1
లక్ష్యం ఏదైనా గానీ
ఎంత దూరమైనా వుండనీ
వాలిపోతున్న పొద్దులో
పరుగు ఆపాలి ఇక !
ఓ సారి వెనుతిరిగి
నాకు సాయం చేసిన
చేతుల్ని తాకాలి
దారి చూపిన వారి
పాదాలకు నమస్కరించాలి
మేలుకోరిన హితుల సన్నిధి
చేరి ధన్యవాదాలు తెలపాలి
బలహీనతలు పసికట్టిన
శతృవులకు శిరస్సొంచి
కృతజ్ఞతలు చెల్లించాలి
అహంకారంతో ఆమడ దూరం
వుంచిన వారిని హత్తుకోవాలి
నే గాయ పరిచిన వారి
గుండెల్లో లేపనం పూయాలి
తప్పిదాలకు అందరికీ
క్షమాపణలు చెప్పాలి
నా జీవిత భవంతికి పునాదులైన
ప్రతీ ఒక్కరినీ ప్రేమతో పలకరించాలి
ప్రాణదీపం ఏ క్షణంలో ఆరిపోయినా
సంతసంగా వెళ్ళడానికి సంసిద్ధం కావాలి.
2
ఆరాధన
ఎన్నేళ్ళు గడిచాయో
ఎటెళ్ళి పోయావో
ఎక్కడని వెతకను !
వెతుకులాటలో అలసి
గొంతు తడియారి పోతుంటే
గుక్కెడు నీళ్ళు తాగటానికి
రెండు చేతుల్ని దగ్గరకు తెచ్చా
దోసిట్లో నీ ముఖం
గృహలక్ష్మిలా
అలల మీద కలలా
కదలాడుతున్న నీ రూపం
నీరు తాగానా
నీ రూపం మాయం
తాగకున్నానా
నా మరణం ఖాయం
ఏం చేయను ప్రియా !
విడిపోయిన దోసిళ్ళు
జారిపోయిన నీళ్ళు
మూతపడ్డ కళ్ళు
సంతృప్తి పరవళ్ళు !
*
Add comment