ఎత్తు కున్న దరువు
ఏడేడు లోకాలు చుట్టి వచ్చేది
మైరావణుడుగా,వీరభాహుడిగా
ఏడు మెరువులు
ఒక్క లగువు లో దూకిన మనిషి
ఇప్పుడు మంచంలో
శిథిల రాగంలా పడుకున్నాడు
చెంచులక్షి కథలో
ఎరుకులసాని చెప్పినట్టు
పంజరాన చిలుక
తుర్రుమనే కాలం
కార్తె కార్తెకు సామెత చెప్పే నోరు
ఊపిరి తీసుకోడానికి
గొలుసు తో కట్టిన ప్రాణిలా
విలవిలలాడి పోతోంది
ఎవరో వస్తున్నారు
నన్ను మోసుకెళ్తున్నారంటూ
డేగను చూసిన,కోడి పిల్లలా
వణికి పోతున్నాడు
చిమ్మ చీకటి పెను చీకటి
గుడ్లు పెట్టి,పిల్లలు పొదుగుతున్న చీకటి
లో లోపల గగ్గోలు పెడుతున్న ప్రాణం
కుడుతున్న కుమ్మరి పురుగు
నులక మంచం అల్లినట్టు
ఎందరినో కలుపుకున్నాడు
ఎంత కష్టం వచ్చినా
నిట్రాడి లా నిలబడి
నిబ్బరంగా ఎదుర్కొనే వాడు
ఇప్పుడెందుకో
తెలియకుండానే కన్నీళ్లు పెడుతున్నాడు
ఎలపటెద్దు,దాపటెద్దు లా సంసారాన్ని లాగి
ఆవలి గట్టుకు చేరినవాడు
శ్మశానాన్ని కలగంటున్నాడు
పొంతలో సలసల కాగిన నీరు చల్లారినట్టు
తీగనుండి కాయ గుంజేసినట్టు
యాతన యాతన
ఏమి జన్మ తండ్రి
ఏమి జన్మ
ఆత్మ ఇమడలేని పరాయితనం
(మా నాయన మంచంలో ఉన్నప్పుడు)
ఆత్మ ఇమడలేని పరాయి తనం.. బాగుంది మిత్రమా..
Superb
పరాయితనం నిజమే
అభినందనలు అండి
నీ శిల్పమొక వింతరీతిగా పరిమళిస్తుంది గోపాల్. కొత్తగా చెబుతావు. రూపం చిన్నది. భావపరిధి పెద్దది.
కవిత చదివించాక మననం చేయించింది
బాగుంది మాస్టారు 👏
“నులక మంచం అల్లినట్టు
ఎందరినో కలుపుకున్నాడు”…
చాలా బాగుంది సార్🙏
చక్కని చిక్కని కవిత.అభినందనలు గోపాల్ గారు
ఎందుకింత దుఃఖం తండ్రి.. ఇదొక నివేదన లా అనిపించింది మిత్రమా
మీదొక విభిన్న శైలి బాగుంది.
జానపద వ్యక్తీకరణ వచన కవితా శిల్పం లోకి బలే తీసుకొచ్చారు.ఇది కవిత్వాన్ని గొప్పగా చేస్తుంది
-ప్రభు
“తల్లి గర్భంలోనే జీవితం. పుట్టిన తర్వాత జీవితమంతా మరణం దిశగా ప్రయాణమే అనిపిస్తుంది”
మీ నాయన ప్రత్యేతలను, అవి మరుగైపోయిన అనివార్యతను జ్ఞాపకం చేసుకుంటూ రాయడం బాగుంది గోపాల్. స్వీయానుభవాల వ్యక్తీకరణలో కసిగానీ కన్ననీరుగానీ అభివ్యక్తికి ప్రాధాన్యత ఉండదేమో. ఐతే గొప్పగా ఉంది.
నులకమంచం అల్లినట్టు ఎందరినో కలుపుకున్నాడు…
ఎలపటెద్దు, దాపటెద్దులా సంసారాన్ని ఈడ్చి
ఆవలి ఒడ్డుకు చేర్చినోడు..
మంచి వ్యక్తీకరణలు. గోపాలయ్య గారికి అభినందనలు.
నుపకమంచం అల్లినట్టు ఎందరినో కలుపుకున్నాడు
ఎలపటెద్దు, దాపలెద్దులా సంసారాన్ని లాగి
ఆవలి గట్టుకు చేరినవాడు.
వ్యక్తీకరణ చాలా బాగుంది. గోపాలయ్యగారికి అభినందనలు
Great one guroo
సరిరారు నీకెవ్వరు.అందుకో నా జోహార్లు.
కొత్తగాను గాఢపరిమళంతోనూ వుంది. గోపాల్ గారు
చీమ్మ చీకటి పెను చీకటి గుడ్లు పెట్టి పిల్లలు పొదుగుతున్న చీకటి…👌 సూపర్ సర్
ఇ లోకం లో మనిషి శాస్వతం కాదు ఎప్పుడూ పరాయివాడే….💐💐అభినందనలు సర్
జీవన పయనం లో
తొలి మెట్టు నుండి
తుది మొట్టు వరకు
జీవి యొక్క నటన
నాదీ నా వాళ్ళు అనే ఆశ
ఎలాంటి ఆశయాన్నన్నై
చేజిక్కించుకోవాలనే ఆరాటం
ఎంతవరకుఈపయనం
సాగిందో తెలియకుండ “దేహం”
పరాకాష్టకు చెందేదే
ఈ. …….పరాయి తనం.
“సార్……మీ కూర్పు జీవన యాత్రకు నేర్పుగా ఉంది.
E Kavitha ni ardam cheskune antha maturity lekapoina baga connect ayya. Bagundi sir.
Good poet..
పరమాద్భుతం అండీ….ఏమి యాతన!ఆహా…గొప్ప గా చెప్పారు గోపాలయ్య గారూ