ఇటీవల బోధి ఫౌండేషన్(పబ్లికేషన్స్) ప్రచురించిన కథా సంపుటం ‘బోరచెక్కు’, తెలుగు కథా సాహిత్యానికి ఒక మంచి చేర్పు అవుతుంది. కథ, నవలా రచయిత, నాటకకర్త ఇండ్ల చంద్రశేఖర్ కథా సంపుటం ఇది. ఈ కథా సంపుటంతో పాటే ‘మేజిక్ ఇఫ్’ అనే సంపుటం కూడా చం.శే తెచ్చాడు. ‘మే.ఇ’ లో కథలన్నీ మేజిక్ రియలిజం కథలు. థియేటర్ ఆర్ట్స్ చదువుకుని పరిశోధనలు చేసిన ‘చం.శే’, తన విస్తృత చదువరితనం ద్వారా గ్రహించిన తెలివితో సృజించిన విరూప కథలు ‘మేజిక్ ఇఫ్’ సంపుటం.
అయితే ‘బోరచెక్కు’ కథలు, జన్యులక్షణాలుగా రచయిత నుండి వెలువడ్డ జీవ కథలు. పదకొండు కథల ఈ సంపుటం పూర్తిగా రచయిత స్వీయానుభవాలు. చిన్న నాటినుండి తను పెరిగిన పల్లె ద్వారా గ్రహించిన జీవసారం ఈ కథలు. ఆ పల్లెలో సామాజికంగా తరతరాలుగా గూడు కట్టుకున్న అనేకానేక బాధల, కష్టాల, చావుల, దిగులుల సందిగ్ధావస్థల సందర్భాలు ఆ పల్లె పిలగాడిని కలచివేసింది. అతని ద్వారా ఆ పల్లె, తన గోడు వెళ్ళబోసుకుంటున్న కథలు ఇవి.
ఇటువంటి కథలు ఇంతకు ముందు రాలేదా అంటే వచ్చాయి. కానీ అవి ప్రాంతీయ అస్తిత్వ కథామాలికలుగా వచ్చినవి. వ్యక్తి, కులం, ఊరు, ప్రాంతం, నదుల పేర్లతో వచ్చిన కథామాలికలలో అగ్రభాగం వొట్టి పాత విషయాల తలపోతలు, నోస్టాల్జియా. అవన్నీ చిన్న కథలు, స్కెచ్ రూపాలు. ఏ కొత్త కథా రచయిత అయినా ఇటువంటి ఒక మూస/నమూనా ధోరణిలో కథలు కట్టి తన ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాడు. తెలుగు కథా సాహిత్యంలో తొలి, మధ్య దశలలో ఇటువంటి సంపుటాలు అరుదుగానే వచ్చాయి. 1980లు 90లనుండి ఈ కథా సంపుటాల ఉరవడి పెరిగాయి. కొత్త శతాబ్దంలో ఇటువంటివి కొల్లలుగా వచ్చి అప్పటికప్పుడు అలరించే ‘పాపులర్ సినిమా’లాగా సందడి చేస్తూనే వున్నాయి. వాటిలో నిలిచేవి కొన్నే.
సరిగ్గా ఇటువంటి మూస/నమూనా ధోరణిలో తన సంపుటాన్ని ‘చం.శే.’ పెట్టదలచుకోలేదు. అందుకే తన కథాసంపుటానికి తన ఊరు పేరుతో ‘కందలూరు కథలు’ అని అనలేదు. ఆ ధోరణి కంటే విస్తృతమైన, లోతైన, ఆలోచింపచేసే కథల్ని ‘బోరచెక్కు’లో మనకి చెప్తున్నాడు. అందుకే ఈ కథలు సంపుటంగా రూపు దిద్దుకోవడంలో పైన చెప్పిన ‘రీతి’ కంటే భిన్నంగా నిలుస్తుంది.
రచయిత పెరిగిన పల్లె సకలసంపదలతో తులతూగే పల్లె కాదు. మాదిగ పల్లె. ఏరోజుకి ఆరోజు తిండికి వెతుకులాడే పల్లె. ఆ పల్లెలో మనుషులు ఎలా వుంటారు. వారి నమ్మకాలు, మూఢనమ్మకాలు, రేపటి బతుకు మారాలన్న ఆశలు, అతి చిన్న చిన్న కోరికలు, వారివైన కట్టుబాట్లు, చుట్టూ వున్న కులాలతో మానసిక, కుల, మత అంతరాలు, తరచుగా ఆ పల్లెని పలకరించే చావులు ఇవన్నీ ఈ కథల్లో ఇతర సమాజానికి తెలియని వారి ఆలోచనలనీ స్థితిగతులనీ తెలుపుతున్నాయి.
పైన చెప్పిన ఆ పల్లె విభిన్న రూపాల బతుకుపటాన్ని అందంగా, వాచ్యంగా, గ్లోరిఫై చేసి చెపితే ఈ కథలకి పురిటిచావే దక్కును. కానీ చం.శే అలా చేయలేదు. అత్యంత ఒడుపుగా కథ చెపుతూనే, అంతకుమించి అట్టర్ రియాలిటీని నిరలంకారంగా ఉన్నది ఉన్నట్టు కథ కట్టడం వల్ల ఈ పదకొండు కథలు ఒకపట్టున పాఠకుని వదలవు.
ఈ మధ్య తెలుగు ప్రోజ్ ఫిక్షన్‌లో అవసరానికి మించి మామూలు తిట్ల స్థానంలో బూతులు వాడడం కొంతమంది రచయితలకి ఫ్యాషన్ అయి కూర్చొంది. అయితే ఈ సంపుటంలోని కథల్లో కూడా వున్న తిట్లు అతిసహజంగా కథలో ‘కూరలో సరిగ్గా కలిసిన ఉప్పులా’, ‘పూలదండలో దారంలా’ కలిసిపోయి ఎక్కడా చదువరికి అడ్డురాకుండా వున్నాయి. చదువరి అక్కడ ‘పాజ్’ తీసుకునేలా రాస్తే ఆ రచయిత ఫెయిల్ అయినట్టు లెక్క. తన ఒంగోలు చుట్టుపక్కల ‘నుడికారాన్ని’ రచయిత ‘గాడి’ తప్పనివ్వలేదు. పై, మధ్య, కింది తరగతుల సమాజాలలో తిట్లు కూడా ‘సందర్భానుసారం’ రకరకాల మానవ అనుభూతులను ఆనుకుని అసంకల్పితంగా వెలువడుతూంటాయి. అవి కొన్నాళ్ళకి ‘సభ్యత’గా కూడా మారిపోతూవుంటాయి. అలా ‘సభ్యతగా’ మారిన తన ప్రాంతపు ‘ఆ’ నుడికారాన్నే రచయిత ఉపయోగించాడు. అలా ఉపయోగించకపోతే కథనానికి లోపం కలుగుతుంది. కథా ప్రాంతపు ఫ్లేవర్ పోతుంది.
ఈ కథల్లో తిండి కట్టుబాట్లు చెప్పే ‘బోరచెక్కు’, ‘నేను, నాన్న, బిర్యానీ’, ‘దినం’, ‘డెత్ రెలే రేస్’, తరచూ పల్లెని వెంటాడే ‘చావు’ సందర్భాలని చెప్పే ‘దేహయాత్ర’, ‘దినం’, ‘కోటమామ కూతురు’, ‘బేల్దారి’, ‘సుభాషిణి కాదు సుమలత’, ‘డెత్ రెలే రేస్’ కథలు పల్లె నిత్యకృత్యాలని పారదర్శకంగా రూపు కట్టాయి.
‘కోటమామ కూతురు’ ఒక ఎపిక్ లాంటి కథ. పేటల్లో చిన్న పిల్లల మనుగడ ఎలా వుంటుందో, లేమి వల్ల కలిగే అశుభ్రత, పోషకాహార లోటు లాంటి విషయాలు స్పృశిస్తూనే కోటమామ కూతురికి ఎదురైన ఒక ‘అన్ యూజువల్ ట్రాజెడీ’తో కథ ముగుస్తుంది. ఈ ముగింపు పాఠకునికి తేరుకోలేని ఆశ్చర్యంతో కూడిన దిగులుకు గురిచేస్తుంది. ‘దేహయాత్ర’, ‘డెత్ రెలే రేస్’ మొ.కథల్లో అవాంతర చావుని పల్లె ఎలా గ్రహిస్తుంది?, చావు చుట్టూ అల్లుకున్న ‘రిచ్యువల్’ పల్లెలో ఎలా ఒక మామూలు రోజువారీ రివాజుగా మారిపోయిందో చెప్తాయి.
‘ఇక్కడేముంది’ కథలో పల్లె విడిచి యువకులు చదువుకుని సహవర్గంలో యువకులు తెచ్చుకున్న అభ్యుదయాన్ని అందుకోవాలని చెప్తూ,
“గెట్ అవుట్ ఫ్రొం ది స్టుపిడ్ విలేజ్. ఏముంది నీకిక్కడా? ఏమన్నుంటె మీ అమ్మా నాయన కొదిలెయ్యండి. మీరు బయటకు పొయి సంపాదించుకొని రండి డబ్బుని, లోకజ్ఞానాన్ని, అయి లేకుండా వచ్చేరో మీ ఇష్టం” అని వేలు చూపించి అరుస్తా మాదిగ తప్పెట్ల తాళానికి చిందేస్తుంది మాలోళ్లు నిలబెట్టుకున్న అంబేద్కర్ విగ్రహం….
-అంటూ రచయిత మాదిగ పల్లెలో యువకులు పల్లెకి వెలుగు తేవడానికి ఉద్యోగాలు చేయడానికి బయలుదేరిన మార్పును ఆశిస్తూ కథ ముగిస్తాడు. ఈ ఆశానిర్దేశపు మాటలు తప్ప మిగిలిన ఈ కథ అంతా పల్లెలో యువకుల అవిద్య, మానసిక దౌర్భల్యాలు, వారి చేతకానితనాలని ఎద్దేవా చేస్తూ రచయిత సర్రిలిస్టిగ్గా, మార్మికంగా చెప్తూ ‘కుక్కలు ఇంగ్లీషు మాట్లాడడం, ఆవులు టైలు కట్టుకుని తిరగడం’ వంటి సన్నివేశాలతో ధ్వనియుక్తంగా ప్రస్తుత సమాజాన్ని చూపించాడు.
పల్లె వెతల్నే చెప్తున్నా ఊరుని ఆలంబనగా చేసుకుని అల్లిన ఇతర కథా సంపుటాల కంటే భిన్నంగా, విస్తృతంగా కథా కేన్వాసుకి సరిగ్గా ఇముడుతూ వున్న కథలివి. పల్లె స్థితిగతుల్ని, అక్కడి మనుషుల మానసిక, సామాజిక, ఆర్ధిక, సాంప్రదాయ కట్టుబాట్లని రూపు కడుతూ అవి మారాల్సిన స్థితిని అన్యాపదేశంగా చెప్తూ, కథనంలో రచయిత చంద్రశేఖర్ తనదైన ముద్ర వేస్తూ చెప్పిన ఈ కథలు చదివి తీరవలసినవి.
***








Add comment