“ఒక్కతే ఊర్లో ఉంటే కష్టమని హైదరాబాద్ లో ఉండే ముగ్గురు కొడుకులూ మాట్లాడుకుని ప్రతి నెల ఒకరి ఇంట్లో ఉండే సర్దుబాటు చేసుకుని కొన్ని నెలల క్రితం తమ దగ్గరికి తీసుకు వచ్చారు రత్నమ్మని కొంత బలవంతంగానే. తల్లి తండ్రుల ఆస్తులను పంచుకోవడం సాధారణమే అయినప్పటికీ ఇప్పుడు వారి ఆలనా పాలనా కూడా నెలల వారీగా పంచుకోవడం కొంత విస్మయానికి గురిచేసింది. తల్లి తండ్రులని అసలే పట్టించుకోని కొడుకులున్న ఈ రోజుల్లో నెలకొక సారి ఇల్లు మారడం మనసుకుకి భారంగా ఉన్నప్పటికీ పెద్ద కష్టమేమీ కాదనుకుంది.”
సమాజానికి మానవ మనుగడకు అమ్మ ఒక చెట్టులాంటిది. నేలతల్లిలాంటిది. ఒక్కో నేల మీద ఒక్కో ప్రత్యేక పాత్రను పోషిస్తుంది అమ్మ. ముఖ్యంగా తెలంగాణ నేలమీది అమ్మల తల మీద ఎంతో బరువైన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ నేల ఎప్పుడూ ఉద్యమాల ‘ఉడుకు’తో మసలిపోతుంటుంది. నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం కావచ్చు. అంతకు ముందటి నక్సలైట్ ఉద్యమం, రైతు కూలి ఉద్యమాలు, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు, సాయుధ రైతాంగ పోరాటాలు ఇలా ఏ ఉద్యమంలోనైనా భర్తలను కోల్పోయిన భార్యలు, కొడుకులను కోల్పోయిన అమ్మలు అడుగడుగున కనిపిస్తారు ఈ మట్టి మీద. అలాంటి రత్నమ్మ కథే ఈ ‘అరుగు’ కథ. ఈ కథ మొదట ఇదే వెబ్ మేగజైన్ లో 15 మే 2020న ప్రచురింపబడింది. ‘అరుగు’ కథను ఇక్కడ చదవండి.
https://magazine.saarangabooks.com/%e0%b0%85%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81/
ఏడు పదులు దాటిన రత్నమ్మ తన ఆత్మలాంటి పల్లెను, తన నెత్తురులాంటి ‘అరుగు’ను వదిలి పెట్టి ఇప్పుడు హైదరాబాద్ లోనే కొడుకుల వద్ద ఉంటుంది. కాని ఆమె మనసు మాత్రం ఆ పల్లె చుట్టూ, ఆ పల్లెలో తన భర్త చేసిన సాయుధ రైతాంగ పోరాటాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆనాటి జ్ఞాపకాలే మనసు చుట్టూ ముసురులా ముసురుకుంటాయి. “భర్త ఉన్నప్పుడు ఇంట్లో ప్రతిరోజు పది, పదిహేను మందికి వంట చేసేది. పొలంలోపని చేసే వాళ్లకు అందరికి వంట ఇంట్లోనే. రైతాంగ పోరాటంలో చురుకుగా పాల్గొన్న తన భర్త, కమ్యూనిస్టు నాయకులతో కలిసి పనిచేసి తను నేర్చుకున్న సిద్ధాంతాలు అమలు చేసే ప్రయత్నం చేసేవాడు.
పోరాటంలో అన్ని కులాల వాళ్ళతో కలసి పనిచేయడం, అందరూ కలసి ఒకే తిండి తినడం అలవాటు చేసుకున్న ఆయన పొలంలో పని చేసే కూలీలతో కలసి భోంచేసే వాడు. ఈ ఒక్క విషయంతోనే, ఆయన మనస్తత్వం అందరికీ అర్థం అయ్యేది. రైతు కూలీలు రెట్టింపు ఉత్సాహంతో పని చేసే వారు ఏ పని చెప్పినా. ఆయన పోయిన తర్వాత చాలా క్రుంగి పోయిన రత్నమ్మ, అన్ని బాధ్యతలు ఒంటరిగా మోయడం తన వళ్ళ కాలేదు. కొడుకులు పట్నాన్ని, ఉద్యోగాన్ని వదలి వచ్చేట్లు లేరు. దానికి తోడు వర్షాలు పడక పోవడం చాలా మంది రైతులని ఇబ్బందులకు గురి చేసింది. నీళ్లు లేక, వేసిన పంటలకి పెట్టుబడి రాక రోజురోజుకీ దిగ జారి పోతున్న రైతుల బ్రతుకులు, పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు. బాగా బతికిన రైతులు పట్నాల్లో కూలీలు గా మారటం కూడా చూడ లేక పోయింది. ”
సముద్రం తలాపునే ఉన్నా తాగటానికి నీరు కరువైనట్లు హైదరాబాద్ లో మాట్లాడటానికి మనిషి కరువు. ఆమె మనసు ఎప్పుడూ మాట కలిపే మనిషి కోసం వెతుకుతుంటుంది. కాని ఒక్కరు కూడా ఆమెను మందలించే వారు లేరు. పైగా నివసించేది అపార్ట్ మెంట్ లో. అందుకే ఆమె మనసు పల్లె మీదికి పోతుంది. పదే పదే పల్లె ఆత్మీయత గుర్తుకు వస్తుంది. ఒక్కోసారి ఆలోచిస్తే భర్తే అదృష్టవంతుడనిపిస్తుంది. యోగిలా బతకాలి రోగిలా కాదు అని అంటుండే వాడు ఎప్పుడూ. అనుకున్నట్టుగానే భర్త యోగిలా మరణించాడు. తనకు కూడా అలాంటి చావు వస్తే బావుండునని అనుకుంటుంది. కానీ ఏది? చావు ఆమెను మర్చి పోయినట్టుంది. చావు పలకరింపే లేదు. దీనికి తోడు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది. పల్లె మీది మనాది ఒక వైపు, ఏకాంతం మరోవైపు, ఆరోగ్య సమస్యలతో తన భవిష్యత్తు ఏమవుతుందోననే దిగులు ఇంకో వైపు వెరసి చివరికి రత్నమ్మ బతుకు ఏమైంది? తెలియాలంటే మనం కూడా ‘అరుగు’ దగ్గరికి చేరాల్సిందే.
అనేక పొరలతో బహు కోణాలున్న ఒక అమ్మ కథ ఇది. అపార్ట్ మెంట్ జీవితం ఎంత దుర్భరం?వాటిల్లో ఇమడలేక వృద్ధులు ఎంతగా నలిగిపోతున్నారు? నగరాల్లో ఉంటూ ప్రతి మనిషిలో ఊరును వెతుక్కుంటున్న వృద్ధులు, అపార్ట్ మెంట్ లో ఎలా ఉండాలో మర్యాదగానే చెప్పే కోడళ్ళు, కొడుకులు, తలెత్తి బతకాల్సిన జీవితాలు ఎంత సేపూ సెల్ ఫోన్లో మునిగి పోయి తలలు వంచుకొని జీవిస్తున్న వైనం, సంసార బండిని లాక్కు పోతున్న జోడెడ్లలో ఒక ఎద్దు మధ్యలోనే జీవితాన్ని చాలిస్తే మిగిలిన జీవితాన్ని ఒంటరిగా మిగిలిన ఎద్దు బలవంతంగా ఎలా లాక్కు పోతుంది, భర్త నేర్పిన జీవిత పాఠాలు, వృద్ధాప్యంలో ఎవరితోనూ చేయించుకోవద్దు. కాలు రెక్క ఆడంగనే చావాలి. మనవళ్ళకు ఆప్యాయంగా తినిపించే స్వేచ్చ కూడా లేదు. కొడుకుకు ఇష్టమని ఏదైనా చేయాలని వంట గదికి పోబోతే వద్దని కోడలు కట్టడి.
“నా భర్తకి మెదడు కి సంబంధించిన వ్యాధితో మంచాన పడ్డప్పుడు, ఆయన అపస్మారక స్థితిలో ఉంటే, అన్నీ నేను దగ్గరుండి చేసినాను, మరి ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉంటే ఈ కొడుకులు, కోడళ్ళకి చూసుకునేంత ఓపిక, సమయం ఉంటుందా?” అనే సందేహం. పల్లీయుల ప్రేమ. కొడుకులకు ఎలాంటి కష్టం రాకుండా తన చావును ముందే ప్లాన్ చేసుకున్న ఒక సాహసం ఇలా ఎన్నో సుడిగుండాలు సగటు పాఠకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఈ కథలో. ఇదంతా ఒక వైపైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చిత్రించిన తీరు రచయిత పట్ల గౌరవాన్ని పెంచుతాయి.
బుజ్జిగాని సంభాషణతో సన్నగా ఒక్క చినుకుతో మొదలయ్యే వర్షంలాగా ప్రారంభమయిన కథ చివరికి వచ్చే సరికి గుండె లోతుల్లో పెద్ద తుఫానును రేపి ముగుస్తుంది. ఎన్నో ఆలోచనల్ని, సమస్యల్ని మన మనసు వాకిట్లో కుమ్మరించి అతలాకుతలం చేస్తుంది. తల్లి మనసు ఎలా ఆలోచిస్తుంది. ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదేనా? అని మన హృదయం లోపల ప్రశ్నల శూలాలు నాటుకు పోతాయి. అరుగు చుట్టూ, పల్లె చుట్టూ, ఆ భర్త చుట్టూ అల్లుకున్న ఎన్నో విషయాలు మనం కూడా నెమరు వేసుకుంటాం.
ఒకనాటి పల్లె, ఇప్పటి నగరం మధ్య ఒక పెనుగులాట మనల్ని రత్నమ్మ లాగే ప్రశాంతంగా కూర్చోనివ్వదు. మన ముందు తరానికి మన తరానికి నడుమ ఎన్ని అంతరాలున్నాయి? అమ్మ మది నిండా ఎన్ని గాజు పెంకుల్ని గుచ్చాం? అయినా ఆమె పెద్ద మనసు ఎంత పాజిటివ్ గా ఆలోచించింది. మనకు గోరంత కష్టం రాకుండా నిశ్శబ్దంగా తన దారిలో తాను ఎలా నడుచుకుంటూ పోయింది? ఆస్తిని పంచుకున్నట్టే అమ్మను కూడా ప్రతి నెల ఒకరు సాకాలని పంచుకుంటున్నాం. కాని ప్రతి నెల ఒక ఇంటికి మారుతున్న కాలంలో ఆ యింటి భోజన అలవాట్ల కారణంగా అమ్మ రక్త ప్రసరణలో వచ్చే మార్పులు, పరిసరాల వాతావరణం, మనుషుల మన్నన వల్ల అమ్మ మానసిక, ఆరోగ్య స్థితిగతుల్ని ఎప్పుడైనా ఆలోచించామా?
వర్తమానం గతం వర్తమానం అనే టెక్నిక్ తో రాసిన ఈ కథ ఇలా తప్ప ఇంకెలా రాసినా ఇంత బాగా ఆకట్టుకునేది కాదు. ఇందులో రచయిత నూటికి నూరుపాళ్లూ కృతకృత్యులయ్యారు. అన్నింటి కంటే మించి ఇందులోని కథాకథనం, శైలి బాగా ఆకర్షిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే శైలి వల్లనే ఇది గొప్ప కథగా మారిందేమో అనిపిస్తుంది. దీనికి నిదర్శనం కథలో కేవలం ఏడంటే ఏడు చిన్న డైలాగులు మాత్రమే ఉండడం. రచయితకున్న సామాజికావగాహన, తెలంగాణ పట్ల గల ప్రేమ కథకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ కథ ఏ నేల మీదైనా జరగవచ్చు. కాని తెలంగాణ నేల మీద జరిగినట్లు చూపించడం వలన రైతాంగ సాయుధ పోరాట స్మృతులను ఇప్పటి తరాలకు చెప్పినట్లైంది. అలాగే ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో మానవీయ సంబంధాల లుకలుకల్ని కూడా చెప్పారు రచయిత.
ఇలాంటి మల్టీ షేడెడ్ కథను మనకు అందించిన రచయిత ఎవరో కాదు వేణు నక్షత్రం. వేణు నక్షత్రం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి లో గత రెండు దశాబ్దాలకు పైగా స్థిరపడిన రచయిత, దర్శకుడు మరియు నిర్మాత. సాఫ్ట్ వేర్ రంగంలో ప్రధాన వృత్తిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రవృత్తి గా కథా రచన, సినిమా, టీవీ రంగాన్ని ఎంచుకొని పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గని పూర్తి హంగులతో మనసుకు హత్తుకునేట్టుగా నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమాలు ఎంతెంతదూరం, అవతలివైపు, పిలుపు, మై డాడ్. తనతో పనిచేసిన వారి టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ప్రొడ్యూసర్ గా నిర్మించిన లఘు చిత్రం ఎక్స్చేంజ్, కాక్టైల్ డైరీస్ అనే ఎనిమిది ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో పలువురు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. లఘు చిత్రాలు ఈ యూట్యూబ్ లింక్ లో చూడొచ్చు. https://youtu.be/S717rCUReoc
సిద్దిపేటలో 90వ దశకంలో మంజీరా రచయితల సంఘం స్పూర్తితో, కాలేజీ రోజుల నుండే రాయడం అలవాటు చేసుకున్నవేణు నక్షత్రం తొలి కథా సంపుటి ‘మౌనసాక్షి’. వేణు రెండవ కథా సంపుటి “అరుగు” అతి త్వరలో మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేణు నక్షత్రం రాసిన మొట్ట మొదటి నవల “శ్రీగీతం-Faction, Love, Romance – Ceded to Nizam” అనే ట్యాగ్ లైన్ తో అతి త్వరలో వెలువడనుంది. వేణు నక్షత్రం కొన్ని పాటలను కూడా రాసాడు, కానీ కథకుడుగానే కొనసాగుతున్నాడు. వేణు నక్షత్రం రాసిన చందమామ పాట ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసిన సందర్బంగా చాలా మంది ప్రశంసించారు. ఈ పాటను యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. https://youtu.be/TbRD8RLDC0U
*
Wonderful congrats
పల్లె ముచ్చట్ల గొడుగు “అరుగు” అని విమర్శ వ్యాసం శ్రీధర్ వెల్దండి గారి కలంలో తెలంగాణ అమ్మల ప్రేమను ప్రత్యేకంగా ప్రస్తావించడం వారి సునిశిత దృష్టికి తార్కాణం.కథలో ఆత్మను పట్టి పాఠకులకు అందజేయడం ద్వారా కథను చదవాలనే ఆసక్తిని పెంచారు.పాఠకుని వలె మారి కథలో ఉన్న తల్లి ప్రేమ గొప్పదనాన్ని పంచారు.రచయిత కోణాన్ని పాత్రల స్వభావాన్ని సులభంగా వివరించి కథను రెండోసారి చదివేలా వ్యాసం అందించారు.రచయిత వేణునక్షత్రం గారికి అభినందనలు.విమర్శకులు శ్రీధర్ గారికి కృతజ్ఞతలు.
భద్రయ్య గారు ,
కథ గురించి , విశ్లేషణ గురించి మంచి మాటలు చెప్పారు. మీ అభిమానానికి ధన్యవాదములు
శ్రీధర్ గారు నేను రాసిన అరుగు కథ కి అద్భుతమైన సమీక్ష రాసి నా కథకు మరింత వన్నె తెచ్చారు. అంతే కాకుండా నా లఘు చిత్రాలని ఇతర రచనలని పరిచయం చేయడం చాలా సంతోషం. ధన్యవాదాలు🙏
–————————————————-/అన్నింటి కంటే మించి ఇందులోని కథాకథనం, శైలి బాగా ఆకర్షిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే శైలి వల్లనే ఇది గొప్ప కథగా మారిందేమో అనిపిస్తుంది. దీనికి నిదర్శనం కథలో కేవలం ఏడంటే ఏడు చిన్న డైలాగులు మాత్రమే ఉండడం. రచయితకున్న సామాజికావగాహన, తెలంగాణ పట్ల గల ప్రేమ కథకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ కథ ఏ నేల మీదైనా జరగవచ్చు. కాని తెలంగాణ నేల మీద జరిగినట్లు చూపించడం వలన రైతాంగ సాయుధ పోరాట స్మృతులను ఇప్పటి తరాలకు చెప్పినట్లైంది. అలాగే ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో మానవీయ సంబంధాల లుకలుకల్ని కూడా చెప్పారు రచయిత.————————- పై వాక్యాలు మీ విశ్లేషణా సామర్థ్యాన్ని చెబుతున్నాయి-కథ మరియు విశ్లేషణ రెండూ బాగున్నాయి.——————————– ——–
కథకుడు వేణూ , మరియు విశ్లేషకులు శ్రీధర్ గార్లకు అభినందనలు.
ధన్యవాదములు శ్రీనివాస్ గారు
ఒక మంచి కథను పరిచయం చేసిన వెల్దండి శ్రీధర్ గారికి ధన్యవాదాలు!
వేణు నక్షత్రం గారి కథ అమ్మమ్మలను, నానమ్మలను కండ్ల ముందు నిలిపింది. రత్నమ్మ అంతరంగాన్ని ఆర్ద్రంగా ఆవిష్కరించింది. ఆమె తన జీవితాన్ని అట్ల ముగించుకోవడం బాధాకరమే కాని……ఆ ‘ నరకయాతన ‘ కంటే ……ఒక్కసారే పిడాత పోతెనే ఒక్క చిత్తం.
అని అనుకోవడం సాధారణమే!
వెల్దండిగారన్నట్టు కథాశైలి చాలా బాగుంది ఏక బిగిన చదివించే విధంగా.
ఈ కామెంటే నన్ను చదివించింది. లేకపోతే దాటవేసేవాన్నేమో!
ధన్యవాదములు సత్యనారాయణ గారు. సమీక్ష, కథ చదివి మీ అద్భుత స్పందనను తెలియచేసినందుకు కృతజ్ఞతలు. వీలయితే ‘మౌనసాక్షి’ నా మొదటి కథా సంకలనం చదవండి. నవోదయ, విశాలాంధ్ర బుక్ హౌస్ లో దొరుకుతుంది.
అభినందనలు ఇద్దరికీ
ధన్యవాదములు రాజేశ్వరి గారు.
శ్రీధర్ గారు *అరుగు* కథా పరిచయం చేసిన తీరు బాగుంది. ఈ పరిచయం తో ఎవరైనా వెంటనే వేణు నక్షత్రము గారి అరుగు కథా చదవాల్సిందే. నన్నయ్య చెప్పినట్లు
“మతిఁ దలఁపఁగ సంసారం
బతిచంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు,
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్.
దీనికి ఆధునిక అక్షర రూపం వేణు నక్షత్రము గారి ఈ అరుగు . ఒక కథ విస్తృతి ఇంతలా కూడా ఉండొచ్చు అని చెప్పే కథ. దీని రచయిత వేణు నక్షత్రము గారు మరియు విశ్లేషకులు శ్రీధర్ గారికి అభినందనలు. ముఖ్యంగా శ్రీధర్ గారు అమ్మ గురించి చెప్పిన మాటలు అద్భుతం.
ధన్యవాదములు రమేష్ గారు. శ్రీధర్ గారి విశ్లేషణ, నా కథ చదివి మీ అభిప్రాయం తెలియచేసినందుకు కృతజ్ఞతలు. రచయితలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేవి మీలాంటి వారి స్పందనలే. వీలయితే ‘మౌనసాక్షి’ నా మొదటి కథా సంకలనం చదవండి. నవోదయ, విశాలాంధ్ర బుక్ హౌస్ లో దొరుకుతుంది.
మంచి విశ్లేషణ .మాయమైన అరుగు ను ఇలా రచయిత కథ ద్వారా ముందుకు తెస్తే దాన్ని మీ సమీక్ష తో మది లోకి చొప్పించారు.అభినందనలు.
ధన్యవాదములు కిరణ్మయి గారు.
హృదయాన్ని కదిలించే కథలు…
కంట కన్నీటి ధార కురిపించే కథలు…
పాఠకుడి గుండెల్లో చెరగని ముద్ర వేస్తాయి అనేందుకు ఈ అరుగు కథే నిలువెత్తు నిదర్శనం…
మా అభిమాన కథా సమీక్షకులు..
శ్రీ వెల్దంటి శ్రీధర్ గారురు… ఇంతటి అనుభూతులు పంచే కథలను పరిచయం చేస్తూ.. సాహితీ లోకంలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు… అనేక… ధన్యవాదాలు మాష్టారూ
కథా రచయిత గారికి…మా అభినందనల మల్లె మాల…
మంచి కథ..ను…
మంచి కథనం తో…
నడిపించిన తీరు అద్భుతం…
పాఠకుడి ని మీ పొందు బంధాలతో…
కట్టిపడేసారు సార్…
మీకు అనేక ధన్యవాదాలు 🙏…