పరిష్కారం

     అక్కడ చూపులు పారే అంత మేరా పచ్చని పొలాలు. వాటి మీద వాలుతూ కొన్ని, ఎగిరి పోతూ కొన్ని, చక్కర్లు కొడుతూ కొన్ని పక్షులు వింత శబ్దాలు చేస్తున్నాయి. తడిని తాగిన పైర్లు ఎంత అందంగా తయారైనావో చూడ్డానికే అన్నట్లు ఆకుల ద్వారా ఆవిరైన నీరు, మేఘాలుగా మారి ఆకాశంలో పచార్లు చేస్తున్నాయి!

రెండు భాగాలుగా ఉన్న ఆ పొలాల్లో ఎడమ వైపున .. మనుష్యులతో ప్రమేయం లేకుండా భూమిని చదును చేస్తూ, పైర్లు నాటుతూ, కలుపులు తీస్తూ, మందుల్ని యంత్రాలు పిచికారీ చేస్తున్నాయి.. అక్కడక్కడ రంగుల నైలాన్ దారాల గుడారాలు. వాటిలో అంతవరకూ చూడని,  పేర్లు తెలియని మొక్కలను, పైర్లను, దుంపలను శాస్త్రీయంగా పెంచడం జరుగుతూ ఉంది. ప్రయోగశాలల్లో జన్యువులను కలిపి, కోరిన మాంసం కృత్రిమంగా ఉత్పత్తి అవుతూ ఉంది.

కుడి వైపున ఉన్నది సాంప్రదాయకమైన వ్యవసాయం. చదునుగా ఉన్న నేల కమతాలుగా విభజించబడింది. వాటిలో ఎద్దులతో దున్నడం, దున్నిన దుక్కుల్లో ఒండుమన్ను, పశువుల ఎరువులు, వేపా కానుగ చెక్కలు వేసి సాగుకు కొందరు సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల పైర్లు నాటడం, కలుపు తీయడం, నీరు పెట్టడం, పంట కోయడం, నూర్పిడి చేయడం  వంటి పనులలో బిజీగా ఉన్నారు. పచ్చగడ్డి కోసి పశువులను మేపుతూ, పాలుపితుకుతూ….ఎవరికి ఇష్టమైన పనిని వారు చేస్తున్నారు.

అక్కడికి కరెంటుబ్యాటరీతో నడిచే ఒక వాహనం అతినిశ్శబ్దంగా వచ్చి ఆగింది.

దాని నుండి  గోరింకల్లా గలగలా కులుకుతూ కొందరు, చిలకల్లా కిలకిల లాడుతూ కొంద రమ్మాయిలు దిగి, యౌవనాన్ని ఒద్దికగా మొస్తూ హంసల్లా కదలసాగినారు.

తమను ఎవరైనా మెచ్చి, పిలువక పోతారా అనే ఆశతో కొందరు అబ్బాయిలు చెట్ల నీడలో కూర్చొని  వారి వైపు చూస్తున్నారు. కల్మషం లేని చిరునవ్వులతో ఎదురుగా వెళ్లి “హలో!!” అని పలకరిస్తున్నారు. వారి మనస్సును తమ వైపు తిప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

యువతులు కూడా వారిని నిరుత్సాహ పరచకుండా వికశించిన పువ్వుల్లా నవ్వి “హాయ్” అని పలకరిస్తూ సున్నితంగా ఒక హగ్ ఇచ్చి ముందుకు సాగిపోతున్నారు.

కొందరైతే ఎంపిక చేసుకొన్న వారితో చేతులు కలిపి ముచ్చట్లు పంచుకొంటూ పొలాలవైపు వెళుతున్నారు.

ఆ సందర్భంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ఆశతో, కళ్లార్పకుండా తననే గమనిస్తున్న అతన్ని చూపులతోనే రమ్మన్నట్లు చెప్పి ముందుకు సాగింది ఆమె! కొంత దూరం వెళ్లాక అక్కడ ఎత్తయిన చెట్టు నీడలో మెత్తని గడ్డి మీద కూర్చొంది. అతను కూడా అటుపక్కనే కూర్చొని ఏదో చెప్పడానికి ఉత్సాహపడుతూ ఉంటే….వినడానికి సిద్ధమయ్యింది.

“రెండు రోజులుగా మీలా ఆకట్టుకొనే వారికోసం వెతుకుతున్నాను. పొదుపు చేసుకొన్న ఆర్థిక సూచికలన్నీ అయిపోవచ్చాయి. మీరు కనుక ఒప్పుకొంటే ఇక్కడ కొంత ఆర్థికం సంపాదించి డేటింగు పార్కుకు వెళదాం” అన్నాడు.

అతని మాటలకు ఏ భావాన్నీ వ్యక్తం చేయకుండా మరింత దగ్గరకు రమ్మంది. అతని మెడలో వేలాడు తున్న డేటామీటరు మీటను నొక్కి వివరాలు గమనించిన తరువాత….చనువుగా అతని చేతిని తన చేతుల్లోనికి తీసుకొని….”నాకు కూడా పొదుపు సూచికలు ఖాళీ పడుతూ వచ్చాయి. అలా ఖాళీ అయినవారే తొందరగా సంపాదించడానికి ఇక్కడ వ్యవసాయ పనులకోసం వస్తారని అందరికీ తెలుసుకదా!! కాకపోతే  “మనస్సుపడినవారిని నొప్పించేలా పరుషంగా తిరస్కరించకూడదు”  అని కదా మన సమాజ నినాదం! అందుకే వినండి……

ప్రాచీన చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆ కాలపు ప్రజల జీవన విధానాలను ఎక్కడెక్కడి నుంచో సేకరించి తెలుసుకొన్నాను. వారిలాగే బతకాలనే నిర్ణయానికి వచ్చాను. అందుకే నాకు ఇరవై అయిదేళ్ల వయస్సు వచ్చేదాకా మన “మహాశక్తి” (మెగాపవర్) నిర్ణయించిన చదువులు ముగించాను. అప్పగించిన పనులు చేశాను కావలసినంత సంపాదన నా ఖాతాలో జమా చేసుకొన్నాను.

ఇప్పుడు నవతరం వారు పదేళ్ల వయస్సు నుంచే చదువుతో పాటు కొన్ని పనులు చేస్తారుకదా! ఆ ఆర్థిక సూచీలతో తమను తామే మరిచిపోతున్నారు. డేటింగులు, అనుభవాలు, త్రిల్లింగులలో కూరుకొని పోతున్నారు. ఇప్పటి సమాజమే అలాగుంది. దానిని కాదనలేము కదా!! అటువంటి వాటికి దూరంగా బతికే వ్యక్తికోసం చాలా చోట్ల వెతకాల్సి వచ్చింది. ఏమైతే ఏమి చివరికి సాదించాను. అతనొక సైంటిస్టు.

నిజానికి తానొక పురుషుడిని అనే స్పృహ అతనికి లేదు! తన శరీరానికి ప్రకృతిసిద్ధమైన కొన్ని కోరికలు ఉంటావనే ఇంగితాన్ని మరిచిపోయాడు. తన జ్ఞానాన్నంతా సమాజ శ్రేయస్సుకోసమే వినియోగిస్తున్నాడు. ఈ సామాజిక స్థాయి ఇప్పటికన్నా దిగజారకూడదని, మరింత కొత్తగా, సమస్యలు లేనిదానిగా తీర్చి దిద్దడానికి రాత్రీపగలూ శ్రమించే వ్యక్తి. అందుకే ఆ పురుషుడు తన్నుగురించి తానే మరిచినట్లున్నాడు. అతని చుట్టూ తచ్చాడుతూ అతను తలపెట్టిన ప్రయోగాలు ముగిసేదాకా ఉండిపోయాను.

మనకైతే వారి డేటామీటరు చూస్తే కానీ ఎవరేమిటో అర్థం కాదు. అతను మాత్రం అర నిమిషం మనిషితో మాట్లాడుతూ మొత్తం కనిపెట్టగల సూక్ష్మగ్రాహి.

మొదటిసారి పరిచయ మౌతూ అతని చేతిలో సున్నితంగా నా చేయినికలిపాను. అతని కళ్ల లోకి సూటిగా చూస్తూ “మీతో ఒక విషయం మాట్లాడాలి” అన్నాను. నా మాటలకు అతను ఏమాత్రం తడబడకుండా “నాతో డేటింగుకు వచ్చినట్లున్నావు! అది ఇప్పుడు అందరికీ సహజమే అయినా నాకు నచ్చదు” అన్నాడు కరాఖండీగా.

అతడలా అంటాడని నాకు తెలుసు. ఎందుకంటే అతని డేటామీటరును ఎప్పుడో చదివినాను. ఇప్పుడు ఎవరి డేటామీటర్లే వారి  బతుకుల ప్రతిరూపాలుకదా!! మరోమాట మాట్లాడలేదు. మెత్తని గులాబీ రేకుల్లా నా పెదవులను విప్పి అతని పెదాలమీద సుతారంగా ముద్దుపెట్టుకొన్నాను. నా ప్రవర్తనతో అతనిలో ఏమాత్రం చలనం కలుగలేదు. అప్పుడు అతని ముఖాన్ని మరీ దగ్గరకు వాల్చుకొని సూటిగా చూస్తూ “సాంకేతిక సమస్యలు వచ్చి సమాజం నడకకు ఎటువంటి ఆటంకమూ రాకుండా మహాశక్తి ఆజ్ఞలను అమలుపరిచే విజ్ఞానులు మీరు!!

ఇప్పటి ఈ జీవన స్థితి కోసం ఎందరో సంస్కర్తలు, శాస్త్రవేత్తలు వేల  సంవత్సరాలుగా కలలుగని, ఉద్యమాలు చేసి, అవమానాలు భరించి కాలమై పోయారు. వారికి మన జోహార్లు!!

అయినప్పటికీ కీడెంచి మేలెంచాలి కదా!?

ఇతర గ్రహాల నుంచి కావచ్చు, పాలపుంతలకు అవతలి నీలి కంతల నుంచీ కావచ్చు రోగ క్రిములో, దుష్ట ఆయుధ ప్రయోగాలో జరిగితే….మీవంటివారు సాధించిన సశాస్త్రీయ విజయం ఒకే ఒక్క నిముషంలో పురా తత్వానికి జారిపోతుంది కదా!? శాస్త్రీయ అనుసంధానం మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది కదా!!

ఎప్పటికప్పుడు సకలజీవుల పరిణామక్రమాన్ని అంచనా వేస్తూ, దానికి తగిన విధంగా శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలికదా. అది నిరంతర ప్రక్రియ అని మీకు తెలియందికాదు. అది ఆగిపోకూడదని, మీ తదనంతరమూ కొనసాగడానికి కొత్త బీజాలకు అంకురార్పణ చేయాల్సిన బాధ్యత  మీ మీదేవున్నది కదా!….అని చెవిలో ఇల్లుకట్టుకొని ఎన్నోరకాలుగా చెప్పడమే కాకుండా ప్రకృతి మధ్యకు తీసుకువెళ్లాను. అద్దాల వాహనాల్లో వన్యప్రాణుల మధ్య తిప్పుతూ అతని ఆలోచనలకు అంతరాయం కలిగించాను.

కొన్ని శారీరక, మానసిక రుగ్మతల నుండి దృష్టిమళ్లించడానికి సెక్సాలజిష్టులు రూపొందించిన కామక్రీ డల చిత్రాలను కూడా చూపి నానా తంటాలుపడ్డాను. ఏమైతే ఏమి, యాభై యేళ్ల వయస్సులోకూడా అతను తరలిపోయిన తన యౌవనాన్ని వెతికి పట్టుకొచ్చినట్లు తయారయ్యాడు. అదే డేటింగ్ అనుకొని ప్రొడక్టివ్ స్థాయికి చేరుకొన్నాము.

నేను అనుకొన్నది నెరవేరడంతో నాలో నాకే ఏదో మార్పు అనిపించింది. డేటామీటర్ ను పరిశీలిస్తే నెల తప్పానని తెలిపింది. బీజదాత నుండి దూరమయ్యే సమయంలో అతడన్నాడు కదా…”ఎటువంటి సంబంధాలు అనుసరిస్తే సమాజం ప్రశాంతంగా ముందుకు సాగుతుంది?? అనే ప్రయోగాల వలయంలోనే నా ఆలోచనలు చక్కర్లు కొట్టేవి.

కానీ స్త్రీ హృదయం మాత్రం తానొక గొప్ప జీవికి జన్మనీయాలని, సమాజాన్ని మరింత పరిణతి చెందేవిధంగా మార్చాలని ఎంతగా కలలుగంటుందో మిమ్ము కలిసిన తరువాతనే తెలిసింది. అందుకే పెద్దలు స్త్రీ ని భూమాతతో పోల్చారు! భూమి ఎప్పుడూ పచ్చని పంటలనే కలగంటుంది కదా!! కాబట్టి మహిళలు శాస్త్రవేత్త లైతే ఈ విశ్వం మరింత సౌందర్యవంతంగా తయారవుతుంది. మానవ సంబంధాలుకూడా పారదర్శక మౌతాయి” అని హ్యాట్సాఫ్ చెప్పి తన పనులకు తాను వెళ్లిపోయాడు.

ఈ సంగతి మీకు అనవసర మైనప్పటికీ ఎందుకు చెబుతున్నానంటే….మన ప్రతి కదలికా, పలికే మాటా మొత్తం సీసీ కెమేరాలు,శాటిలైట్ పరికరాల్లో నమోదు అవుతాయికదా! అలా విషయం అందరికీ తెలియాలని. ఎవరికివారు తమ ప్రవర్తనలను మెరుగుపరచుకో గలరని ఆశ” అని ముగించింది.

అంత వివరంగా ఆమె చెబుతూ ఉంటే అసహనానికి గురికాకుండా, నిరాశకు లోనుకాకుండా విని ఆమెను అభినందిస్తున్నట్లు చేతులు ముందుకు చాచాడు. ఆమె కూడా అతనికి దగ్గరగా జరిగి ఆలింగనం చేసుకొంది. నిష్కపటమైన మనస్సుతో ముద్దులిచ్చింది. “నే నిప్పటికే మూడాఫ్ లో ఉన్నాను. పురిటి కార్యక్రమం ముగియాలి. ఆ తరువాత మనస్సు మీ మీదికి మళ్లితే అప్పుడాలోచిద్దాం! మీ వాలకం చూస్తే ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ప్రయత్నం కొనసాగించండి తప్పక నెరవేరుతుంది. అన్ని జీవుల ఆకలిని తీర్చడానికి భూమాతను, పురుష శాల్తీల వాంఛలను తృప్తిపరచడానికి స్త్రీ జాతిని ప్రకృతి యేర్పాట్లు చేసింది కదా!!” అని టాటా చెప్పి వెళ్లిపోయింది.

**********************

3024 వ సంవత్సరం నాటికి మానవ సమాజం పది నోల్లున్న రావణబ్రహ్మ కూడా చెప్ప లేనన్ని వెర్రితలలు వేసింది. కులం, మతం, భాష, రంగు, ప్రాంతం…వంటి నానా ముఠాలుగా విడిపోయింది. తమను అనుసరించని వర్గాన్ని నీచంగా అణగదొక్కడం, క్రూరంగా చంపడం మొదలుపెట్టింది. అవసరానికి తగిన దుర్మార్గాలు వెదికి అధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రకృతి వనరులను దోచి దాచిపెట్టుకోవడం ఆనవాయితీ అయ్యింది. జనాభాలో సగ భాగమైన మహిళల దీన స్థితిని గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది!!

ఆమె ఇష్టా ఇష్టాలతో పనే లేదు. వావి వరసల్లేవు. చిన్నారులు, ముసలి ముతక అనే దయాదాక్షిణ్యాలు లేవు. అవసరానికి ఆడది అయితే చాలు. ఎన్ని నిబంధన లు ఉన్నా నిస్సిగ్గుగా బలాత్కరించడం. ఎదురు తిరిగితే చంపడం. ఎన్నని చెప్పేది? మనిషి అనే వ్యక్తికి ఎటువంటి చెడ్డ గుణాలు ఉండరాదో వాటిని అన్నింటినీ అలవర్చుకొన్నాడు. తమ జాతిని, వర్గాన్ని పెంచుకోవాలనే దుగ్దతో ఎక్కువమంది పిల్లలను కనేలాగ ఆమె మీద ఒత్తిడి పెరగడంతో ఆమె  రోగాల పుట్ట అయ్యింది. విపరీతంగా పెరిగిపోయే జనాభాను  మోయలేని స్థితికి భూమండలం చేరి పోయింది..

శరీరంలో సూది మొన మోపడానికి చోటు లేకుండా క్యాన్సర్ సోకితే అది ఎంత వికృతంగా, అసహ్యంగా తయారవుతుందో అంత భయంకరంగా తయారయ్యింది సమాజం.

ఈ దుష్ట పోకడలను కళ్లారా చూస్తున్న మేధావి వర్గం ఏవో కొత్త చట్టాలు, కఠిణ శిక్షల వంటివి తెచ్చింది.. అయినా ఫలించలేదు.

మరో పక్క సాంకేతికజ్ఞానం పెరిగి చంద్రమండలం, కుజగ్రహాల మీదికి రాకపోకలు మొదలయ్యాయి. జలాంతర్గాముల ద్వారా సముద్రగర్భ నివాసాలు సులభమయ్యాయి. అయినా పెడదారిపట్టిన సమాజం సక్రమ మార్గానికి రాలేదు. ఏ విధంగా అయినా సమాజాన్ని బాగు చేయాలనే ఆలోచనతో కొత్త ప్రణాళికలు రూపొందించడంలో మేధావి వర్గం తలమునకలయ్యింది.

అంతలో అతి భయంకరమైన విపత్తు!!
భూమండలాన్ని సర్వ నాశనం చేయడాని కన్నట్లు సంభవించిన ఆపత్తు!!

ఒక చీకటి సమయంలో కేవలం కొన్ని నిమిషాల పాటు భూమండలాన్ని కమ్ముకొన్న విషవాయువు. మానవజాతి మొత్తాన్ని పొట్టన పెట్టుకుపోయింది.

తమకు మించిన శక్తే లేదని, తాము చేసే పనులే శాసనాలని విర్రవీగి, తొడలుగొట్టి, మీసాలు మెలిపెట్టిన నరజాతి మొత్తం మట్టిలో కలిసిపోయింది.

ఆకుపచ్చని కళలతో మాగాణి ప్రాంతమంతా విస్తరించిన తోట అగ్గిపిడుగు దెబ్బకు మండి మాడిపోయినట్లు  క్షణంలో జరిగిపోయింది.

అంతటితో ఒక యుగం ముగిసిపోయింది.
ఒకా నొక చీకటి కాలానికి తెర పడింది.
భూమాత బరువు మోతకు విరామం దొరికింది.
ఇక కాలానికి ఇదే చివరి అధ్యాయమా?
లేక కొత్త కాలం మొదలు కానుందా!?…..అని
ప్రశ్నించుకో వలసిన అవసరం కాలానికి వచ్చిపడింది.
అంతలో…..ఇదిగో సమాధానం అన్నట్లు ఒక చల్లని వెలుగు కిరణం!!

********************

అదుపు తప్పిన సమాజాన్ని సరిదిద్దలేమని నిర్ధారణకు వచ్చిన మేధావి వర్గం తమలోతాము కూడబలుక్కొంది.

సాగుకు పనికిరాక చవుడు తేలిన నేలను వదలి పెట్టి, సారవంతమైన భూమిని రైతు వెదికినట్లు….ఇక్కడ బరితెగించిన సమూహాన్ని ఇక్కడే వదిలేసి సరికొత్త సామాజిక వ్యవస్థను తయారు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకొన్నారు. విషయం బయటికి పొక్కకుండా ఇతర గ్రహాల మీదికి, సముద్రగర్భం లోనికి వెళ్లినారు. సాంకేతికజ్ఞానాన్ని మానవ జీవనానికి అనుసంధానం చేసే పద్ధతి పై ప్రయోగాలు చేశారు. ఆశించిన రకంగా ఫలితాలు రావడంతో భూమండలానికి తిరిగివచ్చారు.

కూడబలుక్కొని అందరూ ఒకే సారి భూమండలానికి రానయితే వచ్చారు కానీ…. ఎక్కడ చూసినా కనిపించే విషాదదృశ్యాలు అర్థం కాక చలించిపోయారు. కొండంత ఆశతో వచ్చిన వారు నిరాశలతో నీరుగారిపోయారు.

ఎక్కడ చూసినా అస్థిపంజరాలు. వీధుల్లోను, ఇళ్ల ముందు  చిలుంపట్టిన బైకులు, కార్లు, బస్సులు వగైరాలు!!

చిట్టచివరి ప్రపంచయుద్ధం జరిగి అణ్వాయుధ ప్రయోగాలతో మానవజాతి తుడిచిపెట్టుకు పోయినట్లు విషాద వాతావరణం. ఏదో సాధించాలని, ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త సాంకేతిక సరంజామాతో తిరిగి వచ్చిన మేధావి వర్గానికి గుండెలు పిండేసినట్లయ్యింది.

లేని పక్షుల కోసం చక్కను గూడు అల్లినట్లు.
ఉదాత్తంగా రాసిన నాటకానికి పాత్రధారులే దొరకనట్లు డీలాపడిపోయారు.

ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఆనవాల్లే దొరకక ఒకరినొకరు అభావంగా చూస్తూ కూలబడిపోయారు. అలా ఎంతసేపు కూర్చొన్నారో వారికే తెలియదు. అంతలో కొంత దూరంలో మనుషుల ఉనికిని సూచిస్తున్నట్లు ఏదో అలికిడైతే మెల్లగా అటువైపు కదిలారు.

కొంత దూరంలో ఏడెనిమిదేళ్ల వయస్సున్న పిల్లలు ఆకులు చప్పరిస్తూ, కాయీ కసుర్లు తింటూ కనిపించారు.

పోయిన ప్రాణం మరలా వచ్చినట్లు, మూగబోయిన గొంతు అప్పుడే మాటలాడినంత సంబరంగా అక్కడికి చేరినారు. ఆలింగనం చేసుకొని ముద్దులాడి మురిసిపోయారు. తమ వద్ద ఉన్న తిండీబట్టలిచ్చి మరికొన్ని చోట్ల వెతికితే అదే వయస్సున్న మరికొందరు దొరికారు. అందరినీ ఒక చోట చేర్చి కొన్ని పరిశోధనలు చేసిన తరువాత తెలిసిన విషయం ఏమిటంటే……

ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలకు ఏదో కొత్త జబ్బు వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ యంత్రాంగం సైంటిస్టులతో యుద్దప్రాతిపదికన మందులు తయారు చేయించి టీకాల రూపంలో పిల్లలకు వేయించింది.

ఆ కార్యక్రం ముగిసీ ముగియగానే ఒక భయంకరమైన ఘటన! భూమండలం మొత్తాని ఒక నిముషం పాటు చుట్టుముట్టిన విషవాయువు. దాని దుష్ఫలితంగా వ్యాక్సిన్లు తీసుకొన్న పిల్లలు మినహా మిగిలినవారు విగత జీవులైనారని!!

అసలు సంగతి తెలుసుకొన్న మేధావి వర్గం దఃఖంతో కన్నీరు కార్చలేదు. గతాలు గుర్తుకు తెచ్చుకొని  రంగుల  దారాలతో అల్లిన పుట్టగోచీ ఏమాయేనో….. బట్టలు ఉబ్బకాసే మట్టిబాన ఏమాయెనో? ఏటి ఒడ్డులో బట్టలు ఉతికే బండ ఏమాయెనో?……?? “అని ఏడుస్తూ శోకాలు తీయలేదు. మురిగిపోయిన మురికి నీళ్లనుంచి కొత్త నీటికి చేరిన చేపల్లాగా మురిసిపోయారు. రోగి పాలనే తాగాలి అనుకొన్నప్పుడు వైద్యుడు కూడా పాలనే తాగమన్నట్లు, కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చినట్లు, అభ్యుదయ వాదుల కలలను ప్రకృతే తీర్చింది, అనుకొని తాము తయారు చేయాలనుకొన్న నూతన సమాజ నిర్మాణానికి పూనుకొన్నారు.
******************

కొత్త సమాజంలో………..

తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన బిడ్డను తల్లినుండి దూరం చేస్తారు. అందరి తల్లుల పాలనూ యంత్రాల ద్వారా ఒక చోటుకు చేరుస్తారు. పిల్లల జీర్ణవ్యవస్తను గమనించి తగిన విధంగా పెంచడం జరుగుతుంది.

ఈ వ్యవస్తలో ఇదే అతి ముఖ్యమైన పరిణామం. ఇలా చేయడం వల్ల “తన తల్లి” “తన బిడ్డ” అనే “తన తనం” మనిషి నుండి పూర్తిగా తుడిచి వేయడం జరుగుతుంది.

ఆ బిడ్డ శరీరంలో “గ్రీన్ చిప్” అనే సాంకేతిక సిమ్ము చేర్చడం జరుగుతుంది. ఆ సిమ్ము సదరు శరీరంలోని ప్రతి చర్యనూ గ్రహించి “డేటామీటర్” అనే దానికి పంపుతుంది. ఈ డేటామీటర్ ప్రతివ్యక్తి మెడలో అందరికీ తెలిసేలా వేలాడుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తీ పదైదు అంకెల సంఖ్యగా గుర్తించడం జరుగుతుంది. అదే సదరు శల్తీ పేరు అనుకోవచ్చు. ఆడకు F అని మగకు M అని సంఖ్యతో పాటు ఉంటుంది.

ఈ విధంగా ఏర్పాట్లు జరిగిన అందరి డేటామీటర్లూ “మహాశక్తి”(మెగాపవర్) అనే అత్యున్నత యంత్రానికి అనుసంధానం చేయబడి ఉంటాయి.

ఈ మహాశక్తికి చేరిన ప్రతి వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను గమనించి గ్రూపులుగా విభజిస్తుంది. కాలమాన పరిస్థితులను బట్టి అక్షరజ్ఞానము, విద్యల కోసం అనుభవం ఉన్న విద్యావంతులకు కేటాయించడం జరుగుతుంది.

ఏ చదువులకు ఎవరు అర్హులో వారి ఐ.క్యూ. సామర్థ్యాన్ని బట్టి మహాశక్తే నిర్ణయిస్తుంది. ఒక వేళ ఇంకా మరికొన్ని చదువులు నేర్వాలని ఉంటే సదరు శాల్తీ మానసిక స్థాయిని గమనించి మహాశక్తి  అవకాశం ఇస్తుంది. ఈ విధంగా ప్రతి వ్యక్తికీ విద్యలు అబ్బుతూనే సామర్థ్యానికి తగిన వృత్తిలో నియమించడం జరుగుతుంది.

ఇక్కడ ఎవ్వరికీ సొంత ఆస్థులు ఉండవు. ఏదీ “నాది” అన్నదే ఉండదు. ఒక్క “జ్ఞానము” దానిని మోసే “శరీరం” తప్ప!!

వ్యక్తికి కేటాయించిన పని మీద పర్యవేక్షణ ఉండదు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తీ కనీసం ఐదుగంటల పాటు పని చేయాలి. ఆ పనిలోని నాణ్యత, ఖర్చుచేసిన శ్రమశక్తిని బట్టి, ఆర్థిక సూచికలు డేటాషీటు ఖాతాకు జమా అవుతాయి. అదే సదరు వ్యక్తి సంపాదన. వయస్సు మళ్ళిన వారికి, రోగులకు, వికలాంగులకు, బాలెంతలకు మినహాయింపు ఉంటుంది.

ఈ విధానం మొదలైన కొత్తలో ప్రతి వ్యక్తీ ఏదో ఒక పనిలో నియామపకం జరిగేది. అందరికీ ఒకే వేతనం, ఒకే తిండి, ఒకే గుడ్డ అందుబాటులో ఉండేది.

అయితే ఆ విధానం వల్ల ఆశించిన స్థాయిలో సమాజం నడక సాగలేదు. కారణం?? మనిషి ఆశాజీవి కదా! ప్రతి దాంట్లో ఏదో తనదైన ప్రత్యేకత, నైపుణ్యాన్ని చూపి ఇతరులతో మెప్పు పొందాలని, వ్యతిరేక జెండరుతో ఆకర్షింపబడాలని తాపత్రయపడడం అతి సాధారణం కదా!!

ఆ మానసిక స్థితిని పరిగణన లోనికి తీసుకోకుండా అందరినీ ఒకే గాట కట్టివేయడంతో చాలా మందిలో అసహనం మొదలయ్యింది. “ఎగిరెగిరి దంచినమ్మకూ ఒకే కూలి, కూర్చొని ఎగనూకిన అమ్మకూ ఒకే కూలి” అనే నైరాశ్యంతో “గుంపులో గోవింద” అనే తత్వం  ఎక్కువ మందిలో కనిపించసాగింది.

అప్పుడు శాస్త్రవేత్తలు మెగాపవర్ లో మార్పులు చేర్పులు చేశారు. అప్పటి నుండి అన్ని చోట్లా ఒకటి నుండి ఐదు నక్షత్రాల హోటళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. నానా ప్రయాణ సాధనాలు, వెరైటీ ఫ్యాషన్ డిజైన్ల బట్టలు…..ఇలా ఉండి, ప్రతి దానికి ఒక్కో ధర. పనుల్లో ఎక్కువ శక్తిసామర్థ్యాలు ఖర్చుచేస్తూ, ప్రతేక నైపుణ్యాన్ని చూపగలిగితే ఎక్కువ ఆర్థిక సూచికలు జమా అవుతాయి. వాటితో ఎవరికి ఏది ఇష్టమో ఆ తిండి, బట్ట ఎంచుకోవచ్చు. వాటిని వినియోగించిన సమయంలో సదరు వ్యక్తి ఖాతా నుండి మహాశక్తి ఖాతాకు ఆర్థికం బదిలీ అవుతుంది.

అందరికీ అన్ని సదుపాయాల కల్పన కోసం ప్రతి వ్యక్తి సంపాదన నుండి యాభై శాతం మహాశక్తి ఖాతాకు తనంతకుతాను బదిలీ అవుతూ ఉంటుంది.

ఊళ్లకు మనకులాగా పేర్లు ఉండవు. కొందరిని ఒక చోట చేర్చి నంబరు కేటాయించడం జరుగుతుంది. ఆ నంబరే సదరు సెక్టారుకు పేరు.

ప్రతి సెక్టార్లో పుట్టిన బిడ్డను తల్లి నుండి వేరు చేసే తతంగం జరిగిన తరువాత డేటామీటర్ ద్వారా ఆరోగ్యం, ఆహారం మొదలైన బాగోగులను గమనించి, సంబంధించిన నిపుణులు బాధ్యతవహిస్తారు. నడక, మాటలు నేర్చిన తరువాత ఆటలు, పాటలు అభినయం ద్వారా వస్తుపరిజ్ఞానం, అక్షర జ్ఞానం అలవాటు చేస్తారు.

చదువు ముగుస్తూనే రకరకాల సెక్టార్లు అందుబాటుకు వస్తాయి. వాటిలో మొదటిది లర్నింగ్ స్టాల్.

ఇక్కడ వ్యక్తి తనకు ఇష్టమైన విద్య (కళ) నేర్చుకోవచ్చు. చిత్రాలు, సంగీతం, సాహిత్యం, కుట్టు, అల్లిక, అభినయం, వంటకం, పనిముట్ల తయారీ, ఆటలు, ప్రయోగాలు, సరికొత్త లిపి, భాష….ఇటు వంటివి ఏవైనా మానసిక వికాసానికి, సమాజ వృద్ధికి ఉపయోగ పడేవి అభ్యసించవచ్చు. వాటికి తగిన సరంజామా అందుబాటులో ఉంటుంది.

రెండవది షోయింగ్ స్టాల్…అంటే ప్రదర్శన శాల. తాము ఇష్టపడి నేర్చుకొన్న ప్రతి కళను, తయారు చేసిన దానిని ఇక్కడ ప్రదర్శించవచ్చు. వాటిని నేరుగా కానీ ప్రతి చోటా ఏర్పాటు చేసిన స్క్రీన్ మీదకానీ చూడవచ్చు. తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేయవచ్చు. ఇక్కడే ఆడ, మగ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ, ప్రేమ మొదలవుతుంది.

మూడవది ఈటింగ్ స్టాల్. ముందే చెప్పినట్లు ఇది ఐదు రకాలుగా ఉంటుంది. “చేసుకొన్న వారికి చేసుకొన్నంత మహదేవా” అన్నట్లు ఎవరు ఎక్కువ ఆర్జించి ఉంటారో వారు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంకొక సంగతి ఏమిటంటే ఇక్కడ రెండురకాల పదార్థాలు  ఉంటాయి. మొదటివి కృత్రిమ పద్ధతులతో ల్యాబుల్లో ఉత్పత్తి చేసినవి. రెండో రకం సాంప్రదాయకమైన వ్యవసాయ పద్ధతిలో సాగుచేసినవి. ఈ రెండో రకం ఆహారానికి ధర ఎక్కువ!!

మరో రండు స్టాళ్లను చెప్పుకోవడానికి ముందు ఐదవదైన రెస్టింగ్ స్టాల్. ఇక్కడ వయస్సు మళ్లినవారు, వికలాంగులు, మానసిక సమస్యల వారు ఉంటారు. వీరి అవసరాలను గమనించి కంటికి రెప్పలా చూసుకొనే నైజం ఉన్నవారిని మహాశక్తి నియమిస్తుంది.

అంతరిక్షం నుండి ఉపగ్రహాలు నిరంతరాయంగా సూర్యుని కిరణాలను పరావర్తనం చేయిస్తూ ఉంటాయి. ఆ సౌరశక్తితో వెలుగులకూ, యంత్రాల ఇంధనాలకూ కొదువే ఉండదు. సముద్ర జలాలను శుద్ధి చేసి మంచి నీరుగా మార్చే సాంకేతికతో నీటికరువు అసలే ఉండదు.

ఇక నిర్మాణాలు……… ఇనుము, ఉక్కు, సిమెంటు వంటి వాటితో ఆర్భాటంగా ఉండవు. ప్రతి సంవత్సరమూ ఈ రంగం కొత్త పుంతలు తొక్కుతూ ఉండడంతో అన్ని హంగులతో ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి అనువైన తాత్కాలికమైనవే నిర్మిస్తూ ఉంటారు.

ఆర్జనలో మహాశక్తి ఖాతాకు, ఇతర వినియోగాలకూ ఖర్చయి ఇంకా మిగిలి ఉంటే  సంవత్సరం చివర్లో మహాశక్తి ఖాతాకు చేరిపోతుంది. అందుకే ప్రతి యేడాది చివర్లో ఆర్తిక సూచికలు మిగిలినవారు కొత్త ప్రాంతాలకు విజ్ఞాన, వినోద యాత్రలకు వెళ్లి ఖాళీ చేస్తుంటారు.

అతి ముఖ్యమైన రెండు స్టాళ్లలో మొదటిది డేటింగ్ ఏరియా.

ఇది నందనవనం వంటి సుందరమైన ప్రకృతి ప్రపంచం. స్త్రీ, పురుషుల స్నేహ బంధనాల కాణాచి. రెమ్మకో రంగు పూవును పూచిన మొక్కలు, తీగలు. ఒకదాన్ని చూసిన కళ్లతో మరోదాన్ని చూడలేనంత మనోజ్ఞ దృశ్యం. అక్కడక్కడ కళాత్మకంగా తీర్చి దిద్దిన పొదరిళ్లు. ఏపుగా పెరిగిన చెట్లు. వాటిని వయ్యారంగా అల్లుకొన్న మల్లెతీగలు. పాదాలకు పూవుల స్పర్శను అందించే మెత్తని పచ్చిక దారులు. వాటికి రెండు వైపులా కాలువలు. గట్లను తాకుతూ ప్రవహించే నీరు. కుడి వైపు కాలువ ఒక రాగాన్ని రవళిస్తూ ఉంటే….ఎడమ కాలువ జల తరంగిణీ వాయిద్యం మీటినట్లు సాగిపోతూ ఉంటుంది.

పచ్చిక దాపుల్లో కుందేళ్ళు, గడ్డి మైదానాల్లో నెమళ్లు, లేళ్లు….చెట్ల కొమ్మలమీద పావురాలు, చిలుకలు, గోరింకలు, కౌజుపిట్టలు తమ హృదయ స్పందనలను అనురాగ స్వరాలను చేసి ఆలపిస్తూ ఉంటాయి.

పూచిన ప్రతి పూవూ తనదైన ప్రతేకతతో ఆకర్షిస్తూ ఉంటుంటే….పోటీలు పడి తుమ్మదలు, సీతాకోక చిలుకలు మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. మరో వైపు చిరుగాలులు పూల పరిమళాలను వనమంతా చిలకరిస్తూ ఉంటాయి.

అటువంటి మొహన వనానికి వయస్సులతో సంబంధమే లేకుండా తమ పనులను ముగించుకొని, నిత్యకృత్యంగా స్త్రీ, పురుషులు సయ్యాటలకు తగిన వారిని వెతుక్కోవడానికి వస్తూ ఉంటారు.

షోయింగ స్టాల్లో గమనించడమే కాక, డేటామీటర్ ద్వారా వివరాలు తెలుసుకొని ఒకరిని ఒకరు ఇష్టపడతారు. ప్రకృతి ఒడిలో జంటగా చేయీ చేయీ కలిపి నడుస్తారు. ఎదురెదురుగా కూర్చొని శ్వాసల విశ్వాసాలను మూగగా కొలుస్తూ పరస్పర అవగాహనకు వస్తారు.

ఇంత స్వచ్చమైన జీవన విధానం అమల్లో ఉన్నప్పటికీ….మహిళల గ్రీన్ చిప్ లో తిరష్కారకణం (రెఫ్యూజ్ సర్క్యూట్) అనే ప్రతేక ఏర్పాటు ఉంటుంది. ఆమె స్నేహానికి సిద్ధపడి చేయి చాచినప్పుడు మాత్రమే పురుషుడు చేరువ కావలసి ఉంటుంది.

ఆమె అనుమతి లేకుండా బలవంతంగా ఆక్రమించడానికి పోతే ఆమెలోని తిరష్కార కణం పేట్రేగి పోతుంది. ఆమె నుండి విద్యుత్తు ప్రవాహం చొచ్చుకువచ్చి అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. అదే సమయంలో ఆ సమాచారం మహాశక్తికి చేరి, క్షణంలో పోలీసు రోబో డ్రోణ్ వాహనంలో అక్కడికి చేరుకొంటుంది. సదరు వ్యక్తిని డీఫాల్టు సెల్లుకు తరలిస్తుంది.

ఈ కూడికల్లో రక్త సంబంధాల పొరపాట్లు జరక్కుండా డేటామీటర్ ద్వారా జన్యు మూలాలను తెలుసుకొనే వెసులుబాటుకూడా ఉంటుంది.

రోజువారీ పనుల్లో ఉత్పన్నమయ్యే మానసిక ఒత్తిడులను, ప్రకృతి సంబంధమైన శారీరక  అలజడులను దూరం చేసుకోవడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొనే సాహచర్యం మాత్రమే ఇక్కడ స్త్రీ పురుషుల చెలిమి!! అది ఎంతకాలం అన్నది ఆమె నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది.

ఇక మిగిలింది మేటింగ్ స్టాల్. డేటింగ్ సమయంలో స్త్రీ ఎవరిద్వారా గర్భం ధరించాలి అనుకొంటే…సదరు పురుషునితో కలిసి ఉండడానికి ఏర్పాట్లు చేసిన గది అది.

ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే, తనకు కేటాయించిన వృత్తిని సక్రమంగా చేయడం వల్ల ఆర్థిక సూచికలు జమా అవుతాయికానీ…ప్రతి జీవీ అతిముఖ్యం అనుకొనే ప్రణయ, శృంగార క్రీడలకు ఎటువంటి ఆర్థికమూ జమాకాదు!! బిడ్డను కనడానికి గర్భం ధరించిన పడతికి మాత్రం కడుపుతో ఉన్నప్పుడు, కానుపు అయిన తరువాత కొంతకాలం మహాశక్తి నుండి ఆర్థికం అందుతూనే ఉంటుంది.

అన్ని రంగాల కన్నా వ్యవసాయ రంగంలో శారీరక శ్రమ చేసేవారికే తక్కువ సమయంలో ఎక్కువ ఆర్థికం అందుతుంది. అందుకే ఎక్కువ మంది పొలము పనులు చేయడానికే మొగ్గుచూపుతూ ఉంటారు.
*******************

“తాతయ్యా! అవ్వ మంచం దగ్గర కాఫీ కప్పు పెట్టి చాలా సేపయ్యింది. చల్లారి పోతుంది లెయ్యండి తాతా” అని మనుమరాళ్లు వినూత్నా, విశ్వదా  ఒంటి నిండా చుట్టుకొన్న రగ్గు లాగే సరికిగానీ నేను ఈ లోకానికి రాలేదు.

మా కాలనీలో ఆ మధ్య ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. కారణం కనుక్కొంటే……

అతను ముంబయిలో ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఇల్లు కట్టించాలని అనుకొన్నాడు. తెలిసిన వ్యక్తి తానే దగ్గరుండి కట్టిస్తానని చెప్పడంతో ఒప్పందం చేసుకొన్నాడు.

ఇతను ప్రతి రోజూ పని చేసిన కూలీలు, వాడిన మెటీరియల్ కు లెక్క చెబితే అతను ఏరోజుకు ఆరోజు దబ్బులు పంపిస్తూ ఉన్నాడు. కూలీలు చేస్తున్న పనులను సెల్ ఫోన్ ద్వారా వీడియో కూడా చూపిస్తూ ఉన్నాడు. దాదాపు కోటి రూపాయలు ఖర్చయి పోయింది. ఇంటి పనికూడా ముగిసి పోయింది.

తీరా ఓనరు ముంబయి నుండి వచ్చేసరికి ఇంటి పని పునాది వరకూ మాత్రమే జరిగింది. పని చేయకుండానే ఎక్కడో చేసేపనిని ఇక్కడ చేస్తున్నట్లు చూపి మొత్తం డబ్బును కాజేశాడు. అంత మాత్రమే కాదు ఊటీలో తనకు తెలిసిన మిత్రుడు సినిమా షూటింగ్ చేస్తున్నాడని, అందులో గ్రూప్ డ్యాన్సు కోసం కొందరు కాలేజీ అమ్మాయిలు కావాలని నమ్మించి తీసుకుపోయి వారిని వ్యభిచార కూపంలో దించాడట!!!!

రోజూ జరిగే అటువంటి మోసాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ  రాత్రి ఎంతసేపటికో కునుకు పట్టిన నాకు వచ్చిన కల ఇది!!

కలగా వచ్చినప్పటికీ అటువంటి పద్ధతి అమలుకు వస్తే మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారంగా అనిపించింది. మరి మీకో!!??

( ఇందులో ఏ సంఘటన కానీ రచయిత అనుమతి లేనిదే ఉపయోగించుకోవడానికి వీలు లేదు)

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

సడ్లపల్లె చిదంబరరెడ్డి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Excellent sir.

    వెయ్యేళ్ళ తర్వాత ఈ భూప్రపంచం ఎలా వుంటుందో అర్థం కావడం లేదు కానీ మీకొచ్చిన కలలా ఉంటే బాగుణ్ణు. ఒక్క బిడ్డను పుట్టిన వెంటనే తల్లి నుండి దూరం చేయడం తప్ప.

  • కథా ఆలోచన కొత్తది
    కథా నడిపిన విధానం కొత్తది
    మనుషులం ఏమై మిగులుతామో తెలిపింది
    మనుషులకు రాయిరప్పలకు తేడా ముగిసింది
    మీ ఇద్దరి మనమరాళ్ళకు దెబ్బలు
    వాళ్ళు మీకు నిద్రాభంగం కలిగించక పోతే బాగుండేది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు