పన్నెండేళ్ల పాలస్తీనా బాలుడి పాట ….

అబ్దుల్ పాట , అతని ఆత్మస్థైర్యం మనల్ని కుదిపివేస్తుంది.

న్నెండేళ్ల పాలస్తీనా బాలుడు ఎం సి అబ్దుల్, జూన్ 2021 లో గారీ మెక్ కార్తీ , సియాన్ హెర్న్ అనే మరో ఇద్దరితో కలిసి రాసుకుని పాడిన పాట ఇది. 

ఏడు దశాబ్దాలుగా దుర్మార్గపు ఇజ్రాయిల్ దురాక్రమణకు గురైన పాలస్తీనా వేదన, ఆక్రోశం, ఆగ్రహం కలగలిసిన పాట  ఇది. గాజా చుట్టూ ఇజ్రాయిల్ కట్టిన గోడ వెనుక ఖైదీలైన ఇరవై లక్షల ప్రజల సామూహిక వేదన ఇది. 

దీన్ని అబ్దుల్ రాప్ పద్దతిలో పాడి,  విధ్వంసమైన పాలస్తీనా ఇళ్ల శిథిలాల నేపథ్యంలో వీడియో చేసి యూట్యూబ్ లో ఉంచాడు. 

ఇవాళ హమాస్ దాడి నేపథ్యంలో , ఆ దాడిని సాకుగా తీసుకుని,  పూర్తిగా గాజాని  దురాక్రమించి, పాలస్తీనా ప్రజలకు ఒక దేశము, గజం నేలా  లేకుండా చేయడానికి ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణహోమం, చేస్తున్న యుద్ధం, ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని పారిపోతున్న లక్షలాది పాలస్తీనా ప్రజల హాహాకారాలు, మానవ హననాల నేపథ్యం లో ఇంకా బతికున్నాడో లేదో తెలియని అబ్దుల్ పాట , అతని ఆత్మస్థైర్యం మనల్ని కుదిపివేస్తుంది.

మూలం లోని రాప్ శక్తి అనువాదం లో రావడం అసాధ్యమైంది. అయినా అబ్దుల్ ఆత్మని ఆవిష్కరించడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం 


పాలస్తీనా హృదయాలు ముక్కలౌతున్న తరుణమిది

 

లసిపోయిన పూర్తిగా రాత్రంతా నిద్రలేక

క్షణమైనా కునుకు పడితే  బాంబుల మోతలు కలలనిండ

భయంకరమైన పీడకలైంది బతుకంతా

 

ఇంత పాపిష్టిగా యెట్లుండగలరెవరైనా

అమాయకపు చిన్నారుల్ని అమరుల్ని చేస్తూ

 

యెప్పుడు పడుతుందో తెలియదు మరో బాంబు

గదిమూలకు నక్కుతా  మా తమ్ముడిని పొదివిపట్టి
ఒణికిపోతోంది ఇల్లంతా దయ్యం పట్టినట్టు

లోకం లోనే  బలమైంది అణచివేయబడ్డవాని ఆకాంక్షే

పాలస్తీనా హృదయాలు ముక్కలౌతున్న తరుణమిది

నేను నా పాటలకవితలతో ఎదురుదాడి చేస్తా  శత్రువుపై

 

వేలాడుతున్నాయి తలలపై మబ్బుల్లో  బాంబర్ విమానాలు

ఒకే ఒక్క రొట్టెముక్క కోసం ప్రాణం కోల్పోయిండు మా నాన్న

నా పన్నెండేళ్ళలో ఇదెన్నో సారో లెక్కే లేదు

 

పూర్తిగా మొద్దుబారి పోయి ఉన్న భయం లేదు నాకు

క్షేమంగానో ధైర్యంగానో ఉండడానికి చేసేదేమీ లేదు

నా ఇల్లే నాకు సమాధి కావచ్చు

 

స్వేఛ్ఛ కావాలిప్పుడు మా జనానికి

ఇరవై లక్షల మంది ఖైదీలున్నారీ జైలులో

అరుస్తున్నాం మేమీ గోడకేసి యేళ్ళుగా

మారడం లేదు యేమాత్రం  ఎన్నటికీ

ఆక్రమణలో ఉన్న బతుకులు మావన్నీ

 

విలపిస్తున్నారు మా తల్లులు నిరంతరం

చేస్తున్నారు రోజూ యుధ్ధం విషాదంతో

 

కప్పేశారు వీధుల్లో శవాలను తెల్లగుడ్డలతో

భవంతులన్నీ బూడిదవుతున్నా
చెక్కుచెదరదు నా గుండె ఉక్కుది

పట్టదులే కోలుకోవడానికి ఎంతో సేపు
కోల్పోము మేము బతకాలన్న కోరిక ఎన్నడూ

నేల మట్టమైంది మా పెద్దమ్మ ఇల్లు ఆమె బతుకు లాగే
పుట్టెడు దుఃఖంలోనూ ఇంకా బతికేవుందామె
కురుస్తూనే ఉన్నాయి రాత్రంతా బాంబులు 

ఏడుస్తూ నిద్రపోదు మా చెల్లె ఎంత సముదాయించినా
పటాకుల మోతలని అబద్దాలు చెప్పి  ఎంత బుజ్జగించినా
గుండెలు రాళ్లయిన చోట జాలీ దయ ఎక్కడ మిగిలాయింకా

కరంటు తీసి టవర్లు కూల్చి ముంచారు మమ్మల్ని చీకట్లో
అయినా ఏమీ చేయలేరు నా పెన్నులో శక్తిని
ఆపలేరు నేను రాయడాన్ని ఎవ్వరూ

నేను తప్పించుకునే తొవ్వ  ఈ మైక్ ఒక్కటే
ఇదొక్కటే నాకు మనసువిప్పి మాట్లాడే దారి.

*

నారాయణ స్వామి వెంకట యోగి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు