https://www.newyorker.com/magazine/2012/05/21/the-proxy-marriage
కొన్ని కథల్లో ప్రస్తావించిన విషయాలని బట్టీ ప్రపంచంలోని విశేషాలని తెలుసుకునే అవకాశం పాఠకులకు కలుగుతుంది. ఇంతకుముందు పరిచయం చేసిన కాటిల్ ప్రెయిజ్ సాంగ్ కథవల్ల రోజూ ఆవుల మొదటి మూత్రానికి చిన్నపిల్లల కడుపులో వుండే పురుగులని హరాయించే శక్తి ఉన్నదని నమ్మి ఆఫ్రికాలోని ఒక తెగవారు దానిని పిల్లలచేత తాగిస్తారని తెలుసుకున్నాం. అలాగే, ‘చందమామ’ కథల్లో రాజకుమారుని స్థానంలో అతనికి బదులుగా అతని కత్తికి బాసికాన్ని కట్టి పెళ్లి జరిపారని చదివినా, పాత జానపద సినిమాల్లో అలా చూపినా అది నమ్మబుధ్ధి కాక దానిని కథగానే వదిలేసే అవకాశం ఎక్కువ. ప్రసిద్ధ మయిన పరోక్ష (ప్రాక్సీ) పెళ్లి 1810 లో నెపోలియన్ బోనపార్ట్, ఆర్ట్ డచెస్ మరీ లూయీస్ లకి జరిగిందని చరిత్రలో నమోదు అయింది గానీ ఆ విషయం ఈనాడు ఎంతమందికి తెలుసు? ఈనాడు కూడా భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటే నమ్మడానికి వెనుకాడ మేమో గానీ, ఇరవయ్యొకటవ శతాబ్దంలో, అందునా మానవుని పురోగమనానికి ప్రతీకగా ప్రథమ స్థానంలో ఉన్నదని అనుకునే అమెరికా దేశంలో వధూవరులు ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం లేకుండా వారి స్థానంలో వేరే ఇద్దరిని నిల్చోబెట్టి వాళ్లకు పెళ్లి జరిపించి, అది పరోక్షంగా ఉన్నవాళ్లకు జరిగిన పెళ్లేనని చట్టపూర్వకంగా నిర్ధారించడం సాధ్యం అంటే నమ్మగలమా?
“Proxy marriage Montana” అని గూగుల్ లో టైప్ చెయ్యండి. అమెరికాలో ఈనాడు కూడా అది నాలుగు రాష్ట్రాల్లో సాధ్యం – కొన్ని నిబంధనలతో – అని వస్తుంది. ఆ ఫలితాల ప్రకారం, పైన చెప్పిన పరోక్ష/ప్రాక్సీ పెళ్లిని రిజిస్టర్ చెయ్యాలంటే సాధారణంగా వాళ్లల్లో కనీసం ఒకళ్లయినా మిలిటరీలో పనిచేస్తుండాలి. ఈ పరోక్ష పెళ్లిళ్లకి ముఖ్య కారణం, డ్యూటీ వల్ల దేశం బయట ఉన్న మిలిటరీ వ్యక్తులకి ఒకవేళ తాము యుద్ధంలో చనిపోతే బెనిఫిట్స్ తమ తదనంతరం తాము ప్రేమించినవాళ్లకు చేరాలన్న కోరిక. దేశం బయట అడుగు పెట్టిన తరువాత తాము తండ్రులు కాబోతున్నామని తెలిసినప్పుడు కొందరు ఈ పెళ్లికి సిధ్ధమవుతారు. నాలుగు రాష్ట్రాల్లోనూ వరుడో, లేదా వధువో ఒకరికి మాత్రం ప్రాక్సీని నిల్చోబెట్టే ఆస్కారం ఉన్నది గానీ, ఇద్దరికీ ప్రాక్సీలని అనుమతించే అవకాశం ఒక్క మాంటేనా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రం ఉన్నది. మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ వరుడు గానీ లేదా వధువు గానీ మిలిటరీలో పనిచేస్తుండాలి అన్న నిబంధన ఉన్నది. మాంటేనాలోనే కొన్నిచోట్ల ఈ పరోక్ష పెళ్లికి మిలిటరీలో లేకపోయినా ఒకళ్లు ఆ రాష్ట్రంలో నివసిస్తూంటే చాలన్న సడలింపు కూడా ఉన్నది. వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. సాధారణంగా, అమెరికాలో ఎక్కడ పెళ్లి చేసుకున్నా మిగతా అన్ని రాష్ట్రాలూ ఆ పెళ్లిని గుర్తిస్తాయి గానీ ఈ పరోక్ష పెళ్లిని ఒక్క అయోవా రాష్ట్రం మాత్రం గుర్తించదు. ( గే, లెస్బియన్ పెళ్లిళ్లని కొన్ని రాష్ట్రాలు అనుమతిస్తున్నా వాటికి ఇంకా అన్ని రాష్ట్రాల్లోనూ గుర్తింపు ఇంకా రాలేదు. అది వేరే సంగతి.)
పరోక్ష పెళ్లిళ్లకి ఇంత ఉపోద్ఘాతం ఎందుకో ఈపాటికి అర్థమయే ఉండాలి. ఈ నెల పరిచయం చేస్తున్న కథ పేరే ది ప్రాక్సీ మారేజ్. ఈ కథకి ఆ పెళ్లి అవసరం చాలా ఉన్నది. ఇంకో విధంగా చెప్పాలంటే, ఆ పరోక్ష పెళ్లికి వెసులుబాటు లేనిదే ఈ కథ లేదు.
విలియమ్ జనాభా ఎక్కువగా లేని మాంటేనా రాష్ట్రంలో ఒక చిన్న ఊళ్లో హైస్కూల్ విద్యార్థి. పియానో వాయిస్తాడు. భౌతికశాస్త్రం అంటే ఇష్టం. భవిష్యత్తులో పియానిస్టు గానో లేదా భౌతికశాస్త్రజ్ఞుడి గానో స్థిరపడతా ననుకుంటాడు గానీ ఆ మారుమూల చోట ఆ రెండు వృత్తులూ ఉపాధిగా జీవిస్తున్నవా ళ్లెవరూ అతనికి తెలియదు. అతని ఫిజిక్స్ టీచర్ ముఖ్యంగా కుస్తీకి కోచ్. విలియమ్ది నలుగురితో కలిసిమెలసి తిరగే మనస్తత్వం కాదు గానీ మ్యూజిక్ లో ప్రవేశం స్కూల్లో వేసే మ్యూజికల్స్ లో అతనికి స్థానం కల్పించింది. అమ్మాయిలంటే విపరీతంగా సిగ్గుపడే అతనికి బ్రైడీ టేలర్ తో పరిచయం మాత్రం ఆ మ్యూజికల్స్ కోసం జరిపే రిహార్సల్స్ లేకపోతే అయేదే కాదు. విలియమ్ అమ్మాయిలకి దూరంగా ఉండడం అతని తల్లికి అతను గే అయ్యుంటా డన్న అనుమానాన్ని కూడా కలగజేసింది.
బ్రైడీ అంత అందమయినది కాదు గానీ నటి కావాలని ఆమెకు కోరిక. ఆమె తండ్రి లాయర్. ఆమెకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తల్లి ఆమెనీ, భర్తనీ విడిచి వెళ్లిపోయింది. బ్రైడీకి లెక్కలు కష్టతరమైన పాఠ్యాంశం. ఆమెకు మ్యూజికల్స్ ద్వారా విలియమ్ తో పరిచయం ఉన్నది గనుక అతని చేత లెక్కలు చెప్పించుకున్నది. ఆ సమయంలోనే ఆమె మీద విలియమ్ మక్కువ పెంచుకున్నాడు. అయితే స్వతహాగా సిగ్గుపడే వ్యక్తి గనుక ఆమెకి ఆ సంగతి చెప్పకపోవడమే గాక ఆమెని వేరెవరో డేట్ చేసినప్పుడల్లా బాధపడ్డాడే గానీ బయటపడలేదు. ఆ డేట్ చేసినవాళ్ల మీద ఆమె అంత ఆసక్తి చూపకపోవడం అతనికి ఆశని కలిగించి వింటర్ ఫార్మల్ డాన్స్‌కి పార్టనర్ గా ఉంటావా అని ఆమెని అడగడానికి అతను నోరు విప్పేటంతలో మాంటీ అన్న టెన్నిస్ ప్లేయర్ రిక్వెస్టుని ఆమె అంగీకరించిం దని చెబుతుంది. అవకాశాన్ని కోల్పోయినందుకు విలియమ్ విపరీతంగా బాధపడతాడు. అయితే, రెండు రోజుల తరువాత మాంటీ ఒక తప్పుచేస్తాడు. అది, బ్రైడీని తన తల్లిదండ్రుల ఇంట్లో కూర్చోబెట్టి తనకున్న మూడు ముఖ్యమయిన ఆశయాలని ఆమెకు తెల్పుతాడు. వాటిల్లో మొదటి రెండూ అప్పటికే నెరవేరాయి. మూడవదానికి – అదే, గర్ల్‌ఫ్రెండ్ స్థానానికి – ఆమె పర్ఫెక్ట్ అని అతను అనుకోవడం. ఆ విషయాన్ని విలియమ్ కి చెప్పి, “ఎంత నిజాయితీగా చెప్పాడో తెలుసా? వాడూ, వాడి ఆశయాలూ!” అంటూ పకపకా నవ్వింది.
అప్పుడు విలియమ్ నిర్ణయించుకున్నాడు ఆమెకు మనసు విప్పి చెప్పకూడదని! తరువాత ఒకసారి బ్రైడీ తండ్రి అతని వైపు ప్రశ్నార్థకంగా కూడా చూశాడు కూడా – ఇంకా అడగవే మన్నట్టు. కానీ, మనసు విప్పితే మాంటీ అంత నిజాయితీగా కాకుండా ఇంక ఎలా చెప్పగలడు అని ఆలోచించి విలియమ్ తల అడ్డంగా ఊపాడు.
వాళ్లు హైస్కూల్లో చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు 2001 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబింగ్ అయిన తరువాత అమెరికా నవంబర్‌లో ట్రూప్స్ ని ఆఫ్ఘనిస్తాన్ పంపింది. డిసెంబర్ నెలలో అక్కడికి వెళ్లిన ఒక మెరైన్ కార్పొరల్ కోరిక మీద అతనికీ, వెనక ఉండిపోయిన గర్భవతి అయిన అతని కాబోయే వధువుకీ పెళ్లికోసం వాళ్లు బ్రైడీ తండ్రిని ఆశ్రయించారు. ఆ కాబోయే తండ్రికి విపత్తు సంభవిస్తే అతని పేరుని ఆ పుట్టబోయే సంతానానికి చట్టప్రకారం పెట్టడం కోసం, అలాగే మిలిటరీ బెనిఫిట్స్ ఆ తల్లీబిడ్డలకి సంక్రమించేలా చూడడం కోసం ఆ పెళ్లి. మెరైన్ కార్పొరల్ ఆఫ్ఘనిస్తాన్‌లో, తల్లి నార్త్ కెరొలైనా రాష్ట్రంలో. ఆ పెళ్లికి కోసం బ్రైడీ తండ్రి ఆమెనీ, విలియమ్ నీ ప్రాక్సీలుగా ఆ వధువు, వరుడుల స్థానాల్లో ఉండమని కోరాడు. దేశంకోసం ప్రాణాలని ఇవ్వడానికి సిద్ధపడ్డ జవాన్లకోసం మనం ఆమాత్రం చెయ్యాలి అని విలియమ్ తల్లి అతణ్ణి ప్రోత్సహించింది. విలియమ్ మాత్రం, అబద్ధం పెళ్లయినా బ్రైడీతో జరిగినందుకు ఎనలేని ఆనందాన్ని పొందాడు. అది పరోక్ష పెళ్లి అయినా గానీ, అతనితో బాటు ఆమె కూడా “ఐ డూ!” అనడం దానికి కారణం. ఆ తరువాత పై చదువులకి ఆమె షికాగోకీ, అతను ఒహాయో రాష్ట్రానికి వెళ్లే ముందర అలాంటి అరడజను పెళ్లిళ్లల్లో పాల్గొన్నారు. కాలేజీ సెలవలకు ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాంటి పెళ్లిళ్లల్లో పాల్గొన్నారు.
కాలచక్రం తిరుగుతూనే ఉన్నది. ఇద్దరికీ వాళ్లు చదువుతున్న కాలేజీల్లో లవ్ లైఫ్ ఉన్నాగానీ విలియమ్ ఆమెని మరచిపోలేదు. పార్ట్నర్స్ ఉన్నా గానీ ఎవరూ అతణ్ణి ఆకట్టుకోలేదు. స్టేజీ మీద పాత్రలకోసం ప్రయత్నించడానికి ఆమె న్యూయార్క్ వెడితే అతను పైచదువులకోసం ఒహాయో పక్కనున్న ఇండియానా రాష్ట్రానికి వెళ్లాడు. బ్రైడీ వివరాలు అతనికి తల్లిద్వారా తెలుస్తున్నాయి. ఆమెకి పెళ్లయిందనీ తరువాత విడాకులు తీసుకున్నదనీ, కొన్నాళ్లకి తిరిగి పుట్టి పెరిగిన ఊరికి చేరుకుందని కూడా. తల్లి దగ్గరకు వచ్చినప్పుడు మళ్లీ బ్రైడీతో పరోక్ష పెళ్లి అతన్ని వెదుక్కుంటూ వచ్చింది. అతను తన మనుసుని ఆమె ముందర ఎప్పుడయినా విప్పుతాడా?
ఈ కథ మూడు అంశాల మేలు కలగలపు. అవి, చిన్న ఊళ్లో కలిసి పెరిగిన హైస్కూల్ సహాధ్యాయుల ఆశయాలు, వాళ్ల మధ్య (వన్ వే అయినా గానీ) ప్రేమ, 9/11 దాడి తరువాత యుద్ధానికి పంపబడ్డ సైనికుల కుటుంబాల మీద ఆ యుద్ధం ప్రభావం, దేశంలో చాలా పరిమితంగా నయినా అలాంటి సైనికుల వ్యక్తిగత కోరికలని తీర్చగలిగే వెసులుబాటు. 9/11 అంశంగా కథలు వచ్చివుండవచ్చు గానీ అది ప్రముఖంగా కాకుండా బాక్‌గ్రవుండ్‌లో ఉండడం ఈ కథలో నాకు నచ్చింది. ప్రపంచదేశాల నించీ అమెరికాకి వలస వచ్చి కాస్మోపాలిటన్ నగరాల్లో స్థిరపడి అదే అమెరికా అనుకునేవాళ్లకి చిన్న ఊళ్లల్లో నివసించే మనుషుల మధ్య డైనమిక్స్ తెలుసుకోవడానికి ఈ కథ కొంతయినా ఉపకరిస్తుంది. పిట్టకథగా, కాలేజీ చదువు చదివి న్యూయార్క్ లో నటిగా చేరడానికి ప్రయత్నించి చివరికి పెరిగిన ఊళ్లోనే వైట్రెస్ గా పనిచెయ్యడానికి బ్రైడీ చేరితే ఆమెకు ‘పెద్ద తార అవుదా మనుకున్నావు, మళ్లీ ఇక్కడ!’ అంటూ ఆ ఊళ్లోవాళ్ల వెక్కిరింపు! ఆ వాక్యం, ఎదుటివాళ్లని కాకుల్లాగా పొడవడానికి తయారయే మానవస్వభావం ఇండియాలోనూ, ఎంతో ముందంజ వేసివున్న దనుకునే అమెరికాలోనూ కూడా ఒకటే నని తెలుపుతుంది.
ఈ కథని రికమెండ్ చేసిన ప్రవేష్ భరద్వాజ్ (Mr. Singh Mrs. Mehta సినిమా దర్శకుడు), దీన్ని సినిమాగా తియ్యలేదంటే ఆశ్చర్యంగా ఉన్నదన్నాడు. చదివిన తరువాత, ‘కదా!’ అని తప్పకుండా అనిపిస్తుంది.
ఏళ్లపాటు ప్రేమిస్తూ దూరంగా ఉండిపోయిన అతని మనఃస్థితిని అర్థం చేసుకోవడానికి కుర్రాడి తరఫునించీ రాసిన ఈ కథని చదవాలి. అలాగే, మూగప్రేమలు “జాను” సినిమాలోనే గాక అమెరికాలో కూడా ఉంటాయని తెలుసుకోవడానికి కూడా. ఇది చదివిన తరువాత పాఠకుల మదిలో తలెత్తే ప్రశ్న జాను సినిమా చూసిన ప్రేక్షకులలో కలిగేలాంటిదే: ఇది పూర్తి కల్పనేనా లేదా నిజజీవితంలోని పాత్రల ఆధారంగానా?
ప్రాక్సీ అన్న పదానికీ, పరోక్ష అన్న పదానికీ అర్థం దాదాపు ఒకటే కావడంవల్ల వాటి మధ్య లంకె ఉండే ఉంటుంది, ఒకటే మూలం ఉండి ఉండాలి అని నమ్మినా గానీ నా పరిశోధనలో అలాంటి జాడలు ఎక్కడా తగల్లేదు. అర్థమూ, దాదాపు అన్ని హల్లులూ కుదిరి కూడా లంకె లేకపోవడం నాకు ఆశ్చర్యకరం.
కొసమెరుపు –
ప్రపంచం అంతా కోవిడ్-19 వల్ల లాక్‌డవున్‌లో ఉన్న సందర్భంలో ఇండియన్ల పెళ్లి విడియో ఒకటి వాట్సాప్ లో చూశాను. వరుడొక చోట, వధువొక చోట. ఫోన్లో వధువు కనిపిస్తోంది. వరుడు ఆ ఫోన్ కు తాళి కట్టాడు. వధువు తోడుగా ఉన్న ఒకామె తాళి ముడులు వెయ్యడం ఆ విడియోలో కనిపించింది. పరోక్ష పెళ్లి సామాన్యులని చేరింది!
రచయిత్రి పరిచయం:
మైలీ మెలాయ్ ఇప్పటిదాకా మూడు నవలలనీ, రెండు కథాసంకలనాలనీ వెలువరించారు. ఆమె కథలు ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ప్రాక్సీ మారేజ్ తో కలిపి ఏడు కథలు ఒక్క న్యూ యార్కర్ పత్రికలోనే వెలువడ్డాయి. 2012లో యువతకోసం ఆమె రాసిన “అపోథెకరీ”తో మొదలయిన మూడుభాగాల పుస్తకం E.B. White పురస్కారాన్ని పొందింది. ఆమె వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
కత్తికి పెళ్లి చేయడం అనేది రాజులలో ఇంకా ఉంది; కనీసం నేను దేశం వదిలేనాటికి.