పదేళ్ల వయసు దాటాక, గురుతులన్నీ మసకబారాయి కానీ, చిన్నతనపు జ్ఞాపకాలు మాత్రం నల్లటి పలక మీద వత్తుగా దిద్దిన ‘అ ఆ’ ల వలె స్పష్టంగా కనిపిస్తాయి,
నిద్ర లేచాక, కళ్లని చన్నీళ్లతో కడిగితే, కనిపించినంత తేటగా.
*****
అదొక ఇల్లు. నా జ్ఞాపకాల్లో అదొక గొప్ప ఇల్లు. పెంకుటిల్లే .
చిన్నతనంలో మా నాన్న పామర్రు దగ్గర ఓ పల్లెటూళ్లో కొన్నేళ్లు ఉద్యోగం చేశాడు. అప్పుడు మేమొక ఇంట్లో అద్దెకుండే వాళ్లం. ఆ ఇంటి వోనర్లు ఎక్కడో బొంబాయిలో వుండే వాళ్ళు. పెద్ద తోటలో ఇల్లంతా మాకిచ్చేశారు.
వారెపుడైనా వస్తే వాడుకోడానికి రెండు గదులు మాత్రం ఉంచుకున్నారు. ఇంటి గదుల్లోని బీరువాల్లో ఏవేవో గ్రంధాలు, తాళపత్రాలు, పెద్ద గాజు జాడీలూ ఉండేవి. తాళ పత్రాల మీద అక్షరాలు ఎంతో పొందికగా ఉండేవి. చదవగలిగే వాళ్లం కానీ, ఏమీ అర్థం అయేది కాదు.
ఉత్తరం వైపు తోట ఉండేది. బావి కూడా. తోటలో ఏమేమి చెట్లుండేవో చెప్పడం కన్నా, ఏమి చెట్లు లేవో చెప్పడం తేలిక. దానికి తోడుమా నాన్న కూరగాయలన్నీ పండించేవాడు. బుట్టలకు బుట్టలు చిక్కుళ్ళు తెగేవి. పెంకుల మీద నిర్లక్ష్యంగా కాసిన సొరకాయలు ఎండలో సేద దీరుతుండేవి. పెరగడంలో పెడసరముండేది. ఎటు బడితే అటు వంకర తిరిగి, బలంగా ఉండేవి. నా ఓటి చేతులు మోయలేనంత బరువు తూగేవి. కూరగాయలు కొనుక్కోవడమేమిటో తెలియని రోజులవి.
పూల చెట్లు తక్కువే. సిరిలక్ష్మి వాళ్ల గోడ పక్కనే ఎర్ర మందారపు చెట్టుండేది. ప్రతి రోజూ యాభై పూలకు తక్కువ పూసేది కాదు. దేవుడి ఊరేగింపు వస్తుంటే, మేమంతా గబ గబా పూలు గిల్లేసి మా అమ్మకిచ్చేవాళ్లం.
మేము అంటే నేను, నా అన్నలు, ఇంకా మా పెద్దమ్మ పిల్లలు.
అయిదారునిముషాల్లో దండ తయారయేది. .
ఒక ఇత్తడి పళ్లెంలో దేవుడికి హారతి వెలిగించి , మందార మాలతో సిద్ధంగా నిలబడేవాళ్లం.
ఇహ కోదండరాముడిదే ఆలస్యం.
******
ఆ తోటతో నాకెన్నో సంభాషణలు నడిచేవి, మనసులోనే.
ప్రతి చెట్టునీ ఒక మనిషితో జోడించుకునేదాన్ని, వాటి తీరు తెన్నుల బట్టి.
ఆదివారం మధ్యాహ్నం భోజనమయాక, మా పెద్దన్నయ్య కథల పుస్తకం చదువుతుంటే వేప చెట్టు కింద చాప మీద నిద్రపోయేదాన్ని. అది నిదానమైన పెదనాన్న.
బావి పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు మా రెండో మావయ్య.
తోట వేపు గుమ్మానికానుకుని నాపరాళ్లు సిమెంట్ చేసిన జాగా ఉండేది. బడి నుండి రాగానే ఆ నాపరాళ్లని నీళ్లు పోసి కడిగేవాళ్లం. ప్రతిరోజూ అక్కడే మేము ఆరుబయట భోజనాలు చేసేది. సాయంత్రం ఆరున్నరకు అలా వెలుగు తగ్గుతుండే సమయానికి తినేసే వాళ్లం.
ఆ పక్కనే దడిమీద కాకర కాయలు కాసేవి. ముదురాకు పచ్చగా ఉండి నాన్న మధ్య వేలంత పొడుగుండేవి. వాటి తొడిమెలు సున్నితంగా గిల్లితే చాలు. గట్టిగా తెంపకూడదు.
బుట్ట నిండే వరకూ కోసేవాళ్లం.
ఆ కాకరపాదుని , ఏనాడూ గుమ్మంలో నిలబడని పూజారిగారి భార్య మీనాక్షమ్మ గారితో పోల్చుకునేదాన్ని.
మా స్నానాలు కాగానే, అమ్మ అక్కుళ్లతో వండిన వేడి అన్నం తీసుకొచ్చేది. ఆ నాపరాళ్ల మీద అందరం రౌండ్ గా కూర్చుంటే , వేడి అన్నంలో పులుసు కలిపి ముద్దలు కలిపి పెట్టేది. కాకరకాయ పులుసు వేసుకుని తిన్నామొకనాడు.
ఎర్రటి చిక్కని కాకరకాయ పులుసు. అంత అద్భుతమైన రుచి మళ్లీ ఎరగను.
“కాకరకాయా? అదీ పులుసా?” అని పెదవి విరిచే వారితో నేను వాదించను లెండి.
ప్రహరీ గోడ లోపల, రోడ్డు మీదకు పేద్ద ఉసిరి చెట్టుండేది. ప్రతి ఏడాదీ, ఇంటి ఓనర్ మామ్మగారొచ్చినపుడు , గెడ కర్రల్లాంటి మనుషుల్ని పిలిపించి కాయల్ని దులిపించేవారు. మాకొక వంద కాయలిచ్చేవారు. అయినా మాకెవ్వరికీ ఉసిరికాయ మీద పెద్ద వ్యామోహం లేదు. ఆవకాయంటేనే!
******
ఆవకాయ అనగానే ఓ పిల్ల గుర్తొస్తూ ఉంటుంది. పసిడి బొమ్మ వంటి చిన్న పిల్ల.
ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవి.
ఆ పిల్ల ఎవరో చెప్తానుండండి.
ఆ రోజుల్లో మేమంతా కలిసి సాయంకాలం పూట
కూచిపూడి రోడ్డులో షికారు వెళ్లేవాళ్లం, పార్కు వేపుకు.
పల్లెటూరికి పార్కేమిటంటారా?
ఆ ఊళ్లో నీళ్ల టాంక్, ఒకటి కట్టారు. పెద్దదే. చక్కటి ప్రాంగణంలో ఉండేది. చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లుండేవి. టాంక్ నిండాక నీళ్లు పొర్లిపోతుండేవి, జలపాతమనే భ్రమ కల్పిస్తూ.
నాలుగు పొన్న చెట్లు, ఓ మూలన జూకా మందారాల పొదలుంటే దాన్ని పార్క్ అనేయడమేనా? ఏవిఁటో ఆ అమాయకత్వం.
ఆ రోజు పార్క్ వేపు వెళ్తుంటే చూశాము. మా వెనకింట్లోకి ఎవరో కొత్తగా అద్దెకు దిగుతున్నారు. ఊరి వాళ్లొచ్చి సామాన్లవీ దించుతూ సహాయం చేస్తున్నారు.
ఆయన పేరు సుదర్శనం. మా నాన్న పని చేసే హైస్కూల్లోనే ఆయన లైబ్రేరియన్ గా చేరాడు. యువకుడు. పెళ్లైంది. భార్య, ఇద్దరు చిన్న పిల్లలు.
పెద్ద అమ్మాయి పేరు అవంతి. చిన్న పాప పేరు చంద్రిక.
లైబ్రేరియన్ కదండీ. చందమామలు , బాలమిత్రలు చదివి పెట్టి వుంటాడని అనుకున్నాం.
అతని భార్య , పట్నంలో చదువుకున్న నాజూకు యువతి. మహా అయితే ఓ ఇరవైయేళ్లుంటాయేమో. సంసారం నడపడంలో బొత్తిగా జూనియర్ వలె అనిపించేది. అన్నిటికీ మా అమ్మ దగ్గర సలహాలు తీసుకుంటుండేది.
చిన్న పూల పూల వాయిలు చీరలు కట్టుకునేది. ఆమె చీరకట్టు కూడా చక్కగా ఉండేది. అందమైన చెప్పులు వాడేది.
పని మనిషి దొరుకుతుందేమోనని వాకబు చేసినందుకు ఊరంతా అల్లరైపోయిందామె.
కొత్తగా వచ్చిన లైబ్రీ ఆయన పెళ్లానికి అంట్లు తోమడానికి మనిషి కావాలన్నది ఊళ్లో వార్త అయింది. మట్టితో పరిచయం లేని అమ్మాయి. ఇంటి పనితోనూ, ఇద్దరు పిల్లలతో సతమతమైపోయేది.
సినిమా హాలు లేని ఊరిలో కాపురం ఆమెకేమీ నచ్చేది కాదు.
ఈ విషయమ్మీద ప్రతి రోజూ గొడవలవుతుండేవి.
ఆ లైబ్రేరియన్ మా నాన్నకు స్నేహితుడయ్యాడు.
‘ఇంటి పని చెయ్యలేక, పిల్లలిద్దరికీ అన్నం తినిపించడం చాతకాక భార్య ఏడుస్తోందనీ, ఉద్యోగం మానేసి వెళ్లిపోదామంటోందని’ మా నాన్నతో చెప్పుకున్నాడు. వేరే వారి కష్టాలు వింటే, వెన్న హృదయుడైన మా నాన్న, కరిగిపోయి నెయ్యమందించేవాడు.
“ఉదయాన్నే ఆ పిల్లలిద్దర్నీ మా ఇంటికి పంపండి. మా పిల్లలతో కూర్చోబెడితే వాళ్లే తింటారని” సలహా ఇచ్చాడు.
******
అతి చక్కటి పిల్లలు.
ఎంత బాగుండేవారో చెప్పలేం.
పెద్దమ్మాయికి నాలుగేళ్లుంటాయేమో. గంధపు బొమ్మలా ఉండేది. పొగ మంచు బరక రేపర్ విప్పిన మైసూర్ శాండిల్ వలె సొగసైన పిల్ల.
ఆ పిల్లకు బుల్లి స్టీలు పళ్లెంలో పెరుగన్నం పెట్టేది మా అమ్మ. ఆవిడ తీరంతే, పెరుగన్నం తరహా. తలవంచుకుని పళ్ళెంలోకి చూసిందంటే లోకంతో సంబంధం తెగినట్టే. ఒక ముద్దని రెండు గంటల పాటు చప్పరించడంలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పడానికి ప్రాక్టీసు చేస్తుండేది. పళ్లెం అంచున నిమ్మకాయను సైతం సహించలేనంత సుకుమారి.
రెండవ పిల్ల ఉట్టి పసిది. పసిడి ఛాయ పసిది. వంటి మీద చిన్న నగ ఏదో ఉండేది. ఉన్నట్టే తెలిసేది కాదు. నడవడం రాదు. వేగంగా పాక్కుంటూ పోగలదు.
రావడం రావడం నవ్వుతోనే వచ్చేది. నవ్వు, అల్లరి , కోపం అన్నీ రంగులు వెంట వెంటనే మార్చేది.
అన్నప్రాసన చేసి నాలుగైదు నెలలైందట. మెన్యూ ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. ఇష్టంగా ఏమి తింటుందో ఇంకా తెలియదు.
నాకు పెద్దమ్మాయి ముఖం , నెమ్మదితనం , చిన్ని మూతి నచ్చేవి. మిగిలిన అందరికీ ఆ చిన్ని పోకిరి బిడ్డ అంటేనే ఇష్టం.
******
పెద్ద పిల్లకు మాటలు వచ్చు కానీ, మాట్లాడదు. అంతర్ముఖి. ఆ వయసుకే రెండు గట్టి జడలుండేవి. సాయంత్రాలు మా అమ్మ, మల్లె పూలతో వంకీల జడ వేస్తుండేది. మల్లెలు దొరకని నాడు, చేమంతులతోనూ, ఇంటిముందు పూసే కారబ్బంతులతోనూ వేసేది. ఆ గుంభనపు పిల్ల చిట్టి చిట్టి పూలజడలతో ఇంట్లో తిరుగుతుంటే చిన్న రుక్మిణీ దేవి ఇంట్లో తిరుగుతున్నట్లుండేది.
చిన్న పిల్ల కింకా మాటల్రాలేదు. తెలుగు మాటలొచ్చే వరకూ ఎదురు చూడకుండా తనకు తానే స్వంత భాష సృష్టించుకుని అందులో ధారాళంగా మాట్లాడేది.
ఉదయం ఆ పిల్లలొచ్చే టైముకు మేమంతా వరసలో కూర్చుని చద్దన్నం తింటుండేవాళ్లం. స్కూలుకెళ్లే రోజుల్లో ఉత్సాహం కలిగించే పని అదే కదా.
మా అమ్మ అందరికీ కేరేజిలు కడుతూ హడావుడిగా ఉండేది. తియ్యని పాల సీసా చేతికిచ్చి , చిన్న పిల్లని మా దగ్గర కూర్చోబెట్టేది. కాసేపు పీక నములుతూ కాలక్షేపం చేసి మా పళ్లేలలో చేతులు పెడుతుండేది. ఎవడైన గోడవేపు తిరిగి పళ్లెం దాచుకోవాలని చూస్తే, అటువంటి నీచ వైఖరిని తప్పు బట్టి, అటువేపుకెళ్లి, వాడి మొహమ్మీద తపతపా కొట్టేది.
ఆమె వస్తుందంటే, బెదిరిన జింకలవలె చెల్లా చెదురయే వాళ్లం. చద్దన్నానికి నిర్దేశించిన స్థలంలో కాకుండా , ఇల్లంతా తలో మూల కూర్చుంటున్నామని మా అమ్మ తిడుతుండేది.
ఏదైనా వస్తువు విసిరేస్తే, గజ్జెల కాళ్లతో పాకుతూ వెళ్లి ఆ వస్తువుని దొరకబుచ్చుకుని ఒక అరుపు అరిచేది. అదొక విజయోత్సాహపు ధ్వని. నాలుగు చిలుకలు ఒకే మారు వేర్వేరు స్థాయిలో కూసిన కలగలపు కూత. కళ్ళు చికిలించి, మడికాళ్లమీద కూర్చుని ఎగురుతూ చేతిలో వస్తువుని ప్రదర్శించేది.
అపుడు మేమందరమూ సంభ్రమాశ్చర్యాలను ప్రకటించాలి. లేకపోతే ఆమెకు కోపం!
ఎక్కువగా మా ప్రసాదు దగ్గర, భుజమ్మీద చెయ్యి వేసి నిలబడి, ముఖంలోకి చూస్తూ చికిలిస్తూ నవ్వేది. స్వంత కాళ్లమీద నిలబడే తాహతు రాలేదు. వాడి చెవులంటే ఆ పిల్లకిష్టం, మెత్తగా ఉండి సాగుతుంటాయని, వాటితో ఆడుతుండేది. అప్పట్నుండీ మా నాన్న వాడి చెవులు కడగడంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే వాడు.
వాకిట్లో తిరుగుతున్న కాకులను చూపెట్టి, వాడితో ఏదో గంభీరంగా చెప్పింది. ఆమె భాష అర్థం కానంత ఉత్కృష్టం కాబట్టి , వాడు యాంత్రికంగా తలూపుతూ ,
“అయ్యి కాకులమ్మా. మీ సుట్టాలే. వాళ్లింటికెళ్తావా?” అని అడిగాడు.
వాడి మొహమ్మీద ఒక్కటి చరిచింది.
వెటకారాలు సహించదు.
దెబ్బ తిన్న తర్వాత మాట్టాడకుండా కూర్చున్నాడు. అలిగాడనుకుని నేల మీద పాకుతున్న చిన్ని ఎర్ర పురుగుని , రెండు వేళ్లతో పట్టి వాడి కాలి మీద పెట్టింది, బహుమతి లా. మీకిష్టమైన వారిని బాధపెట్టాక మీరు గిఫ్టులిచ్చి బతిమాలుకుంటారే, అలాగ.
*****
ఆనాడు ఆదివారం.
మేమంతా వంటింటి గుమ్మమెదురుగా కూర్చుని, పొయ్యి మీదున్న ఇడ్లీ పాత్రని పదే పదే చూస్తున్నాము. ఇడ్లీ పాత్ర, ఒక నటీమణి శరీరాకృతి వలె ఉండేది. పొయ్యి సెగల పొగలను గమనించుకుంటూ, యాగఫలం కోసం ఎదురు చూస్తూ, చిలుమూరు ఇడ్లీల మెరుపు విరుపులను గురించి మేము ప్రస్తావించుకుంటుండగా.
ఇంతలో ఈమె వచ్చింది, “ఒహోయ్” అనుకుంటూ!
మా అమ్మ చంకనుండి జారిపోయి మా దగ్గరకు పాకుతూ వచ్చింది. ఆమె రాకకు మిక్కిలి ఆనందించేది ఆమే. రిబ్బను ముక్క ఎరగని ఉంగరాల జుట్టు చెవుల వరకు పెరిగింది. లేత కనకాంబరాల పెదవులు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవి.
మా ప్రసాదు పక్కనే నిలబడి కళ్ళు చికిలించి ” ఏమిరోయ్” అన్నట్టు సావాసంగా నవ్వింది. ఇడ్లీ ధ్యాసలో ఉన్నాడేమో, వాడేమీ పెద్దగా స్పందించలేదు. మెత్తటి చెవి దొరకబుచ్చుకుని సాగదీస్తోంది. వాడి చర్మానికి, పీకుతున్న కొద్దీ సాగే గుణమున్నది. అది ఆమెకు సంభ్రమం కలగ జేసింది.
ఒక మనిషికెంత ఓర్పుంటుంది చెప్పండి. పీకుడు బాధనోర్చుకోలేక , ‘అబ్బ, పోవమ్మా, సంపుతున్నావన్నాడు.’
అంతటి అమర్యాదకు నిర్ఘాంతపోయింది. అవమానం తట్టుకునే అగత్యం ఆమెకేమిటి.
వంటింట్లోకెళ్లి బర బరా పాక్కుంటూ వెళ్లి మా అమ్మని కొంగు పట్టి లాక్కొచ్చి వీడి ముందు నిలబెట్టింది.
తన సొంత false speech తో, వాడి మీద వివరంగా ఫిర్యాదు చేసింది.
ఓ మారు వాడి చెవి పట్టి లాగి చూపెట్టింది. ఆ చిన్నదానికే వాడెంతలా తిట్టాడో అద్భుతంగా communicate చేసి చెప్పింది.
వాడి వీపు మీద, మా అమ్మ తన చెయ్యి పెట్టి, కొట్టినట్టు నటించి ఇక శాంతించమంది. ఆ ఉట్టుట్టి దెబ్బ తాలూకు బాధ గానీ, వాడి మొహంలో పశ్చాత్తాపం కానీ కనపళ్లేదోమో, కోపం తీరక వాడి వత్తైన జుట్టులో వేళ్లు జొనిపి, బిగించి పట్టుకుంది. వాడు నొప్పితో విలవిలాడుతూ విడవమని మొత్తుకున్నాడు. అభిమాన ధన అభిమన్యురాలికి పట్టడం తెలుసు కానీ విడవడం తెలియదు.
వాడికి ‘ఎవ్వనిచే జనించు’ రాదు,
‘కలడందురు దీనులయెడ’ పద్యమున్నదని కూడా తెలియదు.
“చిన్నమ్మా, చిన్నమ్మా” అని బొబ్బలు పెడుతున్నాడు. మేమంతా కూడా గుప్పిటి ఎలా వదలాలో demonstrate చేస్తున్నాము. అందరం గుమిగూడి అల్లరి చేస్తున్నకొద్దీ ఇంకొంచం గట్టిగా బిగించి పీకుతోంది.
అందర్లోకీ చురుకైన బుర్ర కలిగిన మా అమ్మ, చేతిలోనున్న గరిటెను మూలకు విసిరేసి తీసుకు రమ్మంది. వెంటనే ప్రసాదు జుట్టు విడిచి గరిటె పడ్డ మూలవైపు పాక్కుంటూ సాగిపోయింది.
****
ఆ పిల్లకో మంచి గుణముండేది. పాత తగాదాల్ని మనసులో పెట్టుకోదు. ప్రసాదు చెవులు మెత్తనన్న విషయం తప్ప. ఎవరి దగ్గర వదిలినా వాడి దగ్గరే చేరేది.
ఓ నాడు ఆవకాయ అన్నం రంగు చూసి, అది కావాలన్నది.
త్రికోణాకారపు ఆవకాయ ముక్క మంచినీళ్ళతో కడిగి కడిగి ఇచ్చాడు. కాసేపు చప్పరించి, మళ్లీ వాడి కివ్వబోతే నాకొద్దన్నాడు.
దాన్ని కింద పడేసి , వాడి పళ్లెంలో ఎర్రటి అన్నాన్ని వేలితో చూపెట్టి , అది కావాలంది.
“అబ్బా,…ఉఫ్, ఉష్” అంటూ చెయ్యి ఊదుకుని కారాన్ని నటించి చూపాడు.
పట్టలేని కోపమొచ్చినట్టు లేచి నిలబడి, వాడి భుజాన్నానుకుని “పెట్టవేమిరా” అని సొంత భాషలో అరిచింది.
ఉట్టి అన్నం నాలుగు మెతుకులు ఇవ్వ జూపాడు.
గిట్టుబాటు కాకపోతే కొట్టేది.
ప్రతిరోజూ వాడికీ, ఆమెకూ మధ్య ఆవకాయ యుద్ధం జరుగుతుండేది. ఆమె కావాలనడం, వాడు వద్దనడం. ప్రతి రోజూ ఆమె చేతుల్లో దెబ్బలు తినడం.
ఆమె కొట్టేప్పుడు , తలవంచుకుని రెండు చేతులతో కాచుకుంటూ “అబ్బ, సెయ్యి సురుకురోయ్, బలే కొడతంది” అనేవాడు. మాకెవ్వరికీ దొరకని అపురూపమైనది తనకే దక్కినట్టు.
పనయ్యాక మా అమ్మ ఎత్తుకుని వెళ్తుంటే వాడి వంక గుర్రు మని చూస్తూ వెళ్లేది.
మా అమ్మ చంకనెత్తుకుని, వేడి అన్నంలో పెసరపప్పు, చింతకాయ పచ్చడి కు నెయ్యిపోసి పెడితే ముద్ద ముద్దకీ పైకీ కిందకీ ఎగురుతుండేది. ఆ కాంబినేషన్ తనకెంతో నచ్చిందని చెప్పడమన్నమాట.
అప్పుడప్పుడు కూరల వంక ఆశగా చూస్తుండేది. కూరన్నం కావాలని పేచీ పెడుతుండేది. అప్పట్నుండీ మా కూరలు చప్పగా , ముద్దగా అయిపోయాయి. ముక్కలు కనిపించేవి కాదు. సొరకాయ లేహ్యం, వంకాయ లేహ్యం.
మేమంతా ఆవకాయని ఆశ్రయించాము.
అమ్మ దయలేనపుడు ఆవకాయే గతి.
మిగిలిపోతున్న కూరలు పారేస్తూ, వళ్లూ పై ఎరక్కుండా తయారవుతున్నామని, మంచి నూనె, ఉప్పు పప్పుల ధరవరలు వల్లిస్తూ మమ్మల్ని తిట్టేది.
ఆ పిల్లక్కూడా చప్పటి కూరలంటే విసుగొచ్చినట్టుంది. ఓనాడు ప్రసాదు దగ్గర చేరి ఆవకాయ కోసం మళ్లీ అడిగింది. వద్దన్నాడు.
ఒకసారి చెప్తే వినదు కదా చండి.
“పెట్టూ , పెడతావా, పెట్టవా?” అన్నట్టు కళ్ళురిమింది. చెంప మీద కొడుతోంది.
“చిన్నమ్మా చూడు.” నన్ను తంతోందన్నాడు.
“దానిక్కోపం తెప్పించకండి.” అని గట్టిగా చెప్పింది అమ్మ.
అంటే తన్నులు తినమనా?
కూరముక్క ఒకటి చేతిలో పెట్టాడు. వద్దని కింద పడేసింది.
“పెట్టూ , పెట్టూ” అని సాధిస్తోంది.
కౌరవులంతా కలిసి ఒక మాటనుకున్నారు. “ఒకసారి పెడదామురా, ఇక మళ్లీ అడగదు” అని .
పట్టెడన్నంలో నలకంత ఆవకాయ వేసి కలిపారు . అందులోంచి ఓ బుల్లి ముద్ద మెత్తగా చేసి, వెన్నపూసలో దొర్లించి ఆమె అరచేతిలో పెట్టాడు. ఒక క్షణం చప్పరించి గుటుక్కుమనిపించింది. ఎంత వెన్నపూసతో మాయపుచ్చినా, పసి దానికి ఘాటు తెలిసింది. నిర్ఘాంత పోయినట్టు సైలెంటయింది. కనుకొలుకులలో ఓ చుక్క నిలబడింది. అందరం కంగారు పడి వంటింట్లో ఉన్న మా అమ్మ వైపు చూశాము. పొయ్యి మండడానికి చిత్తు కాయితాలు మంటలో పెట్టి గొట్టాం తో వూదుతోంది. విషయం తెలిస్తే, కాగితాల బదులు మమ్మల్నే వాడుతుంది.
గ్లాసుతో మంచినీళ్లిస్తే మొత్తం తాగేసి, సైలెంట్ గా కూర్చుంది. మా అమ్మ పని కానిచ్చి ఎత్తుకునేవరకూ అందరి వంకా చూస్తూ కూర్చుంది.
మాలో ఎవరో చెబుతారన్న భయం కాదు. ఆ పిల్ల మీదే భయం. తలచుకుందంటే తన భాషలో చెప్పలేని కావ్యముండదు. మా అమ్మతో ఏదైనా చెప్పగలదు.
ఆ పిల్ల అనర్గళంగా మాట్టాడే అబ్సర్డ్ లాంగ్వేజ్ కు , మా అమ్మ కాసింత పాదరసం జోడిస్తే చాలు.
సీనంతా అర్థమైపోతుంది. మా వీపు చిట్లుతుంది.
వెళ్లేప్పుడు మా అమ్మ భుజమ్మీదనుండి వాడి వంక చూస్తూ చూస్తూ వెళ్లింది.
వాడు బిక్క చచ్చి పోయి మా అందరి వంకా చూశాడు.
మేము చూపులతోనే చేతులు దులిపేసుకున్నాం.
మాకేం సంబంధం?
వాడే కదా పెట్టింది.
వాడి గుండె పీచు పీచుమనడం మా అందరికీ, స్పష్టంగా వినిపించింది.
*****
మర్నాడుదయం మామూలుగానే తెల్లారింది.
రావడం రావడం ప్రసాదు దగ్గర జారిపోయింది. వెటకారాలు పోకుండా మర్యాదగా ఆహ్వానించాడు. చెవులు , జుట్టు పీకుతుంటే, మూతి కోణాలను రెండు వేపులా సాగదీస్తూ ‘దొరకునా ఇటువంటి సేవ’ అని పాడుతున్నాడు, మౌనంగా.
నిన్నటి ఆవకాయాన్నదానం బయట పడితే పర్యవసానాలెలా వుంటాయోనని నంగిగా నవ్వుతున్నాడు.
ఇదివరకులా వాడి భుజం పట్టుకుని నిలబడకుండా పక్కనే కూర్చుంది. ఎప్పటిలానే ఆవకాయ చూపెట్టి పెట్టమంది.
“నేను పెట్టను. పెట్టనంటే పెట్టను” అని వాడు loud గా over react అయ్యాడు.
నిన్న వాడు పడ్డ టెన్షన్ కు నరాలు తెగినంత పనయ్యింది.
వాడి నరాలకు సాగుడు గుణముండబట్టి సరిపోయింది.
ఆ తిరస్కారాన్ని తట్టుకోలేక పోయింది. ఏనాడూ లేనిది ఏడుపు మొదలెట్టింది. అది కూడా ఆకతాయి ఏడుపు కాదు. వెక్కి వెక్కి ఏడుస్తోంది. మా అమ్మ పొయ్యిమీద గిన్నె దించేసి, మంటమీద నీళ్లు చల్లి పరుగున వచ్చి ఎత్తుకుంది.
“ఏమైందిరా, ఏం చేశారు. ఎందుకేడుస్తోంది.”
“చిన్నమ్మా, ఆవకాయ కావాలని పేచీ. పెట్టనంటే, నన్ను తన్ని తనే ఏడుస్తోందని” చెప్పాడు ప్రసాదు. “చూడు ఎట్టా కొట్టిందో” అని ఏవో ఆనవాళ్లు చూపెట్టాడు.
మా అమ్మ ఎంత సముదాయించబోయినా ఏడుపు ఆపలేదు.
‘అదుగో కాకి, ఇదిగో పిల్లి’ అని ఏమార్చబోతుంటే ఏడుపు ఎక్కువ చేసింది. అన్నలందరూ వంతులు వేసుకుని ఎత్తుకున్నారు. గిలక్కాయ ఇవ్వబోతే, విసిరి కొట్టింది. పాల సీసా ఎత్తి పడేయబోయింది.
‘ఏం కావాలి, ఏం కావాలని’ బుజ్జగిస్తే ఆవకాయ చూపెట్టింది. వద్దంటే కళ్లెంట ధారలు కారుస్తోంది.
వేడి అన్నంలో నెయ్యి ధారాళంగా పోసి మెత్తటి పెసర పప్పుకు, రవ్వంత ఆవకాయ కలిపి పెడితే ఎగురుతూ మెచ్చుకుంటూ తిన్నది.
ఆ తర్వాత నుండి ఎందులోనైనా ఆవకాయ వెయ్యాలి. ఆవకాయ రుచి తగలకపోతే తినడం మానేసింది.
ఇక ఆ హోమంలో గుమ్మరించడానికి ఎంత నెయ్యీ సరిపోయేది కాదు.
వెన్న పూస పొయ్యి మీద కాస్తుంటే ‘ఎంత సేపు? ఆలస్యమవుతోందని’ అస్సూ అస్సూ అంటుండేది.
*******
పిల్లల్ని మేమెంత చూసుకున్నా, పిల్ల వాళ్ల అమ్మకు ఆ పల్లెటూరి జీవితం విసుగ్గా ఉండేది. చుట్టాలు లేరు, స్నేహితులు లేరు. సినిమాలు లేవు. ట్రాన్స్ఫర్ చేయించుకోమని భర్తని అడుగుతూనే ఉండేది. నాన్న కూడా అదే సలహా ఇచ్చాడు. భార్య సంతోషంగా లేకపోతే మనుగడ కష్టమని నచ్చజెప్పి, ట్రాన్స్ఫర్ కి ప్రయత్నించమన్నాడు.
ఎవరో ఒకాయన ఈ ఊరికి వచ్చే కండిషన్ మీద మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి ఒప్పుకున్నారట.
మొత్తానికి ఆమె కోరిక తీరింది. ఓ శనివారం సాయంత్రం తెలిసింది. వాళ్లు పామర్రు వెళ్లిపోతారని. ఆ వార్త అమ్మతో చెప్పేందుకు వచ్చింది. రాగానే పసిడిని, అమ్మ తన చేతుల్లోకి తీసుకుంది.
ఇన్నాళ్లూ పల్లెటూరిలో తను ఎంత యాతన పడిందో ఈ బదిలీ అయినందుకు తను ఎంత సంతోషంగా ఉందో , అమ్మతో చెప్తోంది.
అక్కడ పని మనుషులు దొరుకుతారని, ఇల్లు కూడా కమలాహాలుకి దగ్గరే అని చెప్తోంది.
ఆమె ఉత్సాహానికి, అమ్మ ఉదాసీనతకు జత కుదరడంలేదు.
మర్నాడే ప్రయాణమట.
హడావుడిగా వెళ్లిపోతున్నారని, కనీసం మిఠాయి అయినా చేసి పెట్టే వీలు లేకపోయిందని ఎంతో ఇదైపోయింది.
ఆమెకేదో ఇవ్వాలని హడావుడి పడింది.
అక్కాయి వాళ్లెళ్లిపోతారన్న వార్త మాకెవ్వరికీ నచ్చలేదు. ఆమెకివ్వడానికని మా అమ్మ ఇంట్లో చూస్తుంటే, అన్నలంతా తోటలోకి చూశారు. సొరకాయలు కోశారు. చిక్కుళ్లు దులిపారు. గోరింటాకు దూశారు. దోసకాయలు, తోటకూర చేతికందినవన్నీ పెరుక్కొచ్చారు.
మా పెద్దన్న సీతాఫలం చెట్టు దగ్గరకెళ్తుంటే నేనూ అనుసరించాను.
పెద్దగా ఉన్న సీతాఫలమొకటి మా వంకే చూస్తోంది. పట్టుకోగానే చేతిలోకొచ్చింది. మిగలపండింది గావాఁల!
****
మర్నాడు ఆదివారం.
పసిడి వాళ్ళింటికి మనుషులొచ్చారు. సామానంతా సర్ది ట్రక్కులోకెక్కిస్తున్నారు. మా నాన్న కూడా అక్కడే ఉన్నాడు.
ఆనాడు గోడ మీంచి కాకుండా ముందు గుమ్మం నుండి పిల్లలిద్దర్నీ తీసుకొచ్చింది వాళ్లమ్మ. ఇద్దరూ ప్రయాణపు ముస్తాబులో ఉన్నారు.
ఒకే రకం కుచ్చుల గౌన్లు వేసుకున్నారు.
ఆనాడు పసిడి, కొత్త షోకులతో వచ్చింది. నిద్ర కళ్ళు, చిందర వందర ఉంగరాల జుట్టు, బంగారపు ఛాయ ముఖము , లేత కనకాంబరాల పెదవులు! ఇవే మేమెరిగిన అలంకారాలు.
గులాబి పౌడరద్దుకుంది. జుట్టుకి రిబ్బను కుచ్చు మొలిచింది. పక్కనే లేత గులాబి.
కాటుక చేపలకు తోకలొచ్చాయి.
కణత మీద చుక్క పెట్టుకుంది.
కాళ్లకు చిన్ని చిన్ని బూట్స్ వేసుకుంది.
ఎప్పటిలా నవ్వడం లేదు. ఆనాటి ఆమె ఉద్వేగం, కళ్లక్కట్టినట్టే ఉంది. చేతులతో తమ ఇంటివైపు చూపిస్తోంది. అందరితోనూ ఏదో చెప్పాలని కంగారు పడుతోంది.
జరుగుతున్నవన్నీ అర్థమైనట్టే హడావుడి పడుతోంది.
మా అమ్మతో ఏవేవో చెప్తోంది. ఆ భాషలో ఒక్క పదమైనా మాకు పరిచయముంటేనా? అయినా అందరికీ అరటి పళ్లు వలిచి పెడుతోంది.
ఆ ఆత్రుత, పదాల జడివాన , ఆ గంభీరపు వాదనా, కళ్లలో ఆశ్చర్యం పలికించే తీరు, అన్నీ కలిపితే
“మేమెళ్లిపోతుంటే మీరంతా పట్టించుకోరేమి? చీమ కుట్టినట్టైనా లేదే?” అని మా అందర్నీ నిలదీస్తోంది.
అన్నలందరూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటున్నారు. ప్రసాదు ఆమె ముందు నిలబడ్డాడు. కడసారి చెవులు పీకమన్నట్టు. వాడి అభ్యర్థనను కొట్టిపారేసింది.
వెళ్లిపోతున్నారన్న విషయం చిన్ని బుర్రకెలా అర్థమైందని మా అమ్మ ఎంతో ఆశ్చర్యపడింది.
“ఈ గయ్యాళి దాన్ని పెంచడం నా వల్ల కాదు.” అంది వాళ్లమ్మ.
“పోనీ ఉంచేయి. మాష్టారు చదువు చెప్తారు.” ఎత్తుకునే ఉంది మా అమ్మ.
వాళ్ల కోసం ఓ జీప్ వచ్చింది.
వాళ్లమ్మ జీప్లో సర్దుకుని కూర్చుంటే, పెద్దమ్మాయిని ఎక్కించాము.
అప్పటి వరకూ కొంపలన్నీ ముంచుకుపోతున్నాయని పసిడి పడ్డ కంగారంతా ఒక్క క్షణంలో మాయమైంది. ‘ఈ జీపేంటి, వింతగా ఉందే’ అని మా అమ్మ చేతుల్లోంచి లోపలికి దూకేసింది.
ఒక్క క్షణంలో అపరిచితులమైపోయాము. రెండో క్షణంలో
అధముల్లాగా కనిపించాము.
మా అమ్మ జీపు వద్దకొచ్చి, చేయి చాచింది. చిట్టి చేతి వీడ్కోలు కోసమని.
అమ్మని పట్టించుకోకుండా , సీటుపై నిలబడి, కడ్డీ పట్టుకుని నెడుతూ డుర్రు డుర్రుమని ఇంజను శబ్దాన్ని అనుకరిస్తోంది.
ఆమె తోస్తేనే కదా జీపు కదిలేదీ!
కదిలింది.
జీప్ వెళ్లిపోయింది.
******
చద్దన్నాలు ప్రశాంతంగా తింటున్నాం. ఎవరో వచ్చి పళ్లెం లాగేస్తారన్న భయం లేదు. ‘నాకూ పెట్టు’ అని కన్నెర్ర జేసే రౌడీయిజం నుండి విముక్తి పొందాం. సన్యాసం పుచ్చుకున్నంత నెమ్మదిగా ఉంది జీవితం. చంకలో బరువు లేక మా అమ్మ ఇబ్బంది పడుతోంది. అది అల్లరి చేస్తుంటే తప్ప మతి సరిగా పనిచెయ్యదేమో. అన్నీ అవకతవకలే. మొన్న పొంగుతున్న పాలలో చింత పండు పులుసు పోసింది.
ప్రసాదు “ఇట్టా లాగేదిరా , ఇట్టా” అంటూ వాడి చెవులు వాడే లాక్కుని చూపిస్తున్నాడు.
“ఎట్టా పీకేదిరా జుట్టూ , సుక్కలు కనిపించేయి.
మొహమ్మీద కొట్టిందంటే నా సావిరంగా , చర్రన మంటలేసేది.” అనుకునేవాడు.
ఆమె వెళ్లిపోయాక కూడా, ఆమె ముక్కు ఎలా చిట్లిస్తుందో, మూతి ఎలా విరుస్తుందో, కోపమెలా ప్రకటిస్తుందో, ఆ హావ భావ విన్యాసాలకు మెరుగులు దిద్ది మేమంతా ప్రాక్టీసు చేస్తున్నాము. మాకదే నచ్చిన కాలక్షేపం.
*******
ప్రతినెలా సరుకులు తెచ్చుకోడానికి పామర్రు వెళ్తుండేవాళ్లం. ఆ రోజు నాన్న, అమ్మా, నేను, వెళ్లాము. పనయ్యాక, పసిడి వాళ్లింటికెళ్లాము. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. గూగుల్ మేపులు లేవు. అయినా వాళ్లిల్లు చులాగ్గా కనుక్కొన్నాం. అదొక వెడల్పు లేని సిమెంట్ రోడ్. రంగురంగుల పెంకుటిళ్లు. ప్రతి ఇంటి మీదా ఏవేవో పూల తీగెలు వాళ్ళింటికెళ్లేసరికి మధ్యాహ్నం ఎండ తగ్గుతూ ఉంది. ఇంటి గేటు మీద రాధామనోహరాలు గుత్తులు గుత్తులుగా వేళాడుతున్నాయి. ఇంటి ముందు గుమ్మానికెదురుగా నాలుగైదు మెట్లున్నాయి.
అటుపక్కా, ఇటుపక్కా అరుగులు. అరుగులకు కూడా లక్క రంగులు వేశారు. ఎక్కువగా బులుగు, పచ్చ రంగులు.
సుదర్శనం , ఆయన భార్య ఇద్దరూ బయటే ఉన్నారు.
సుదర్శనం లోపలికెళ్దామని ఎంత పిలిచినా ‘ఇప్పటికే లేటయింది. పిల్లలెదురు చూస్తుంటారని’ మా అమ్మ ఒప్పుకోలేదు. పసిడిని చూసి వెళ్లిపోతామంది.
పెద్దమ్మాయిని ఊళ్లోనే ఉన్న అమ్మమ్మగారు పెంచుతున్నారట. చిన్న పిల్లని పిలిచింది. అప్పటికి నడక వచ్చేసింది. గజ్జెలు పెట్టుకున్న కాళ్ళతో గుమ్మం దాటుకుని అరుగు మీదకొచ్చింది. వెంటనే మా ఎదురుబడడానికి సిగ్గేసి , అరుగు మూలన ఉన్న స్థంభం పట్టుకుని అల్లీ బిల్లీ తిరుగుతుంటే చటుక్కున అందుకుంది మా అమ్మ.
“అబ్బో నడవడం వచ్చేసిందే” అమ్మ అబ్బురంగా.
“అక్కణ్ణుంచి వచ్చేసిన మూడో నాటినుండే నిలబడింది. ఇక ఇల్లంతా పరుగులే. అన్నీ పడేస్తోంది.”
ఊళ్లో ఉండగా మా అమ్మా నాన్నలు చేసిన సాయం గురించి పదే పదే అనుకున్నారు భార్యాభర్తలు.
“ అయ్యో, అదో సహాయమా? పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే ఎంత కళకళలాడేది. ఇప్పుడు ఇల్లంతా బోసి పోతున్నది. ఎంత గుర్తొస్తున్నారో.” గొంతులో తేడా రాబోతుంటే తమాయించుకుంది అమ్మ.
పసిడితో మాట్టాడుతోంది.
ఏమేమో ప్రశ్నలు వేస్తోంది.
“అన్నం తింటున్నావా?”
“ఆయి వేసుకుంటున్నావా?”
చంద్రిక ఏమీ జవాబు చెప్పకుండా మా అమ్మ మెడలో గొలుసులతో ఆడుకుంటోంది. ఆమె పేరు అదే కదా. చంద్రిక!
వదిలేసి వెళ్లావనీ, మర్చిపోయావనీ, అమ్మ చేసే ఫిర్యాదులన్నిటినీ పిల్లతనంగా తీసేసినట్టు, గంభీరంగా ఉంది.
“చిక్కిపోయిందేమి?” అడిగింది అమ్మ.
“లేదులే, పొడుగయ్యింది.” అన్నాడు మా నాన్న, వాళ్లమ్మ నొచ్చుకోకుండా.
“అమ్మాయి, అన్నం పలుకుగా ఉంటే తినదు. బియ్యం ఓ గంట ముందు నాన బెట్టి , ఎసరెక్కువ పెట్టు. లేత బెండకాయలతో చిక్కటి పులుసు చేసి, వేడి అన్నంలో బాగా నెయ్యి పోసి పెడితే బాగా ఇష్టం.”
చంకలో ఉన్న పిల్లని చూస్తూ వాళ్లమ్మకి సూచనలు చెప్తోంది.
“అవన్నీ అమ్మ చూసుకుంటోందండీ” చెప్పింది ఆమె.
“నెయ్యి గుమ్మరించాలి అమ్మగారికి. అప్పటికప్పుడు కాచిన నెయ్యి. అన్నం చల్లారితే తినదు. వేడిగానే పెట్టాలి. మా కోతి మూక ఆవకాయ అలవాటు చేశారుగా. అది లేకపోతే తినదు. దేనికైనా సరే ఒక్క పిసరు అంటించు.”
“చిన్నదానికి ఆవకాయేంటని అమ్మ అరిస్తే , ఆపేశామండి. ఇప్పుడు ఆవకాయ అడగడం మానేసింది.”
“అమ్మగారు ఊళ్లోనే ఉన్నారంటే ఇక కావల్సిందేముంది. నువ్వొక్కదానివే పిల్లలతో యాతన పడుతున్నావని మీ పిన్ని రోజూ అనుకుంటోందమ్మా.” సంభాషణని చదును చేస్తున్నాడు మా నాన్న.
“అంత అల్లరీ ఏమైపోయింది? బాలా త్రిపుర సుందరిలా ఎంత నెమ్మదిగా ఉందీ. బాగా చదువుకుని పైకి రావాలి.” మనసులో ఆలోచనలే పైకి అన్నాడు నాన్న, దీవిస్తున్నట్టు.
“చూశావుగా , దిగులు తీరిందా, పోదామా?” అన్నాడు అమ్మతో.
పిల్లని ఎత్తుకుని, “మన వూరెళ్దామా, అన్నయ్యలుంటారూ , ఆడిస్తారూ . పద” అంటూ వాళ్లింటి ముందు రోడ్డు మీద అమ్మ రెండడుగులు వేయగానే, “ఊ ఊ. అమ్మ” అంటూ వెనక్కి తిరిగి వాళ్లమ్మ చేతుల్లోకి వెళ్లింది.
సుదర్శనం “ఆమ్మకి, మాస్టరు గారికి ‘టా టా’ చెప్పూ, రోజూ తాతా అమ్మమ్మలకు చెప్తావుగా. అట్లా చెప్పమ్మా, చెప్పూ “ అని ఎంతో బతిమాలితే
సిగ్గుతో తలొంచుకుని చేయి చాచి ‘తా, తా’ అన్నది
*****
మేము ఇంటికి చేరుకునే సరికి మసగ్గా చీకటి పడుతోంది. ప్రతి రోజూ నాపరాళ్ల మీద కూర్చుని అందరం కలిసి వేడి పులుసన్నం తినే టైమది.
“పొయ్యెప్పుడు ముట్టించేది? ఇంత ఆలస్యమైపోయిందని” అమ్మ హడావుడి పడుతోంది.
తోటంతా గోల గోలగా ఉంది. పిల్లలు ఏడుపెంకులాట ఆడుతున్నారు. మా అన్నలే కాక వేరే ఎవరో కూడా ఉన్నారా గుంపులో.
మమ్మల్ని చూడగానే ఆట ఆపేసి వచ్చాడు ప్రసాదు.
“చిన్నమ్మా, ఎట్టా వుందీ?” అడిగాడు.
“ఇంకా స్నానాలు చెయ్యలేదా, ఇట్టా తగలడ్డావే, మట్టి తలా నువ్వూ ?” విసుక్కుంది.
“అది కాదే, పిల్లెట్టా ఉందంటే?”
“ఎట్టా ఉండడమేంటి? పిల్లలానే ఉంది.”
“అదేలే ఏమన్నదీ? ఏం చేసింది? గుర్తు పట్టిందా? గొడవ చేసిందా?”
అందరూ చుట్టూ నిలబడి చూస్తున్నారు అమ్మ జవాబు కోసం.
“ఊఁ.. పెద్దదైంది.” అంటూ లోపలికెళ్లింది.
“పదండి, పదండి, బావి దగ్గర స్నానాలు చేద్దురు గానీ.” అంటూ నాన్న వాళ్లందర్నీ అదిలించాడు.
*******
నే కనిపిస్తే చాలు , ఆనందంతో ఎగసి పడింది.
మీద మీద పడి ప్రేమతో తడిపేసింది.
ఆటలాడింది. వెంట పడింది.
పరుగులు తీయించింది.
నేనంటే ఏమిటో దానికంత ఇది.
ఈనాడు మౌనంగా ఉందేమి?
ఆ కళలన్నీ నాకోసం కాదా?
సముద్రం తీరే అంతని నాకేం తెలుసు.
*
జాషువా గారి “శిశువు” అన్నప్రాశన తర్వాత కథ చదువుతున్నట్లు ఉంది. చాలా బాగుంది శైలజ గారు.
పద్మ గారూ, Thank you.
ప్రతి విషయాన్నీ ఒక కావ్యంలా ఇంత అందంగా ఎలా రాస్తారు? ఒక పసిదాని అల్లరీ, ఆటపాటలు ఇంత చక్కగా వర్ణించినట్లు తెలియకుండానే కళ్లకు కట్టారే, అదీ ప్రతిభంటే. మేమూ పామర్రులో ఆ తోట ఇంట్లో పసిడి ముచ్చట్లన్నీ చూసి మురిసాం. చాలా బావుందండీ.
రత్నశ్రీ గారూ, Thank you.
the owners used to live in hyd not mumbai
it started with the mother and librarian ‘s wife taking across the compound wall. on the second or third day…i told the mother…mummy take the baby…we will play..the librarians wife infact was waiting for such request….once the baby crossef the compound wall…it is everything for everybody..
the teachers family got used to the little ones…so every day she started crossing
after few days many times a day and aftet few weeks she was on the other house most of the time
the actual problem was…as the bathroom is outside the house…taking care of the tiny tots while having a bath was extremly difficult and may be dangerous for them…so the babies started crossing the wall!
..nobody bothered much about the elder one…
the younger made the little golden bangle and ittle golden ring so pale…
the little girl used to cross across the word .
.smiling and slipping away..
chasing and catching her was everybody’s past time
.
…it is real tragedy…a little baby…who became almost member of the family
..ate and slept…disowns all in few weeks time…bit of more heavy words may add to the ending to make it more effective and the reader drops a tear or two…this story really deserves
.great story
…at times…the phrases used at few places can be improved by being little crispy…
ravi
Ravi,
Thanks for correcting me.
Readers, Ravi is my brother, Professor in Engineering.
A poet also.
Always used to guide me in education & literature.
నవ్వించి నవ్వించి
ఏడిపించింది ఈ కథ….
ఎంత చొచ్చుకుపోయిందో మనసులోకి…..
సుధామురళి గారూ, Thank you.
ఎంత దగ్గరగా ఉందో మీ తోట, అంతే స్వచ్చంగా అనుబంధాలూనూ! చాలా మంది అమ్మలు చాలా మంది పిల్లలు గుర్తొచ్చారు., ఆ ముగింపు నొప్పి బాగా అనుభవమండీ నాక్కూడా! ఎప్పుడూ మీ కథలు చదివి పడి పడి నవ్వే దాన్ని, ఇవాళ తీపి కంటతడి పెట్టించారు. Thank you for this story Mam.
రేఖ గారూ,
Thank you.
ముందుగా కృతజ్ఞతలు… గొప్ప కధ..మా అమ్మ ఇలానే చుట్టుపక్కల టీచర్ల పిల్లలను మా ఇంట్లో సాయంత్రం దాకా ఉంచి చూసుకునేది…ఇలానే వాళ్ళ అల్లరి..ఆవకాయ కోసం వడియాలు కోసం ఏడుపులు… అమ్మ పోయినప్పుడు వాళ్లంతా వచ్చి సొంత అమ్మమ్మ కు చేసినట్టే చేశారు..మా బాల్యం కళ్ళకు కట్టినట్టు రాశారు..మా అక్కలలకు అన్నలకు ఈ కధ పంపుతున్నాను…ఈ మధ్య చదివిన అద్భుతమైన కధ..మీకు మరోసారి కృతజ్ఞతలు.
శ్రీరాం గారూ,
Thank you sir.
A smooth and subtle nostaligia writeup.Yes mam .no suspence , no specially driven content.But a everybody’s experience .But a small baby is a mirror to look into ourselves.I got the pain of your mother.As simple as a natural memory.
Thank you sir.
చంటిపాప వన్నెచిన్నెలు అంత అందంగానూ చెప్పారండీ..
“సముద్రం తీరే అంతని నాకేం తెలుసు?”
మనసు ఒక్క సారిగా చివుక్కుమంది. తప్పదనీ తెలుసు, తప్పు కాదనీ తెలుసు. కానీ మనసు నొచ్చుకొకుండా ఆగలేదు.
మనసు తీరే అంతని మీకెలా తెలుసు?
Dr. ముఖర్జీ గారూ,
ధన్య వాదాలు.
Wonderful narration.👌👌👌
ఝాన్సీ గారూ.
Thank you
Chaalaa chaalaa baavundi… kadhaaa… Kaadu… Jeevitham kallaku kattinattu…. Adbhutham 👌💓💓
అనురాధ గారూ.
Thanks
Kalla munde jarugutunnattundi ..kudos 💐
చాలా చాలా బాగుంది శైలజ గారు
చాలా చాలా బాగుందండీ మీకథ! డిటైల్స్ హృద్యంగా చెప్పారు .
అబ్బా!
అనుబంధాలు అల్లుకున్నంత తేలిక కాదు కదా విడిపోవడం.
ఆ పాపాయిని తెలియకుండానే మెదళ్ళలోకి చొప్పించేశారు. మరుపు పిల్లల్లో సహజమేనని తెలిసినా అమృతమంటి అమ్మతనం తట్టుకోలేదు.
ప్రేమ,ఆప్యాయతల నెగడు కథంతా చుట్టుముట్టింది
సంఘటనలు జరిగినంత సున్నితంగా సాగింది కథ.
Very nice mam
excellent narration. Heart touching story. Hearty congratulations Madam.
మాటలు రావడం లేదండి.అంతా కళ్ళముందు జరుగుతున్న దృశ్యమాలిక లా ఉంది.🙏🙏🙏
Paapalo yennenno pratibimbaalu kanipinchaayi..andulo okati naadi
When I was three, we were tenents at a distant relative’s house at Eluru. I used to call her nayanamma. She used to love me and pamper me. Even after 64 years I remembet her very fondly…
( ancheta mee tragic mugimpu nenu angeekarinchanu)
ఎంత బాగుందీ కథ. ముగింపు ఊహించలేదు ఇట్ల ఉంటుందని. అమ్మెంత బాధపడిందో.
ఇంత అద్భుతంగా చక్కగా వ్యక్తం చేయడం మీకే సొంతం !!
You brought many memories to life including the purity in them !! Amazing !!