందులో మార్లిన్  డిట్రీక్ అనే గాయని ఆనాటికి అత్యంత పారితోషకం అందుకుంటున్న ప్రసిద్ధ హాలీవుడ్ నటిమణి. అమె ఈ పాటకు ప్రపంచమంతటా విశేష ప్రచారం తీసుకొచ్చింది. ఈ పాట యుద్ధం మిగిల్చిన ఒక తీపి జ్ఞాపకం అయింది. దీని చుట్టూ ఉన్న అనేకానేక విశేషాలన్నింటినీ రచయిత్రి ఈ పుస్తకంలో వివరించుకుంటూ వచ్చి చివరగా ఇలా అంటారు.
“ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జరిగిన దారుణ హోమానికి ప్రపంచం ముందు జర్మనీ దోషిగా నిలబడింది. ప్రపంచమంతా జర్మన్ ను అసహ్యించుకునే సమయాన అందరూ ప్రేమించింది ఈ జర్మన్ పాట ను, లిల్లీ మార్లిన్ నే.”
ఈ వ్యాసం చివర న పాట తాలూకు రెండు వెర్షన్లను తెలుగు లోకి అనువదించి అందించారు.
‘చెలీ ఇక సెలవ్’ అనే ఇటాలియన్ పాట కూడా ఇదే స్థాయిలో ఉంది.
” ‘డు ఇట్ నౌ నౌ’ అంటూ బెల్జియం కు చెందిన 60 మంది ఫ్లెమిష్ కళాకారులు చిత్రించిన ఈ పాటతో సుమారు 150 దేశాలలో లక్షలాదిమంది కళాకారులు, పర్యావరణవాదులు, ప్రకృతి ప్రేమికులు, పిల్లలు, పెద్దలు గొంతు కలిపి పాడిన ఉత్తేజ కరమైన పాట. అది కలిగించిన ఉద్యమ స్ఫూర్తి ఒక ప్రముఖ చారిత్రక ఒప్పందానికి దారి తీసింది. “
ఇది వింటుంటే మన వందేమాతరం పాట గుర్తువస్తోంది. ఈ పాటను ఇద్దరు రచయితలు రచిస్తే దీని స్వరపరిచింది మాత్రం ఆల్ పర్వత సానువుల్లోని వరి పొలాల్లో. స్వరపరిచిన వారెవరు తెలీదు 9 వ శతాబ్దం లో అనామక స్వరకర్తల హృదయాల్లోంచి పుట్టిన పొలంపాట ఇది.
ఈ పొలంపాటను  అందిపుచ్చుకున్నది ఇటాలియన్ అంతర్యుద్ధ యోధులు. అయితే ఇటలీ దీన్ని జాతీయ ప్రచారంలోకి తెచ్చింది.
ఇక్కడ ఇటలీ నియంతృత్వాన్ని ఎదిరించిన పార్టీజాన్లు అని పిలవబడే స్వేచ్ఛావాదులు దీనిని ప్రపంచవ్యాప్తం చేశారు.
ఈ విధంగా
“ఒక పొద్దుటి పూట నిద్ర లేచానో లేదో
చెలీ చెలీ సెలవు చెలీ చెలీ సెలవు”
అంటూ వచ్చే ఈ పాట చరిత్ర చాలా పెద్దదే.
ఆల్ పర్వత సానువుల్లో ‘ పో’ నది పరివాహక ఫీడ్ మౌంట్ ప్రాంతంలోని వరి పొలాలలో కర్షకులు పాడుకున్న పాటగా ఇది కనిపిస్తోంది. ఈ ఇటలీ పాట గురించి చెప్పేటప్పుడు అక్కడి పంటలు, పద్ధతులు, వ్యవసాయం చేస్తున్న మహిళా శ్రామికులు వీరందరికీ సంబంధించిన విశేషమైన సమాచారాన్ని ఇక్కడ  అందించారు.
అలా ఈ పాట 19వ శతాబ్ది ఆఖరిలో పుట్టిందని భావిస్తున్నా, దీన్ని పదిలపరిచింది మాత్రం అర్థ శతాబ్ది కిందటనే.
జియో వాన్ని డాప్సిని అనే జానపద గేయాన్ని స్వయంగా ఒక మొండినా పాడిన పాట ( మొండినా అంటే వరి పొలాల్లో పనిచేసే శ్రామిక స్త్రీ) పొలాల్లో పనిచేసేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వీల్లేదు కాబట్టి వారి శ్రమను తగ్గించుకోవడానికి పాడిన పాటలే ఇలాంటి జానపద గేయాలు. అటువంటి పాట ఈ బెల్లా చావు అనమాట.
ఈ పాట గురించి ఈమె ఎలా చెప్తారు ఇంటి శత్రువైన ఇటలీ ఫాసిస్టు నియంతృత్వం అటు చొచ్చుకు వస్తోన్న దురాక్రమణదారులు ముందూ వెనకా. ఏకంగా పర్వతాలనే ఢీకొనడానికి తన వంటి మరి ఎందరో యువతీ యువకులతో కలిసి ఒక స్వేచ్ఛా వాదిగా ఒక పార్టీ జాన్ గా ముందుకు నడవాలని నిశ్చయించుకొని వెళ్లబోయే ముందు అతని మనోహరి కోసం పాడిన వీడ్కోలుట పాట ఈ బెల్లా చావ్ అనే పార్టీ జాన్ పాట.
“జీవితం పట్ల గాఢానురక్తిని, నమ్మకాన్ని గౌరవాన్ని కలిగించాల్సిన ” ఆళ్ల మట్టెనా,అప్పెనా అల్జాట బిల్లా చావ్ చావ్ చావ్”  పాట ఇది.  అనేక ఉద్యమాలకు ఊపిరి ఉత్తేజమై నిలిచిన పాటఇది.
దీన్ని దిగజారుడు తిట్టుపాటలా తీర్చిదిద్దడం మన తెలుగు సినిమాకే దక్కింది” అని కూడా పిల్ల పిల్ల చావు అన్న పాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తారు
ఎడిత్ పిఎఫ్ అనే గాయని పాడిన లావియనా రోజా అన్నది ఫ్రెంచ్ పాట. ఎంతో పేదరికంలో పెరిగిన అమ్మాయి గొప్ప వ్యక్తుల పరిచయాల వల్ల సానబెట్టబడిన వజ్రమైంది. యుద్ధవేళల్లో తను తన ప్రదర్శనలను స్థావరాల్లో, కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో ఫ్రెంచ్ యుద్ద ఖైదీల కారాగారాల్లో ఇవ్వడమే కాక జర్మనీలో ప్రదర్శనల పర్యటన చేయటం వల్ల విమర్శలకు గురి అయింది. కానీ ఆమె తనకున్న ప్రఖ్యాతి వల్ల నాజీల నుంచి నాటకీయంగా ఫ్రెంచ్ యుద్ధ ఖైదీలను తప్పించింది. ఇలా గాయనిగా ఉంటూనే తను చేయగలిగినంత చేసింది. అందువల్ల ఈ పాట ఫ్రెంచ్ వారి ఆశాగీతమై, ఫ్రెంచ్ వారి తరతరాల వారసత్వ సంపదగా కూడా మారింది.
చంద్రలత ఈ పాటకు ఫ్రెంచ్ పాఠాన్ని, అలాగే ఆంగ్ల పాఠాన్ని కూడా అనువాదం చేసి ఈ వ్యాసానికి చివర చేర్చారు. ఇందులో ఫ్రెంచి పాట ప్రథమ పురుషులో ఉంటుంది. ఆంగ్ల పాఠం మధ్యమపురుషలో ఉంటుంది. ఇవి కాక ఈమె పాడిన ప్రసిద్ధమైన పడాంపడాం అనే పాటకి కూడా ఈ పుస్తకంలో అనువాదం ఉంది.
ఎల్ కాన్డోర్ పాషా అని మొదలయ్యే స్పానిష్ పాట పెరూదేశ జాతీయ గీతాల్లో ఒకటి.
 కాండూర్ అంటే మన గండభేరుండం లాంటి ఒక పక్షి. దాన్ని సూర్యుడి దూతగా భావిస్తారు ఆ ఆండియన్ అడవి బిడ్డలు. తమ జీవితాల్లో నుంచి పుట్టిన ఈ స్వరం చెట్టు పుట్టలపై వారు అల్లుకున్న  ఆప్యాయత అనుబంధాలకు ప్రతీక.
దీనికున్న ప్రాధాన్యత, దాని చరిత్ర , జార్  జువేలా అనే సంగీత రూపంలో దాని స్థానము ఇదంతా పెద్ద వ్యాసంగా దీంట్లో రాశారు.
ఇది కొండల మీది పర్యావరణ స్పృహనించి స్వేచ్ఛ కోసం అన్నింటిని ఎదిరించగల  గీతంగా ప్రపంచ దృష్టికి వచ్చింది.
కదిలిందొకకాండర్ అని దీన్ని అనువదిస్తూ ఈ స్వరాల ప్రత్యేకత తెలియజేశారు. ఇందులో కూడా స్పానిష్ పాఠాంతరం సార్వజనీనంగా ఉంటే ఆంగ్ల పాఠాంతరం ఉత్తమ పురుషులో ఉంటుంది
త్వర త్వరగా అమ్మా త్వర త్వరగా అని అను భూతుల్లోకి పొంగిన మిరియం మకీబా పాట ఆఫ్రికా పాట. ఈమెను ఆఫ్రికన్లు మమ్మా ఆఫ్రికా అని పిలుచుకుంటారు. ఇటలీ మాఫియా నేర ప్రపంచ అధికారుల దౌష్ట్యానికి వ్యతిరేకంగా గళమెత్తిన రెబెర్టో సావియానాకు మద్దతుగా సుప్రసిద్ధ అమెరికన్ ఆఫ్రికన్ గాయనీయమణి మకీబ గళమెత్తింది.
ఒక పనిమనిషి కుమార్తెగా పుట్టిన  మిరియం మకీబా దక్షిణాఫ్రికా గాయణీయమణి, పాటల రచయిత, నటి, ఐక్యరాజ్యసమితి రాయబారి, గ్రామి అవార్డు గ్రహీత గా ఎదిగింది.
నెల్సన్ మండేలా చేతుల మీదుగా దక్షిణాఫ్రికా సర్వోన్నత పురస్కారం రాష్ట్రపతి పతకం పొందింది. జాతి వివక్షతో సంబంధం లేకుండా అన్ని వర్గాల్లోనూ ఆమె గానానికి అభిమానులు ఉన్నారు. ప్రార్థనా గీతాలతో ప్రారంభమైన ఆమె సంగీత ప్రయాణం పెళ్లిళ్ల వేడుకల్లో, విందు వినాదాల్లో, సరదాగా సంతోషంగా వీనులు విందుగా సాగింది. అమెరికన్ ప్రభావిత ఆఫ్రికన్ జార్జ్ సంగీత శైలులు కాకుండా ఆఫ్రికన్ ప్రభావిత అమెరికన్ జాజ్ సంగీత శైలికి చెందిన ఆఫ్రికన్ జార్జ్ ను ప్రాచుర్యానికి తెచ్చిన కళాకారుల్లో ముఖ్యమైన కళాకారిణి మరియ.
ఆమె ఇలా అంటుంది కళాకారుడిని అవడం కన్నా ముందుగా నేను ఒక మనిషిని అని భావిస్తాను. మనుషులందరూ జీవించే లోకంలోనే నేను జీవిస్తున్నాను. ఒక కళాకారుడిగా మన చుట్టూ జరుగుతున్న దానికి కళ్ళు మూసుకోకూడదు. నేను దక్షిణాఫ్రికా నుంచి వచ్చాను. నా జీవితం అక్కడ అనుభవాలతో ప్రభావితం అయింది. నా పాటలు కేవలం అక్కడి నిజ జీవితాన్ని ప్రతిపాదిస్తాయి. నేను నా ప్రేక్షకులకు ఏదో ఒక్క సందేశం ఇవ్వటం లేదు.  నన్ను, నా దేశాన్ని, నా ప్రజలను వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను అని చెప్తుంది. ఈ వ్యాసం చివర చంద్ర లత అమ్మ ఆఫ్రికా వి నాలుగు పాటలు అనువాదం చేశారు
కలిప్సో సంగీత శైలి లో  పాటలు పాడి కలిప్సో యువరాజుగా గుర్తించబడిన గాయకుడు హారి బెల్ఫ్ ఫాంటే. కలిప్సో పనిపాటల సంగీతం. ఇతను అతిపేద కుటుంబంలో పుట్టి పెద్ద గాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. అతని పాటలు సంగీత ప్రపంచాన్ని జయించడమే కాక అతని జంకు లేని మాటలు, రాజీపడని చేతలు అంతకన్నా ప్రసిద్ధమైనవి. బెల్ ఫాంటే అంటే ఎంతటి పోరాటయోధుడో ఈ వ్యాసం నిండా ఉంటుంది
అరటిపడవ లొచ్చాయ్ అన్న పాట హృదయాన్ని ద్రవింప చేసే పాట. అరటికాయని సగంగా కోసిన ఆకారంలో ఉండే పడవలో ఒకరికి ఒకరికి ఎడలేనంత దగ్గరగా కూర్చోబెట్టి బానిసలను ఎగుమతి చేసే అంశాన్ని ప్రశ్నించే పాట.
జ్యూడీ గార్లాండ్ పాడిన ఇంద్రధనస్సు కు  ఆవలగా అనే అమెరికన్ పాట  గురించి చెప్తూ బాల్లాడ్డ నే యక్షగాన లాంటి ప్రక్రియ గురించి చాలా వివరంగా ఈ వ్యాసంలో చెప్పుకొస్తారు.
 చిట్టచివరి పాట గా ఏథెన్స్ కు చెందిన నానా మోస్కోరి పాడిన తెల్ల గులాబీ పాటతో వ్యాసాలు పూర్తయ్యాయి. చరిత్ర అంతా కూడా గ్రీకు సాంప్రదాయ నేపథ్యంలో వివరించుకుంటూ వెళ్లి ఆ పాట తాలూకు అనువాదాన్ని ఇలా అందించారు.
“కాస్త జ్ఞాపకం పెట్టుకో శీతాకాలంలో ఘనీభవించిన మంచుపొరల అడుగున ఒక విత్తనం దాగి ఉంటుంది. సూర్యుడి వెచ్చని ప్రేమతో వసంతకాలన గులాబీ పువ్వు అవుతుంది.”
ఈ తొమ్మిది పాటల ద్వారా గ్రీసు నుంచి జర్మనీ దాకా ప్రభుత్వాల అధికారుల దౌష్యాలు, వాటి కింద పడి నలిగినా తారాపధానికి ఎగసిన కళాకారులైన సాధారణ వ్యక్తుల పోరాటాలు, పాటలు నేపథ్యంగా ఎలా జరిగాయో చెప్పడం కోసం ఇంత పెద్ద పరిశోధన తలకెత్తుకున్నట్టు అనిపిస్తుంది.
ఇందులో పాటలను లయబద్ధంగా అనువదించటానికి ఆమె ప్రయత్నం చేయలేదని, కేవలమూ భావాన్ని మాత్రమే అందించే ప్రయత్నం చేశారని అనువాదాలు చూసి అనుకున్నాను .
కానీ ప్రతీ పాటా వింటూ ఆ స్వరానికి తగిన అదే అర్ధం ఉన్న తెలుగు పదం కోసం వెతుకుతూ అనువాదం చేసేనని ఆమె చెప్పినప్పుడు మళ్లీ అన్ని పాటలూ చదివాను.ఇది కఠినమైన కుటీరపరిశ్రమ అని అర్ధమైంది.
ఏదైనా ఈ పుస్తకం చూసినప్పుడు, చదువుతున్నప్పుడు కూడా తెలుగు భాషకి ఇదొక కొత్త చేర్పు అవుతుందని అనిపించింది. చంద్రలత చేసిన ఈ పరిశోధనాత్మక రచనలో  ఆమె చూపిన ఓర్పుకు, కృషికి నా అభినందనలు.
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నమస్కారం.పాటల పరిచయంలో అందరికన్నా ఒక అడుగు ముందుంటుందని మరొకమారు సారంగ పత్రిక నిరూపించింది. ధన్యోస్మి!
    ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, సాహిత్య విమర్షకులు శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి గారు,ఈ రచనలను ఒకటికి పలుమార్లు కూలంకషంగా చదివి, ఆ పాటలను విని, ఆ పాటలు పుట్టిన తావులు వెతికి పట్టుకొని,ఆసాంతం తడిమిచూసారు. ఆ పై, విశ్లేషాత్మకమైన పరిచయం రాశారు.నేరుగా మరెన్నో సూచనలు చేశారు.వీరలక్ష్మి గారికి అభిమానవందనాలు.మనసారా.
    సారంగ బృందానికి ధన్యవాదాలు.

  • ఆయువు పాట రచయిత్రి డాక్టర్ చంద్రలత గారికి అత్యద్భుతమైన విశ్లేషణ చేసిన వాటిరేవో వీరలక్ష్మి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు నమస్సులు

    ఈ పాటల్ని వెలుగులోకి తీసుకురావడం కోసం చంద్ర లత గారు ఎంత కష్టపడ్డారో, అదే విధంగా ఈ పాటలని విశ్లేషించే పనిలో వీరలక్ష్మి గారు కూడా చాలా ఏకాగ్రతను చూపారు
    తెలుగు సాహిత్యానికి మరొక కొత్త చేర్పు ఈ పుస్తకం ద్వారా లభించినందుకు ఆనందిస్తూ ఒక గీత రచయితగా అభినందిస్తూ నమస్తులతో మీ భువనచంద్ర

  • తలపెట్టిన రచన ఏదైనా పరిశోధనకి కూడా అందులో తావిచ్చి ఆ రచనని విశిష్టంగా తీర్చి దిద్దడం చంద్రలతకి అలవాటు. తన ప్రతి రచనా పాఠకులకి ఒక సర్ప్రైజ్!
    వీరలక్ష్మి గారి సమీక్ష అందమైన చిత్రానికి ఫ్రేమ్ కట్టించినట్టై పుస్తకాన్ని పాఠకుల కళ్లకి కట్టించింది. కొని చదువుకోవాలనిపించేలా చేసింది. చంద్రలతకూ, వీరలక్ష్మి గారికీ, సారంగకూ అభినందనలు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు