పల్లె పదం నుంచి హిట్ పాటల దాకా…

కందికొండను హీరోలా చూడడం మొదలు పెట్టాను. అయినా మా స్నేహం అరమరికలు లేకుండా ముందుకు సాగింది.

కందికొండ ఎమ్మేలో నా బ్యాచ్ మేట్. సికింద్రాబాద్ పి.జి. హాస్టల్ లో విద్యార్థి పరిషత్  వాళ్ళ తో ఏదో గొడవ జరిగింది. ఆ గొడవలో కందికొండ పరిచయమయ్యాడు. మొదట్లో దానికి అనుకూలంగా  వుండేవాడు. రాను రాను దళిత, బహుజన ఐడియాలజీని ఓన్ చేసుకున్నాడు.

ఆంధ్ర జ్యోతి సండే మ్యాగజైన్ లో నా కవిత అచ్చయితే, అది పట్టుకుని నా రూమ్ 225 లోకి వచ్చాడు. అప్పటికే నేను రాష్ట్రంలో కాస్త పేరున్న కవిని. “అన్నా.. నా పేరు కందికొండ యాదగిరి, ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, మాది వరంగల్ దగ్గర నర్సీపట్నం” అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. “అన్నా.. నేను సినిమాలకు పాటలు రాయాలనుకుంటున్నాను.” అన్నాడు. నేను షాక్ తిన్నాను. వీడేమిటి…,సినిమాలకు పాటలు రాయడ మేమిటి ?- అని మనసులో అనుకొని చికాకు పడ్డాను. సరే రాయి. “అందుకు బాగా చదువు” అని చెప్పాను. తనకు తెలిసిన లిటరేచర్ అంతా మాట్లాడి,వెళ్లి పోయాడు. అలా మొదలైన మా పరిచయం గాఢమైన స్నేహంగా మారింది.

పత్రికలలో నా కవితల,వ్యాసాలు అచ్చవుతుంటే నన్నో హీరోలా చూసేవాడు. అచ్చవ్వాలంటే ఎలా రాయాలని ……తరచుగా అడిగే వాడు. అతనితో ఈ బాధ తట్టుకోలేక కొన్ని రోజులు తప్పుకొని తిరిగాను. అది పసిగట్టి , “నాతో ఫ్రీగా వుండు….ఇబ్బంది పడకని మొహమాటం లేకుండా చెప్పాడు. అప్పటికే నా రూమ్ లో కాస్ట్లీ టేప్ రికార్డ్ వుండేది. దానిని తరచుగా తీసుకెళ్ళేవాడు. నా హీరో హోండా బైక్ ను కూడా. మా స్నేహం అలా గాఢంగా మారింది. నేను,విజ్ఞాన్, నరసయ్య, అక్కాల వెంకటేష్, వెంకట్ రెడ్డి… ఇంకా చాలా మంది మి జట్టుగా తిరిగాం.

2౦౦౦లో నేను తెలుగు యూనివర్సిటీ లో ఎం. ఫిల్. లో చేరాను. ఒక కొత్త సినిమా క్యాసెట్ పట్టుకుని కందికొండ నా రూమ్ కొచ్చాడు.ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, ఇందులో పాట రాసాను.. విను అన్నాడు. ఆ పాట విని నేను షాక్ తిన్నాను. ఇంత మంచి పాట నీవు రాసావా…? అని అడిగాను.తను ఎంతో ఆనందంగా తలూపాడు. ఆ సినిమా పేరు…..” ఇట్లు… శ్రావణి సుబ్రహ్మణ్యం”. ఆ పాట, “మళ్లి కూయవే గువ్వా……, మోహన అందెల మువ్వా….”. ఆ సినిమాకి డైరెక్టర్ పూరి జగన్నాథ్. సంగీతం చక్రి. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది.

ఇక కందికొండ వెనక్కి తిరిగి చూడలేదు. చక్రి , పూరి జగన్నాథ్ అండతో సినిమా రంగంలో ముందుకు దూసుకు పోయాడు. “ఇడియట్” సినిమాలో కందికొండ రాసిన.. “చూపులతో గుచ్చి గుచ్చి చంపకే….”, “సైరా సై….”పాటలు చాలా చాలా సూపర్ హిట్ అయ్యాయి.

ఆంధ్ర, సీడెడ్, నైజాం ఏరియాల్లో ఆ పాటలు మార్మోగి పోయాయి.

మా ఇద్దరి స్నేహంలో సీన్ మారిపోయింది. నేను కందికొండను హీరో లా చూడడం మొదలు పెట్టాను. అయినా మా స్నేహం అరమరికలు లేకుండా ముందుకు సాగింది.

అప్పటికే తాను మ్యారీడ్. భార్య, పిల్లలను ఊరిలోనే వదిలి పెట్టి, సినిమా ఫీల్డ్ లో చాలా కష్టాలు పడ్డాడు.అవన్నీ నాకు తెలుసు . చాలా విషయాలు పబ్లిక్ గా రాయలేను. కందికొండ కి చలం రచనలన్న, చలం అన్నా…బాగా ఇష్టం. స్వేచ్ఛగా సాగే జీవితాలని, లైంగిక సంబంధాలని బాగా ఇష్టపడి, బాహాటంగా సపోర్ట్ చేసేవాడు. ఇది అతని లో నాకు బాగా నచ్చిన అంశం. కందికొండ కు కూతురంటే బాగా ఇష్టం. ఇంటికి వెళ్లి ,మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చేప్పుడు బాగా ఏడుస్తుందని, ఆ ముద్దు మాటలని, ఎడబాటు ను నాతో చెప్పుకొని బాగా ఫీలయ్యేవాడు. అప్పుడు “రణం,భాగ్యలక్ష్మి బంపర్ డ్రా” సినిమాలకు పనిచేస్తున్న రోజులని నాకు బాగా గుర్తుంది. హీరో రామ్ సినిమాకి సింగిల్ కార్డ్ పాటలు రాస్తున్నానని ఆనందంగా చెప్పాడు. తరువాత రాసాడు. ఆ రోజుల్లోనే. కూతురితో దూరంగా వుండడాన్ని,ఆ బాధను భరించలేక ఫ్యామిలీ ని హైదరాబాద్ షిఫ్ట్ చేసాడు. సినిమాలో వచ్చే డబ్బులు సరిపోక నానా బాధలు పడ్డాడు.

“ఇట్లు…. శ్రావణి సుబ్రహ్మణ్యం” సినిమాకి సీనియర్ సినిమా కవుల ఇండ్ల చుట్టూ తిరిగి, విసిగిపోయిన పూరి జగన్నాథ్…. కొత్త వాళ్ళయిన తనకు, భాస్కర భట్ల లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చాడని తరచుగా చెప్పేవాడు. చక్రి, పూరి…ఇద్దరూ కందికొండ ను K.K. అని పిలిచే వారు. నన్ను కూడా వాళ్లు KK ఫ్రెండ్ గానే పిలిచేవారు. “దేశ ముదురు, పోకిరీ,మున్నా” సినిమాల షూటింగ్ టైమ్ లో బాగా ఎంజాయ్ చేసాం. ఆడియో రీలిజ్ ఫంక్షన్స్ లో 5 స్టార్ హోటల్స్ లో గడిపాం. సినిమా రంగానికి నా చేత కందికొండ ఘోస్ట్ రైటర్ గా పని చేయించాడు. తనకు డైరెక్టర్ కావాలని బలంగా వుండేది. అది నెరవేరలేదు. 2009 తెలంగాణ మూమెంట్ నుంచి సినిమా అవకాశాలు తగ్గాయి. చాలా బాధ పడ్డాం. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిస్థితి పెద్దగా మెరుగు పడలేదు.

కందికొండ తెలుగు లో పిహెచ్. డి. చేసి డాక్టరేట్ తీసుకోవడానికి నేను కారణం. చాలా సహాయం చేసాను. తాను నాకెంతో సహాయం చేసాడు. చక్రి చనిపోయి నపుడు బాగా ఫీలయ్యాం. అంతకు ముందే కందికొండ క్యాన్సర్ బారిన పడ్డాడు. నాకు చాలా చాలా ఆలస్యంగా చెప్పాడు. ఎంతగానో సంపాయించి దర్జాగా బతికిన కందికొండ నాకు తెలుసు. ప్రగతి రిసార్ట్స్, అలంకృతా రిసార్ట్స్, పబ్ కల్చర్ ను నాకు పరిచయం చేసాడు. అంతగా ఎంజాయ్ చేసాం.ఆ స్వర్ణయుగం ముగిసింది. తర్వాత తర్వాత పరిస్థితి దిగజారింది. పెద్దగా ఏం సంపాయించుకోలేదు. చివరి దశలో చాలా మంది సినిమా వాళ్ళ పరిస్థితి ఇంతే.

తెలంగాణ వెనుక బడిన గ్రామం లోంచి వచ్చి, సినీ రంగంలో ఎదిగిన వాడు కందికొండ. కుమ్మరి బి.సి. కులం లోంచి ఇంత విద్యాధికుడిగా ఎదిగిన వాడు కందికొండ. సమాజం లోని వ్యాధులతో, శరీరం లోని వ్యాధి తో పోరాడి, అలసిపోయి విశ్రమించిన ప్రాణ మిత్రుడు కందికొండ కి అశృ నివాళి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

*

పగడాల నాగేందర్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా ఆలోచనాత్మక వ్యాసం ఇది. ఇందులో చాలా అంశాల మీద మరింత విపులంగా చర్చ జరగాలి. కళా సంపన్నులను వీడని పేదరికం అనారోగ్య పెద్దరికమవడమే విషాదం.

  • కందికొండ గారితో మీ అనుబంధం, నేపథ్యం చాలా బాగుంది. వారి అకాలమరణం తెలంగాణ కు తీరనిలోటు.
    -డాక్టర్. మేడబోయిన లింగయ్య యాదవ్
    టీచర్
    జనగామ 9948485001

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు