పవిత్ర+ కవిత= కవిత్ర (According to me)

ప్రతి మునిమాపువేళలాగానే
ఇప్పుడు కూడా నా ఫోన్ రింగైంది:
నీ వరకే ప్రత్యేకంగా పెట్టుకున్న రింగ్టోన్-
“బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే”;
చెవుల గుండా కాస్త మృదువుగా గుండెల్లోకి చొచ్చుకుపోతుంది.
పగలంతా చీకటిని పోగుచేసుకున్నవాడిలాగా మెసిలిన నేను
నీ ఫోన్ కాల్తో, మునిమాపు గుబాళింపు కలిసిన గాలిని పీలుస్తాను
చలనం కోల్పోతున్నట్టుగా ఒళ్ళంతా చచ్చుబడిపోతుంది
అయినా నీ ఊసులు వినాలని
రోజూ నేను మోసే నిరాశతో
పచ్చని ఐకాన్ మీదకి బొటనివేలుని పోనిస్తాను
ఇరువైపులా హలో పిలుపు వినిపిస్తుంది
ఆ పూట నీ గొంతులోంచి వినబడిన స్వరమే  నన్ను విషాదంలోంచి కాస్త ప్రేమలోకి తీసుకొచ్చి,
అన్నీ అర్థమవుతున్నాయనే అనిపించి మరెందుకో అనాలోచితంగా మార్చేస్తుంది
ఎలా ఉన్నావ్ లిఖిత్? అని నువ్వు అడుగుతావు కదా
ఎందుకో బాగాలేనని చెప్పకూడదని
రెండోమాటగా అబద్దంతోటే
బావున్నానని కొనసాగిస్తాను మన మాటలని
ఏం చేస్తున్నావ్? అంటావు
ఏ సమయం దాకో నీ గురించి ఆలోచించి, తిరిగి ఏ ఆయాచితలోకంలోకో వెళ్ళానని చెప్పలేక
“ఖాళీ” అంటాను
ఏం తిన్నావ్? అనే ఇంకో ప్రశ్న
ఏది తిన్నానో గుర్తుకురాక
బతకడానికి ఏదో తింటున్నాన్న వాస్తవం చెప్పలేక
ఎప్పుడూ చెప్పే చపాతీ-కుర్మా-రైస్-రసం అంటాను
నీదీ వాటిల్లో ఒకటని నువ్వే చెప్తావు
ఒక్కడివే ఉన్నావా? అంటావు
ఔనంటాను!
ఇంకా… అని నన్ను మాట్లాడమంటావు, మాట్లాడ్డానికి నీ దగ్గరేం లేదన్నట్టు
నా జీవితంలో బయటికి కానీ, నీకు కానీ, కేవలం నీకే చెప్పుకోలేని ఒక్కగానొక్క విషయాన్ని
గుండెకింద అదిమిపెట్టి ఉంచుతాను.
తలలో శూన్యం తిరుగాడుతుంటుంది
కళ్ళల్లో ఇంతసేపు ఆగిన కన్నీళ్లు తన్నుకురావాలని పరితపిస్తుంటాయి
ఎలాగో నాకే తెలియనితనంతో కన్నీళ్లు దిగమింగుకుంటాను
గొంతులో గద్గద స్వరం పైకి రాదు
ఇదంతా ఒక్క లిప్తకాలంపాటే జరిగిపోతుంటుంది
మాట్లాడాలని సత్తువ కూడగట్టుకుని
జీవితంలో ఖాళీలు తప్ప ఇంకేం లేనివాణ్ణి
జీవితాన్ని ప్రేమించాలని, ఆశలు చిగురించాలని కలలు కనేవాణ్ణి
ఇలాంటి మాటలు తప్ప నా దగ్గర ఏముంటాయి? అంటాను
సరే అని
నీకేమీ అర్థంకాని నా జవాబుతో సంతృప్తి పడి
నీ ఈ రోజులో జరిగిన కథని చెప్పి
దాన్ని నాలో రాసుకుంటావు
నేను నవ్వుతాను
తర్వాత మనమధ్య కాసేపు నిశ్శబ్దం అలుముకుంటుంది
గొంతుదాకా అదిమిపట్టుకున్న నిన్ను ప్రేమించే విషయం ఒడ్డు దాటిద్దామనుకుంటాను
నిన్నూ, నీ స్నేహాన్నీ, ఇలా మునిమాపువేళ నీ గొంతునీ ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోనని ఆగిపోతాను
కవిత్రా! అబ్బాయిల్లో నీ బెస్ట్ ఫ్రెండ్సెవరైనా
నిన్ను ప్రేమిస్తున్నానని చెబ్తే
ఏం చేస్తావని నా సంశయాన్ని నీ ఊసుగా చెప్పమంటాను
చెప్తావు— ఈ వయసులో ఇదంతా ఎట్రాక్షన్
నాకా ఫీలింగ్ లేదు, మనం గతంలాగానే ఫ్రెండ్లీగా ఉండిపోదాం
నా సంశయమూ తీరిపోతుంది
కన్నీళ్లు ఆగవు గుండె వేగంగా కొట్టుకోవడం ఆగదు
గతంలాగానే నా జీవితం నిన్ను ప్రేమిస్తున్న సంగతిని మోయాల్సివస్తుందని దిగులుపడతాను
కానీ ఎప్పట్లానే బయటికి చెప్పను
ఇన్ని మాటల్లో నాకు పరిపూర్ణంగా నువ్వు నవ్వుతూ ఉండే సంగతి అవగతమౌతుంది
నువ్వలా ఉంటే చాలనుకుంటాను
చివరికి మనమధ్య మాటలు ముగిసి చీకటి పడిపోతుంది
నన్నూ, నా పిరికితనాన్నీ తిట్టుకుంటాను
నాది ప్రేమే కదా అని కన్నీళ్ళని తుడుచుకుంటాను
మళ్ళీ రేపు ఈ పొద్దు నను మాటలతో కలవడానికి చూస్తావని నాకు తెలుసు
అందుకే
నువ్వు చెప్పిన ఊసులు గుర్తుచేసుకుంటూ
నువ్వు నాతో ఉంటేనో
నాతో జతకట్టి బతికితే బాగుంటుందన్న ఊహనో తలుచుకుంటాను
ఒక నవ్వు నవ్వి
నాలో నేను బద్దలవుతుంటాను.
~
(సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అమ్మాయి (క్యాంపస్ అమ్మాయి కాదు) పంచిన ఊసులే ఈ రూపం, క్యాంపస్ లో ఏ అమ్మాయి అన్ని ఊసులు పంచలేదు. కానీ క్యాంపస్ మొదటి రోజునుండి అనుభవించినది ఈ వేదనంతా. కాబట్టి ఇది నా క్యాంపస్ వేదనే కదా)

లిఖిత్ కుమార్ గోదా

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నీకేమీ అర్థంకాని నా జవాబుతో సంతృప్తి పడి
    నీ ఈ రోజులో జరిగిన కథని చెప్పి
    దాన్ని నాలో రాసుకుంటావు
    నేను నవ్వుతాను.. ❤️❤️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు