పల్లె నుడికారంలో పుట్టిన భావవిప్లవం

ధునికయుగ ప్రవర్తకత్రయంగా పరవస్తు చిన్నయసూరి, కొక్కొండ వెంకటరత్నం, కందుకూరి వీరేశలింగం పంతుళ్ళను పేర్కొన్నప్పుడు, ఆధునిక భావ విప్లవానికి పునాదులు వేసిన సీమకవుల్ని సాహిత్యలోకం గుర్తుపెట్టుకోవాలి.

చిన్నయ సూరి వ్యాకరణం, వెంకటరత్నం పంతులు భాషలో నవయుగవికాసం, కందుకూరి సాంఘిక విప్లవం లాంటి చారిత్రక సాహిత్యవిషయాలు పేర్కొన్నప్పుడు కావ్యరచనలో కాల్పనికవాద కవిత్వాన్ని ముసలమ్మ మరణంతో భావ విప్లవానికి పునాదులు వేసిన కట్టమంచి రామలింగారెడ్డిని, పేదవాని వదాన్యత, పేదవాని అస్త్ర నిపుణత, విరసుడైనట్టివాని, వాక్‌చమత్కృతి, కవిగాని వాని శాస్త్ర పాండితియు, నిష్ఫలమ్ములై పఱగుచుండు’ అంటూ సామ్యవాదానికి పునాదులు వేసిన విద్వాన్‌ విశ్వంను సీమ ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరిది రాయలసీమ ప్రాంతం.

విద్వాన్‌ విశ్వం అనగానే పెన్నేటిపాట గుర్తుకు వస్తుంది. కన్నీటి నుడులెన్నో కూర్చి/పెన్నేటిపాటగా తీర్చి/రాళ్ళలో మేల్కొల్పినావు/రసదిగ్ధ భావామృతార్చి అంటూ సినారె విద్వాన్‌ విశ్వం గూర్చి చెబుతారు. సీమ బతుకు ముఖచిత్రాన్ని పెన్నేటిపాటతో విద్వాన్‌ విశ్వం ఆవిష్కరించారు. ఆధునిక కవిత్వంలో పద్యాన్ని కూడా కవిత్వం అనుకున్నప్పుడు బహుశా వొక ప్రాంతపు అస్తిత్వం గూర్చి చెప్పిన తొలికావ్యంగా పెన్నేటి పాటను చెప్పవచ్చు.

సాంప్రదాయ పద్యశైలిలో పద్యాన్ని ఆధునికతతో, ప్రగతిశీలత కల్గిన వస్తువుతో రాసినపుడు అది ప్రగతిశీలకవిత్వమే అవుతుంది. ఈ రచనగూర్చి రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి తన పరిశోధనా వ్యాసాల్లో విశ్లేషిస్తూ–ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో స్తబ్దయుగంగా భావించబడుతున్న కాలంలో ఈ పెన్నేటిపాట కావ్యం వచ్చి ఆ ఆలోచనను ప్రశ్నకు గురిచేసిందంటాడు. ఈ కావ్యం రాయలసీమ కరువు, పేదల వెతలు, బాధలు, కన్నీటిఘోష రాయలసీమ ప్రజల జీవనస్థితిని చెప్పిన ఆధునిక మహాకావ్యం అంటారు.

పెన్నేటిపాట తర్వాత రాయలసీమ నుండి అనేక కావ్యాలొచ్చాయి. కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం, పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవం, పెనుగొండలక్ష్మీ, గడియారం వెంకటశేషశాస్త్రి శివభారతం, దుర్భాక రాజశేఖర శతావధాని రాసిన రాణా ప్రతాపసింహచరిత్ర, బెళ్లూరి శ్రీనివాసమూర్తి రాసిన తపోవనం, గజ్జెల మల్లారెడ్డి రాసిన శంఖారావం లాంటి మరికొన్ని రచనలొచ్చాయి. అయితే వీటిలో పెన్నేటిపాట-ముసలమ్మ మరణం కావ్యాలు మినహాయిస్తే అన్నీ ఆధ్యాత్మిక భావజాలానికి సంబంధించిన కావ్యాలే.

విద్వాన్‌ విశ్వం పెన్నేటిపాటకు, కట్టమంచి ముసలమ్మ మరణం కావ్యానికి సామాజిక చైతన్య స్వభావముంది. ఆనాటి ప్రజల సాంఘిక జీవనస్థితి కనబడుతుంది. 1953-55 మధ్యకాలంలో కరువు నేఫథ్యంలో సాగిన కావ్యవస్తువు పెన్నేటిపాట. పెన్నానదీ పరీవాహక ప్రాంతంలో అతలాకుతలమైన ప్రజల బతుకులు, డొక్కలు తేలిన దేహాలపై మొలిచిన అక్షరాలే పెన్నేటిపాట. అయితే బెళ్లూరి శ్రీనివాసమూర్తి రాసిన తపోవనం కావ్యంలో రాయలసీమలో అదే సమకాలీన కాలంలో రాయలసీమ బతుకులు, గంజికేంద్రాల ప్రస్తావన కొద్దిగా కనిపిస్తుంది.

రాయలసీమ స్థితిని సమగ్రంగా ప్రతిబింబించిన కావ్యం మాత్రం కాదు. ఆనాటి రాయలసీమ సమగ్ర బతుకుముఖచిత్రాన్ని ఆవిష్కరించిన కావ్యం పెన్నేటిపాట అనడంలో సందేహం లేదు. కరవు చిత్రాన్ని విదారించునెదన్‌, వట్టి ఎడారి తమ్ముడు అంటూ ఎండిపోయిన పెన్నానదిని చూపిస్తాడు కవి. రాయలసీమ ప్రజల కన్నీటి చారికల్లాంటి కవితాత్మకతను ఈ నాల్గుకవితా వాక్యాలలో చెబుతాడు. వేయ్యేండ్ల కొక్కొక్క వానకదా!, అక్కడమాత్రమెట్లు గఱకైనాపుట్టు, ఏపాత చెట్లకుగాని, చివురేది? పచ్చనలు తాటల్‌దీసికాచూడమే అంటాడు. గఱకకూడా మొలవని భూమి ఇప్పుడు కూడా వుంది.

ఈ 75 ఏళ్ళ స్వర్ణోత్సవ భారతంలో రాయలసీమను కరువు కబళించడం లేదా? మారిందొక్కటే. కరువుకాటకాలొచ్చినపుడు తిండి ఉన్నా లేకున్నా ఇక్కడే బతికేటోళ్లు, సచ్చేటోళ్లు. ఇప్పుడు నమ్ముకున్న భూమిని, కన్నతల్లిలాంటి ఊళ్లను వొదిలి వలస వెళ్తున్నారంతే. అదే ఇప్పటికీ అప్పటికీ మార్పు. బతుకులు మాత్రం యధాతథం.

విద్వాన్‌ విశ్వం అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో జన్మించాడు. సాహిత్యము-సంఘసేవ రెండుకళ్లుగా బతికాడు. విద్వాన్‌ విశ్వం గూర్చి ఆరుద్ర చెబుతూ..‘ఇంగ్లీష్‌ చదువుల ద్వారా మార్క్సిజం వైపు పయనించినవాళ్ళు చాలా మంది ఉన్నారని, కానీ ప్రాచ్యవిద్యలు చదివి సామ్యవాదం వైపు పయనించిన ప్రజ్ఞావంతుడు విద్వాన్‌ విశ్వం’ అని అంటాడు. జర్నలిస్టుగా, సంపాదకుడుగా వివిధ పత్రికల్లో పనిచేశారు. కమ్యూనిస్టునాయకులు తరిమెలనాగిరెడ్డి తనకు కాశీలో సహాధ్యాయుడవ్వడం వల్ల మార్క్సిస్ట్‌ సాహిత్యం విస్తృతంగా అధ్యయనం చేసి వారి రాజకీయ ఉద్యమాలలో పాల్గొని అనేక రచనలు చేశారు. ఇందులో ప్రముఖంగా ఫాసిజం, స్టాలిన్‌, లెనిన్‌ మొదలైనవి రాశారు.

ఆనాటి సాంఘికచైతన్యానికి ప్రతీకగా నిలిచిన కావ్యం కట్టమంచి ముసలమ్మ మరణం. కట్టమంచి రామలింగారెడ్డి రాసిన ఈ కావ్యం వొక స్త్రీ గ్రామంకోసం, ఆ గ్రామ క్షేమం కోసం తన త్యాగంతో ఆత్మాహుతి చేసుకున్న వైనాన్ని రాశాడు. ఈ కావ్యం ఆధునిక కవిత్వానికి బాటలు వేసింది. అనంతపురం పట్టణానికి దగ్గరగా ఉన్న బుక్కరాయసముద్రం అనే గ్రామం దగ్గర ఉన్న చెరువు చరిత్ర ఆధారంగా ఈ కావ్యాన్ని రాశాడు. అప్పటికే చార్లెస్‌ఫిలిప్‌ బ్రౌన్‌ రాసిన అనంతపురం చరిత్రలోని కథను తీసుకుని 107 గద్యపద్యాలతో 1900 సంవత్సరంలో ఆయన ముసలమ్మ మరణం రాశాడు. దీన్ని కర్నూలుకు చెందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1940లో అనగా కట్టమంచి షష్టిపూర్తి సందర్భంలో రెండో ముద్రణగా తీసుకొచ్చారు.

కథలోకి వెళితే వానలు ఎక్కువగా పడి బుక్కరాయ సముద్రం చెరువు నిండిపోతుంది. చెరువుకట్ట తెగిపోయే స్థితివస్తుంది. ఊరి పెద్దలందరూ ఆలోచించి గ్రామదేవత పోలేరమ్మకు ఉత్సవం చేయాలని నిర్ణయిస్తారు. ఆ సందర్భంలో ఆ ఊరి రైతు బసిరెడ్డి చిన్నకోడలు ముసలమ్మ చెరువుకుబలైతే కట్టతెగిపోదని ఆకాశవాణి పలుకుతుంది. ముసలమ్మ గ్రామ క్షేమం కోరి తన భర్తను, అత్తమామలను, ఊరిప్రజలను ఒప్పించి తన కొడుకును భర్తకు అప్పగించి చెరువులోకి దూకుతుంది. చెరువుకట్ట తెగకుండా ఆగిపోతుంది. ఈ కథ అశాస్త్రీయంగా కనబడినా ఇందులో త్యాగమే ప్రధానభూమిక. ఆనాటి సమాజంలో గ్రామ కట్టుబాట్లకు విలువ ఇవ్వడం, ఒకరు బలైనా పరవాలేదు. అందరి క్షేమం కోసం అనే సామాజిక భావనను, పరిణతిని ఈ కథ తెలుపుతుంది. ఆకాశవాణి పలుకులాంటి వర్ణన హేతుబద్దత కాదు. కానీ వొక గ్రామంలోని ఘటనే వస్తువుగా సాగి ఆధునిక సాహిత్యానికి బాటలు వేయడం అద్భుతం.

ఈ కావ్యంలో రాయలసీమ రైతుల బతుకు వెతల వర్ణన కట్టమంచి శిల్పసౌందర్యానికి ప్రతిబింబం. ఈ కథ జానపదకథే అయినప్పటికీ గొప్ప ఆధునిక కథాలక్షణాలున్నది. రాయలసీమలోని ప్రతిగ్రామం ఒక కథకు, నవలకు, కవితకు లేదా నాటకానికో వస్తువులుగా అందిస్తాయి. ఇందులోనూ కరువు వర్ణన, పేదల కష్టాలు కనబడతాయి. ఇందులో ..బీదసాదల నెల్ల నాదరించుచు గూడు/గడుపార బెట్టెడు కన్నతల్లి/ వ్యాధి బాధల నెవరైన నడల ఱెప్ప/ వేయక కాచెడు వినుత చరిత../తనవారు పెఱవారలను భేదమే లేదు/ హృదయమన్ననొ యప్పుడెత్తు వెన్న..’ అంటాడు. స్త్రీతన త్యాగబుద్దితో గ్రామాన్ని రక్షించిందనే విషయాన్ని మాత్రం తీసుకుంటే వొకస్త్రీలో గొప్ప త్యాగాన్ని ఆవిష్కరించాడు కట్టమంచి. కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరు జిల్లా కట్టమంచిలో జన్మించి కవిగా, సాహితీవేత్తగా రాజకీయవేత్తగా కీర్తిపొందారు. సీఆర్‌ రెడ్డిగా సుప్రసిద్దులు.

రాయలసీమ బతుకుచిత్రాన్ని ఆధునికసాహిత్యంలో ఇమిడ్చిన కవులు విద్వాన్‌ విశ్వం, కట్టమంచిరామలింగారెడ్డిలు. రాయలసీమ జీవితం ఆధారంగా వచ్చిన ఈ కావ్యాల పంక్తుల్ని, ఈ కవుల గూర్చి ఉటంకించకుండా రాయలసీమ సాహితీవేత్తలు ఉండలేరు. అందుకే ఆధునిక సాహిత్యంలో రాయలసీమ నుండే భావ విప్లవానికి పునాదులు అని చెప్పడం అతిశయోక్తి కాదు.

*

కెంగార మోహన్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ముసలమ్మ మరణం బాగుంది…అన్న అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు