కథ సజీవంగా నిలిచేది ఎప్పుడో తెలుసా!?
ఎప్పుడైతే ఆ కథా రచయిత – ఆయా కాలమాన సంక్లిష్ట సందర్భాలను, ఆయా కాలాల నాటి రాజ్యపు విఫల పరిపాలనలను, ఆయా రోజుల్లో సామాన్య జనం యొక్క తీవ్ర మరణపు అగచాట్లను ఎప్పటికప్పుడు తన రచనల్లో రికార్డ్ చేసి భద్ర పరుస్తాడో అప్పుడే ఆ రచన–అది కవిత కానీ, కథ కానీ సజీవంగా చరిత్ర సాహిత్యం లో నిలిచి పోతుంది. సరిగ్గా కుప్పిలిపద్మ అదే చేసింది.
పరిమళ కలలది యే పరిమళం! చదవండి!
కరోన ఎందరో జీవితాలను కుప్ప కూల్చేసింది. ఎన్నో విషాద కావ్యాలను మన ముందు ఉంచింది. మనిషి ఆలోచన విధానం ను మార్చేసింది. ప్రపంచాన్ని కరోనా ముందు…కరోనా తర్వాత అని స్పష్టంగా ఒక విభజన రేఖను గీయవచ్చు. ఆ కరోన సమయం లో రాజ్యం ఎంత నిర్లక్ష్యoగా వ్యవహరించింది!? ఆకలికి అలమటించి, ఆకలికి చనిపోయిన 20 వ శతాబ్దాన్నీ…మగ ఆసరా లేని కుటుంబాలు విలవిలలాడిన సందర్భాలనూ.. వృత్తిలో ఎదురయిన అసహన పరిస్థితులనూ…ఆర్ద్రతగా, వాస్తవానికి అతి దగ్గరగా ఈ కథను నడిపారు.
కథ సమయం – ప్రస్తుతం. కథ నడిచిన ప్రదేశం – చెన్నై ; తులసమ్మ అనే ఒక సామాన్య మహిళా కుటుంబపు ఇతివృత్తం కథలో ప్రధాన కథాoశం.
ఎడ్గార్ అలెన్ పో తన వ్యాసం లో కథ గురించి ఒక మాట అంటాడు. ” కథను ఒక్క ఉదుటున చదివేసేలా ఉండాలని”! హెచ్ జి వేల్స్ అనే రచయిత కథను నిర్వచిస్తూ, The jolly art, of making something very bright and moving; it may be horrible or pathetic or funny or profoundly illuminating, having only this essential, that it should take from fifteen to fifty minutes to read aloud. ఏదైనా ఒక విషయాన్నీ వెలుగు లోకి తీసుకురావడమైనా, లేక కదిలించే ఒక అంశాన్ని తెలిపే కథ అనేది ఒక సరదా కళ. అది భయానకమైన ఉండొచ్చు, హృదయ విదారకంగా నైనా ఉండొచ్చు, లేదా, ఒక అంశాన్ని అద్బుతంగా వెలుగులోకి అయినా తీసుకొని వచ్చేదైనా ఉండొచ్చు. కానీ, అది పదిహేను నిముషాలు నుండి యాభై నిముషాల లోపల గట్టిగా చదవగలిగే సమయం పట్టేదిగా ఉండాలి. ” అని అంటాడు. కథకు ఉండాల్సిన బేసిక్ లక్షణాలను కథలో అదే పనిగా చేర్చినారని నేను అనుకోను. ఎరుకలో పెట్టుకొని రాసినారని కూడా అనుకోను. బహుశా, ఆమెకు స్వతః సిద్ధంగా అందిన ఒక కళగా భావిస్తాను.
అంతే కాదు, కథలో బ్రివిటి కానీ, కథా సమయం పట్ల కానీ, కథ నడిచిన ప్రదేశాన్ని గురించి కానీ, ఎక్కడా పక్కదారి పట్టిందని అనిపించదు. ఈ కథలో-కథ మొత్తం చెన్నై చుట్టూ పక్క ప్రాంతాల్లో నడుస్తుంది. పేదరాలు తులసమ్మ కరోన లాక్ డౌన్ సమయం లో “అమ్మా” కాంటీన్ లో తన రోజువారీ భోజనం తెచ్చుకోవడం… అలాగే, ఆ వాతావరణం, ఆ ప్రాంతపు కల్చర్ ఇవన్నీ చక్కగా కథలో పొందు పరుస్తారు. ఇక కథకు ఉండాల్సిన ప్రధాన లక్షణమైన బ్రివిటి విషయానికొస్తే, తులసమ్మ కుటుంబం పెళ్లి నుండి పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు, కరోనా మొదటి , రెండో వేవ్ , లాక్ డౌన్, వలస కుటుంబాల దుస్థితి, ఇలా అనేక అంశాలను ఆ చిన్ని కథలోనే చాల వివరంగా చెప్పేశారు. రీడబిలిటి విషయాని కొస్తే, కథ చదువుతూ ఉంటె, పాటకుడు అర్థం కాక, మళ్ళీ వెనక్కు వెళ్లి చదవాల్సిన అవసరమే ఉండదు. ఒక్క ఉదుటున చదివిస్తుంది.
ఇక, కథలో పాత్రల విషయాని కొస్తే, పాత్రల మనస్తత్వాలను ఆమె స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తూ రాసినట్లు అనిపిస్తుంది. కథలో ఒక పాత్ర అంటే, పరిమళ అగరొత్తులు చుడుతూ ఉంటుంది. అవి చుట్టీ చుట్టీ చేతులు అదే వాసన, భోజనం కలిపినా అదే వాసనా. వొంటి నిండా అదే అగరొత్తుల పరిమళం… ఇలా ఆమె లైఫ్ లో ఆ వాసన వెంట పడుతుంటే, అదెంత బోర్ కొడుతుందో , ఎంత అసౌకర్యంగా ఉంటుందో, ఆ పాత్ర మాటల్లో, ఆ పాత్ర …ఆ వాసన పట్ల చూపే అసహనం ఇలా ప్రతి వాక్యం లో మనల్ని తడుముతుంది. కథ ప్రారంభంలో – పిల్లాడికి పాలు పట్టే బదులుగా alternative గా వేరే తాపించాలని ప్రయత్నిస్తే మొదట ఆ పిల్లాడు తాగడు. కాసేపయ్యాక, ఆకలి కారణంగా అవే alternative తీపి నీళ్ళు తాగుతాడు. పేదరికం, ఆకలి, ఎలాంటి స్థితి నైన accept చేస్తుందని, ఆ పిల్లాడి క్యారెక్టర్ తో పరోక్షంగా చెప్పించడం నిజంగా రచయిత్రి కి హాట్స్ ఆఫ్ .
కథలోకి వెళ్లికొద్దీ మనలో ఒక తెలియని మెలాంఖలి చుట్టుముడుతుంది..ఈ కథ. _ కరోన సమయంలో మనచుట్టూ సంభవించిన ఎన్నో విషాద గాధల సమిష్టి గొంతుక ఈ కథ అనిపిస్తుంది. కథలో రెండు కుటుంబాలు మాత్రమే కనిపించినా , ఎన్నో కుటుంబాలు మనముందు కదలాడతాయి కథ చదువుతుంటే..!
కథ చదవడం మొదలు పెట్టగానే, ఒక దేవలయపు ముందర సీన్… ఆగరొత్తుల సువాసన వంటి పదాలు చూసి, కథను అంచనా వేయలేకపోయాను..
పరిమళం కోసం ఉపయోగపడే ఆగరొత్తులను తయారు చేసే ఆ కుటుంబ సభ్యుల జీవితం లో పరిమళం ఆవిరి అయిపోవడం అనే ఒక కాన్సెప్ట్ కొత్తగా అనిపించినా, కరోన విధ్వంసం తో ఆ కథ లింక్ అవుతూ రావడం పాఠకుడిని అలా బాధిస్తూనే సాగుతుంది.
ఒక రకమైన సస్పెన్స్ ను చాలా తెలివిగా ఇన్సర్ట్ చేశారు.. ఇంట్లో మొత్తం కుటుంబ సభ్యులు చనిపోయి, ఒంటరిగా చిన్నపిల్లతో మిగిలిపోయిన ‘పరిమళ’, ఎలా సాగిస్తుంది జీవితం? కథను ఎలా ముగిస్తారో ? అన్న ఒక ఉత్సుకత మనకు లీలగా కదలడుతుంది.
ఇవన్నీ రచయిత్రి కి స్వయం సిద్ధంగా అబ్బిన నేర్పు అని చెప్పవచ్చు.
రచయత్రి లోని ఆ ప్రోగ్రెసివ్ థాట్, ఆశావాద దృక్పధం ఈ రెండూ- కథ చదువుతుంటే, ఎక్కడా కనిపించలేదే అనుకొనే లోగా, కథ చివరిలో తళుక్కు మనిపించారు. అందరినీ కోల్పోయి, చివరగా, పరిమళ, తన అక్క కూతురును భుజాన వేసుకొని, వస్తూ… వస్తూ… “ చదువుకోవాలి నువ్వు… అమ్మ కలలూ, అమ్మమ్మ కలలూ, పెద్దమ్మ కలలూ , నా కలలను నింపుకొని నువ్వు ..బాగా..చదువుకోవాలి..’ అనుకుంది పరిమళ. అన్న ఈ వాక్యాలను చెపుతూ, రచయత్రి మాటగా, పరిమళ కలల పరిమళం ఆవిరై పోయిన చోటే, మొదలైన కొత్త కల పరిమళపు కలల ప్రవాహం…. అని ముగిస్తారు.
ప్రపంచం ఎదుర్కొన్న ఈ విపత్కర పాండమిక్ పరిస్థితిని రికార్డు చేయాల్సిన అవసరం రచయితల ముందు ఉంది. గొంతు విప్పని ఎన్నో కుటుంబాలు సజీవంగా పూడ్చి పెట్టబడ్డాయి. ఎవరికీ ఎవరూ కాని పరిస్థితులు మనం చూసాము. ఎంతో మంది లెజెండరీస్ ను పోగొట్టుకొన్నాము. ఆప్తులను, బంధువులను, స్వంత వారిని కోల్పోయాము. ఈ పీరియడ్ లో దోపిడి ని చూసాము. బంధాలే కనిపించని ఓ దుర్మార్గ పరిస్థితి మన కళ్ళ ముందే కదిలి పోయింది.
ఇలా, ప్రస్తుత సందర్భాన్ని రికార్డు చేయడం లో రచయితలు ముందుకు రావాలి. సందర్భోచితంగా సాహిత్యం లో మన పాత్రను మనం పోషించాలి. మన బాధ్యత .
*
పరిమళ కలలదే పరిమళం..కథ ఆర్దత కలిగి బాగుంది. మీ విశ్లేషణ ఎప్పటిలానే ఆకట్టుకుంది సురేష్ జీ👍 లింకు లో లింకు తెరిచి చదవాల్సిరావడం కొంత ఇబ్బంది. మీ విశ్లేషణ తర్వాత కథను పొందుపరిచుంటే ఇంకా బాగుండేది సర్👍👍💐💐💐💐