“కూరగాయల యూసుఫ్ పెద్దబిడ్డె లేశిపోయిందట. కాలేజ్‌ల సదివే తోటి పోరని ఎంబట పోయిందట” ఈ మాట వాడకట్టులో అందరికీ తెలిసిపోయింది.
అందరూ ఈ విషయమై గుసగుసలాడుకుంటున్నారు.
“నా కొడుకుకు అడుగుంటి ఆ పొల్లను. మాకు ఇల్లు జాగ వాళ్లంత లేదని ఇయ్యనన్నడు యూసుఫ్. మల్ల సయ్యదుల పొల్ల లద్దాఫ్‌ల వాకిలి ఊడవద్దని కథలు జెప్పిండు. ఇప్పుడు మంచిగుందా. ఏరే మతం పోరగాని ఎంబటవాయె” అంటూ ఉడుక్కుంటున్నాడు పక్కింట్లో ఉండే యూసుఫ్ దోస్తు వహీద్.
ఆయన మాటలు వింటూ చేటలో బియ్యం చెరుగుతోంది సుమేరా. మళ్లీ తనే అందుకుంటూ “దోస్తానా కాడ రాని కులం పెండ్లి కాడ వచ్చిపడ్డది. నా కొడుకుకు ఏం తక్కవోయింది. పిల్ల ముడితే మాశిపోయేటట్టు బొమ్మ లెక్కట ఉందని, మీదికెల్లి దోస్తే గదాని నోరు ఇడిశి అడిగినందుకు నా మాట ఖాళిజేశిండు” రుసరుసలాడుతున్న భర్త మాటలకు అడ్డుపడుతూ “ఏ ఊకో నువ్వు. ఇంట్లకెల్లి కాలు బయటవెట్టని పిల్ల పోయింది. పాపం యూసుఫ్ అన్న, మాలన్ వదిన ఎంత బాధవడుతున్నరో. ఆ పిల్లకు అట్ల రాసిపెట్టి ఉండచ్చు గనీ.. లోకం ఎన్ని మాటలు అంటదో గదా” దిగులు వ్యక్తంచేసింది సుమేరా.
* * *
యూసుఫ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. ఇద్దరు అమ్మాయిలే పెద్దవారు.
పెద్దమ్మాయి జబీన్ చాంద్ కా నూర్ లా అందంగా ఉంటుంది.
కూరగాయలు విక్రయిస్తూ భార్యాబిడ్డలను, తల్లిని పోషించుకుంటున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, వాళ్ల చిన్నప్పటినుంచే ఇద్దరి పేర్ల మీద పోస్టాఫీసులో నెలనెలా డబ్బులు పొదుపు చేస్తున్నాడు.
కొడుకు విషయంలో ఏ రంది పెట్టుకోలేదు. జబీన్‌కు మెడిసిన్ చదివి డాక్టర్ అవాలని కోరిక. కానీ అన్నన్ని ఫీజులు, డొనేషన్లు కట్టి డాక్టర్ చదివించలేనని ఖరాఖండిగా చెప్పాడు యూసుఫ్.
“మన ఆడివిల్లలు బుర్కలనే ఉంటే శింగారం. నువ్వు డాక్టర్ అయి ఎవర్ని ఉద్దార్కం జేశేదుంది చెప్పు. సప్పుడుదాక మంచి సంబంధం సూశి ఎత్తిస్తం అటు. మొగోడు, పిల్లలు, సంసారం, ఇంత ఇబాదత్.. ఆడిదాని బతుకుకు ఇంతకన్న ఎక్క ఏం గావాలె. మీ అమ్మ జేస్తలేదా సంసారం” సాధారణంగా చాలా ముస్లిం కుటుంబాల్లో మాట్లాడే పురుషాధిక్య మాటలే తన తండ్రి నుంచి విన్న జబీన్ చాలా బాధపడింది.
తెల్లకోటు వేసుకోవాలన్న తన కలను తన గరీబు తండ్రి తీర్చలేడని లోలోన కుమిలిపోయింది.
ఈ క్రమంలో తన పదవ తరగతి చదువు ముగించింది జబీన్. ఇంటర్ మీడియట్ చదవాలంటే తాలుకా ఎల్లారెడ్డికి బస్సులో వెళ్లాలి. 20 కిలోమీటర్ల ప్రయాణం.
టెన్త్‌లో మంచి ఉత్తీర్ణతతో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది.
స్కూల్ టీచర్లు ఇంటి దాకా వచ్చి “పాప చదువులో చాలా షార్ప్. ఇక్కడితో ఆపకుండా పై చదువులు చదివించండి. ఉన్నత స్థాయికి ఎదుగుతుంది” అని చెప్పి వెళ్లారు. హైదరాబాద్ నుంచి నారాయణ, చైతన్య వంటి విద్యాసంస్థలు జబీన్‌ను తమ సంస్థలో జాయిన్ చేయమని పోరుతున్నాయి.
కానీ, యూసుఫ్ తన కూతురికి ఉన్నత చదువులొద్దు ఏమొద్దు అని ఖరాఖండిగా చెప్పేశాడు.
రెండేళ్లలో పెళ్లి కూడా చేస్తానన్నాడు. ఆ మాట విని జబీన్ చాలా బాధపడింది. ఎన్నో రోజులు అలిగింది, అన్నం మానేసింది. నానమ్మ అమీనమ్మ మధ్యవర్తిత్వం తీసుకుని కొడుకుకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.
“అరేయ్ యూసుఫూ, సదువు నీకు అబ్బకపాయే. నీ కడుపుల పుట్టినదానికి అబ్బుతున్నది. మన వంశంల అదొక్కతన్న సదవనీరా, తండ్రిగ నీ పేరు నిలవెడ్తది” అంటున్న అమ్మ వైపు మిర్రున చూస్తూ “నీకేం తెల్వదమ్మా ఊకో. అది సదివి నన్ను నడిపేదుందా? చేసుకున్న మొగోన్ని నడిపేదుందా? ఏమద్దు ఇంట్లనే ఉండి కుట్టు మిషను నేర్సుకుంటది. రెండేండ్లు అయినంక అటు ఎత్తిస్తే నాకో బరువు దిగిపోతది” అన్నాడు యూసుఫ్.
ఆ మాటకు అమీనమ్మ ఉడుక్కుంది. “నీ రోకి నీకేనారా? పోరల మనసుతోని అవుసరం లేదా నీకు” అంటున్న అత్త మాటకు సపోర్ట్ చేస్తూ మాలన్ అందుకుంది.
“అమ్మీ అంటున్నది నిజమే. మనిష్టం ఉన్నట్టు పిల్లలను అణగదొక్కద్దు. వాళ్లకు ఇష్టమైనట్టు ఎదగనియ్యాలె” అంది. “ఇష్టమున్నట్టు బతకమని మన దీన్ చెప్తలేదు. అల్లా, రసూల్ సూపిచ్చిన తొవ్వల నడవాలె. ఇగో సూడు మాలన్ ఇయ్యాల్లరేపు దినాలు మంచిగలేవు. లవ్వులు గివ్వులు అంటున్నరు” అంటూ ఆగిపోయి కూతురు తన మాటలు వింటుందేమోనని అటుఇటు చూస్తున్నాడు.
అక్కడ జబీన్ లేదుగానీ లోపలి గదిలో కూర్చుని తమ్ముణ్ణి, చెల్లిని చెరో పక్క కూర్చుండబెట్టుకుని కన్నీళ్లు కారుస్తోంది.
“పప్పా తన కలను చిదిమేస్తడు” అనుకుని లోలోన కుమిలిపోతోంది.
“అవన్నీ నాకు తెల్వదిర. చిన్న వయసుల నేను డాక్టర్‌ను అయి పది మంది పానాలు కాపాడుతా అనే పెద్ద మాట జెప్పింది. ఆ మాటతోని అది ఖచ్చితంగా డాక్టర్ అయితదనే అనిపిస్తున్నది. నువ్వు ఏమన్న అనుకో. నాకు నా మన్మరాలు మీద సత ఉన్నది గావట్టి నేను నా మన్మరాలును కాలేజుకు పంపిస్తున్న అంతే” మొండిగా అంది అమీనమ్మ.
అమ్మ మాట వినగానే యూసుఫ్‌కు మండిపోయింది. అక్కడున్న నీళ్ల బిందెను కాలితో తంతూ లేచి పెద్దగా అరుస్తున్నాడు. “అంత మీ ఇష్టమున్నట్టే చేసుకునంగ ఇగ ఇంట్ల నేనెందుకు?” అంటూ బయటకు వెళ్తున్న కొడుకును చూస్తూ తానేం తక్కువ తినలేదన్నట్టు అమీనమ్మ మరింత ఆవేశంగా లేచింది.
“నా కడుపుల పుట్టిన నీకే గింత రేషం ఉంటే నాకెంత ఉండాల్రా? అమ్మ మాటకు ఇలువ లేని ఇంట్ల నేనెందుకు ఉండాలె?” అంటూ తన సంచిలో బట్టలు సర్దుతోంది.
అమ్మ కోపం గురించి తెలిసిన యూసుఫ్ శాంతించాడు. కాలు బయటపడుతుండగా లోపలికి అనుకుని ఆగిపోయాడు.
వారం రోజులు ఇంట్లో మౌనం రాజ్యమేలింది.
యూసుఫ్ బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. “సరే అమ్మీ నీ మన్మరాలును కాలేజుకు పంపుకో. రెండేండ్లు అయినంక నేను సంబంధాలు సూసుడు, నిఖా సదివిచ్చుడు ఖాయం. ఇంకో మాట ఏందంటే ఫీజులు కట్టి ప్రైవేట్ కాలేజీకి పంపుడు నాతోని గాదు. సర్కార్ కాలేజికే పంపుకోర్రి” అన్నాడు.
ఆ మాట వినగానే అందరి ముఖాల్లో వెలుగు.
అలా జబీన్ తన పంతాన్ని నెగ్గించుకుని కాలేజీకి వెళ్తోంది. బీపీసీ గ్రూప్ తీసుకుంది. బస్ పాస్ తీసుకుని నిత్యం బస్సులో ఎల్లారెడ్డికి వెళుతోంది.
ఇంటర్ తర్వాత పప్పా మనసు మారి పై చదువులకు పంపొచ్చు అనుకుంది. రోజూ బుర్ఖా వేసుకుని, టిఫిన్ బాక్స్ తీసుకుని కాలేజీకి వెళ్లేది. బుర్ఖాలో నల్లని కాటుక పెట్టుకున్న కళ్లు మాత్రమే కనిపేంచివి.
చేపల్లాంటి ఆ కళ్లను చూసి వెంకీ ఫిదా అయ్యాడు.
తాండూరు గేటు నుంచి బస్సు ఎక్కి జబీన్ కళ్లనే చూసేవాడు. అతనూ అదే కాలేజ్, కానీ గ్రూప్ వేరు. సెకెండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ క్లాసులో జబీన్‌ను చుసే అవకాశం లభించేది తనకు. లీజర్ పీరియడ్స్‌లో జబీన్ అమ్మాయిల్లో ఎక్కడుందా అని అతని కళ్లు వెతికేవి.
అలా కొంతకాలం జబీన్‌కు తెలియకుండా బాగా ఫాలో అయ్యాడు.
ఓరోజు జబీన్‌తో మాట కలిపాడు. వెంకీ కూడా చదువులో క్లెవర్. జబీన్ కూడా చదువులో తనకు సాయపడతాడని అతనితో స్నేహంగా ఉండసాగింది.
అయితే వెంకీకి మాత్రం ఆమె మీద ప్రేమ మొదలైంది. క్లాసులో ముఖం మీద బుర్ఖా తొలగించినప్పుడు తెల్లని పాలుగారే ఆమె చెక్కిళ్లను చూసి ఫ్లాట్ అయిపోయాడు.
చంద్రబింబం లాంటి ఆమె మోమును తన గుండెల్లో ముద్రించుకున్నాడు.
వన్‌సైడ్ లవ్ చేస్తున్నాడు.
తనతో చాలా సన్నిహితంగా ఉంటున్న జబీన్‌కు తన లవ్ గురించి చెబితే యాక్సెప్ట్ చేయదని ఆందోళన చెందాడు.
అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకెండ్ ఇయర్‌కు వచ్చాక ఓరోజు ధైర్యం చేసి జబీన్‌కు తన లవ్ గురించి చెప్పాడు. అప్పుడు జబీన్ చల్లగా తిరస్కరించింది. “మా పప్పా ఏదైతే అనుమానంతో నన్ను కాలేజికి పంపియ్యా అన్నడో దాన్ని నేను నిజం చెయ్య. నేను డాక్టర్ అవుడు నా లైఫ్ ఆంబిషన్. ఎంతో కష్టపడి ఫస్ట్ స్టెప్ ఏశిన. ఇది రాంగ్ అయితే నేను మా పప్పా ముంగట ఎల్లకాలం దోషిని అయిత. ప్లీజ్ వెంకీ నన్ను అర్థం చేస్కో. మనం మంచి దోస్తులుగానే ఉండిపోదాం” జబీన్ మాటలకు నొచ్చుకున్న వెంకీ, తర్వాత బాగా ఆలోచించి ఆమె నిర్ణయానికి ఓకే అన్నాడు.
ఇద్దరూ మళ్లీ ఎప్పటిలానే క్యాజువల్‌గా ఉంటున్నారు. అలా ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు కూడా రాశారు.
యూసుఫ్ అన్నట్టుగానే తన కూతురికి గొప్పింటి సంబంధం తీసుకొచ్చాడు. హైదరాబాద్‌లో రాజమహాల్ లాంటి ఇల్లు ఉంది.
ఆ వార్త వినగానే జబీన్ మనసు పగిలింది. పప్పా అన్నంత పనే చేస్తున్నాడని తెగ హైరానా పడింది. అమీనమ్మ కూడా ఏమీ అనలేకపోతోంది.
పెద్దింటి సంబంధం అని మిన్నకుండి పోయింది. పిల్లను చూసి వారు మెచ్చారు. కట్నకానుకలు తీసుకోవడం హరామ్ అని దాని ఊసే వద్దన్నారు. పైపెచ్చు ఎదురు కట్నం ఇచ్చి నిఖా చేసుకుంటాం అన్నారు. ఇరవై తులాల బంగారం పిల్ల మెడలో వేస్తాం అన్నారు. పెళ్లి ఖర్చులన్నీ తమవే అన్నారు. వాళ్ల వ్యాపారాలన్నీ దుబాయ్‌లో ఉండటంతో అందరూ అక్కడే సెటిల్ అయ్యారు. పెళ్లి అయ్యాక జబీన్‌ను అక్కడికే తీసుకెళ్తాం అన్నారు.
ఆమాట వినగానే తొలుత సంశయించిన యూసుఫ్ దంపతులు కూతురు గొప్పింట్లో పడుతోంది కదా అని ఈ పెళ్లికి ఒప్పుకున్నారు.
ఇరవై తులాల బంగారం తన కూతురి మెడలో చూస్తాననే సంబరంలో మాలన్ కూడా అటువైపే మొగ్గుచూపింది. పైగా అబ్బాయి ఏజు కూడా పెద్దదే. ఇంతకుముందు ఓ పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. భార్య అనారోగ్యంతో చనిపోవడంతో రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. అన్నీ తెలిసి కూడా యూసుఫ్ పైసా ముందు అవన్నీ అతిచిన్న సమస్యలుగా భావించాడు.
ఇవన్నీ విన్నాక జబీన్ మనసు కకావికలం అవసాగింది.
పెళ్లి, దుబాయ్ అనే మాటల ముందు తన డాక్టర్ కల ధ్వంసం అవుతున్నట్టుగానే అనిపించసాగింది. పిల్ల నచ్చడంతో తన అభిప్రాయంతో ఆస్కారం లేకుండా పెద్దవాళ్లు.. పెద్దవాళ్లు అన్నీ మాట్లాడుకోవడం, సంబంధం ఖాయం చేసుకోవడం జరిగిపోయాయి. ఆ వెంటనే స్వీట్లు తిని నోరు తీపి చేసుకుంటున్నారు.
మనవరాలితో పాటు అమీనమ్మకు కూడా ఈ సంబంధం ససేమిరా ఇష్టంలేదు. హాలులో కూర్చుని వారంతా మాట్లాడుతుంటే జబీన్, అమీనమ్మ లోపలి గదిలో కూర్చుని ఉత్కంఠగా వింటున్నారు.
వచ్చే నెలే నిఖా చేసుకుని వారం తర్వాత దుబాయ్ వెళ్లిపోవాలని వాళ్లు అనడం, యూసుఫ్ ఒప్పుకోవడం జరిగిపోయాయి. అతన్ని పెళ్లి చేసుకుంటే బంగారు పంజరంలో చిలుకను అయిపోతానని జబీన్ మనసు మ్లానమైంది.
తన ఆశయం కళ్ల ముందు తునాతునకలు అయినట్టు అనిపించింది. ఇంటర్‌తో తన చదువు శాశ్వతంగా ఆగిపోతుందని తెగ హైరానా పడుతోంది. తరతరాలుగా స్త్రీ ఏ స్వేచ్ఛ లేకుండా మగాడి చేతికింద బానిసలా బతకాల్సిందేనా? తనకంటూ ఓ వ్యక్తిత్వం, అస్తిత్వం, స్థిరత్వం ఇవేవీ లేకుండా బానిస బతుకు బతకాల్సిందేనా? జబీన్‌లో సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు??
ఈ క్రమంలో వెంకీ తన లక్ష్య పాదులకు నీళ్లు పోసి పచ్చని చిగుర్లు పూయిస్తానన్నాడు.
తనను డాక్టర్ చేస్తానని వాగ్దానం చేశాడు. వెంకీ ఇచ్చిన భరోసా జబీన్‌లో భవిష్యత్తు మీద నమ్మకాన్ని పెంచాయి.
జబీన్ రాత్రంతా బాగా ఆలోచించింది. వెంకీతో వెళ్లడమే కరెక్టుగా భావించింది. ఉత్తరం రాసిపెట్టి ఆరోజు రాత్రి వెంకీ చేయి పట్టుకుని వేములవాడకు వెళ్లింది.
వేములవాడ రాజన్న సన్నిధిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. “ఎంతపని చేసింది పిల్ల. తండ్రి పరువంత తీసింది” అని ఇరుగుపొరుగు వారు మాట్లాడుకుంటున్నారు. “తండ్రి ఎసుంటోడో పిల్లలు అసుంటోళ్లే” అని మరికొందరు యూసుఫ్ ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్‌ను గుర్తు చేస్తున్నారు.
* * *
“మనమరాలును నీ లాడుతోని కరాబ్ జేశినవు. ఇప్పుడు మంచిగుందా అమ్మీ? ఆడివిల్లకు సదువద్దు గిదువద్దు అంటే ఇన్నవా? అదేదో తెల్వక డాక్టర్ అయితా అంటే నువ్వు ఎనకేసుకస్తివి” ఉడుక్కుంటూ అన్నాడు యూసుఫ్.
కొడుకు మాటలకు అమీనమ్మ కళ్లలోంచి టపటపా కన్నీళ్లు నేల రాలుతున్నాయి. మనవరాలు ఇలాంటి పని చేస్తుందని అమీనమ్మ కూడా ఊహించలేకపోయింది. ఈ వారం రోజులుగా యూసుఫ్ కూరగాయల షాపుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.
కూతురు తన పరువు బజారుకీడ్చిందని కుమిలిపోతున్నాడు. బయటకు వెళ్తే ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని ముఖం చాటేస్తున్నాడు.
మాలన్, అమీనమ్మలు దొంగచాటుగా వెంకీ నంబర్ కనుక్కుని ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వస్తోంది. చిన్నమ్మాయి సఫా, జుబేర్‌లు తమ అక్కను వెంకీ అనేవాడు తీసుకెళ్లాడనే కోపంలో ఉన్నారు. ఇంట్లో విచారం తిష్ఠ వేసినట్టుగా ఉంది.
అమీనమ్మకు మనసునబట్టడం లేదు. ఇంట్లోంచి ఈ మౌనాన్ని బయటకు తోసెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుంది. కోడలిని దగ్గరికి పిలిచి ఏదో మాట్లాడింది. కొడుకు కంట కనిపించకుండా బుర్ఖా వేసుకుని బయలుదేరింది.
* * *
బస్సు ఎక్కి తాండూర్‌లో దిగింది. వాళ్లను వీళ్లను అడుగుతూ నేరుగా వెంకీ వాళ్ల ఇంటికి వెళ్లింది. అమీనమ్మను చూడగానే వెంకీ ఆనందంగా వెళ్లి ఆమె కాళ్లకు నమస్కరించాడు.
నానమ్మను చూడగానే వాకిట్లోకి పరుగున వచ్చి గట్టిగా అలుముకుని వెక్కసాగింది జబీన్. మనవరాలిని చూడగానే అమీనమ్మ కూడా ఏడ్చేస్తోంది.
వెంకీ అమ్మానాన్నలు వచ్చి చెరో వైపు నుంచి ఓదార్చుతున్నారు. “నన్ను క్షమించు దాదీ” అంది జబీన్. “నేను మాఫ్ జేసుడు ఏమోగనీ మీ నాయినైతే దండి కోపాన ఉన్నడు నీమీద” అమీనమ్మ మాటకు మరింత నొచ్చుకుంది జబీన్.
ఇంతలో వెంకీ అమ్మానాన్నలు అమీనమ్మకు మర్యాదలు చేసే ఏర్పాట్లలో పడ్డారు. చికెన్ తెచ్చి వండుతున్నారు.
వంట అయ్యాక అందరూ కూర్చుని భోజనాలు చేశారు. అమీనమ్మకు అందరూ కొసరి కొసరి వడ్డిస్తుంటే తినలేకపోయింది. తింటున్నప్పుడు జబీన్‌ను ఓ కంట కనిపెడుతోంది అమీనమ్మ. నుదుటన బొట్టు, మెడలో పుస్తెలతాడు వంటివి ఏవీ లేవు. మెడలో నల్లపూసలు మాత్రమే ఉండి ముస్లిం అమ్మాయిలానే ఉంది. అవతారం మార్చుకుని ఎదురు పడుతుందనుకుంటే అలాంటివి ఏమీలేవు. అర్థంకాలేదామెకు? లోలోన మథనపడసాగింది.
అందరూ వరండాలో కూర్చున్నారు. “వీడు ఇసుంటి పని జేస్తడని నేను అనుకోలే శిన్నీ. కనీ వాణ్ని ఇష్టవడి వచ్చిన ఆడివిల్లను నూకిపెట్టలేను గదా. వానికి అట్ల రాశిపెట్టి ఉండచ్చు అనుకున్నం. ఈలోకం ఊకుంటదా శిన్నీ. సాహెబుల పిల్లను తెచ్చుకున్నడు అని పొడుపు మాటలు మాట్లాడుతున్నరు” విస్తుపోతూ అంది వెంకీ వాళ్లమ్మ రాజవ్వ.
“అవును బిడ్డా.. ఈ లోకంతోనే ఉన్నది అసలు బాధంత. వాళ్లకు అన్నీ పట్టీసే. నేను గూడ అంతే అనుకుంటున్న.. దాని నొష్టరాత అట్ల రాసిపెట్టి ఉంది అంతే అనుకుంటున్న. మావోడే జర గరం మీద ఉన్నడు” అంది అమీనమ్మ. “ఇంత పెద్ద బిడ్డె వోయినంక ఉండదా బాధ. అన్న కోపం వాజీబే” రాజవ్వ అంది.
వెంకీ అందుకుంటూ “సూడమ్మా.. నీ మన్మరాలును మీరెట్ల సూసుకున్నరో నేనూ అట్లనే సూసుకుంట. ఆమెను డాక్టర్‌ను చేశేదాక నేను నిద్రవోను. నేను తనను డాక్టర్‌ను జేస్తనంటెనే నా ఎంటచ్చింది నీ మన్మరాలు” అంటున్న వెంకీ వైపు చూసింది అమీనమ్మ.
మళ్లీ వెంకీయే అందుకుంటూ “అందరు జేశినట్టు నేను నీ మన్మరాలు పేరు మార్సుడు, మతం మార్సుడు చెయ్య. బొట్టు వెట్టుకోమని గూడ చెప్ప. ఈడినుంచి మా ఇంట్ల రంజాన్, బక్రీద్ పండుగులు గూడ అయితయి. తన ఇష్టమచ్చినట్టు ఉండనీ ఈ ఇంట్ల. నమాజులు సదువుకున్నా, బుర్ఖా ఏసుకున్నా తనిష్టం అంతే. జబీన్ డాక్టర్ అయినంకనే మా నిజమైన పెండ్లి అయినట్టు, పిల్లల ప్లానింగ్ గూడ అప్పుడే నాయినమ్మ” నింపాదిగా అన్నాడు వెంకీ.
వయసులో ఎంతో చిన్నవాడైనా ఆలోచనల్లో ఎంతో పరిణతి చెందాడనిపించింది.
అతను చెప్పిందంతా విని అమీనమ్మ మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోయాయి. తన మన్మరాలుకు కరక్టు మొగుడు దొరికిండు అనుకుంది.
భారంగా ఉన్న మనసు దూదిపింజలా మారిపోయింది.
వెంకీ వైపు, అతని అమ్మానాన్నల వైపు మురిపెంగా చూస్తూ రెండు చేతులెత్తి నమస్కరించింది. ఆ చర్యను అడ్డుకుంటూ ఆమె చేతులు పట్టుకుని “ఏంది అత్తమ్మా.. పెద్దదానివి నువ్వు మాకు దండం పెట్టొచ్చా ఇట్ల. ఊకో.. ఇయాలటి సంది మీ పిల్ల మా పిల్ల. మంచిగ సూసుకుంటం. నాకు శాతనైతలేదని వాడు సదువు మానుకొని వ్యవుసం జేస్తా అంటున్నడు. ఐదెకరాల భూమి ఉన్నది. కష్టపడి మా కోడలును వాడు డాక్టర్‌ను జేశినంక గీ బయట ఒర్రేటోళ్ల పనిచెప్త” అంటూ ఆమె రెండు చేతులను పట్టుకున్నాడు వెంకీ వాళ్ల నాన్న గోపాల్.
అతని మాటలకు అమీనమ్మ మనసు మరింత ప్రశాంతంగా మారింది. “నా మనమరాలు పడాల్సిన ఇంట్లనే పడ్డది. జబీన్ డాక్టర్ అవుడు ఖాయమే. వీళ్లంతా మంచి మనసున్న మనుషులు” అని లోలోన తెగ సంబర పడింది అమీనమ్మ. రెండు రోజులు అక్కడే ఉండిపోయింది.
తన మనవరాలి మీద వారంతా చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయింది. ఈ క్రమంలో ఎయిమ్స్‌లో సీటు కోసం ఎంసెట్‌కు ప్రిపేర్ అవుతోంది జబీన్. చదువు పట్ల జబీన్‌కు ఉన్న ఇంట్రస్టును చూసి మరింత పొంగిపోయింది అమీనమ్మ. రెండు రోజులు గడిచిపోయినా ఇంకా అక్కడినుంచి కదలాలి అనిపించలేదు. తప్పదన్నట్టు కదిలింది.
ఇంట్లో వాళ్లంతా ఇంకో రెండు రోజులు ఉండమని పోరుతున్నారు.
అక్కడ యూసుఫ్‌కు తన కోడలు ఏం చెప్పిందోనని మనసులో గాబరా పెట్టుకుని అక్కడినుంచి బయలుదేరింది.
* * *
అమ్మ ఎక్కడికి పోయిందని గట్టిగా అడిగేసరికి మాలన్ అసలు విషయం చెప్పేసింది.
ఆ మాట వినగానే యూసుఫ్ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. “నా కడుపుల శెడవుట్టిన దానింటికి అమ్మీ ఎట్ల వోతది? ఖతం ఇగ ఇయాలటి సంది నాకు ఒక బిడ్డె, ఒక కొడుకు అంతే. అది సచ్చిపోయింది” అని గచ్చులో ఉన్న బకెట్లోని నీళ్లు నెత్తి మీద పోసుకుంటుండగా అమీనమ్మ బయటినుంచి వచ్చి బకెట్‌ను విసిరేసింది.
“నీకేమన్న పిచ్చి పట్టిందారా?” అంది ఆక్రోషంతో. “అవును పిచ్చే పట్టింది. మీరు ఇసుంటి పనులు జేశినంక పిచ్చే పడ్తది” పెద్దగా అరిచాడు యూసుఫ్.
మాలన్ బీ అక్కడ నిలుచుని ఏదో ఉపద్రవం వచ్చేస్తోందని వణికిపోతోంది. “కిరాయి గూండాలను పెట్టి వాణ్ని సంపేస్త” కనుగుడ్లు పెద్దవి చేస్తూ అన్నాడు.
ఆ మాట వినగానే అమీనమ్మ శివాలెత్తిపోయింది. “ఆ పని జేశేకన్న ముందు నేనే నిన్ను సంపేస్త కొడుకా ఏమనుకుంటున్నవో” అంటూ కొడుకు చెంప చెళ్లుమనిపించింది.
అమ్మ దెబ్బకు యూసుఫ్ అలా బిగుసుకుపోయాడు. నోరు పెగలడం లేదు. కోపం తగ్గి బాధ తన్నుకొస్తోంది.
కళ్లు నిండా కన్నీళ్లతో ఎరుపెక్కాయి. “వాణ్ని సంపుతా అంటున్నవు. ఇరవై ఏండ్ల కింద మాలన్ నాయిన గూడ నిన్ను సంపాల్శిందే..” రోషంగా అంటున్న అమీనమ్మ మాటలకు సమాధానం లేక బిగదీసుకుపోయాడు యూసుఫ్.
కోడలి వంక చూస్తూ మళ్లీ అమీనమ్మే అందుకుంది. “మాలన్‌ను నువ్వు బానిస లెక్క సూశినట్టు నీ బిడ్డెను వాడు అట్ల సూస్తలేడుర. నువ్వు సంగీతను తెచ్చి మాలన్ బీ అని పేరు మార్శినవు. కల్మ సదివిచ్చినవు. ఖురాన్, ఇస్లాం, నమాజ్ అన్నీ నేర్వాల్సిందేనని జిద్దు వట్టినవు. అన్నీ నేర్పిచ్చి ఇంట్ల కూసుండవెట్టినవు. నువ్వు ఏది జెప్తే అది కాదనకుంట ఇన్నది. తనకేమన్న కావాల్నని నీకు చెప్పేంత స్వతంత్రం గూడ నువ్వు ఇయ్యలేదు దీనికి. నువ్వు కనుగుడ్లతోని సైగ జేస్తే అది అన్నీ మూసుకొని చెయ్యాలి. లేకపోతే నువ్వు మొగోనివి గదా ఒప్పుకుంటవా? నువ్వు మాలన్‌ను లేపుకచ్చినప్పుడు నీలెక్కట వాళ్ల నాయిన ఆలోశించలేదు. అక్కడ నీ బిడ్డె ఊరు, పేరు, మతం ఏది మార్వనన్నడు వెంకీ. వాడు వయసుల శిన్నోడు అయినా మనసుల ఎంతో పెద్దోడు తెల్సా. పరువును కాపాడుకునుడు అంటే మానవత్వం సూపిచ్చుడు, ప్రేమను పంచుడు అని ఆ శిన్నపోరడు చెప్పిండుర” ఆవేశంగా అంటున్న అమ్మ మాటలకు నిరుత్తరుడై ఉండిపోయాడు యూసుఫ్.
విసురుగా లోపలికి వెళ్తూ ఆగి కొడుకును చూస్తూ.. “ఇయాలటి సంది నేను నా కోడలును తన అసలు పేరైన సంగీత అనే పిలుస్త. ఏం జేస్కుంటవో చేస్కోపో” అంటూ తన చేతిలో ఉన్న బ్యాగును విసురుగా అక్కడ పారేసి లోపలికి వెళ్లింది.
వెళ్తున్న అమ్మను, తల దించుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న భార్యను చూస్తూ ఆలోచనలో పడ్డాడు యూసుఫ్. తన గతం అంతా కళ్ల ముందు కదలాడసాగింది.
ప్రాణంగా ప్రేమించి తనవెంట వచ్చిన సంగీతను మాలన్‌గా మార్చి జీవితాంతం బానిసను చేశాననే అపరాధ భావం దేవుతోంది. తనది సంగీత మీద నిజమైన ప్రేమ కాదు కపఠ ప్రేమ అని అర్థం అయింది.
కానీ, వెంకీ మాత్రం తన కూతురును జీవితమంతా ప్రేమిస్తానని చెప్పడం యూసుఫ్‌ను ఆలోచనలో పడేసింది. కానీ, ఇగోల అడ్డుగోడలను బద్దలు కొట్టలేకపోయారు. కాలం చల్లగా గడిచిపోతోంది…,
* * *
యూసుఫ్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. గుండెలోని ఓ వాల్‌లో బ్లడ్ క్లాట్ అయిందని. వెంటనే ఆపరేషన్ చెయ్యలన్నారు.
దీంతో ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హార్ట్ సర్జన్ డాక్టర్ జబీన్ వెంకటేష్ ఆపరేషన్ చేసి తండ్రిని కాపాడింది.
కోలుకునేవరకు తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంది జబీన్. వెంకీ కూడా ఆసుపత్రిలోనే ఉండి అన్నీ చూసుకుంటున్నాడు. కళ్లు తెరిచి తన కూతురు డాక్టర్ అయి తన ప్రాణాలు కాపాడిందని తెలుసుకుని షాక్ అయ్యాడు యూసుఫ్. తన గుండెలోని మలినాన్నంతా తన కూతురు సర్జరీ చేసి కడిగేసింది.
గుండె పవిత్రంగా ప్రశాంతంగా మారినట్టు అనిపించింది.
బెడ్డు మీద తనకు సూది ఇవ్వడానికి వస్తున్న జబీన్, ఆమె వెనకాలే వస్తున్న వెంకీని చూస్తూ యూసుఫ్ కరిగిపోయాడు. అప్రయత్నంగానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి.
చెరోవైపు చేరి కన్నీటిని తుడిచారు. అమీనమ్మ, మాలన్‌లు. జబీన్‌ను తెల్ల కోటులో చూస్తూ తెగ సంబరపడిపోతున్నారు. వెంకీని ఓ మహానుభావుడిలా చూస్తున్నారు.
+ + +
మంచిరోజు చూసుకుని కూతురిని, అల్లుడిని కూడా ఇంటికి పిలిచారు.
వెంకీ వాళ్ల బంధువులంతా వచ్చారు. చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశారు. రంగురంగుల సీతాకోక చిలుకల పచ్చని బాగ్ అయింది ఆ ఇల్లు.
ఫంక్షన్ అయిపోయాక బంధువులంతా వెళ్లిపోయారు. వారం రోజుల తర్వాత వెంకీ, జబీన్ కూడా హైదరాబాద్ వెళ్లిపోయారు.
+ + +
ఆరోజెందుకో యూసుఫ్ తనలో మరుగునపడ్డ మనిషిని పూర్తిగా మేల్కొలపాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
బయటకు వెళ్లిన యూసుఫ్ ఒక చేతిలో ఏదో పట్టుకుని రావడం, మరో చేతిలో సంచిని గమనించింది అమీనమ్మ. హాల్లో నిల్చుని “సంగీతా” అని పిలిచాడు.
వంటింట్లో కూర్చుని చేటలో వెల్లుల్లి పాయలు వేసుకుని పొట్టు ఒలుస్తున్న మాలన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ పేరు తానెప్పుడో మరిచిపోయింది. ఇన్నాళ్లకు భర్త నోటితో తన అస్తిత్వాన్ని చాటే పేరు వినడం ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అయినా తనను కాదేమోననే సందిగ్ధంలో పడి వెల్లుల్లి పొట్టు ఒలుస్తోంది. ఇంతలో యూసుఫ్ మళ్లీ “సంగీతా, మాలన్” అని రెండు పేర్లతో పిలిచాడు. అంతే తననే పిలుస్తున్నారనే నిర్ధారణకు వచ్చిన మాలన్ చేట అక్కడ పెట్టి లేచింది.
కొడుకు నోటి నుంచి ఆ పేరు విన్న అమీనమ్మ ముఖంలో ఆనందం. తరతరాలుగా స్త్రీ జాతికి పురుష సమాజం వేస్తున్న ఆంక్షల సంకెళ్లు తెగిపడి స్వేచ్చా వాయివులను గుండె నిండా పీలుస్తూ, సడలని ఆత్మాభిమానంతో నికార్సుగా నిలబడ్డట్టు కోడలి నిలువుదృశ్యాన్ని ఊహించుకుంది కొన్ని క్షణాల పాటు.
కొడుకు వైపు మురిపెంగా చూస్తోంది. తల్లి వైపు చూసిన యూసుఫ్ ముఖంలో చిన్న చిరునవ్వు చారిక. ఇంతలో మాలన్ హాల్లోకి వచ్చి భర్తను చూస్తోంది.
తల తిప్పి భార్య వైపు ఆరాధనగా చూస్తున్నాడు యూసుఫ్.
ఆ ప్రేమైక చూపులు తనను గతంలోకి లాక్కెళ్తున్నాయి. అలా భర్త ముఖంలోకి చూస్తూ రెప్ప వాల్చలేకపోతోంది. “ఇలా రా” అన్నట్టు కళ్లతోనే సైగ చేశాడు యూసుఫ్. మాలన్ అతని దగ్గరికి వచ్చి నిల్చుంది.
మరో మాటకు ఆస్కారం లేకుండా తన గుప్పిట్లో ఉన్న కుంకుమ భరిణె మూత తీశాడు. మాలన్ కు ఏం అర్థంకావడం లేదు.
భరిణెలోని కుంకుమ తీసి ఆమె నుదుటన దిద్దాడు. ఆ చర్యకు స్థాణువులా బిగుసుకుపోయిందామె.
అదంతా చూస్తున్న అమీనమ్మ మరింత ఆనందిస్తోంది. చేతిలో ఉన్న సంచిలోంచి శివపార్వతుల ఫోటోని ఆమెకు అందించాడు. మౌనంగానే ఆ ఫోటోను తీసుకుని ఆరాధనగా చూసింది.
అవే చూపులను భర్త మీద లగ్నం చేసింది. “ఇయాలటి నుంచి నిన్ను నేను సంగీతా అనే పిలుస్త. నీ ఇష్ట దైవానికి నిత్య పూజలు కూడా చేసుకో. నీకు నచ్చినట్టు నువ్వుండు” అంటున్న అతని మాటలు వింటూ సరే అన్నట్టు తలాడించింది.
ఆ మర్నాడే యూసుఫ్ సంగీతను తీసుకుని ఆమె పుట్టింటికి తీసుకెళ్లాడు చాలా ఏళ్ల తర్వాత. అప్పటివరకు ఆ రెండు కుటుంబాల మధ్య నిలిచిన ఇగోల అడ్డుగోడలు పటాపంచలు అయ్యాయి.
*
చిత్రం: చరణ్
సంఘీర్ సమాజం పట్ల నిబద్ధత ఉన్న రచయిత. అభ్యుదయ వాది. ఏ మతమైనా మానవతావాదానికి పట్టం కట్టాలని భావించి రచనలు చేస్తున్న యువ రచయిత. ఈ కథ కూడా ఆ కోవలోకే వస్తుంది. మంచి కథ. సంఘీర్ కు అభినందనలు.
ధన్యవాదములు సర్
బాగుంది భయ్యా. మొన్న సరూర్ నగర్ సంఘటనలో కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఇలా ఆలోచించి ఉంటే ఎంత బాగుండేది…?
అవును చందూ బాయ్. థాంక్యూ 🙏
ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కథలు మరిన్ని రావాలి.రచయితకు శుభాకాంక్షలు
అవును సర్, ధన్యవాదములు 🙏
Very nice message and good story keep it up .
Shukriya bhayya
మంచి సందేశాన్నిచ్చే కథ. హుమాయూన్ కు
అభినందనలు
Thanks sir